రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

9, ఏప్రిల్ 2016, శనివారం

దర్శకత్వం : కేఎస్ రవీంద్ర (బాబీ)


తారాగణం : పవన్ కల్యాణ్, కాజల్ అగర్వాల్, ఊర్వశి, లక్ష్మీ రాయ్, టీస్కా చోప్రా, శరద్ కేల్కర్, ముఖేష్ రిషి, ప్రదీప్ రావత్, కబీర్ సింగ్, రావురమేష్, అలీ, తనికెళ్ళ, పోసాని, రఘుబాబు, కృష్ణ భగవాన్, వేణు, బ్రహ్మాజీ, ప్రభాస్ శీను తదితరులు 

కథ- స్క్రీన్ ప్లే : పవన్ కల్యాణ్, మాటలు : బుర్రా సాయిమాధవ్, సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఛాయగ్రహణం : ఆర్ధర్ ఎ. విల్సన్, కూర్పు : గౌతం రాజు, యాక్షన్ : రామ్ - లక్ష్మణ్ 
బ్యానర్ : ప‌వ‌న్ క‌ల్యాన్ క్రియేటివ్ వ‌ర్క్స్, నార్త్ స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, ఇరోస్ ఇంటర్నేషనల్ 
నిర్మాతలు :  ప‌వ‌న్ క‌ల్యాణ్, శ‌ర‌త్ మరార్, సునీల్ లుల్లా
విడుదల : ఏప్రెల్  8, 2016
***

         పవన్ కల్యాణ్ ఈసారి నటిస్తూనే కాదు, తన సినిమా కథ తనే రాసుకుంటూ క ‘త్తెర’ పైకి వచ్చాడు. ఒక సూపర్ స్టార్ తన సినిమా కథ తనే రాసుకోవడం కమల్ హాసన్ తర్వాత పవన్ కల్యాణ్ తోనే జరిగివుండొచ్చు. అయితే పవన్ సూపర్ స్టార్ కాదు, అంతకి మించి  ఒక ‘పర్సనాలిటీ’ - రజనీకాంత్ ఏం చేసినా ఎలా చెల్లిపోగలదో, పవన్ ఎంత ‘అతి’ చేసినా అలా నడిచిపోతుంది. ఇది కేవలం సూపర్ స్టార్ దశ నుంచి ‘పర్సనాలిటీ’ గా దిగిన నటుడికే సాధ్యమవుతుంది. ఈ ‘పర్సనాలిటీ  స్టేటస్’ పవన్ కి ‘గబ్బర్ సింగ్’ అనే రీమేక్ తోనే  లభించింది.  ఈ స్టేటస్ నే దృష్టిలో పెట్టుకుంటూ ఇప్పుడు ‘సర్దార్ గబ్బర్ సింగ్’  అనే ‘స్వీ మేక్’ తో  తనే కథ రాసుకుని ప్రేక్షకుల ముందు కొచ్చాడు. ఐతే ‘గబ్బర్ సింగ్’ అనే ఒక కల్ట్ క్యారక్టర్ తో పవన్ సృష్టించిన  ఈ వినోదాత్మకాన్ని  ఏ దృష్టితో చూడాలి? ఇదొకసారి చూద్దాం...కథ      
      ఆంధ్రా తెలంగాణా సరిహద్దుల్లో ఎక్కడో రతన్ పూర్ అనే ఒక గ్రామం. ఇదొక్కప్పుడు పూర్వపు  రాజపుత్ర వంశీయుల సంస్థానంలో వుండేది. ఆ సంస్థానం వారసురాలు అర్షి దేవి ( కాజల్ అగర్వాల్) తల్లిదండ్రుల మరణంతో దళపతి అయిన హరినారాయణ్ (ముఖేష్ రిషి) సంరక్షణలో పెరుగుతుంది. ప్రజల సంక్షేమం కోసం పాటు పడుతూ వుంటుంది. ఈమెకి మధుమతి( ఊర్వశి) అనే చెలికత్తె,  శేఖర్ ( బ్రహ్మానందం) అనే మామా వుంటారు. ఈ ఒకప్పటి సంస్థానం పరిధిలోని గ్రామాలకి బొగ్గు మాఫియాగా ఎదిగిన రాజపుత్ర వంశీయుడే, భైరవ్ సింగ్ (శరద్ కేల్కర్) అనే అతను  ప్రజల పాలిట యముడిలా మారతాడు. అడ్డొచ్చిన వాళ్ళని చంపి గ్రామాల్ని బొగ్గు మైనింగ్ వనరులుగా మార్చుకుంటాడు. రతన్ పూర్ ని కూడా చెరబట్టి బొగ్గు తవ్వుకుని తరలిస్తూంటాడు.

          అటు హైదరాబాద్ లో గబ్బర్ సింగ్ (పవన్ కల్యాణ్ ) అనే ఎస్సై,  ఓ స్నేక్ గ్యాంగ్ అరచకాల్ని అరికట్టి పాపులర్ అవుతాడు. ఇతడి పై అధికారి (తనికెళ్ళ) ఇతడికి ప్రమోషన్ ఇచ్చి,  రతన్ పూర్ కి బదిలీ చేస్తూ అక్కడ పరిస్థితుల్ని చక్క దిద్దమని పంపిస్తాడు. వెంట సాంబా (అలీ) అనే కానిస్టేబుల్ ని కూడా పంపిస్తాడు. రతన్ పూర్ కి  గబ్బర్ సింగ్,  సర్కిల్ ఇన్స్ పెక్టర్ సర్దార్ గబ్బర్ సింగ్ గా రావడంతో ప్రజల్లో ఆశలు చిగురిస్తాయి, ప్రత్యర్ధులకి ఆగ్రహం పెల్లుబుకుతుంది.  

          ఈ నేపధ్యంలో తనదైన స్టయిల్లోప్రత్యర్ధుల పని పడుతున్న గబ్బర్ కి,  అర్షి తారస పడుతుంది. దీంతో ఈ రాకుమారి అర్షి ని చెలికత్తెగానూ, అర్షి చెలికత్తె నడివయసు మధుమతిని రాకుమరిగానూ భ్రమించి, తన లెవెల్ చెలికత్తె తోనే అనుకుని, అర్షినే ప్రేమించడానికి నిర్ణయించుకుంటాడు గబ్బర్. ఇదే అర్షి మీద అటు పెళ్ళైన బైరావ్ సింగ్ కూడా కన్నేసి సమయం కోసం చూస్తూంటాడు..ఇదీ కథ.

ఎలావుంది కథ
      బిగ్ కమర్షియల్స్ లో ఇంతకంటే ఏం కథ వుంటుంది. వచ్చిన కథలే  రీసైక్లింగ్ అవుతూనే వుంటాయి తప్ప, ఒక ‘పీకే’ లానో, ఇంకో ‘రోబో’ లానో తెలుగులో బిగ్ కమర్షియల్స్ తో ప్రయోగాలు చేసి కొత్తదనాన్ని ఇవ్వరుగా. కాబట్టి పవన్ రాసిన ఈ కథకూడా  పాత రొటీన్ చట్రంలోనే వుంది. 70 కోట్లు రిస్కు చేసి, కొత్తగా పవన్ రాస్తున్నప్పుడు కొత్తదనం కోసం ప్రయత్నించకూడదు కూడా. ముందు రొటీన్ తోనే చెయ్యి తిప్పుకోవాలి. ఈ రొటీన్ కి మాజీ గబ్బర్ సింగ్ ఆధారంగా వుంది. కాబట్టి తనకి సులువైంది. పవన్ కి రాజకీయ కాంక్ష లుండొచ్చు. అయితే వాటిని తన చేతిలో పనే కదా అని కథలో చొరబెట్టకుండా, కేవలం ఒక్క వినోదమే ఎజెండాగా- ఈ వేసవిలో ఆహ్లాదాన్నివ్వడమే లక్ష్యంగా పెట్టుకుని ట్రావెల్ చేసినట్టుంది కథ. గబ్బర్ అన్నాక ఫన్నే తప్ప నో సీరియస్ ఎలిమెంట్స్ అని ప్రేక్షకులకే అన్పిస్తుంది. ‘పర్సనాలిటీ’ అన్నాక కథే ముంటుంది, కథన మేముంటుంది. ‘పర్సనాలిటీ’ యే కథ, విన్యాసాలే కథనం. ‘భలేభలే మగాడివోయ్’ అనే హిట్ లో కథేముంది-మతిమరుపు పాత్రలో హీరో నానీ తన క్యారక్టరైజేషన్ తో పదినిమిషాలకో బ్యాంగ్ చొప్పున ఇస్తూ వినోదపర్చడం తప్ప? ఉగాది పండక్కి చూస్తున్న క్లాస్ మాస్ ప్రేక్షకుల పండగ మూడ్ చెడగొట్టి తిట్టుకునేలా మాత్రం లేదు కథ తాజా గబ్బర్ కథ.

ఎవరెలా చేశారు 
       పర్సనాలిటీయే సుప్రీం ఇక్కడ. ఆ పర్సనాలిటీ పవన్. పర్సనాలిటీ అన్నాక ఫన్నే తప్ప ఇంకే  ఎమోషనల్ బ్యాగేజీ లేకపోవడమనే క్యారక్టరైజేషన్ తో పవన్ ఆద్యంతం ఎక్కడా బోరనేది  కొట్టుకుండా కన్పిస్తాడు. మాజీ గబ్బర్ సింగ్ తోనే కౌబాయ్ కల్ట్ ఫిగర్ గా ఎదిగిన పాత్ర ఇక్కడ మరింత పెరిగిన కాన్వాస్ తో,  గన్ షాట్స్ నుంచీ గుర్రాన్ని హిప్నటైజ్ చేయడం వరకూ, గన్ ఫైట్స్ నుంచీ మార్షల్ ఆర్ట్స్ వరకూ ప్రదర్శించని విద్య లేదు. నిజానికి కథా కథనాలని వదిలేసి ఈ విద్యలన్నిటినీ, విన్యాసాలన్నింటినీ జొప్పించడమే పెద్ద క్రియేటివిటీ. ఎక్కడ్నించీ కాపీకొట్టని  ఈ క్రియేటివిటీనీ, ఊహాశక్తినీ, కల్పనా శక్తినీ మొట్టమొదట మనమిక్కడ ఒప్పుకుని తీరాలి.  కమర్షియల్ సినిమాల్ని ఇంత విజువల్ యాక్షన్ తో కాకుండా, కేవలం అవుట్ డేటెడ్ వెర్బల్ యాక్షన్ తో తీస్తున్న దర్శకులందరూ, రాసే రచయితలందరూ,  తాజా గబ్బర్ లో అడుగడుగునా విజువల్ యాక్షన్ క్రియేషన్ కి పడ్డ శ్రమనంతటినీ స్టడీ చేసుకోవాలి. కమర్షియల్ సినిమా అంటే క్యారక్టర్ ని ఇంత హ్యూజ్  కాన్వాస్ మీద  మౌంట్ చేసే కళా ప్రక్రియ అని పవన్ క్యారక్టర్, దాంతో ఎలాటి మొహమాటం లేని అతని నటనా తెలియ జేస్తాయి. ఆటా పాటా మాటా అన్నిటా ఒక ఆల్ రౌండర్ గా, ఇలా ఒన్ మాన్ షోని రక్తి కట్టించడం సామాన్యమైన విషయం కాదు. ఇంత ఇచ్చాక ఇంకా కథెవడి క్కావాలి,  అవే బిగ్ కమర్షియల్స్ రొటీన్ కథలు. ప్రతీ వారం చూస్తున్న 'అద్బుతమైన' కథలతో కడుపు నిండిపోయింది ప్రేక్షకులకి. కథంటూ  కావాలని  అడిగితే గిడిగితే, అదిగో ఆకాశంలో చందమామలాంటి  ‘రోబో’ నో,  ‘పీకే’ నో  తెచ్చివ్వమని మారాం చేయాలి. అప్పుడొక అర్ధముంటుంది. 

          రాకుమారి పాత్రలో అపురూపంగా కన్పించేది కాజల్ అగర్వాల్ అయితే, తెలుగుకి కొత్త విలన్ గా శరద్ కేల్కర్ కంట్రోల్డ్ గా కన్పిస్తాడు. మిగిలిన పాత్రధారులు పెద్దగా ప్రభావం చూపరు తమ పాత్రలతో, నటనలతో. వాళ్లకి మిగిలిందే అంతంత మాత్రం స్పేస్. 

          దేవీశ్రీ  ప్రసాద్ సంగీతం ఒక మ్యూజికల్ ఎంటర్ టైనర్ గా మార్చింది సినిమాని. రెండు పాటలకి ‘లావారిస్’ మీద ఆధారపడ్డారు. ‘తోబాతోబా’ పాట ప్రీల్యూడ్ కి వాడిన  బీట్ సాంతం అమితాబ్ ‘లావారిస్’ లో ‘అప్నీతో జైసే తైసే’  సాంగ్ నుంచి తీసుకున్నదే. అలాగే అంత్యాక్షరిలోనూ ‘లావారిస్’ లోనిదే  ‘మేరే ఆంగ్నేమేఁ’  పల్లవినే వాడారు. కానీ గబ్బర్ సింగ్ అన్నాక ‘షోలే’ లో గబ్బర్ సింగ్ కి వున్న బిజిఎమ్స్ ని ఎందుకు వాడుకోలేదో. 

          ఆర్ధర్ విల్సన్ ఛాయాగ్రహణం అతి పెద్ద ఎస్సెట్ ఈ సినిమాకి. అలాగే  కళా దర్శకుడు బ్రహ్మ కడలి సృష్టించిన సెట్స్ , రామ్ – లక్ష్మణ్ ల యాక్షన్ కొరియో గ్రఫీ. రతన్ పూర్ గ్రామం, ఆ వాతావరణం, విశాలమైన రాజ ప్రసాదాలూ వాటి వైభవం, చిత్ర విచిత్ర ముఠాలతో పోరాట దృశ్యాలూ, పాటల చిత్రీకరణా  పతాకస్థాయికి చేరాయి. గౌతమ్ రాజు ఎడిటింగ్ మీద స్క్రీన్ ప్లే లో సీన్ల కూర్పు ప్రభావం చాల పడింది. సీన్ల కూర్పు  అలా ఎందుకు వున్నందుకు- మరో సారి మరో వ్యాసంలో చూద్దాం. కానీ తెలుగు- హిందీ భారీ నిర్మాణ సంస్థలు పూనుకున్నందువల్ల ప్రొడక్షన్ విలువలు బాగా రిచ్ గా వున్నాయి.

          దర్శకుడు కే ఎస్ రవీంద్ర అలియాస్ బాబీ విషయానికొస్తే, పవన్ రాసిచ్చిందే తీసి పెట్టడం జరిగిందన్నట్టుంది. కానీ ఆ తీయడం బావుంది. ముఖ్యంగా చివర్లో, రాజవంశీయుల భేటీలో రాకుమారిని కమిట్ చేయించే సన్నివేశ చిత్రీకరణ చాలా హూందాతనంతో కూడుకుని వుంది. అక్కడ బుర్రా సాయిమాధవ్ రాసిన సంభాషణలు కూడా బలంగా వున్నాయి. మిగతా పవన్ పాత్రకి ఎలారాసి అభిమానుల్ని సంతోష పెట్టొచ్చో అలా రాశారు. 

చివరికేమిటి 
        ఓ సినిమాకి ప్రేక్షకుల రెస్పాన్స్ ఏమిటన్నది  మొత్తం అన్ని వర్గాల ప్రేక్షకులూ తరలివచ్చే సింగిల్ స్క్రీన్ థియేటర్లే  గీటురాయి అయితే,  ఈ తాజా గబ్బర్ కి  సింగిల్ స్క్రీన్ ప్రేక్షకులు సలాము చేశారంతే. కమర్షియల్ సినిమాల్ని ఒక్కోసారి అలవాటు పడిన ఒకే కథా సూత్రాల ప్రకారం జడ్జ్ చేయలేం. ఒక్కోసారి స్ట్రక్చర్ ని ఎగేసుకుంటూ వెళ్ళిపోయే క్యారక్టర్ తో ‘భలేభలే మగాడివోయ్’ లాంటిది రావొచ్చు. అక్కడ ఫీలవని లోపం తాజా గబ్బర్ లో పీలవ్వడంలో అర్ధం లేదు. తాజా గబ్బర్ లో ఇంటర్వెల్లో హీరోకి విలన్ తో కాన్ ఫ్లిక్ట్ ( సంఘర్షణ) పుట్టాక,  సెకండాఫ్ లో దాన్ని వదిలేసి అర్ధం లేని సీన్లు వేశారనుకోవడం, సెకండాఫ్ బలం  లేక సినిమా పొయిందనుకోవడం, కేవలం తెలిసిన కొన్ని కథా సూత్రాల ప్రకారం జడ్జ్ చేసుకోవడం వల్లే. అసలు ఇంకా ఈ రొటీన్ కాన్ ఫ్లిక్టులతో హీరో - విలన్లూ తన్నుకునే సినిమా లెందుకుండాలి? బయటి ప్రపంచంలో రోజూ భరించలేని టెన్షన్, హింసా చూస్తున్న ప్రేక్షకులకి మళ్ళీ అవే, అనుకున్న కథా సూత్రాల ప్రకారం, ఎందుకు చూపించాలి? తాజా గబ్బర్ లో కాన్ ఫ్లిక్ట్ లేదని ఎవరన్నారు? కాన్ ఫ్లిక్ట్ అంటే ఏమిటి? అది ఎన్ని రకాలుగా వుంటుంది? హీరో విలన్లకి మధ్య చూసి చూసి వున్న తన్నులాటలకి మారుగా ఇక్కడ ఇంకో మర్యాదకరమైన కాన్ ఫ్లిక్ట్ వుంది. అది విలువల మధ్య వైరుధ్యం. హీరోకి సానుకూల విలువలుంటే, విలన్ కి ప్రతికూల విలువలున్నాయి. హీరోతో భౌతిక పోరాటం కాక నైతిక పోరాటానికి తెలివిగా పథకం వేశాడు విలన్. జనంలో హీరో ఒక ఐడియాలజీ. అతణ్ణి చంపినంత మాత్రాన జనంలో అతడి ఐడియాలజీ చచ్చిపోదు. ఈ మేరకు ప్రకటించాడు కూడా విలన్.  కాబట్టి హీరో ఐడియాలజీనే తన ఐడియాలజీతో నిర్మూలించాలని ప్రయత్నించాడు. ఇలా ఇన్నర్ కాన్ ఫ్లిక్ట్ సెకండాఫ్ అంతా అంతర్లీనంగా వుంది. ‘బెన్హర్’ లో కూడా  ఐడియాలజీని ఐడియాలజీతోనే ఎదుర్కోవాలని విలన్ అంటాడు.


          బిగ్ కమర్షియల్స్ ని ఇక డిఫరెంట్ లుక్ తో చూడాల్సిన రోజులొస్తున్నాయేమో.. అసలు కాన్ ఫ్లిక్టే వుండని ‘ఊపిరి’ ని ప్రశంసించి, తాజా గబ్బర్ లో  కాన్ ఫ్లిక్ట్ లేదంటూ తిరస్కరించడంలో అర్ధముందా, ప్రేక్షకులకి విడమర్చి చెప్తే తప్పుందా? అసలు ప్రాబ్లం ఏమిటి? లైటర్ వీన్ గా వున్న హీరో-విలన్ల మధ్య రగడ తెలిసో తెలీకో చేసిన ప్రయోగమే. వెంటనే ఈ ప్రయోగ ఫలితాల్ని నిర్ణయించలేం..చూద్దాం ఇంకా ప్రేక్షకులేం  చేస్తారో.

-సికిందర్