రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Wednesday, September 12, 2018

686 :స్పెషల్ ఆర్టికల్



       నేడు హాలీవుడ్ సినిమా రచన ఎలా జరుగుతోందన్నఅంశంపై న్యూయార్క్ మ్యాగజైన్ జరిపిన పరిశోధనలో భాగంగా కొందరు టాప్ హాలీవుడ్ ప్రొడ్యూసర్లని, ఎగ్జిక్యూటివ్ లని ఇంటర్వ్యూ చేసింది. హాలీవుడ్ లో సినిమా కథల ఎంపికకి గేట్ కీపర్లు అనదగ్గ ఏడుగురి నుంచి వివరాలు సేకరించింది. కథల ఎంపికలో గేట్ కీపర్లు వేటికి ప్రాధాన్యమిస్తారు? స్క్రిప్టుల్లో వ్యాకరణానికి, అక్షర దోషాలకి ఎలా రియాక్టవుతారు? స్క్రిప్టు నిడివి పట్ల ఏ నిబంధనలు పాటిస్తారు? స్క్రిప్టుకి నో చెప్పాల్సివస్తే ఎలా చెప్తారు?...మొదలైన వాటికి సమాధానాలు రాబట్టిన స్టేసీ విల్సన్ హంట్ రిపోర్టింగ్ నేటి నుంచి వరుసగా...

గేట్ కీపర్ : మైకేల్  బార్కర్ 
కో- ప్రెసిడెంట్, సోనీ పిక్చర్స్ క్లాసిక్స్
ఆమోదించిన స్క్రిప్టుల్లో కొన్ని : క్రోషింగ్ టైగర్ - హిడెన్ డ్రాగన్, ఆల్ ఎబౌట్ మై మదర్, మిడ్నైట్ ఇన్ పారిస్
         
ప్రస్తుతం నేనిష్టపడే స్క్రిప్టులు : ముందుగా నేనీ ప్రశ్న వేసుకుంటాను – ఈ పాత్రలు, ఈ కథ కాలపరీక్షకి నిలబడతాయా? ఇప్పుడున్న ప్రపంచాన్ని ఇవి ప్రతిబింబిస్తున్నాయా? నన్నాశ్చర్యపర్చే ఫ్రెష్ నెస్ కోసం కూడా చూస్తాను. నేనూ మా ఇంకో కో- ప్రెసిడెంట్ టామ్ బెర్నార్డ్ కలిసి పెడ్రో అల్మొడోవర్ రాసిన ‘టాక్ టు హర్’ అన్న స్క్రిప్టు చదువుతున్నప్పుడు ఒక చోట ఇలా వుంది – స్క్రీన్ డార్క్ అవుతుంది. ఒక నగ్నంగా వున్న పొట్టి మనిషి, చాలా పెద్దావిడ మీదికి ఎక్కి ఆమె వెజినాలోకి ఒక దూకు దూకుతాడు! – పిచ్చెక్కిపోయింది మాకు!
        స్క్రీన్ రైటింగ్ లో తలనొప్పి కల్గించే ట్రెండ్ :
అమెరికన్ స్క్రీన్ ప్లేలు చాంతాడంత వుంటూ తలనొప్పి పుట్టిస్తాయి. మైకేల్ హేనెకా వంటి యూరోపియన్ రచయితల నుంచి వచ్చే స్క్రిప్టులు పొట్టిగా వుంటాయి. ఇక పదిహేను పేజీలూ, ఇరవై పేజీలూ తిరగేసినా విషయం వున్న చోటే వుంటే ఇంకో తలనొప్పి వచ్చేస్తుంది. ఏమిటిది... ఎందుకివన్నీ జరుగుతున్నాయీ అన్పిస్తుంది.
        ఇష్టపడని స్క్రిప్టులు:
హార్రర్ స్క్రిప్టులు. కౌబయ్స్ స్క్రిప్టులంటే పడిచస్తాను.
        చదివిన మొదటి మంచి స్క్రిప్టు : డేవిడ్ మమెట్ స్క్రిప్టులు వైభవంతో కట్టి పడేస్తాయి. వుడీ అలెన్ స్క్రిప్టులు చదవలేదు. ఆయన సినిమాలు మాకున్న నాలెడ్జి కంటే తక్కువ నాలెడ్జి తో వుంటాయి.  
        మూవీ బడ్జెట్ గురించి : ఎప్పుడూ మా మెదళ్ల మీద ఇదే స్వారీ చేస్తూంటుంది. చాలాసార్లు ఈ స్క్రిప్టు మేం తీయలేమని చేతులెత్తేస్తూంటాను. నోరా ఎఫ్రాన్ ఇండీ ఫిలిం చేయాలనుకుంటున్నానని ఒక స్క్రిప్టు పంపింది. ఏ కోశానా అది లో-బడ్జెట్ లో తీసేలా లేదు. ఆమె బిగ్ మూవీస్ తీయడంవల్ల ఇండీ మూవీస్ స్క్రిప్టు ఎలా వుండాలో అర్ధం జేసుకోలేదు.  
       
ముగింపులో ఏమాశిస్తానంటే : చాలా సినిమాలు చూశాను. ముగింపులు ప్రేక్షకుల్ని కదిలించగల్గాలి. పంచ్ పడాలి. లేకపోతే మౌత్ టాక్ కి నష్టం వస్తుంది. మంచి ముగింపు చాలా ముఖ్యం.
***