రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

3, జనవరి 2021, ఆదివారం

1006 : రివ్యూ!

      హేపీ కరోనా సీక్వెల్ న్యూ ఇయర్. 21 వ శతాబ్దపు 21 వ సంవత్సరం ఓటీటీ ఆయు ప్రమాణాన్ని ఇంకింత పెంచుతున్నట్టుంది. రోజుకి 9 వేల చొప్పున కొత్త చందాదార్లు చేరుతున్నారు. హిందీ తర్వాత తెలుగుకే డిమాండ్. డిమాండ్ కి తగ్గ సరఫరా లేదు. డిమాండ్ తగ్గట్టు కంటెంట్ లేదు. హిందీలో కంటెంట్ మారింది, పెరిగింది. మారిన కంటెంట్ తో సినిమాల్ని పునర్నిర్వచిస్తోంది బాలీఫుడ్. నిన్నటి సినిమా ఇవ్వాళ వుండడం లేదు. ఇవాళ్టి సినిమా రేపుండడం లేదు. ట్రెండ్ సెట్టర్స్ లేవు. ట్రెండ్ సెట్టర్స్ ని ఫాలో అయ్యే తామరతంపర మేకింగులు లేవు. దేనికదే యూనిక్ ఐడియా, దేనికదే యూనిక్ మోడల్. మూస చట్రాల్లేవు, రేసు చక్రాలే వున్నాయి. యూనిక్ మేకర్లదే మార్కెట్, యూనిక్ థింకర్లకే డిమాండ్. ప్రేక్షకులు యూనిక్ గా మారుతున్నారు. ఓటీటీ కంపెనీలు సినిమాలెలా వుండాలో నిర్ణయిస్తున్నాయి. క్లాస్ మాస్, ఏబీసీ సెంటర్ తరగతులు ఒకటయ్యాయి. ఒన్ నేషన్, ఒన్ సినిమా. ఈ పరిస్థితి ఎన్నాళ్ళు వుంటుందో, థియేటర్లకి సాధారణ పరిస్థితులు నెలకొంటే  ఏమౌతుందో మాత్రం తెలీదు.  
    
        'కే వర్సెస్ ఏకే' (అనిల్ కపూర్ వర్సెస్ అనురాగ్ కశ్యప్) ఇలాటి వొక కిల్లర్ ఐడియా. నిజజీవితపు అనిల్ కపూర్, సినిమాలో కూడా నిజజీవితపు అనిల్ కపూరే. నిజజీవితపు దర్శకుడు అనురాగ్ కశ్యప్, సినిమాలోనూ నిజజీవితపు దర్శకుడు అనురాగ్ కశ్యపే. నిజజీవితపు అనిల్ కపూర్ కీ, నిజ జీవితపు అనురాగ్ కశ్యప్ కీ ఒకానొక సందర్భంలో కొట్టుకునే పరిస్థితి వస్తే ఏం జరుగుతుంది? ఇదీ సినిమాకి కల్పించిన కథ. ఈ కథతో ధైర్యం చేసింది దర్శకుడు విక్రమాదిత్య మోత్వానే. ఇలాటి కథ తెలుగులో ఎవరైనా దర్శకుడు చెబితే ఏమవుతుందో వూహించాల్సిందే. 

     2003 లో అనురాగ్ ప్రారంభించిన ఆల్విన్ కాళీ చరణ్ నుంచి మధ్యలో తప్పుకున్నాడన్న కోపం అనిల్ మీద అనురాగ్ కి. రెండు దశాబ్దాలు కావొస్తున్నా మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇవ్వలేదని కసి. ఇలాటి ఇద్దరూ ఒక ఈవెంట్ లో ప్రేక్షకులతో ఇంటరాక్షన్ సందర్భంగా భేటీ అయినప్పుడు, అనిల్ ని సూటిపోటి మాటలంటాడు అనురాగ్. ఇంకా నువ్వు హీరోవా, డాన్సు లేస్తావా, నువ్విప్పుడు అనిల్ అంకుల్ వి - అని దెప్పిపొడుస్తాడు. నేను సిగ్గూశరం లేని స్టార్ని అనేస్తాడు అనిల్. స్టార్ గొప్పోడా, డైరెక్టర్ గొప్పోడా ...ఇలా మాటామాటా పెరిగి గ్లాసులో నీళ్ళు అనిల్ మోహన కొట్టి పోతాడు అనురాగ్. ఇది వైరల్ అవుతుంది. బాలీవుడ్ అనురాగ్ ని బ్యాన్ చేస్తుంది. సినిమాలు చేజారిపోతాయి. అప్పుడొక అసిస్టెంట్ యోగితా బీహానీ ఒక ఐడియా వుందని చెప్తుంది. 

        ఐడియా ప్రకారం షూటింగులో వున్న అనిల్ దగ్గరికి ఫిలిమ్ సిటీ వెళ్తాడు అనురాగ్. దగ్గరికి రానివ్వరు. బయట కూర్చోబెడతారు. ఆ రోజు అనిల్ బర్త్ డే. మిగిలి పోయిన బర్త్ డే కేకు ముక్క తెచ్చి అనురాగ్ కి ఇంత పడేస్తారు. ఎలాగో అనిల్ ని పట్టుకుని అనిల్ కి బ్రేక్ నిచ్చే కిడ్నాప్ కథ విన్పించబోతాడు. నీ చెత్త కథ ఎవడ్రా వింటాడూ అని బూతులు తిడతాడు అనిల్ (సినిమా సాంతం అనురాగ్ ని పచ్చి బూతులు తిడుతూనే వుంటాడు). ఈ కథలో కిడ్నాపయ్యింది మీ రియల్ కూతురే, నేను కిడ్నాప్ చేశాను, తెల్లారేలోగా పది గంటల్లో ఎక్కడుందో మీరు తలుసుకుని విడిపించుకోవాలి- ఇదంతా యోగితా కెమెరాతో షూట్ చేస్తూంటుంది, ఈ సినిమా మీకూ నాకూ మంచి పేరు తెస్తుంది - అని స్క్రిప్టు చూపించి వివరిస్తాడు. అనిల్ కి ఇంకోదారి లేకుండా ఇరికించేస్తాడు. ఇక కూతురి కోసం పరుగులు దీస్తాడు అనిల్. వెంట అనురాగ్ వుంటాడు. కెమెరాతో షూట్ చేస్తూ యోగితా వుంటుంది. 
 
    ఇప్పుడు తెల్లారే లోగా అనిల్ కూతురు సోనమ్ కపూర్ ని కనుక్కోగలిగాడా? ఈ పరుగులో పడ్డ కష్టాలేమిటి? అవమానాలేమిటి? తెరమీద స్టార్ గా హీరోయిజంతో వుంటే, తెర వెనుక జీవితంలో ఇలాటి పరిస్థితిలో ఎలా వుంటాడు? ఏం చేస్తాడు? నిజ జీవితంలో సగటు మనిషేనా? జోకరేనా? ఇవన్నీ పరీక్షకి నిలబెడతాయి.

***

        ఇది మాక్యుమెంటరీ జానర్ సినిమా. అంటే నిజ వ్యక్తుల్ని, లేదా నిజ సంఘటనల్ని డాక్యుమెంటరీ చేస్తూ ఎగతాళి చేసే సినిమా. హాలీవుడ్ లో పెద్ద లిస్టే వుంది. ఈ కథ 2013 లో అవినాష్ సంపత్ రాశాడు. రాసిన వెంటనే కథలు సినిమాలైపోవు. కాబట్టి ఇంతకాలం పట్టింది. అనురాగ్ కశ్యప్ మాటలు రాశాడు. పచ్చి బూతుల మాటల రచయితగా ఆల్రెడీ పేరున్న వాడు. అతను తీసిన గ్యాంగ్స్ ఆవ్ వసేపూర్ లోంచి బూతులు తీసేస్తే ఆ సినిమా ఎవ్వరూ చూడరని అనిల్ కపూర్ తిట్టిపోస్తాడు. అనిల్ చేత ఎడాపెడా పచ్చి బూతులు తిట్టించుకుంటాడు అనురాగ్. దీని వల్ల ఈ సినిమా ఇంట్లో అందరూ కలిసి చూసేలా మాత్రం వుండదు. హిందీ ఓటీటీ సినిమాల్లో బూతులు న్యూనార్మల్ అయిపోయింది. ఈ సినిమా ఇంగ్లీషు సబ్ టైటిల్స్ లో ఎఫ్ పదం లెక్కలేని సార్లు వస్తూంటుంది. హాలీవుడ్ సినిమాల్లో కూడా ఎఫ్ పదం ఈ యెత్తున దాడి చేయదు. 

      Axn ఛానెల్లో యాక్షన్ రియాల్టీ షోలు వస్తుంటాయి. ఈ సినిమా కథ అలాటిదే. కిడ్నాప్ తో టాస్క్ ఇచ్చిన వాడు అనురాగ్, దాని టాస్కర్ అనిల్. కూతుర్ని కాపాడుకునే ప్రయత్నాలు. అయితే కథ మధ్యలో మలుపు తిరుగుతుంది. టాస్క్ ఇచ్చిన అనురాగ్ కే టాస్క్ ఎదురు తిరుగుతుంది. ఈ మలుపు తను రాసిన స్క్రిప్టులో వుండదు. తన తల్లిదండ్రులు కిడ్నాపయ్యారు. ఎవరు చేశారు, ఎలా చేశారు? అనిల్ చేసే అవకాశం లేదు. తను అనిల్ తోనే వుంటున్నాడు. అతను చేసే ప్రతీకాల్ స్పీకర్ ఫోన్లో వింటూనే వు న్నాడు.

        ఈ మలుపు మంచిదే. అయితే దీనికి ముగింపులో వివరణనిచ్చిన విధానం మాత్రం మొత్తం కథనే  డీలా చేసేసింది. ముగింపులో ఎండ్ సస్పెన్స్ సినిమాల తరహాలో ఇచ్చిన  వివరణ ముగింపు షాక్ వేల్యూనే దెబ్బ తీసింది. ముగింపు మొత్తం కథ అనురాగ్ కే ఎదురు తిరిగేట్టు అనిల్ క్యారక్టర్ రివీల్ కావడం షాకింగే కానీ, ఇదెలా చేశాడో మొదట్నుంచీ కట్ షాట్స్ వేస్తూ చెప్పుకు రావడంతో, ఎండ్ సస్పెన్స్ సినిమాలతో జరిగే నష్టాన్నే కొని తెచ్చింది. 

        మొదట్నుంచీ అనిల్ మనకి తెలియకుండా ఏమేం చేసుకు వచ్చాడో అతను చెప్పే ఆ షాట్స్ అన్నీ చూస్తూ, వాటిని చూపించిన కథతో  జోడించుకుని అర్ధం జేసుకునే ఆసక్తి ముగింపులో ఎవరికుంటుంది. ప్రతీసారీ ఎండ్ సస్పెన్స్ సినిమాల్లో జరిగే ఇదే విఫల తంతుకి ఇక్కడొక విరుగుడు కన్పిస్తుంది - ఆ చెప్పేదేదో ప్రేక్షకుల భాగస్వామ్యం లేకుండా  ఏకపక్షం గా చెప్పుకుపోకుండా -అనురాగ్ ని కుదేసి కూర్చోబెట్టి- ఒరేయ్, నేను చేసిందిదిరా, అప్పుడు నీ స్క్రిప్టు ప్రకారం నువ్వాలా చేశావే, దానికి నా స్క్రిప్టు ప్రకారం ఇలా చేశానని నాటకీయంగా ఒక్కోటీ చెబుతూ పోతే, ప్రత్యర్ధితో ఈ ఇంటరాక్టివ్ సెషన్ ప్రేక్షకులకి కిక్ ఇచ్చే అవకాశముంటుందని ఇందులోంచి గ్రహించవచ్చు. 

        అలాగని ఎండ్ సస్పెన్స్ సినిమాలకి ఈ ట్రిక్ వాడొచ్చని కాదు. అసలు ఎండ్ సస్పెన్స్ కథల జోలికే పోకూడదు, దృశ్య మాధ్యమమైన సినిమాలకి. నవలల కైనా ఎండ్ సస్పెన్స్ హాని చేస్తుందని ఏనాడో గ్రహించిన అగథా క్రిస్టీ, ఎండ్ సస్పెన్స్ ని ఎండ్ సస్పెన్స్ అనిపించకూడా చేసిన అద్వితీయ ప్రయోగాలెన్నో వున్నాయి. క్రైమ్ సినిమాలు తీయాలని నిజంగా నిబద్ధత వుంటే ఆమె నవలల్ని, వాటితో వచ్చిన కొన్ని సినిమాల్నీ స్టడీ చేయాలి. లవ్ సినిమాలు తీసినట్టు క్రైమ్ సినిమాలు తీసిపడేస్తే కాదు. బాక్సాఫీసుకి క్రిమినల్స్ గా ప్రూవ్ అవుతారు.

***

     అనిల్, అనురాగ్ ఇద్దరూ పేలడానికి సిద్ధంగా వున్న ఏకే 47 గన్స్ లా నటించారు. పరుగులు తీసే ప్రతీ సీనులో ఇద్దరూ వుంటారు. పరస్పరం మాటల దాడి సైతం నిప్పులు చెరుగుతూంటుంది. బూతులు తీసేస్తే ఈ జానర్ కి అనురాగ్ రాసిన ఎగతాళి డైలాగ్స్ టాలీవుడ్ మూస కృత్రిమ టెంప్లెట్ ఎత్తిపోతల రైటర్స్ కి ఒక పాఠం. అనిల్ లో 64 ఏళ్ల వయస్సు కన్పించదు. నేటి యువ హీరోలకి అతనే మాత్రం తీసిపోడు ఫిట్ నెస్ విషయంలో. 48 ఏళ్ల అనురాగ్ ఒక సీనియర్ స్టార్ తో చేసే వెకిలితనాల్లో యూత్ అప్పీల్, బాక్సాఫీసు అప్పీల్ కూడా చాలా వుంటుంది. 

        ఈ కథ అనిల్ కపూర్ బర్త్ డేకి జరగడం కథకి బలం. అతను బర్త్ డే  జరుపుకొనివ్వకుండా, వేడుకల్లో పాల్గోనివ్వకుండా, కూతుర్ని కిడ్నాప్ చేసి మంచి ఫిట్టింగే పెట్టాడు అనురాగ్. ఇది కథకి డెప్త్ తీసుకొచ్చింది. ఆ కూతురి కోసం ఉరుకు పరుగుల్లోనే అన్న బోనీ  కపూర్ కుటుంబాన్ని కలుస్తాడు అనిల్. అక్కడ కొడుకు అప్ కమింగ్ హీరో హర్షవర్ధన్ కపూర్ వుంటాడు. కానీ బోనీ కపూర్ కొడుకు యువహీరో అర్జున్ కపూర్ కనిపించడు. అతనుంటే కథకి తేడా వస్తుందనేమో. అతను బాబాయ్ అనిల్ కీ, అనురాగ్ కీ ఏదో తేడా వుందని పసిగట్టెసే రకం కావొచ్చు. కిడ్నాప్ విషయం పోలీసులు సహా అనిల్ ఎవరికీ చెప్పవద్దని అనురాగ్ కండిషన్. అనిల్ కూతురు యువ స్టార్ సోనమ్ కపూర్ చిట్ట చివర కిడ్నాప్ నుంచి విడుదలైనప్పుడు కన్పిస్తుంది. 


        ఇదంతా గెరిల్లా షూటింగ్ చేశారు. 21 రోజుల్లో షూటింగ్ ముగించామని చెప్పారు. రాత్రి పూట ముంబాయి కొత్త ప్రాంతాల్ని ఈ సినిమాలో మొదటిసారి చూస్తాం. దర్శకుడు మోత్వానే మాక్యుమెంటరీతో అపూర్వ కమర్షియల్ ప్రయోగమే  చేశాడు.    

సికిందర్