రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Friday, January 29, 2016

షార్ట్ రివ్యూ..



హర్రర్ మైనస్ కామెడీ



రచన- దర్శకత్వం : సుందర్ సి
తారాగణం : సిద్ధార్థ్, త్రిష, హంసిక, సుందర్ సి, పూనం బజ్వా, మనోబాల, కోవై సరళ  తదితరులు
సంగీతం : హిప్ హాప్ తమిళ, ఛాయాగ్రహణం : యూకే . సెంథిల్ కుమార్
నిర్మాణం : గుడ్ ఫ్రెండ్స్ గ్రూప్
విడుదల : జనవరి 29, 2016
***
హారర్ కామెడీల పరంపర ఆగకుండా  కొనసాగుతోంది. తమిళ, తెలుగు సినిమాలకి ఇప్పుడు దెయ్యం అనే పదార్ధం నిత్యావసర సరుకైపోయింది. దెయ్యం కామెడీల్ని సీక్వెల్స్ మీద సీక్వెల్స్ కూడా తీస్తూ ఇప్పట్లో నిన్నొదల బొమ్మాళీ అన్నట్టు జోరుమీద సాగిపోతున్నారు నిర్మాతలు, దర్శకులు. ఈ రేసులో ‘చంద్రకళ’  అనే తమిళ డబ్బింగ్ తో దర్శకుడు  సుందర్ సి కూడా జాయినయ్యాడు. ఇప్పడు  దీనికి సీక్వెల్ గా ‘కళావతి’ తో మరో సారి అదే విధంగా  భయపెట్టి నవ్వించే ప్రయత్నం చేశాడు. ఇది ‘చంద్రకళ’ కి కొనసాగింపు కథ కాకపోయినా సీక్వెల్ పేరిట చెలామణి అయిపోతోంది. అయితే సీక్వెల్ అనగానే ఇదివరకున్న ఆకర్షణ ఇప్పుడు లేదు. అయినా సీక్వెల్స్  అంటూ ప్రచారం చేసుకుని విడుదల చేసిన  ఈ లేటెస్ట్ దెయ్యం డబ్బింగ్ కామెడీలో విషయం ఏమిటో, అదెంతవరకూ కొత్తగా వుందో ఓసారి చూద్దాం.
కథేమిటి
ఓ  గ్రామంలో జమీందారు గారి బంగాళా.  ఆ గ్రామంలో ఒక భారీ అమ్మవారి విగ్రహానికి కుంభాభిషేకం చేసి పునఃప్రతిష్టాపన చెయ్యాలని ఆ విగ్రహాన్ని తొలగిస్తారు. అంతవరకూ దుష్ట శక్తుల నుంచి గ్రామాన్ని కాపాడుతూ వస్తున్న  అమ్మవారి విగ్రహం అలా తొలగగానే గ్రామంలోకి ఓ ప్రేతాత్మ జొరబడుతుంది.  నేరుగా జమీందారు  బంగళాలో ప్రవేశించి  మొదట జమీందారు పని బడుతుంది. ఆ దెబ్బకి కోమా లోకి వెళ్ళిపోతాడు జమీందారు. ఈయన కొడుకు ఒకడు మురళీ ( సిద్దార్థ్) అనే అతను అనిత ( త్రిష) అనే అమ్మాయితో నిశ్చితార్ధమై  ఎక్కడో బీచిలో బ్యాచిలర్ పార్టీ ఎంజాయ్ చేస్తూంటాడు. తండ్రి సంగతి తెలిసి  వచ్చేస్తాడు. అప్పుడు కోమాలోంచి బయటపడ్డ తండ్రి మీద మరోసారి ఆత్మ దాడి  చేస్తుంది. ఈసారి చనిపోతాడు తండ్రి.   ఈ సంఘటనలో మురళిని అరెస్టు చేతారు పోలీసులు.
ఇలావుండగా అనిత అన్న ( సుందర్ సి) ఒక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్. ఇతను ఈ బంగళాలో జరుగుతున్న సంఘటనలకి మూలం తెలుసుకోవాలని వచ్చి సీసీ కెమెరాలూ, థర్మల్ స్కానర్ లూ అమరుస్తాడు. ఈసారి ఆత్మ మురళి అన్న మీద  దాడి చేస్తుంది. దీంతో కెమెరాకి చిక్కుతుంది. ఆ విజువల్స్  చూస్తే ఆ ఆత్మ  మురళి చెల్లెలు మాయ ( హంసిక) దని తేలుతుంది. మురళి ఆందోళన పడతాడు. ఎప్పుడో చనిపోయిన చెల్లెలు పగదీర్చుకుంటోందా కుటుంబం మీద- ఎందుకు? అసలేం జరిగింది? చెల్లెలు ఎలా చనిపోయింది? అన్న ప్రశ్నలతో మిగతా కథ సాగుతుంది...
ఎలావుంది కథ
రొటీన్ గా భయపెడుతూ నవ్వించడమనే స్కీముతోనే వుంది. హన్సిక ఫ్లాష్ బ్యాక్ లో ఒక ఆసక్తికరమైన విషయముంది. అది ఆనర్ కిల్లింగ్స్ కి సంబంధించింది. కులం తక్కువ వాణ్ణి ప్రేమించి గర్భవతి అవడంతో ఆమెణి తండ్రి, అన్న చంపేసిన కథ. ఇదొక సామాజిక సమస్యే. దీనికి పరిష్కారమే ఈ దెయ్యం కథ. ఫ్లాష్ బ్యాక్ లో  ఇంత విషాదముండగా వర్తమాన  హార్రర్ కథలో కామెడీని జొప్పించిన దర్శకుడి కళ అంతంత మాత్రంగానే వుంది.
ఎవరెలా చేశారు
సిద్ధార్థ కి పెద్దగా పాత్ర లేదిందులో సెకండాఫ్ చివరివరకూ. తన చెల్లెలు అసలెలా చనిపోయిందో అతడికి ముందు తెలీదు కాబట్టి కథలో ఇన్వాల్వ్ మెంట్ లేదు. కేసుని పరిశోధించే ఫోటోగ్రాఫర్ గా దర్శకుడు సుందర్ సికి పాత్ర నిడివి ఎక్కువ వుంది. త్రిషకి మోడరన్ గర్ల్ గా ఫస్టాఫ్ లో అంతగా పనిలేదు- గ్లామర్ ప్రదర్శన, పాటలు పాడుకోవడం తప్ప.  సెకండాఫ్ లో రొటీన్ గా ఆత్మ ఆవహించడంతో ఆమెకి పని పెరుగుతుంది.  ఫ్లాష్ బ్యాక్ కథలో హంసిక ఓకే. కామెడీ కోసం  నటించిన నటీనటుల్లో సూరి, కోవైసరళలు అగ్రభాగాన నిలుస్తారు.  
పాటలు, కెమెరా వర్క్ ఓ మాదిరిగా వున్నా, బంగాళా సెట్ భారీగా వేశారు. సీజీ వర్క్ తో ఆత్మని ప్లే చేసిన టెక్నిక్స్ పెట్టిన బడ్జెట్ కి తగ్గట్టే వున్నాయి.
 చివరికేమిటి
ఫస్టాఫ్ లో భయపెట్టే  దృశ్యాల్లో పసలేదు. పసలేకపోగా బోరు కొట్టే ప్రమాదాన్ని కొనిదెచ్చుకున్నాయి. సెకండాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ వల్ల కథా బలం చేకూరినా, భయపెట్టే  దృశ్యాల కంటే కామెడీ ఎక్కువైపోయింది. ఎడాపెడా వచ్చి పడుతున్న ఇలాటి హర్రర్ కామెడీల మధ్య మరో హారర్ కామెడీ అంటే చాలానే   కష్టపడాలి. పాతిక సినిమాలకి దర్శకత్వం వహించిన అనుభవమున్న ఈ దర్శకుడికి ప్రేక్షకుల నాడీ తెలీక కాదు, అయితే ‘చంద్రకళ’  తీసిన తర్వాత తనతో తనే పోటీ పడి మరో హార్రర్ కామెడీ  ‘కళావతి’ తీయాల్సి వచ్చింది. ఇదీ సమస్య. సీక్వెల్ అన్నాక సక్సెస్ అంత సులభం కాదని నిరూపించడానికి మాత్రం ఈ సినిమా పనికొచ్చింది.

-సికిందర్






షార్ట్ రివ్యూ..

మాస్ యూత్ మసాలా!   
రచన- దర్శకత్వం : శ్రీనివాస రెడ్డి జి
తారాగణం : రాజ్ తరుణ్, అర్థన, షకలక శంకర్, రాజారవీంద్ర, సురేఖావాణి,  శ్రీ లక్ష్మి, హేమ తదితరులు
సంగీతం : గోపీ సుందర్, ఛాయాగ్రహణం : విశ్వ
బ్యానర్ : శ్రీ శైలజా ప్రొడక్షన్స్
నిర్మాతలు  : ఎస్. శైలేంద్ర బాబు, శ్రీధర్ రెడ్డి, హరీష్ దుగ్గిశెట్టి
విడుదల : 29.1.16
***
      ప్రేమకథల రాజ్  తారుణ్ మరో విలేజి ప్రేమతో వచ్చాడు. ఈ సారి మాస్ లుక్ తో మాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుందామని ఆలోచన చేసినట్టుంది- నటించిన గత సినిమాలకంటే ఎందులోనూ క్వాలిటీ అనేది కన్పించకుండా జాగ్రత్తపడ్డాడు. ఈ ప్రయత్నంలో అర్బన్ యూత్ గురించి పెద్దగా ఆలోచన పెట్టుకోలేదు. తెలుగు సినిమా హీరో అన్నాక  ఒక మాస్త సినిమా నటించాలన్న కోరిక ప్రకారం తప్పనిసరిగా వాళ్ళ అడుగుజాడల్లో ఒకటై నడిచాడు. రూరల్, అర్బన్ యూత్ ఎవరైనా వాళ్ళ జీవితాలు ఇలాగే ఉంటాయా –అంటే ఇలాగే ఉంటాయని టాలీవుడ్ ఇలా బల్లగుద్ది చెప్తున్నాక- యూత్ కనెక్ట్ గురించి మాటాడకుండా ఈ సినిమాలో ఏముందని చూస్తే...
కథేమిటి
        రాము ( రాజ్ తరుణ్), సీత ( అర్థాన) చిన్ననాటి స్నేహితులు. రాము కి క్రికెట్ పిచ్చి. సీత కి చదువు మీద ఇంటరెస్టు. చదువు మీద శ్రద్ధలేని రాము అంటే సీతకి ఇష్టం వుండదు. ఆమె పై చదువులకి వెళ్లి మెడిసిన్ పూర్తి చేస్తుంది. అప్పుడప్పడు సెలవులకి వచ్చినప్పుడు సీతని చూసి ఎప్పటికైనా ఆమె తనది అవుతుందని కలలు గంటూంటాడు రాము.

        ఇంటర్ ఫెయిలైన రాము ఆవారా ఫ్రెండ్స్ తో తిరుగుతూంటాడు. ఇప్పటికైనా మెడిసిన్ పూర్తి చేసుకుని వచ్చిన  సీతకి తన లవ్ గురించి  చెప్పమని ఫ్రండ్స్ బలవంతం చేస్తూంటారు. కొన్ని విఫల యత్నాలు చేసి, చివరికి  ఆమెకి దగ్గరాయ్- ఓ రోజు ఆమెతో బాటు ఆమె అన్నకి దొరికిపోతాడు. గొడవవుతుంది. వూరి ప్రెసిడెంట్ అయిన ఆమె తండ్రి ( రాజారవీంద్ర) ఇక సీతకి పెళ్లి చేసేయాలనుకుంటాడు. అసలు రాముని ప్రేమించని సీత సీత్హ రాము దగ్గరకొచ్చి తిట్టి వెళ్ళిపోతుంది. కొన్ని పరిణామాలు జరిగి రాము మీద మనసుపడుతుంది. కానీ  ఆమెతో పెళ్లి కుదిరిన క్రికెట్ ప్లేయర్ ఇద్దరికీ అడ్డుగా  ఉంటాడు. అప్పుడు ఇతనూ రామూ ఒక అంగీకారానికొస్తారు. అదేమిటనేది క్లయిమాక్స్ పాయింట్.

ఎవరెలా చేశారు
        ముందుగానే చెప్పుకున్నట్టు రాజ్ తరుణ్ రఫ్ క్యారక్టర్ పోషించాడు. ప్రతీ సినిమాలో ఎలా నటించుకొస్తున్నాడో అలాగే షరా మామూలుగా నటించుకొచ్చాడు. మాస్ పాత్ర అయినా తేడా లేదు. ఇలాటి ప్రేమికుడే అయిన ‘గుణ’ లో కమలహాసన్ పోషించిన పాత్ర స్థాయిని రాజ్ తరుణ్ ఇంకా అప్పుడే  ఊహించలేడు. వృత్తిపరంగా నటనలో ఎదిగి  పైస్థాయికి  చేరాలని ఆలోచిస్తే ఒకనాటికి ఇది సాధ్యం కావొచ్చు.

        ప్రతీ తెలుగు సినిమాలో, అదెలాటి దైనా, ఏ తరహా కథైనా,  విధిగా వుండే అదే చదువుసంధ్యలు లేని, తల్లి దండ్రుల మాట వినని,  స్మోకరూ డ్రీంకరూ అయిన, ఆవారా హీరో పాత్రలోనే, ఇక్కడా రాజ్ తరుణ్ దర్శన మిస్తాడు. డబ్బులిచ్చి చూసే ప్రేక్షకులు పదేపదే ఈ పాత్రలే చూడాలి. వెరైటీ లేదు. ఈ పాత్రలో మాస్ ప్రేక్షకులనుంచి మాత్రమే రెస్పాన్స్ ని  రాబట్టుకుంటూ, ఒక పాతబడిన – అదీ అతుకుల బొంతలా వున్న కథని, పాత్రనీ లాక్కొచ్చాడు. తన పాత్ర ఏకపక్ష ప్రేమకి సరయిన కారణం, అర్హతా  లేకపోయినా మెడిసిన్ చదివే అమ్మాయి కావాలనుకుంటాడు. కాబట్టి ఈ సారి రాజ్ తరుణ్ నుంచి ఎక్కువ ఆశించకుండా బిలో ఎవరేజ్ క్వాలిటీతో సర్దుకుపోయి సినిమా చూడాలి.

        కొత్త హీరోయిన్ అర్ధన శారీరకంగానే బలహీనం. అంత స్క్రీన్ ప్రెజెన్స్ కూడా లేని ఈమె మెడిసిన్ పూర్తి చేసిన అమ్మాయి స్థాయిలి చాల్లేదు. పైగా పాత్రపరంగా డెప్త్ లేకపోవడం నటనకి  ప్రబంధకమైంది. ప్రేమ వద్దనడం, మళ్ళీ కావాలని వొళ్ళో వాలిపోవడం ఆటబొమ్మలా తయారయ్యింది. పాత్ర ప్రవేశించిన ప్రారంభ దృశ్యాల్లో ఎంతో సుకుమారంగా,  సంసార పక్షంగా కన్పించే ఈమె ఒక మెడిసిన్ చదివిన అమ్మాయిలా వుండదు. అంతలోనే సడెన్ గా అల్లరి పిల్లగా మారిపోవడం దర్శకుడి పాత్రచిత్రణ లోపమే.
       
        ఇక పక్కపాత్రల్లో షకలక శంకర్ తో బాటు మరికొందరు యువ కమెడియన్లు మందుభాయీ ఆవారా పాత్రల్ని పోషించారు. యూత్ ని  ఇలా చూపిస్తున్న తెలుగు సినిమాల్ని ప్రధాని నరేంద్ర మోడీ కి చూపిస్తే,  వెంటనే ఆయన పదవికి రాజేనామా చేసి వెళ్ళిపోతారు.  ఇకపోతే మరిన్ని విషయంలేని పక్కపాత్రల్లో  రాజారవీంద్ర, సురేఖావాణి,  శ్రీ లక్ష్మి, హేమ మొదలైన వాళ్ళు కన్పిస్తారు.

        గోపీ సుందర్ సంగీతంలో ఓ రెండు  పాటలు తప్ప మిగిలినవి కథలో గానీ, గ్రామీణ వాతావరణంలో గానీ సింక్ అవవు, ఆ ఫీల్ ని ఇవ్వవు. పేరుకి విలేజి వాతావరణమే తప్ప,  విశ్వ నిర్వహించిన ఛాయగ్రహణం కూడా సబ్ స్టాందర్డే. బ్యాక్ గ్రౌండ్ సంగీతం చాలా గోల పెట్టేస్తుంది. అసలు కథలోనె సున్నితత్వం, ఎక్కడైనా సెంటి మెంట్లూ లేనప్పుడు ఎలాటి సాంకేతిక హంగులు కూడా ఆమేరకు జతపడవు.

దర్శకుడు శ్రీనివాసరెడ్డి- చేసిన ఈ మాస్ కథని కూడా మనసు పెట్టి చేయలేదు.  పాత్రలకి, కథకి, సంఘటనలకీ దేనికీ సరయిన బేస్ వుండదు. ఈ కథ, దీని ఆవిష్కరణా ఆయన మనసుల్లోంచి తన్నుకు రాలేదని అడుగడుగునా నిదర్శనాలే కన్పిస్తాయి. ఎక్కడబడితే అక్కడ ఎప్పుడో  అవుట్ డేటెడ్ అయిపోయిన ఎపిసోడ్స్ తోనె  సినిమాని నింపేశాడు. ఉంగరం వెతికే, అరటి తొక్క తొక్కే, సోది చెప్పే; పావురాలతో, పాములతో ఆడే, మెడికల్ క్యాంపు పెట్టే, ఐరన్ లెగ్ శాస్త్రి  లాంటి క్యారక్టర్ కామెడీ పెట్టే, దేవుడి పల్లకీ మోసే, అగ్నిగుండం లో నడిచే, హీరోయిన్ పేరు పచ్చబొట్టు పొడిపించుకునే,...ఇలా చెప్పుకుంటే ఈ సినిమా తీయడానికి దర్శకుడు తనకి కలలోకోచ్చిన ప్రతీ పాతసినిమా కమర్షియల్ ఎలిమెంతునీ ఇందులోకి తోసేసినాటు కన్పిస్తాడు. ఆఖరికి బాహాటంగా ‘లగాన్’ ణి కూడా వదలలేదు. క్రికెట్ తో క్లయిమాక్స్ పెట్టేశాడు. అయితే ఈ  మధ్యే ‘గ్యాంగ్స్ ఆఫ్ హైదరాబాద్’ లో ఈ క్రికెట్ కామెడీని ఇంతకంటే ఫుల్ క్రియేటివిటీ తో ఎంజాయ్ చేశాం!

చివరికేమిటి.
        మాస్ ప్రేక్షులు ఎంజాయ్ చేస్తారు. కొత్తకొత్తగా ఇప్పుడిప్పుడే గుర్తింపు పొందుతున్న యువ రాజ్ తరుణ్ తో కాస్త డీసేన్సీనీ, నీట్ నేస్ నీ  ఆశించే వాళ్ళకి మాత్రం మోటుగా వుంటుంది ఈ మాస్ ప్రేమ.  ఇది నయమే. ఎవరో ఒక వర్గం  ప్రేక్షకులు కూడా మోయని  ఇలాటి సినిమాలే ఎక్కువ వస్తున్న ఈ రోజుల్లో,   ఈ  సీతారాముల మాస్ లవ్ మాస్ వర్గాలకైనా పనికి రావడం గొప్పే!


-సికిందర్