రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Monday, March 18, 2019

799 : సందేహాలు - సమాధానాలు



Q : 118’ సస్పెన్స్ థ్రిల్లర్  స్ర్కీన్ ప్లే సంగతులు  రాస్తారా? ఈ మధ్య మీరు తెలుగు సినిమాలకు స్క్రీన్ ప్లే సంగతులు రాయడం లేదు. చిన్న చిన్న సినిమాలు వస్తున్నాయి. వాటిని అసలు పట్టించుకోవడం లేదు. చిన్న సినిమాల పరిస్థితి బాగా లేదు కదా? అవి తీస్తున్న కొత్తవాళ్ళ కోసమైనా చిన్న సినిమాల స్క్రీన్ ప్లే సంగతులు రాయవచ్చు కదా?
పేర్లు వెల్లడించ వద్దన్న దర్శకుడు, రచయితతో బాటు, సంజీవ్ అసిస్టెంట్ డైరెక్టర్
A : 118, బద్లా లాంటి సస్పెన్స్ థ్రిల్లర్స్ ని థియేటర్లో చూసి స్క్రీన్ ప్లే సంగతులు రాయడం సాధ్యం కాదు. ఇవి డైలాగ్ కనెక్షన్స్ తో, ఎన్నో క్లూస్ కనెక్షన్స్ తో, వాటి లాజికల్ డ్రైవ్ తో సాగిపోయే ఇన్వెస్టిగేషన్ కథలు. వీటిని చాలా సార్లు ఆపి చూస్తూ రాయాలి. అందుకని ‘118’ అమెజాన్ లో విడుదలయ్యాక రాద్దాం. ఇక తెలుగు సినిమాలకి  స్క్రీన్ ప్లే సంగతులు రాయడం లేదనే విషయం. రాయడానికి వీటిలో కొత్త విషయాలుండడం లేదు. అవే టెంప్లెట్ సినిమాలు, అవే కథలు. ఇంకా పాత సినిమాలు బెటర్. నేర్చుకోవాల్సిందంతా వీటిలోనే వుందన్పిస్తోంది. దొంగ రాముడు, మనసే మందిరం, వివాహ బంధం...నాటి దర్శకులు, రచయితలూ నేర్చుకోవడానికి భావితరాల కిచ్చినట్టు, నేటి కథ - మాటలు -స్క్రీన్ ప్లే - దర్శకత్వం అన్నీ తామే అయి కూడా మేకర్లు ఏమిస్తున్నారు. వాళ్ళే ఒకర్నొకరు అనుకరిస్తూ టెంప్లెట్ సినిమాలే తీస్తున్నారు. వీళ్ళని ఫాలో అయ్యే అసిస్టెంట్లు వీళ్ళనుంచి కొత్తగా ఏం నేర్చుకుంటారు. 

          గత Q&A లో సీన్ ఎలా రాయాలో ‘జస్టిస్ చౌదరి’ ఉదాహరణగా విశ్లేషిస్తే విశేష స్పందన వచ్చింది. ఎన్నడూ లేనన్ని రికార్డు స్థాయి హిట్స్ వచ్చాయి. వందల్లో వుండే హిట్స్, ఆ రోజు వేలల్లో వచ్చాయి. ఎందరో సీన్ ఎలా రాయాలో ఇప్పుడు తమకు కొత్తగా తెలిసిందని ఎక్సైట్ అయ్యారు. నిజానికి సీన్ స్ట్రక్చర్ కి ఉదాహరణ కోసం ఇప్పటి సినిమాలేమున్నాయని చూస్తే కన్పించలేదు. పాత సినిమాల్లోకి వెళ్లి చూస్తే,  చూసిన మొట్ట మొదటి ‘జస్టిస్ చౌదరి’ లోనే కన్పించింది. కానీ పాత సినిమా ఉదాహరణ ఇస్తే కొత్త జనరేషన్ కేం నచ్చుతుందని కూడా అన్పించింది. అయినా తప్పక రాయాల్సి వచ్చింది. దీనికే కొత్త జనరేషన్ ఎక్సైటయి పోయారు. తీసుసుకోవాల్సింది పాత సినిమాల్లో వుంటే తీసు కోవడానికి అభ్యంతరం లేదన్న మాట!  

          కొత్తగా విడుదలయ్యే తెలుగు సినిమాలకి స్క్రీన్ ప్లే సంగతులు రాయబోతే సవాలక్ష లోపాలుంటున్నాయి. తీస్తున్న సినిమాలు 90 శాతం అట్టర్ ఫ్లాపులు. ఎందుకు ఫ్లాపయ్యాయో వీటి లోపాలు రాయడమే పనిగా మారింది. దీనికంటే అర్ధవంతమైన సినిమాలకి -  అవి పాతవైనా - రాయడం బెటరన్పిస్తోంది. ఓ సినిమా ఫ్లాపయితే ఎందుకు ఫ్లాపయ్యిందో మేం తెలుసుకోవాలి కదా, ఇది తెలుసుకోవడానికి బ్లాగుని విజిట్ చేస్తున్నాం కదా అనే వాళ్ళూ వున్నారు. తప్పదంటే అప్పుడప్పుడు ఈ పని కూడా చేద్దాం. అసలే ఫ్లాపయిన సినిమాలని వదిలెయ్యక, ఇంకా తప్పులు రాసి పీడించడం ఎందుకనే పాయింటు కూడా ఒకటుంది. 

          ఇక వారంవారం విడుదలై వెళ్లి పోతున్న చిన్న చిన్న సినిమాల సంగతి. వీటిలో కొన్నిటికి రివ్యూలు రాస్తూనే వున్నాం. స్క్రీన్ ప్లే సంగతులంటే వాటి స్థాయికి ఎక్కువ. మీరడిగారు కాబట్టి ఒకటి రెండు రాసి చూద్దాం. అప్పుడు పరిస్థితిలో మార్పు వస్తుందా? ఏమీ రాదు. ఈ చిన్న నిర్మాతలు, దర్శకులు ఇకంతే! 

Q : ‘కథ ఎలా చెప్పాలన్న దానికి మీరిచ్చిన వ్యాసం అద్భుతంగా వుంది. మా లాంటి వాళ్ళెందరికో ఉపయోగపడుతుంది. అయితే మల్టీ స్టారర్ కథ ఎలా చెప్పాలో వివరించలేదు.
శ్రీను ఆర్, అసిస్టెంట్ డైరెక్టర్ 
A :   మల్టీ స్టారర్ తీసే స్థాయికి వెళ్ళేటప్పటికి కథలు చెప్పడం ఎలాగూ వచ్చేస్తుంది. ఇప్పట్నుంచే ఎందుకు. ఇప్పుడేం తీసే అవకాశాలొస్తాయో అంతవరకూ తెలుసుకుంటే చాలు. ఐతే చిన్న హీరోలు ఇద్దరు ముగ్గుర్ని కలిపి తీసే ‘మినీ స్టారర్స్’ అవకాశముండొచ్చు. వీటికి కథలో ప్రధానపాత్రని దృష్టిలో పెట్టుకునే చెప్పాలి. ‘హేపీడేస్’ లో నల్గురు హీరోలున్నా అది వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రగా నడిచే కథే. కనుక ముందు ఆ మెయిన్ హీరోకి చెప్పాలి. చెప్పేటప్పుడు అతనే ప్రధాన పాత్రగా త్రీ పిల్లర్స్ ఆధారంగా చెప్పాలి, మిగిలిన హీరోల పాత్రల్ని కూడా కలిపి. మిగిలిన హీరోలకి చెప్పినప్పుడు ఫలానా అతను మెయిన్ హీరో, మీమీ క్యారెక్టర్స్ ఇవీ అని చెప్పొచ్చు. కథ గురించి అయిడియా ఇస్తే సరిపోతుంది. ఎస్టాబ్లిష్ అయిన డైరెక్టర్ అయితే ఎవరికీ కథ కూడా చెప్పరు. నీ క్యారెక్టర్ ఇదీ, నీ క్యారెక్టర్ ఇదీ...వచ్చి చేసుకోండని చెప్పేస్తారు. 

Q :  నేనొక స్క్రిప్టు రాశాను. ఎవర్ని అడిగినా తీసుకోవడం లేదు. ఇంకా రాయాల్సిన అయిడియాలున్నాయి. కానీ చూస్తే ఎవరూ తీసుకోని పరిస్థితి వుంది. నేను రైటర్ గా ఎలా ముందు కెళ్ళాలి?
జే ఎం ఆర్ రచయిత
A :   అది కిందటి శతాబ్దం సంగతి. ఈ శతాబ్దంలో స్క్రిప్టు రాసుకుంటే దర్శకుడు అయిపోవడమే. ఇతరుల స్క్రిప్టుతో దర్శకత్వం వహించాడనికెవరూ సిద్ధంగా లేరు. ఎవరి స్క్రిప్టు వాళ్ళదే. కాబట్టి రాసుకుంటే తీసుకోవడమే. లేదంటే దర్శకుల దగ్గర రైటర్ గా చేరడమే. ఇండిపెండెంట్ రైటర్ కాన్సెప్ట్ ఇక లేదు. ఐతే గియితే పెద్ద సినిమాలకి డైలాగు రచయితలవుతారేమో. డైలాగ్ రైటర్ గా కృషి చేసుకుంటే ఆ స్థాయికి వెళ్ళొచ్చు. 
సికిందర్