రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

2, డిసెంబర్ 2017, శనివారం

టీనేజి నోయర్ స్క్రీన్ ప్లే సంగతులు -1


       నిర్మాణాత్మకంగా డార్క్ మూవీస్ తీయడమెలా అన్న శీర్షికన ఇంతకి ముందు ఈ జానర్ లో నియో నోయర్ మూవీగా 1984 లో విడుదలైన ‘బ్లడ్ సింపుల్’  గురించి కూలంకషంగా తెలుసుకున్నాం. అది ఆనాటి  అడల్ట్ క్రైం అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఈనాటి టీనేజీ క్రైంతో నియో నోయర్ ఎలా వుంటుందో పరిశీలిద్దాం. నోయర్ సినిమాలు ఇతర రెగ్యులర్ సినిమాలకంటే, ఆర్ట్ సినిమాలకంటే కూడా, వాటికంటూ ఏర్పాటైన కొన్ని ప్రత్యేక నియమాలకి లోబడి ఎంత కళాత్మకంగా వుంటాయో ఇదివరకే చెప్పుకున్నాం. ఇప్పుడు ఇదే కోవలో టీనేజీ నియో నోయర్ ‘బ్రిక్’  ని విశ్లేషించుకోవడం మొదలెడదాం. ఈ వ్యాసపరంపర ఎన్నాళ్ళు కొనసాగుతుందో ఇప్పుడే చెప్పలేం. ‘బ్లడ్ సింపుల్’ కనీసం ఆరునెలలు కొనసాగింది.  2005 నాటి ‘బ్రిక్’ ఒక ఆశ్చర్యకర క్రియేషన్. అందుకే ఇది ఎన్నో అధ్యయనాలకి మూలమైంది ‘బ్లడ్ సింపుల్’ లాగే. దర్శకుడు రియాన్ జాన్సన్ ఒక షార్ట్ ఫిలిం తీశాక, 1997 లో ‘బ్రిక్’  స్క్రిప్టు రాశాడు. అప్పుడతడికి 24 ఏళ్ళే. ఈ వయసులోనే అతను జానర్ ని అధ్యయనం చేసి తొలిసినిమాతో అద్భుతాన్ని సాధించాడు.

          రియాన్ జాన్సన్ స్క్రిప్టు రాశాక ఆరేళ్ళు ప్రయత్నించాడు నిర్మాతల కోసం. స్క్రిప్టుని ముందు నవలగా రాశాడు. చాలా పూర్వం అంటే 1930 లలో బ్లాక్ అండ్ వైట్ లో ఫిలిం నోయర్ పేరుతో  ప్రారంభమైన ఈ జానర్  సినిమాలకి మూలాలు  ఆనాటి డెషెల్ హెమెట్ రాసిన హార్డ్ కోర్ డిటెక్టివ్ నవలల్లో వున్నాయన్న  సంగతి  తెలిసిందే. ‘బ్లడ్ సింపుల్’ కోసం కోయెన్ బ్రదర్స్ కూడా ఈ నవలల్లోనే జానర్ ని పట్టుకున్నారు. రియాన్ జాన్సన్ కూడా హెమెట్ నవలల్ని అధ్యయనం చేశాడు. హెమెట్ కల్పించిన  నోయర్ వాతావరణాన్ని, సంభాషణల్లో భాషనీ  స్క్రీన్ ప్లేలో పట్టుకోవాలంటే, ముందుగా హెమెట్ లాగా ‘బ్రిక్’ ని నవలగా రాసుకోవాలని నవల పూర్తిచేశాడు. ఆ నవలలోకి దింపిన నోయర్ వాతావరణాన్నిఆధారంగా చేసుకుని స్క్రీన్ ప్లే రాశాడు ( ఈ నవలా, స్క్రీన్ ప్లే రియాన్ జాన్సన్ వెబ్ సైట్లో పొందవచ్చు). 

       నిర్మాతలు ముందుకు రాకపోవడానికి, కొత్త కుర్రాడు ఇంత నియో నోయర్ భారాన్ని ఎత్తుకుంటున్నాడే అన్న భయమే కారణం. లాభం లేక మిత్రుల సహాయంతో ఐదులక్షల డాలర్ల అతి తక్కువ బడ్జెట్ తో,  2005 లో పూర్తి చేసి విడుదల చేస్తే, 39 లక్షల డాలర్లు వసూలు చేసింది. ఎనలేని కీర్తి ప్రతిష్టల్ని ఆర్జించి పెట్టింది. ఆధునిక నోయర్ సినిమాలకి ఒక గైడ్ లా మారింది. జాన్సన్ కనబర్చిన అనూహ్య సృజనాత్మక చమత్కారమేమిటంటే, ఇంకా హెమెట్ డిసైడ్ చేసిన జానర్ ని అడల్ట్ క్రైం నోయర్ గానే తీయనవసరం లేదు - హెమెట్ ని నేటి కాలపు ఆధునిక హైస్కూల్ నోయర్ రూపంలోకి,  యువతరపు థ్రిల్లర్ గానూ  అప్ డేట్ చేయ వచ్చనేది. కాబట్టి ‘బ్రిక్’ అప్డేట్ అయిన హెమెట్ అన్నమాట. 

          ‘బ్రిక్’ అంటే ఇటుక అని వేరే చెప్పనవసరం లేదు. ఈ మూవీలో ‘బ్రిక్’ కి అర్ధం ఏమిటంటే,  ఇటుకలాంటి ఘన రూపంలో వున్న హెరాయిన్ డ్రగ్ అన్నమాట. ‘బ్రిక్’ 11సార్లు వివిధ అవార్డుల్ని కూడా గెల్చుకుంది.  ఈ విజయం తర్వాత జాన్సన్ ది బ్రదర్స్ బ్లూ, లూపర్ తీశాడు. తాజాగా తీసిన ‘స్టార్ వార్స్ – ది లాస్ట్ జేడీ’ డిసెంబర్ ఎనిమిదిన విడుదలవుతోంది. ఇంతకీ ‘బ్రిక్’ కథేమిటి?  వచ్చే వ్యాసంలో చూద్దాం.

(సశేషం)

-సికిందర్