రచన- దర్శకత్వం : జెనూస్ మహ్మద్
తారాగణం : దుల్కర్ సల్మాన్, నిత్యా మీనన్, శేఖర్ మీనన్, వినీత్, ప్రవీణ,
రాహుల్ మాధవ్ తదితరులు
మాటలు : శశాంక్ వెన్నెలకంటి, సంగీతం : గోవింద్ మీనన్, ఛాయాగ్రహణం : ప్రతీష్ వర్మ
బ్యానర్ : ఎన్ ఎస్ సీ మూవీస్ , నిర్మాత : ఎస్. వెంకటరత్నం
విడుదల : 26 ఆగస్టు, 2016
***
గత సంవత్సరం మణిరత్నం ‘ఓకే బంగారం’ తో తెలుగులో పరిచయమైన మలయాళ హీరో దుల్కర్ సల్మాన్
మరోసారి నిత్యా మీనన్ తో కలిసి నటిస్తూ తెలుగు ప్రేక్షకుల ముందు కొచ్చాడు.
మలయాళంలో గత సంవత్సరం విడుదలై ఓమాదిరిగా ఆడిన ‘100 డేస్ ఆఫ్ లవ్’ తెలుగులోనూ ఇదే
టైటిల్ తో డబ్ అయ్యింది. ప్రేమలో ఈ వంద రోజులేమిటి, ఏం జరిగింది, అసలా ప్రేమ ఏమిటీ అని యూత్ ని
టార్గెట్ చేస్తూ తీసిన ఈ రోమాంటిక్ కామెడీ కథా కమామిషేమిటో ఈ కింద చూద్దాం...

ప్రేమిద్దామని బయల్దేరిన గోపాల్ కి ప్రేమలో ఈ ఎదురుదెబ్బ తగిలి ఏం చేశాడూ అన్నదే మిగతా కథ. ఆమె పట్ల తనకున్న కోపం, ఆమెని ప్రేమిస్తున్న రాహుల్, ఆమె తల్లి దండ్రులు, స్వయంగా ఆమే....ఇన్ని ప్రతిబంధకాల్ని ఎలా నెగ్గుకొచ్చి ప్రేమని పండించుకున్నాడో తెలుసుకోవాలంటే వెండితెర మీద చూడాల్సిందే.
ఎలావుంది కథ
మూస ఫార్ములాలకి దూరంగా ఈ మాత్రం కూడా ప్రేమ సినిమాలు తెలుగులో రావడం లేదు గనుక,
ఈ నాన్ – ఫార్ములా లవ్ కథ ఫ్రెష్ గానే అన్పిస్తుంది. మన పేరెంట్స్ కాలంతోనే పవిత్ర
ప్రేమలు ఎండ్ అయ్యాయని, ఇప్పుడు ప్రేమలతో
ప్రాక్టికల్ గా వుండాలని ఈ కథలోనే హీరోయిన్ చెప్పే మాటలు- మన తెలుగు ప్రేమ
సినిమాలకి కొరడా చరుపులాగే వుంటాయి.
తెలుగు సినిమాల్లో యువజంటలకి ఇంకా పాత చింతకాయ పవిత్ర ప్రేమలే కదా
అంటగడుతున్నది! అయితే పూర్తిగా ఇది ఆధునిక
ప్రేమ కథైతే కాదు. ఆధునిక జీవితంలో ప్రేమికులెదుర్కొనే సమస్యలతో నైతే ఇది లేదు.
అదే పాత స్కూలునాటి పరిచయం, అదే ఆనాటి పాత టైపు ఫీలింగు (కోపం) తో పునః పరిచయం,
స్వాతంత్ర్యాన్ని కోరుకునే హీరో, ప్రాక్టికాలిటీ పేరుతో పెళ్ళితో జీవితానికి
భద్రతని కోరుకునే పాత కాలం నాటి హీరోయిన్ – ఈ ఫార్ములా దినుసులు లేకపోలేదు. అయితే
వీటిని పునాది రాళ్ళుగా పెట్టుకుని కథనాన్ని మాత్రం నాన్- ఫార్ములాగా కొత్త
పోకడలతో కొనసాగించాడు దర్శకుడు.

ప్రతీష్ వర్మ ఛాయాగ్రహణం బ్రౌన్ టింట్ తో, డిమ్ లైటింగ్స్ తో స్టయిలిష్ గా వుంది. కథనానికి తగ్గ విజువల్స్ తో యూత్ ఫుల్ గా వుంది. అలాగే గోవింద్ మీనన్ సంగీతంలో పాటలు కూడా. శశాంక్ వెన్నెలకంటి మాటలు –తక్కువ పదాల్లో ఎక్కువ అర్ధాన్ని పలికాయి. దర్శకుడు జెనూస్ మహ్మద్ దర్శకత్వంలో, విజువల్ సెన్స్ లో మంచి ప్రావీణ్యం చూపించాడు గానీ, రచన సైడ్ జాగ్రత్త తీసుకోలేదు.
స్క్రీన్ ప్లే సంగతులు
విషయం తగ్గినప్పుడు కాలక్షేపం ఎక్కువవుతుంది. విషయాన్ని
పెంచలేని కథలుంటే ఇంతే. చాలినంత విషయముంటే ఇంటర్వెల్ లోపే కథలోకి ప్రవేశించవచ్చు.
లేనప్పుడే ఇంటర్వెల్ వరకూ సాగదీయాల్సి వస్తుంది కాలక్షేప పురాణాన్ని. ఈ సిన్మాలో
ఇంటర్వెల్ దాకా సాగే కాలక్షేప పురాణమేమిటంటే, టాక్సీ ఎక్కి మాయమైపోయిన హీరోయిన్ ని
వెతుక్కోవడమే. ఇంటర్వెల్ దాకా వెతుక్కుంటారు. హీరోయిన్ దొరికితేనే కదా కథ
మొదలయ్యేది. హీరోయిన్ ఇంటర్వెల్ లోపే దొరికిపోతే అక్కడే కథ ప్రారంభిస్తే –చివరివరకూ
లాగలేనంత అతి సన్నని, బలహీన పాయింటుతో
వుంది కథ మరి. ఆ పాయింటు హీరోయిన్ మీద హీరో చిన్ననాటి కోపం!
చాలా సులభంగా హీరోయిన్ని కనుక్కునే అవకాశం వున్నా ఎక్కడ అప్పుడే కథ మొదలెట్టాల్సి వస్తుందోనన్న భయంతో సాగదీశాడు వేట దర్శకుడు. హీరో జర్నలిస్టు అయినప్పుడు సింపుల్ గా- ఆమె పోగొట్టుకున్న ఫోటోలూ కెమెరా తనకి దొరికాయని పేపర్లో ప్రకటన వేయిస్తే చాలు. అతను ఈ పనిచెయ్యక పోగా, ఆమె కూడా విలువైన వాటిని పోగొట్టుకుని సైలెంట్ గా ఉండిపోతుంది. ఆమె అయినా వాటిని పోగొట్టుకున్నట్టు పేపర్లో వేయిస్తే ఎప్పుడో హీరో పరిగెత్తుకుంటూ వెళ్లి ఇచ్చేసే వాడు! ఇలా చెయ్యక ‘ఈమె తెలుసా?’ అని ఫోటోలు పట్టుకుని మనిషి మనిషినీ అడుగుతూ తిరుగుతాడు.
టాక్సీలో ఆమెని చూసినప్పుడు ప్రేమలో పడ్డం, క్లయిమాక్స్ దగ్గర ఆమెకి ఎంగేజ్ మెంట్ అయినప్పుడు ప్రేమని పోగొట్టుకోవడం- ఈ రెండు ప్లాట్ పాయింట్స్ మాత్రం బాగా కుదిరాయి. అలాగే ముగింపూ ఫన్నీగా వుంది. హీరో హీరోయిన్లవి వేర్వేరు వ్యక్తిత్వాలు. అతను కార్టూన్లని నమ్ముకోవడంతో అయినవాళ్ళందరికీ దూరమై ఏకాకిగా బతుకుతున్నాడు. ఆయిన వాళ్ళందరూ వేరే వృత్తుల్లో జీవితంలో పైకొచ్చారు. కార్టూన్లని నమ్ముకున్న తను పనిచేస్తున్న పత్రికలో కూడా ఇమడలేకపోయాడు. సొంతంగా ఒబామా మీద కార్టూన్లేసి సోషల్ మీడియాలో పెట్టడంతో, అవి ఒబామా దృష్టిలో పడి ట్వీట్లు చేశాడు. దీంతో అంతర్జాతీయ పబ్లిషర్లు హీరో వెంట పడ్డారు... ఇంకేముంది రిచ్ అయిపోవడమే...
హీరోయిన్ ప్రేమని ప్రాక్టికల్ గా చూడాలని, అందం చందం- డబ్బు దస్కం వున్న వాణ్ణి చేసుకుని స్థిరపడాలనీ అనుకుంటుంది. కార్టూన్లని నమ్ముకున్న కళాకారుడు హీరోని జీవితంలో పరాజితుడిగా చూస్తుంది. నేను పరాజితుణ్ణి అయినా ఒరిజినల్ ని – అంటాడు హీరో. నువ్వు పెళ్లి చేసుకుంటున్న వాడు ఒరిజినల్ కాదంటాడు. నీకు ఒరిజినాలిటీ కావాలో, వాడి దగ్గర జీవితానికి భద్రతే కావాలో తేల్చుకొమ్మంటాడు. ఈ విధంగా ప్రేమలో పాత ఫార్ములా విషయాన్నే కొత్త కాంటెక్స్ట్ లో పెట్టి చెప్పడంతో కథనం, పాత్రలూ బూజు వదిలించుకున్నాయి.
-సికిందర్
http://www.cinemabazaar.in
http://www.cinemabazaar.in
-