రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

Friday, January 29, 2016

షార్ట్ రివ్యూ..హర్రర్ మైనస్ కామెడీరచన- దర్శకత్వం : సుందర్ సి
తారాగణం : సిద్ధార్థ్, త్రిష, హంసిక, సుందర్ సి, పూనం బజ్వా, మనోబాల, కోవై సరళ  తదితరులు
సంగీతం : హిప్ హాప్ తమిళ, ఛాయాగ్రహణం : యూకే . సెంథిల్ కుమార్
నిర్మాణం : గుడ్ ఫ్రెండ్స్ గ్రూప్
విడుదల : జనవరి 29, 2016
***
హారర్ కామెడీల పరంపర ఆగకుండా  కొనసాగుతోంది. తమిళ, తెలుగు సినిమాలకి ఇప్పుడు దెయ్యం అనే పదార్ధం నిత్యావసర సరుకైపోయింది. దెయ్యం కామెడీల్ని సీక్వెల్స్ మీద సీక్వెల్స్ కూడా తీస్తూ ఇప్పట్లో నిన్నొదల బొమ్మాళీ అన్నట్టు జోరుమీద సాగిపోతున్నారు నిర్మాతలు, దర్శకులు. ఈ రేసులో ‘చంద్రకళ’  అనే తమిళ డబ్బింగ్ తో దర్శకుడు  సుందర్ సి కూడా జాయినయ్యాడు. ఇప్పడు  దీనికి సీక్వెల్ గా ‘కళావతి’ తో మరో సారి అదే విధంగా  భయపెట్టి నవ్వించే ప్రయత్నం చేశాడు. ఇది ‘చంద్రకళ’ కి కొనసాగింపు కథ కాకపోయినా సీక్వెల్ పేరిట చెలామణి అయిపోతోంది. అయితే సీక్వెల్ అనగానే ఇదివరకున్న ఆకర్షణ ఇప్పుడు లేదు. అయినా సీక్వెల్స్  అంటూ ప్రచారం చేసుకుని విడుదల చేసిన  ఈ లేటెస్ట్ దెయ్యం డబ్బింగ్ కామెడీలో విషయం ఏమిటో, అదెంతవరకూ కొత్తగా వుందో ఓసారి చూద్దాం.
కథేమిటి
ఓ  గ్రామంలో జమీందారు గారి బంగాళా.  ఆ గ్రామంలో ఒక భారీ అమ్మవారి విగ్రహానికి కుంభాభిషేకం చేసి పునఃప్రతిష్టాపన చెయ్యాలని ఆ విగ్రహాన్ని తొలగిస్తారు. అంతవరకూ దుష్ట శక్తుల నుంచి గ్రామాన్ని కాపాడుతూ వస్తున్న  అమ్మవారి విగ్రహం అలా తొలగగానే గ్రామంలోకి ఓ ప్రేతాత్మ జొరబడుతుంది.  నేరుగా జమీందారు  బంగళాలో ప్రవేశించి  మొదట జమీందారు పని బడుతుంది. ఆ దెబ్బకి కోమా లోకి వెళ్ళిపోతాడు జమీందారు. ఈయన కొడుకు ఒకడు మురళీ ( సిద్దార్థ్) అనే అతను అనిత ( త్రిష) అనే అమ్మాయితో నిశ్చితార్ధమై  ఎక్కడో బీచిలో బ్యాచిలర్ పార్టీ ఎంజాయ్ చేస్తూంటాడు. తండ్రి సంగతి తెలిసి  వచ్చేస్తాడు. అప్పుడు కోమాలోంచి బయటపడ్డ తండ్రి మీద మరోసారి ఆత్మ దాడి  చేస్తుంది. ఈసారి చనిపోతాడు తండ్రి.   ఈ సంఘటనలో మురళిని అరెస్టు చేతారు పోలీసులు.
ఇలావుండగా అనిత అన్న ( సుందర్ సి) ఒక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్. ఇతను ఈ బంగళాలో జరుగుతున్న సంఘటనలకి మూలం తెలుసుకోవాలని వచ్చి సీసీ కెమెరాలూ, థర్మల్ స్కానర్ లూ అమరుస్తాడు. ఈసారి ఆత్మ మురళి అన్న మీద  దాడి చేస్తుంది. దీంతో కెమెరాకి చిక్కుతుంది. ఆ విజువల్స్  చూస్తే ఆ ఆత్మ  మురళి చెల్లెలు మాయ ( హంసిక) దని తేలుతుంది. మురళి ఆందోళన పడతాడు. ఎప్పుడో చనిపోయిన చెల్లెలు పగదీర్చుకుంటోందా కుటుంబం మీద- ఎందుకు? అసలేం జరిగింది? చెల్లెలు ఎలా చనిపోయింది? అన్న ప్రశ్నలతో మిగతా కథ సాగుతుంది...
ఎలావుంది కథ
రొటీన్ గా భయపెడుతూ నవ్వించడమనే స్కీముతోనే వుంది. హన్సిక ఫ్లాష్ బ్యాక్ లో ఒక ఆసక్తికరమైన విషయముంది. అది ఆనర్ కిల్లింగ్స్ కి సంబంధించింది. కులం తక్కువ వాణ్ణి ప్రేమించి గర్భవతి అవడంతో ఆమెణి తండ్రి, అన్న చంపేసిన కథ. ఇదొక సామాజిక సమస్యే. దీనికి పరిష్కారమే ఈ దెయ్యం కథ. ఫ్లాష్ బ్యాక్ లో  ఇంత విషాదముండగా వర్తమాన  హార్రర్ కథలో కామెడీని జొప్పించిన దర్శకుడి కళ అంతంత మాత్రంగానే వుంది.
ఎవరెలా చేశారు
సిద్ధార్థ కి పెద్దగా పాత్ర లేదిందులో సెకండాఫ్ చివరివరకూ. తన చెల్లెలు అసలెలా చనిపోయిందో అతడికి ముందు తెలీదు కాబట్టి కథలో ఇన్వాల్వ్ మెంట్ లేదు. కేసుని పరిశోధించే ఫోటోగ్రాఫర్ గా దర్శకుడు సుందర్ సికి పాత్ర నిడివి ఎక్కువ వుంది. త్రిషకి మోడరన్ గర్ల్ గా ఫస్టాఫ్ లో అంతగా పనిలేదు- గ్లామర్ ప్రదర్శన, పాటలు పాడుకోవడం తప్ప.  సెకండాఫ్ లో రొటీన్ గా ఆత్మ ఆవహించడంతో ఆమెకి పని పెరుగుతుంది.  ఫ్లాష్ బ్యాక్ కథలో హంసిక ఓకే. కామెడీ కోసం  నటించిన నటీనటుల్లో సూరి, కోవైసరళలు అగ్రభాగాన నిలుస్తారు.  
పాటలు, కెమెరా వర్క్ ఓ మాదిరిగా వున్నా, బంగాళా సెట్ భారీగా వేశారు. సీజీ వర్క్ తో ఆత్మని ప్లే చేసిన టెక్నిక్స్ పెట్టిన బడ్జెట్ కి తగ్గట్టే వున్నాయి.
 చివరికేమిటి
ఫస్టాఫ్ లో భయపెట్టే  దృశ్యాల్లో పసలేదు. పసలేకపోగా బోరు కొట్టే ప్రమాదాన్ని కొనిదెచ్చుకున్నాయి. సెకండాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ వల్ల కథా బలం చేకూరినా, భయపెట్టే  దృశ్యాల కంటే కామెడీ ఎక్కువైపోయింది. ఎడాపెడా వచ్చి పడుతున్న ఇలాటి హర్రర్ కామెడీల మధ్య మరో హారర్ కామెడీ అంటే చాలానే   కష్టపడాలి. పాతిక సినిమాలకి దర్శకత్వం వహించిన అనుభవమున్న ఈ దర్శకుడికి ప్రేక్షకుల నాడీ తెలీక కాదు, అయితే ‘చంద్రకళ’  తీసిన తర్వాత తనతో తనే పోటీ పడి మరో హార్రర్ కామెడీ  ‘కళావతి’ తీయాల్సి వచ్చింది. ఇదీ సమస్య. సీక్వెల్ అన్నాక సక్సెస్ అంత సులభం కాదని నిరూపించడానికి మాత్రం ఈ సినిమా పనికొచ్చింది.

-సికిందర్


No comments: