రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

13, జూన్ 2019, గురువారం

841 : స్క్రీన్ ప్లే సంగతులు


'కిల్లర్’ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే చేశారు. నాన్ లీనియర్ అంటేనే ఫ్లాష్ బ్యాకులతో వుండేది. ఇది ఒక ఫ్లాష్ బ్యాక్ గా వుండొచ్చు, అనేక ఫ్లాష్ బ్యాకులుగానూ వుండొచ్చు. ‘కిల్లర్’  లో ఒకటికంటే ఎక్కువ హత్యలతో వేర్వేరు కథలున్నాయి. దీంతో ఒకటి కంటే  ఎక్కువ, అంటే మల్టిపుల్ ఫ్యాష్ బ్యాక్యులతో కూడిన నాన్ లీనియర్ కథనం ఏర్పాటయింది. వీటిలో రెండు హత్యలకి సంబంధించి ప్రెజెంట్ టైం కథనంలో రెండు సమాంతర కథనాలు వుంటాయి. అంటే మొత్తంగా చూస్తే మల్టిపుల్ మర్డర్స్ కి, మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకులతో, నాన్ లీనియర్ కథనమన్న మాట. ఇలా ఇంతటి సంక్లిష్టతతో మల్టీపుల్ మర్డర్స్ మిస్టరీలని, మల్టీ పుల్ ఫ్లాష్ బ్యాకులతో, నాన్ లీనియర్ కథనం చేసినప్పుడు, కథలో లాజిక్కులు మిస్సయిపోయాయి. అసలు కథకి పునాది వంటి మౌలిక అంశమే  గల్లంతై పోయింది. ఇవి పైకి మామూలు కంటికి కనపడవు. ఎందుకంటే ప్రేక్షకులకి ఫ్లాష్ బ్యాకుల్ని జోడించుకుని చూడంతోనే, కాలంలో ముందుకూ వెనక్కీ అవుతున్న కథనాన్ని అతికించుకుంటూ ఫాలో అవడంతోనే సరిపోతుంది. లోపాలు తెలిసేంత అవకాశం వుండదు. 

          కానీ లాజిక్కే, కామన్ సెన్సే  హత్య కేసు దర్యాప్తు కథల్ని నడిపేది. క్లూస్ ఆధారంగా గొప్ప విశ్లేషణలు చేస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నప్పుడు లాజిక్ ని ఎగేసి, కామన్ సెన్సు లేకుండా ప్రవర్తిస్తే, ఆ దర్యాప్తు అధికారుల పాత్రలు హాస్యాస్పదంగా వుంటాయి. ఫార్ములా కథలకి లాజిక్కులు అవసరం లేని సృజనాత్మక స్వేచ్ఛ తీసుకోవచ్చేమో. మాస్, యాక్షన్, అడ్వెంచర్ తదితర కథలని ఫార్ములా కథలుగా తీస్తున్నప్పుడు కథనంలో లాజిక్ అవసరం లేకపోవచ్చేమో (వుంటే చాలా మంచిది). హత్య దర్యాప్తు కథలు వేరు. వీటిని లాజిక్ లేకుండా ఫార్ములా కథలుగా చేస్తే సిల్లీగా వుంటాయి. ఫార్ములా కథల్లో హీరో ఎడాపెడా చంపేస్తే కేసు కాదు, కథ అది కాదు కాబట్టి. దర్యాప్తు కథల్లో ఒక హత్యయినా సరే, అదే కథవుతుంది. హంతకుణ్ణి పట్టుకోవడానికి ఆ హత్యని కూలంకషంగా శోధించి, మూల్యాంకన చేసి, నేరాన్ని రుజువు చేయడం వుంటుంది. 

          టీవీలో ఎఫ్ఐఆర్, సిఐడి లవంటి క్రైం ఇన్వెస్టిగేషన్ షోలు చూస్తే అవెంత ప్రొఫెషనల్ గా, పక్కాగా వుంటాయో తెలుస్తుంది. ఈ టీవీ షోల స్థాయిని సినిమాలు అందుకోలేకపోవడం ప్రొఫెషనల్స్ గా వుండే నేటి నయా మేకర్ల కాలంలో చాలా బ్యాడ్. సినిమా అనగానే కథతో చులకన భావం, అలసత్వం. ఇలా వుంటే సరిపోతుందిలే నని చుట్టేయడం. పోలీస్ ప్రోసీజురల్ జానర్ గురించి జ్ఞానం లేకపోయినా వాటిమీద చేతులు వేయడం. పోలీసు పాత్రల్ని తమలాగే తెలివి తక్కువ వాళ్ళుగా చిత్రించుకోవడం. 

          నేరస్థుడు తప్పే చేస్తాడు. తప్పు చేసి కూర్చుంటాడు. ఆ తర్వాత వాడికి ఏ బాధ్యతా లేదు. జీతాలు తీసుకుంటున్న పోలీసులకే బోలెడు పని పెడతాడు. వాడొక్క క్షణంలో నేరం చేసేసి కూర్చుంటాడు. అది రుజువు చేయడానికి పోలీసులకి క్షణాల మీద క్షణాలు లక్షల క్షణాలు పడతాయి. వాడు బుర్ర లేకుండా నేరం చేసినా రుజువు చేయాలంటే ఎన్నో బుర్రలు మంటెక్కి పోతాయి. ఇలా సినిమాల్లో జరుగుతుందా? ఊహుఁ, బుర్ర వాడకుండా మాట్లాడుతూంటారు పోలీసులు. ‘కిల్లర్’ లో అర్జున్, నాజర్ ల పోలీసు పాత్రలు – ఉన్నత పోలీసు అధికారుల పాత్రలు! – బుర్ర లేకుండా మాట్లాడుతూంటాయి. కిల్లర్ అయిన విజయ్ ఆంటోనీ యేమో హయిగా  కూర్చుని చూస్తూ వుంటాడు...

          ఈ కథకి మూలం విజయ్ ఆంటోనీ మాజీ ఐపీఎస్ అధికారి పాత్ర. అతడితోనే కథ మొదలవుతుంది. అలాంటప్పుడు అతడి బ్యాక్ గ్రౌండ్ ఆధారంగా ఆలోచించాలి, కథ చేయాలి. రెండేళ్ళ క్రితం అతడి భార్య హత్యకి గురైన విషయమే తెలియనట్టు ఐపీఎస్ పాత్రలైన అర్జున్, నాజర్ లు కేసు దర్యాప్తు చేస్తూంటే ఎలా వుంటుంది? ఐపీఎస్ భార్య హత్యకి గురైతే ఐపీఎస్ వర్గాలకి తెలియక పోతుందా? పెద్ద న్యూస్ కాకుండా పోతుందా? ఆమె ఎలా వుండేదో ఆ రూపం గుర్తుండక పోతుందా? అప్పుడు అచ్చం ఆమెని పోలిన హీరోయినే ఇప్పుడు కన్పిస్తూంటే, అదీ విజయ్ ఆం టోనీతోనే వుంటే, ఇదేమిట్రా బాబూ అన్పించదా, సినిమా చూస్తున్న మనకే అన్పిస్తూంటే? 

          కథకి పునాది అయిన ప్రశ్నార్థకమైన ఈ మౌలికాంశం మల్టీపుల్ మర్డర్స్ తో, మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకుల నాన్ లీనియర్ (ఎంఎంఎన్) కథనంలో పైకి కనపడకుండా పోయింది. ఇంకా అనేక తప్పులు కూడా మరుగున దాగి వున్నాయి. ఎంఎంఎన్ లాంటి కథకి స్క్రీన్ ప్లే సంగతులు రాయాలంటే, ఆ నాన్ లీనియర్ ఆర్డర్ నే కార్డుల మీద రాసుకుని, వాటిని లీనియర్ గా ఆర్డర్ లో పేర్చుకుంటూ రావాలి. ఇలా చేయడానికి రెండో సారి సినిమా చూడాల్సి వచ్చింది. లీనియర్ ఆర్డర్ లో పేర్చుకుంటే,  కథ ఎప్పుడు ఎక్కడ మొదలై ఎలా కొనసాగిందో ఆద్యంతాలు స్పష్టంగా తెలుస్తాయి. ఇలా లీనియర్ ఆర్డర్ గా సీన్లని విడగొట్టి చూసినప్పుడు కథకి పునాది వేసిన మౌలికాంశంతో బాటు, మరికొన్ని పాత్రలకి, కథనానికీ అడ్డుపడే లాజిక్కులు బయటపడ్డాయి. సినిమాయే కదా అని దర్యాప్తు కథలకి సృజనాత్మక స్వేచ్ఛ తీసుకుంటామంటే చెల్లదు. దర్యాప్తు కథలంటేనే ప్రేక్షకుల మెదడుకి మేత వంటివి. మెదడుకి శ్రమ పెట్టేవి. అవి సవ్యంగా వుండి తీరాలి.

          ఏ సినిమా అయినా రెండుసార్లు చూసి రివ్యూలు రాయమంటారు నిపుణులు. ప్రింట్ మీడియా కాలంలో ఒకసారి చూసినా ఆలోచించి రాయడానికి వారం టైం వుండేది. ఆన్ లైన్ల కాలంలో గంటలో రాసేయాల్సిన పరిస్థితి. రెగ్యులర్ సినిమాలకి రాసేయ్యొచ్చు. ‘కిల్లర్’ లాంటి  నాన్ రెగ్యులర్ సంక్లిష్ట సినిమాలకి కష్టం. ఇలా స్క్రీన్ ప్లే సంగతులు రాసినప్పుడే అసలు సిసలు స్థితిగతులు తెలుస్తాయి. 

          ముందుగా లీనియర్ గా కథెలా వుందో చూద్దాం...