‘ఇంటచబుల్స్’ తో తెలుగు రీమేక్ కి ఊపిరులూదడానికి అవసరమైన వరల్డ్ మూవీ స్క్రీన్
ప్లే గురించి గత వ్యాసంలో చెప్పుకున్న ‘కిష్టెన్ క్యాచో’ మోడల్ ని ఏమాత్రం అతిక్రమించలేదు, ఆ ఫ్రేములోనే వుంచారు.
చాలా షాట్లు కూడా మార్చకుండా అవే తీశారు. అలాగే కథ మొత్తానికీ సెకండ్ యాక్ట్ లో
కొత్త ఎలిమెంట్ గా మెరిసిన అదృశ్య ప్రేమికురాలి (శ్రియ) పాయింటునే విధిగా కీలకం చేసి,
దాంతో ఫోర్త్ యాక్ట్ ని ‘ఇంటచబుల్స్’
తరహాలోనే ముగించారు.
ఐతే ఒరిజినల్ లో ప్రతీ యాక్ట్ లోనూ వున్న ప్రారంభ
ముగింపుల ఘటనలకి, ఆయా యాక్ట్స్ లో సాగిన బిజినెస్సులకీ, తెలుగులో బెల్ట్ షాపుల చందాన అదనపు బిజినెస్సూ,
ఘటనలూ క్రిక్కిరిసి క్యూ కట్టాయి. ఉన్న 4 దశల ( యాక్ట్స్) కథలో 40 బెల్ట్
షాపులు వాటి దారులు అవి వెతుక్కున్నాయి. ఇక్కడే వరల్డ్ మూవీ సంస్కారానికీ,
తెలుగు రీమేక్ సంస్కారానికీ – ఆ మాటకొస్తే మొత్తం తెలుగు సినిమాల సంస్కారానికీ
తేడా తెలిసిపోతోంది. దర్శకుడు కూడా నిన్నటి వరకు మాస్ దర్శకుడుగా పేరొందడ మొకటి. సమస్య ఎక్కడ వచ్చిందంటే, ఈ రీమేక్ ని తెలుగు- తమిళం రెండు భాషల హీరోలతో చేశారు. దీంతో తెలుగులో అక్కినేని నాగార్జున పెద్దరికాన్ని కాపాడే, అటు తమిళంలో కార్తీ ఇమేజిని కూడా కాపాడే రెండంచుల కత్తిని సానబట్టారు. ఈ సానబట్టడం సమంగా జరక్క, కార్తీ కోసం తమిళ కత్తి వాడిగా తేలి, ప్రేక్షకుల మెడ మీద వేలాడేట్టు తయారయ్యింది ఓ గంట పాటు.
ఒరిజినల్ కేవలం గంటా 45 నిమిషాల నిడివితో కావలసినంత సంతృప్తిని కల్గిస్తే, రీమేక్ వచ్చేసి రెండు గంటలా 40 నిమిషాలు సాగినా ఇంకా ఇంకా సాగదీసుకోవాలన్న బలమైన కోరికతో వుంది. ఓపెన్ చేసిన బెల్ట్ షాపులు ఎలా మూయించాలో తెలీక వచ్చిన సమస్య ఇది. ఇక్కడ మొన్న విడుదలైన ‘కళ్యాణ వైభోగమే’ కూడా గుర్తుకు రాక మానడం లేదు... అందులో కూడా పెద్దవాళ్ళు క్లాసు పీకే బెల్ట్ షాపు ఓపెన్ చేసి, ఇక ఎలా ముగించాలో తెలీక సాగదీస్తూ సాగదీస్తూ అనేక బెల్ట్ షాపులు తెరచి, రెండు గంటలా 38 నిమిషాల వరకూ వెళ్ళారు. బెల్ట్ షాప్ ఓపెన్ చేస్తున్నామని తెలీక పోతే ఇంతే, కాలాన్ని అతిక్రమించిన మాయదారి కత్తులు ప్రేక్షకుల కుత్తుకల మీద కసకస వేలాడ్డమే.
కథా ప్రారంభం కార్తీ జైలు నుంచి పెరోల్ మీద విడుదల అవడంతో అవుతుంది. దొంగతనాల నేరం మీద రెండేళ్ళు జైలు శిక్ష పడింది. నాల్గు నెలలు పెరోల్ మీద విడుదలైనట్టు చూపారు. ఇలా ఒరిజినల్లో లేదు. ఒరిజినల్లో సెకండ్ యాక్ట్ లో, ఫిలిప్ ఫ్రెండ్ ఒకడు, సేవకుడు డ్రిస్ గురించి చెప్తూ, వీడు జైలు కెళ్ళొచ్చిన దొంగ అన్న సంగతి దృష్టికి తెస్తాడు. ఇప్పటి వరకూ డ్రిస్ గతంలో దొంగ అని ప్రేక్షకులకి కూడా తెలీదు. ఇది కొంచెం డిస్టర్బింగ్ గా వుంటుందిక్కడ. కావాలనే చేశారు దర్శకులు. ఇక్కడ ఈ మాట అన్పించడం ద్వారా ‘ఫోర్ షాడోవింగ్’ అనే టెక్నిక్ ని ప్రయోగించారు. అంటే ముందేదో జరగబోతోందన్న ఆదుర్దా కల్గించారు. ఇప్పుడు దొంగోడని తెలిసిన ఇతను, ఈ బిలియనీర్ ఇంట్లోఇంకేం చేయబోతాడో అన్న పాత్రరీత్యా సస్పెన్స్ పుట్టింది. తెలుగులో ఇంతమంచి కథనాన్ని కిల్ చేశారు. చూపించడమే కార్తీ దొంగ అని ఓపెన్ చేసేస్తూ క్యారక్టర్ కి షేడ్ లేకుండా, చప్పగా తయారు చేశారు.
ఇదలా వుంచితే, అసలు పెరోల్ గొడవేమిటి? సాధారణ దొంగకైనా పెరోల్ ఎప్పుడు లభిస్తుంది? చట్టంలో వుండే ఆ తొమ్మిదీ పది కారణాల్లో ఒక్కటీ ఇక్కడ కార్తీకి వర్తించవు. కుటుంబ సంబంధాలు/ సామాజిక సంబంధాలు అనే కారణంపై కూడా విడుదల చెయ్యాలన్నా- అసలు కుటుంబ సంబంధాలే లేవే? తల్లికి అసహ్యం, తమ్ముడికి ధిక్కారం, చెల్లెలికి ఛీత్కారం. ఇక సామాజిక సంబంధాలేమున్నాయని అవికూడా కొనసాగించుకోవడానికి? ఈ మేరకు పోలీసు ఎంక్వైరీ రిపోర్టు అందితే, పెరోల్ అప్లికేషన్నే కొట్టేస్తారుగా?
ఇక నాల్గు నెలలపాటు పెరోల్ గడువు సంగతి. ఏడాది మొత్తం మీద నాల్గో ఐదో వారాలు పెరోల్ కి అనుమతిస్తారేమో. అది కూడా ఒకేసారి కాదు. రెండు విడతలుగా. ఒకసారి రెండు వారాలు, ఇంకోసారి మూడు వారాలు. అంతేగానీ ఏకంగా నాల్గు నెలలు పెరోల్ మీద వదిలేసే చట్టం లేనేలేదు. ఎంత డబ్బూ పలుకుబడీ వున్నా సంజయ్ దత్ కే సాధ్యం కాలేదు. అతడి పెరోల్ ఉల్లంఘనలన్నీ చాలా వివాదాస్పదమయ్యాయి.
ఇలా పెరోల్ మీదున్న కార్తీని, నాగార్జున తనతో పాటు పారిస్ కి బయల్దేరదీస్తూ, ఇతడి మ్యాటర్ చూడమంటాడు సెక్రెటరీతో. ఏముంటుంది చూడ్డానికి. పెరోల్ మీద వున్న వాడు యాభై మైళ్ళ పరిధి దాటి వెళ్ళకూడదు. పారిసైనా, ఇంకే విదేశమైనా యాభై మైళ్ళ పరిధిలో వుండదు. పాస్ పోర్టే రాదు. పెరోల్ కండిషన్స్ వుంటాయి. విదేశాలు వెళ్ళే కోరికలు పెట్టుకుంటే పెరోల్ క్యాన్సిల్ చేసి జైల్లో కుక్కేస్తారు.
కార్తీ పెరోల్ మీద వచ్చాడంటే అతనింకా శిక్షకాలం పూర్తి చెయ్యని క్రిమినలే. పెరోల్ మీద వచ్చిన వాణ్ణి నాగార్జున కూడా చట్ట ప్రకారం ఉద్యోగంలో పెట్టుకోలేడు. ఇక కథ చివర్లో, నాగార్జున కార్తీని పంపించేశాక, కార్తీ వెళ్లి ఎంచక్కా క్యాబ్ డ్రైవర్ ఉద్యోగంలో చేరిపోతాడు. డ్రైవింగ్ లైసెన్స్ ఎక్కడిది? జైలర్ అప్పుడే ఇచ్చేశాడా? క్యాబ్ డ్రైవర్ గానే కాదు, నాగార్జున దగ్గర వున్నప్పుడు కూడా ఆయన్ని కూర్చో బెట్టుకుని కార్లు తెగ నడిపేస్తూంటాడు.
ఒరిజినల్లో డ్రిస్ తను చేసిన తప్పుకి జైలు శిక్ష అనుభవించి వచ్చాడు. ప్రభుత్వమిచ్చే నిరుద్యోగ భృతికి కూడా అర్హుడయ్యాడు. ఎవరైనా సమాజంలో అతడికి ఇంకో అవకాశమిచ్చి పనిలో పెట్టుకోవచ్చు. లాజికల్ గా ఆ పనే చేశాడు ఫిలిప్. తెలుగులో ఇంకో పని కూడా చేస్తారు కార్తీ, అతడి లాయర్ అలీ. సత్ప్రవర్తన సర్టిఫికేట్ తెచ్చుకుంటే శిక్షాకాలం తగ్గుతుందని, కార్తీని అనాధాశ్రమంలో సేవకీ, వృద్ధాశ్రమంలో సపర్యలకీ తిప్పుతాడు అలీ! సత్ప్రవర్తన అనేది జైల్లో ఉన్నప్పడు చూసి సర్టిఫై చేస్తారు. పెరోల్ మీద బయట ఆబోతులా వదిలి పెట్టేసి ఎవడో ఇచ్చిన పనికిమాలిన సర్టిఫికేట్స్ తెచ్చుకోమనరు.
ఇలా లాజిక్కులు తీస్తే కథేముంటుంది అనొచ్చు. అసలు కార్తీ ని పెరోల్ మీద చూపించి సాధించిందేమిటి? కథకైనా పాత్రకైనా వొరిగిందేమిటి? క్యారక్టర్ బిల్డప్ కైనా పనికొచ్చిందా? అడుగడుగునా లాజిక్ పరమైన ప్రశ్నలు రేకెత్తించడం తప్ప. ఒరిజినల్ దర్శకులు కూడా ఇలా చేసి వుంటే ఈ రీమేక్ కి అవకాశమే వుండేది కాదు- ఎందుకంటే, అక్కడి ఇంటలిజెంట్ ప్రేక్షకులు ఆ ఒరిజినల్ ని ఎప్పుడో తిప్పికొట్టేసే వాళ్ళు.
కార్తీ తల్లి (జయసుధ) పాత్ర సంగతి.
ఈమెకి ముగ్గురు పిల్లలు. కార్తీ, ఇంకో కొడుకు, కూతురూ. చిన్న ఉద్యోగం ఏదో చేస్తూ కుటుంబ భారమంతా మోస్తోంది. ముఖంలో సుఖ సంతోషాలుండవు. పెద్ద కొడుకు కార్తీ అంటే అస్సలు పడదు. ఆవారాగా తిరుగుతూ దొంగతనాలు మరిగి జైలు కెళ్ళి వచ్చాక (పెరోల్ మీద) తింటున్న అన్నం మీంచి కూడా లేపేసి వెళ్ళ గొట్టేస్తుంది. ఏదో చెప్పబోతే, చేతులు జోడించి దండం పెడుతూ ఇంట్లోంచి వెళ్లి పొమ్మంటుంది. ఈ చేతులు జోడించి దండం పెట్టడమనే చర్య చాలా అఫెండింగ్ గా వుంటుంది చూడ్డానికి, హెవీగా వుండే సంగతలా వుంచి.
ఈమెకి ముగ్గురు పిల్లలు. కార్తీ, ఇంకో కొడుకు, కూతురూ. చిన్న ఉద్యోగం ఏదో చేస్తూ కుటుంబ భారమంతా మోస్తోంది. ముఖంలో సుఖ సంతోషాలుండవు. పెద్ద కొడుకు కార్తీ అంటే అస్సలు పడదు. ఆవారాగా తిరుగుతూ దొంగతనాలు మరిగి జైలు కెళ్ళి వచ్చాక (పెరోల్ మీద) తింటున్న అన్నం మీంచి కూడా లేపేసి వెళ్ళ గొట్టేస్తుంది. ఏదో చెప్పబోతే, చేతులు జోడించి దండం పెడుతూ ఇంట్లోంచి వెళ్లి పొమ్మంటుంది. ఈ చేతులు జోడించి దండం పెట్టడమనే చర్య చాలా అఫెండింగ్ గా వుంటుంది చూడ్డానికి, హెవీగా వుండే సంగతలా వుంచి.
మనం
చూస్తున్నది ‘ఆ నల్గురు’ అనే సినిమా కాదు, ‘కలికాలం’ కూడా కాదు, ‘సూరిగాడు’ అసలే
కాదు. అలాటి సినిమాల్లో ఉండాల్సిన సీను ఇక్కడ జొరబడి మూడ్ చెడ గొట్టడ మేమిటి? ఇది నాగ్ - కార్తీ ల మధ్య ఒక ఫన్నీ జాయ్ రైడ్ తో కూడిన, ఫీల్ గుడ్ జానర్
మూవీ. ఈ హాస్య రస- అద్భుత రస ప్రధాన కథలో ఇంత కరుడుగట్టిన విషాద దృశ్యాలేమిటి?
కార్తీ కి పెట్టిన ఈ ఇంటి కథ ఒక మినీ ‘అంతు లేని కథ’ లా వుంటుంది. తను ఆవా రా సరే, తమ్ముడు ‘అంతులేని కథ’ లో రజనీ కాంత్ లాంటి వాడు, చెల్లెలు శ్రీ ప్రియ లాంటింది. ఇక తల్లి (జయసుధ) జయప్రదలాంటిది! వీళ్ళతో ఫ్యామిలీ డ్రామా అంతా ‘అంతులేని కథ’ -1976 బ్లాక్ అండ్ వైట్ స్టయిల్లో వుంటుంది. కార్తీకి ఈ ప్యాకేజీ తమిళానికి అవసరం కాబట్టేమో, అక్కడి కె. బాలచందర్ తీసిన ‘అంతులేని కథ’ నే ఆశ్రయించినట్టుగా వుంటుంది కలెక్షన్ల కోసం.
సరే, పెద్ద కొడుకు దొంగే అనుకుందాం, చిన్న కొడుకు ఇంకా అసహ్యంగా కన్పించే డ్రగ్స్ బానిస. కూతురు తల్లి చాటున రంకు నేర్చిన పిల్ల. చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకోబోతూంటే అడ్డుపడిన అన్న (కార్తీ) విలువ తీస్తూ మాటాడుతుంది. ప్రేమించిన వాడి పేరెంట్స్ తో మాటాడి పెళ్లి జరిపిస్తానని కార్తీ మాటిచ్చి, ఆ పేరెంట్ (తనికెళ్ళ) దగ్గరి కెళ్తే అతను హేళన చేస్తాడు. నాగార్జున కి ఇది తెలుస్తుంది. మిత్రుడు ప్రకాష్ రాజ్ ని తనికెళ్ళ దగ్గరికి పంపిస్తాడు. తనికెళ్ళ నాగార్జున దగ్గర కాంట్రాక్టులు పొంది పెరిగిన వాడు. ప్రకాష్ రాజ్ క్లాస్ పీకేసరికి వచ్చి నాగార్జున కాళ్ళ మీద పడి పెళ్లికి ఒప్పుకుంటాడు తనికెళ్ళ. నాగార్జున చేసిన ఈ సహాయం కార్తీ కి తెలియాలి కాబట్టి అందుకనుగుణంగా సీను.
ఆ వెంటనే తనికెళ్ళ వెళ్లి కార్తీ తల్లికి దండాలు పెట్టి ముహూర్తం పెట్టుకోవడం. అన్న చేసిన ఘన కార్యం చెల్లెలికి తెలియాలి కాబట్టి అదింకో సీను. ఇంద్రుడూ చంద్రుడూ అని ఫోన్లోనే పొగిడేసి అవతల పారేస్తుంది. ఇంకా కార్తీ చేసిన ఘనకార్యం ద్వేషించే తల్లికి కూడా తెలియాలి కాబట్టి ఆ రకమైన సీన్ల క్రమం...ఇలా చైన్ రియాక్షన్ లా ఒక అంశం చుట్టూ సీన్లు పెరుగుతూ వుంటాయి- బెల్ట్ షాపుల్లా! ఇంతకీ కూతురి అసలు నంగనాచితనం ఆ తల్లికి ఏమాత్రం తెలియదు. ఆమె పెళ్లి చేసుకుని పారిపోయి వుంటే ఆ తల్లి ఢామ్మని గుండె పగిలి చచ్చే పనే. కొడుకుల కంటే కూడా ఈ కూతురే డేంజరస్ డైనమైట్ అన్నమాట. అయినా ఈ చిహ్నాలు మహా తల్లి పసిగట్టనే పసిగట్టదు.
ఒకరు కాదు ఇద్దరు కాదు, పిల్లలు ముగ్గురూ ఇలా తయారయ్యారంటే, ఆమె ఎంత చక్కటి మహా తల్లో తెలిసిపోతోంది. దీనికి బాధ్యత వహించాల్సింది పోయి, లోకం ఎప్పుడూ తన సైడే ఉంటుందన్న అపోహతో వుంటుంది. చాలా మంది తల్లిదండ్రులు ఇలాగే ఎస్కేప్ అవుతూంటారు, వాళ్ళల్లో ఈమె ఒకత్తి.
కథ చివర్లో ఇంకో విషయం చెప్తాడు నాగార్జునకి కార్తీ ( ఇంకో బెల్ట్ షాపుకి ముహూర్తం!). ఈ తల్లి అసలు తన కన్న తల్లే కాదట. చిన్నప్పుడు తన తల్లి చనిపోతే ఆమె చెల్లెలు – అంటే ఈ తల్లి (తనకి పిన్ని) పెంచుకుందట. భర్త కూడా చనిపోయి పిన్ని కష్ట పడుతూంటే చూడలేక, నాల్గోతరగతిలోనే చదువు మానేశాడట. ఇక్కడ కార్తీకి ఫుల్ మార్కు లెయ్యొచ్చు- అంత చిన్న వయసులో ఇంత పెద్ద మనసుతో ఆలోచించినందుకు!
అయితే తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్న పిల్లాడు చదువు మానేసిన మానసిక కారణమేంటో తెలుసుకుని చక్కదిద్దాల్సిన బాధ్యత పెంపుడు తల్లికి లేదా? అక్క కొడుకే కదా. అక్క కొడుకుని తన సొంత పిల్లలకంటే హీనంగా ట్రీట్ చేయడమేంటి? డ్రగ్ బానిసగా అసహ్యంగా వున్న సొంత కొడుకుని పల్లెత్తు మాటనకుండా, అక్క కొడుకుని శత్రువులా చూడ్డమేమిటి? ఇదేనా చనిపోయిన అక్క పట్ల మర్యాద? ఈ అక్క కొడుకు చిన్నప్పుడు చదువు మానేసిన కారణం చెప్తే ఎక్కడ పెట్టుకుంటుంది మొహం?
ఇలా జరక్కుండా పాత్ర అదృష్ట మేమిటంటే, కూతురి రంకు, పెద్దకొడుకు చిన్నప్పటి పెద్ద మనసూ తెలుసుకోకుండానే అసమగ్ర పాత్రచిత్రణ పాలబడి ముగిసి పోవడం! ఇవి తెలిస్తే సూసైడే!!
నాగార్జున పాత్రకి కూడా బెల్ట్ షాపుంది...
ఐదేళ్ళ
క్రితం పారిస్ లో ప్రమాదం పాలయినప్పుడు, ప్రేమిస్తున్న అనూష్కా శెట్టికి కావాలని దూరమయ్యాడు
నాగార్జున. కానీ ఆమె ఎక్కడున్నా పెళ్లి చేసుకుని సుఖంగా వుండాలని కోరుకుంటూ
జీవిస్తున్నాడు. అసలామె అలావుందా లేదా
అన్న శంకతోనే వున్నాడు. తన మనశ్శాంతిని ఆనాడే పారిస్ లోనే కోల్పోయాడు. కనుక పోగొట్టుకున్న
చోటే వెతుక్కోవాలని తిరిగి ఇప్పడు పారిస్ కెళ్తే, అక్కడే కనపడుతుంది అనూష్కా కూతురితో, భర్త
(అడివి శేష్) తో కలిసి. నాగార్జున పరిస్థితికి చలించి, ఇన్నాళ్ళూ అపార్ధం
జేసుకున్నందుకు బాధ పడుతుంది అనూష్కా. ఆమె పిల్లా పాపలతో సుఖంగా వున్నందుకు
నాగార్జున పూర్తి మనశ్శాంతిని పొంది తిరిగొచ్చేస్తాడు.
ఒరిజినల్లో ఫిలిప్ కి పెళ్ళయి వుంటుంది. ఆ ప్రమాదంలో భార్య చనిపోయి వుంటుంది. ఇపుడు ఐదేళ్ళ తర్వాత ఇంకా ఆ బాధతో లేడతను. ఇది అతడి పాత్ర చిత్రణకి చాలా అవసరం. ఎందుకంటే, వికలాంగుడైన తను పక్షిలా ఎగరాలనుకోవడమే ఇక్కడ కాన్సెప్ట్. పక్షుల్ని కూడా చూపిస్తూంటారు. భార్య గురించి బాధ పడుతూ కూర్చుంటే ఈ కోరిక కలగక పోవచ్చు. కథ వేరే దారి పడుతుంది. ఒకవైపు భార్య గురించి బాధ పడుతూ- ఇంకో వైపు పక్షిలా ఆనందంగా షికార్లు కొట్టాలనుకోవడం పాత్రని అర్ధ రహితంగా మారుస్తుంది. ఏదో ఒకటే వుండాలి. ఆ ఒకటి పక్షిలా ఎగరాలనుకోవడమే కాన్సెప్ట్ ప్రకారం! కాబట్టి భార్య గురించిన ఎమోషనల్ బ్యాగేజీ లేకుండా చూశారు పాత్రకి.
నాగార్జునకి అనూష్కా గురించిన ఎమోషనల్ బ్యాగేజీ ఒక వైపు, చక్రాల కుర్చీకి బందీ అయిపోయీ అయిపోయీ స్ట్రెస్ పేరుకుపోయి రిలీఫ్ పొందాలన్న ఆరాటం మరో వైపూ. ఈ స్ట్రెస్ అనూష్కా సుఖ సంతోషాల గురించా, పక్షిలా ఎగరాలనుకోవడం గురించా పోగుపడింది? ( పావురాల్ని చూస్తూంటాడు తదేకంగా). కన్ఫ్యూజింగ్ గా లేదూ పాత్ర? ఒరిజినల్లో లాగే ఇక్కడ కూడా ఆ ప్రమాదంలో ‘భార్య’ అయిన అనూష్కా చనిపోయి వుంటే, పాత్ర కాన్సెప్ట్ ప్రకారం పక్షిలా ఎగరాలన్న ఒకే కోరికతో ( ఏకసూత్రతతో) స్పష్టంగా వుండేది. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవడమనే ఫిలాసఫీ ఒకటి మళ్ళీ. ఆ పోగొట్టుకున్న చోట మనశ్శాంతి పొందితే స్ట్రెస్ దూరమైపోతుందా? స్ట్రెస్ దాని గురించా, పక్షిలా ఎగరాలనుకోవడం గురించా? చాలా కన్ఫ్యూజింగ్. ఒరిజినల్లో తెలివిలేకుండా అలా పాత్రని సృష్టించి వుంటారా!
అసలు నాగార్జున లాంటి సీనియర్ పాత్రకి – బిలియనీర్ కి- పెళ్ళయి భార్యని పోగొట్టుకున్న నేపధ్యమే గౌరవప్రదంగా వుంటుంది. ఇంకా పెళ్ళే కాలేదంటే, సంసార సుఖం అనుభవించకుండానే ఇలా పనికిరాకుండా అయిపోయాడంటే, పాత్ర చులకన అవడమే గాక, పాత్ర తాలూకు విషాదం డబుల్ అవుతుంది. కథలో విషాద ఛాయల్ని వీలైనంత తగ్గించడానికి కదా ప్రయత్నించాలి? వొరిజినల్లో లేని విషాదాన్ని ఎందుకు పెంచినట్టు?
జోకేమిటంటే, కార్తీని కూడా పోగొట్టుకున్న చోటే వెతుక్కోమని వాళ్ళమ్మ దగ్గరికి పంపడం! వాట్ అమ్మ? హూజ్ దట్ అమ్మా? ఈ అమ్మ దగ్గర కార్తీ ఏం పోగొట్టుకున్నాడని? నథింగ్. ఆమె వున్నా లేకపోయినా ఒకటే. పోగొట్టుకుంటే కన్న తల్లిని పోగొట్టుకున్నప్పుడే అన్నీ పోగొట్టుకున్నాడు! ఇంకే అమ్మా భర్తీ చేయలేదు.
అసలు కాన్సెప్ట్ వదిలేసి ఏదో పోగొట్టుకుని వెతుక్కునే గొడవేమిటి?
దర్జాగా పబ్ లో ( కేవలం నాగ్- కార్తీల మెయిన్ ట్రాకు ఫన్ లో) మాంచి మజాగా కిక్కు ఎక్కుతూంటే, మధ్యలో ఈ బెల్ట్ షాపుల గొడవేమిటి చీప్ లిక్కర్
తో?
‘ఇంటచబుల్స్’ అసలు ఐడియా ఏమిటంటే, ఒక ఫ్రీ బర్డ్ లా చక్రాల కుర్చీ లోంచి ఎగిరిపోవాలనుకుంటున్న వికలాంగుణ్ణి, ఇంకో ఆల్రెడీ ఫ్రీ బర్డ్ లా తిరుగుతున్న ఆవారాగాణ్ణీ, పట్టుకుని ఎదురెదురుగా కాంట్రాస్ట్ గా పెట్టి, వీళ్ళేం చేస్తారో చూడ్డం! రాయడానికే చాలా ఇంటరెస్టింగ్ గేమ్ లా ఉత్సాహ పర్చే స్క్రీన్ ప్లే ఇది. కాన్సెప్ట్ ఇంత స్పష్టంగా క్యాచీగా, క్రేజీగానూ వుంది. తెలుగులో ఇదంతా మిస్సయి పోయింది- కారణం, ఒరిజినల్ లో ఈ పాత్రల్ని ఇలా ఎందుకు సృష్టించి, ఇలాగే ఎందుకు నిర్వహించారో అంతరార్ధాన్ని పసిగట్టక పోవడం! కథని పక్కదారి పట్టించి, హాస్యాస్పదంగా తెలుగు- తమిళ ప్రేక్షకుల కోసమని బోలెడంత కుటుంబ విషాదాలతో నింపేసి, అసలు పాయింటుని గల్లంతు చేసేయడం!!
62
కోట్ల సినిమాకి కాన్సెప్ట్ ని ఇంత మిస్ మేనేజ్ మెంట్ చేసుకోవాలా! ఏ లెవెల్లో కథలు
ఆలోచిస్తున్నట్టు? ఇవ్వాళ తమిళంలో ఈ
సినిమాని ప్రేక్షకులు పట్టించుకోవడం లేదటే, విషాద కథలతో కాన్సెప్ట్ గల్లంతయ్యే
కాదూ? కొత్త కాన్సెప్ట్స్ కి అక్కడెప్పుడూ ఆహ్వానమే కదా!
ఒరిజినల్లో ఒక వుడ్ బీ ఫ్రీబర్డ్ – ఇంకో ఆల్రెడీ ఫ్రీబర్డ్ ల మధ్య సయ్యాట కాబట్టే- కథ పక్క దార్లు పట్టకుండా డ్రిస్ ని కుటుంబ డ్రామా నుంచి డిటాచ్డ్ గా వుంచారు. మొదట్లో తల్లి వెళ్ళి పొమ్మంటే వెళ్ళిపోయే సీనే తప్ప మళ్ళీ ఆ తల్లి కూడా కన్పించదు. చెల్లెలి ట్రాకే లేదు. యజమాని పిలిప్, డ్రిస్ కోసం ఒకే ఒక్క త్యాగం చేస్తాడు- అదీ థర్డ్ యాక్ట్ లో. డ్రిస్ తమ్ముడేదో ప్రాబ్లంతో రావడం చూసి, ఇంటి కెళ్ళి సమస్యలు తీర్చుకోమని డ్రిస్ ని తన దగ్గర్నుంచి పంపేయడం ఫిలిప్ చేసుకునే త్యాగమే.
చివర్లో ఈ తమ్ముడి సమస్య తప్ప, డ్రిస్ పాత్రకి ఇంకే బరువూ పెట్టలేదు. పైగా అతడి స్వభావాన్ని కూడా దేనికీ బాధ పడని ఫన్నీ- హేపీ గో లక్కీ టైప్ క్యారక్టర్ గా వుంచారు. థర్డ్ యాక్ట్ తో ఫిలిప్ తన గురించి ఆలోచించి ఇంటికి వెళ్లి పొమ్మంటే, ఫోర్త్ యాక్ట్ లో ఫిలిప్ భావిజీవితం గురించి డ్రిస్ ఆలోచించి, ప్రేమించినమ్మాయితో కలిపేస్తాడు. ఇది పరస్పరం ఇచ్చుకున్న మాస్టర్ స్ట్రోక్స్ . ఫిలిప్ తన త్యాగంతో డ్రిస్ కి ఓ మాస్టర్ స్ట్రోక్ ఇస్తే, వూరుకోకుండా ప్రేమించినమ్మాయితో ఫిలిప్ ని కలిపేస్తూ డ్రిస్ తనదైన స్టయిల్లో మాస్టర్ స్ట్రోక్ ఇచ్చి వెళ్లి పోయాడు. విజువల్ మీడియా అయిన సినిమాకి చాలా ప్లస్ అయ్యే ఈ డైనమిక్స్ ని అర్ధం జేసుకోలేదు తెలుగులో.
ఎప్పుడు పడితే అప్పుడు ఇస్తే మాస్టర్ స్ట్రోక్ అన్పించుకోదు. కార్తీ చెల్లెలి పెళ్ళికి నాగార్జున ఒకసారి సహాయం చేశాక, మళ్ళీ చివర్లో కార్తీ తమ్ముడు గురించి ఆలోచించి కార్తీని ఇంటికి పంపేస్తే అది మళ్ళీ మాస్టర్ స్ట్రోక్ అవదు. రిపిటీషన్ – పునరుక్తి అవుతుంది. దీని ఎఫెక్ట్ ఫీల్ కాం.
అలాగే కార్తీ ఒకసారి నాగార్జునని పారిస్ లో అనూష్కాతో కలిపి, మళ్ళీ వూళ్ళో ప్రేమించినమ్మాయితో కలిపితే మాస్టర్ స్ట్రోక్ అన్పించుకోదు- ఒక ప్రేక్షకుడు ఇలా కామెంట్ చేశాడు కూడా థియేటర్లో - 'వీడు బ్రోకర్లా వున్నాడురా' అని! చెల్లెలి ట్రాక్ ఇంత నష్టం చేసింది మెయిన్ ట్రాకుకి. చివరి అరగంట సేపూ దారీ తెన్నూలేక కార్తీ కుటుంబ విషాదమే హెవీగా మారిపోయి- హేవీగానే సినిమా ముగిసి, హేవీగానే మనం బయటికి రావాల్సిన అవసరమేమిటి? ఇది నాగ్- కార్తీ ల మధ్య కథా? కార్తీ - అతడి ఫ్యామిలీ మధ్య కథా? చాలా కన్ఫ్యూజింగ్!
ఒరిజినల్లో హెవీ లేకుండా సింపుల్ గా డ్రిస్ వచ్చేసి, తనదైన మాస్టర్ స్ట్రోక్ ఇచ్చి వెళ్లిపోతూంటే, అప్రయత్నంగా మన కళ్ళు చెమరుస్తాయి, అంతే. ఒక అనిర్వచనీయమైన అనుభూతికి లోనవుతాం- ఇప్పుడు మళ్ళీ జీరోకొచ్చిన ఈ నిరుద్యోగి తనకేం భవిష్యత్తు వుందని అంత ధీమాగా వెళ్తున్నాడని ప్రశ్న వేధిస్తూంటే ముగుస్తుంది సినిమా.
క్లాసిక్ ఎండింగ్. ఎవరి మీద చివరి షాట్ వుంటుందో అతనే కథకి హీరో. ఒరిజినల్లో డ్రిస్సే హీరో. తెలుగులో మొహమాటాలకి పోయి ఇద్దర్నీ హీరోలుగా చేసేందుకు విఫలయత్నం చేశారు. చివరి షాట్ నాగ్- శ్రియాల మీద తీశారు. ఇది తేలిపోయింది. ఎందుకంటే కథ ప్రకారం, నాగ్ జీవితంలోకి వచ్చిన వాడు కార్తీ. జీవితంలోంచి వెళ్లి పోవడా న్ని కూడా అలాగే రికార్డ్ చేస్తూ అతడిపైనే ముగించాలి! అప్పుడొక స్పష్టమైన ‘స్టోరీ లైన్’ గా కనపడుతుంది మూవీ.
క్రేజీ కెమిస్ట్రీకే పట్టం!
నాగ్ – కార్తీల మధ్య ప్రతి సన్నివేశమూ బాగా వర్కౌట్
అయ్యింది. కార్తీ ది స్వాభావికంగానే స్మైలింగ్
ఫేస్ కావడంతో ఆవారా పాత్ర కలర్ ఫుల్ గా మారింది. ఒరిజినల్లో ఈ పాత్ర పోషించిన ఒమర్
సైది మెస్మరైజింగ్ బాడీ లాంగ్వేజ్. స్పీడు కూడా ఎక్కువే. అతనలా ఆకట్టుకుని
గుర్తుండి పోతాడు.
కార్తీ – నాగ్ ని అన్నయ్యా అని పిలుచుకోవడానికి అనుమతి కోరడం బాండింగ్ ని మరింత బలీయం చేసింది. నాగ్ కూడా తను రోగి కనుక ఏడుస్తూ పాసివ్ గా వుండిపోకుండా, చక్రాల కుర్చీలోనే యాక్టివ్ క్యారక్టర్ గా వుండడంతో- వీళ్ళిద్దరి బ్రోమాన్స్ చాలా ఫన్నీగా మారింది. ఇద్దరివీ యాక్టివ్ పాత్రలే. మధ్యలో నాగ్ సెక్రెటరీగా తమన్నా వుంది. చూసిన ఫస్ట్ షాట్ లోనే ఈమెకి రోమాంటిక్ గా ఎటాచ్ అయిపోతాడు కార్తీ. ఒరిజినల్లో ఈ ట్రాక్ లేదు. అయితే తెలుగులో ఈ ట్రాక్ ని చాలా అండర్ ప్లే చేశారు. ఇంకో దర్శకుడైతే కార్తీ తమన్నాల మధ్య లవ్ ట్రాక్ చాలా అవసరమనుకుని, ఆ సీన్లూ పాటలతో ఫస్టాఫ్ అంతా నింపేసి, సెకండాఫ్ లో తిరిగి నాగ్ దగ్గరికి కథని తెచ్చి, కాలం చెల్లిపోయిన ‘ఫార్మాట్’ ని పట్టుకుని వేలాడే వాడేమో!
వంశీ పైడిపల్లి ఈ నిగ్రహం తప్పలేదు. బంగళాలో ఉన్నంత వరకూ కథకి నాగ్ – కార్తీల ట్రాకే ముఖ్యమనుకుని లవ్ ట్రాక్ ని పూర్తిగా పక్కన పెట్టారు. లేకపోతే అమ్మాయి వెంట అబ్బాయి పడే లవ్ ట్రాక్ ని ఈ రోజుల్లో ఇంకా ఎవరు కేర్ చేస్తారు. అక్కడక్కడ మాత్రమే తమన్నాని కార్తీ గిల్లు తూంటాడు. చివర్లో ‘అద్దం’ సీను కూడా హిలేరియస్ వుంది. అలాగే ఒరిజినల్లో నామమాత్రంగా వున్న డ్రిస్ పెయింటింగ్ పిచ్చిని తెలుగులో బాగా వాడుకుని కార్తీకి ఒక పెద్ద ట్రాక్ గా డెవలప్ చేశారు. దీని ముగింపులో ప్రకాష్ రాజ్ తో మంచి ఫినిషింగ్ టచ్ ని కూడా ఇచ్చారు. ఇలా ఇక్కడ ఫినిషింగ్ టచ్ ని హైలైట్ చేసినట్టే, ముగింపులో నాగ్- కార్తీ మధ్య పరస్పర మాస్టర్ స్ట్రోక్స్ ని హైలైట్ చేయడం కూడా అత్యవసరమని పైన ఇందాక చెప్పుకున్నది.
ఇలా కథ నాగ్ – కార్తీల మధ్య నాగ్ బంగళాలో కథ తిరుగుతున్నంత సేపూ అదనంగా డెవలప్ చేసిన సీన్లు సహా బ్రహ్మాండంగా వుంది. ఎప్పుడయితే కథ బయటి కె ళ్తూంటుందో, ఆ కార్తీ కుటుంబ విషాదాలతో, పెరోల్ ప్రహసనాలతో బెల్ట్ షాపులు పెరిగి- చక్కటి పబ్ లాంటి నాగ్ బంగాళాలో అసలు ఫన్నంతా- కిక్కంతా దిగిపోయే పరిస్థితి ఎదురయ్యింది. భరించలేని కాక్ టెయిల్ – టార్చర్- పబ్ లో ఎంజాయ్ చేస్తున్న కాస్ట్లీ డ్రింక్ చీప్ లిక్కర్ తో కల్తీ!
ఇవాల్టి ప్రేక్షకులకి తక్కువ బరువున్న కథతో , తక్కువ బరువు గల పాత్రలతో, అక్కడక్కడా మాత్రమే భావోద్వేగాల్ని స్పృశిస్తూ, వినోదాత్మకంగా పరుగులు తీసే సినిమా కదా చూపించాలి. కష్టాలూ బాధ్యతలూ ఉండొచ్చు. వాటికి కుయ్యోమంటూ మూల్గుతున్నట్టు ఎప్పుడో ఎవరో స్థాపించిన ఇంకా అదే రొటీన్ నిరాశావాదంతోనే చూపించకుండా, ఆ కష్టాల్నీ బాధ్యతల్నీ బాద్షాలా తీర్చేసుకునే ఆశావహ దృక్పథపు చిత్రీకరణలు కదా ఈ కాలపు జీవనసమరానికి అవసరం? సినిమా అనేది ఈ రోజుల్లో పాజిటివ్ లుక్ తో హేండ్సమ్ గా వుండాలి.
-సికిందర్