రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Thursday, July 19, 2018

662- స్క్రీన్ ప్లే సంగతులు



    హీరోలకు ఎంత వారసత్వపు  నేపధ్య బలమున్నా, అదే వారసత్వపు నిర్మాణ శైలుల్లో సినిమాల్ని కొనసాగించలేరు. కాలాన్ని బట్టి మారాలి. రాజ్ కపూర్ తన కుమారుడు  రిషీ కపూర్ ని హీరోగా పరిచయం చేస్తూ తన కాలం నాటి కథా కథనాలతో, పాత్రలతో ‘బాబీ’ తీయలేదు. కాలానికి తగ్గ ట్రెండ్ సెట్టర్ ‘బాబీ’ ని తీసి చరిత్ర సృష్టించాడు. కొత్తగా పరిచయమయ్యే హీరోలు యువతని ఉర్రూతలూగిస్తూ రంగప్రవేశం చేయాల్సిందే. కానీ మెగాస్టార్ చిరంజీవి అల్లుడు, ఈ తరం యువకుడు, తన మామ గారు ఎప్పుడో నటించిన లాంటి, ఇప్పుడు కాలం చెల్లిన పాత వ్యవహారంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఎవర్ని ఆకట్టుకో గలిగాడు? ఎవర్నీ లేదు!      
 
         
పురాతనాన్ని  రీసైక్లింగ్ చేసిన వ్యవహారంతో  కొత్త దర్శకుడు కూడా దెబ్బతినిపోయాడు. ఏడాదికి 70 మంది కొత్త దర్శకులు వస్తూంటే, ఒకరో ఇద్దరో తప్ప,  అందరూ అట్టర్ ఫ్లాపై తిరిగి వెళ్ళిపోతున్నసాంప్రదాయాన్ని ఈ కొత్త దర్శకుడు కూడా తుచ తప్పకుండా పాటించాడు. కొత్త దర్శకులు ఎందుకు ఫ్లాపవుతున్నారో విశ్లేషించుకోకుండా,  మళ్ళీ ఇంకో  కొత్త దర్శకుడు అవే పోకడలతో అలాగే దర్శన మిస్తూంటే – ఫ్లాపుల చరిత్రకి అంతెక్కడ వుంటుంది. 

          ప్రస్తుత సినిమా సమస్యేమిటంటే, షరామామూలుగా స్క్రీన్ ప్లే భ్రష్టత్వం.  పాత కథకి తోడు స్క్రీన్ ప్లే సర్వ భ్రష్టత్వం సంపూర్ణ దివాలాకోరు తనానికి దారితీసింది. ఈ స్క్రీన్ ప్లేలో పలాయనవాదం ఎంతగా వుందంటే, కథ చెప్పడానికి దర్శకుడు ససేమిరా ఇష్టపడడం లేదు. చివరి పది నిమిషాలకి కథని పరిమితం చేసి, మిగతా గంటా యాభై  నిమిషాల కాలమంతా టైం పాస్ చేశాడు. చివరి పది నిమిషాల కథకి ఈ గంటా యాభై నిమిషాల టైం పాస్ ని చేర్చడానికి రకరకాల వంకర్లు తిప్పాడు. గమ్యానికి ఎలా చేరామన్నది కాదు, చేరామా లేదా అన్నదే ముఖ్యమనే - ఎండ్ జస్టిఫైస్ ది మీన్స్ మైండ్ సెట్ తో – సహనపరీక్షకి గురిచేసే మేకింగ్ ని రుద్దాడు.

స్థూలంగా కథ 
         ముందు స్థూలంగా కథ చెప్పుకుంటే, ఉక్కు ఫ్యాక్టరీలో పనిచేసే శ్రీనివాసరావు కొడుకు రామ్. చిన్నప్పట్నుంచీ కొడుకుకేం కావాలన్నా సమకూరుస్తూ, కోరిన చదువుకూడా అప్పు చేసి చదివించాడు.  కానీ రామ్ కి ఉద్యోగం రావడం లేదు. దీంతో నేస్తాలనేసుకుని చెడ  తిరుగుళ్ళు మొదలెట్టాడు. ఇలాకాదని,  నేస్తాలతో కలిసి ఒక ఈవెంట్ మేనేజ్ మెంట్ పెట్టాడు. ఇది వికటించి పోలీస్ స్టేషన్లో పడ్డాడు. తండ్రి విడిపించు కొస్తూంటే యాక్సిడెంట్ అయి గుండె పోటుకి గురయ్యాడు. అప్పుడు తండ్రి మిత్రుడు ఒకాయన తండ్రి గురించి ఒక విషయం  చెప్పాడు. కుటుంబ బాధ్యతల కోసం అంతర్జాతీయ ఫోటోగ్రాఫర్ కావాలన్న తన కలల్ని చంపేసుకున్నాడని.  


             
దీంతో రామ్ మారడానికి ప్రయత్నించాడు. ఇందులో భాగంగా మళ్ళీ ఈవెంట్ మేనేజ్ మెంట్ చేపట్టి, ప్రేమించిన చైత్ర సహకారంతో ఆమె బాస్ కుటుంబానికి పరిచయమయ్యాడు. ఆ కుటుంబంలో వున్న సమస్యని పరిష్కరించి, ప్రతిఫలంగా ఒక ఈవెంట్ మేనేజి మెంట్ ప్రోగ్రాం పొందాడు. పనిలో పనిగా ఆ బాస్ తన కొడుక్కి రామ్ చెల్లెలితో పెళ్లి కూడా జరిపించాడు.  చివరికి రామ్ తండ్రికి కెమెరా కొనిచ్చి ప్రపంచ యాత్ర తిప్పాడు. అక్కడ తీసిన ఫోటోలని పోటీలకి పంపి,  తండ్రి అవార్డు అందుకునేలా చేశాడు. దీంతో పిల్లలు కూడా తమ పేరెంట్స్ కి కోరికలుంటాయని గుర్తించాలని చెప్పి, ప్రయోజకుడైన రామ్ ని తండ్రి ఆలింగనం చేసుకున్నాడు. 

స్క్రీన్ ప్లే సంగతులు 
         ఈ కథకి మార్కెట్ యాస్పెక్ట్ వుందా అంటే వుంది. మంచి మార్కెట్ యాస్పెక్ట్  వుంది. అయితే కథని ఎక్కడ పట్టుకోవాలో అక్కడ పట్టుకోకుండా, పాత మూస ధోరణిలో సంసార కథగా మార్చేయడంతో మార్కెట్ యాస్పెక్ట్ గల్లంతై పోయింది. ఈ కథ సెంట్రల్ ఐడియా ఏమిటంటే,  గొప్ప ఫోటోగ్రాఫర్ కావాలన్న తండ్రి కలని కొడుకు నెరవేర్చడం. వాడవాడలా సెల్ ఫోన్లతో ఫోటోలు తీసే అదృష్టానికి  నోచుకుంటున్న ప్రజలందర్నీ ఆకట్టుకునే ఫోటోగ్రఫీ సెంట్రల్ ఐడియా, ప్రధానాకర్షణ కావాలి ఈ సినిమాకి నిజానికి. కాబట్టి కాన్సెప్ట్ పరంగా మార్కెట్ యాస్పెక్ట్ పుష్కలంగా వుంది. ఇవ్వాళ్టి  మార్కెట్  యాస్పెక్ట్ లో ప్రధానంగా సినిమా ప్రేక్షకులు యువతే. ఐతే ఇందులో అమ్మాయిల్లేరు. ఎంతో క్రేజ్ వున్న హీరోల  సినిమాలకి తప్ప అమ్మాయిలు రావడం లేదు. వాళ్ళతో ఓపెనింగ్స్ ఉండడంలేదు. కాబట్టి జనరల్ గా ‘యువతలో సగం’ సినిమా ప్రేక్షకులుగా లేరు. చిరంజీవి అల్లుడు హీరో అయ్యాడని యువతలో భాగమైన  అమ్మాయిలు కాదుకదా,  అబ్బాయిలు కూడా కానరావడం లేదంటే,  దీని మార్కెట్ యాస్పెక్ట్ ఏ పాటిదో అర్ధం జేసుకోవచ్చు. 

          యువతని దృష్టిలో పెట్టుకుని ఇవాళ్టి మార్కెట్ యాస్పెక్ట్  రోమాంటిక్స్ లేదా ఎకనమిక్స్, అంతే. ఇంకే కబుర్లు చెబుతూ సినిమాలు తీసినా ఇంతే సంగతులు. తెర మీద అమ్మాయి కనపడాలి, లేదా పుష్కలంగా ధనార్జన కనపడాలి. వీటితో ముడిపడి వుంటే ఏ కథైనా ఓకే. ఫోటోగ్రఫీ కథకి ఇది వర్కౌట్ అవుతుంది. 

           క్రియేటివ్ యాస్పెక్ట్ కొస్తే,  ఇంత మంచి మార్కెట్  యాస్పెక్ట్ వున్న సెంట్రల్ ఐడియాతో సమకాలీన కథని వూహించలేక, పురాతన  కుటుంబ కథని అల్లేశారు. ఎప్పుడు తీసినా కుటుంబ కథలు అవే ముప్ఫై ఏళ్ల నాటి కథల్లాగే వుండాలన్న పద్ధతిలో ఇంకా తీస్తున్నారు. ఇలాటి కుటుంబ  సినిమాలు  ఎప్పుడో టీవీ సీరియల్స్ దెబ్బకి అయిపులేకుండా పోయాయి. 

          స్ట్రక్చర్ కొస్తే, క్రియేటివ్ స్కూలు కన్పిస్తుంది. ఇందువల్ల కథకి, పాత్రలకి ఒక చట్రం కన్పించదు. స్ట్రక్చర్ స్కూలు స్క్రీన్ ప్లే కున్నట్టు ప్లాట్ పాయింట్స్ వుండవు. కథని ఒకే పెద్ద ఫ్లాష్ బ్యాక్ లో చెప్పాలన్న సృజనాత్మకత వరకూ బాగానే వుంది. కానీ ఆ ఫ్లాష్ బ్యాకులో  విషయాన్ని సర్దుబాటు చేసిన తీరు దిశా దిక్కూ లేకుండా వుంది. 

          తండ్రీ కొడుకులు బైక్ మీద పోతూండగా వాళ్ళ గురించి ఒక వాయిసోవర్ లో చెబుతూ ఫ్లాష్ బ్యాక్  ప్రారంభమవుతుంది. ఈ ఫ్లాష్ బ్యాక్ ఉస్సూరంటూ చిన్నప్పటి కథ చెప్పడం దగ్గర్నుంచీ ఇంకా అదే పాత పద్ధతిలో స్పూన్ ఫీడింగ్ చేసస్తూ ప్రారంభమవుతుంది. పుట్టిన కొడుకు ఇంజనీరింగ్ పూర్తి  చేసే వరకూ ఇది కొనసాగుతుంది. ఇందులో తండ్రీ కొడుకుల అనుబంధం ఏమిటంటే, కొడుకు భవిష్యత్తు గురించి తండ్రి కష్టపడడం. అలాటి కొడుకు తీరా  ఉద్యోగం దొరక్క ఆవారాగా కామెడీలు చేస్తూ తిరగడం ప్రారంభిస్తాడు. ఎదురింట్లో దిగిన అమ్మాయిని ప్రేమిస్తాడు. ఈవెంట్ మేనేజి మెంట్ పెట్టి, ఒక పొరపాటు జరిగి పోలీస్ స్టేషన్లో పడతాడు. తండ్రి విడిపించుకొస్తూ గుండె పోటుకి గురై హాస్పిటల్లో పడతాడు. ఇదీ ఫస్టాఫ్ కథ. 

          స్క్రీన్ ప్లే పరంగా ఇది బిగినింగ్ విభాగమనుకుంటే,  దీని ముగింపు ఇంటర్వెల్లో గుండె పోటు సీనుతో వచ్చిందన్న మాట. అంటే ప్లాట్ పాయింట్ వన్ ఏర్పడాలన్న మాట. కానీ ఏర్పడదు. ప్లాట్ పాయింట్ వన్ అంటే  అక్కడెదురైన సమస్యతో హీరోకి ఒక లక్ష్యం ఏర్పడాలి. కానీ ఇంటర్వెల్ లో కూడా హీరో ఏం చేస్తాడో, కథేమిటో తేలదు. 

          ఇంటర్వెల్ తర్వాత హాస్పిటల్ సీను వస్తుంది. తండ్రి హాస్పిటల్లో వుండగా, ఆయన మిత్రుడు హీరోకి తండ్రి గురించిన ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. ఇందులో తండ్రికి గొప్ప ఫోటోగ్రాఫర్ కావాలని కోరిక. నేషనల్ జాగ్రఫిక్ లో ఫోటోలు కూడా ఎంపికై జాబ్  వస్తుంది. ఉన్న ఉద్యోగం వదిలేసి వెళ్ళడానికి సిద్ధం కూడా అవుతాడు. అంతలో బైక్ మీద కొడుకుని తీసుకుని భార్యతో పోతూ యాక్సిడెంట్ చేస్తాడు. ప్రాణాపాయ స్థితిలో  వున్న కొడుకు వైద్యం కోసమే లక్షలు అప్పు చేయాల్సివస్తుంది. దీంతో ఫోటోగ్రఫీ కలలు  కల్లలవుతాయి. సాధారణ ఉద్యోగిగానే ఉక్కు ఫ్యాక్టరీలో ఉండిపోతాడు. 

          అంటే,  చిన్నప్పుడు తన ప్రాణాలు కాపాడడానికి తండ్రి చేసుకున్న త్యాగం గురించి తెలుసుకున్న హీరో, ఇప్పటికైనా తండ్రికి కుటుంబ బాధ్యతలు వదిలించి,  ఫోటోగ్రఫీ కలని నెరవేర్చేందుకు ఒక లక్ష్యంతో కంకణ బద్ధుడవుతాడని ఆశిస్తాం. ఇదేం జరగదు.

          మళ్ళీ ఈవెంట్ మేనేజి మెంట్ లో పడతాడు. దీనికోసం హీరోయిన్ తో ఆమె బాస్ ని పడతాడు. ఆ బాస్ ఇంట్లో కొడుకుతో వున్న సమస్యని కిడ్నాప్ డ్రామా అడి పరిష్కరిస్తాడు. దీంతో అదే బాస్ తన చిన్న కొడుక్కి హీరో చెల్లెలితో పెళ్లి జరిపించేస్తాడు. దీని తర్వాత హీరో తండ్రికి కెమెరా కొని ప్రపంచం తిప్పడం, ఆ ఫోటోలు పోటీలో గెలవడం వగైరా జరిగిపోయి ముగిసిపోతుంది కథ. 

          ప్లాట్ పాయింట్ వన్ లేకపోవడం వల్ల హీరోకి సంఘర్షణ అంటూ, తద్వారా కథ పుట్టడమంటూ జరక్కుండా పోయింది. దీంతో ప్లాట్ పాయింట్ టూ కూడా ఏర్పడక ముగింపు చప్పగా తేలిపోయింది. ఉన్న విషయంలో కూడా మలుపులు, సన్నివేశాలు అన్నీ పాత  ఎన్నో సినిమాల్లో వచ్చినవే. వాటిని టెంప్లెట్స్ గా పెట్టేసుకుని విషయాన్ని నింపేశాడు. తండ్రికి ఫోటోగ్రఫీ కల అనే సెంట్రల్ ఐడియా జోలికి అసలే వెళ్ళకుండా, పైపైన ఉత్తుత్తిగా ఆ కోరిక కొడుకు తీర్చినట్టు చూపించేసి వదిలించుకున్నాడు. 

          కొత్త హీరోతో యూత్ ని ఆకర్షించే అంశం ఒక్కటీ లేదు. కానీ సెంట్రల్ పాయింటులో గొప్ప యూత్ అప్పీల్ వుంది. తండ్రిని ఇప్పటి కాలానికి తగ్గ ఫోటోగ్రాఫర్ ని చేసేందుకు తండ్రితో కలిసి హీరో చేసే విన్యాసాలు, సాహసాలు, వీరోచిత కృత్యాలూ వగైరా ఫన్నీగా, హాస్య భరితంగా, కొత్త కథగా  చూపించాల్సింది పోయి – ఏ ప్రేక్షకులకీ పట్టని పాత సంసారాల  ఏడ్పుల  కథలో హీరోని కుదేసి కుదేలు చేసేశాడు దర్శకుడు.

పాత్రచిత్రణ  
       కొడుకు పాత్ర ఎంత బలహీనమో, తండ్రి పాత్ర అంతే బలహీనం. కొడుకు మీద పెట్టిన శ్రద్ధ కూతురి మీద ఎందుకో పెట్టడు. కొడుకు చదువు, కొడుకు బాగు, అంతవరకే. పిల్లలిద్దర్నీ సమానంగా చూసే పద్ధతే లేదు. పిచ్చి పిల్ల ఏం  చదివిందో, ఆమెతో ఎప్పుడూ పెళ్లి చేసి పంపించెయ్యాలన్న గోలే. ఆమెని కూడా బాగా చదివించి వుంటే కొడుకుని తలదన్నేసి పోయేది.

          కొడుకు ఏదో తప్పు చేశాడని పోలీస్ స్టేషన్లో విడిపించుకొస్తాడు. కోపంతో వుంటాడు. నిజానికి అది తప్పేం కాదు. ఈవెంట్ మేనేజి మెంట్ లో తెలియక జరిగిన ఒక పొరపాటువల్ల ఒకడు గాయపడ్డాడు, అంతే. ఇక నుంచి ఇలా జరక్కుండా చూసుకోమంటే సరిపోతుంది. కానీ కొడుకేదో ఘోర నేరం చేసి పోలీస్ స్టేషన్ కెక్కించాడన్న ద్వేషం ఎందుకో అర్ధం గాదు. ఈ కోపంతో కొడుకుని బైక్ ఎక్కించుకుని పోతున్న వాడల్లా గుండె పోటుతో పడిపోతాడు. అప్పుడు కొడుకు ఒక అంబులెన్స్ ని ఆపుతాడు. ఆ అంబులెన్స్ లో ఇదివరకు నాటకమాడి నేస్తాలతో ఉచితంగా ప్రయాణం చేశాడు. దీని మీద ఆ డ్రైవర్ ఫైర్ అయి, ఇప్పుడు కూడా తండ్రితో నాటక కమాడుతున్నావని తిట్టి ఎక్కించుకోకుండా వెళ్ళిపోతాడు. దీంతో తండ్రికి కొడుకు మీద ఇంకింత మండిపోతుంది అంబులెన్స్ తో హీరో ఆడిన నాటకానికి. కానీ అదంతా గతం. ఇప్పుడు బాగుపడి ఈవెంట్ మేనేజి మెంట్ పెట్టుకున్నాడుగా?  ఇంకెందుకు అసహ్యం?

           ఇక్కడ గమనించాల్సింది ఇంకోటేమిటంటే, ఈ తండ్రి చిన్నప్పుడే కొడుకుని ఇదే బైక్ మీద ఎక్కించుకుని యాక్సిడెంట్ చేసి ప్రాణాపాయ స్థితిలోకి నెట్టాడు. ఇప్పుడు పెద్దయ్యాక కొడుకుని ఎక్కించుకుని రెండోసారీ యాక్సిడెంట్ చేశాడు. కాకపోతే తనకి గుండెపోటు వచ్చి ప్రాణాపాయ స్థితిలో పడ్డాడు. ఇది చెల్లుకి చెల్లు కదా? ఇంకేమిటి? ఇంకా చెప్పుకోవడానికి, ఇంత సినిమా తీయడానికీ కథ వుంటుందా? తీయాల్సిన అసలు కథ తీయకుండా ఏదో తీస్తే ఇంతకన్నా ఏం జరుగుతుంది?

 సికిందర్  


(తెలుగు రాజ్యం డాట్ కాం సౌజన్యంతో)