రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

10, నవంబర్ 2015, మంగళవారం



కథ- దర్శకత్వం : రాజ కిరణ్
తారాగణం : కలర్స్ స్వాతి, నవీన్ చంద్ర, రావు రమేష్, సప్తగిరి, ధన్ రాజ్, జయప్రకాష్ రెడ్డి
స్క్రీన్ ప్లే : కోన వెంకట్, వెలిగొండ శ్రీనివాస్, మాటలు : రాజ్
సంగీతం : కమ్రాన్, కెమెరా : రవికుమార్ శానా, ఎడిటింగ్ : ఉపేంద్ర
బ్యానర్ : జీ మీడియా, నిర్మాతలు : ఎ. చినబాబు, ఎం, రాజశేఖర్
విడుదల : 6 నవంబర్, 2015

***
దెయ్యాలు నవ్వించే హార్రర్ కామెడీల ట్రెండ్ లో ‘గీతాంజలి’ అనే హిట్ తీసిన దర్శకుడి మరో ప్రయత్నం ‘త్రిపుర’. ఓ మర్డర్ మిస్టరీని కూడా కామెడీని జోడించి ప్రకటించు కున్నట్టు హార్రర్ థ్రిల్లర్ గా  చెలామణి చేయవచ్చా? అన్న ప్రశ్నని  రేకెత్తిస్తూ తెరకెక్కిన ఈ సినిమాలో, మళ్ళీ కలలు నిజమయ్యే సైకలాజికల్ అంశమంటూ కూడా జోడించి, కాక్ టెయిల్ జానర్ గా తయారు చేశారు. ప్రధానంగా మర్డర్ మిస్టరీ, ఇంకో కలలు నిజమయ్యే సైకలాజికల్ పాయింటు, చివర్లో పిసరంత హార్రర్, మధ్య మధ్యలో వీటితో సంబంధం లేని కామెడీ అన్న కలగూరగంపగా తయారైన  ‘త్రిపుర’ లో,  టైటిల్ పాత్ర పోషిస్తూ కలర్స్ స్వాతి కొంతకాలం గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాత్రపరంగా కాస్త లావెక్కినట్టు కన్పించే స్వాతి తో మొత్తం గా సినిమా ఎలా తెరకెక్కిందో ఈ కింద చూద్దాం..

 కథేమిటి
        కాస్త కొంటెతనం, ఇంకాస్త అల్లరి ఎక్కువున్న పల్లెటూరి అమ్మాయి త్రిపుర ( కలర్స్ స్వాతి). టెన్త్ చదివిన ఆమెకి పెళ్లి సంబంధాలు తప్పి పోతూంటాయి. ఆమెకో మానసిక సమస్య వుంటుంది. ఆమె కేదైనా కల వస్తే అది మంచిదైనా చెడ్డదైనా నిజమవుతుంది. దీంతో  గ్రామ ప్రజలు తమ ‘జాతకాలు’ చెప్పించుకోవడానికి ఇంటి ముందు క్యూ కడుతూంటారు. విసిగిపోయిన ఆమె తండ్రి ఇలా కాదని సైకియాట్రిస్టుకి  చూపించేందుకు హైదరాబాదుకి తీసుకొస్తాడు. కలల మీద పరిశోధన చేసే  సీనియర్ డాక్టర్ ( రావు రమేష్)  త్రిపుర కేసు తీసుకుని మరో డాక్టర్ నవీన్ (నవీన్ చంద్ర) కి  అప్పగిస్తాడు. త్రిపురకి ట్రీట్ మెంట్ చేస్తున్న నవీన్ ఆమెని ప్రేమించడం ప్రారంభిస్తాడు. మొదట ఆమె తండ్రి ఒప్పుకోకపోయినా తర్వాత ఒప్పుకుని పెళ్లి జరిపించేస్తాడు. త్రిపురని తీసుకుని హైదరాబాద్ లో కాపురం పెడతాడు నవీన్. త్రిపురకి ఆ కలలు రావడం మానవు. నవీన్ కో ఫాం హౌస్ వుంటుంది. ఆ ఫాం హౌస్ కెళ్ళిన బ్రోకర్ చనిపోవడాన్ని ఆమె కలలో చూస్తుంది. అంతేగాక  తను నవెన్ ని పొడిచినట్టు కూడా కల వస్తుంది. నవీన్ ఆందోళన చెందుతాడు.

        ఆ ఫాం హౌస్ ని అమ్ముడుపోవాలంటే,  అందులో మనం వారం పాటు  వుండాలని నవీన్ త్రిపురతో ఆ ఫాం హౌస్ లో మకాం వేస్తాడు. అప్పుడు త్రిపురకి కన్పించకుండా పోయిన నవీన్ కొలీగ్ ఈషా (పూజ)  కేసు గురించి తెలుస్తుంది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సీఐ,  నవీన్ ని అనుమానిస్తూంటాడు. త్రిపుర అదగె ప్రశ్నలకి  నవీన్ ఏ సమాధానమూ చెప్పకుండా దాట వేస్తూంటాడు. ఇక తనే ఈషా గురించి తెలుసుకునే ప్రయత్నాలు ప్రారంభిస్తుంది...
ఈషా అసలేమైంది, ఈమె అదృశ్యానికీ నవీన్ కీ వున్న సంబంధం  ఏమిటి, చివరికి సీఐ చేస్తున్న దర్యాప్తు ఏ  మలుపులు  తిరిగింది...మొదలైన సందేహాలు తీరాలంటే మిగతా కథ వెండి తెర మీద చూడాల్సిందే. 

ఎలావుంది కథ
        ఇదొక ప్యూర్ మర్డర్ మిస్టరీ. కథా ప్రారంభంలోనే ఒక హత్య జరుగుతుంది. కానీ ఆ శవం దెయ్యమై రాదు. దాదాపు రెండు గంటల సమయం గడిచిపోయాక,  సెకండాఫ్ లో మాత్రమే  సప్తగిరీ-  -జయప్రకాశ్ రెడ్డి ల ఓ కామెడీ సీన్లో  పనిమనిషి రూపం లో వున్న దెయ్యం కన్పిస్తుంది. ఆతర్వాత ముగింపులో ఓ సీన్లో  రెండు నిమిషాల్లో తన పగ దీర్చుకుని వెళ్ళిపోతుంది. కాబట్టి  ముందే చెప్పుకున్నట్టు ఇది హార్రర్ కథా కాదు, హార్రర్ థ్రిల్లర్  అంతకన్నా కాదు. కేవలం ఓ హత్య చేసిన హంతకుడెవరన్న మిస్టరీ కథగానే ఇది తేలుతుంది. దీనికి హీరోయిన్ కలల్తో సంబంధం పెట్టారు గానీ- ఆ కలలకి మర్డర్ మిస్టరీతో గానీ అసలు మర్డర్ జరగడానికి గానీ ఎ సంబంధమూ లేదు. దర్శకుడు నీలకంఠ తీసిన ‘మాయ’, కన్నడ హీరో ఉపేంద్ర తెసిన ‘న్యూస్’ ఏ కసూత్రతతో తీసిన కేవలం ‘కలల’ కథలుగానే వుంటాయి. ‘త్రిపుర’ కి అనేక జానర్ల అతుకులు వేయడంతో ఈ బరువంతా మోస్తూ గమ్యం లేని ప్రయాణం చేస్తున్నట్టు తయారయ్యింది సినిమా. అందుకే నిడివి కూడా రెండున్నర గంటలు తెగసాగింది.

ఎవరెలా చేశారు 

       కలర్స్ స్వాతి మొదట్లో కన్పించిన తెలివైన కొంటె పిల్లగా తర్వాత కన్పించదు. పాత్రలో పెప్ లేకపోవడం వల్ల, అదొక టైటిల్ పాత్రగా, టైటిల్ ని బట్టి అన్పించే  హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాగా అన్పించదు. కథ హీరోయిన్ దా, హీరోదా అన్న సందిగ్ధత ఒకటి. ప్రధాన పాత్రగా తనకున్న కలల సమస్యతో కథని నడిపించాల్సిన స్వాతి, అదేమీ పట్టకుండా పాసివ్ గా మారిపోవడంతో నటన కూడా ఆ మేరకు డల్ గానే తయారయ్యింది. పెళ్ళవగానే అమాయక గృహిణి పాత్రగా ఆమె మారిపోవడం ఈ సినిమాకి నష్టదాయకమే. పెళ్ళవక ముందు ఉన్నంత ఫన్నీగానే ఆమె కొనసాగివుంటే ఇది ఏదో రకమైన కామెడీ అన్పించుకునేది. కేవలం కమెడియన్లు కామెడీ చేసినంత మాత్రాన ఏ సినిమాయైనా కామెడీ సినిమా అన్పించుకుంటుందా? 

        నవీన్ చంద్ర ది  చాలా సాఫ్ట్ రోల్. కాకపోతే ఎక్స్ ప్రెషన్స్  పలకని ఫేస్ తో ఎప్పుడూ ఒకేలా చూస్తాడు, నటిస్తాడు. రావు రమేష్ వుండే రెండు మూడు సీన్లలో ఎటువంటి ప్రభావమూ చూపలేదు. కలల మీద పరిశోధన చేస్తున్నప్పుడు నిజానికి ఎ పాత్రకి హీరోయిన్ తో చాలా పని వుండాలి. నామ్ కే వాస్తే లెక్చర్లు ఇచ్చి వెళ్ళిపోయే పనైతే ఈ పాత్రే అవసరం లేదు.  పరిశిఒశన చేస్తున్నప్పుడు నిజానికి హీరోయి పాత్రతో తనకి చాలా పని వుండాలి. ఇక కథతో సంబంధంలేని ఫుల్ లెన్త్ కామెడీ తో సప్తగిరీ, సెకండాఫ్ లో వచ్చి కామెడీ చేసే జేపీ- శకలక శంకర్ ఈ ముగ్గురే సినిమా పెట్టే సహన పరీక్ష నుంచి కాస్త రిలీఫ్ నిస్తారు.

       ఇకపోతే ఈ సినిమాకి కోన వెంకట్, వెలిగొండ  శ్రీనివాస్ లు స్క్రీన్ ప్లే రాశారు. ఏ  టైపు కథనేది స్పషత లేకపోవడం వల్ల  కాబోలు స్క్రీన్ ప్లే బలహీనంగా తయారయ్యింది. ఒక్క ముక్కలో ఇది మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే. దాదాపు రెండు గంటలు గడించిన తర్వాత గానీ, నడుస్తున్న కథ పాయింటుకి వచ్చి అసలు కథ ప్రారంభం కాదు. మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లేల్లో ఇంతసేపూ నడిచేది కేవలం ఉపోద్ఘతమే నన్నమాట. ఏఎ ప్రాథమిక అంశం తెలుసుకోకుండా రాసుకుపోవడం వల్ల వచ్చిన ఇబ్బంది ఇది. ఇలాటి స్ట్రక్చర్ తో వచ్చిన సినిమాలు హిట్టయిన సందర్భాలు లేవు. ఇక రాజా రాసిన డైలాగుల్లో కామెడీ డైలాగులు బావున్నాయి.

        చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి వంటి సీనియర్లు పాటలు రాసినప్పటికీ అవి కమ్రాన్ సంగీతంలో అలరించే బాణీల్లో లేకుండాపోయాయి. అసలు పాటలు ఈ  సినిమాకి అక్కరలేదు. ఈ తరహా సినిమాకి కెమెరా వర్క్ లో లైటింగ్ తో తీసుకు రావాల్సిన ఎఫెక్స్ట్ తీసుకురాలేక ఫ్లాట్ లైటింగ్ తో సరిపెట్టారు. 

స్క్రీన్ ప్లే సంగతులు