రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Monday, June 12, 2023

1344 : రివ్యూ!


 

రచన -దర్శకత్వం : వై. శివ ప్రసాద్
తారాగణం : : స‌ముద్రని, అన‌సూయా భ‌ర‌ద్వాజ్‌, మాస్ట‌ర్ ధృవ‌న్‌, మీరా జాస్మిన్, రాహుల్ రామ‌కృష్ణ‌, ధనరాజ్, తదితరులు
సంగీతం : చరణ్ అర్జున్, ఛాయాగ్రహణం : వివేక్ కాలెపు
బ్యానర్స్ : జీ స్టూడియోస్‌, కిర‌ణ్‌ కొర్ర‌పాటి క్రియేటివ్ వ‌ర్క్స్
నిర్మాత : కిర‌ణ్‌ కొర్ర‌పాటి
విడుదల : జూన్ 9, 2023
***

         వేసవి స్టార్  సినిమాలు విడుదల కాకపోవడంతో చిన్న సినిమాలతో ప్రేక్షకులు సరిపెట్టుకోవాల్సి వస్తోంది. చిన్న సినిమాల్లో కమర్షియల్ సినిమాలు, రియలిస్టిక్ సినిమాలు అనే రెండు కేటగిరీల్లో ప్రేక్షకులకి లభిస్తున్నాయి. అయితే కమర్షియల్ సినిమాల పట్ల చూపే ఎంతో కొంత ఆదరణ రియలిస్టిక్ సినిమాలు -అందులోనూ కన్నీటి కథలతో వుండే వాస్తవిక సినిమాల పట్ల చూపించడం లేదు. ఇది తెలిసికూడా కన్నీటి కథల్ని వినోదాత్మకంగా చూపించే ఆలోచనకి దూరంగా వుంటున్నారు మేకర్లు. చార్లీ చాప్లిన్ సినిమాలు కన్నీటి కథలే, కానీ నవ్విస్తాయి. అప్పుడే వ్యాపార విలువ. ఇలా కాకుండా విమానం అనే వాస్తవిక సినిమాని విషాదంగానే తీసినప్పుడు బాక్సాఫీసు తలుపులు ఏ మేరకు బార్లా తెరచుకున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం...

కథ

హైదరాబాద్ లో వీరయ్య (సముద్రకని) సులభ్ కాంపెక్స్ నడుపుకుంటూ జీవనం సాగిస్తూంటాడు. అతను వికలాంగుడు. అతడికో స్కూలు కెళ్ళే కొడుకు రాజు (మాస్టర్ దృవన్) వుంటాడు. రాజుకి విమానాల పిచ్చి. విమానం ఎక్కాలంటే పైలట్ కావాలని కలలు గంటూ వుంటాడు. తిండికే ఇబ్బంది పడుతున్న వీరయ్య కొడుకుని భవిష్యత్తులో పైలట్ గా ఎలా పంపుతాడో మధన పడుతున్న సందర్భంలో, కొడుకు బ్లడ్ క్యాన్సర్ బారిన పడతాడు. అదే సమయంలో రోడ్డు విస్తరణలో భాగంగా సులభ్ కాంప్లెక్స్ ని కూల్చేస్తారు. వీరయ్యకి దిక్కుతోచదు. ఒకవైపు కొడుక్కి ప్రాణాంతక బ్లడ్ క్యాన్సర్, మరో వైపు జీవనాధారం సమస్య. అయితే పైలట్ సంగతేమో గానీ, ముందు బ్లడ్ క్యాన్సర్ తో వున్న కొడుక్కి విమానం ఎక్కించి కోరిక తీర్చాలన్న తపనతో వీరయ్య డబ్బుకోసం ప్రయత్నాలు మొదలెడతాడు. ఇప్పుడు ఈ ప్రయత్నాల్లో ఎన్ని కష్టాలకి, ఎన్ని మోసాలకి లోనయ్యాడనేది మిగతా కథ. ఆఖరికి కొడుకుని విమానం ఎక్కించాడా లేదా అన్నది ప్రశ్న.

ఎలావుంది కథ

  ఇలాటిదే ప్రేమ విమానం అని వెబ్ మూవీ గత నెల జీ5 లో విడుదలైంది. ఒకేలాటి కథలతో జీ5 ఈ రెండు సినిమాలు నిర్మించింది. అయితే ‘ప్రేమ విమానం’ కామెడీ కథ. ఇందులో విమానం ఎక్కాలన్న ఇద్దరు పిల్లల కలలు, వీళ్ళిద్దరికి ఇంకో ఇద్దరు ప్రేమికులు కలవడం, వీళ్ళందరికీ ఇంకో ఇద్దరు పెద్దలు కలిసి, మొత్తం అందరూ విమానమెక్కే కోర్కెని తీర్చుకునే కథ.

అయితే ప్రస్తుత విమానం విషాద కథ. అసలే తారాగణ బలం లేని లోబడ్జెట్ మూవీ, పైగా కష్టాలూ కన్నీళ్ళ ఆర్ట్ సినిమా బాపతు వాస్తవిక సినిమా. దీంతో దీని మార్కెట్ యాస్పెక్ట్ ఓటీటీకే తప్ప థియేట్రికల్ రిలీజుకి కాకుండా పోయింది. పేదరికంలో పెద్ద కోరికల్ని హాస్యభరితంగా చూపించి సినిమాని థియేటర్ సినిమాగా మల్చవచ్చు. ఇలా చూపించిన సినిమాల్ని ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు, అవార్డులు కూడా వచ్చాయి.

తమిళంలో ఇద్దరు పేద బస్తీ పిల్లల పిజ్జా తినాలన్న కోరికతో కాకిముట్టై’, గుజరాతీలో సినిమా వేసుకుని చూడాలన్న ప్రయత్నాలతో పేద పిల్లల చెల్లో షో’, మరాఠీలో దేశంలో తొలి సినిమా తీయాలన్న దాదా సాహెబ్ ఫాల్కే కోర్కెతో హరిశ్చంద్రాచీ ఫ్యాక్టరీ’, కన్నడలో చావు కథతో తిధి’...ఇవన్నీ నవ్వించే- వినోదాత్మక వాస్తవిక సినిమాలే. హరిశ్చంద్రాచీ  ఫ్యాక్టరీ లో ఫాల్కే కష్టాలు ఎంత కామెడీగా వుంటాయో చెప్పక్కర్లేదు. ఇవి పైకి నవ్వించినా అంతర్లీనంగా వాస్తవంగా వున్న విషాదాన్ని ఫీలవుతూంటాం. ఈ ద్వంద్వాల పోషణే వీటి బలం కమర్షియల్ గా కూడా.

విమానం ఫ్లాట్ గా విషాదాన్నే చూపిస్తూ పోయింది. ఫస్టాఫ్ లో విమానాల పిచ్చితో కొడుకు సన్నివేశాలు, వాడి స్కూల్ మేట్స్ సన్నివేశాలూ హస్యంగానే వున్నా, తీరా కథలోకి వెళ్ళాక అంతా సీరియెస్సే. ఫస్టాఫ్ లో తండ్రీ కొడుకుల పాత్రల పరిచయం, పరిస్థితి, మరో వేశ్య పాత్ర పరిచయం, చెప్పులు కుట్టే వాడి పరిచయం, ఒక ఆటో డ్రైవర్ పరిచయం... ఇలా సాగుతూ ఇంటర్వెల్లో కథలోకి ప్రవేశిస్తుంది సినిమా. ఇక్కడ కొడుక్కి బ్లడ్ క్యాన్సర్ అనే మలుపు. అయితే ఇక్కడే సెకండాఫ్ లో కథ ఎలా వుండబోతోందో తెలిసి పోతుంది.

దీంతో సెకండాఫ్ లో కొడుకు కోరిక కోసం వీరయ్య పడే కష్టాలు వూహకందేవిధంగానే వుంటాయి. సులభ్ కాంప్లెక్స్ కోల్పోయి వెరే ఉద్యోగంలో చేరిన వీరయ్య దొంగతనం ఆరోపణతో పోలీసుల చేతిలో దెబ్బలు తినడం, తర్వాత జోకర్ వేషం వేసి డబ్బులు సంపాయిస్తే దుండగులు లాక్కోవడం లాంటి సన్నివేశాలు బాధపెట్టినా, సెకండాఫ్ లో వేరే మలుపు తీసుకోక కథలో ఈ కష్టాలే రిపీట్ అవడంతో, వీరయ్య కంటే మనమే ఇబ్బంది పడతాం చూడలేక.

ఈ కష్టాలకి తగ్గట్టు కథా నడక మందగించడం ఇంకో సమస్య. అయితే ముగింపులో ఇచ్చిన వూహకందని ట్విస్టు బావుంది. అయితే ఇది వీరయ్య పాత్రని మాత్రం జస్టిఫై చేయదు. 

నటనలు- సాంకేతికాలు

ఈ మధ్య తెలుగు సినిమాల్లో తరచుగా కన్పిస్తున్న సముద్రకని వికలాంగుడి పాత్రలో కొన్ని చోట్ల ప్రేక్షకుల్ని ఏడ్పిస్తాడు. కొడుకుతో బాండింగ్ కి సంబంధించిన సన్నివేశాలు కొన్ని భావోద్వేగాల లోతుతో కట్టి పడేస్తాయి. ఇవి కొన్ని చోట్ల మాత్రమే వుంటే సరిపోతుంది. అదే పనిగా చూపిస్తే వర్కౌట్ అవదు. కొడుకు పాత్రలో మాస్టర్ దృవన్ ఒక మంచి బాల నటుడు. అతడికి మార్కులు పడతాయి.
       
వేశ్య పాత్రలో అనసూయ ఒక టెర్రిఫిక్ నటి. పచ్చి వేశ్యలు కూడా అలా వుండరేమో
, అలా నటించింది. చెప్పులు కుట్టే వాడి పాత్రలో రాహుల్ రామకృష్ణ. అయితే వీళ్ళిద్దరి మధ్య ట్రాకు మాత్రం అరకొరగానే వుంటుంది. ఆటో డ్రైవర్ గా ధన రాజ్ కి కూడా పూర్తి స్థాయి పాత్ర దక్కలేదు.
       
సినిమాలో మొత్తం అన్ని పాత్రలకీ పాత్ర చిత్రణ లోపం కన్పిస్తుంది. కంటెంట్ పరంగా విషాదంగా
, భారంగా వున్న ఈ సినిమా సంగీతం (చరణ్ అర్జున్0, ఛాయాగ్రహణం (వివేక్ ), ఇంకా ఇతర ప్రొడక్షన్ విలువలు బావున్నాయి.
       
పోతే
, సినిమా పేదరికాన్ని ఒక టెంప్లెట్ గా తరతరాలుగా మార్పులేకుండా అదే విధంగా చూపిస్తున్నారు. దీంతో కాలమొకటి, పాత్రలు వేరొకటిగా అసహజంగా తెరకెక్కుతున్నాయి. కోవిడ్ లాక్ డౌన్ల దెబ్బతో మధ్య తరగతి పేద తరగతికీ, పేద తరగతి కటిక దారిద్ర్యానికీ జారిపోయారు. ఇలాటి ఒకప్పుడు బాగానే బ్రతికి, పతనమైన మధ్య తరగతి జీవిగా వీరయ్యని చూపించి వుంటే, ప్రేక్షకులు ఐడెంటిఫై చేసుకుని -ఓన్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశముండేది.

—సికిందర్

1343 : రివ్యూ!



రచన- దర్శకత్వం : కార్తీక్ జి. క్రిష్
తారాగణం : సిద్ధార్థ్, దివ్యాంశా కౌషిక్, అభిమన్యూ సింగ్, యోగి బాబు, మునీష్ కాంత్ తదితరులు
సంగీతం : నివాస్ కె ప్రసన్న, ఛాయాగ్రహణం : వాంచినాథన్ మురుగేశన్
బ్యానర్ : పాషన్ స్టూడియోస్
నిర్మాతలు : టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్
విడుదల : జూన్ 9, 2023

         శతాబ్దం ఆరంభంలో బాయ్స్’, బొమ్మరిల్లు’, నువ్వొస్తానంటే నేనొద్దంటానా మొదలైన హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన తమిళ హీరో సిద్ధార్థ్, చాలా కాలం కనుమరుగై 2021 లో కార్తికేయతో మహాసముద్రం అనే మరో తెలుగులో నటించి నిరాశతో వెనుదిరిగాడు. తిరిగి ఇప్పుడు 45 ఏళ్ళ వయస్సులో తెలుగు- తమిళ భాషల్లో టక్కర్ అనే యాక్షన్ మూవీతో కొత్త తరం ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అయితే కొత్తతరం తనని రిసీవ్ చేసుకునేందుకు ఎలాటి యూత్ ఫుల్ సినిమాని ప్రెజంట్ చేశాడు? తను ట్రెండ్ లోనే  వున్నాడా, లేక పాత బ్రాండ్ నే రిపీట్ చేశాడా? సినిమా కోసం తను చేసిన ప్రమోషన్లు ఫలించాయా? ఇవి తెలుసుకోవాలంటే విషయంలో కెళ్ళాలి...

కథ

పేద కుటుంబానికి చెందిన గుణశేఖర్ (సిద్ధార్థ్) పేద వాడిగా చావకూడదని, కోటీశ్వరుడవ్వాలన్న లక్ష్యంతో డబ్బు కోసం విఫలయత్నాలు చేస్తాడు. ఒక చైనీస్ బాస్ దగ్గర డ్రైవర్ గా చేరతాడు. రాజ్ (అభిమాన్యూ సింగ్) అనే ఓ కిడ్నాప్ గ్యాంగ్ బాస్ వుంటాడు. ఇతను డబ్బున్న వాళ్ళ అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి డబ్బు గుంజడమో, లేదా విదేశాల్లో అమ్మేయడమో చేస్తూంటాడు. అలాటి ఒక ప్రయత్నంలో ఇతడి అనుచరులు పోలీసుల నుంచి తప్పించుకుంటూ గుణశేఖర్ కారెక్కేస్తారు. పోలీసులకి దొరక్కుండా కాపాడితే 50 లక్షలిస్తామంటారు.
       
తీరా పని పూర్తయ్యాక గుణశేఖర్ని గాయపర్చి పారిపోతారు. పోలీసులతో ఛేజింగులో కారు డ్యామేజీ కావడంతో చైనీస్ బాస్ ఏడేళ్ళు ఫ్రీగా డ్రైవర్ ఉద్యోగం చేయాలని బాండ్ రాయించుకుంటాడు. వీటన్నిటితో విసిగిపోయిన గుణ శేఖర్ ఆత్మ హత్యకి పూనుకుంటాడు. ఇది కూడా విఫలమై, యాభై లక్షలు ఇవ్వకుండా మోసం చేసిన గ్యాంగ్ కనపడితే తంతాడు. వాళ్ళ కారు వేసుకుని పారిపోతాడు. ఆ కారు డిక్కీలో కాత్యా (దివ్యాంశా కౌషిక్) అనే అమ్మాయి బందీగా వుంటుంది. ఎవరీ కాత్యా
? ఈమె కూడా కిడ్నాపైందా? ఇప్పుడు గుణశేఖర్ ఈమెనేం చేయాలి? కిడ్నాప్ గ్యాంగ్ బాస్ రాజ్ బారి నుంచి ఈమెనెలా కాపాడాలి? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

1.5 రేటింగ్ తో అద్భుత కథ. సినిమాలో సిద్ధార్థ్ క్షవరం చేయించుకోబోతే మీసం తెగిపోయి పిల్లి గడ్డంతో మిగిలినట్టు తలాతోకా లేని కథ. ఈ గెటప్ బావుందని పిల్లి గడ్డం తోనే నటించాడు సిద్ధార్థ్. గెటప్ ఎంత ఎబ్బెట్టుగా వుందో కథ అంత ఘోరంగా వుంది. కథలో హాలీవుడ్ బేబీ డ్రైవర్ ఛాయలు కన్పిస్తాయి. కానీ బేబీ డ్రైవర్ లా వుండదు. అసలు కథే లేదు. కథ మొత్తం కలిపి చూస్తే స్థూలంగా పైన చెప్పిన విధంగా కనపడుతుంది. అతుకుల బొంతలా వున్న కథనాన్ని ఎడిట్ చేసి కూర్చితే పై విధంగా కనపడుతుంది ఇంటర్వెల్ వరకూ.
        
ఇక ఇంటర్వెల్ తర్వాత డ్రమెటిక్ క్వశ్చన్ –హీరోయిన్ తో ఏం చేయాలనేది. ఏం చేయాలో కోటీశ్వరుడవ్వాలనుకుంటున్న సిద్ధార్థ్ కి తెలీదు. హీరోయినే ఐడియా ఇచ్చే పరిస్థితి. ఎలాగూ నేను కిడ్నాప్ అయ్యాననని మా నాన్నకి తెలుసు గాబట్టి ఆ డబ్బు నువ్వే డిమాండ్ చేసి తీసుకో- అని. ఇలా హీరో పాసివ్ క్యారక్టర్ అయిపోయాక అతడితో సెకండాఫ్ కథ నస పెట్టే వ్యవహారంగా మారిపోతుంది. ఇక వీళ్ళని పట్టుకోవాలని రాజ్ గ్యాంగ్ వేట.
        
కోటీశ్వరుడవ్వాలన్న కోరిక నెరవేరక ఆత్మహత్య చేసుకోబోయిన తను, హీరోయిన్ తో అవకాశాన్ని తనే చూసి, ఆమెని కేర్ చేయకుండా అగ్రెసివ్ గా మారిపోయి - ఏ 100 కోట్లకో డిమాండ్ పెట్టి కలకలం రేపి వుంటే క్యారక్టర్, కథ పైకి లేచేవి. ఆమెకి అతడితో ప్రేమ, అతడికి ఆమెతో సంపద- ఈ డైనమిక్స్ తో రోమాంటిక్ సస్పెన్స్ ని కూడా క్రియేట్ చేసి- సెకండాఫ్ నడిపివుంటే బ్రతికి బయటపడేది సినిమా. నేటి కాలపు సినిమాలకి మార్కెట్ యాస్పెక్ట్ రోమాంటిక్స్ లేదా ఎకనమిక్స్ అయినప్పుడు- ఈ రెండూ తీరుతోంటే ఇంతకంటే ఏం కావాలి. చివర్లో హీరోని నైతిక ఆవరణలోకి తేవచ్చు- పేదరికంలోంచి బయట పడ్డమంటే అడ్డ మార్గాల్లో సంపాదించడం కాదని.
        
కనీస స్థాయిలో ఒక అర్ధవంతమైన కథ చెప్పలేనప్పుడు సినిమాలు తీసి ప్రేక్షకుల్ని చంపడమెందుకు. 

నటనలు – సాంకేతికాలు

సిద్ధార్థ్ చెప్పుకోదగ్గ నటుడు. ఈ సినిమాలో ఏం చూసి నటిద్దామనుకున్నాడో తెలీదు. మహాసముద్రం తర్వాత మళ్ళీ టక్కర్ తిన్నాడు. పిల్లి గడ్డం అస్సలు పనికి రాలేదు. ప్రారంభంలో చూపిన తల్లి, చెల్లెలు ఏమయ్యారో కూడా పట్టించుకోలేదు. చెల్లెలు అడ్మిషన్ కోసం లక్ష అడిగితే ఇస్తానన్నాడు. అదికూడా ఏమైందో తెలీదు. ఈ బాధ్యతలు ప్రేక్షకులకి అప్పజెప్పినట్టున్నాడు. ప్రేక్షకులు జేబుల్లో బాగా నోట్ల కట్టలు పెట్టుకుని వెళ్ళాలేమో.
       
హీరోయిన్ తో ప్రేమాయణం
, విలన్ తో సంఘర్షణ వంటి నటించడానికి పనికొచ్చే ముక్కలు కూడా మర్చిపోయాడు. డిక్కీలో హీరోయిన్ కనపడడమన్నది పేలవమైన ఇంటర్వెల్ మలుపు. ఈ మలుపులో కూడా అమాయకంగా చూస్తూ వుండిపోయాడు.
       
ఇక
మజిలీ’, మైఖేల్ సినిమాల్లో నటించిన హీరోన్ దివ్యాంశ ఈ సినిమాలో వృధా అయింది. గ్లామర్ కే తప్ప క్యారక్టర్ కి కాకుండా పోయింది. విలన్ అభిమాన్యూ సింగ్ విలన్ కి తక్కువ, కమెడియన్ కి ఎక్కువైపోయాడు. కథని హీరో పట్టించుకోక, విలన్ కూడా పట్టించుకోక వుంటే -మధ్యలో యోగిబాబు ఇష్టమొచ్చినట్టు కామెడీలు చేసుకున్నాడు.
        
ఈ సినిమాకి హీరో యాక్షన్ డైరెక్టర్. చెన్నై రోడ్ల మీద ఛేజింగ్స్ ఈ సినిమాకి హైలైట్. ఓ మూడు ఛేజింగులు వున్నాయి. అయితే ఇవి బాగా సాగదీసిన ఛేజింగులు. రెండుంపావు గంటల సినిమాలో కథలేదని తెలిసి వుండాలి యాక్షన్ డైరెక్టర్ కి- ఛేజింగులతో కవర్ చేశాడు. కెమెరా వర్క్, లొకేషన్స్ బావున్నా, పాటలు సూట్ కాలేదు.
        
మొత్తానికి తెలుగులో సిద్దార్థ్ రెండో పునరాగమన ప్రయత్నం టక్కర్ తిని బోర్లా పడింది. కొత్త దర్శకుడు కార్తీక్ జి క్రిష్ చేతిలో బాగా క్రష్ అయింది.

—సికిందర్