Hi, Readers! Back from a long break.
హాలీవుడ్ సినిమా రచనా చరిత్ర మూడు ప్రధాన ఘట్టాలతో పూర్తయిందని చెప్పొచ్చు.
రెండు వేల సంవత్సరాల నాడు అరిస్టాటిల్ రచించిన నాటక శాస్త్రం ‘పొయెటిక్స్’ తో ఒకటి, 1949 లో పురాణాల ఆధారంగా జోసెఫ్ క్యాంప్ బెల్
రాసిన ‘ది హీరో విత్ ఏ థౌజండ్
ఫేసెస్’ తో మరొకటి, 1979 లో సిడ్ ఫీల్డ్ తను చదివిన రెండు వేల స్క్రీన్ ప్లేల ఆధారంగా వెలువరించిన ‘ది ఫౌండేషన్స్ ఆఫ్ స్క్రీన్ రైటింగ్’ తో ఇంకొకటి. ఈ మూడూ తప్ప స్క్రీన్ ప్లే బేసిక్ స్ట్రక్చర్ తో మలుపు తిప్పిన
ఘట్టాలు లేవు. కానీ బేసిక్ స్ట్రక్చర్ మీద అనేక మంది పుస్తకాలు రాశారు, రాస్తూ వున్నారు. వాళ్ళందరూ ఈ మూడు పుస్తకాలలోని బేసిక్ స్ట్రక్చర్ నే అటుతిప్పి ఇటుతిప్పి రాస్తూంటారు. 1930 లలో హాలీవుడ్ రచయితలు అరిస్టాటిల్ నాటక నమూనానే బేసిక్ స్ట్రక్చర్ గా తీసుకుని స్క్రీన్ ప్లేలు
రాయడం ప్రారంభించారు. ఆ బేసిక్ స్ట్రక్చర్ కార్యకారణ సంబంధం (కాజ్ అండ్ ఎఫక్ట్) తో
పాత్రల మధ్య చర్యకి ప్రతిచర్య పంథాలో సరళ రేఖగా వుంటూ వచ్చింది.
ఇంతలో జోసెఫ్ క్యాంప్ బెల్ వచ్చేసి, ప్రపంచ పురాణ కథలన్నీ ఒకే
బేసిక్ స్ట్రక్చర్ తో వున్నాయని ప్రకటిస్తూ, ఆ పురాణ పాత్రలు
లక్ష్యసాధన కోసం అవే 17 మజిలీలతో కూడిన కథా
ప్రయాణాన్ని అలాగే చేపడతాయని తేల్చాడు. వృత్తాకారంలో వుండే ఈ బేసిక్ స్ట్రక్చర్ ని
మోనో మిత్ అన్నాడు. అప్పుడు ఇదేదో బావుందని, 1977 లో
జార్జి లూకాస్ వచ్చేసి ఈ మోనోమిత్ ఆధారంగా
‘స్టార్ వార్స్’ తీసి పెద్ద చరిత్రే సృష్టించాడు. దీంతో మోనోమిత్ వైపు
పరిగెత్తారు నిర్మాతలు, దర్శకులు. ఈ 17 మజిలీల హీరో కథా ప్రయాణంలో
భావోద్వేగాలు (ఎమోషన్లు) పుష్కలంగా పండుతున్నాయని సినిమాలు తీశారు. ప్రతీ
మజిలీ ఒక భావోద్వేగపు విడిది అనుకోవాలి. ఆ
విడిదిలో పాత్ర ఆగి, అంత వరకూ తన కథా ప్రయాణంలో అనుభవించిన భావోద్వేగాల్ని ప్రేక్షకులకి పంచి పెట్టి, ఇంకో కొత్త మజిలీకి ముందుకి సాగుతూ వుండాలన్న మాట. అయితే ఈ 17 మజిలీల్లో పండే
భావోద్వేగాల మాట దేవుడెరుగు, అసలు ఇన్నేసి మజిలీల కారణంగా కథల వేగం తగ్గిపోయి, సినిమాలు తలనొప్పిగా మారుతున్నాయని కూడా వెంటనే గ్రహించారు.
ఈ నేపథ్యంలో
సిడ్ ఫీల్డ్ రంగ ప్రవేశం చేశాడు. చేసి, ఆ 17
మజిలీలకీ భారీగా
కత్తెర వేస్తూ 5 కి కుదించి, ఈ కాలపు కమర్షియల్ సినిమాలకి బేసిక్ స్ట్రక్చర్ ఇదే
పొమ్మన్నాడు. దీనికి పారడైం అని పేరు పెట్టేశాడు.
సినిమా కంపెనీలో
తను చదువుతూ వుండిన రెండు వేల స్క్రీన్ ప్లేల్లో ఎక్కువ మంది కొత్తా పాతా రచయితలు
తెలిసో తెలీకో ఒకే స్ట్రక్చర్ లో
రాసుకుంటూ పోయారు. ఎందుకంటే సబ్ కాన్షస్ పరంగా మనుషులందరూ ఒకటే కాబట్టి. ఒకే
యూనివర్సల్ ఎనర్జీకి కనెక్ట్ అయి వున్నారు కాబట్టి. ఆ సబ్ కాన్షస్ మైండ్ లో
అనాదిగా మనుషులు కథలు చెప్పుకునే, రిసీవ్ చేసుకునే విధానం ఒకేలా వైరింగ్ ఐపోయి
వుంది కాబట్టి. ఈ వైరింగ్ తో తేడా కొట్టిన కథలతో సినిమాలు ఆడడం లేదు కాబట్టి.
స్ట్రక్చర్ అంటేనే ద్వేషించే తెలుగు మేకర్లు తమ వైరింగ్ ని తాము తెలుసుకోక సరదాగా
90 శాతం ఫ్లాపులు తీస్తూనే వుంటారు
కాబట్టి. అదొక ఆనందం కాబట్టి.
ఇలా ఆ ఎక్కువ మంది రాసిన స్క్రిప్టుల్లో ఐదే మజిలీలుండే సరికి సిడ్ ఫీల్డ్ దీన్నే బేసిక్ స్ట్రక్చర్ గా తీసుకుని - పారడైం గా ప్రతిపాదిస్తూ పుస్తకం రాశాడు. ఈ పారడైం లో రెండు ప్లాట్ పాయింట్లు, రెండు పించ్ పాయింట్లు, ఒక మిడ్ పాయింట్ వుంటాయి, ఇంతే. సినిమా రచనని ఇంత సింపుల్ చేసేసి, 5 మజిలీలతో కథల వేగాన్ని అమాంతం పెంచేశాడు. జోసెఫ్ క్యాంప్ బెల్ మోనో మిత్ వచ్చేసి, వృత్తాకారంలో అంతర్ముఖంగా మనిషి జీవితానికి దర్పణం పడితే, సిడ్ ఫీల్డ్ పారడైం వచ్చేసి అరిస్టాటిల్ కి లాగే, కాజ్ అండ్ ఎఫెక్ట్ తో సరళ రేఖపై వుంటూ, బహిర్ముఖంగా లోకానికి అద్దం పడుతుంది. దీంతో నాటి నుంచీ నేటి వరకూ హాలీవుడ్ బిగ్ బడ్జెట్ బ్లాక్ బస్టర్లు సైతం ఈ 5 మజిలీల బేసిక్ స్ట్రక్చర్ తోనే వస్తున్నాయి. 500 యూనివర్సిటీల్లో దీన్నే బోధిస్తున్నారు.
2026 కి వద్దాం. 2000-2005 ప్రాంతాల హైదరాబాద్ లో వీబీ నాగ్ (విబి చౌదరి) సిడ్ ఫీల్డ్ పారడైం ని బోధిస్తూ వుండేవారు. దర్శకుడు దశరథ్, సినిమా రివ్యూ రైటర్ జోస్యుల సూర్య ప్రకాష్, కో - డైరెక్టర్ (ఇప్పుడు డైరెక్టర్) జేడీ స్వామి తదితరులు వీరి శిష్యులుగా వుండేవారు. ఈయన స్క్రీన్ ప్లేలు కూడా రాస్తూండే వారు.’మిణుగురులు’ అనే సినిమాకి నంది అవార్డు వచ్చింది. తర్వాత ‘కీచక’ కి దర్శకత్వం వహించారు. ఆ తర్వాత అజ్ఞాతంలో కెళ్ళి పోయారు. ఇప్పుడు ఇన్నేళ్ళ తర్వాత అజ్ఞాతం వీడి సర్ప్రైజ్ గిఫ్ట్ తో వచ్చారు. ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ ‘ది స్క్రీన్ ప్లే సూత్ర’ అనే స్క్రీన్ రైటింగ్ బుక్.
ఇంగ్లీషులో
అంతర్జాతీయ మార్కెట్లోకి ప్రవేశిస్తూ
ఏమిటీ ఈ బుక్ పరిచయం చేస్తున్న శాస్త్రం?
ఇందులో ఏముంది? ఇది మేకర్స్ కి ఏ
విధంగా ఉపయోగం? రచయిత మాటల్లోనే - చాలా స్క్రీన్ రైటింగ్ పుస్తకాలు స్ట్రక్చర్ ని నేర్పిస్తాయి. కానీ ఇంత చక్కటి స్ట్రక్చర్ వున్న
స్క్రిప్ట్‌లు కూడా ఎందుకు నిస్సారంగా అనిపిస్తాయి? ఈ పుస్తకం స్ట్రక్చర్ ని, భావోద్వేగాల్నీ
ఏకం చేసే ఒక ఆచరణాత్మక 13-దశల వ్యవస్థని పరిచయం చేస్తుంది. ఇది పాశ్చాత్య కార్యకారణ
సిద్ధాంతాన్ని, భారతీయ భావోద్వేగ
పరివర్తననూ కలుపుతూ, కథ కేవలం సరళ రేఖగా ముందుకు సాగడమే కాకుండా, మరింత డెప్త్ కలిగి వుండేలా చేస్తుంది...ఇదీ కాన్సెప్ట్.
పూర్వం సిడ్
ఫీల్డ్ రంగ్ దే బసంతి, మై నేమ్ ఈజ్ ఖాన్ బాలీవుడ్ సినిమాలకి స్క్రిప్ట్
కన్సల్టెంట్ గా వున్నప్పుడు అతడికి ఇండియన్ మసాలా గురించి చెప్పారు దర్శకులు. ఇక్కడి
సినిమాలు నవరసాలతో షడ్రసోపేత విందులా వుండాలని చెప్పారు. దీనికి అంగీకరించాడతను. తను ప్రపంచంలో ఎక్కడ వున్నా, బ్రెజిల్, కైరో, మాడ్రిడ్, మనీలా, మెక్సికో సిటీ, బొంబాయి, సింగపూర్, లేదా వియన్నాలో అయినా, ఏ భాష మాట్లాడినా సంబంధం లేకుండా, రచయితలు తాము భాగమైన సంస్కృతికి కట్టుబడి వుండాలని తన బాధ్యతగా చెబుతూంటాననీ, ప్రపంచవ్యాప్తంగా చాలా మంది రచయితలు తమ సొంత
సాంస్కృతిక వారసత్వంపై, సమస్యలపై దృష్టి పెట్టకుండా, హాలీవుడ్ సినిమాలాగా స్క్రిప్టు
రాయాలని కోరుకుంటారనీ, ఇది తప్పనీ అన్నాడతను.
ఈ సాంస్కృతిక
వారసత్వాన్నే, నవరసాల స్ట్రక్చర్ నే చెబుతోందీ పుస్తకం. అంటే పాశ్చాత్య స్ట్రక్చర్ కి, భరతముని నాట్య శాస్త్రాన్ని
ఫ్యూజన్ చేసి, ఎమోషనల్ డెప్త్ ని పరిచయం చేస్తోంది. అంటే సరళ రేఖగా కాజ్ అండ్
ఎఫెక్ట్ పంథాలో సాగే స్ట్రక్చర్ ని,
స్ప్రింగులా భావోద్వేగాలు చుట్టుకుని సహ ప్రయాణం చేస్తాయన్న మాట. ఈ భావోద్వేగాల
చేరికతో స్ట్రక్చర్ నిస్సారంగా అన్పించదు.
పటం చూడండి.
దీనికి ఇన్
సెప్షన్ మూవీ స్ట్రక్చర్ కి నాట్యశాస్త్రాన్ని జోడిస్తే ఎలాటి డెప్త్ వస్తుందో
వివరించారు. ఈ థియరీని వివరించేందుకు ఇంకా మ్యాట్రిక్స్, ట్రిపులార్, బాహుబలి
మొదలైన సినిమాలని తీసుకున్నారు.
సిడ్ ఫీల్డ్
పారడైంలో వరుసగా ప్లాట్ పాయింట్ 1, పించ్ పాయింట్ 1, మిడ్ పాయింట్, పించ్ పాయింట్
2, ప్లాట్ పాయింట్ 2 అనే 5 మజిలీలకి ఆరంభ, గ్రంథి, విస్ఫోట, శూన్య, నిర్వహణ అని
సంస్కృత పేర్లిచ్చారు.
ఇంటర్వెల్
ఘట్టం విస్ఫోటని సమర్ధవంతంగా ఎలా
సృష్టించవచ్చో వివరించారు. పై 5 మజిలీల్లో ఒక్కో మజిలీతో వుండే సంబంధిత భావోద్వేగాల్ని సర్దుబాటు
చేశారు. ఇవి మొత్తం 13. అయితే సిడ్ ఫీల్డ్ పారడైంలో భావోద్వేగాలుండవని కాదు,
ప్లాట్ పాయింట్ 1 లో కాన్ఫ్లిక్ట్ పుట్టిన చోటే పాత్రకి బలమైన భావోద్వేగం
పుడుతుంది. అది చివరంటా కొనసాగుతుంది. దీన్నే పాత్ర ఉత్థాన పతనాల చాపం (క్యారక్టర్
ఆర్క్) అన్నారు. ఈ చాపాన్ని 13 గా విభజించారు పుస్తకంలో. ఇది మళ్ళీ
మోనోమిత్ తో వుండే పరిస్థితిని సృష్టించకుండా చూసుకోవాలి. కథనంలో స్పీడు
ప్రాముఖ్యాన్ని మరువకూడదు.
కథ ఎలా
ప్రారంభించారో చెప్పారు. కథ చేస్తున్నప్పుడు వచ్చే సమస్యల్ని ఎలా పరిష్కరించాలో
టూల్ కిట్ నిచ్చారు. తెలుగులోనే తీసుకుంటే దాదాపు అన్ని సినిమాలూ ఎమోషనల్ గా
విఫలమవుతూ కనిపిస్తాయి. అసలే వివిధ ఇతర వినోద మాధ్యమాల సంఖ్య పెరిగిపోతూ సినిమా
అనే మాతృ మాధ్యమం ఉనికే ప్రమాదంలో పడుతున్న ఈ రోజుల్లో, ఎమోషనల్ డెప్త్ ని ఆ సినిమాల్లో భాగంగా చేసుకోవాల్సిన తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. వైరల్ వీడియోలు కూడా ఎమోషనల్ టచ్ తోనే వైరల్
అవుతున్నాయి. ఈ పుస్తకాన్ని సినిమా గుండె చప్పుడుని చెక్చేసే స్టెతస్కోపుగా తీసుకుని వాడుకుంటే సినిమాలకి
తప్పక కొత్త జవసత్వాలు చేకూరుతాయి.
ప్రస్తుతం అమెజాన్ లో ఇంగ్లీషు వెర్షన్ కిండిల్ ఎడిషన్ అందుబాటులో వుంది. తెలుగు ప్రింట్ ఎడిషన్ మే లో విడుదలవుతుంది.
-సికిందర్

