రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Thursday, May 24, 2018

650 : స్పెషల్ ఆర్టికల్



        సినిమా కథంటే ఏమిటని ఎవరికైనా సందేహం వస్తే, ఇలా అనేక సమాధానాలు చెప్పుకోవచ్చు- సినిమా కథంటే అప్పుడున్న మార్కెట్టని అస్సలు అన్పించనిదని. సినిమా కథంటే ప్రొఫెషనల్ గా రాయాలని అస్సలు అన్పించనిదని. దాంతో చేసే వ్యాపారం పక్కా ప్రొఫెషనల్ అని అస్సలు అన్పించనిదని. మార్కెట్ యాస్పెక్ట్ తో ఆలోచించి రాయాలని ఏ కోశానా అన్పించనిదని. 90 శాతం సినిమాలు ఫ్లాపవుతున్నా, ఎందుకు ఫ్లాపవుతున్నాయో తెలుసుకుని రాయాలని ముమ్మాటికీ అన్పించనిదని. అసలు 90 శాతం సినిమాలు ఫ్లాపవుతున్నాయన్న సంగతే తెలీకుండా రాసెయ్యాలన్పించేదని. మార్కెట్ లో ఏం జరుగుతోందో తెలియనే తెలియక, తెలుసుకోవాలనే అన్పించక రాసెయ్యా లన్పించేదని . జానర్ల తేడాలే తెలీక, తెలుసుకోవాలనే అన్పించక రాసెయ్యాలన్పించేదని. సినిమాలు ఎవరు చూస్తున్నారో తెలీక, తెలుసుకోవాలనే అన్పించక, రాసెయ్యలన్పించేదని. ఏదీ తెలీక, తెలుసుకోవాలనే అన్పించక, రాసెయ్యలన్పించేదని. సినిమా కథంటే, ఏదీ తెలుసుకోవాల్సిన అవసరమేలేని ఒక పనికిమాలిన వ్యాపకమని. రాశామా, తీశామా, ఇంటికి వెళ్ళామా అన్పించేదని. సినిమా కథంటే సీమ పంది కూడా ఆలోచించి పారేసే తొక్కలో నాసి వ్యవహారమనీ...

       
కాబట్టి ఈ మొత్తంగా చూస్తే తేలే సారాంశం - గురజాడ రాసినట్టు – ‘థ్రోయింగ్ పెరల్సు బిఫోర్ ది స్వైన్’ లాంటి వ్యవహారమన్న మాట స్క్రీన్ ప్లే సంగతులు చెప్పుకోవడమంటే. అయినా ఓపిగ్గా చెప్పుకుంటూనే వున్నాం చాన్నాళ్ళుగా. ఎలా అన్పిస్తే అలా రాసెయ్యడం ప్రకృతి, ఎలా రాయాలో తెలుసుకుని రాస్తే సంస్కృతి. ప్రకృతి పశువుక్కూడా వుంటుంది, సంస్కృతి మనిషికే వుంటుంది. సంస్కృతితో  తయారు చేయని మరచెంబు కూడా మార్కెట్లో అమ్ముడుపోదు. చేతి వృత్తులవారికున్న సంస్కృతిని (ప్రొఫెషనలిజాన్ని) చూసైనా మారాలన్పించకపోతే, ఎవరి పొట్ట ప్రాబ్లమ్సూ ఎప్పటికీ తీరవు.

        సినిమా కథంటే మిడిల్ లేదా సెకెండ్ యాక్ట్ కూడా. అక్కడే వుంటుంది సినిమా కథంతా. సినిమా అంతా సినిమా కథ వుండదు. సినిమా అంతా సినిమా కథ కాదు. సినిమా బిగినింగ్ సినిమా కథ కాదు, సినిమా ఎండ్ సినిమా కథ కాదు. మధ్యలో వుండే మిడిల్ మాత్రమే సినిమా కథ. ఈ కనీసావగాహన లేకపోతే సినిమా కథ రాసే అర్హత లేదు.  అందుకని కొన్ని సినిమాల్లో మిడిల్ ముక్కుతూ మూల్గుతూ నత్త నడక సాగిస్తుంది. చివరికెలాగో హమ్మయ్యా అని ముగింపుకి చేరుకుంటుంది. ఆ ముగింపు మాత్రమే బ్రహ్మాండంగా వుంటుంది. ముగింపు బ్రహ్మాండంగా వుంది కాబట్టి మిగతా  సినిమా అంతా బ్రహ్మండంగానే వుందనే భ్రమకి లోనుజేస్తారు ప్రేక్షకుల్ని. ప్రేక్షకులు కూడా ముగింపుకి ఫిదా అయిపోయి, మిడిల్లో పడ్డ నరకయాతనంతా మర్చిపోతారు సినిమా భేష్ అనేస్తూ. రివ్యూ రైటర్ కూడా సెకండాఫ్ లో (దర్శకుడు) కాస్త తడబడ్డాడు అని పడికట్టు పదాలు అదే పనిగా వాడతాడు. తడబడ్డ మంటే ఏమిటో, ఎందుకు తడబడాలో, ఆ తడబడ్డంలో కూడా కాస్త తడబడ్డాడని కొలతలేమితో, అసలు మొత్తంగా బొక్కబోర్లా పడి ప్రేక్షకులకి ప్రత్యక్ష నరకం చూపిస్తూంటే! 


        ఇంతకీ తడబడుతున్నానని దర్శకుడికి తెలీదా? ఛత్, నేనెందుకు తడబడ్డానూ, రివ్యూ రైటర్ చూశాడా నేను తడబడుతూ నడుస్తూంటే? నేను మంచి స్టామినాతో స్ట్రెయిట్ గా వెళ్ళాను - అని సినిమా జర్నలిజం పదాలతోనే  ఎదురు దాడికి దిగవచ్చు.  కాస్త తడబడ్డాడని ఎంతో క్షమాగుణం చేసుకుని రివ్యూ రైటర్ రాసినా, లేదు స్టామినాతో స్ట్రెయిట్ గా వెళ్లానని దర్శకుడు దబాయించినా, మనకొచ్చే సందేహం ఒక్కటే – అసలు కథలోకే వెళ్ళకుండానే  ఎలా తడబడ్డాడని, ఎలా స్టామినాతో స్ట్రెయిట్ గా వెళ్ళాడని !!


        మొత్తం విషయమంతా సినిమాలో  దర్శకుడు బయట బయటే తప్పించుకు తిరుగుతున్నట్టు కన్పిస్తూంటే,  ఎలా తడబడతాడు? ఎలా స్ట్రెయిట్ గా స్టామినాతో వెళ్తాడు? విషయం మహా గంభీరంగా వుండి, దాన్ని మోయలేక తడబడ్డాడన్నా అర్ధముంటుంది. అసలు విషయమే లేకపోతే మోసేదేముంటుంది, మోయలేక తడబడే దేముంటుంది? స్టామినాతో పనేముంటుంది, దాంతో  స్ట్రెయిట్ గా వెళ్ళే అవస్థేముంటుంది? 


        కాబట్టి సినిమా కథంటే ఏదేమిటో, ఎందుకు చేస్తున్నారో, ఏదెందుకు అనాలో తెలీని ఇంకా బాగా గజిబిజి చేసుకున్న వ్యవహారమని ఇంకో  నిర్వచనం కూడా చెప్పుకోవచ్చు. అసలు ఒకటీ అరా సినిమాలకి పని చేసిన వాళ్ళతో వచ్చే సమస్య కూడా ఒకటుంది.  ఒకటీ అరా సినిమాలకి పనిచేసి అప్పుడే దర్శకత్వ ప్రయత్నాలు మొదలెట్టడంతో వస్తోంది ఈ పరిస్థితి. ఎందుకు ఒకటీ అరా సినిమాలకి పని చేసి దర్శకత్వ ప్రయత్నాలు చేస్తున్నారంటే, పని చేస్తున్న చోట జీతాల్లేక. ఇంకెక్కడైనా ఇదే పరిస్థితి వుంటుందనే, జాగ్రత్తపడి దర్శకులై పోవాలనుకుంటున్నారు. కొంత కాలం క్రితం గాంధీగారు ఒక కార్టూను వేశారు – దర్శకుడితో ఒకతను అంటాడు - రైటర్స్ ని బాగా చూసుకోకుంటే వాళ్ళే దర్శకులైపోయి మనకి పోటీ కొచ్చేస్తారని!


        దీన్ని అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడి) లు నిజం చేస్తున్నారు జీతాల్లేక అలమటించి. జీతాలిస్తూంటే సినిమా తర్వాత సినిమాగా కొన్ని సినిమాలు చేస్తూ, మొత్తం పనినేర్చుకుంటారు ఏడిలు. ఒకటీ అరా సినిమాలకి కూడా జీతాలివ్వకపోతే బయటపడి విధిలేక డైరెక్టర్లై పోవాలనుకుంటున్నారు. వీళ్ళల్లో బడ్జెట్ వేసుకోవడం కూడా ఎంత మందికి వస్తుందో సందేహమే. ఇక బిజినెస్ విషయాలు అసలే తెలీవు. సినిమా కథ మొదటికే తెలీదు. అయినా ఛాన్సులు కొట్టేస్తున్నారు! 


        ఇలా కొత్త కొత్త వర్గాలు వచ్చి చేరుతున్నాయి టాలీవుడ్ కథల్ని కాల్చిపారెయ్యడానికి. ఈ వర్గాల్లో ఇతర శాఖల వాళ్ళూ  చేరుతున్నారు, మేము సైతం దర్శకత్వానికి సై అంటూ. ఎడిటర్ కావచ్చు, కాస్ట్యూమర్ కావచ్చు, ప్రొడక్షన్ మేనేజర్ కూడా...వాళ్ళ శాఖల్లోకి వెళ్ళి పనిచేయాలంటే కార్డు లేకపోతే రానిచ్చే ప్రసక్తే లేదు, కానీ మా శాఖలోకి కార్డు అవసరం లేకుండా మాకే ఎలా పోటీ కొచ్చేస్తున్నారో చూడండీ - అని నిర్మాతల కోసం పాట్లుపడుతున్న ఓ ఇద్దరు దర్శకుల ఆందోళన!


        ఇంకా కథ ఎక్కడ బతుకుతుంది. ఎవరు బతికిస్తారు కథని. అసలు బతికించాలని ఎందుకనిపించాలి. ఎవరి ఆట వాళ్ళాడుకోవాలి. ఒక కెమెరామాన్ హాస్యంగా అన్నాడు – కథ, స్క్రిప్టు, క్రియేటివిటీ, దర్శకత్వం  అంతా షూటింగు ముందు వరకే – షూటింగు మొదలయ్యాక దర్శకుడు దర్శకుడు కాదు, మేనేజరే! అక్కడ ఖర్చు ఎలా తగ్గించాలి, దేనికి ఎవర్ని మాటాడుకోవాలి... లాంటి ఆలోచనలే బుర్రనిండా – దర్శకత్వం లేదు, తొక్కాలేదు అని!  


        కథకి ఇన్ని కందకాలు తవ్వుకుంటే కథ గురించి మాట్లాడుకోవడం హాస్యాస్పదంగానే వుంటుంది. అయినా విధిలేక ఏదో ఒకటి మాట్లాడుకోవాలి కాబట్టి సెకెండ్ యాక్ట్ స్లంప్  ఏమిటో చూద్దాం...


రేపు!

సికిందర్