మాస్ యూత్ మసాలా!
రచన- దర్శకత్వం : శ్రీనివాస రెడ్డి జి
తారాగణం : రాజ్ తరుణ్, అర్థన, షకలక శంకర్, రాజారవీంద్ర, సురేఖావాణి, శ్రీ లక్ష్మి, హేమ తదితరులు
సంగీతం : గోపీ సుందర్, ఛాయాగ్రహణం : విశ్వ
బ్యానర్ : శ్రీ శైలజా ప్రొడక్షన్స్
నిర్మాతలు : ఎస్. శైలేంద్ర బాబు, శ్రీధర్ రెడ్డి, హరీష్ దుగ్గిశెట్టి
విడుదల : 29.1.16
***
రచన- దర్శకత్వం : శ్రీనివాస రెడ్డి జి
తారాగణం : రాజ్ తరుణ్, అర్థన, షకలక శంకర్, రాజారవీంద్ర, సురేఖావాణి, శ్రీ లక్ష్మి, హేమ తదితరులు
సంగీతం : గోపీ సుందర్, ఛాయాగ్రహణం : విశ్వ
బ్యానర్ : శ్రీ శైలజా ప్రొడక్షన్స్
నిర్మాతలు : ఎస్. శైలేంద్ర బాబు, శ్రీధర్ రెడ్డి, హరీష్ దుగ్గిశెట్టి
విడుదల : 29.1.16
***
ప్రేమకథల రాజ్ తారుణ్ మరో విలేజి ప్రేమతో వచ్చాడు. ఈ సారి మాస్
లుక్ తో మాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుందామని ఆలోచన చేసినట్టుంది- నటించిన గత
సినిమాలకంటే ఎందులోనూ క్వాలిటీ అనేది కన్పించకుండా జాగ్రత్తపడ్డాడు. ఈ ప్రయత్నంలో
అర్బన్ యూత్ గురించి పెద్దగా ఆలోచన పెట్టుకోలేదు. తెలుగు సినిమా హీరో అన్నాక ఒక మాస్త సినిమా నటించాలన్న కోరిక ప్రకారం తప్పనిసరిగా వాళ్ళ అడుగుజాడల్లో ఒకటై నడిచాడు. రూరల్, అర్బన్ యూత్ ఎవరైనా వాళ్ళ జీవితాలు ఇలాగే ఉంటాయా
–అంటే ఇలాగే ఉంటాయని టాలీవుడ్ ఇలా బల్లగుద్ది చెప్తున్నాక- యూత్ కనెక్ట్ గురించి
మాటాడకుండా ఈ సినిమాలో ఏముందని చూస్తే...
కథేమిటి
రాము ( రాజ్
తరుణ్), సీత ( అర్థాన) చిన్ననాటి స్నేహితులు. రాము కి క్రికెట్ పిచ్చి. సీత కి
చదువు మీద ఇంటరెస్టు. చదువు మీద శ్రద్ధలేని రాము అంటే సీతకి ఇష్టం వుండదు. ఆమె పై చదువులకి
వెళ్లి మెడిసిన్ పూర్తి చేస్తుంది. అప్పుడప్పడు సెలవులకి వచ్చినప్పుడు సీతని చూసి
ఎప్పటికైనా ఆమె తనది అవుతుందని కలలు గంటూంటాడు రాము.
ఇంటర్ ఫెయిలైన రాము ఆవారా ఫ్రెండ్స్ తో తిరుగుతూంటాడు.
ఇప్పటికైనా మెడిసిన్ పూర్తి చేసుకుని వచ్చిన సీతకి తన లవ్ గురించి చెప్పమని ఫ్రండ్స్ బలవంతం చేస్తూంటారు. కొన్ని
విఫల యత్నాలు చేసి, చివరికి ఆమెకి దగ్గరాయ్-
ఓ రోజు ఆమెతో బాటు ఆమె అన్నకి దొరికిపోతాడు. గొడవవుతుంది. వూరి ప్రెసిడెంట్ అయిన
ఆమె తండ్రి ( రాజారవీంద్ర) ఇక సీతకి పెళ్లి చేసేయాలనుకుంటాడు. అసలు రాముని
ప్రేమించని సీత సీత్హ రాము దగ్గరకొచ్చి తిట్టి వెళ్ళిపోతుంది. కొన్ని పరిణామాలు
జరిగి రాము మీద మనసుపడుతుంది. కానీ ఆమెతో
పెళ్లి కుదిరిన క్రికెట్ ప్లేయర్ ఇద్దరికీ అడ్డుగా ఉంటాడు. అప్పుడు ఇతనూ రామూ ఒక
అంగీకారానికొస్తారు. అదేమిటనేది క్లయిమాక్స్ పాయింట్.
ఎవరెలా చేశారు
ముందుగానే చెప్పుకున్నట్టు రాజ్ తరుణ్ రఫ్ క్యారక్టర్ పోషించాడు.
ప్రతీ సినిమాలో ఎలా నటించుకొస్తున్నాడో అలాగే షరా మామూలుగా నటించుకొచ్చాడు. మాస్
పాత్ర అయినా తేడా లేదు. ఇలాటి ప్రేమికుడే అయిన ‘గుణ’ లో కమలహాసన్ పోషించిన పాత్ర
స్థాయిని రాజ్ తరుణ్ ఇంకా అప్పుడే ఊహించలేడు.
వృత్తిపరంగా నటనలో ఎదిగి పైస్థాయికి చేరాలని ఆలోచిస్తే ఒకనాటికి ఇది సాధ్యం
కావొచ్చు.
ప్రతీ తెలుగు సినిమాలో, అదెలాటి దైనా, ఏ
తరహా కథైనా, విధిగా వుండే అదే చదువుసంధ్యలు
లేని, తల్లి దండ్రుల మాట వినని, స్మోకరూ
డ్రీంకరూ అయిన, ఆవారా హీరో పాత్రలోనే, ఇక్కడా రాజ్ తరుణ్ దర్శన మిస్తాడు. డబ్బులిచ్చి
చూసే ప్రేక్షకులు పదేపదే ఈ పాత్రలే చూడాలి. వెరైటీ లేదు. ఈ పాత్రలో మాస్
ప్రేక్షకులనుంచి మాత్రమే రెస్పాన్స్ ని రాబట్టుకుంటూ, ఒక పాతబడిన – అదీ అతుకుల బొంతలా
వున్న కథని, పాత్రనీ లాక్కొచ్చాడు. తన పాత్ర ఏకపక్ష ప్రేమకి సరయిన కారణం, అర్హతా లేకపోయినా మెడిసిన్ చదివే అమ్మాయి
కావాలనుకుంటాడు. కాబట్టి ఈ సారి రాజ్ తరుణ్ నుంచి ఎక్కువ ఆశించకుండా బిలో ఎవరేజ్
క్వాలిటీతో సర్దుకుపోయి సినిమా చూడాలి.
కొత్త హీరోయిన్ అర్ధన శారీరకంగానే బలహీనం.
అంత స్క్రీన్ ప్రెజెన్స్ కూడా లేని ఈమె మెడిసిన్ పూర్తి చేసిన అమ్మాయి స్థాయిలి
చాల్లేదు. పైగా పాత్రపరంగా డెప్త్ లేకపోవడం నటనకి
ప్రబంధకమైంది. ప్రేమ వద్దనడం, మళ్ళీ కావాలని వొళ్ళో వాలిపోవడం ఆటబొమ్మలా
తయారయ్యింది. పాత్ర ప్రవేశించిన ప్రారంభ దృశ్యాల్లో ఎంతో సుకుమారంగా, సంసార పక్షంగా కన్పించే ఈమె ఒక మెడిసిన్ చదివిన
అమ్మాయిలా వుండదు. అంతలోనే సడెన్ గా అల్లరి పిల్లగా మారిపోవడం దర్శకుడి
పాత్రచిత్రణ లోపమే.
ఇక పక్కపాత్రల్లో షకలక శంకర్ తో బాటు
మరికొందరు యువ కమెడియన్లు మందుభాయీ ఆవారా పాత్రల్ని పోషించారు. యూత్ ని ఇలా చూపిస్తున్న తెలుగు సినిమాల్ని ప్రధాని
నరేంద్ర మోడీ కి చూపిస్తే, వెంటనే ఆయన
పదవికి రాజేనామా చేసి వెళ్ళిపోతారు. ఇకపోతే
మరిన్ని విషయంలేని పక్కపాత్రల్లో రాజారవీంద్ర,
సురేఖావాణి, శ్రీ లక్ష్మి, హేమ మొదలైన
వాళ్ళు కన్పిస్తారు.
గోపీ సుందర్ సంగీతంలో ఓ రెండు పాటలు తప్ప మిగిలినవి కథలో గానీ, గ్రామీణ
వాతావరణంలో గానీ సింక్ అవవు, ఆ ఫీల్ ని ఇవ్వవు. పేరుకి విలేజి వాతావరణమే తప్ప, విశ్వ నిర్వహించిన ఛాయగ్రహణం కూడా సబ్
స్టాందర్డే. బ్యాక్ గ్రౌండ్ సంగీతం చాలా గోల పెట్టేస్తుంది. అసలు కథలోనె
సున్నితత్వం, ఎక్కడైనా సెంటి మెంట్లూ లేనప్పుడు ఎలాటి సాంకేతిక హంగులు కూడా ఆమేరకు
జతపడవు.
దర్శకుడు శ్రీనివాసరెడ్డి- చేసిన ఈ మాస్ కథని
కూడా మనసు పెట్టి చేయలేదు. పాత్రలకి,
కథకి, సంఘటనలకీ దేనికీ సరయిన బేస్ వుండదు. ఈ కథ, దీని ఆవిష్కరణా ఆయన మనసుల్లోంచి
తన్నుకు రాలేదని అడుగడుగునా నిదర్శనాలే కన్పిస్తాయి. ఎక్కడబడితే అక్కడ ఎప్పుడో అవుట్ డేటెడ్ అయిపోయిన ఎపిసోడ్స్ తోనె సినిమాని నింపేశాడు. ఉంగరం వెతికే, అరటి తొక్క
తొక్కే, సోది చెప్పే; పావురాలతో, పాములతో ఆడే, మెడికల్ క్యాంపు పెట్టే, ఐరన్ లెగ్
శాస్త్రి లాంటి క్యారక్టర్ కామెడీ పెట్టే,
దేవుడి పల్లకీ మోసే, అగ్నిగుండం లో నడిచే, హీరోయిన్ పేరు పచ్చబొట్టు పొడిపించుకునే,...ఇలా
చెప్పుకుంటే ఈ సినిమా తీయడానికి దర్శకుడు తనకి కలలోకోచ్చిన ప్రతీ పాతసినిమా
కమర్షియల్ ఎలిమెంతునీ ఇందులోకి తోసేసినాటు కన్పిస్తాడు. ఆఖరికి బాహాటంగా ‘లగాన్’
ణి కూడా వదలలేదు. క్రికెట్ తో క్లయిమాక్స్ పెట్టేశాడు. అయితే ఈ మధ్యే ‘గ్యాంగ్స్ ఆఫ్ హైదరాబాద్’ లో ఈ క్రికెట్
కామెడీని ఇంతకంటే ఫుల్ క్రియేటివిటీ తో ఎంజాయ్ చేశాం!
చివరికేమిటి.
మాస్ ప్రేక్షులు ఎంజాయ్ చేస్తారు.
కొత్తకొత్తగా ఇప్పుడిప్పుడే గుర్తింపు పొందుతున్న యువ రాజ్ తరుణ్ తో కాస్త డీసేన్సీనీ,
నీట్ నేస్ నీ ఆశించే వాళ్ళకి మాత్రం
మోటుగా వుంటుంది ఈ మాస్ ప్రేమ. ఇది నయమే.
ఎవరో ఒక వర్గం ప్రేక్షకులు కూడా మోయని ఇలాటి సినిమాలే ఎక్కువ వస్తున్న ఈ రోజుల్లో, ఈ సీతారాముల మాస్ లవ్ మాస్ వర్గాలకైనా పనికి రావడం
గొప్పే!
-సికిందర్