కానీ ఇప్పుడు ఏదైనా కొత్తదనం కోసం తహతహలాడుతున్నాడు, ప్రేక్షకులు కూడా అలాగే అనుకుంటున్నారని భావిస్తున్నాడు.
సైనిక శిక్షణ పొందిన కండలు తిరిగిన హీరో పాత్రలు కాకుండా, నిత్య జీవితంలో సామాన్యంగా కనిపించే సగటు హీరోల పాత్రలు చేసే హీరోలు ఏమై
పోయారని ప్రశ్నిస్తున్నాడు. మన భాషలో చెప్పుకుంటే యాంగ్రీ యంగ్ మాన్ పాత్రల్ని
తిరిగి అతను కోరుకుంటున్నాడు. తాజాగా వెరైటీ మేగజైన్ పాడ్ కాస్ట్ లో తన మనోభావాలు
వెల్లడించాడు.
ఇది మనం చూస్తున్నదే- హాలీవుడ్ సినిమాల్లో, టీవీ షోల్లో ఒక భారీకాయుడు
హఠాత్తుగా వచ్చి,
గది నిండా వున్న
వాళ్ళందరినీ పిచ్చెక్కినట్టు చితకబాదుతాడు. ఇది చూడడానికి అద్భుతంగా అనిపించవచ్చు, కానీ ఇలాంటి పది సినిమాలు
చూశాక, వెగటు పుట్టే వీలుంది. పరిస్థితులు
ప్రతికూలంగా వున్నప్పుడు యాక్షన్ హీరోలు వాటిని అధిగమించడం చూడాలని మనం కోరుకుంటాం, కానీ ఒక గొప్ప సూపర్‌హీరోకి, ఒక సాధారణ వ్యక్తికీ మధ్య వున్న గీత పూర్తిగా చెరిగిపోయినప్పుడు, తెరపై వున్న పాత్రలతో మనం
మమేకం అవడం కష్టమై పోతుంది. కానీ ఇదే ధోరణి కొనసాగుతోంది. సైనికులుగా లేదా మాజీ
సైనికులుగా నటిస్తున్న యాక్షన్ హీరోలు వంద మందిని చితకబాదే సినిమాలు మనం చాలా చూస్తున్నాం.
జాన్ విక్ అయినా, ది బీకీపర్ అయినా, మనం ఇలాంటి మూసగా
మారిపోయిన కథలకి ఎంతగా అలవాటు పడిపోయామంటే, ఇకపై సామాన్య ప్రజల
గురించి సినిమా తీయడానికి హాలీవుడ్ లో ఎవరూ ప్రయత్నించే ప్రసక్తే లేదనిపించేలా
తయారయ్యింది పరిస్థితి. వెరైటీ పాడ్ కాస్ట్ లో రిట్చ్‌సన్ కూడా ఇదే అసంతృప్తిని
వ్యక్తం చేశాడు. హీరోలని తరచుగా రెండంచుల సూపర్
హీరోలుగా మార్చేస్తున్నారని పేర్కొన్నాడు.
ఇప్పుడు తనకంటూ సొంత నిర్మాణ సంస్థ వున్నందున, సామాన్యుడిని తిరిగి వెండితెరపైకి తీసుకురావాలని తాను ఎలా కోరుకుంటున్నాడో చెప్పుకొచ్చాడు. ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్ల వంటి కథానాయకులు వుండే కథల్ని సృష్టించడానికి సహాయం చేయమని తను పట్టణ ప్రాంతపు ప్రజల్ని అడుగుతూనే వున్నానన్నాడు. వీళ్ళు అసాధారణ పరిస్థితుల్లో చిక్కుకుంటారనీ, కానీ వాటిని ఎదుర్కోవడానికి తప్పనిసరిగా సిద్ధమై వుండాలని లేదనీ చెప్పాడు.
గతంలో చూస్తే - అనేక గొప్ప యాక్షన్ సినిమాల్లో హీరోలు జన్యుపరంగా అద్భుత శక్తులు గల వాళ్ళో, కోట్లాది సంపద కలిగిన జీనియస్‌లో లేదా ఎప్పటికీ ఓడిపోని యోధులో కాదనీ, వాళ్ళు సాధారణ ఉపాధ్యాయులు, పోలీసులు, మెకానిక్‌లు, ఆఫీస్ ఉద్యోగులు, తండ్రులు, తల్లులు లేదా సాధారణ పౌరులనీ – వాళ్ళని అసాధారణ పరిస్థితుల్లోకి నెట్టి కథలు సృష్టించేవారనీ వివరించాడు.
మన సినిమాల్లో కూడా ఒకప్పుడు చూసేవాళ్ళం- హీరో పాత్రలు సూపర్ పవర్స్ కంటే తెలివి, ధైర్యం, పరిస్థితులకి తగ్గట్టు స్పందించే సామర్థ్యం, పట్టుదలల మీద ఆధారడి వుండేవి. కుటుంబం, గౌరవం, న్యాయాన్ని లేదా నమ్మిన వాళ్ళని కాపాడడం వంటి వ్యక్తిగత కారణాలతో పోరాడేవి. భావోద్వేగపరంగా చూసే నిజమైన మనుషుల్లా అన్పించేవి. సౌత్ లో ఏమోగానీ, నార్త్ లో ఒకప్పటి మాస్ హీరోల్ని చూపించే సినిమాలు వస్తే విరగబడి చూస్తున్నారు. సౌత్, నార్త్ తేడాల్లేకుండా ఎక్కువ భారీ యాక్షన్ సినిమాలు సూపర్ హీరోలతో, ఎలైట్ హంతకులతో, గూఢచారులతో- ఓటమి ఎరుగని సూపర్ యాక్షన్ హీరో పాత్రలతోనే వస్తున్నాయి. ఇవి వినోదాత్మకమైనప్పటికీ, హీరో ఎప్పటికీ ఓడిపోడని అనిపించినప్పుడు, ఉత్కంఠ తగ్గిపోతోందని కొంతమంది ప్రేక్షకులు భావిస్తున్నారు.
ఇప్పుడు ప్రేక్షకులు మిస్ అవుతున్న అంశాలు ఇవీ
: ఇది నాకూ జరగొచ్చు అనిపించే సంబంధం. హీరోలు కూడా నిజంగానే ఓడిపోవచ్చు, గాయపడవచ్చు, లేదా చనిపోవచ్చనే లాజిక్.
భయం, బాధ, ప్రేమ, అపరాధ భావం వంటి మానవ సహజ
భావోద్వేగాలూ శుభ్రంగా మిస్ అవుతున్నారు.
సమస్య భారీ నిర్మాణ విలువలతో కాదు- హీరో
పాత్రకి మానవ సహజ భావోద్వేగాలు మిస్సవుతున్న భారీ నిర్మాణ విలువలతోనే సమస్య. విషయ
బలం లేని సినిమాలకి భారీగా సాంకేతిక బలం దేనికి? సగటు హీరో పాత్రయితే సహజత్వానికి
దగ్గరగా వుంటాడు. హీరోతో బాటు కుటుంబం. ఇరుగు పొరుగు, సహోద్యోగులు వంటి పాత్రలు
బలపడతాయి. ప్రేక్షకులు తామే ఆ పాత్రల్లో వున్నట్టు
అనుభూతి చెందుతారు. అందుకని సగటు హీరో పాత్రని ఆలోచించేటప్పుడు మన హీరో 100 మందిని ఎలా ఓడిస్తాడని
కాకుండా- మా హీరో వచ్చే 10 నిమిషాలు ఎలా
బ్రతుకుతాడని మేకర్లు ఆలోచించేలా
చేస్తుంది. ఇక్కడే నిజమైన ఉత్కంఠ పుడుతుంది.
మన సినిమాల్లో ప్రేక్షకులు ప్రేమించిన అనేక
హీరో పాత్రలు మొదట- రైతు, విద్యార్థి, మెకానిక్, మధ్యతరగతి ఉద్యోగి, స్మాల్ టౌన్ యువకుడు
మొదలైనవి. తర్వాత కొందరు పురాణ స్థాయి హీరోలుగా మారిపోయారు. మళ్ళీ సాధారణ హీరో
వైపు రావాలంటే- చిన్న పరిసరాలు, నిజమైన గాయాలు, పరిమిత అవకాశాలు, తెలివైన ఎత్తుగడలు, కుటుంబ భావోద్వేగాలు, స్థానిక సమస్యలూ అవసరం.
భావోద్వేగ బలం సూపర్ హీరోలతో కన్నా,
సామాన్యుడైన యాక్షన్ హీరోలతో చూడగలం. ప్రేక్షకులు సూపర్ హీరోలని చూసి, ‘నాకు కూడా
అంత శక్తి వుంటే బాగుండేది’ అనుకోరు. సామాన్యుల్లోంచి వచ్చిన యాక్షన్ హీరోలని
చూసి, ‘నేనూ ఇంత ధైర్యంగా వుం డగలనా?’ అని ప్రశ్నించుకుంటారు. ఇదీ తేడా.
ఒక్క వాక్యంలో చెప్పాలంటే, మనలాంటి కామన్ యాక్షన్
హీరోల్ని తిరిగి తీసుకురావడమంటే, యాక్షన్ సినిమాల్లో మళ్ళీ మానవ సహజ బలహీనతలు, నిజమైన భావోద్వేగాలు, వ్యక్తిగత పణాలూ తీసుకురావడం. ఇక్కడ ప్రేక్షకుల్ని ఉత్సాహపర్చేది మానవాతీత శక్తులు కాదు, మనిషి ధైర్యం!
-సికిందర్

.jpg)