రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Sunday, June 14, 2026

1419 : స్క్రీన్ ప్లే సంగతులు


 

రచన-దర్శకత్వం : బుచ్చిబాబు సానా
తారాగణం : రాం చరణ్, జాహ్నవీ కపూర్, జగపతిబాబు, శివరాజ్ కుమార్, బోమన్ ఇరానీ
రచయితలు : నాగేంద్ర కాశి, వర ప్రసాద్ తోలేటి, కృష్ణ హరి, వెంకట ప్రసాద్ గాంధీ, శ్రీ రామన్
సంగీతం : ఏఆర్ రెహ్మాన్, ఛాయాగ్రహణం : ఆర్ రత్నవేలు, కూర్పు : నవీన్ నూలి
బ్యానర్ : వృద్ధి సినిమాస్
నిర్మాత : కె వెంకట సతీష్
విడుదల : జూన్ 6, 2026
***

      థకీ, గాథకీ తేడాల గురించి చాలా సార్లు చెప్పుకున్నా ఇంకా కథలనుకుని గాథలతో సినిమాలు తీస్తూనే వున్నారు...మళ్ళీ సందర్భం వచ్చింది కాబట్టి సింపుల్ భాషలో ఇంకోసారి తెలుసుకుందాం. కథకీ,  గాథకీ వుండే తేడా ఇదీ : కథ (Story) అనేది  హీరోకీ, విలన్ కీ మధ్య వాళ్ళ వాళ్ళ గోల్స్ కోసం జరిగే సంఘర్షణలో ఎవరు రైట్, ఎవరు రాంగ్ అన్న తప్పొప్పుల ఆర్గ్యుమెంట్ (వాదన) ని తేల్చి చెప్పే జడ్జిమెంట్. అంటే కథంటే వేడి పుట్టించే వాదన  అన్నమాట. ఒక అనిల్ కుమార్ అనే రైటర్ / డైరెక్టర్ వున్నాడనుకుందాం. అతను కథ ఆలోచించుకుంటూ రోడ్డు మీద నడుచుకుంటూ పోతూంటే అనుకోకుండా యాక్సిడెంట్ అయింది. కాలు విరిగి హాస్పిటల్లో చేరాడు. అప్పుడా  వాహనదారుడి మీద కేసు పెట్టాల్సిందేనని పట్టుబట్టాడు. వాడెవరో తెలియడం లేదని అన్నారు పోలీసులు. దీన్ని తల రాతగా సరిపెట్టుకోమన్నారు. నేను కమర్షియల్ సినిమా రైటర్ / డైరెక్టర్ని- నాకు తల రాత గురించీ, విధి ఆట గురించీ చెప్పకండి- వాణ్ణి పట్టుకుని కేసు పెట్టండి అని వాదించాడు. పోలీసులు వాణ్ణి పట్టుకుని కోర్టులో కేసు వేశారు. కోర్టు లో వేడి వేడి ఆర్గ్యుమెంట్ జరిగింది. వాహనదారుడిదే తప్పని తీర్పు వెలువడింది. అనిల్ కుమార్ కేసు గెలిచి నష్టపరిహారం పొందాడు. ఇదీ కథంటే. పత్రాల మధ్య ఇది ఒక వాదులాటని ముందుకు తెచ్చి,  ఆట చూపిస్తూ ఎవరు రైటో ఎవరు రాంగో జడ్జిమెంటు నిస్తోంది. అంటే కథంటే వాదన తో కూడిన వేడి పుట్టించే  గరంగరం మసాలా అని  తెలుస్తోంది.

రి గాథంటే? గాథ (Tale) అంటే, విలన్ లేకుండా హీరో ఒక్కడే తనకి జరిగే కొన్ని అనుభవాల జర్నీని ఒక కొలిక్కి తెచ్చుకుని, ఇదీ నా జీవితమని  చివర్లో ఇచ్చే స్టేట్ మెంట్ (ప్రకటన) లాంటిది మాత్రమే. అంటే గాథంటే వేడి పుట్టించని ప్రకటన అన్నమాట. ఇంకో సునీల్  కుమార్ అనే రైటర్ / డైరెక్టర్ వున్నాడనుకుందాం. అతను కథ ఆలోచించు
కుంటూ రోడ్డుమీద నడుచుకుంటూ పోతూంటే, విధి వక్రించి యాక్సిడెంట్ జరిగింది. కాలు విరిగి హాస్పిటల్లో చేరాడు. కాలు బాగా ఫ్రాక్చరైందని, తిరిగి లేచి నడవాలంటే కొన్ని నెలలు పడుతుందనీ చెప్పారు డాక్టర్లు. అలాగా, నా తల రాత ఇలా రాసి పెట్టి వుంటే ఇంకేం చేస్తాం, సరే ఇలాగే తంటాలు పడతాను, అదే సర్దుకుంటుందని రాజీ పడిపోయాడు. యాక్సిడెంట్ చేసిన వాడితో అమీతుమీ తేల్చుకోవాలన్పించలేదు. అలాగే ఇబ్బందులు పడుతూ కొన్ని నెలల తర్వాత కోలుకుని, తిరిగి ఎప్పటిలా నడవసాగాడు. ఇలా తన అనుభవాల్ని రికార్డు చేసి, దానికి తగ్గ ప్రతనగా ముగించేదే గాథ. ఇలా గాథంటే వేడి పుట్టించని ప్రకటన మాత్రమే అవుతోంది. గరం మసాలా లేదు, వీర రసం లేదు. కమర్షియల్ సినిమా తీయాలనుకుంటే,  వేడి పుట్టించే వాదన కావాలా,  వేడి పుట్టించని ప్రకటన కావాలా  -ఏది అవసరం?

కమర్షియల్ సినిమాకి కచ్చితంగా  వాదులాటతో వేడి పుట్టించే కథే కావాలని ఎవరైనా కోరుకుంటారు. ఎందుకంటే ఇందులో వాదులాటకి హీరోతో బాటు విలన్ వుంటాడు, వాళ్ళ మధ్య వేడి పుడుతుంది. కానీ ఆర్ట్ సినిమాల్లో సాధారణంగా కన్పించేవి గాథలే. విలన్ లేని హీరో అనుభవాల వేడి పుట్టించని ప్రకటనల్లాగా.  ‘పెద్ది’ ఈ కోవకి చెందుతుంది. ఇది గాథ అయినా బాక్సాఫీసులో నిలబడిందంటే ఒకటే కారణం- ప్రత్యర్ధి పాత్రలేని పెద్ది తన ఏకపక్ష ప్రయాణంలో చివరి భాగంలో సానుభూతిని  సంపాదించుకోవడమే.

 

తెలుగులో తీస్తున్నది కథలనుకుని గాథలతో తీసిన  ఇతర చిన్నా పెద్దా సినిమాలూ హీరో మీద ఏ భావోద్వేగాలూ పుట్టించకుండా ఫ్లాపయ్యాయి.  ‘పెద్ది’ కూడా తీస్తున్నది కథే అనుకుని తీస్తే అది ఎందుకో గాథ అయినట్టుంది- అయితే ‘పెద్ది’ గాథకీ, మిగతా సినిమాల గాథలకీ తేడా గుర్తించాలి- ‘పెద్ది’ కి చివర్లో సానుభూతి వర్కౌట్ అయింది. అయితే ప్రత్యర్ధి పాత్ర వుందని గాథల్లో హీరో మీద సానుభూతిని సృష్టిస్తే ఫర్వాలేదా అంటే చెప్పలేం. అన్నిసార్లూ వర్కౌట్ కాకపోవచ్చు. గాథ అని తెలిసి గాథతో స్క్రీన్ ప్లే ఆలోచించడం ఎప్పుడైనా రిస్కే. ప్రత్యర్ధి పాత్ర వుండే కథలతో సేఫ్ బిజినెస్ వుంటుంది.

గాథ అనేది వేడి పుట్టించని ఓ ప్రకటన కాబట్టి - ఈ రకమైన గాథల్ని, ముఖ్యంగా సినిమాల పరంగా, ఒకసారికి మించి చూడాలనిపించదు. మొదటిసారి చూసిన తర్వాత, మళ్ళీ చూసే ఏ ప్రయత్నమైనా చాలా విసుగ్గా మారుతుంది.  కానీ కథ అనేది వేడి పుట్టించే వాదన కాబట్టి-  ఇది సినిమాని మళ్ళీ మళ్ళీ చూసేలా పురికొల్పుతుంది. బాగా తీస్తే కథతో వున్నా సినిమాని  పదే పదే చూడాలని ఎందుకు అనిపిస్తుందంటే,  నిజ జీవితంలో మనకి అనుభవం కాని  అర్థం పరమార్ధం అందిస్తుంది కాబట్టి.

ఈ నేపథ్యంలో ‘పెద్ది’ గాథని స్క్రీన్ ప్లేగా ఎలా సర్దుబాటు చేశారో చూద్దాం...

2. ‘పెద్ది’  గాథలో విషయమిలా వుంది :

2016 ఒలింపిక్స్‌లో మన క్రీడాకారులు ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో, జాతీయ క్రీడా మంత్రిత్వ శాఖకి చెందిన ఉన్నతాధికారి కిరణ్ సింగ్ జైస్వాల్ (బొమన్ ఇరానీ) ని క్రీడా మంత్రి మందలిస్తాడు. ఆ తర్వాత జైస్వాల్ ఆంధ్రప్రదేశ్‌లోని ఒక పట్టణంలో పర్యటిస్తు
న్నప్పుడు, అక్కడి స్థానిక యువత అథ్లెటిక్స్ పట్ల చూపిస్తున్న అసాధారణ అంకిత భావాన్ని గమనిస్తాడు. యువత క్రీడా స్ఫూర్తికి పెద్ది’ (రాం చరణ్) అనే ఆట కూలీ కారణమని తెలుసుకున్న  జైస్వాల్, పెద్ది వెనకున్న అసలు కథని తెలుసుకోవడానికి ముందుకు సాగుతాడు. అలా పెద్ది చరిత్రని వెలికితీసే క్రమంలో, విజయనగరం జిల్లాలోని అడవులు, కొండలు దాటుతూ మారుమూలనున్న పేరులేని కొండ గ్రామానికి చేరుకుంటాడు ఓ గ్రామస్తుడ్ని వెంటబెట్టుకుని. ఈ గ్రామస్థుడు పెద్ది గాథ చెప్పుకు పోతూంటాడు...


ఫ్లాష్ బ్యాక్ లో గాథ 1980ల చివర్లో విజయనగరం పరిసర ప్రాంతాల్లోని ఒక వెనుకబడిన, ప్రభుత్వ గుర్తింపు లేని గిరిజన కుగ్రామానికి మారుతుంది. ఆ గ్రామస్థులు పొరుగున వున్న అగ్రవర్ణ భూస్వాముల నుంచి తీవ్ర సామాజిక వివక్షని, ఆర్థిక దోపిడీనీ ఎదుర్కొంటూ వుంటారు.

ఆ గ్రామానికి చెందిన అప్పలసూరి (జగపతిబాబు) తమ ఊరికి ప్రభుత్వ గుర్తింపు ఇవ్వాలని, దానికి ఒక పేరు పెట్టి, బయటి ప్రపంచంతో అనుసంధానించేలా ఒక రైల్వే స్టేషన్ మంజూరు చేయాలనీ  ముప్పై ఏళ్ళుగా అధికారుల చుట్టూ తిరుగుతూంటాడు. అప్పలసూరి స్నేహితుడు పెద్ది. ఇతను క్రికెట్ లో మంచి టాలెంటున్న రోజువారీ ఆట కూలీ. కేవలం ఆటకి ఇంతని కూలి డబ్బుల కోసం స్థానిక టోర్నమెంట్లలో ఆడుతూ విజయాలు సాధిస్తూ ఉంటాడు.

ఈ క్రమంలో స్థానిక రాజకీయ నాయకుడి కుమార్తె అచ్చియమ్మ (జాహ్నవీ కపూర్) తో ప్రేమలో పడతాడు. ఆమె తండ్రి రాజకీయ ప్రత్యర్థి మేనల్లుడైన రాంబుజ్జి (దివ్యేందు) అచ్చియమ్మని  బహిరంగంగా అవమానించడానికి ప్రయత్నించినప్పుడు పెద్ది అడ్డుకుంటాడు. ఈ ఘర్షణ పగగా మారి, రాంబుజ్జి ఒక స్థానిక టోర్నమెంట్‌లో పెద్దిని కుట్రతో ఓడించి, అవమానిస్తాడు. అయినా సరే, పెద్ది ప్రజల గుండెల్లో నాయకుడిగానే నిలుస్తాడు. అతడి లోని శారీరక సామర్థ్యాన్ని గమనించిన గౌర్నాయుడు (శివరాజ్ కుమార్) అనే సీనియర్ మల్లయోధుడు, అంతరించిపోతున్న సాంప్రదాయ కుస్తీలో పెద్దికి శిక్షణ ఇస్తానని ముందుకొస్తాడు. పెద్ది నిరాకరిస్తాడు.

ఒకరోజు అడవిలో పనికి వెళ్ళిన ఒక గిరిజన బాలుడు ప్రమాదవశాత్తూ మరణించడంతోగ్రామంలో తీవ్ర విషాదం నెలకొంటుంది. తీవ్రంగా కుంగిపోయిన అప్పలసూరి ఇక ఎలాగైనా సమస్యని  పరిష్కరించాలని స్థానిక మంత్రిని  కలిసి వినతిపత్రం ఇస్తాడు. కానీ ఆ మంత్రి అతడ్ని దారుణంగా అవమానించి తరిమేస్తాడు. ఈ అవమానాన్ని తట్టుకోలేకతీవ్ర నిరాశతో అప్పలసూరి వేగంగా వస్తున్న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోబోతే పెద్ది వచ్చి కాపాడతాడు. తర్వాత ఇంకో సంఘటనలో అప్పలసూరి మరణించడంతోమృత దేహాన్ని తీసికెళ్ళడానికి గుర్తింపు కార్డు చూపించమంటాడు మంత్రి. గుర్తింపు లేని వూళ్ళో ఎవరికీ గుర్తింపు కార్డు లుండవు. దీంతో పెద్ది మంత్రి ముఠాతో పోరాడి అప్పలసూరి మృతదేహంతో పారిపోతాడు.

సెకండాఫ్ లో - ఇక తమ గ్రామస్థుల సమస్యలన్నిటికీ తమకు ప్రభుత్వ గుర్తింపు లేకపోవడమే కారణమని గ్రహించిన పెద్ది
, తన గ్రామానికి న్యాయం చేయడం కోసం గౌర్నాయుడు దగ్గర కుస్తీ శిక్షణకి ఒప్పుకుంటాడు. అందులో కఠోర శ్రమతో స్థానిక, రాష్ట్ర స్థాయి పోటీల్లో విజేతగా నిలుస్తాడు.

 

ఇక జాతీయ స్థాయి పోటీలకి  సిద్ధమవుతున్న రెజ్లింగ్ ఈవెంట్ లో, తనమీద అసూయతో రగిలిపోయిన  ప్రత్యర్థి, పెద్ది కాలి నరాలు దెబ్బతినేలా గాయపరుస్తాడు. అయినా ఆ బాధని ఓర్చుకుంటూ పెద్ది సెమీ-ఫైనల్స్‌ గెలిచి స్పృహ కోల్పోతాడు. కళ్ళు తెరిచేసరికి, తను ఇకపై ఎప్పటికీ కుస్తీ ఆడలేడని డాక్టర్లు చెబుతారు. పెద్ది నేరుగా ఢిల్లీ వెళ్ళి  రైల్వే మంత్రిని కలుస్తాడు. కానీ ఆ మంత్రి కూడా అతడి శారీరక స్థితిని ఎగతాళి చేస్తూ విజ్ఞప్తిని తోసిపుచ్చుతాడు.

 

రాజకీయ నాయకుల నిర్లక్ష్యానికి విసిగిపోయిన పెద్ది ఒక సంచలన నిర్ణయం తీసుకుని, దెబ్బతిన్న కాలుని పూర్తిగా తొలగించుకుని, కృత్రిమ కాలుని  అమర్చుకుంటాడు. మళ్ళీ ఇంకో కఠోర శారీరక శిక్షణతో పారా-ట్రాక్ అథ్లెట్‌గా మారుతాడు.

 

చివరికి  జాతీయ ట్రాక్ రేసులో పాల్గొని అద్భుత విజయాన్ని సాధిస్తాడు. విజయోత్సవ ప్రసంగంలో, ప్రభుత్వ గుర్తింపు లేక తన గ్రామం ఎదుర్కొంటున్న కష్టాల్ని దేశానికి ఏకరువు పెడతాడు.

 

దీంతో దేశవ్యాప్తంగా వచ్చిన ప్రజా ఒత్తిడికి తలొగ్గి కేంద్ర ప్రభుత్వం ఆ గ్రామాన్ని అధికారికంగా గుర్తించి, అక్కడ ఒక రైల్వే స్టేషన్‌ని  నిర్మిస్తుంది. దానికి పెద్ది పేరు పెట్టాలని ప్రభుత్వం భావించినా, పెద్ది తన స్నేహితుడి త్యాగానికి గుర్తుగా ఆ గ్రామానికి ‘అప్పలవలస’   అని పేరు పెట్టాలని కోరతాడు.

ఈ ఫ్లాష్ బ్యాక్ అంతా తెలుసుకున్నాక, ప్రభుత్వ అధికారి జైస్వాల్ దేశంలోని ప్రతి మారుమూల గ్రామంలో దాగివున్న స్పోర్ట్స్ టాలెంట్స్ ని వెలికితీసి, ప్రోత్సహించడానికి ఒక భారీ జాతీయ కార్యక్రమాన్ని ప్రారంభించడంతో  గాథ ముగుస్తుంది.

 

3. ఎలావుంది ఈ గాథ?

ఈ రెండు దశాబ్దాల కాలంలో గాథలుగా తీస్తే ఫ్లాపయిన తెలుగు సినిమాలెన్నో వున్నాయి- వాటిలో మచ్చుకి కొన్ని - బ్రహ్మోత్సవం, పైసా, మొగుడు, ఓకే బంగారం, కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ, జక్కన్న, ఉన్నది ఒక్కటే జీవితం, రాజుగారి గది 2, రాజాధి రాజా, కబాలీ, ద్వారక, ఒక్కడు మిగిలాడు, డియర్ కామ్రేడ్, జార్జి రెడ్డి, రాధే శ్యామ్, శాకుంతలం, బ్రో, బచ్చలమల్లికింగ్డమ్ ...ఇలా పొరపాటున తీసిన ఇన్నేసి గాథలు ఫ్లాపవుతున్నా మళ్ళీ పెద్దితీశారంటే, మిగతా వాటిలాగే  తాము తీస్తున్నదీ గాథ అని తెలుసుకోకుండా తీశారని భావించాల్సి వస్తోంది. వందల కోట్లతో సినిమా తీస్తున్నప్పుడు ఈ చిన్న విషయం తెలియకుండా ఎలా వుంటుంది? ఏమో, దీన్ని పక్కనబెట్టి కంటెంట్ గురించి మాట్లాడుకుందాం.

జానర్ పరం గా ఇది స్పోర్ట్స్ సినిమా. అయితే రెగ్యులర్ కమర్షియల్ స్పోర్ట్స్ సినిమాల టెంప్లెట్ లో ఇది లేకపోవడానికి కారణముంది.  స్పోర్ట్స్ జానర్ సినిమాఎవరు తీసినా కథకి ఈ టెంప్లెట్టే వుంటుంది- 1. ఆట నేర్పే ఒక ట్రైనర్, 2. ఒక పీడితుడైన హీరో, 3. హీరోకి ట్రైనింగ్, 4. ట్రైనింగ్ లో సమస్యలు, 5. హీరోకి ఒక ప్రత్యర్థి, 6. ఆటలో ఆ ప్రత్యర్ధితో హీరో ఓటమి, 7. హీరోకి మరింత కఠినమైన ట్రైనింగ్, 8. ఫైనల్ గా ఆటలో ప్రత్యర్ధి మీద హీరో విజయం, 9. విజేతగా హీరోకి మెడల్, ఇంతే!

స్క్రీన్ ప్లే ట్యూటర్ కెన్ మియమోటో ఈ టెంప్లెట్ ని అప్డేట్ చేశాడు. గొప్ప స్పోర్ట్స్ డ్రామాని క్రియేట్ చేయాలంటే దృష్టి పెట్టాల్సింది పాత్ర క్రీడలో ఏం సాధించాలనుకుంటోందో ఆ గోల్ మీద కాదు, ఆ మార్గంలో ఎదురైన ఆటంకాల్ని పాత్ర ఎలా బీట్ చేసిందన్నది, ఆ అవసరం ఎందుకన్నది- వీటి మీద దృష్టి పెట్టాలి. సిల్వెస్టర్ స్టాలోన్ తో రాకీసిరీస్  స్పోర్ట్స్ సినిమాల విజయ రహస్యమిదే అన్నాడు.

‘పెద్ది’ విషయానికొస్తే, దీని గాథ 2024 హిందీ స్పోర్ట్స్ బయోపిక్ ‘చందూ ఛాంపియన్’ ని పోలి వుంటుంది. మన దేశపు మొట్టమొదటి పారాలింపిక్స్ గోల్డ్ మెడలిస్టు, మురళీకాంత్ పెట్కర్ జీవిత కథ ఆధారంగా హీరో కార్తీక్ ఆర్యన్ తో దర్శకుడు కబీర్ ఖాన్ దీన్ని తీశాడు. పారాలింపిక్స్ (లేదా పారాలింపిక్ గేమ్స్) అనేది శారీరక, దృష్టి, మానసిక వైకల్యాలున్న అథ్లెట్ల కోసం ఒలింపిక్స్ లో సమాంతరంగా నిర్వహించే వివిధ క్రీడా పోటీలు. ఈ బయోపిక్ లో ఇందులో వృద్ధుడైన మురళీకాంత్ పెట్కర్, తన విజయాలకి  గాను అర్జున అవార్డు ఇవ్వనందుకు భారత రాష్ట్రపతికి ఫిర్యాదు చేయాలనుకుంటున్నానని  పోలీస్ స్టేషన్‌కొస్తాడు. ఆ అవార్డు తనకి లభిస్తే తన గ్రామం అభివృద్ధికి సహాయపడుతుందని అంటాడు. అతడి అర్హతల గురించి అధికారి ప్రశ్నించినప్పుడు, షెట్కర్ తన ఫ్లాష్ బ్యాక్ చెప్పుకొస్తాడు.

పాయింటేమిటంటే, దేశానికి ఒలింపిక్ గోల్డ్ మెడల్ సంపాదించి పెట్టి, తన గ్రామానికి గుర్తింపు తేవాలన్న లక్ష్యంతో ఇల్లు వదిలి పారిపోయి సైన్యంలో చేరిన షెట్కర్, అక్కడ బాక్సర్‌గా ఎంపికై శిక్షణ పొందుతాడు. తీరా 1964 లో టోక్యోలో బాక్సింగ్‌ పోటీల్లో పాల్గొన్నప్పుడు శ్రద్ధతో బాటు ఏకాగ్రత లేక ఓడిపోతాడు. దీంతో బాక్సింగ్ పట్ల షెట్కర్ కి కమిట్ మెంట్ లేదని ట్రైనింగ్ ఇవ్వను పొమ్మంటాడు ట్రైనర్.

1965 ఇండో-పాక్ యుద్ధంలో వైమానిక దాడిలో ఒక బుల్లెట్ షెట్కర్ వెన్నెముకని  దెబ్బతీయడంతో  పక్షవాతానికి గురవుతాడు. ఇక తాను ఎప్పటికీ ఒలింపిక్ గోల్డ్ గెలవలేననే నిరాశతో ఆత్మహత్యకి  ప్రయత్నిస్తాడు. అప్పుడు ట్రైనర్ అతడ్ని మందలించి  పారాలింపిక్స్‌లో పోటీపడమని ప్రోత్సహిస్తాడు. దీంతో కఠోరంగా శిక్షణ పొంది, 1972  పారాలింపిక్స్‌లో  ఫ్రీస్టైల్ స్విమ్మింగ్ ఈవెంట్‌ లో కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పి, గోల్డ్ మెడల్ గెల్చుకుంటాడు. ఈ వార్త అతని గ్రామానికి చేరగానే సెలబ్రిటీ అయోపోతాడు. గ్రామస్తులు అతడికి ఘన స్వాగతం పలుకుతారు.

గ్రామం అభివృద్ధి, ఒలింపిక్ గోల్డ్ మెడల్, బాక్సింగ్, పక్షవాతం, పారాలింపిక్స్, గోల్డ్ మెడల్ తో సత్కారం వంటి ఈ బయోపిక్ లోని గాథని నడిపిన బేసిక్ థీమ్స్ ‘పెద్ది’ లోనూ వున్నాయి. గ్రామానికి గుర్తింపు, ఒలింపిక్ గోల్డ్ మెడల్, బాక్సింగ్, కాలు దెబ్బతినడం, పారాలింపిక్స్, గోల్డ్ మెడల్ తో సత్కారం మొదలైనవి ఈ బయోపిక్ తో పోలిన ‘పెద్ది’ గాథని నడపడానికి వాడుకున్న థీమ్స్.

ఐతే ‘పెద్ది’ గాథని ముగించిన విధానం కాన్సెప్ట్ కి గండి కొట్టినట్టుంది. పెద్ది గోల్డ్ మెడల్ గెలవడంతో  ప్రభుత్వం ఎట్టకేలకు అతడి  గ్రామాన్ని అధికారికంగా గుర్తించి, డిమాండ్ లో వున్న రైల్వే స్టేషన్‌ ని ప్రారంభిస్తుంది. దీంతో పెద్ది గాథ తెలుసుకుంటున్న అధికారి జైస్వాల్, దేశవ్యాప్తంగా వున్న మారుమూల గ్రామాల్లో క్రీడా ప్రతిభని గుర్తించి, ప్రోత్సహించడానికి ఒక జాతీయ కార్యక్రమాన్ని అమలు చేయాలని సంకల్పించుకుంటాడు. అయితే ఈ కాన్సెప్ట్ ని ఇందుకు ఉద్దేశించలేదు. మారుమూల గ్రామాల్లో క్రీడా ప్రతిభని గుర్తించి ప్రోత్సహించడం గురించి ఈ గాథ కాన్సెప్ట్ కాదు. ఏ గుర్తింపుకూ నోచుకోకుండా మగ్గుతున్న మారుమూల గ్రామాలని జాతీయ పటంపైకి తీసుకువచ్చే ప్రభుత్వ బాధ్యతని గుర్తు చేయడం గురించి ఈ కాన్సెప్ట్. ఇది కాస్తా ముగింపులో వూసులోకి లేకుండా పోయింది!

4. ఈ స్క్రీన్ ప్లే గాథ ఎలా అయిందో చూద్దాం...

కథకి మాత్రమే స్క్రీన్ ప్లే త్రీ యాక్ట్స్  స్ట్రక్చర్ వుంటుంది. గాథకి ఏ స్క్రీన్ ప్లే స్ట్రక్చరూ వుండదు. ఎలా బావుందని అనిపిస్తే అలా తోచినట్టూ రాసుకుంటూ, తీసుకుంటూ  పోవడమే. చేస్తున్నది గాథ అని తెలియక పోతే ఇదే జరుగుతుంది. చేస్తున్నది కథే అనుకుని చేస్తూంటే అది కథ కాకుండా, సరైన గాథ కూడా గాకుండా పోతుంది. ఇదే ఎక్కువ జరుగుతోంది. కథలతో బాటు గాథలూ వుంటాయనీ, ఈ విషయం తెలియకపోతే గాథలు చేసేసే ప్రమాదముందనీ తెలుసుకోవడం లేదు. గాథలతో హాలీవుడ్ సినిమాలూ వస్తూంటాయి. చేస్తున్నది గాథ అని తెలిసి గాథలాగా తీసి సక్సెస్ చేస్తూంటారు. కొన్ని వరల్డ్ మూవీస్ కూడా గాథలుగా వస్తూంటాయి. 2016లో తెలుగులో నాగార్జున- కార్తీ- తమన్నా లతో దర్శకుడు వంశీ పైడిపల్లి  ‘ఊపిరి’ ని గాథగా తీస్తే హిట్టయ్యింది. ఇదెలా జరిగిందో చివర్లో చూద్దాం. ముందుగా ‘పెద్ది’ కి తయారు చేసిన స్క్రీన్ ప్లే గురించి...

పై సెక్షన్ 2 లో చెప్పుకున్న ‘పెద్ది’ గాథ ఫస్టాఫ్ ఇంటర్వెల్ వరకూ చూస్తే, గ్రామానికి గుర్తింపు కోసం పెద్ది రెజ్లర్ గా మారాలని నిర్ణయించుకోవడం ఇంటర్వెల్ లో వస్తుంది. ఈ ఫస్టాఫ్ లో ముందు దిక్కులేని  గ్రామ పరిస్థితి, భూస్వాముల ఆగడాలు, రైల్వే హాల్ట్ కోసం అప్పలసూరి ప్రయత్నాలు, మరోవైపు ఆట కూలీగా పెద్ది క్రికెట్ లో గెలుస్తూ వుండడం, ఇలా బిగినింగ్ సుదీర్ఘంగా సాగుతూ వుంటుంది. ఇంకా టోర్నమెంటులో కుట్ర చేసి ప్రత్యర్ధి రాంబుజ్జి పెద్దిని ఓడించడం, గౌర్నాయుడు వచ్చి కుస్తీలో పెద్దికి శిక్షణ ఇస్తానని ఆఫరివ్వడం, పెద్ది కాదనడం, ఇంకా అప్పల సూరి మరణం, దాంతో గుర్తింపు ప్రశ్న తలెత్తడం, పెద్ది మంత్రి మనుషులకి బుద్ధి  చెప్పి- వూరికి గుర్తింపు కోసం కుస్తీ పోటీలకి వెళ్ళాలని నిర్ణయించుకోవడం వగైరా జరుగుతాయి.

ఇంటర్వెల్ వరకూ గంటంపావు సేపూ సుదీర్ఘంగా సాగుతూ వుంటుంది బిగినింగ్. ఇదే కథ అయితే బిగినింగ్ ఇంటర్వెల్ వరకూ సుదీర్ఘంగా సాగినా, అందులో ఇంత కథ వుండదు. బిగినింగ్ బిజినెస్ లో ఏఏ 4 అంశాలైతే వుండాలో ఆ నాల్గు అంశాలతో బిగినింగ్ ముగిసి ప్లాట్ పాయింట్ వన్ వస్తుంది. హీరోకి విలన్ తో సంఘర్షణ పుడుతుంది. విలన్ మీద గెలవాలన్న గోల్ హీరోకి ఏర్పడుతుంది.

ఇవేవీ లేకపోవడంతో, చివరికి ఒక విలన్ అంటూ ఎవరూ లేకపోవడంతో, ఇంటర్వెల్ లో పెద్ది ఏకోన్ముఖంగా కుస్తీ పోటీలకి వెళ్ళాలని నిర్ణయించుకోవడంతో ఇది కథ కాదు, గాథ అని స్పష్ట మవుతోంది. కథయితే, ఎదురుగా  విలన్ అనే వాడుంటే,  పెద్ది తీసుకునే ఈ నిర్ణయంలో రిస్కు కనపడుతుంది. ఊరికి గుర్తింపు కోసం పోరాటం అనే ఆర్గ్యుమెంట్ పుడుతుంది. ఈ ఆర్గ్యుమెంట్ తో విలన్ తో సంఘర్షణ పుట్టి కథ రక్తి కడుతుంది. ‘పెద్ది’ లో ఇలాటి ఎదుటి శక్తిగా విలన్ కనిపించనప్పుడు,  పెద్ది నిర్ణయంలో రిస్కూ కనిపించడం లేదు. పరిణామాల హెచ్చరికా, చివరికి ఎమోషన్ కూడా కనిపించడం లేదు. ఇలా క్యారక్టరైజేషన్ బలహీన పడింది గాథ కాబట్టి. చూద్దాం, ఒకటి కాకపోతే ఇంకో  ఆట ఆడి చూద్దామని రాజీ పడుతూ ఏకపక్ష ప్రయాణం చేస్తున్నాడు. ఇందుకే ఈ మొత్తం గాథ పథకం ఎక్కడి కక్కడ ముగిసిపోయే చిన్న చిన్న ఎపిసోడ్లుగా సాగింది. పెద్ది ప్రయాణంలో కాన్ఫ్లిక్ట్ అనేది సహజంగానే గాథల్లో లాగా పరిస్థితులతో ఏర్పడుతోంది. అంటే పరిస్థితులతో పోరాటమన్నమాట, విలన్ తో పోరాటం కాదు. కథల్లో విలన్ తో కాన్ఫ్లిక్ట్ ఏర్పడి ఎమోషన్ డ్రైవ్ అవుతుంది.

ఇక సెకండాఫ్ కొస్తే, కుస్తీ శిక్షణ పొందడం, రాష్ట్ర స్థాయి పోటీల్లో గెలవడం, జాతీయ పోటీలకి వెళ్ళడం, అక్కడ ఇంకో ఇంకో ప్రత్యర్ధి పెద్ది కాలుకి హాని చెయ్యడంతో, ఆ ప్రత్యర్ధి మీద పగ తీర్చుకునే బదులు, నా ఖర్మ ఇంతే ననుకుని ఆ కాలు తీసేయిన్చుకుని, కృత్రిమ కాలుతో  పారా-ట్రాక్ అథ్లెట్‌గా మారి గెలుస్తాడు. ఊరికి గుర్తింపూ రైల్వే స్టేషనూ సాధిస్తాడు. ఇలా తను పడ్డ కష్టాలతో స్టేట్ మెంట్ మాత్రంగా గాథ ముగిస్తాడు. ముందుగ చెప్పుకున్నట్టు, చివరి ఎపిసోడ్ లో పాత్ర మీద సానుభూతి ఏర్పడడంతో, దీన్ని క్యాష్ చేసుకుంటూ రాం చరణ్ గట్టెక్కాడు.

5. ఎందుకిలా జరిగింది?

ఎందుకంటే పోలికలున్న ‘చందూ ఛాంపియన్’ లాగే కథనం చేయడం వల్ల. అంటే నిజ జీవిత చరిత్రతో బయోపిక్ గా వున్న ‘చందూ ఛాంపియన్’ కథనాన్ని అలాగే బయోపిక్ గా తీసేయడం వలన ‘పెద్ది’ ది కూడా బయోపిక్ గాథలా అయింది. బయోపిక్ నిజ వ్యక్తులతో వుంటుంది. కల్పిత పాత్రతో బయోపిక్ ఏమిటి? ‘పెద్ది’ తో రెండు జరిగాయి : తీసింది గాథ అయితే, ఆ గాథని బయోపిక్ లా తీయడం!

బయోపిక్ అంటే ఈ భూమ్మీద పుట్టిన నిజ వ్యక్తి జీవిత చరిత్ర. భూమ్మీద పుట్టని కల్పిత పాత్రతో బయోపిక్ వుండదు. ‘చందూ ఛాంపియన్’ లో అతను నిజ క్రీడా కారుడు. కాబట్టి అతడి మీద సినిమా బయోపిక్ అయింది స్పోర్ట్స్ జానర్ లో. అయితే ఈ బయోపిక్ ని గాథలా తీయడంతో బాక్సాఫీసులో నష్టపోయింది.

 

పెద్ది భూమ్మీద ఎప్పుడు పుట్టాడు? క్రీడా కారుడుగా అతడి చరిత్ర ఎక్కడుంది? కాబట్టి పెద్ది అనే కల్పిత పాత్రతో ‘చందూ ఛాంపియన్’ లో నిజ వ్యక్తి బయోపిక్ తో గాథ కిచ్చిన కథనాన్నే దృష్టిలో పెట్టుకుని, అందులోనూ పొరపాటున బయోపిక్ గా తీసేశారు.

ఒక తమాషా జరిగింది...2019 లో  సుధాకర్ కోమాకుల హీరోగా, హరినాథ్ అనే దర్శకుడు తీసిన ‘నువ్వు తోపురా’ వచ్చింది. దీన్ని కామన్ మాన్ బయోపిక్ అని నిర్మాత ప్రచారం చేశారు. ఏదో అప్పుడున్న బయోపిక్ ల ట్రెండ్ లో బిజినెస్ కోసం అని వుంటార్లే అనుకున్నాం. కానీ నిజంగానే బయోపిక్ లాగే తీయబోయారు. కల్పిత పాత్రతో బయోపిక్ ఏమిటి, బయోపిక్ అంటే నిజంగా జీవించిన మనిషి కథతో కదా వుండాలి - అన్న హద్దుల్ని కూడా చెరిపేయదల్చుకున్నారు. ఆ కల్పిత ఆవారా పాత్రతో బయోపిక్ ఎలా తీశారో చూస్తే మతిపోతుంది. అందుకే బాక్సాఫీసు పట్టించుకోలేదు.

గాథకి కథకి లాగా త్రీ యాక్ట్స్ స్ట్రక్చర్ వుండకపోవచ్చు. కానీ, బయోపిక్ ని త్రీ యాక్ట్స్ స్ట్రక్చర్ తో కథ లాగా తీయొచ్చు. ఎలాగంటే, ఆ నిజ వ్యక్తి జీవితాన్ని మలుపు తిప్పిన ప్రధాన సమస్య ఒకటి తీసుకుని, దాంతో ఎలా సంఘర్షించాడో, ఫలితంగా ఏం సాధించాడో ఆ నిజ జీవితంలోని సంఘటనల్ని ఏర్చి కూర్చి - త్రీయాక్ట్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్లో ఇమిడ్చి, కమర్షియాలిటీ కల్పించ్చ వచ్చు. అంటే నిజ జీవితాన్ని- బయోపిక్ ని - సినిమాగా ఆడించుకోవాలన్నా దాన్ని సమస్య - సంఘర్షణ - పరిష్కారమనే త్రీయాక్ట్ స్ట్రక్చర్ తోనే చూపించాలన్న మాట. ఈ పని ‘చందూ ఛాంపియన్’ చేయలేక పోయింది.

ఇలాకాక నిజ  జీవితంలో జరిగిన అన్ని సంఘటనలూ అనుభవాలూ ఎపిసోడిక్ గా చూపించుకుంటూ పోతే అది సినిమా అవదు, డాక్యుమెంటరీ అవుతుంది. ఇది టీవీకి పనికొస్తుంది, సినిమాకి కాదు. అలాగే త్రీయాక్ట్ స్ట్రక్చర్ లో బయోపిక్ అనేది సినిమాకే పనికొస్తుంది, టీవీ ఫిలింగా తీయడానికి కాదు. అయితే త్రీ యాక్ట్ స్ట్రక్చర్ లో సినిమాగా తీసిన బయోపిక్ ని టీవీలో ప్రసారం చేయొచ్చు. ఈటీవీ ‘మార్గదర్శి’ ప్రోగ్రాంలో అమితాబ్ బచ్చన్ మీద రెండు భాగాల బయోపిక్ఈ వ్యాసకర్త రాసినప్పుడు, డాక్యుమెంటరీగానే రాయాల్సి వచ్చింది. కాకపోతే ప్రారంభం కూలీషూటింగ్ సందర్భంగా అమితాబ్ తీవ్రంగా గాయపడిన ఆసక్తికర సంఘటనతో ఎత్తుకున్నాం. ఇదే సినిమా కోసం బయోపిక్ అనుకుంటేఅమితాబ్ జీవితంలో ఓ ప్రధాన సమస్యని  తీసుకుని, దాంతో సంఘర్షించిన విధం చూపించాల్సి వచ్చేది.

ఇలా సినిమాగా ఆడేందుకు నిజ జీవితాల్నే త్రీయాక్ట్ స్ట్రక్చర్ లో పెట్టి తీయాల్సి వస్తున్నప్పుడు, ఇక రెగ్యులర్ గా వచ్చే కమర్షియల్ సినిమాల్లో కల్పిత హీరోయిజాల కథలకి ఇంకెంత త్రీ యాక్ట్ స్ట్రక్చర్ వుండాలి!! ఇది గుర్తించకపోవడం వల్లే ఎవరి యాక్ట్’  ప్రకారం వాళ్ళు స్ట్రక్చర్ లేని సొంత క్రియేటివిటీలతో గాథలు తీసేస్తున్నారు.

 

6. ‘ఊపిరి’కి వూపిరి పోసిందేమిటి?

మరి గాథగా తీస్తే ‘ఊపిరి’ ఎలా హిట్టయ్యింది? ఎలాగంటే, దాన్ని ఇదివరకే హిట్టయిన ‘ఇన్ టచబుల్స్’ అనే ఫ్రెంచి మూవీ ఆధారంగా తీశారు. ‘ఇన్ టచబుల్స్’ ని చైనీస్ / జపనీస్ టెక్నిక్ తో గాథగా తీశారు. గాథలకి పనికొచ్చే ఈ చైనీస్ /జపనీస్ టెక్నిక్ కి త్రీ యాక్ట్స్ స్ట్రక్చర్ వుండదు, అంటే కాన్ఫ్లిక్ట్ వుండదు. ఈ టెక్నిక్ ని కిష్టెన్ క్యాచో’ (Kishotenketsu) అన్నారు.

ఈ టెక్నిక్ లో గాథ ఇలా సర్దుకుంటుంది :
1. Ki : Introduction
2. Sho : Development
3. Ten : Twist (complication)
4. Ketsu : Conclusion (reconciliation)

కమర్షియల్ సినిమా కథల్లో త్రీ యాక్ట్స్(బిగినింగ్, మిడిల్, ఎండ్) వుంటే, ఈ టెక్నిక్ లో ఫోర్ యాక్ట్స్  వుంటాయి. త్రీ యాక్ట్స్ స్ట్రక్చర్ లోనైతే బిగినింగ్ లో పాత్రల పరిచయం, సమస్య ఏర్పాటు, మిడిల్ లో ఆ సమస్యతో సంఘర్షణ, ఎండ్ లో పరిష్కారం అనే పద్ధతి వుంటుంది. ఇక్కడ 4 యాక్ట్స్ విధానంలో ఇవేవీ వుండవు. ఇందులో ఫస్ట్ యాక్ట్ లో కథా పరిచయంపాత్రల పరిచయం, వాటి సామాన్య ప్రపంచమూ వుంటాయి. సెకండ్ యాక్ట్ లో  పాత్రలు పరస్పరం సంపర్కంలోకి వస్తాయి. వాటి ప్రపంచం మారుతుంది. ఆయా పాత్రల గురించి మరిన్ని విషయాలు బయటపడతాయి. ఇంతలో ఒక కొత్త ఎలిమెంట్ వచ్చి చేరుతుంది. ఇంతేగాక రకరకాల సంఘటనలతో ఆ పాత్రలు మరింత దగ్గరై ఎమోషనల్ కనెక్ట్ ఏర్పడుతుంది. థర్డ్ యాక్ట్ లో ఎమోషనల్ కనెక్ట్ తో పాత్రలు మరింత ముందుకు సాగుతాయి.  చివర్లో ఒక ట్విస్టు వస్తుంది. ఫోర్త్ యాక్ట్ లో సెకండ్ యాక్ట్ లో ప్రవేశపెట్టిన ఎలిమెంట్ తో పరిష్కారం వుంటుంది. దీని గురించి పూర్తి ఆర్టికల్ ని ఈ లింక్ ని క్లిక్ చేసి చూడొచ్చు.

కమర్షియల్ గా ఏ కథయినా ఒక సమస్య (పాయింటు) చుట్టే వుంటుంది, కమర్షియల్ గా బయోపిక్ తీసినా ఒక సమస్య చుట్టే వుంటుంది. గౌతమీ పుత్ర శాతకర్ణిగణరాజ్యాల్ని  ఏకం చేసే సమస్య చుట్టే వుంటుంది. ఒక సమస్యా, దాంతో సంఘర్షణా అంటూ వుండనిది గాథలకే. విడివిడి ఎపిసోడ్లుగా సమస్యలు మారిపోతూ వుంటాయి. అంటే ఎమోషన్ ఎక్కడికక్కడ స్టార్ట్ అండ్ స్టాప్ అనే పంథాలో ఆగుతూ సాగుతూ వుంటుంది. గాథలతో ఇలాటి రిస్కులు చాలా వుంటాయి.

ఒక విలన్, అతడితో కాన్ఫ్లిక్ట్ అంటూ లేని ‘పెద్ది’ అనే గాథకి, కిష్టెన్ క్యాచో టెక్నిక్ మంచి కమర్షియల్ ప్రయోగమయ్యేది. వందల కోట్ల బడ్జెట్ వున్నప్పుడు అనుకున్న కాన్సెప్ట్ ని ఏ తరహాగా చెప్పాలా రీసెర్చి అవసరం. ఐదారుగురు రచయితలతో భారీ రీసెర్చికి తెరతీయడానికి నిధుల కొరతేమీ వుండదు కాబట్టి. గాథల్నే కాదు, ఏ కథలనైనా రీసేర్చే కాపాడుతుంది. రీసెర్చి లేని స్క్రిప్టు రచ్చ.

-సికిందర్