ఏఐ ద్వారా సృష్టించిన ఏ కళారూపానికీ కాపీరైట్ వుండబోదని నిన్నఅమెరికా సుప్రీం కోర్టు స్పష్టం చేయడంతో సంవత్సరాలుగా వివిధ కోర్టులకి చక్కర్లు కొడుతున్న కేసు కథకి తెరపడింది. ఓ కళా రూపాన్ని సృష్టించే చేతికి మానవీయ గుణాలు ఒక అవసరమైన షరతు అంటూ కాపీరైట్ చట్టాన్నీ, కింది కోర్టుల తీర్పుల్నీ సమర్ధించింది సుప్రీం కోర్టు. మొట్ట మొదట ఈ దరఖాస్తుని యూఎస్ కాపీరైట్ కార్యాలయం తిరస్కరిస్తూ, రచయిత అంటే మనిషి కాబట్టి, మనిషికాని, మనిషితనం లేని యంత్రం రచయిత కాజాలదు కాబట్టి, కాపీరైట్ చట్టం వర్తించదని స్పష్టం చేసింది.
‘ఏ రీసెంట్ ఎంట్రన్స్ టు ప్యారడైజ్’ అన్న టైటిల్ తో ఓ ఏఐ మూవీని సృష్టించుకుని కాపీరైట్ కోసం తిరిగితే కోర్టు ముందు కూర్చున్న బంట్రోతు కూడా అడుగుతాడు- ఏఐ అయ్య పేరేంటి, అమ్మ పేరేంటి, డేటాఫ్ బర్త్ ఏంటి, అడ్రసేంటి, ఆధార కార్డు ఏదీ?- అని. శాస్త్రవేత్త ఏం సమాధానం చెప్తాడు? అయినా కంప్యూటర్ శాస్త్రవేత్త స్టీఫెన్ థాలర్ కాపీరైట్ కోసం కోర్టులు తిరిగాడు. తన డాబస్ అనే ఏఐ వ్యవస్థ ద్వారా సృష్టించుకున్న మూవీ కాపీరైట్ కోసం, ఆ ఏఐనే రచయితగా పేర్కొంటూ సంవత్సరాలుగా ప్రయత్నిస్తూనే వున్నాడు. మొట్టమొదట 2018 లో ఈ దరఖాస్తుని ‘రచయిత అంటే మనిషి కాబట్టి, మనిషికాని, మనిషితనం లేని యంత్రం రచయిత కాజాలదు కాబట్టి’ అంటూ యూఎస్ కాపీరైట్ ఆఫీసు బాగానే కామన్ సెన్స్ గుర్తు చేసింది. ఇప్పుడు సుప్రీం కోర్టు అసలు కేసు వినడానికే తిరస్కరించడంతో థాలర్ కోర్టుల దండ యాత్ర చాలించాడు. చాలించి ప్రమాదంలో పడ్డాడు. ఏమిటా ప్రమాదం?
యంత్ర బుద్ధి (అంటే ఏఐ- ఒక యూట్యూబ్ హిందీ చానెల్లో ఒక పానెలిస్టు ఏఐ ని హిందీలో ‘యంత్ర బుద్ధి’ అంటూంటే ఇది బావుందన్పించింది) - ఇటీవల సినిమాల్లో, ట్రైలర్స్ లో ఇంటర్నెట్ అంతటా వ్యాపించి, కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘిస్తూ ప్రజల్ని రెచ్చ గొడుతోంది. కాబట్టి ఇది వినాలి- సినిమాల్లో, టీవీల్లో ఏఐ నుపయోగించే నిర్మాతలు / దర్శకులు తమకి చిక్కులు తెచ్చిపెట్టే యంత్రబుద్ధితో వంకర పనులు చేయకూడదు. ఒక మానవ పాత్రని లేదా ఇంకేదైనా రాక్షస పాత్రని రూపొందించడానికి యంత్రబుద్ధి నుపయోగిస్తే, దానికి కాపీరైట్ వర్తించక అది పబ్లిక్ డొమైన్ సొంతమై పోతుంది! ఇక ఆ పాత్రని ఎవరైనా, ఎందరైనా తీసుకుని తమ సినిమాల్లో వాడుకుంటే దావా వేయడానికి ఎలాటి చట్టపరమైన హక్కులూ వుండవు! సైంటిస్టు థాలర్ తన యంత్రబుద్ధి మూవీతో ఇదే ప్రమాదంలో పడ్డాడు!
రెండోది, ఇలాటి ఏఐ కంటెంట్ కి ఎలాటి బీమా సౌకర్యం వుండదు. ఇక్కడ ఒకే ఒక్క వెసులుబాటు ఏమిటంటే, యంత్రబుద్ధిని సృష్టికర్తగా కాకుండా సాధనంగా చెప్పుకుని వాడుకోవచ్చు. ఈ వాడుకోవడంలో కూడా యంత్రబుద్ధి పాలెంత, మానవ సృష్టి ఎంత నిర్దారించినప్పుడు మాత్రమే కాపీరైట్ వర్తిస్తుంది. దీన్ని సులభంగా చెప్పాలంటే, చట్టం దృష్టిలో యంత్రబుద్ధిని ప్రస్తుతం కెమెరా లాగా పరిగణిస్స్తారు. కెమెరా ఫోటోని సొంతం చేసుకోలేదు. లెన్స్, ఫ్రేమింగ్, లైటింగ్ లని ఎంచుకున్న వ్యక్తి ఆ ఫోటో సొంతదారు అవుతాడు.
ఈ యంత్ర బుద్ధితో అసలు సమస్యేమిటంటే, ఇది కళా రూపాన్ని సృష్టించడానికి ఇంటర్నెట్ నుంచి భారీ ఎత్తున ఎత్తి పోతలకి పాల్పడుతుంది. పది చోట్ల నుంచి వస్తువులెత్తుకొచ్చి కోరిన వస్తవు ముస్తాబు చేసి ఇచ్చేస్తుంది. కాబట్టి కోర్టు ముందు కూర్చున్న బంట్రోతు ఇంకో ప్రశ్న ఠపీమని అడుగుతాడు- ఎన్ని చోరీ కేసులున్నాయేమిటి దీని మీద? - అని!
కాబట్టి ఈ అమెరికా సుప్రీం కోర్టు తీర్పు మన దగ్గర కూడా నిర్మాతల / దర్శకుల ఆలోచించే విధానాన్ని మారుస్తుందని భావిద్దాం. యంత్ర బుద్ది దానికదే ప్రాంప్ట్ చేసుకుని క్రియేట్ చేయదు కాబట్టి, ప్రాంప్ట్ చేసేవి మానవ హస్తాలే కాబట్టి - యంత్ర బుద్ధికి కాపీరైట్ యంత్ర బుద్దే అడగదు. అది పబ్లిక్ డొమైన్ లో పడేస్తుంది పడ్డ కష్టాన్ని!
-సికిందర్
%20(1).jpg)