రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

12, మార్చి 2016, శనివారం

షార్ట్ రివ్యూ!





దర్శకత్వం : కుమార్ నాగేంద్ర
తారాగణం : నారా రోహిత్‌, లతా  హెగ్డే , కబీర్‌  సింగ్‌, అలీ, వెన్నెల కిషోర్‌, షకలక శంకర్‌, సుదర్శన్‌, పూజిత తదితరులు
కథ : ఏ.ఆర్‌. మురుగదాస్‌, సంగీతం : సాయి కార్తీక్‌, ఛాయాగ్రహణం : ఎం.ఆర్‌. పళనికుమార్‌
బ్యానర్‌ : శ్రీ కీర్తి ఫిలింస్‌, నిర్మాతలు : అశోక్‌ బాబా, నాగార్జున్‌
కథనం, దర్శకత్వం: కుమార్‌ నాగేంద్ర
విడుదల తేదీ: మార్చి 11, 2016
         ***
      తమిళంలో మురుగ దాస్ కథ రాసిన ‘మాన్ కరాటే’ ( ప్రాణాలకు తెగించేవాడు) అనే హిట్ ని తెలుగు సినిమా రాజ్యాంగం ప్రకారం ఆవారా మాస్ గానే  టైటిల్ వుండి తీరాలి  కాబట్టి, ‘తుంటరి’ పేరుతో  నారా రోహిత్ హీరోగా  రీమేక్ చేశారు. ‘గుండెల్లో గోదారి’, ‘జోరు’ అనే సినిమాలు తీసిన కుమార్ నాగేంద్ర దీని దర్శకుడు. మరి రెండేళ్ళ క్రితం మురుగదాస్ తమిళంలో హిట్ చేసుకోగలిగిన తక్కువ కథని నాగేంద్ర తెలుగులో ఎలా తీశాడు? మురగ దాస్ హిట్ చేసుకోవడానికి కేవలం తన తక్కువ కథ మీదే ఆధార పడలేదు - మరి నాగేంద్ర కూడా ఇదొక తక్కువ కథ అని గుర్తు పట్టి,  దీని మీదే ఆధారపడకుండా మురుగ దాస్ చేసిన లాంటి కాస్టింగ్ గిమ్మిక్కులతో  ‘తుంటరి’ ని నిలబెట్ట గలిగాడా, లేక ఆ గిమ్మిక్కులున్న సంగతే తెలుసుకోకుండా ఘోర పొరపాటు చేశాడా ఓసారి చూద్దాం...
కథ
        ఓ ఐదుగురు ఐటీ ఉద్యోగులు పిక్నిక్ చేసుకుందామని అడవికి వెళ్తారు. అక్కడో సాధువుని  కలుస్తారు. అతనొక దినపత్రికని సృష్టించి ఇస్తాడు. అది నాల్గు నెలల తర్వాత రాబోయే పత్రిక. అందులో రాజు అనే వాడు ఒక బాక్సింగ్ పోటీల్లో ఐదు కోట్లు గెలుచుకుంటాడని వార్త  వుంటుంది. వెంటనే ఆ రాజు (నారా రోహిత్) ని వెతికి పట్టుకుంటారు. అతను తుంటరి ఆవారాగా తిరిగే బేవార్సు.  ఇతను బాక్సింగ్ లో ఐదు కోట్లు గెలవబోతున్నాడంటే నమ్మ బుద్ధిగాదు.

         అయినా ధైర్యం చేసి రాజుతో ఒప్పందం కుదుర్చుకుంటారు ఐటీ ఫ్రెండ్స్. ఈ బాక్సింగ్ కి సిద్ధపడితే ఖర్చులూ భరిస్తామంటారు. కానీ రాజు సిరి ( లతా హెగ్డే) అనే ఒకమ్మాయితో ప్రేమలో ఉంటాడు. వీళ్ళ బాక్సింగ్ గోలని పట్టించుకోకుండా ఆ అమ్మాయి వెంట పడుతూంటాడు.

         అప్పుడు ఐటీ ఫ్రెండ్స్ కి ఒక షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. తమక్కావలసిన రాజు వీడు కాదనీ, ఇంకో రాజు వేరే ఉన్నాడనీ, అతను పక్కా   ప్రొఫెషనల్ బాక్సర్ అనీ తెలుస్తుంది. భవిష్యత్ వార్త ప్రకారం మ్యాచ్ గెల్చి ఐదు కోట్లు కొట్టేసే వాడు వీడే (కబీర్ దాస్) నని తెలుస్తుంది. ఈ రెండో రాజు జోలికెళ్ళ లేక,  మొదటి రాజునే దువ్వుతూ  శిక్షణ ఇప్పించి,  బరిలోకి రెండో రాజు మీదికి తోసేస్తారు. ఇప్పుడు ఈ మొదటి ఆవారా రాజు,  రెండో వస్తాడు రాజుతో తలపడి ఎన్ని తిప్పలు పడ్డాడు, గెలిచాడా లేదా, దీంతోనే  ముడిపడి వున్న ప్రేమని కూడా గెలుచుకున్నాడా  లేదా అనేది మిగతా కథ.

ఎలావుంది కథ
        కొత్తగా వుంది. చిత్తశుద్ధి వుంటే కమర్షియల్ కథల్ని కూడా కొత్తగా ఎలా ఆలోచించవచ్చో తెలియజేసేలా వుంది. మనం ఆలోచించమనీ, ముందుగా తమిళంలో ఎప్పుడాలోచిస్తారా అని పడిగాపులు గాస్తామనీ, వాళ్ళు ఆలోచించగానే అప్పనంగా రీమేక్ చేసుకుని కాలరెగరేస్తామనేలా వుంది. ఏ పాపమూ చేసుకోలేదు ఈ తక్కువగా వున్న తమిళ కథ.  ఈ కొట్టొచ్చినట్టు తక్కువగా కన్పిస్తున్న తమిళ కథని రీమేకైనా ఎలా చేసుకోవాలో తెలియరాక తీవ్ర అపచారం చేశాడు తెలుగు దర్శకుడు. కాబట్టి కొత్తగా వున్నఈ  తమిళ కథ తెలుగులో  స్వచ్ఛ భారత్ ఉద్యమానికి పనికొచ్చేలా పరిణామం చెందింది.

ఎవరెలా చేశారు
        నారా రోహిత్ తుంటరి మాస్ పాత్ర చేద్దామనుకున్నాడుగానీ, తన టాలెంట్ కి ఇది సరిపోలేదు.  ఇంకా ‘అసుర’ లో పెరిగిన అదే శరీరంతో అవస్థలు పడాల్సి వచ్చి పాత్ర కంట్రో ల్లోకి రాలేదు. ఇలాటి పాత్ర తన డిపార్ట్ మెంట్ కాదని తేలిపోయింది. స్థూలకాయం హీరో అర్హత కాదు, అనర్హత.

        హీరోయిన్ లతా హెగ్డే  గ్లామర్ పరంగానూ, నటనాపరంగానూ పనికిరాలేదు. సినిమాకొక
హీరోయిన్ వస్తున్నారు. పేర్లు కూడా గుర్తుండడం లేదు. తనూ ఇంతే.

       వెన్నెల కిషోర్, షకలక శంకర్, అలీలు వంటి వాళ్ళ కామెడీల్లో కొత్తదనం లేదు.
రెండో రాజుగా కబీర్ దాస్ ఒక్కడే నటన అంటే ఏమిటో  తెలుసుకుని పాత్రని నిలబెట్టినవాడు.

       కెమెరా పనితనం వరకూ బాగానే వున్నా, సంగీతం సహా సకల ప్రొడక్షన్ విలువలు అంతంత మాత్రమే. దర్శకత్వమూ డిటో.

చివరికేమిటి
          మురుగ దాస్ తన కథకి తగ్గ ఇమేజీ ఫిజిక్కూ వుండే అతి సాధారణంగా కన్పించే శివకార్తి కేయన్ ని  తీసుకున్నాడు. అలాగే ఇలాటి ఇంత సామాన్యుడు ఒక క్లాస్ అమ్మాయితో ప్రేమలో పడ్డమనే ట్రాక్ కి డైనమిక్స్ కోసం టాప్ హీరోయిన్ హన్సికని దింపాడు. దీంతో ఇదొక క్రేజీ కాంబినేషన్  వున్న కాస్టింగ్ అయ్యింది. తక్కువ కథ వున్న సినిమాని నిలబెట్టుకోవడానికి ఈ కాస్టింగ్ ప్లస్ అయ్యింది. తెలుగు రీమేక్ లో ఈ గిమ్మిక్కుల్ని పూర్తిగా మర్చిపోయాడు దర్శకుడు నాగేంద్ర- లేక గిమ్మిక్కులున్న సంగతే  పసిగట్టాడో లేదో- కేవలం గంటన్నర పాటూ కథే లేని కథకి నారా రోహిత్ కుండే ఫాలోయింగ్ మీద ఆధారపడి ప్రయాణం సాగించాడు. ఈ పాత్రకి నారా రోహితూ సరిపోక, హీరోయినూ పనికిరాక – ఇద్దరు డమ్మీస్ తో దమ్ములేని రీమేక్ చేసేశాడు!
పైగా ‘డెస్టినీ  వర్సెస్ హార్డ్ వర్క్’ అని టాగ్ లైన్ ఒకటి పెట్టుకుని చెప్పిందేమిటో  ఎంత ఆలోచించినా అంతుచిక్కని  రహస్యం!


-సికిందర్