రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

8, మే 2019, బుధవారం

820 : బాలీవుడ్ సీన్

    బాలీవుడ్ సినిమా బజార్ లో ప్రేక్షకులు ఎటు చూసినా చరిత్రలే చరిత్రలు! చరిత్రలు, జీవిత చరిత్రలు! బాలీవుడ్ బజార్ చరిత్ర పాఠాలకి ఒక లైబ్రరీగా మారిపోయింది. ఎటు చూసినా  హిస్టారికల్స్ తో చరిత్రలు, బయోపిక్స్ తో జీవిత చరిత్రలు! ఈ బజార్ లో జీవిత చరిత్రలతో చరిత్రలు పోటీ పడుతున్నాయి. సినిమాలంటే ఇక ఇవే అన్నట్టు ప్రేక్షకులు చూసి చూసి అలవాటైపోతున్నారు. మసాలా కమర్షియల్స్ ని మర్చిపోయేట్టున్నారు. బయోపిక్స్, హిస్టారికల్స్ ఇవే గాకుండా కల్పిత కథల పీరియడ్ మూవీస్ అంటూ కూడా మధ్యలో సందడి చేస్తున్నాయి. ఇటీవలే ఇలాటి కల్పిత కథతో  పీరియడ్ మూవీగా ‘కళంక్’ విడుదలయ్యింది. 

       
యురీ, కేసరి, మణికర్ణిక, బెటాలియన్ 609, తాష్కెంట్ పేపర్స్ అనే హిస్టారికల్స్ ఇప్పటికే రాగా, ఇక పానిపట్, తఖ్త్, బాట్లాహౌస్, తానాజీ, సర్దార్ ఉద్ధం సింగ్, ఛత్రపతి శివాజీ మహారాజ్, 83 అనే ఎనిమిది హిస్టారికల్స్  ఇంకా రాబోతున్నాయి. 

          ‘పానిపట్’ ని 1761 లో జరిగిన మూడవ పానిపట్టు యుద్ధం ఆధారంగా నిర్మిస్తున్నారు. మరాఠాలకూ, కాబూల్ రాజు అహ్మద్ షాకూ మధ్య జరిగిన హోరాహోరీ యుద్ధాన్ని ఇక మన కళ్ళముందు వెండితెర మీద చక్కగా చూడొచ్చు. ఇందులో సంజయ్ దత్ అహ్మద్ షాగా నటిస్తూంటే, బోనీ కపూర్ కుమారుడు అర్జున్ కపూర్ సదాశివ్ రావ్ బాహుగా నటిస్తున్నాడు. కృతీ సానన్ పార్వతీ బాయిగా నటిస్తోంది. ‘లగాన్’  ఫేమ్ దర్శకుడు ఆశుతోష్ గోవరీకర్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. డిసెంబర్ 6న ఇది విడుదల కాబోతోంది. దీని టీజర్, పోస్టర్ గత సంవత్సరం మార్చిలోనే విడుదలయ్యాయి.

        ఇక ‘తఖ్త్’ (పీఠం) మొఘల్ సామ్రాజ్య చరిత్ర. నిర్మాత కరణ్ జోహార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా దీన్ని నిర్మిస్తున్నాడు. షాజహాన్ చక్రవర్తి పెద్ద కుమారుడు, ఉపనిషత్తుల్ని పర్షియన్ లోకి అనువాదం చేసిన దారా షిఖోకి, అతడి తమ్ముడు ఔరంగ జేబుకీ మధ్య రాజ్యాధికారం కోసం జరిగిన పోరుని ఈ చారిత్రికం చిత్రిస్తుంది. ఇందులో బాలీవుడ్ సూపర్ స్టార్ రణవీర్ సింగ్ దారా షిఖో గా నటిస్తున్నాడు. ఔరంగ జేబుగా విక్కీ కౌశల్ నటిస్తున్నాడు. వీళ్ళిద్దరి అక్క జహానారా బేగంగా కరీనా కపూర్ నటిస్తోంది. దారా షిఖో భార్య నాదిరా బాను బేగంగా అలియాభట్ నటిస్తోంది. ఇక షాజహాన్ పాత్ర అనిల్ కపూర్ పోషిస్తున్నాడు. అనిల్ కపూర్ కుమార్తె జాహ్నవీ కపూర్ ఔరంగజేబు  రెండో భార్య ఔరంగబాదీ మహల్ గా నటిస్తోంది. భూమీ పడ్నేకర్ వచ్చేసి ఔరంగ జేబు మొదటి భార్య నవాబ్ బాయీగా నటిస్తోంది. ఇలా వైభవోపేతంగా  బాలీవుడ్ తరాతోరణమంతా కొలువుదీరారు. ఇంతకీ దర్శకుడెవరు? ఇంకెవరు కరణ్ జోహారే! ఈ  భారీ హిస్టారికల్ ని చూడాలంటే 2020 వరకూ ఆగాలి. 

          ఇక ‘బాట్లాహౌస్’ నిన్న మొన్నటి చరిత్రే. 2008లో ఢిల్ల్లీలో, బాట్లా హౌస్ లో జరిగిన ఇండియన్ ముజాహిదీన్  ఉగ్రవాదుల ఎన్కౌంటర్ కేసు ఆధారంగా నిర్మిస్తున్నారు. ఇందులో డిసిపి సంజీవ్ కుమార్ యాదవ్ గా జాన్ అబ్రహాం  నటిస్తున్నారు. ఇతర పాత్రల్లో ప్రకాష్ రాజ్, రవి కిషన్, నోరా ఫతేహీలు నటిస్తున్నారు. నిఖిల్ అద్వానీ దర్శకుడు. ఆగస్టు 15న విడుదలకి సిద్ధమవుతోంది.

          ‘తానాజీ -  ది అన్ సంగ్ వారియర్’ అజయ్ దేవగణ్ కి ప్రతిష్టాత్మకం. తానాజీ 17వ శతాబ్దపు మరాఠా సామ్రాజ్య సైనికాధికారి. కోహ్లీ సామాజిక వర్గానికి (కోహ్లీలు తెలుగు ముదిరాజులకి సమానం) చెందిన వాడు. పూర్తి పేరు తానాజీ మలుసారే. ఛత్రపతి శివాజీతో కలిసి ఎన్నో యుద్ధాలు చేశాడు. 1670 ఫిబ్రవరి 4 న సింహగఢ్ యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో మొఘల్ సైనికాధికారి ఉదయ్ భాను రాథోడ్ తో తలపడి మట్టి కరిపించాడు తానాజీ. ఈ చారిత్రక ఘట్టాన్ని తెరకెక్కిస్తున్నారు. ఉదయ్ భాను రాథోడ్ గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. దర్శకుడు ఓం రౌత్. ఇతను మారాఠీ దర్శకుడు. జనవరి 2020 లో విడుదలవుతుంది.  

          సూజిత్
సర్కార్ దర్శకత్వంలో ఉద్ధమ్ సింగ్ చరిత్ర ‘సర్దార్ ఉద్ధమ్ సింగ్’ గా వస్తోంది. బ్రిటిష్ పాలనకి వ్యతిరేకంగా గదర్ పార్టీ స్థాపించి పోరాడిన విప్లవకారుడు సర్దార్ ఉద్ధమ్ సింగ్. 1919లో అమృత్సర్ లో పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ మైకేల్ ఓ డయ్యర్ పాల్పడిన జలియావాలా బాగ్ ఊచకోత దురంతానికి ప్రతీకారంగా,1940 లో లండన్ లో ఉద్ధమ్ సింగ్ అతణ్ణి హతమార్చడమే ఈ చారిత్రికం కథ. విక్కీ కౌశల్ ఉద్ధమ్ సింగ్ గా నటిస్తున్నాడు. ఇది కూడా 2020 లోనే విడుదలవుతుంది. అయితే 1999 లోనే ఈ చరిత్ర రాజ్ బబ్బర్ తో వచ్చింది. 

     ఇక ‘ఛత్రపతి శివాజీ మహారాజ్’ గా రీతేష్ దేశ్ ముఖ్ వస్తున్నాడు. రవి జాదవ్ దీని దర్శకుడు. హైదరాబాద్ కి చెందిన ‘భజరంగీ భాయిజాన్’ ఫేమ్ దర్శకుడు కబీర్ ఖాన్ ‘83’ అనే హిస్టారికల్ తీస్తున్నాడు. 1983లో ఇండియా గెలుచుకున్నవరల్డ్ కప్ క్రికెట్ విజయగాథని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో కపిల్ దేవ్ గా రణవీర్ సింగ్ నటిస్తూంటే, సునీల్ గవాస్కర్ గా తాహిర్ రాజ్ భాషిన్ నటిస్తున్నాడు. మోహిందర్ అమర్నాథ్ గా సాఖీబ్ సలీం, కృష్ణమాచారి శ్రీకాంత్ గా జీవా, సయ్యద్ కిర్మానీగా సాహిల్ ఖట్టర్, దిలీప్ వెంగ్ సర్కార్ గా ఆదినాథ్ ఖొఠారే, రోజర్ బిన్నీగా నిశాంత్ దహియా నటిస్తున్నారు. ఏప్రెల్ 2020 లో విడుదలవుతుంది. 

          ఇవీ రాబోతున్న8 హిస్టారికల్స్. కొసమెరుపేమిటంటే ‘మొఘల్ -ది గుల్షన్ కుమార్ స్టోరీ’ అని కన్ఫ్యూజింగ్ టైటిల్ తో ఒకటి వస్తోంది. మొఘలుల కాలంలో ఈ గుల్షన్ కుమార్ ఎవర్రా బాబూ అని జుట్లు పీక్కోవాల్సిందే. అది మొఘలుల కాలం కాదట. గుల్షన్ కుమార్ ఒక మొఘల్ అట. బాలీవుడ్ లో టీ సిరీస్ సంగీత సామ్రాజ్యానికి మొఘల్. అదీ విషయం. చరిత్రలు, జీవిత చరిత్రల సందట్లో దివంగత టీ సిరీస్ బాస్ గుల్షన్ కుమార్ బయోపిక్ కూడా వచ్చేస్తోంది.