రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

28, ఆగస్టు 2022, ఆదివారం

1198 : రివ్యూ!

రచన - దర్శకత్వం : పూరీ జగన్నాధ్
తారాగణం : విజయ్ దేవరకొండ,  అనన్యా పాండేరమ్య కృష్ణఅలీరోణీత్ రాయ్విషు రెడ్డిమార్కండ్ దేశ్ పాండేమైక్ టైసన్
సంగీతం : సునీల్ కశ్యప్తనీష్ బాగ్చీఛాయాగ్రహణం : విష్ణు శర్మ
బ్యానర్స్ : ధర్మా ప్రొడక్షన్స్,  పూరీ కనెక్ట్స్ఏఏ ఫిల్మ్స్
నిర్మాతలు :  కరణ్ జోహార్పూరీ జగన్నాధ్ఛార్మీ కౌర్అపూర్వా మెహతా
విడుదల :  25 ఆగస్టు, 2022
***

            రెండేళ్లుగా ప్రేక్షకులెంతగానో ఎదురు చూసిన రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ లైగర్’ మొత్తానికి విడుదలైంది. అర్జున్ రెడ్డి’ తో సూపర్ ఫేమస్ అయిన విజయ్ దేవరకొండ ఇప్పుడు లైగర్ తో కొత్త జోన్ లోకి ప్రవేశించాడు. పానిండియా జోన్. ప్రమోషన్స్ లోనే నార్త్ లో అసంఖ్యాక ఫ్యాన్స్ ని సంపాదించుకుని బాలీవుడ్ నే ఆశ్చర్య పర్చాడు. ఇలాటి విజయ్ పూర్తిగా గల్లీ మాస్ క్యారక్టర్ తో పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో బిగ్ బ్యాంగ్ ఇచ్చేందుకు కిక్ బాక్సర్ గా విచ్చేశాడు హీరోయిన్ అనన్యా పాండేతో కలిసి. ప్రేక్షకులకి బోనస్ గా వరల్డ్ ఛాంపియన్ మైక్ టైసన్ ని కూడా తారాగణంలో భాగంగా చేర్చారు. తెలుగులో తొలి మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ మూవీగా నమోదు చేశారు. అయితే ఇంతా చేసి ఇది ఫ్లాప్ అయితే ఏమిటి పరిస్థితి అని కూడా పూరీ సహా నిర్మాతలే అనుకోవడం కొసమెరుపు. ఈ అనుమానం ఎందుకొచ్చినట్టుమూవీని అంత తేడాగా తీశారాతీస్తే రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ పానిండియా కలలేమవుతాయిభవిష్యత్తు ఏమవుతుందిముందుగా కథలోకి వెళ్ళి చూద్దాం...

కథ

సింహానికీపులికీ పుట్టిన క్రాస్ బ్రీడ్ గా చెప్పుకునే కరీంనగర్ కి చెందిన లైగర్ (విజయ్ దేవరకొండ) ముంబాయిలో చాయ్ అమ్మి జీవనం సాగించే తల్లి బాలామణి (రమ్యకృష్ణ) తో వుంటాడు. తనకి నత్తి వుండడం వల్ల అవమానాలు పడుతూంటాడు. బాలామణి భర్త ఫైటర్ గా ఛాంపియన్ కావాలన్న కలలు నెరవేరక ముందే చనిపోయాడు. అందుకని కొడుకుని మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎంఎంఏ) వరల్డ్ ఛాంపియన్ గా తీర్చిదిద్దాలని తీసుకుని ముంబాయి వచ్చింది. ఇక్కడొక ట్రైనర్ (రోణిత్ రాయ్) దగ్గర ట్రైనింగ్ కి చేర్పించింది. అయితే లక్ష్యం నెరవేరే వరకూ అమ్మాయిల జోలికి పోవద్దని షరతు పెట్టింది. కానీ తాన్యా (అనన్యా పాండే) అనే డబ్బుగల అమ్మాయి లైగర్ ఫైటింగ్ స్కిల్స్ ని చూసి వెంటపడి ప్రేమిస్తుంది. తనూ ప్రేమిస్తాడు. ఒకానొక ఘట్టంలో అతడికి నత్తి వుందని వదిలేస్తుంది. దీంతో ప్రేమలో దెబ్బతిన్న లైగర్ లక్ష్యం కూడా చిక్కుల్లో పడుతుంది.

ఇప్పుడేం చేశాడు లైగర్తల్లికిచ్చిన మాట నిలబెట్టుకున్నాడావిఫల ప్రేమలోంచి కోలుకుని వరల్డ్ ఛాంపియన్ అయ్యాడాతాన్యా ప్రేమని గెల్చుకున్నాడాఇదీ మిగతా కథ. 

ఎలావుంది కథ

సినిమా ప్రారంభంలో లైగర్ తన కథ చెప్పుకోవడం మొదలెడుతూ, ‘నాకు కథ చెప్పడం రాదుట్రై చేస్తాను’ అంటాడు. తీరా షో పడ్డాక కథ చెప్పడం ట్రై చేస్తే ప్రేక్షకులు వూరుకుంటారా? సినిమా తీయక ముందే నేరేషన్ ఇచ్చుకోవడం ట్రై చేయాలి గాని. అన్నట్టే అతడికి కథ చెప్పడం రాలేదు. ఏం కథ చెప్పాడో అర్ధం గాదు. ఈ కథ అసలెందుకు బాగాలేదో కథ చెప్పడం రాని లైగర్ మీదికి తోసేసి పూరీ ఇలా తప్పించుకుంటున్నట్టు వుంది.

తన పేరే (టైటిల్) సరిగా పలకలేని నత్తిగల వాడు కథ ఎలా చెప్తాడు నిజానికివిచిత్రం కదూనత్తి పాత్రతో కథ చెప్పించడంఅడుగడుగునా ఇలాగే వుంటుంది పూరీ తప్పించుకునే ప్లాన్. సినిమా ఫ్లాపవడానికి నత్తినత్తిగా కథ చెప్పిన లైగరే కారణం, తను కాదన్న మాట!

సరే, ఇది పూరీ ఎప్పుడూ తీసే సినిమాల్లోలాగే అదే అరిగిపోయిన పురాతన కథ. ఆయన కథల్ని మార్చడుస్టార్స్ ని మారుస్తాడు. వాళ్ళతో అవే టెంప్లెట్ కథలుఅవే టెంప్లెట్ పాత్రలు, అదే టెంప్లెట్ మేకింగ్, మొత్తంగా అదే టెంప్లెట్ సినిమా. క్రియేటివిటీకి, కొత్తదనానికీ చోటే వుండదు. అందుకే 15 రోజుల్లో ఏ స్క్రిపు అయినా రెడీ. ఇంకా పూరీ సినిమాలకి రివ్యూలు రాయడం కూడా ఇలాంటిదేహెడ్డింగ్ మార్చేస్తే ఏ సినిమాకైనా అదే రివ్యూ మ్యాచ్ అవుతుంది.

ఇక స్పోర్ట్స్ జానర్ సినిమా అంటే కూడా టెంప్లెట్ కథే. ఎవరు స్పోర్ట్స్ సినిమా తీసినా ఈ టెంప్లెట్టే వుంటుంది- 1. ఆట నేర్పే ఒక ట్రైనర్2. ఒక పీడితుడు, 3. ట్రైనింగ్, 4. సమస్యలు5. పీడితుడికి ఒక ప్రత్యర్థి6. ఆటలో ప్రత్యర్ధితో ఓటమి7. తీవ్రమైన ట్రైనింగ్, 8. ఆటలో ప్రత్యర్ధి మీద గెలుపు, 9. పీడితుడు విజేతగా మెడల్, ఇంతే!

ఈ 9 స్టోరీ బీట్స్ కి తగ్గ సీన్స్ ని చకచకా టెంప్లెట్లో (మూకుట్లో) వేసుకుంటూ పోతే స్పోర్ట్స్ మూవీ వంట వేడివేడిగా తయార్! బడ్జెట్ ని బట్టి ఇనప మూకుట్లో, సత్తు గిన్నెలో, రాచిప్పలో, మట్టి పిడతలో పడతాయి బీట్స్ దినుసులు. లైగర్ ది ఇనప మూకుడు. ఏ స్పోర్ట్స్ మూవీ చూసినా ఇంతే కథ. దీంతో స్పోర్ట్స్ మూవీస్ లో కొత్తగా చూడడాని కేమీ వుండడం లేదు.

స్క్రీన్ ప్లే ట్యూటర్ కెన్ మియమోటో ఈ టెంప్లెట్ ని అప్డేట్ చేశాడు. గొప్ప స్పోర్ట్స్ డ్రామాని క్రియేట్ చేయాలంటే దృష్టి పెట్టాల్సింది పాత్ర క్రీడలో ఏం సాధించాలనుకుంటోందో ఆ గోల్ మీద కాదు, ఆ మార్గంలో ఎదురైన ఆటంకాల్ని పాత్ర ఎలా బీట్ చేసిందన్నది, ఆ అవసరం ఎందుకన్నది. సిల్వెస్టర్ స్టాలోన్ తో రాకీ సిరీస్ సినిమాల విజయ రహస్యమిదే అన్నాడు.

క్రీడల్ని పక్కనబెట్టి మన విషయమే చూద్దాం. మనకి గోల్స్ వుంటాయి బాగా డబ్బు సంపాదించాలని లేదా పేరు పొందాలని లేదా ఇంకేదో. ఇవి సాధించాక సుఖంగా సెటిలై పోతామా? డబ్బు సంపాదించడమే గోల్ గా పెట్టుకుని డబ్బులే డబ్బులు సంపాదించుకున్న వాళ్ళంతా సుఖంగా వుంటున్నారా? ఆ అశాంతి దేనికి? దుష్ప్రవర్తన దేనికి? ఆత్మహత్యలు దేనికి?

వాళ్ళు భౌతికంగా స్థిరపడ్డమే గోల్ అనుకున్నారు కాబట్టి- ఆత్మిక సుఖాన్ని గుర్తించలేదు కాబట్టి. ఆత్మ కోరుకునేది వేరు. సంపాదనలో పడకముందు చిన్నప్పట్నుంచో, ఆ తర్వాతో కొన్ని స్వచ్ఛమైన కోరికలు పుడతాయి- ఇవి యూనివర్స్ కి బాగా కనెక్ట్ అయి వుంటాయి. పుస్తకాలు బాగా చదవాలని, పాటలు వినాలని, టూర్లు వెళ్ళాలని, పేదల్ని ఆదుకోవాలని, ఇంకేదో సేవ చేయాలని, తిరిగి ప్రపంచానికేదో ఇవ్వాలనీ.. ఇలా ఇవి ఆత్మిక సుఖాన్నిస్తాయి. పాటు పడాల్సింది ఈ ఆత్మిక సుఖం కోసమే. దీనికి భౌతిక సుఖం ఒక మెట్టు మాత్రమే. పరీక్ష  పాసవడం, ఉద్యోగం పొందడం, బిజినెస్ చేయడం, డబ్బు సంపాదించడం, విదేశాలకెళ్ళి సెటిలవడం - ఇవి గోల్స్ కానేకావు. ఇవి సంపాదించాక ఆత్మిక సుఖం కోసం ఏం చేస్తామన్నదే గోల్. గోల్ అంటే ఇదే. ఈ గోల్ కి రీచ్ అవ్వాలనే చేసే పనులు చేయాలి. ఇది జరిగిన నాడు మనశ్శాంతి గొప్పగా వుంటుంది.

అలాగే క్రీడల్లో కూడా మెడల్ కొట్టడమే గోల్ కాదు. కెన్ మియమోటో అన్నట్టు దేనికోసం మెడల్ కొడుతున్నారనేది ముఖ్యం. సల్మాన్ ఖాన్ నటించిన స్పోర్ట్స్ మూవీ సుల్తాన్ (2016) లో- రెజ్లింగ్ లో సుల్తాన్ (సల్మాన్) నేషనల్ ఛాంపియన్ వరకూ ఎదిగి పెళ్ళి చేసుకుంటాడు. భార్య గర్భవతవుతుంది. ఆమెకి నెలలు నిండిన సమయంలో వరల్డ్ ఛాంపియన్ కెళ్తాడు. అక్కడ  గెలుస్తున్న సమయంలో ఇక్కడ కొడుకు పుట్టి చనిపోతాడు. అరుదైన ఓ-పాజిటివ్’ బ్లడ్ గ్రూపుతో పుట్టిన కొడుకు రక్తం దొరక్క రక్త హీనతతో చనిపోతాడు. సుల్తాన్ ది ఆ బ్లడ్ గ్రూపే. దీంతో తను దగ్గరుండి కొడుకుని రక్షించుకోలేక పోయాననే తీవ్ర క్షోభకి లోనవుతాడు. కొడుకుని బతికించుకో లేకపోయిన తను కూడా  మొహం చూపించలేనని దూరమవుతుంది భార్య (మియామోటో చెప్పే ఆటంకమిదే). ఇక సుల్తాన్ తన కొడుకు లాంటి పరిస్థితి ఇంకొకరికి రాకూడదని వాడి పేర బ్లడ్ బ్యాంకు స్థాపించే లక్ష్యం తోక్రీడా రంగాన్ని వదిలేసిఉద్యోగం చేసుకుంటూ సాధారణ జీవితం గడుపుతూంటే-

ఈ గతం తెలుసుకున్న స్పోర్ట్స్ ఏజెంట్, బ్లడ్ బ్యాంకు పెట్టాలంటే సుల్తాన్ మళ్ళీ రెజ్లింగ్ కి సిద్ధం కావాలనిచాలా డబ్బొస్తుందనీ  ఒప్పించి తీసుకుపోతాడు. ఆ వరల్డ్ మిక్స్డ్ మార్షల్ ఈవెంట్ కోసం తిరిగి శిక్షణ పొందిఅంతర్జాతీయ ఫైటర్స్ ని చిత్తు చిత్తుగా ఓడించి- వచ్చిన బోల్డు డబ్బుతో బ్లడ్ బ్యాంకు స్థాపిస్తాడు సుల్తాన్. నల్గురికి తోడ్పడే బ్లడ్ బ్యాంకు భౌతిక సుఖం కాదు, ఆత్మిక సుఖం. దీని కోసమే పాటుపడ్డాడు. భౌతిక లక్ష్యం  ఆత్మిక లక్ష్యానికి వాహకం మాత్రమే. అదే గమ్యం కాదు.

లైగర్ లో ఈ యాంగిల్ లేదని కాదు. అది వ్యక్తిగత స్థాయిలో వుండి పోయింది. భర్త ఛాంపియన్ అవ్వాలన్న కల తీరకుండా చనిపోతే ఆ కల కొడుకు ద్వారా తీర్చాలని తల్లి ప్రయత్నించే కథ. తల్లి మాట మీద తండ్రి కల నెరవేర్చాలని లైగర్ పాత్ర. జేమ్స్ బానెట్ స్టోరీ వీల్ ప్రకారం ఇది తన స్వార్ధం కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం వుండే అట్టడుగు స్థాయి పాత్ర, దీని పై స్థాయిలో సమాజం కోసం పాటు పడే పాత్ర వుంటుంది. దీని పై స్థాయిలో ప్రపంచం కోసం పాటుపడే పాత్ర వుంటుంది. ఇంకా దీని పై స్థాయిలో ఆథ్యాత్మికంగా పాటుపడే పాత్ర వుంటుంది.

ఈ కథాచట్రం (స్టోరీ వీల్) లో లైగర్ ఏ ర్యాంకులో వున్నాడు? ఇతనెలా ఆడియెన్స్ కి అంత బాగా కనెక్ట్ అవుతాడు? తండ్రి కల వుంటే నెరవేర్చకూడదని కాదు. ఇంకో ఉన్నతాశయాన్ని కలిపి తను ఛాంపియన్ అయినప్పుడు తండ్రి ఇంకా సంతోషిస్తాడు. ఇలా కాకుండా ప్రియురాలు తనకి నత్తి వుందని ఛీ కొట్టి వెళ్ళి పోయిందని, ఆమెకి ప్రూవ్ చేయడం కోసం ఛాంపియన్  అవ్వాలనుకోవడం కథకి ఎమోషనల్ రేషన్ కార్డు నివ్వదు. ఇది కూడా వ్యక్తిగత స్థాయే. పైగా ఒకరికేదో ప్రూవ్ చేయడం కోసం పనిని చేపట్టడమంటే అది ఆ పనిని కండోములా వాడి పారేయడం లాంటిది. గోలూ కాదు ఏమీ కాదు, రివెంజీ మెంటాలిటీ.

నటనలు - సాంకేతికాలు 

ఈ సినిమాలో లైగర్ గా విజయ్ ని  తప్ప ఇంకొకర్ని వూహించలేమనేది నిజమేగానీ, విజయ్ లైగర్ పాత్ర ఫైట్లు చేసి మాంచి యాక్షన్ పాత్రలా కన్పించినంత మాత్రాన అది యాక్టివ్ పాత్ర కాదు, పూర్తిగా పాసివ్ పాత్ర. పాత్ర డైనమిక్స్ కి నత్తి పెద్ద అడ్డంకి. ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకుని హుషారుగా ఎంటర్ టైన్ చేయాల్సిన తను- నత్తి వల్ల డైలాగులు కూడా ఎంజాయ్ చేయలేని పరిస్థితి తెచ్చాడు. కాబట్టి పవర్ఫుల్ మాస్ డైలాగులుపంచ్ డైలాగులూ సాధ్యం కాలేదు. ఇది పెద్ద ట్రాజడీ. కొత్తగా ఎంటరవుతూ, నత్తి మాట్లాడి పానిండియా ప్రేక్షకులకి ఎలా దగ్గరవాలనుకుంటాడు? నత్తి మార్కెట్ యాస్పెక్ట్ ని చంపేసింది.

ఫైటర్ గా మాత్రం పూర్తి మేకోవర్ తో- సిక్స్ ప్యాక్ తో నిజంగా పులే. ఎంఎంఏ రింగ్ లో ప్రత్యర్థుల్ని విరగ్గొట్టే సీన్లు టాప్. సినిమా కోసం తన ఎనర్జీ ఎంత పెట్టి చేయాలో అంతా చేశాడు. దేశమంతా తిరుగుతూ ప్రమోషన్స్ కి కూడా అంతే కష్టపడ్డాడు. కానీ ఇందులో పదో వంతు కూడా కథ విషయంలోపాత్ర విషయంలో పూరీ కష్ట పడలేదు. దీ సమస్య.

అతడి గోల్ అతడి గోల్ కాదు, అది తల్లి గోల్. అతను తల్లి చెప్పు చేతల్లో వుండే పాసివ్ క్యారక్టర్. వృత్తి విషయంలోనూ, ప్రేమ విషయంలోనూ. ప్రేమ లవర్స్ నడుపుకునే రోమాంటిక్ కామెడీగా లేక, ఇటు తన తల్లి చేతిలో, అటు హీరోయిన్ తండ్రి చేతిలో పెద్దలు నడిపే రోమాంటిక్ డ్రామా కావడం యూత్ అప్పీల్ కీ, బాక్సాఫీసు అప్పీల్ కీ గండి కొట్టింది.      

హీరోయిన్ అనన్యది పాత మూస ఫార్ములా పాత్రఈమె ప్రేమకూడా నలిగిపోయిన టెంప్లెట్టే. హీరోకి దూరమై, తర్వాత నీ గోల్ నుంచి నిన్ను డిస్టర్బ్ చేయకూడదనే అలా దూరమయ్యాననని నీతి వాక్యాలు చెప్పే చాలా పాత మూస ఫార్ములా చాలా సినిమాల్లో చూసేశాం. ఇన్నేళ్ళ అనుభవంతో కాపీ పేస్టే తప్ప, పూరీ కొత్తగా ఆవిష్కరించిం దేమీ లేదు. అయితే అనన్య  హావభావాలు బాగా ఒలికించగలదు. ఈ సినిమాతోనైనా తను గాడిలో పడుతుందేమో చూడాలి.

ఇక తల్లిగా రమ్యకృష్ణ మాస్ పాత్ర ఓవర్ డ్రామా అవుట్ డేటెడ్ అయిపోయింది. మెలోడ్రామాల కాలం నాటి పాత మోడల్ పాత్ర. అరుపులతో, మాట విరుపుతో లైగర్ కంటే రమ్యకృష్ణ నటనే టైగర్ లా వుంది.

ఎంతో ప్రచారం చేసిన వరల్డ్ ఛాంపియన్ మైక్ టైసన్ అతిధి పాత్ర... ముగింపులో వచ్చి కథనే ఆకస్మికంగా ముగించేస్తాడు. టైసన్ తో విజయ్ ఫైట్ సీను టైసన్ అభిమానులకి బాధ కల్గిస్తుందేమో తెలియదు. చాలా ప్రయత్నం చేసిన మీదట టైసన్ నటించడానికి ఒప్పుకున్నట్టు సమాచారం. ఒప్పుకుని ముగింపులో వచ్చి బాక్సాఫీసుకే పనికి రాకుండా విరిచేశాడు సినిమాని.

పాటల గురించి చెప్పుకోవడానికి లేదు. పాటలు హిట్ కాలేదు. ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాయి. కెమెరాఎడిటింగ్కోరియోగ్రఫీయాక్షన్ కొరియోగ్రఫీలొకేషన్స్ అన్నీ హైక్లాస్ గా వున్నాయి - ఒక్క పూరీ చేతిలో స్క్రిప్టు తప్ప!

చివరికేమిటి  

ఫస్టాఫ్ విజయ్ ట్రైనింగుహీరోయిన్ తో ప్రేమమదర్ తో ఫ్యామిలీ సీన్లూ ఇవే వుంటాయి ఓ మూడు పాటలతో. మధ్య మధ్య వీధి పోరాటాలతో. ఇంటర్వెల్లో విజయ్ కి నత్తి అని తెలిసి హీరోయిన్ దూరమవుతుంది. ప్రేమ కథే బలహీనమంటేఈ ఇంటర్వెల్ మలుపు మరీ వీక్. ఇక్కడే ప్రేక్షకులు తీవ్ర అసంతృప్తి చెందారు. ఇక సెకండాఫ్ మరీ దారుణం. నేషనల్ ఛాంపియన్ గెలవడంఆపైన వరల్డ్ ఛాంపియన్ కెళ్ళడం తగిన విషయంస్ట్రగుల్ఎమోషన్స్ లేకుండా ఫ్లాట్ గా సాగిపోతాయి. ఇక పూరీ సినిమాల్లో అలవాటుగా వుండే హీరోయిన్ కిడ్నాప్ ఒకటి. పోనూ పోనూ దిగజారి పోతూ వుంటుంది ఈ పానిండియా ప్రయత్నం. ఇంకేం చెప్పలేక మైక్ టైసన్ రాకతో, నాల్గు పిడి గుద్దులతో సడెన్ గా శుభం పడి పోతుంది.

స్టేడియంలో వస్తాదులు ఎదురు చూస్తూంటే, ఇంకెక్కడో అవుట్ డోర్ లో విజయ్ దేవరకొండ హీరోయిన్ కిడ్నాప్ గురించి మైక్ టైసన్ ని మట్టి కరిపిస్తే, ఆ క్లిప్పింగ్స్ ప్రసారమై విజయ్ దేవరకొండ వరల్డ్ ఛాంపియన్ అయిపోవడ మేమిటో అడక్కూడదు.   

కనీసం కథకి కావాల్సిన ఒక విలన్ఒక కాన్ఫ్లిక్ట్ లేకపోతే సినిమా నిలబడుతుందా? నత్తీ కథకేమీ ఉపయోగ పడలేదు. తన నత్తే తనకి విలన్ అయ్యుంటే ఆ స్ట్రగుల్ సానుభూతిని రాబట్టుకునేది. కాన్ఫ్లిక్ట్ నత్తి వల్ల ప్రేమలో పుట్టడంతో దాన్ని కాన్ఫ్లిక్ట్ గానే ఫీలవలేదు ప్రేక్షకులు. వారియర్ హాలీవుడ్ హిందీ రీమేక్ బ్రదర్స్ (2015) లో ఎఎంఏ ఛాంపియన్ షిప్ కి అన్నదమ్ములే ఒకరికొకరు విలన్లు. రింగ్ లో కొట్టుకుని కొట్టుకుని రక్తసిక్తమైన వాతావరణంలో, తమ్ముడ్ని ఇంకా కొట్టి ఓడించలేక ఏడుస్తాడు అక్షయ్ కుమార్. బంపర్ హిట్టయ్యింది.

పూరీ చూడని కథా లోకాలు ఇంకా చాలావున్నాయి. తిప్పి తిప్పి అవే సారం లేని కథలు ఇంకెంత కాలం...

—సికిందర్