రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Thursday, July 23, 2026

1431 : డైలాగ్ రైటింగ్ టిప్స్!


    వి అప్పుడప్పుడూ రాసుకుంటూ  పోయిన  డైలాగ్ రైటింగ్  టిప్స్. డేటా బ్యాంక్ లో వుంటే తీసి మూడవ భాగం అందిస్తున్నాం. పని కొస్తాయనుకంటే ప్రయత్నించవచ్చు.

1. ప్రతి పాత్రకూ  ఒక ‘వాయిస్’ ఇవ్వాలి
అదే విషయాన్ని మూడు  పాత్రలు ఎలా చెబుతాయంటే:
పోలీస్ : ‘చట్టం ముందు అందరూ సమానమే
గ్యాంగ్‌స్టర్ : చట్టం డబ్బున్న వాళ్ళ జేబులో వుంటుంది’
మదర్ : ‘తప్పు చేసినవాడు ఎప్పుడో ఒకరోజు ఫలితం చూస్తాడు’
ఒకే ఆలోచన, మూడు వేర్వేరు ‘వాయిస్’ లతో గమనించ వచ్చు.
2. డైలాగ్‌లో మలుపు వుండాలి
ప్రేక్షకులు వూహించిన దాని కంటే వేరేలా ముగియాలి :
ఉదాహరణ:
‘నిన్ను చంపడానికి వచ్చాను’
‘మరెందుకు నిలబడి పోయావ్?
‘ఇప్పటికే నువ్వు చచ్చావని’
4. భావోద్వేగం పెరుగుతూ వుండాలి
ప్రతి లైన్ ముందు లైన్ కంటే బలంగా వుండాలి :
ఉదాహరణ :
‘వెళ్ళు’
‘వెళ్తానని అనుకోకు’
‘నేణు పంపిస్తున్నాను’
5. డైలాగ్‌కి ముందు, తర్వాత జరిగే చర్యలు కూడా ముఖ్యం
కొన్నిసార్లు ఒక చూపు, ఒక నవ్వు, ఒక గ్లాస్ పెట్టే శబ్దం మాటలకంటే ఎక్కువ చెబుతాయి
ఉదాహరణ:
(అతను టీ కప్పు టేబుల్‌పై నెమ్మదిగా వుంచుతాడు)
‘ఇక నిన్ను నమ్మను’
6. ప్రతి డైలాగ్‌తో ఒక  పరిణామం వుండాలి
పాత్ర ఒక మాట చెప్పిన తర్వాత ఏదో మారాలి:
సంబంధం మారాలి. నిర్ణయం మారాలి.ప్రమాదం పెరగాలి.
నిజం బయటపడాలి.
ఏమీ మారకపోతే, ఆ డైలాగ్ అవసరం లేకపోవచ్చు.
7. మంచి విలన్ డైలాగులు
విలన్ తనని తాను చెడ్డవాడిగా భావించడు.
బలహీనం :
‘నేను చెడ్డవాడిని’
బలీయం :
‘ప్రపంచం నన్ను రాక్షసుడని అంటుంది... ఎందుకంటే వాళ్ళకి నిజం నచ్చదు’
8. హీరో డైలాగులు
హీరో తన గొప్పతనాన్ని చెప్పుకోడు; పరిస్థితి అతడి గొప్పతనాన్ని బయటపెడుతుంది :
ఉదాహరణ :
‘నన్ను గెలవడం నీ వల్ల కావచ్చు...’
‘కానీ నన్ను వంచడం మాత్రం కాదు’
9. హాస్య డైలాగులు
హాస్యం జోక్ చెప్పడం వల్ల కాదు, పాత్ర స్వభావం వల్ల వస్తుంది:
ఉదాహరణ:
‘భయపడుతున్నావా?
‘లేదు... నా కాళ్ళు లగెత్తాలని  చూస్తున్నాయి’
10. నిశ్శబ్దానికి విలువ ఇవ్వాలి
ప్రతి ప్రశ్నకూ వెంటనే సమాధానం అవసరం లేదు.
‘నిజంగా నన్ను ప్రేమించావా?
(నిశ్శబ్దం)
‘అర్థమైంది’
ఈ నిశ్శబ్దమే డైలాగ్‌లో భాగం.
11. ప్రేక్షకులు గుర్తుంచుకునే డైలాగులు ఎలా పుడతాయి?
చాలా ప్రసిద్ధ డైలాగులు ఈ నాలుగు లక్షణాల్లో కనీసం రెండింటిని కలిగి వుంటాయి:
నిజం - జీవితానికి దగ్గరగా వుండాలి.
ఆశ్చర్యం వూహించని కోణం వుండాలి.
భావోద్వేగం మనసుని తాకాలి.
సరళత్వం  ఒక్కసారి వింటే గుర్తుండాలి.
ఉదాహరణలు:
‘గెలవడం కష్టం కాదు... గెలిచాక మనిషిగా వుండడమే కష్టం’
శత్రువుని  ఓడించడం విజయం... కోపాన్ని ఓడించడం గొప్ప విజయం

నువ్వు నన్ను మోసం చేయలేవు... మోసంతో నీకు మూన్నాళ్ళ ముచ్చటే’

12. ఒక ప్రొఫెషనల్ అభ్యాసం
ఒక సీన్ రాసేటప్పుడు ముందుగా డైలాగులు లేకుండా ఆ సీన్‌ని వూహించాలి. పాత్రలు ఏం చేస్తున్నాయి?  ఎలా చూస్తున్నాయి? ఎప్పుడు మౌనంగా వున్నాయి? ఆ తర్వాత అవసరమైన మాటలు మాత్రమే రాయాలి.  ఈ పద్ధతి వల్ల డైలాగులు సహజంగా, ప్రభావవంతంగా మారుతాయి.
13. సినిమా డైలాగ్ రచనలో ఒక మంచి రూలు
ప్రేక్షకులు విన్న మాటల్ని కాదు, ఆ మాటల వల్ల కలిగిన ఫీలింగ్ ని గుర్తుంచుకుంటారు.

(మరికొన్ని మరోసారి)

-సికిందర్