రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

30, ఆగస్టు 2016, మంగళవారం

సాంకేతికం :







ద్దరు కాస్ట్యూమర్లు. ఒకరు రిఫరెన్సులు  లేకుండా కుట్టేస్తారు, మరొకరు రియలిస్టిక్ గా కుడతారు. ఒకరు సినిమాలు కూడా తీస్తారు. మరొకరు యూనియన్ ప్రెసిడెంటుగా వ్యవహరిస్తారు. ఒకరు ఇన్ఫర్మేటివ్ అయితే, మరొకరు ఎగ్రెసివ్. కాస్ట్యూమర్స్ యూనియన్ ప్రెసిడెంట్ చిల్లర వేణుగోపాల రావు తమ శాఖ దుస్థితి మీద ఎడాపెడా విరుచుకు పడతారు. ‘ఎవరిమీద మీకింత ఆగ్రహం?’ అంటే,  వెంటనే శాంతిస్తారు. మనకందరికీ తెలిసిందే- రెడీ మేడ్ల,  ఫ్యాషన్ డిజైనర్ల ఈ కాలంలో పెద్ద ఆఫర్లు కాస్ట్యూమర్లకి అంతగా దక్కడం లేదని. అయితే దీనికి రెండో వైపు ఒక ఆశావహ దృశ్యం కూడా వుంది. ఫ్యాషన్ డిజైనర్లకి అంత సీనేమీ లేదు, ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడమే వాళ్ళ పని.  అయితే అప్పటికే జరగాల్సిన నష్టమంతా జరిగిపోతుంది.


        దీనికొకటి చెప్తారు ఒకప్పుడు యూనియన్ వైస్ ప్రెసిడెంట్ గా కూడా పనిచేసిన వానపల్లి జగదీశ్ : ‘పంచాక్షరి’ లో హీరోయిన్ అనూష్కాకి ఒక రోమన్ డ్రెస్ కావాల్సి వచ్చింది. ముంబాయి చెన్నైల లోని ఫ్యాషన్ డిజైనర్లు దాన్ని  రూపొందించారు. ఆ  అతుకుల బొంతల్ని తిప్పి కొట్టారు అనూష్కా. ఇక జగదీశ్ రంగంలోకి దిగారు. అప్పటికి టైం లేదు, ఒక్క రోజులోనే కుట్టాలి. రిఫరెన్సులు కూడా అక్కరలేని తన సొంత క్రియేటివిటీతో,  రాత్రికి రాత్రి ఆ డ్రెస్ ని తయారు చేసేశారు. దాన్ని చూసి అనూష్కాతో బాటు సెట్లో అందరూ థ్రిల్లయ్యారు. నెట్, షీఫాన్ ల నుపయోగిస్తూ-  ఫాల్స్,  హేంగ్ వర్క్ లతో అత్యద్భుతంగా కుట్టిన ఆ వైట్ కలర్ డ్రెస్ ఇప్పుడు తన దగ్గరే వుంది- దాన్ని తీసి సగర్వంగా ప్రదర్శించారు జగదీష్. 

           కాస్ట్యూమర్స్ కి కుట్టు పని తెలియడంతో పాటు, స్పీడు కూడా వుంటుందన్నారు వేణుగోపాలరావు అలియాస్ వేణు. ఫాంటసీలని సృష్టించడంలో కూడా జగదీష్ దిట్ట అయితే, వేణు రియలిస్టిక్ గా పోతారు. జేడీ చక్రవర్తికి పర్సనల్ కాస్ట్యూమర్ గా వుండడం వల్ల తనకీ రియలిస్టిక్ అప్రోచ్ అబ్బిందన్నారు. ‘ఎగిరే పావురమా’ లో జేడీ రైల్వే గ్యాంగ్ మన్ పాత్రకి తను కుట్టిన బట్టల జత చూసి నిర్మాత రవికిషోర్, దర్శకుడు ఎస్వీ కృష్ణా రెడ్డి లు ఏంతో  మెచ్చుకున్నారన్నారు. తెలుగులో మంచి కాస్ట్యూమ్స్ కి నాగార్జునని చెప్పుకుంటారనీ, తను ఆయనకి కూడా కాస్ట్యూమర్ గా వున్నాననీ  అన్నారు వేణు.   ఫాంటసీ డ్రెస్సు లకి కన్నడ హీరో ఉపేంద్ర గురించి అంతా చెప్పుకుంటారనీ, ఆయనకి తనే బట్టల ప్రదాతననీ చెప్పుకొచ్చారు జగదీష్. ఉపేంద్ర నటిస్తున్న ఓ కన్నడ సినిమాకి తను అందుబాటులో లేనప్పుడు, ముంబాయి  బెంగళూరుల నుంచి ఐదుగురు డిజైనర్లు ఐదు మోడల్స్ లో టైగర్స్ డ్రెస్సులు తయారు చేసి తెచ్చారనీ, అవేవీ నచ్చక పోవడంతో ఉపేంద్ర తనని వెతికి పట్టుకున్నారనీ - అప్పుడా జెర్కిన్, ప్యాంట్, బుల్లెట్ బెల్టు లతో కూడిన ఫాంటసీ ‘టైగర్’ కాస్ట్యూమ్స్ ని,  తను తయారు చేసి తీసుకుని పోతే- అక్కడున్న హీరోయిన్ నయనతార సహా అందరూ అవాక్కయి చూశారనీ గుర్తు చేసుకున్నారు జగదీష్. 

          ‘HO’ లో కూడా ఉపేంద్రకి ఒక కవచం తయారు చేశానన్నారు. అప్పటి వరకూ కవచాల్ని దేశంలో ఫైబర్ తో తయారు చేసే వారనీ, అవి పెళుసుగా వుండి తొడుక్కుంటే ఇబ్బంది పెట్టేవనీ; తను తొలిసారిగా ఫోమ్, స్పాంజిల నుపయోగించి, కంఫర్టబిలిటీకి తిరుగు లేకుండా రూపొందించాననీ అన్నారు జగదీష్. ఉపేంద్ర నటించిన ‘హాలీవుడ్’  లో రోబో డ్రెస్ ని కూడా అందరికీ భిన్నంగా కార్లు, చెప్పుల తయారీల్లో ఉపయోగించే విడిభాగాలతో రూపొందించానన్నారు. రజనీకాంత్ ‘రోబో’ కి ఆ కాస్ట్యూమర్లు పెళుసుగా వుండే ఫైబర్ నే వాడారన్నారు. మరి మీరెందుకు మీ కొత్త ప్రయోగాన్ని ‘రోబో’ నిర్మాతల దగ్గర ప్రమోట్ చేసుకో లేదన్న ప్రశ్నకి- తనకి ఆసక్తి లేదనేశారు జగదీష్. 

          బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా ప్రోత్సాహాన్ని కూడా ఇలాగే తిరస్కరించారు జగదీష్. హైదరాబాద్ లో ఆమె ‘అపురూపం’  షూటింగ్ కి వచ్చినప్పుడు ఎవరో తనని ఆమెకి పరిచయం చేశారు. అప్పుడామె తను  వేసుకున్న జీన్స్ కలర్ లోనే చెవి రింగులు కావాలన్నారు. ఆమె అనుమతితో ఆమె నడుం వెనుక భాగం నుంచి జీన్స్ లోపలి బెల్టు ముక్క కత్తిరించి, అక్కడికక్కడే దాంతో చెవి రింగులు తయారు చేసిస్తే,  కళ్ళు తిరిగిన ప్రియాంకా వెంటనే ముంబాయి వచ్చేయమన్నారు. కానీ  ఇంటి బాధ్యతల వల్ల తిరస్కరించాల్సి వచ్చింది జగదీష్ కి. 

      సుస్మితా సేన్. కత్రినా కైఫ్ లకి కూడా కాస్ట్యూమ్స్ అందించారు జగదీష్. అయితే ఓ కన్నడ సినిమాలో జ్యోతికకి కుట్టిన ఫాంటసీ డ్రెస్ సీతాకోక చిలుక మంచి పేరే తెచ్చింది. ఇదెలా వుంటుందంటే, రంగురంగుల స్లీవ్ లెస్ టాప్స్, దీనికి మ్యాచయ్యే అంబ్రెల్లా స్కర్ట్ తో అచ్చం సీతాకోక చిలుకలాగే వుంటుంది. 

       మరి ఇప్పుడొస్తున్న ఫాంటసీ సినిమాలతో కాస్ట్యూమర్స్ కి మళ్ళీ పూర్వవైభవం వచ్చినట్టే కదా అంటే, హైప్ కోసం ఫ్యాషన్ డిజైనర్ల వెంటబడుతున్నారన్నారు వేణు. ‘ ఆ ఫాంటసీ డిజైన్లు పట్టుకుని డిజైనర్లు మా దగ్గరికే వచ్చి కాస్ట్యూమ్స్ కుట్టించు  కుంటున్నారు... పేరు మాత్రం వాళ్ళది చెప్పుకుంటారు’ అని అక్కస్సుగా అన్నారు వేణు. ఇక్కడే వున్న ఒక అసిస్టెంట్ ని చూపిస్తూ, ఇతను తయారు చేసిచ్చిన ఒక అద్భుతమైన డ్రెస్ కి క్రెడిట్ ఇతడికి రాకుండా,  ఫ్యాషన్ డిజైనర్ కొట్టేశారని విమర్శించారు జగదీశ్. వేణూ జగదీష్ లు కలిసే వుంటారు, కానీ కలిసి పనిచెయ్యరు. అదొక స్నేహబంధం అంతే.  

        బాపట్లకి చెందిన వేణు 1991 లో ‘క్షణం క్షణం’ కి అసిస్టెంట్ గా పనిచేసి, 1996 లో ‘గులాబీ’ తో కాస్ట్యూమ్స్ చీఫ్ అయ్యారు. కాస్ట్యూమ్స్ తో ఈయన అలవర్చుకున్న వాస్తవిక దృక్పథం  ఎలాంటిదంటే,  పోసాని కృష్ణ మురళి తీసిన ‘శ్రావణ మాసం’ అనే ఫార్ములా సినిమాలోనూ,  50 మంది రికార్డు స్థాయి తారాగణం మొత్తానికీ, రియలిస్టిక్ దుస్తులనే తయారుచేసి ఇచ్చిపారేశారు. ఇప్పటివరకూ 75 సినిమాలు పూర్తి చేశారు. 

        జగదీష్  1983 లో వైజాగ్ నుంచి చెన్నై వెళ్లారు. ఆరేళ్ళప్పుడే సూది పట్టిన ఈయన,  అన్నం లేకుండా ఆర్రోజులు గడపగల జీవన కళ ని కూడా ఔపోసన పట్టారు.  అంతటి దుర్భర స్థితి నుంచి పైకొచ్చారు. మొదట  కె ఆర్ విజయ, ప్రభలకి, కె ఎస్ ఆర్ దాస్ సినిమాలకీ పనిచేసి;  ఉపేంద్ర , రాజ శేఖర్ లకి పర్సనల్ కాస్ట్యూమరై;  సురేష్ ప్రొడక్షన్స్ కి కంపెనీ కాస్ట్యూమర్ గా వ్యవహరిస్తూ, తెలుగు తమిళ కన్నడ హిందీ భాషల్లో 300 సినిమాలూ పూర్తి చేశారు. ఈయన శిష్యులు ఐదారుగురు కాస్ట్యూమర్స్ అయ్యారు. ‘సీమశాస్త్రి’, ‘హలో ఉమా’ సినిమాలకి సహ నిర్మాతగా కూడా వున్నారు జగదీష్.



-సికిందర్
 (ఏప్రెల్ 2011- ‘ఆంధ్రజ్యోతి’ –సినిమాటెక్ శీర్షిక)  

29, ఆగస్టు 2016, సోమవారం

రచన- పాటలు- దర్శకత్వం : ముదస్సర్ అజీజ్

తారాగణం : అభయ్ డియోల్, డయానా పెంటీ, మోమల్ షేక్, అలీ ఫైజల్, జిమ్మీ షేర్ గిల్, పీయూష్ మిశ్రా, జావేద్ షేక్, కన్వల్జిత్ సింగ్ తదితరులు సంగీతం : సోహైల్ సేన్, ఛాయాగ్రహణం : సౌరభ్ గోస్వామి బ్యానర్స్ : ఇరోస్  ఇంటర్నేషనల్, ఎ కలర్ ఎల్లో ప్రొడక్షన్ నిర్మాతలు : కృషికా లుల్లా, ఆనంద్ ఎల్ రాయ్
 
విడుదల :  18 ఆగస్టు, 2016
***
        కామెడీ తీయడం ఆషామాషీ వ్యవహారం కాదనీ,  అందుకే ఇప్పుడు ప్యూర్ కామెడీల జోలికి ఎవరూ పోవడం లేదనీ, ఈ సెగ్మెంట్ లో శూన్యాన్ని భర్తీ  చేసి లాభపడే ఆలోచన చేయడం లేదనీ, చేస్తే కామెడీకి పూర్వవైభవం కల్పించే అదృష్టం చేసుకుంటూ, దండిగా రాబడులు కూడా  పొందవచ్చనీ తెలియజేసుకుంటూ హిందీలో ఓ సినిమా వచ్చింది- ‘హేపీ భాగ్ జాయేగీ’ అని.  ఇది అసాధ్యాన్ని ఎలా సుసాధ్యం చేసిందో ఈ కింద చూసుకుంటూ వెళ్దాం...

కథ 
     అమృత్ సర్ లో ఇండో- పాక్ వ్యవసాయ సదస్సు జరుగుతూంటుంది. పాకిస్తాన్ నుంచి మాజీ గవర్నర్ జావేద్ అహ్మద్ (జావేద్ షేక్), అతడి కొడుకు బిలాల్ అహ్మద్ (అభయ్ డియోల్) వచ్చి పాల్గొంటారు. కొడుకు తన లాగే రాజకీయాల్లోకి వస్తే పాకిస్తాన్ చరిత్రే మారిపోతుందని నమ్ముతూంటాడు జావేద్  (It will change the history of Pakistan).  కొడుకు బిలాల్ కి రాజకీయాలంటే ఇష్టముండదు. క్రికెటర్ కావాలని వుంటుంది. తండ్రిమాట కాదనలేక ఈసురోమని ఏడుస్తూ  రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటూ వుంటాడు.  అమృత్ సర్ లో సదస్సు ముగించుకుని లాహోర్ వెళ్ళిపోతాడు తండ్రితో. ఉదయాన్నే లేచి అమృత్ సర్ నుంచి తెచ్చుకున్న పెద్ద పళ్ళ బుట్టని తెరిస్తే,  అందులోంచి కెవ్వు మంటూ హేపీ (డయానా పెంటీ) బయటికి గెంతుతుంది. బిలాల్ తో బాటు పనిమనిషీ, పియ్యే అదిరిపడతారు. ఎవరు ఏమిటని ఆరాతీస్తే, తను అమృత్ సర్ వాసి. అక్కడి కార్పొరేటర్ బగ్గా ( జిమ్మీ షేర్ గిల్) తో తన కిష్టం లేని పెళ్లి చేస్తున్నాడు తండ్రి (కన్వల్జిత్ సింగ్). తను గిటారిస్ట్ గుడ్డూ (అలీ ఫైజల్) ని కాలేజీలో చదువుకుంటు
న్నప్పట్నించీ ప్రేమిస్తోంది. గుడ్డూతో పారిపోవాలని పెళ్లి పందిట్లో పైనుంచి దూకితే లారీలో పడింది. గుడ్డూ మిస్సయ్యాడు. లారీలో పళ్ళ బుట్టలో దాక్కున్న తనకి రాత్రిపూట లారీ ఎటు వెళ్లిందో తెలీదు. ఇదీ సంగతి. 

        అమృత్ సర్ నుంచి ఆ లారీతో బాటు తన  కాన్వాయ్ సరిహద్దు దాటుకుని మా లాహోర్ వచ్చిందంటాడు బిలాల్. ఇది లాహోర్,  నువ్వు పాకిస్తాన్ లో వున్నావ్- మా కొంపలు ముంచావ్-  అని లబోదిబో మంటాడు. ఇది బయటపడితే రాజకీయంగా అల్లరవుతుందనీ, హేపీని పోలీసులకి అప్పగిస్తే ఆమెకి కూడా ఇబ్బందులు తప్పవనీ భావించి,  తండ్రికి తెలీకుండా ఇంట్లోనే దాస్తాడు. ఇంట్లో కన్పించీ కన్పించకుండా మిస్సవుతున్న ఆకారాన్ని చూసి తండ్రి కంగారు పడుతూంటే, ‘అది అమ్మ ఆత్మ’  అని నమ్మిస్తూంటాడు బిలాల్. ఒకవైపు తనకి పొలిటీషియన్ జియా రెహమానీ (మనోజ్ బక్షీ) కూతురు మోడరన్ గర్ల్ జోయా (మోమల్ షేక్) తో సంబంధం కుదిరి వుంది. కానీ ఇప్పుడు చూస్తే  హేపీని లైక్ చేస్తూంటాడు. 

        అటు అమృత్ సర్ లో హేపీని పోగొట్టుకున్న పెళ్లి కొడుకు బగ్గా,  హేపీ లవర్ గుడ్డూని బంధిస్తాడు. హేపీ తండ్రి  హేపీ కన్పిస్తే కాల్చెయ్యాలని తుపాకీ పట్టుకుని తయారుగా వుంటాడు. పరిస్థితి ఉద్రిక్తంగా వుంటుంది. ఈ నేపధ్యంలో అటు లాహోర్లో బిలాల్ వైపు నుంచి ఏ సంఘటన జరిగి,  వీళ్ళంతా  లాహోర్లో వెళ్లి పడి అలజడి సృష్టిస్తారనేది మిగతా కామెడీ కథ. 

ఎలా వుంది కథ     ఫ్రెష్ కామెడీ అనొచ్చు. కామెడీ అనగానే, పెళ్లి  కూతురు పారిపోయిందనగానే, రౌడీ గ్యాంగులు టాటా సుమో లేసుకుని తుపాకులూ కత్తులతో బీభత్స భయానక దృశ్యాల్ని సృష్టించే (ఇవ్వాల్టి ‘చుట్టాలబ్బాయ్’ వరకూ)  తెలుగు కామెడీల్లా లేదు. తెలుగు కామెడీల  క్వాలిటీ నేలకు దిగిన పరిస్థితుల్లో కాస్త ఉపశమనం కోరుకునే వాళ్ళు  ‘హేపీ భాగ్ జాయేగీ’ హాస్యాన్ని ఆశ్రయించాల్సిందే. జీవితాల్లో పట్టుకున్న సృజనాత్మక హాస్యం దీని ప్రత్యేకత. నిత్యజీవితంలో అనుభవమయ్యే వివిధ పరిస్థితుల సునిశిత పరిశీలనలోంచి బోల్డు హాస్యాన్ని సృష్టించిన కథ. పెళ్లి కూతురు పారిపోవడమనేది పాత కథే, కథనం కొత్తది. దీనికి పాకిస్తాన్ నేపధ్యం సరికొత్తది. ఎవరి మనోభావాల్నీ  దెబ్బతీసే ఎలాటి రాజకీయ కామెంట్లు గానీ, జోకులు గానీ  లేని క్లీన్ ఎంటర్ టైనర్. హీరోయిన్ చూపించే ఇండియన్ నోటు మీద గాంధీ బొమ్మ చూసి, పాక్ పోలీసు సెల్యూట్ కొట్టేలాంటి చిన్న చిన్న ఫన్నీ సీన్స్ కి కూడా,  పాక్ సెన్సార్ బోర్డు అభ్యంతర పెట్టి అనుమతి ఇవ్వలేదు గానీ- మీడియాలో ఎక్కడా ఏ అంశం మీదా వివాదం రేగకుండా జాగ్రత్త తీసుకున్న కథ ఇది.  ‘నువ్వేమైనా అడుగు, కాశ్మీర్ తప్ప’ అని  పాక్ పోలీసు అధికారి పలికే  డైలాగుగానీ, జిన్నా చిత్రపటం చూసి – ‘ఇంకెన్ని అబద్ధాలు చెప్పిస్తావు?’ అని హీరో అనే డైలాగు గానీ నవ్వు తెప్పించేవే. ‘నేను ఇండియా వెళ్లి ఇండియా ఉప్పు తినను’  అని పాక్ పోలీసు అధికారి అంటే, ‘మనం దిగిమతి చేసుకుంటున్నది ఇండియా ఉప్పే’ అని హీరో గుర్తు చేయడం ఎలాటి సెన్సార్ కీ, కాంట్ర వర్సీలకీ దొరకని సెటైరే.  ఇక ప్రతీ మాటకీ హీరో తండ్రి - It will change the history of Pakistanఅనడం అతి పెద్ద  వ్యంగ్య బాణమే అనుకోవాలిగానీ, ఒంటి కాలిమీద లేవడానికి ఎవరికీ అవకాశమే ఇవ్వదు. అమృత్ సర్ లో చెడిపోయే మొదటి పెళ్లి సీను దగ్గర్నుంచీ, లాహోర్ లో సామూహిక వివాహాల సీను వరకూ నాన్ స్టాప్ క్రేజీ కామెడీ ఇది. 
ఎవరెలా చేశారు
       బిగ్ మసాలా సినిమాలకి దూరంగా సహజంగా వుండే చిన్న చిన్న సినిమాలతో వెరైటీ పాత్రల్ని ప్రేక్షకులకి పరిచయం చేస్తున్న అభయ్ డియోల్ కిది మరో విభిన్న పాత్ర. పాకిస్తానీయుడి పాత్రలో, అదీ మాజీ గవర్నర్ కొడుకు పాత్రలో,  హుందాగా కన్పిస్తూ ఉత్తమ హాస్యాన్ని పలికించాడు. మన తెలుగు సినిమాల్లోలాగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కొడుకైనా సరే ఆవారా తాగుబోతు, నీచ నికృష్ట, కోన్ కిస్కా గాడిలా వుండాలన్న దిక్కు మాలిన తెలుగు రూలు నుంచి ఇదెంతో రిలీఫ్!

        అభయ్  పాత్రకో అంతర్మథనముంది- క్రికెటర్ అవాలన్న తన కోరిక చంపుకుని తండ్రి కోర్కె తీరుస్తూ ఇష్టంలేని రాజకీయాల్లోకి వచ్చాడని. పంజరంలో పక్షిలా ఫీలవుతున్నాడు. తనకి విరుద్ధంగా హీరోయిన్ హేపీ తన స్వాతంత్ర్యం కోసం ఎప్పుడైనా ఎక్కడికైనా పారిపోగల తత్త్వంతో వుండడం. ఇలాటి ఈమెని తిరిగి తండ్రి దగ్గరికి పంపి ఆమె స్వేచ్చని, కోరికల్ని హరించకుండా,  ప్రియుడితో పెళ్లి జరగడానికి సహకరించాలన్న ధ్యేయం పెట్టుకుంటాడు-తనకి లేని స్వేచ్చ ఆమె కుండాలన్న ఆలోచనతో.  దీంతో పాత్ర అమాంతం ఎలివేటవుతుంది. కానీ ఈ ధ్యేయంతో చాలా చిక్కుల్లో పడతాడు. చాలా గేములు ఆడాల్సి వస్తుంది. సొంత తండ్రి, కాబోయే భార్య, కాబోయే మామ, హీరోయిన్ తండ్రి, పెళ్లి కొడుకు బగ్గా, లాహోర్ లో వాడి  అనుచరులూ – ఇంతమందిని ఎదుర్కొని గట్టెక్కాల్సిన పరిస్థితి దాపురిస్తుంది! సాధారణంగా హీరోకి వ్యతిరేకంగా విలన్ ఒక్కడే ఉంటాడు, కానీ ఇక్కడలా కాదు- హీరోకి అందరూ వ్యతిరేకులే- ఒక్కోసారి హీరోయిన్ కూడా. 
       ఏ రాజకీయాల్ని అసహ్యించుకుంటాడో ఆ రాజకీయాలే చెయ్యాల్సి వస్తుంది. హేపీ ప్రియుడు గుడ్డూ కోసం అమృతసర్ వచ్చినప్పుడు కోరిక ఆపుకోలేక గల్లీలో పిల్లలతో క్రికెట్ ఆడతాడు. రెండు  సిక్సర్ లు కొట్టి, తను పాకిస్తానీ అని ప్రకటిస్తాడు. ఈ సంగతి ముందు చెప్పి వుండాల్సింది - అని పిల్లలు అనగానే, పిల్లల చేతిలో కూడా క్రికెట్ రాజకీయాలమయమై పోయిందని వాపోతాడు! అభయ్  డియోల్ కిది కొత్త నేపధ్యంతో కొత్త తరహా పాత్ర. 
      హేపీ పాత్రలో హీరోయిన్ డయానా పెంటీది సినిమాలో అందరికంటే డాషింగ్ పాత్ర. ఆమె ఒక్క తన్ను తంతే ఎక్కడికి ఎగిరెళ్లిపోతారో తెలీదు. ఆమె ఎక్కువ ఆలోచించదు. ఎప్పుడేది అనుకుంటే అప్పుడది వెంటనే చేసేస్తుంది. మనదేశం, పర దేశం అన్న తేడా,  భయం కూడా లేవు. లాహోర్ లో ఆటో వాడికి ఇండియన్ నోటు ఇచ్చి అడ్జస్ట్ చేసుకొ మ్మంటుంది. వాడు వినకపోతే చితకబాది గలాభా సృష్టిస్తుంది. ‘పాకిస్తాన్ లోకి వచ్చి ఇలా పడ్డావ్, నీకు టెన్షన్ గా లేదా?’ అనడిగితే, ‘నాకెందుకూ టెన్షన్, పాకిస్తాన్ పడాలి  టెన్షన్!’ అనేసే రకం. 
      ఆమెని వెతుక్కుంటూ లాహోర్ వచ్చిన ఆమె తండ్రి, మాజీ గవర్నర్ ని చంపడానికి వచ్చిన టెర్రరిస్టుగా ముద్ర పడి, వూరంతా పోస్టర్లు వెలసి, పోలీసు వేటతో నానా తంటాలు పడతాడు. ఈ పాత్రలో కన్వల్జిత్ సింగ్ ది ఇంకో రకమైన హాస్యం. హేపీని వెతుక్కుంటూ లాహోర్ వచ్చిన పెళ్లి కొడుకు బగ్గా, జగ్గా అనేవాడి లోకల్ ముఠాతో హేపీని కిడ్నాప్ చేయడానికి ప్లానేస్తాడు. ఈ నెగెటివ్ పాత్రలో హీరో జిమ్మీ షేర్ గిల్ అచ్చం పంజాబీ వాడిలా కన్పిస్తాడు. తనేం మాట్లాడతాడో అర్ధం జేసుకోవడం చాలా కష్టం- ‘ఐయాం స్పీకింగ్ విత్ గుడ్డూ మీ దమన్ సింగ్ బగ్గా పంజాబీ టు ‘ఇంగీష్’ నాన్ స్టాప్  టాప్ స్పీడ్  హూ యూ బీ వాట్ యూ వాంట్’ -  అని ఫుల్ స్టాపులు, కామాలు లేకుండా అనేస్తాడు. గమ్మత్తయిన క్లయిమాక్స్ తో తనే లాహోర్ వదిలి అమృత్ సర్ పారిపోయి రావాల్సి వస్తుంది. అమృత్ సర్ లో సభ ఏర్పాటు చేసి, పెళ్ళయిపోయిన హేపీ- గుడ్డూ లని పొగుడుతూ ఉపన్యసించే తీరు జిమ్మీ షేర్ గిల్ నుంచి అద్బుత కామెడీ.  

        మోడరన్ గర్ల్ జోయా పాత్రలో పాకిస్తానీ నటి
మోమల్ షేక్ సీరియస్ గా వుంటుంది పరిస్థితుల ప్రకారం. ఆమె తండ్రిగా వేసిన మనోజ్ బక్షీ - అభయ్ డియోల్, అతడి పనిమనుషులూ పెట్టే తికమకకి జవాబులు వెతుక్కునే పాత్రలో రాయల్ కామెడీని ప్రదర్శిస్తాడు. అభయ్ తండ్రిగా వేసిన జావేద్ షేక్ అయితే తన ఊతపదంతో (ఇట్ విల్  ఛేంజ్ ది హిస్టరీ  ఆఫ్ పాకిస్తాన్) ఇంకో గుర్తుండి పోయే పాత్ర పోషించాడు.

        ఇక టాప్ కామెడీ అయితే పీయూష్ మిశ్రాది. పాక్ పోలీసు అధికారి ఉస్మాన్ గా నవాబీ ఉర్దూ మాట్లాడుతూ గందరగోళం సృష్టిస్తాడు. పాతకాలం నవాబులు ఎలా మాట్లాడతారో అవే పదాలతో,  ఉచ్ఛారణతో, ముఖకవళికలతో పాత్రని ఎంజాయ్ చేస్తూ జీవించేస్తాడు. డబ్బా గాళ్లయిన గుడ్డూతో, బగ్గాతో  అతడి సీన్లు టాపు లేచిపోతాయి. అమాయక ప్రేమికుడు గుడ్డూ పాత్రలో అలీ ఫైజల్ కూడా ఫర్వాలేదు. 

        తన కెమెరా పనితనంతో లాహోర్ లొకేషన్స్ ని బాగా మనోరంజకం చేశాడు సౌరభ్ గోస్వామి. ఇందుకు పాకిస్తానీయులు అభినందించాలి. అయితే అమృత్ సర్ దృశ్యాలకి అక్కడి బాణీల్ని నేపధ్య సంగీతంగా కూర్చిన  సోహైల్ సేన్, లాహోర్ సన్నివేశాలకి అక్కడి సంస్కృతితో కూడిన బాణీలు కూర్చివుంటే బావుండేది- అక్కడి బాణీలు  హిందుస్తానీ సంగీతమేగా! 

        కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం అన్నీ తానై నిర్వహించిన ముదస్సర్ అజీజ్,  పెళ్ళికూతురు పారిపోవడమనే పాత కథనే  కొత్తరకం పాత్రలతో,  కొత్త రకం నేటివిటీతో, సన్నివేశాలతో వినోదభరితం చేశాడు బాగానే వుంది గానీ, అదే సమయంలో స్క్రీన్ ప్లే తో హీరో పాత్ర సమన్వయం కూడా చూసుకోవాల్సింది. ఫస్టాఫ్ లో హీరోయిన్ వల్ల  రాజకీయంగా అల్లరవుతుందని భయపడి గుడ్డూ తో ఆమెని కలిపేసేందుకు  ప్రయత్నించే హీరో, సెకండాఫ్ లో తన గోల్ కి కారణం ఇది కాదన్నట్టు- తనకి లేని స్వేచ్ఛ హీరోయిన్ కుండాలన్నట్టుగా వెల్లడించడం, అందుకే తను ప్రయత్నిస్తున్నట్టు చెప్పడం  స్టోరీ పాయింటుని  రెండుగా చీల్చినట్టు వుంది. హీరో పాత్రకి ఒక గోల్ పెట్టినప్పుడు దానికి ఒకే కారణం పెట్టివుంటే పాత్ర ఇంకా బలంగా కన్పించేది. ఈ పాత్ర గోల్ కి సెంటిమెంటు బలమున్న స్వేచ్ఛ కి సంబంధించిన కారణమే కరెక్ట్. 

చివరికేమిటి?
      కామెడీ రైటింగ్ కూడా ఇంటలిజెంట్ రైటింగ్ గా మారినప్పుడు అప్డేటెడ్ మూవీస్ ఇలా ప్రేక్షకుల మధ్యకి వస్తాయి.  సినిమాటిక్ డైలాగులతో, సీన్లతో,  క్రియేటివిటీ లేని మాసిపోయిన కార్బన్ కాపీ కామెడీలు తీయడం అలవాటుపడిన వాళ్ళు - ఇలా జీవితాల్లో ఉట్టి పడే సహజ హాస్యంతో  ఆరోగ్యకర సినిమాలు తీసే స్థాయికి ఎదగడం ఇప్పటి అర్జెంటు అవసరం. సమాజంలో చాలా హస్యముంది, పాత్రలున్నాయి- వీటితో ప్రేక్షకులు తమని ఐడెంటిఫై చేసుకున్నంతగా, మూసఫార్ములా కామెడీ- పేరడీలకి కనెక్టయ్యే  పరిస్థితి ఇక లేదని వారం వారం తెలుస్తూనే వుంది.

        రెండోదేమిటంటే, హార్రర్ కామెడీ, థ్రిల్లర్ కామెడీ, యాక్షన్ కామెడీ, క్రైం కామెడీ, అడల్ట్ కామెడీ...ఇంకేవేవో  కామేడీలంటూ ఇతర జానర్లని కలిపి కృత్రిమంగా విరగబడి తీసేస్తూ,  ప్యూర్ కామెడీనే మర్చిపోయారు. ప్యూర్ కామెడీలకి  ఇటు జంధ్యాల, ఈవీవీ లాంటి వాళ్ళు; అటు హృషికేష్ ముఖర్జీ, ప్రియదర్శన్ లాంటి వాళ్ళూ  ఇప్పుడు లేనే లేరు. ముదస్సర్ అజీజ్ ఈ కొరత తీర్చాడు. 

        మూడోదేమిటంటే, సింగీతం శ్రీనివాసరావు టైపు హింస లేని ఫక్తు హాస్యభరిత క్లయిమాక్సులు ఇప్పుడు  వర్కౌట్ కావేమో అన్న సందేహాల్ని  కూడా ‘హేపీ భాగ్ జాయేగీ’ శుభ్రంగా పటాపంచలు చేస్తోంది.

-సికిందర్




       

       






26, ఆగస్టు 2016, శుక్రవారం

రివ్యూ!


రచన- దర్శకత్వం : జెనూస్ మహ్మద్ 

తారాగణం : దుల్కర్ సల్మాన్, నిత్యా మీనన్, శేఖర్ మీనన్, వినీత్, ప్రవీణ,
రాహుల్ మాధవ్ తదితరులు
మాటలు : శశాంక్ వెన్నెలకంటి, సంగీతం :  గోవింద్ మీనన్, ఛాయాగ్రహణం : ప్రతీష్ వర్మ
బ్యానర్ : ఎన్ ఎస్ సీ మూవీస్ , నిర్మాత : ఎస్. వెంకటరత్నం
విడుదల :  26 ఆగస్టు, 2016

*** 
         గత సంవత్సరం మణిరత్నం ‘ఓకే బంగారం’ తో  తెలుగులో పరిచయమైన మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ మరోసారి నిత్యా మీనన్ తో కలిసి నటిస్తూ తెలుగు ప్రేక్షకుల ముందు కొచ్చాడు. మలయాళంలో గత సంవత్సరం విడుదలై ఓమాదిరిగా ఆడిన ‘100 డేస్ ఆఫ్ లవ్’ తెలుగులోనూ ఇదే టైటిల్ తో డబ్ అయ్యింది. ప్రేమలో ఈ వంద రోజులేమిటి, ఏం జరిగింది, అసలా ప్రేమ ఏమిటీ అని యూత్ ని టార్గెట్ చేస్తూ తీసిన ఈ రోమాంటిక్ కామెడీ కథా కమామిషేమిటో  ఈ కింద చూద్దాం...

కథ       రావు గోపాల రావు అలియాస్  గోపాల్  (దుల్కర్ సల్మాన్) టైమ్స్ పత్రికలో జర్నలిస్టు. ప్రఖ్యాత కార్టూనిస్టు ఆర్కే లక్ష్మణ్ నుంచి స్ఫూర్తి పొంది జర్నలిజం లోకి వచ్చాడు గానీ, కార్టూన్లు వేసే అవకాశం పత్రికలో ఇవ్వడం లేదు. ఈ  విషయంలో ఎడిటర్ తో గొడవలు కూడా పడ్డాడు. రూమ్ మేట్ గుమ్మడి (శేఖర్ మీనన్) కి వీడియో గేమ్స్ సృష్టించడం మీద మక్కువ. ఈ నేపధ్యంలో ఒకరోజు గోపాల్ ఉద్యోగం పోగొట్టుకుంటాడు. అదే రోజు తను ఎక్కబోతున్న టాక్సీలోకి ఒకమ్మాయి (నిత్యా మీనన్) ఎక్కేస్తుంటే ఆగిపోయి ఆమెనే కళ్ళార్పకుండా చూస్తాడు. ప్రేమలో పడిపోతాడు. టాక్సీ వెళ్ళిపోతుంది. చూస్తే క్యారీబ్యాగ్ కింద పడిపోయిన విషయం ఆమె గమనించలేదు. దాన్ని గోపాల్ తీసి చూస్తే అందులో పాత  కెమెరా,  ఒక రోల్ నెగెటివ్ వుంటాయి. ఆ నెగెటివ్ ని డెవలప్ చేసి చూస్తే,  అందులో వివిధ లోకేషన్స్ లో ఆ అమ్మాయి దిగిన ఐదు ఫోటోలుంటాయి. గుమ్మడిని వెంటేసుకుని గోపాల్ ఆ అమ్మాయి వేటలో పడతాడు. ఆ అమ్మాయికి తెలిసిన రాహుల్ (రాహుల్ మాధవ్) అనే యంగ్ బిజినెస్ మాన్ పరిచయమవుతాడు. అప్పుడా అమ్మాయి  పేరు సావిత్రి అని తెలుస్తుంది. సావిత్రి ని తను ప్రేమిస్తున్నానని వార్నింగ్ ఇస్తాడు రాహుల్. విన్పించుకోకుండా గోపాల్ మరికొన్ని ప్రయత్నాలు చేసి సావిత్రిని కనుక్కుంటాడు. అప్పుడు సావిత్రి మనం చిన్నప్పుడు కలిసి చదువుకున్నామని గుర్తు చేస్తుంది. అప్పట్లో పొగరుబోతు అయిన అతడికి తానెలా బుద్ధి చెప్పిందో గుర్తు చేస్తుంది. దీంతో మళ్ళీ ఆమె మీద కోపం పెంచుకుంటాడు. 

        ప్రేమిద్దామని బయల్దేరిన గోపాల్ కి ప్రేమలో ఈ ఎదురుదెబ్బ తగిలి ఏం చేశాడూ అన్నదే మిగతా కథ. ఆమె పట్ల తనకున్న కోపం, ఆమెని ప్రేమిస్తున్న రాహుల్, ఆమె తల్లి దండ్రులు, స్వయంగా ఆమే....ఇన్ని ప్రతిబంధకాల్ని ఎలా నెగ్గుకొచ్చి ప్రేమని పండించుకున్నాడో తెలుసుకోవాలంటే వెండితెర మీద చూడాల్సిందే. 

ఎలావుంది కథ  
     మూస ఫార్ములాలకి దూరంగా ఈ మాత్రం కూడా ప్రేమ సినిమాలు తెలుగులో రావడం లేదు గనుక, ఈ నాన్ – ఫార్ములా లవ్ కథ ఫ్రెష్ గానే అన్పిస్తుంది. మన పేరెంట్స్ కాలంతోనే పవిత్ర ప్రేమలు ఎండ్ అయ్యాయని, ఇప్పుడు ప్రేమలతో  ప్రాక్టికల్ గా వుండాలని ఈ కథలోనే హీరోయిన్ చెప్పే మాటలు- మన తెలుగు ప్రేమ సినిమాలకి కొరడా చరుపులాగే వుంటాయి.  తెలుగు సినిమాల్లో యువజంటలకి ఇంకా పాత చింతకాయ పవిత్ర ప్రేమలే కదా అంటగడుతున్నది!  అయితే పూర్తిగా ఇది ఆధునిక ప్రేమ కథైతే కాదు. ఆధునిక జీవితంలో ప్రేమికులెదుర్కొనే సమస్యలతో నైతే ఇది లేదు. అదే పాత స్కూలునాటి పరిచయం, అదే ఆనాటి పాత టైపు ఫీలింగు (కోపం) తో పునః పరిచయం, స్వాతంత్ర్యాన్ని కోరుకునే హీరో, ప్రాక్టికాలిటీ పేరుతో పెళ్ళితో జీవితానికి భద్రతని కోరుకునే పాత కాలం నాటి హీరోయిన్ – ఈ ఫార్ములా దినుసులు లేకపోలేదు. అయితే వీటిని పునాది రాళ్ళుగా పెట్టుకుని కథనాన్ని మాత్రం నాన్- ఫార్ములాగా కొత్త పోకడలతో కొనసాగించాడు దర్శకుడు. 


ఎవరెలా చేశారు      దుల్కర్ సల్మాన్ ఈ యూత్ ప్రేమకథకి కొత్త ఫీల్ తెచ్చాడు. నిత్యా మీనన్ కూడా. ఇందులో బరువైన సన్నివేశాలు లేకపోడం, అంతా హేపీ గో లక్కీ టైపుగా సాగడం వీళ్ళిద్దరికీ బాగా కలిసివచ్చింది. ఫస్టాఫ్ లో దాదాపు నిత్యా మీనన్ కన్పించకపోయినా, సల్మాన్ ఆ లోటు కన్పించకుండా లాక్కొచ్చాడు. సల్మాన్ ఫ్రెండ్ గా నటించిన స్థూల కాయుడు శేఖర్ మీనన్ కామెడీ పార్టు పోషించాడు. ఈ ముగ్గురే ఎక్కువగా కన్పించేది, నిత్యా పేరెంట్స్ గా వినీత్- ప్రవీణ లు నటిస్తే, బాయ్ ఫ్రెండ్ గా రాహుల్ మాధవ్ నటించాడు. అయితే ‘ప్రేమ దేశం’ తో హీరోగా తెలిసిన వినీత్ ఇందులో నిత్యా తండ్రిగా వేయడానికి వయసు చాల్లేదు.

        ప్రతీష్ వర్మ ఛాయాగ్రహణం బ్రౌన్ టింట్ తో, డిమ్ లైటింగ్స్ తో స్టయిలిష్ గా వుంది. కథనానికి తగ్గ విజువల్స్ తో యూత్ ఫుల్ గా వుంది. అలాగే గోవింద్ మీనన్ సంగీతంలో పాటలు కూడా. శశాంక్ వెన్నెలకంటి మాటలు –తక్కువ పదాల్లో ఎక్కువ అర్ధాన్ని పలికాయి. దర్శకుడు జెనూస్ మహ్మద్ దర్శకత్వంలో, విజువల్ సెన్స్ లో మంచి ప్రావీణ్యం చూపించాడు గానీ, రచన సైడ్ జాగ్రత్త తీసుకోలేదు. 

 స్క్రీన్ ప్లే సంగతులు  
     విషయం తగ్గినప్పుడు కాలక్షేపం ఎక్కువవుతుంది. విషయాన్ని పెంచలేని కథలుంటే ఇంతే. చాలినంత విషయముంటే ఇంటర్వెల్ లోపే కథలోకి ప్రవేశించవచ్చు. లేనప్పుడే ఇంటర్వెల్ వరకూ సాగదీయాల్సి వస్తుంది కాలక్షేప పురాణాన్ని. ఈ సిన్మాలో ఇంటర్వెల్ దాకా సాగే కాలక్షేప పురాణమేమిటంటే, టాక్సీ ఎక్కి మాయమైపోయిన హీరోయిన్ ని వెతుక్కోవడమే. ఇంటర్వెల్ దాకా వెతుక్కుంటారు. హీరోయిన్ దొరికితేనే కదా కథ మొదలయ్యేది. హీరోయిన్ ఇంటర్వెల్ లోపే దొరికిపోతే అక్కడే కథ ప్రారంభిస్తే –చివరివరకూ లాగలేనంత అతి సన్నని,  బలహీన పాయింటుతో వుంది కథ మరి. ఆ పాయింటు హీరోయిన్ మీద హీరో చిన్ననాటి కోపం!

        చాలా సులభంగా హీరోయిన్ని కనుక్కునే అవకాశం వున్నా ఎక్కడ అప్పుడే కథ మొదలెట్టాల్సి వస్తుందోనన్న భయంతో సాగదీశాడు వేట దర్శకుడు. హీరో జర్నలిస్టు అయినప్పుడు సింపుల్ గా- ఆమె పోగొట్టుకున్న ఫోటోలూ కెమెరా తనకి దొరికాయని పేపర్లో ప్రకటన వేయిస్తే చాలు. అతను ఈ పనిచెయ్యక పోగా,  ఆమె కూడా విలువైన వాటిని పోగొట్టుకుని సైలెంట్ గా ఉండిపోతుంది. ఆమె అయినా వాటిని పోగొట్టుకున్నట్టు పేపర్లో వేయిస్తే ఎప్పుడో హీరో పరిగెత్తుకుంటూ వెళ్లి ఇచ్చేసే వాడు! ఇలా చెయ్యక ‘ఈమె తెలుసా?’  అని ఫోటోలు పట్టుకుని మనిషి మనిషినీ అడుగుతూ తిరుగుతాడు.

        టాక్సీలో ఆమెని చూసినప్పుడు ప్రేమలో పడ్డం, క్లయిమాక్స్ దగ్గర ఆమెకి ఎంగేజ్ మెంట్ అయినప్పుడు ప్రేమని పోగొట్టుకోవడం- ఈ రెండు ప్లాట్ పాయింట్స్ మాత్రం బాగా కుదిరాయి. అలాగే ముగింపూ ఫన్నీగా వుంది. హీరో హీరోయిన్లవి వేర్వేరు వ్యక్తిత్వాలు. అతను కార్టూన్లని నమ్ముకోవడంతో అయినవాళ్ళందరికీ దూరమై ఏకాకిగా బతుకుతున్నాడు. ఆయిన వాళ్ళందరూ వేరే వృత్తుల్లో జీవితంలో పైకొచ్చారు. కార్టూన్లని నమ్ముకున్న తను పనిచేస్తున్న పత్రికలో కూడా ఇమడలేకపోయాడు. సొంతంగా ఒబామా మీద కార్టూన్లేసి సోషల్ మీడియాలో పెట్టడంతో,  అవి ఒబామా దృష్టిలో పడి ట్వీట్లు చేశాడు. దీంతో అంతర్జాతీయ పబ్లిషర్లు  హీరో వెంట పడ్డారు... ఇంకేముంది రిచ్ అయిపోవడమే...

        హీరోయిన్ ప్రేమని ప్రాక్టికల్ గా చూడాలని,  అందం చందం- డబ్బు దస్కం వున్న వాణ్ణి చేసుకుని స్థిరపడాలనీ అనుకుంటుంది. కార్టూన్లని నమ్ముకున్న కళాకారుడు హీరోని జీవితంలో పరాజితుడిగా చూస్తుంది. నేను పరాజితుణ్ణి అయినా ఒరిజినల్ ని – అంటాడు హీరో. నువ్వు పెళ్లి చేసుకుంటున్న వాడు ఒరిజినల్ కాదంటాడు. నీకు ఒరిజినాలిటీ కావాలో, వాడి దగ్గర జీవితానికి భద్రతే  కావాలో తేల్చుకొమ్మంటాడు. ఈ విధంగా ప్రేమలో పాత  ఫార్ములా విషయాన్నే కొత్త కాంటెక్స్ట్ లో పెట్టి  చెప్పడంతో కథనం, పాత్రలూ బూజు వదిలించుకున్నాయి.


-సికిందర్
http://www.cinemabazaar.in
-

23, ఆగస్టు 2016, మంగళవారం


     ‘రుస్తుం’ రీ- పోస్ట్ మార్టం బేతాళ కథల్లా సాగేట్టుంది... ఒక్కో శవాన్ని చెట్టుమీద నుంచి దించి భుజాన వేసుకు వెళ్తూండడమే... శవాల్లోని బేతాళుడు అడిగే ప్రశ్నలకి చచ్చినట్టూ సమాధానాలు చెప్పుకోవడమే. కొందరు కళాకారులు  ఎంతో తెలివిగా కళా సృష్టి గావిస్తారు. దాంట్లోని సంక్లిష్టతకి ఎన్ని వెబ్ పేజీలైనా చాలవు విశ్లేషణలకి. ‘రుస్తుం’ కి  1) అసలు నిజ కథ, 2) దీని ఆధారంగా దర్శకుడు రచయితల సొంత కథ, 3) మళ్ళీ ఈ సొంత కథలో a ) భార్య ద్రోహ కథ-  b) భర్త దేశభక్తి కథా, 4) ఇంకా వేరే  రెండు సినిమాల్లో వచ్చిన కథలూ  ముందేసుకుని, పీహెచ్ డీ పట్టాకోసం కృషి చేస్తున్నట్టు ఎంతకీ ముగియని  తులనాత్మక పరిశీలన చేయాల్సిందే...కళా పోషణ కరాళ నృత్యం చేస్తూంటే ఇంతే!!  

        ఇంకా మనం బిగినింగ్ విభాగం దగ్గరే వున్నాం. అసలు విక్రం అనేవాడు నేవీ అధికారులతో కలిసి స్కామ్ చేస్తూ, స్కామ్ కి లొంగదీయాలని  రుస్తుం మీద వొత్తిడి తెస్తున్నప్పుడు, ఈ సంగతి రుస్తుం తన భార్య సింథియాకి  చెప్పకుండా వుంటాడా? తామిద్దరికీ విక్రం,  అతడి చెల్లెలూ పరిచయస్థులే కదా? ఒకవేళ స్కామ్ విషయాలు సింథియాకి తెలియనివ్వ కూడదనుకుంటే- స్కామ్ మూలంగా తనతో సంబంధాలు చెడిన విక్రంనీ అతడి చెల్లెల్నీ ఇక కలవొద్దని మాత్రమైనా  రుస్తుం సింథియాకి చెప్పి వెళ్ళాలిగా? అలా చెప్పి వెళ్తే సింథియా విక్రం వలలో పడేది కాదుగా? పోనీ, తను డ్యూటీ నుంచి తిరిగి వచ్చాకైనా సింథియా  వ్యవహారం మీద నిలదీసినప్పుడు-  తను  తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా చేశానని ఆమె చెప్పినప్పుడైనా తను  అప్రమత్తమై - స్కామ్ సంగతి నీకు తెలిసిపోయిందా? వాడేం చెప్పాడు? స్కామ్ కి నన్ను ఒప్పించమని నిన్ను బలవంత పెట్టాడా?-  అని అడగలిగా? స్కామ్ విషయంలో విక్రం తో ఆమె ఏదో కుమ్మక్కయినట్టూ, తనకేదో ద్రోహం చేస్తున్నట్టూ  అలా చూస్తాడేమిటి? 

        రెండోది- స్కామ్ కి సంబంధించి విక్రం మాట రుస్తుం వినలేదే అనుకుందాం, అలాంటప్పుడు ఓ  ప్లేయ్ బాయ్ లా సింథియాతో ఎందుకు ఎంజాయ్ చేస్తాడు విక్రం? మాట వినని  రుస్తుంకి ఇలా బుద్ధి చెప్ప వచ్చనా? ఇలా  రుస్తుం భార్యని వాడుకుని వదిలేస్తే,  జీవితాంతం రుస్తుం కుమిలి పోవాలనా? ఇదేనా అతడి ఉద్దేశం?  ఇది అతికినట్టు వుందా? ఇలాటి ఉద్దేశం ఎప్పుడు పెట్టుకోవాలి విక్రం? రుస్తుం వల్ల ఇక స్కామ్ కి పూర్తిగా తెర పడి,  ఆశ వదులుకున్నప్పుడు కదా? స్కామ్ వ్యవహారం ఇంకా నలుగుతూండగానే సింథియాని వూరికే వాడుకుని వదిలెయ్యడంలో అర్ధముందా- తనతో ఫోటోలు తీసుకుని బ్లాక్ మెయిల్ చేయడానికైతే ఆమెని ట్రాప్ చేయాలిగాని!  

        ఇంకొక సంగతేమిటంటే, ఫ్లాష్ బ్యాక్ లో చూపించే దాని ప్రకారం అసలు సింథియాని  విక్రం కి సెట్ చేసేది అతడి చెల్లెలు ప్రీతీనే. అప్పుడామె తన ప్లే బాయ్ అన్నకి అమ్మాయిల్ని సమకూర్చి పట్టే మనిషిలాగే అన్పిస్తుంది తప్ప, స్కామ్ లో ట్రాప్ చేయడానికి సింథియాని సెట్ చేస్తున్నట్టు అన్పించదు. 

        ఇలా ఏ పాత్ర ఉద్దేశాలూ లక్ష్యాలూ అక్కడ నెలకొన్న పరిస్థితిని బట్టి గాక, అనాలోచితంగా అడ్డగోలుగా  చిత్రణ చేశారు. కారణం- మామూలు భార్యా- భర్త- ప్రియుడు అనే కథకి  స్కామ్ ని తెచ్చి కలపడమే. సెకండాఫ్ లో స్కామ్ సంగతులు ఓపెన్ చేస్తూ పోయారే గానీ, అది రుస్తుం- సింథియా- విక్రం ల ట్రయాంగిల్లో   పొసగాలని ఆలోచించ లేదు.  

        కాబట్టి నేవీ స్కామ్ అనే ఫ్లాష్ బ్యాక్ తో కలిపి చూస్తే, ఈ బిగినింగ్ విభాగంలో కథ- ప్రాబ్లం సెటప్, తద్వారా ప్లాట్ పాయింట్ వన్ అన్నీ తప్పుల తడకగానే, తప్పుదోవ పట్టించడంగానే  తేలిపోతాయి.
***
    స్కామ్ కోణాన్ని పక్కన బెట్టి కాసేపు మామూలు భార్య- భర్త- మధ్యలో ప్రియుడు కథలా చూసినా కూడా ‘రుస్తుం’ లో చిత్రణ ఎంత అమెచ్యూరిష్ గా వుందో గత వ్యాసంలోనే చూశాం. రుస్తుం ఇంటికి వస్తే సింథియా రెండు రోజులుగా లేకపోవడం, ఆమె ఉత్తరాల వ్యవహారం, విక్రం బంగాళా కెళ్ళి రుస్తుం కేవలం వాళ్ళిద్దర్నీ చూసి రావడం, సింథియా వచ్చాక ఆమెని నిలదీయడం, అప్పుడు మాత్రమే వెళ్లి విక్రంని చంపడం అనే సీక్వెన్సు లో రుస్తుం వెళ్లి విక్రంని చంపడం అనే చర్య మినహా మిగతావన్నీ అర్ధం లేనివి. వీటిలో విక్రం బంగాళా కెళ్ళి విక్రంతో వున్న సింథియాని దీనంగా చూసి రావడమనే ఘట్టమైతే సహజ రియాక్షన్ కాదు. 

        నానావతి కేసు ఆధారంగానే  1973 లో గుల్జార్ తీసిన ‘అచానక్’ లో హీరో వినోద్ ఖన్నాది ఆర్మీ మేజర్ రంజిత్ పాత్ర. ఈ కథలో నాన్చుడు లేదు. మేజర్ రంజిత్  ఇంటికి తిరిగి రాగానే ప్రియుడితో భార్య కలిసి ఉండడాన్ని చూసి వాళ్ళిద్దర్నీ చంపేస్తాడు! డ్రామాలు, మెలోడ్రామాలు లేవు. 

        నానావతి కేసు ఆధారంగానే 1963లో ఆర్కే నయ్యర్ తీసిన   ‘యే రాస్తే హై ప్యార్ కే’ లో సునీల్ దత్ ది  పైలట్ అనిల్ సహానీ పాత్ర. నానావతికి ముగ్గురు పిల్లలుంటే సహానీకి ఇద్దరు పిల్లలుంటారు. నానావతి లాగే అనిల్  ఇంటికి తిరిగి వస్తే, నానావతి భార్య సిల్వియాలాగే అనిల్  భార్య ఆశ (లీలా నాయుడు) కూడా ముభావంగా వుంటుంది. ఆమెని మూడ్ లోకి తెచ్చుకునేందుకు నానా కామెడీలు చేస్తాడు అనిల్. మధ్యలో ఫోన్ మోగుతుంది. అనిల్  తీస్తే అవతలి గొంతు పలకదు. పెద్దగా పట్టించుకోడు. 

        ఆశా కోసం తను తెచ్చిన  బహుమతి బొమ్మ తాజ్ మహల్ ఇవ్వబోతే తీసుకోదు. అలమారలో పెట్టబోతే అడ్డుపడి ఆ బహుమతి తీసేసుకుంటుంది. అతను పిల్లల దగ్గరికి వెళ్లి పోతే అలమార తెరుస్తుంది. అందులో అలాటిదే బహుమతి  ఇంకోటి వుంటుంది. దాన్ని తీసి కిటికీలోంచి పారేసి దీన్ని పెడుతుంది. మళ్ళీ ఫోన్ మోగితే తనే తీస్తుంది. ఇందాక ఫోన్ చేసిన ఆమె ప్రియుడే  (రెహమాన్) ఆమెతో మాట్లాడేస్తాడు. వింటూ వుండి పోతే, ఒక్కసారి పిల్లల అరుపులు  వినబడతాయి. ఫోన్ పక్కన పెట్టేసి పిల్లల దగ్గరికి వురుకుతుంది. అక్కడ బొమ్మ తుపాకీతో కూతురి మీద కొడుకు కాలుస్తాడు. కూతురు చచ్చిపోయినట్టు నటిస్తుంది- తల్లికి  కంప్లెయింట్ చేస్తుంది. ఇటు అనిల్ వచ్చి ఇంకా ఎంగేజ్ లో వున్న ఆ ఫోనెత్తి వినేస్తాడు ...ఆశా ప్రియుడి మాటలు...

      అప్పుడు దాదాపు ఆశా గొంతు నులిమి చంపినంత పనిచేస్తాడు అనిల్.  ‘వాణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావా?వాడు నిన్ను ప్రేమిస్తున్నాడా?’  అనడిగితే,  ‘ముజే కుచ్ నహీ మాలూం’ (నాకేమీ తెలీదు) - అంటుంది. ఇప్పుడు నేనేం చెయ్యాలని తండ్రిని అడుగుతాడు- పిల్లల కోసం కలిసి వుండమంటాడు తండ్రి. కానీ ఇంత  ద్రోహం చేసిన స్నేహితుణ్ణి సహించలేక వెళ్లి చంపేస్తాడు అనిల్. 

       
అచానక్ లో చూసిన దృశ్యానికి సహజ రియాక్షన్ తో తక్షణ చర్య తీసుకుని ఇద్దర్నీ చంపేస్తే, ‘యే రాస్తే హై  ప్యార్ కే’  లో- సహజ రియాక్షన్ గా భార్య గొంతు నులిమి  చంపబోతాడు, తర్వాత వెళ్లి ప్రియుణ్ణి చంపేస్తాడు. ‘రుస్తుం’ లో, సింథియా విక్రం తో కలిసి వుండగా చూసిన రుస్తుం   ఎలాటి సహజ రియాక్షనూ  లేక వెలవెల బోతాడు. సహజ రియాక్షన్ కి పాత్రకి అవకాశమీయక పోతే అలాటి పరిస్థితిలోకి నెట్టనే కూడదు. 

       ఇక ‘రుస్తుం’ లో సింథియా ఉత్తరాలూ, ‘యే రాస్తే హై ప్యార్ కే’  లో ఆశా బొమ్మ తాజ్ మహల్ బహుమతుల సంగతి చూస్తే-  సింథియా ఇంట్లో పెట్టకున్న బోల్డు ఉత్తరాలతో, బహుమానాలతో  సన్నివేశాలూ పాత్రలూ ఎంత అయోమయంగా తయారయ్యాయో క్రితం వ్యాసంలో చూశాం. కానీ ఆశాకి ప్రియుడి నుంచి అన్నేసి బహుమతులూ వగైరా అందుకున్నట్టు వుండదు. ఒక్క తాజ్ బొమ్మే ఆమె అందుకుంది. భర్త ఇంటికి వచ్చే ముందు పెళ్లి చేసుకోనన్న ప్రియుడితో ఘర్షణ కూడా పడి -నీ సంగతి చూస్తా - అని తెగతెంపులు చేసుకుని వచ్చింది.  

        ఈ నేపధ్యంలో భర్త ఇంటికి వచ్చినప్పుడు ప్రియుణ్ణి వదిలించుకుంది గనుక ఇక ఏమీ ఎరగనట్టు కాపురం చేసెయ్యొచ్చు భర్తతో. కానీ ఆమె అంతరాత్మ ఒప్పుకోలేదు. అందుకే భర్త ఇంటికి వచ్చినప్పుడు ఆ అపరాధ భావంతో  మధన పడింది. విషయం తెలీని  అతడెన్ని కామెడీలు చేసినా,  సరే జరిగిందేదో జరిగిపోయింది మనం కూడా భర్తతో కామెడీగా బతికేద్దా మనుకోలేదు. సింథియా లాగా డబుల్ గేమ్ ఆడదల్చుకోలేదు. సిల్వియాలాగా ఒక నీతితో వుంది. అలమార లోని ప్రియుడి బహుమతి తీసి పారేసి, భర్త బహుమతినే  పెట్టుకోవడంలో ఇది తేటతెల్ల మవుతోంది. అంటే నానావతి భార్య సిల్వియా ప్రియుడితోనే ఫిక్స్ అయిపోయి భర్తకి చెప్పేస్తే, ఆశా భర్త తోనే ఫిక్స్ అయిపోయి భర్తకి చెప్పలేక మధనపడింది. ఆ ఫోన్ కాలే ఆమెని భర్తకి పట్టించింది. 

        ఇక్కడకూడా సన్నివేశ సృష్టిలో లోపముంది. ప్రియుడు మొదటి సారి కాల్ చేస్తే భర్త తీశాడు. రెండో సారి చేస్తే తనే తీసింది. భర్త ఇంట్లోవున్న అలాటి సమయంలో తను ప్రియుడి కాల్ అందుకో కూడదు  కదా? కట్ చేయాలి. పైగా అతడితో తెగతెంపులు చేసుకున్నాక  రెస్పాన్సే  ఇవ్వకూడదు. అతనేదో చెప్తూంటే వింటూ వుంటుంది. అంతలో పిల్లల కేకలు విన్పిస్తే ఫోన్ ని అలాగే వదిలేసి వెళ్ళిపోతుంది- ఇలా ఎవరైనా చేస్తారా? అంటే, పాత్ర బదులు ఇక్కడ కథకుడు ఎంటర్ అయ్యాడన్న మాట.  ఆమె చేత కావాలని ఇలా చేయించాడు- ఆమెని భర్తకి పట్టించడానికి ఇంతకంటే మార్గం తోచలేదు కాబోలు. 

      ఇక ఈ రెండు పాత హిందీ సినిమాల్లోనూ హీరో వెళ్లి చంపినప్పుడు,  ప్రియుడు టవల్ మీద వుండడు. ‘రుస్తుం’ లో మాత్రం నిజ ఘటనలాగే టవల్ మీద వుంటాడు. నానావతి ఎలా చంపాడో అలాగే చంపుతాడు. ఆతర్వాత పోలీసులకి లొంగిపోతాడు. 

         ఇక్కడ పాయింటేమిటంటే, ఆ రెండు పాత సినిమాల్లో హత్యకి మోటివ్ వివాహేతర  సంబంధమే. ఇంకెలాటి స్కాములూ వగైరాలతో తికమక లేని సూటి పాయింటే. నానావతి చంపడానికి కూడా మోటివ్ వివాహేతర  సంబంధం ఒక్కటే. 

        కానీ రుస్తుం విషయానికొస్తే,  అతడి మోటివ్ అనుమానాస్పదం.  వివాహేతర సంబంధమా, స్కామా? దేనికోసం చంపాడు? చంపినప్పుడు వెల్లడైన కథ వరకూ చూస్తే,  వివాహేతర  సంబంధమే కారణమన్పిస్తుంది. కానీ సెకండాఫ్ లో వెల్లడయ్యే  స్కామ్ రీత్యా చూస్తే మాత్రం స్కామ్ గురించి కూడా  చంపాడా అన్న కొత్త ప్రశ్న తలెత్తుతుంది. వివాహేతర సంబంధం- స్కామ్ రెండూ తోడై చంపాడనడం సరికాదు. ఒక కథకి రెండు పాయింట్లు, రెండు సమస్యలు వుండవు. కాబట్టి రెండు కారణాలూ తోడై చంపాడనడం ఎలాటి కథా  సూత్రాలకీ వ్యతిరేకం. 

        ఒకవేళ రెండు కారణాలూ తోడై చంపడం కూడా కథా సూత్రమే అనుకుంటే, దీనికి వ్యతిరేకంగా దొరికిపోయే చిత్రణ సన్నివేశంలోనే వుంది. నేవీ స్కామ్ కి సంబంధించి చంపితే దేశభక్తి కిందికి రావచ్చు. వివాహేతర  సంబంధం దృష్ట్యా చంపితే దేశభక్తి ఎలా అన్పించుకుంటుంది?  చివరికి దేశ భక్తుడి కలరిస్తూనే కథ ముగించారు. మొదటిది వృత్తిగతమైతే, రెండోది వ్యక్తిగతం. చంపడం నేవీ యూనీఫాం వేసుకెళ్ళి చంపాడు. వ్యక్తిగత కక్ష, అందునా వివాహేతర  సంబంధమనే కారణానికి యూనిఫాం వేసుకెళ్ళి చంపి -తన యూనిఫాంకి చెడ్డ పేరు తెచ్చుకోడు బాధ్యత గల అధికారి అయిన హీరో. విలన్ అయితే ఇలాటి పాడు పన్లు చేస్తాడు.  రుస్తుంకి  యూనిఫాం వేసుకెళ్ళి మరీ చంపాలనిపించిందంటే,   అతను భార్యా ద్రోహం కంటే కూడా విక్రం దేశద్రోహాన్నే ఎక్కువ ఫీలైనట్టని అర్ధం వస్తోంది. కాబట్టి రెండు కారణాలతోనూ చంపాడనే మాట నిలబడదు. 

        పోను పోనూ సెకండాఫ్ లో భార్యా ద్రోహమనే అసలు పాయింటు మరగున పడిపోయి-  విక్రం దేశద్రోహం తద్వారా రుస్తుం దేశభక్తీ అనే పాయింటే ఎలివేట్ అవుతుంది. సెకండాఫ్ లో రివీలయ్యే దాని ప్రకారం, చంపే ముందు ఢిల్లీ కి కాల్ చేసి విక్రంని వదలనని డిఫెన్స్ సెక్రెటరీతో అనడం, స్విస్ బ్యాంక్ ఎక్కౌంట్ ఓపెన్ చేయడం వగైరా చర్యలన్నీ వివాహేతర సంబంధానికి సంబంధించినవి కావుగా? ఇలా  మొదలెట్టిన భార్య వివాహేతర సంబంధం కథ కాస్తా భర్త దేశభక్తి కథగా మారి పోయిందన్న మాట! ఇది కూడా ఒక కథా సూత్రమే నంటే ఇక చెప్పేదేమీ వుండదు. 

        కాబట్టి కథకి కీలక మలుపు అనదగిన, అసలు కథ ప్రారంభ మయ్యే మజిలీ ప్లాట్ పాయింట్ వన్ దగ్గర – రెండు కారణాల్లో ఏదో ఒక్కటే ఎక్కువ ఫీలయ్యి చంపాడను కోవాలి-  అప్పుడది  దేశభక్తి. ఎందుకంటే యూనిఫాంలో వెళ్లి చంపాడు.
        అంటే విక్రంతో తన భార్య అలా తిరగడాన్ని రుస్తుం పెద్దగా సీరియస్ గా తీసుకోలేదా?

                                         ***
         ప్పుడు మిడిల్ కొస్తే, సింథియా పాత్రని ఎలాగైనా బాధితురాల్ని చేసి బయటపడెయ్యాలని విఫల యత్నం చేశారు కథలో. ఏమంటే విక్రమే ఆమెని మాయమాటలతో లొంగదీసుకున్నాడని చిత్రీకరణలు. ఈ చిత్రీకరణలో వర్షపు రాత్రి కారులో అతను హద్దుమీరుతూంటే తను ప్రతిఘటించాలి సింథియా. కానీ అలా చెయ్యదు. శుభ్రంగా మైకం కమ్మి లొంగిపోతుంది. యే రాస్తే హై ప్యార్ కే లో మత్తు మందు ఇచ్చి లొంగ దీసుకుంటాడు. కాబట్టి ఆశా  తప్పేం కన్పించదు. బాధితురాలని చెప్పొచ్చు. సింథియా ఎలా బాధితురాలవుతుంది?

          ప్లాట్ పాయింట్ వన్ దగ్గర రుస్తుం భార్య బాధితురాలనే ఫీలయ్యి వెళ్లి దేశభక్తితో విక్రం ని చంపివుంటే భార్యని క్షమిస్తున్నట్టే. కానీ అప్పట్నించీ ఆమెతో మాటలుండవు. మిడిల్ విభాగంలో ఆమె జైలు కొచ్చి కలిస్తే
ఈమెని నేను  రిసీవ్ చేసుకోలేననే బాడీ లాంగ్వేజ్ తో,  చేతులు వెనక కట్టుకుని బిగుసుకుపోయి నిలబడి ఉంటాడు. అప్పుడామె చెప్పే ఫ్లాష్ బ్యాక్ లో విక్రంతో ఆ వర్షపు రాత్రి ఏం జరిగిందో తెలుసుకుని గొప్ప సానుభూతితో, ప్రేమతో, చేతులు ముందుకు తెచ్చి అన్యాయ  మైపోయిన సింథియాని కావలించుకుంటాడు. ఇది సిల్లీగా అన్పించడం లేదూ - ఫ్లాష్ బ్యాక్ లో చూపించేది ఆమె ఏమాత్రం ప్రతిఘటించకుండా లొంగిపోవడం...నిజానికి అతణ్ణి నెట్టేసి కారు దిగిపోయి పరిగెత్తాలి వర్షం పడ్డా, పిడుగులు పడ్డా! కానీ అలా చెయ్యలేదు. తమకంతో శుభ్రంగా లొంగిపోయింది. దీనికి రుస్తుం ఈమె బాధితురాలని శుభ్రంగా నమ్మి ఫిక్స్ అయిపోయాడు- ఆమె చెప్పే కహానీలు ఇప్పుడెలా నమ్మాలన్పించిందో!

          మిడిల్ లో భార్యా భర్తల కథ ఇలా కొలిక్కి వచ్చి, అంతా స్కామ్ కథగానే సాగుతుంది. భార్యాభర్తల మధ్య సమస్య మొదలై కొలిక్కి వచ్చే వరకూ ఇద్దరి మధ్యా దాని తాలూకు మానసిక సంఘర్షణే కన్పించదు.
యే రాస్తే హై ప్యార్ కే లో ప్రధాన కథ ఇదే. భార్యాభర్తల సంబంధం ఇప్పుడేమవుతుందన్నదే. వాళ్ళు తమ సంబంధాన్ని పునర్నిర్వచించుకునేందుకు పడే మానసిక సంఘర్షణే. ఇంతా చేసి ముగింపుని చెడిన ఆడదానికి స్థానం లేదనే అర్ధంలోనే పాత్రని తప్పించారు. కోర్టులో భర్త నిర్దోషి అని తేలడంతో, భార్య తను చేసిన మోసం తట్టుకోలేకో మరెందుకో గుండాగి చనిపోతుంది. 'చెత్త' అనుకుని ఊడ్చేశాడన్న మాట దర్శకుడు!

         
అచానక్ లో ప్రియుడితో సహా భార్యనీ చంపెయ్యడంలో కూడా ఇదే అర్ధం కన్పిస్తుంది- చెడిన ఆడదానికి స్థానం లేదని. చంపిన హీరోకి ఉరి శిక్ష వేస్తారు. కానీ దర్శకుడు గుల్జార్ సాబ్ మరీ ఇంత పురుషపక్షపాతి అంటే  లోకం నమ్మదు. కనుక కాస్త పురుషాధిక్య భావాన్ని సడలిస్తున్నట్టు- హతురాలైన భార్య పాత్రకి కొంచెం సెంటిమెంటు జోడించి తన ఇమేజిని బ్యాలెన్సు చేసుకున్నారు గుల్జార్ సాబ్. చనిపోతూ భార్య - ఈ పవిత్ర మంగళ సూత్రాన్ని గంగానదిలో నిమజ్జనం చేయమని చివరి కోరిక కోరుతుంది భర్తని. కాబట్టి ఇప్పడు ఉరి శిక్ష పడ్డ భర్త జైల్లోంచి తప్పించుకుని, మంగళ సూత్రాన్ని గంగానదిలో నిమజ్జనం చేయడానికి పారిపోతాడు. పోలీసులు వెంట పడతారు. ఇలా చట్టం- సెంటి మెంటు అనే బలమైన డ్రామాతో సినిమా హిట్టయ్యింది. 

         
రుస్తుం లో చెడిన ఆడదాన్ని శిక్షించలేదని, ఈ సినిమా మహిళల్ని ఆకట్టుకుంటుందనీ   హీరో అక్షయ్ కుమార్ సెలవిచ్చాడు. చాలా హిందీ సినిమాల్లో భర్త తప్పు చేస్తే భార్య క్షమిస్తుందనీ, కానీ ‘రుస్తుం’ లో తప్పు చేసిన భార్యని  భర్త క్షమిస్తాడనీ, ఇందుకే ఈ సినిమాని మహిళలు బాగా ఇష్టపడి మరొక్క సారీ చూస్తారనీ, కాపురాలు ముక్కలవకుండా, విడాకులకి దారితీయకుండా ఈ సినిమా పరిష్కారం చూపిస్తుందనీ స్టేట్ మెంట్ ఇచ్చి పారేశారు! దీనికి రకరకాల అర్ధాలు తీసి ఎంజాయ్ చేస్తున్నారు నెటిజనులు!

-సికిందర్ 
 (next : నేవీ స్కామ్ నడక) 
http://www.cinemabazaar.in