రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

3, ఫిబ్రవరి 2020, సోమవారం

913 : సందేహాలు - సమాధానాలు


Q : ‘షెర్లాక్ హోమ్స్’  సినిమాల యొక్క స్ట్రక్చర్, జానర్, క్యారెక్టర్ వీటి గురించి తెలియచేయండి.
 
రామ్, సహకార దర్శకుడు
A : ఏ కథకైనా స్ట్రక్చర్ ఒకటే. అది త్రీ యాక్ట్ స్ట్రక్చర్. స్ట్రక్చర్ అన్నప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోవాలి. స్ట్రక్చర్ అంటే లీనియర్ కథకి వుండే బిగినింగ్, మిడిల్, ఎండ్ విభాగాలు లేదా యాక్ట్స్, లేదా అంకాలు. వీటి మధ్య ప్లాట్ పాయింట్ వన్, ప్లాట్ పాయింట్ టూ, మిడ్ పాయింట్ వుంటాయి. దీన్నే స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ అంటారు. అంతే గానీ, ఫ్లాష్ బ్యాక్ లేదా మల్టీపుల్ ఫ్లాష్ బ్యాక్స్ తో కథ ముందుకూ వెనక్కీ కదిలే కథనాలు స్ట్రక్చర్ కాదు. ప్లాట్ పాయింట్ వన్ తో బిగినింగ్ ప్రారంభించి, అదే ప్లాట్ పాయింట్ వన్ తో బిగినింగ్ ముగించే లాటి కథనాలు కూడా స్ట్రక్చర్ కాదు. ఇవి స్ట్రక్చర్ లోపల చేసుకునే క్రియేటివిటీ మాత్రమే. సినిమాలెంత మారినా స్ట్రక్చర్ మారేది కాదు, అది శాశ్వతం. ఒక ఛాసిస్, నాల్గు చాక్రాలు వాహన స్ట్రక్చర్. ఇది మారేది కాదు. దీని మీద బస్సు డిజైన్ చేసుకుంటారో, కారు డిజైన్ చేసుకుంటారో అది క్రియేటివిటీ. కనుక క్రియేటివిటీని స్ట్రక్చర్ అనుకుని కన్ఫ్యూజ్ అవకూడదు. చాలా మంది చేసేపని ఇదే. ఇందుకే మళ్ళీ మళ్ళీ ఈ వివరణ. పదాలకి అర్ధమే తెలీనప్పుడు ఏమర్ధం జేసుకుని స్క్రీన్ ప్లేలు రాస్తారు. ఫ్లాష్ బ్యాక్స్ తో వచ్చిన సినిమాలు చూసి ‘స్ట్రక్చర్’ బావుందనుకుని, ఫ్లాష్ బ్యాక్స్ ఆధారంగా అడ్డదిడ్డంగా స్క్రీన్ ప్లేలు నిర్మించేస్తున్నారు. బండి చక్రాలే వూహలో లేనప్పుడు రధం నిర్మించేసి వూరేగిస్తారా ? లాగే వాళ్ళు దాన్ని లాగడానికి వస్తారా? అందుకని ముందు లీనియర్ గా కథని స్ట్రక్చర్ లో పెట్టుకుని, అప్పుడు ఫ్లాష్ బ్యాక్స్ గా విభజించుకుని అదే స్ట్రక్చర్ లో కూర్చాలి. ఇది క్రియేటివిటీ. స్ట్రక్చర్ కీ క్రియేటివిటీ కి ఇదీ తేడా. స్ట్రక్చర్ లేకుండా ఏ క్రియేటివిటీ లేదు. ఇందుకే స్ట్రక్చర్ గురించి ఈ 
బ్లాగులో ఇంతగా మొత్తుకునేది.
        ఇక విషయాని కొద్దాం. షెర్లాక్ హోమ్స్ కథలు క్రైం జానర్లో క్రైం డిటెక్షన్ సబ్ జానర్ కింది కొస్తాయి. షెర్లాక్ హోమ్స్  డిటెక్టివ్ పాత్ర. తెలుగులో నేర పరిశోధనలు చేసే డిటెక్టివ్ పాత్రలు ఏనాడో అంతరించాయి. యాక్షన్ తో సాగే మధుబాబు ‘షాడో’ అనే పాత్ర రావడంతో డిటెక్టివ్ పాత్రలు పాఠకాదరణ కోల్పోయాయి. నవలల్లో పరిశోధన చేసే డిటెక్టివ్ పాత్రలు ప్రైవేట్ డిటెక్టివ్ పాత్రలు. ఈ ప్రైవేట్ డిటెక్టివ్ పాత్రల్ని పోలీసు అధికారులు హత్యా నేరాన్ని పరిశోధించమని ఆహ్వానించే కథలుగా ఇవి వుంటాయి. నిజీవితంలో ఇలా జరగదు. హత్యానేర దర్యాప్తు లనేవి ప్రభుత్వ పరిధిలో వుండే ప్రక్రియ. మనం వెళ్లి ప్రైవేట్ డిటెక్టివులమని లైసెన్సు చూపించి హత్యా స్థలంలో జొరబడితే నెట్టి పారేస్తారు. ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీలు లేవని కాదు, వున్నాయి.


      ఇవి హత్యలు, సైబర్ నేరాలు వంటి కేసులు కాకుండా నిఘా, అవినీతి, మోసాలు, వ్యక్తిత్వ ధృవీకరణ వంటి నిత్య జీవితవ్యహరాల్లో వ్యక్తులు, సంస్థలు కోరుకునే కేసులు చేపడతాయి. పోలీసు శాఖలో క్రైం బ్రాంచ్ విభాగముంటుంది. ఇందులో పోలీస్ డిటెక్టివ్ లుంటారు. డిటెక్టివ్ ఇన్స్ పెక్టర్, డిటెక్టివ్ సబిన్స్ పెక్టర్...ఇలా. అమెరికన్ సాహిత్యంలో వూహల్లో విహరించే పోలీసు డిటెక్టివ్ పాత్రలకి కాలం చెల్లిపోయాక, పోలీస్ డిటెక్టివ్ లనే వాస్తవిక పాత్రలొచ్చాయి. ప్రస్తుతం వీటిదే హవా. హాలీవుడ్ సినిమాలు కూడా ఇవే వస్తున్నాయి. 
        తెలుగు సినిమాల్లో అరుదుగానే వచ్చిన డిటెక్టివ్ పాత్రలకి ప్రేక్షకాదరణ లేదు. డిటెక్టివ్ పాత్రలతో పరిచయమున్న ఒక తరం పాఠకులకి తప్ప జన సామాన్యానికి ఈ పాత్రలు తెలీవు. వీటి బదులు సీఐడీలంటే బాగా అర్ధమై ఆదరించారు. సీఐడీలు కూడా ప్రభుత్వ పత్తేదార్లు. కనుక ఇప్పుడు తెలుగులో డిటెక్టివులతో ఇంకా సినిమాలు తీయాలనుకుంటే, ఈ డేటానంతా దృష్టిలో పెట్టుకుని, అప్పుడు కూడా వాస్తవికతని, మాస్ అప్పీల్నీ త్యాగం చేయాలనుకుంటే తప్పకుండా రాసి తీసుకోవచ్చు. బెస్ట్ ఆప్షన్ ఏమిటంటే పోలీస్ డిటెక్టివ్ పాత్ర.

      దర్యాప్తుల్లో ఫోరెన్సిక్ సైన్స్ పోలీస్ డిటెక్టివ్ లకే అందుబాటులో వుంటుంది. పోలీస్ డిటెక్టివులుండాల్సిన చాలా సినిమాల్లో లా అండ్ ఆర్డర్ ఎస్సై పాత్రని పెట్టి వృధా చేసుకున్నారు. తెలుగు సినిమాల్లో దేనైకనా ఎస్సై పాత్రే. ఇది హాస్యాస్పదంగా వుంటుంది. ఇంకోటేమిటంటే, పోలీసు శాఖలో ఎవరి కింద / పైన ఎవరుంటారో సోపానక్రమం కూడా తెలియకుండా ఎస్సైని పెట్టి స్క్రిప్టులు రాసి పారేస్తున్నారు. జిల్లా ఎస్పీ ఎక్కడుంటాడు, కమీషనర్ ఎక్కడుంటాడో కూడా తెలీదు. ఆఖరికి పోలీస్ స్టేషన్లో ఎవరెవరుంటారో కూడా తెలీదు. ఒక్క ఎస్సై మాత్రమే తెల్సు. జిల్లాల్లో ఎస్సైల పైన ఇన్స్ పెక్టర్లుంటారనీ, ఒక్కో  ఇన్స్ పెక్టర్ కింద నాల్గైదు పోలీస్ స్టేషన్లుంటాయనీ, సర్కిల్లో ఇన్స్ పెక్టర్ లందరి మీదా డీఎస్పీ వుంటాడనీ, డీఎస్పీలందరి మీదా జిల్లా ఎస్పీ వుంటాడనీ తెలీదు.  
        నగరాల్లో ఇన్స్ పెక్టర్ల పైన ఏసీపీ, ఏసీపీల పైన డీసీపీ లుంటారనీ, డీసీపీల పైన నగర పోలీస్ కమీషనర్ వుంటాడనీ కూడా తెలీదు. ఎస్సై ఒక్కడే తెలిసినట్టు ఏసీపీ ఒక్కడే తెలుసు. ఈయనకి పైనా కింద ఎవరుంటారో తెలీదు. ఇక ఐజీ, డీఐజీలు సరేసరి. ఇంకొక పెద్ద షాకింగ్ న్యూస్ ఏమిటంటే,  డీజీపీ కూడా తెలియని వాళ్ళు మర్డర్ కథలు రాసిపా రేస్తున్నారు. అజ్ఞానం అంతులేని ధైర్యాన్నిస్తుంది.

      ఇదంతా చెప్పడమెందుకంటే, జానర్ మర్యాద కోసం. వ్యవస్థ తెలియకుండా వ్యవస్థాగత కథలు రాసే తెగువ ఒక్క తెలుగు సినిమా కర్తలకే వుంది బహుశా. వ్యవస్థని తెలుసుకున్నాక జానర్ మర్యాదల్లో భాగమైన ఇతర రైటింగ్, మేకింగ్ ఎలిమెంట్స్ కోసం ‘హీట్’, ‘మిస్టిక్ రివర్’, ‘డర్టీ హేరీ’ వంటి హాలీవుడ్ సినిమాలు అనేకం వున్నాయి. ఇతర జానర్స్ లో లేని ఎలిమెంట్స్ వీటిలో ప్రత్యేకంగా ఏమున్నాయో, ఏవి లేవో తేడాలు గమనించి నోట్ చేసుకోవచ్చు. పోలీస్ డిటెక్టివ్ పాత్రలతో సినిమాలు తీయాలనుకుంటే ఈ స్టడీ చేపట్టాలి. పోలీస్ డిటెక్టివ్ జానర్ మర్యాదలని తెలిపే డేటా ఇంటర్నెట్ లో బోలెడు వుంది. జానర్ మర్యాద మాన మర్యాదలు లేని చవకబారు సినిమాల సంఖ్య తగ్గిస్తుంది.

Q : Your analysis of Matthuvadalara’ is 100% true sir. End suspense concept in movies is a bygone era. Makers shouldn't underestimate today's audience, especially urban sector.Thank you for your analysis sir. Cinema needs you, not the makers (sic). If they follow your approach towards cinema, there will be a tremendous success rate. Thank you sir.
పేరు రాయలేదు.
A : థాంక్స్. ఈ శతాబ్దపు తెలుగు సినిమాలంటే అవే ఎండ్ సస్పెన్సులు, మిడిల్ మటాషులు, సెకండాఫ్ సిండ్రోములు, పాసివ్ పాత్రలు, విజాతి జానర్ల సంకరం ఎట్సెట్రా ఎట్సెట్రా. వీటిని సరిదిద్దుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు. లేకపోతే విజాతి జానర్ల సంకరంతో ‘డిస్కో రాజా’ ఎందుకు ఫ్లాపవుతుంది. అసలు మార్కెట్ యాస్పెక్ట్, క్రియేటివ్ యాస్పెక్ట్ లంటే ఏమిటో తెలుసుకోవాలని మనస్కరించనంత కాలం ఇంతే.
(మరికొన్ని రేపు)
సికిందర్