ఎస్ రఘునాథ్ వర్మ |
ఈ డిజిటల్ యుగంలో సినిమా క్రాఫ్టులు ఇంకా 24 శాఖలకే పరిమితమైలేవు. ఇప్పుడు 24 క్రాఫ్ట్స్ అనేందుకు కాలం చెల్లిపోయింది. గ్రాఫిక్స్, డీటీఎస్, డిజిటల్ ఫిలిం మేకింగ్, డీఐ టెక్నాలజీ...ఇలా బహుముఖాలుగా విస్తరిస్తున్న కొత్తకొత్త క్రాఫ్ట్స్ సంఖ్య పెరుతూ పోతోంది. డిజిటల్ ఇంటర్మీడియేట్ (డీఐ) విషయానికి వస్తే, అది డీఐ ప్రభావమని తెలీక కొందరు సినిమా రివ్యూ రచయితలే ‘ఫోటోగ్రఫీ’ అద్భుతంగా వుందని రాసేసి ఆనందిస్తున్నారు. కంటికి కన్పించిందే నిజం కానవసరం లేదెప్పుడూ. కళలు వచ్చేసి ఓవర్ లాప్ అవుతున్న ఈ ఆధునిక సందర్భంలో, గ్రాఫిక్స్ ని చూస్తే అది కళా దర్శకత్వమని అన్పించ వచ్చు. డీఐ ని చూస్తే అద్భుత ‘సినిమాటోగ్రఫీ’ లానూ తోచవచ్చు. గ్రాఫిక్స్ పార్టు కూడా దానికదే వైభావోపేతమనీ అన్పించవచ్చు.
అసలు జరుగుతున్న దేమిటంటే, ఆ గ్రాఫిక్స్ చేసిన దృశ్యాలకి కూడా డీఐ చేయడం. గ్రాఫిక్స్ తో సృష్టించిన, బయట షూట్ చేసిన, దృశ్యాల రంగుల్నీకాంతుల్నీద్విగుణీకృతం చేసే ప్రక్రియ డీఐ టెక్నాలజీ తో సమీప భవిష్యత్తులో ఒక్కటి గ్యారంటీగా జరగబోతోంది- ఈస్ట్ మన్ కలర్ రాకతో ఎలా బ్లాక్ అండ్ వైట్ సినిమాలు వెలవెలబోయాయో, డీఐ చేయని కలర్ సినిమాలు కూడా అలా కళావిహీనంగా కన్పిస్తాయి. తద్వారా అటువంటి సినిమాలకి ప్రేక్షకులు కూడా దూరమైపోతారు. అయితే-
‘చెన్నై
లో థియేటర్లన్నీ డిజిటల్ ప్రొజెక్షన్ కి
మారిపోయాయి. కాబట్టి అన్ని తమిళ సినిమాలకీ డీఐ అవసరమవుతోంది. ఒకప్పుడు ఇక్కడ 130
సినిమాలు నిర్మిస్తే, వంద వరకూ డిజిటల్ ఫార్మాట్ లో ఉండేవి. తెలుగులో 30 మాత్రమే ఉండేవి. ‘హేపీడేస్’
తో తెలుగులో చిన్న సినిమాలకి కూడా ప్రారంభమైన డీఐ ప్రక్రియ మెల్ల మెల్లగా ఇంకా
లోబడ్జెట్ సినిమాలన్నిటికీ ప్రాకిపోయింది’ అని చెప్పుకొచ్చారు చెన్నైలో ప్రముఖ డిఐ
కలరిస్టుగా వ్యవహరిస్తున్న సోమల రఘునాథ్ వర్మ అలియాస్ రఘు.
ఐతే తనకి ఎనలాగ్ (ఫిలిం) ఫార్మాటే మంచి ఆట స్థలంగా వుండేదన్నారు. ఎందుకంటే, ఫిలిం మీద అక్ష రేఖ (టాప్- బాటమ్ ల మధ్య స్పేస్) ఎక్కువ కాబట్టి, డిఐతో ఆడుకోవడానికి అదో మంచి ప్లే గ్రౌండ్ గా ఉండేదన్నారు. ఫిలింమీద సూపర్ 35 కెమెరాతో షూటింగులు మొదయ్యాక డీఐ తప్పని సరైందన్నారు.
‘ఏ మాయ చేశావే’ సినిమా చూస్తున్నంత సేపూ కళ్ళు తిప్పుకోలేకపోయారు ప్రేక్షకులు. అటు దీని తమిళ మాతృక చూసిన తమిళ ప్రేక్షకుల పరిస్థితీ ఇంతే. డీఐ వల్ల వీటికి జతకలిసిన దృశ్యాత్మక నాణ్యత అలాంటిదన్నమాట. మళ్ళీ ఈ వైభవాలు తెలుగు, తమిళం రెండు చోట్లా వేర్వేరు రంగుల పొందికతో, కాంతుల ప్రసరణలతో వున్నాయని మన కెవరైనా చెప్పారా? ఆ రహస్యం రఘు విప్పారు. తెలుగు తమిళ ప్రాంతీయ అభిరుచుల్ని దృష్టిలో పెట్టుకుని, తెలుగుకి గాఢమైన రంగులతోనూ, తమిళానికి లైట్ కలర్స్ తోనూ డీఐ చేశామన్నారు.
మరి ఇలా కెమెరా మాన్ కష్టపడి తనక్కావలసిన లైటింగ్ ఏర్పాట్లూ అవీ చేసుకుని, తను సంతృప్తి పడి షూట్ చేసుకొచ్చిన దృశ్యాల మీద కలరిస్టుగా మీరు చేయి చేసుకుంటే, కెమెరామాన్ ఒరిజినాలిటీ కనుమరుగైపోతుందికదా అంటే- అలా జరగదన్నారు. పై పెచ్చు కెమెరా మాన్ లే తమ వర్క్ అద్భుతంగా కన్పించేందుకు నిర్మాతలకి డీఐ ని సిఫార్సు చేస్తున్నారన్నారు. దీంతో గ్రాఫిక్స్ నిపుణుల్లాగే తామూ ప్రీ ప్రొడక్షన్ దశ నుంచీ, సినిమా నిర్మాణంలో పాలుపంచుకోవాల్సి వస్తోందన్నారు.
ఇదిలా వుంటుంది : ఒక సినిమాకి ఓ లొకేషన్ ని నిర్ణయిస్తే, రఘు ఆ లొకేషన్ కి వెళ్లి పాత్రలకి తగ్గ కాస్ట్యూమ్స్ తో టెస్ట్ షూట్ చేయిస్తారు. డిఐ తర్వాత ఈ దృశ్యాలు తెర మీద ఎలా కనపడవచ్చో ముందుగానే అంచనా వేసుకుని, అవసరమైన మార్పు చేర్పులు లోకేషన్లోనే చేసుకుని షూట్ చేస్తారు.
దృశ్యాల్ని డీఐ చేశాక కెమెరా మాన్ కి నచ్చక పోతే, మరో మూడు నాల్గు ఆప్షన్స్ చేసి చూపిస్తామన్నారు. వాటిలో కెమెరా మానే తనకి కావాల్సింది ఎంపిక చేసుకుంటాడ న్నారు.
‘డీఐ కేవలం కలరిస్టుకి సంబంధించిన ఇండివిడ్యువల్ క్రియేటివిటీ, అయినప్పటికీ కెమెరా మాన్ తో మ్యూచువల్ చఅండర్ స్టాండింగ్ తో పోతాం’ అని స్పష్టం చేశారు.
ఓ తెలుగు సినిమా- ‘ఆవకాయ్ బిర్యానీ’ అనుకుందాం - అందులో అవుట్ డోర్ లొకేషన్స్ కి చేసిన డీఐ (రఘు కాదు) కృత్రిమంగా పెయింటర్ వేసిన నిశ్చల చిత్రాల్లా వుందెందుకనీ అని అడిగితే - అది కెమెరామాన్ జడ్జ్ మెంట్ కావొచ్చన్నారు. లొకేషన్లకి వాటిదైన నేటివ్ ఫీల్ వుంటుందనీ, ‘ఏ మాయ చేశావే’ లో దాని హైదరాబాద్ నేటివిటీకి ఒక లాంటి ఫీల్ తో, ఈ సినిమాలోనే కేరళ దృశ్యాల నేటివిటీకి దాని ఫీల్ తో, చివరికి అమెరికా దృశ్యాలకి అక్కడి నేటివ్ ఫెల్ తోనూ డీఐ చేశానన్నారు.
చిత్తూరు జిల్లా పుత్తూరుకి చెందిన రఘు, ఎస్వీ యూనివర్సిటీలో బీసీఏ, ఎంబీఏ కోర్సులు చేశారు. గ్రాఫిక్స్ ని ఇంటి దగ్గరే సాఫ్ట్ వేర్స్ అవీ తెప్పించుకుని స్వయంగా నేర్చుకున్నారు. 2005 లో చెన్నై వెళ్ళిపోయి ఏవీఎం స్టూడియోలో ఎడిటర్ గా చేరారు. అదే సంవత్సరం ముంబాయి వెళ్లి ప్రసాద్ లాబ్స్ లో డిఐ విభాగంలో కన్ఫర్మిస్టుగా చేరారు. తన పనితీరు నచ్చి యాజమాన్యం చెన్నై ప్రసాద్ లాబ్స్ డీఐ విభాగానికి కలరిస్టుగా నియమించింది. డీఐ విభాగానికి కలరిస్టే చీఫ్. పది మంది కన్ఫర్మిస్టులు ఆయన కింద పనిచేస్తారు. ఫిలిం వున్నప్పుడు వీళ్ళు నెగెటివ్ ని డిజిటల్ బిట్లుగా స్కానింగ్ చేసి, ఫ్రేముల్ని మ్యాచ్ చేసి, డీఐకి అనువుగా మార్చి, కలరిస్టుకి అందించే వాళ్ళు. వీళ్ళ కింద లైన్ ప్రొడ్యూసర్ ఉంటాడు. ఇతను షెడ్యూలింగ్, కెమెరా మాన్ తో కలరిస్టు మిలాఖత్ ఏర్పాట్లూ అవీ చూస్తాడు.
ప్రస్తుతం చెన్నైలో జెమిని ఎఫ్ఎక్స్ డిఐ విభాగంలో కలరిస్టుగా – క్వాంబెల్ పాబ్లో వర్క్ స్టేషన్ మీద సినిమాలకి
సోయగాలు అద్దుతున్న రఘుని, ‘మీ దృష్టిలో గొప్పగా డిఐ చేసిన హాలీవుడ్ మూవీ ఏదో
చెప్పండి?’ అంటే, ‘అన్నీ గొప్పవే!’ అని తప్పించుకున్నారు.
-సికిందర్
(ఆంధ్రజ్యోతి- 2010)
(ఆంధ్రజ్యోతి- 2010)