ఏర్
లిఫ్ట్’ లిఫ్ట్ చేసిందెవర్ని?
నిజమే..’ఏర్ లిఫ్ట్’ సినిమా చూస్తున్నంత సేపూ కువైట్ సంక్షోభంలో భారత
ప్రభుత్వపు ఉనికి కోసం అడుగడుగునా వెతుక్కోవాల్సి వస్తుంది...1990 లో కువైట్ మీద
ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ దాడికి ఆజ్ఞాపించిన చారిత్రక ఘట్టంలో అక్కడ
చిక్కుకుని అల్లల్లాడిన లక్షా డెబ్బై వేలమంది భారతీయుల్ని, సినిమా క్లయిమాక్స్
వరకూ వాళ్ళ ఖర్మానికి వదిలేసి, భారత
ప్రభుత్వం ఏం చేస్తోందా అన్న సందేహం మనల్ని పీడించక మానదు.
కేవలం దర్శకుడు రాజా కృష్ణ మీనన్ సృష్టించిన కల్పిత పాత్ర అయిన రంజిత్ కటియాల్ ( అక్షయ్ కుమార్ ) మొత్తం బాధ్యతనంతా తన భుజానేసుకుని,
అక్కడ చిక్కుకున్న భారతీయుల్నందర్నీ
ఇండియాకి తరలించే బృహత్ ప్రణాళిక రచించినట్టు చూపించారు. చిట్ట చివర్లోనే భారత ప్రభుత్వపు రెడ్ టేపిజం కొలిక్కివచ్చి
విమానాల్ని పంపినట్టు చూపించారు. విదేశాంగ మంత్రిని చాలా సోమరి వ్యక్తిలా, కువైట్
సంక్షోభం కంటే ఇంకా చాలా ముఖ్యమైన పనులేవో పెట్టుకుని ఫీలయ్యే వ్యక్తిలా చూపించారు. ఈ శాఖ ఉన్నతాధికారి అయిన జాయింట్
సెక్రెటరీని చూపించిన తీరైతే చాలా హాస్యాస్పదంగా
వుంది. అతనొక పెద్ద హాల్లో ఎందరో ఉద్యోగుల సమూహంలో, ఫైళ్ళ గుట్టల మధ్య గుమస్తాలా
లంచ్ బాక్సుతో, కప్పులో చాయ్ తో పనిచేసుకుంటూ కూర్చుని ఉంటాడు. టేబుల్ మీద
టెలిఫోన్ కూడా వుండదు. మంత్రిని కలవాలనుకుంటే చేతులు కట్టుకుని గంటల తరబడి నిరీక్షిస్తాడు. ఇలాటి
వెన్నో భారత ప్రభుత్వానికి సంబంధించిన చిత్రీకరణలు బ్యాడ్ టేస్టుతో వున్నాయి - ఏర్ ఇండియా పైలట్స్ స్పందించిన తీరు సహా. నిజానికి కువైట్ సంక్షోభం
ప్రారంభమైన వెంటనే యుద్ధ ప్రాతిపదికన భారత ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అప్పట్లో
అధికారంలో వున్నది ప్రధాని విపి సింగ్ ప్రభుత్వం. అప్పటి విదేశాంగ మంత్రి ఐకె
గుజ్రాల్. ఈయనే 1997 లో ప్రధానమంత్రి అయ్యారు.
ఈ సినిమాలో
తమ శాఖని ఇంత హీనంగా చూపించడాన్ని తీవ్ర అవమానంగా భావించిన మాజీ రాయబారి ఒకరు, మాజీ
విదేశాంగ శాఖాధికారులు కొందరూ, ప్రస్తుత
విదేశాంగ ప్రతినిధి సహా నిన్న శుక్రవారం ధ్వజమెత్తారు. అమెరికా మాజీ రాయబారి
నిరుపమా రావ్ అయితే, ఈ సినిమాలో విదేశాంగ శాఖని చూపించిన తీరు ‘లాఫింగ్ గ్యాస్’
అని హాస్యమాడారు. ప్రస్తుత విదేశాంగ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్, అప్పట్లో తమ
శాఖ క్రియాశీలంగా వ్యవహరించిందనీ, విదేశాల్లో వున్న భారతీయుల రక్షణకి తమ శాఖ మొదటి
ప్రాధాన్య మిస్తుందనీ, ఈ సినిమాలో అనవసరంగా చాలా సృజనాత్మక స్వేచ్చ తీసుకున్నారనీ
అభ్యంతరం వ్యక్తం చేశారు. దౌత్యాధికారులు ఈ సినిమా వాస్తవాలకి దూరంగా వుందని
విమర్శించారు.
కువైట్ సంక్షోభంలో చిక్కుకున్న భారతీయుల్ని సురక్షితంగా
తరలించడంలో కీలక పాత్ర పోషించిన రాయబారి కెపి ఫేబియన్, చాలా ఆసక్తికర విషయాల్ని
వెల్లడించారు. అప్పటి మంత్రి ఐకె గుజ్రాల్ నేతృత్వంలోని విదేశాంగ శాఖతో బాటు, ఏర్
ఇండియా, పౌరవిమానయాన శాఖా సమన్వయంతో పనిచేసి చరిత్రలో ఎన్నడూ చోటు చేసుకోని మహా
ప్రజా సమూహ తరలింపు యజ్ఞాన్ని దిగ్విజయంగా పూర్తి చేశాయని చెప్పుకొచ్చారు. టర్కీలో, జోర్డాన్ లో వున్న
విదేశాంగ శాఖాధికారులు కూడా అహర్నిశలు
శ్రమించారని చెప్పారు.
స్వయంగా
విదేశాంగ మంత్రి ఐకె గుజ్రాల్ ఇరాక్ వెళ్లి సద్దాం హుస్సేన్ తో చర్చించారనీ, ఫలితంగానే భారత్ తో సత్సంబంధాల్ని
కొనసాగిస్తున్న సద్దాం, టిప్పు సుల్తాన్ నౌక
ని కువైట్ పంపించారనీ, విమనాల్లోనే కాకుండా ఆ నౌకలో కూడా భారతీయుల్ని తరలించామనీ వెల్లడించారు.
( సినిమాలో దీన్ని హీరో కష్టాల కోసం వక్రీకరించారు. హీరో బాగ్దాద్ వెళ్లి ఇరాక్
విదేశాంగ మంత్రి తారీక్ అజీజ్ ని కలిసి అభ్యర్ధించినట్టు చూపించడాన్ని మనం క్షమించగల్గినా;
అజీజ్ నౌకని పంపడం, తీరా ప్రజలు ప్రయాణానికి తరలి వస్తున్నప్పుడు ఆ నౌక రద్దయిందని ప్రకటించి హీరో కష్టాలు
పెంచడమనే సృజనాత్మక స్వేచ్ఛ
సరైనదేనా - టిప్పు సుల్తాన్ కూడా ఇండియాకి
కువైట్ భారతీయుల్ని మోసుకొచ్చినప్పుడు?).
ఫేబియన్
ఇంకా చెప్పుకొస్తూ, కువైట్ మీద సద్దాం దాడిని ఖండించాల్సిందిగా అమెరికా నుంచి ఎంత వొత్తిడి వచ్చినప్పటికీ
విదేశాంగ శాఖ తలొగ్గలేదనీ. కువైట్ లో
చిక్కుకున్న భారతీయుల కోసం అమెరికా మాటనే పక్కన బెట్టామనీ, కానీ సినిమాలో భారతీయుల్ని
తరలించడానికి విదేశాంగ శాఖ అయిష్టంగా వున్నట్టు చూపించారనీ, దర్శకుడు విదేశాంగ శాఖ
ఎలా పనిచేస్తుందో తెలుసుకోలేదనీ విమర్శించారు.
దర్శకుడు
రాజా కృష్ణ మీనన్ కొన్నేళ్ళ పాటు రీసెర్చి చేశామన్నారు. అయితే నిన్న శుక్రవారం రాత్రే ‘టైమ్స్ నౌ’ ఛానెల్ న్యూస్ అవర్ ప్రోగ్రాం లో
పాల్గొన్న మాజీ విదేశాంగ అధికారులూ, జర్నలిస్టులూ, యాంకర్ అర్ణాబ్ గోస్వామీ సహా, దర్శకుడు తప్పే చేశారని మెత్తగా మందలించారు. దర్శకుడు
ఇచ్చుకున్న వివరణలేవీ చర్చకి నిలబడలేదు.
జరిగిన చరిత్రని పక్కన పెట్టి సినిమా చూస్తే
దర్శకుడు మీనన్ చేసింది గొప్ప కృషే. కళారూపంగా అది గొప్ప సినిమానే. గొప్ప
కలెక్షన్లు సాధిస్తున్నదే. ఒక మాజీ విదేశాంగ అధికారి అన్నట్టు, ఇప్పుడు ఇరవై ఏళ్ల తర్వాత
ఈ సినిమా చూసే ఎక్కువ మంది ప్రేక్షకులు
కువైట్ ఉదంతం జరిగినప్పుడు పుట్టి వుండరు. వారికి తప్పుడు సమాచార మివ్వడమే అవుతుంది- చరిత్రలో ఒక
పార్శ్వాన్ని పూర్తిగా ఇలా ఉపేక్షించి. పైగా విదేశాంగ శాఖని ఇలా చిత్రించడం
విదేశాల్లో ఆ శాఖ ప్రతిష్టకే భంగకరం. స్థానిక ప్రేక్షకుల్లో దర్శకుడు ఈ సినిమా ద్వారా
క్లయిమాక్స్ లో గొప్ప దేశ భక్తిని రగిలించాడు సరే, అదే సమయంలో ఇలా తీసి విదేశాల్లో
విదేశాంగ శాఖ ఇమేజిని దెబ్బతీయడం కూడా
చేసినట్టే. దేశభక్తే కాదు, విదేశాంగ భక్తి కూడా అవసరం.
చరిత్రని కాల్పనికం చేసి కమల్ హాసన్ కూడా ‘హేరామ్’
తీశారు. అందులో మహాత్మా గాంధీని చంపిన
నాథూరాం గాడ్సే కి సమాంతరంగా కమల్ సృష్టించిన కాల్పనిక పాత్రయిన తమిళ బ్రాహ్మణ
యువకుడు, గాడ్సేకి సమాంతరంగా పథకమేస్తూ, బిర్లా మందిర్ లో గాంధీ ఎదుటకి వచ్చేస్తాడు. అయితే
రెప్పపాటు కాలంలో అతడి పథకం తలకిందులై, గాడ్సే తుపాకీ పేల్చేస్తాడు గాంధీ మీదకి.
ఫ్రాన్స్ అధ్యక్షుడు చార్లెస్ డీ- గాల్ మీద
అక్కడి టెర్రరిస్టు సంస్థ ఒక విఫల హత్యాయత్నం చేయడం చరిత్ర. నవలా రచయిత ఫ్రెడరిక్
ఫోర్సిత్ దీనికి కల్పన జోడించి, రెండో
హత్యా ప్రయత్నంగా ‘డే ఆఫ్ ది జాకాల్ ‘ అనే బెస్ట్ సెల్లర్ రాశారు. ఇదే పేరుతో
దీన్ని సినిమాగా కూడా తెశారు.
ఈ రకంగా చరిత్రలో కాల్పనిక పాత్ర
సృష్టించడం ఒకెత్తు. దీంతో అభ్యంతరాలుండవు. కానీ చరిత్రలో గాడ్సే నే తీసేసి, ఇంకెవరో
హత్య చేశారని చూపిస్తే ఎలా వుంటుంది. అలాగే వుంది ‘ఏర్ లిఫ్ట్’ లో విదేశాంగ శాఖని డమ్మీని చేసి కాల్పనిక హీరోపాత్రకి
ఆ క్రెడిట్ అంతా కట్ట బెట్టడం.
దర్శకుడు ఒకటి చేయాల్సింది- తన రిసెర్చి
ద్వారా నాటి కువైట్ సంక్షోభంలో కీలకపాత్ర పోషించిన అధికారి ఒకరిని గుర్తించి, ఆయన్నే పాత్రగా చేసి, ఆ పాత్రకి ఎంత
కల్పన జోడించినా, అతిశయోక్తులు చూపించినా ఇబ్బంది వుండేది కాదు. కాకపోతే ఆ అధికారి
కృషిని ప్రభుత్వం గుర్తించి వుండాలి.
-సికిందర్
http://www.cinemabazaar.in/
http://www.cinemabazaar.in/