రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Thursday, November 10, 2022

1247 : రివ్యూ!


 

రచన- దర్శకత్వం : జయతీర్థ
తారాగణం : జైద్ ఖాన్,  సోనాల్ మోంటెరో, సుజయ్ శాస్త్రి, దేవరాజ్, అచ్యుత్ కుమార్ తదితరులు
సంగీతం బి. అజనీష్ లోక్‌నాథ్, ఛాయాగ్రహణం : అద్వైత గురుమూర్తి
బ్యానర్ : ఎన్ కె  ప్రొడక్షన్స్
నిర్మాతలు : తిలకరాజ్ బల్లాల్, ముజమ్మిల్ అహ్మద్ ఖాన్
విడుదల : నవంబర్ 4,  2022
***
        న్నడ సినిమాలు జాతీయంగా హిట్టవుతున్న నేపథ్యంలో మరో కన్నడ మూవీ  బనారస్ కన్నడ, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో యువ ప్రేక్షకుల వినోదం కోసం థియేటర్లని అలంకరించింది. కర్ణాటక ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ ఖాన్ కుమారుడు జైద్ ఖాన్ ఈ మూవీతో హీరోగా రంగప్రవేశం చేశాడు. మిస్టీరియస్ రోమాంటిక్ డ్రామాగా ప్రచారం చేసిన దీనికి జయతీర్ధ దర్శకుడు. ఇతను చెప్పే మిస్టీరియస్ రోమాంటిక్ డ్రామా ఏమిటో చూద్దాం...

కథ

సిద్ధార్థ్ (జైద్ ఖాన్) బీఎస్సీ ఫైనల్ స్టూడెంట్. ఇతను ధని (సోనాల్ మోంటెరో) ని కలిసి తను భవిష్యత్తులోంచి వచ్చానని, తామిద్దరికీ పెళ్ళయ్యిందనీ అంటాడు. ఇతను చెబుతున్న టైమ్ ట్రావెల్ విషయాలకి ఆసక్తి పెంచుకుని స్నేహం చేస్తుందామె. ఆమెతో చనువు పెంచుకుని ఒక రోజు ఆమె గదిలోకి వెళ్ళి నిద్రపోతున్న ఆమె ఫోటో తీస్తాడు. ఆ ఫోటో ఫ్రెండ్స్ కి చూపించి తను బెట్ గెలిచానని అంటాడు. ఓ అమ్మాయిని బెడ్రూంలో ఫోటో తీసి చూపించాలన్న బెట్ అది. ఒక ఫ్రెండ్ ఆ ఫోటో తీసుకుని సోషల్ మీడియాలో పెట్టేస్తాడు. దీంతో అవమానంగా ఫీలైన ధని అదృశ్యమైపోతుంది. ఆమెని వెతుక్కుంటూ బనారస్ (వారణాసి) చేరుకుని ఆమెకి సారీ చెప్పాలని ప్రయత్నిస్తాడు సిద్ధార్థ్. చాలా బెట్టు చేసి చివరికి క్షమిస్తుంది.

ఇద్దరూ ప్రేమించుకుంటారు. బనారస్ లో ఆమె బాబాయ్ దగ్గర వుంటోంది. అయితే ప్రేమలో పడ్డాక సిద్ధార్థ్ టైమ్ లూప్ లో పడిపోతాడు. అతడి జీవితంలో ఒకే రోజు జరిగిన సంఘటనలే రిపీట్ అవుతూంటాయి. ఈ కాల వలయంలోని బయటపడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తాడు. ఇలా ఇందులో విజయం సాధించి తిరిగి మామూలు జీవితంలోకి వచ్చాడా? ఇద్దరి ప్రేమ సుఖాంతమయ్యిందా? ఇదీ మిగతా కథ.

ఎలా వుంది కథ

ఇటీవలి ఒకే ఒక జీవితం లాగా టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో కథ ప్రారంభమైందనుకుంటాం. కానీ టైమ్ ట్రావెల్ కాకుండా  టైమ్ లూప్ కాన్సెప్ట్ గా మారిపోతుంది. గడుపుతున్న రోజు తెల్లారితే తేదీ మారకుండా, మళ్ళీ అదే తేదీతో రిపీటయ్యే, అవే సంఘనలు జరిగే, టైమ్ లూప్ కాన్సెప్ట్ గా మార్చి చేసిన కథ పూర్తిగా విఫలమైంది.

సిద్ధార్థ్ ఫస్టాఫ్ లో ధనిని ట్రాప్ చేసి ఫోటో తీశాక, తప్పు తెలుసుకుని మాయమై పోయిన ఆమెని బనారస్ వెళ్ళి పట్టుకుని, సారీ చెప్పే ప్రయత్నంతోనే ఫస్టాఫ్ గంటా 20 నిమిషాలు గడిచి పోతుంది. ప్రారంభంలో టైమ్ ట్రావెల్ ని ప్రస్తావించి చెప్పిన కథంతా, టైం ట్రావెల్ జోలికి ఎంతకీ వెళ్ళకుండా, చీప్ రోటీన్ లవ్ స్టోరీగా సాగుతుంది. పాతగా అన్పించే సీన్లు, పేలవమైన డైలాగులు, నత్తనడక కథనం.

సారీ చెప్పడానికి రిపీటవుతూ వుండే అవే సీన్లు, బనారస్ లో పుణ్య క్షేత్రాల టూరింగ్ అన్నట్టు సాగుతాయి. ఇక వచ్చే మూడు పాటలైతే భరించడం కష్టం. ఆమె మీద పూర్తి భక్తి పాట ఒకటి పెట్టేశారు ఈ రోజుల్లో. ఇది రోమాంటిక్ డ్రామానా, సైన్స్ ఫిక్షనా, భక్తి సినిమానా అర్ధం గాకుండా వుంటుంది.

ఈ మధ్య నార్త్ పుణ్యక్షేత్రాల నేపథ్యంలో సినిమాలు తీస్తే నార్త్ లో - రాజకీయాల పుణ్యమాని మత భక్తి పెరిగిపోయిన ప్రేక్షకులతో బాక్సాఫీసు బద్ధలవుతోందనే ఒక నమ్మకంతో సినిమాలు తీస్తున్న ట్రెండ్ మొదలైంది. కానీ మొన్న  రామ్ సేతుతో, ఇవ్వాళ  బనారస్ తో పథకం పారలేదు.

ఫస్టాఫ్ గంటా 20 నిమిషాల తర్వాత ఎలాగో పాయింటుకొచ్చి (పాయింటు మార్చి), సెకండాఫ్ ని దర్శించుకుంటే, మళ్ళీ ఈ గంటా 10 నిమిషాలూ టైమ్ లూప్ కాన్సెప్ట్ తమ మీదపడి విలవిల లాడతారు ప్రేక్షకులు. విల విల లాడడానికి ప్రేక్షకులు లేరనేది వేరే విషయం-మనలాంటి కొందరు అమాయకులు తప్ప. టైమ్ లూప్ లో చిక్కుకున్న సిద్ధార్థ్ కి ఆ వొక రోజే మళ్ళీ మళ్ళీ రిపీటవుతూంటుంది. కొన్ని మార్పులతో అవే సీన్లు మళ్ళీ మళ్ళీ చూస్తూ పోవాలి. ఇలా నాల్గు సార్లు జరిగాక లూప్ లోంచి బయటపడతాడు. బ్రతుకు జీవుడా అని మనం కూడా.

ఫస్టాఫ్ ఒక సినిమా, సెకండాఫ్ వేరే సినిమా చూస్తున్నట్టు వుంటుంది. ఈ టైమ్ లూప్ లో దృశ్యాలు కూడా సస్పెన్స్, హింస, రక్తపాతంతో వుంటాయి. పుణ్య క్షేత్రంలో రక్తపాతం. ప్రేమ కథతో వయొలెన్స్. మిస్టీరియస్ రోమాంటిక్ డ్రామా అంటే ఇదే. ఈ టైం లూప్ దృశ్యాల వల్ల సెకండాఫ్ లో హీరో హీరోయిన్ల రోమాన్సుకి చోటే లేకుండా పోయింది. చక్కగా టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో సెంటిమెంటల్  ప్రేమ కథేదో నడుపుకోక, టైమ్ లూప్ అంటూ సెకెండాఫ్ వేస్ట్ చేశాడు. దీన్ని పానిండియా రిలీజ్ చేశారు.

నటనలు- సాంకేతికాలు

కొత్త హీరో జైద్ కష్టపడి ఎలాగో నటించాడు. జైద్ బనారస్ ఎలా వెళ్తాడని సినిమాని బాయ్ కాట్ చేసేంత దృష్టి పడలేదు బాయ్ కాట్ బ్యాచులకి. వాళ్ళు షారూఖ్ ఖాన్ ని బాయ్ కాట్ చేస్తూ బిజీగా వున్నట్టున్నారు. అయితే అన్ని గుళ్ళు గోపురాలు తిరిగే జైద్ ఒకసారైనా బొట్టు పెట్టుకోలేదేమిటా అన్పించొచ్చు. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే కొడుకైన జైద్ సేఫ్ గా సేఫ్ గా సినిమాతో బయటపడ్డాడు. అయితే ఇలాటి అర్ధం కాని ప్రయోగాలు కాకుండా అర్ధమయ్యే సినిమాలు నటిస్తే మంచిది.

హీరోయిన్ సోనాల్ మోంటెరో సాంప్రదాయ పాత్ర పోషించింది. చూడ్డానికి బాగానే వుంది. పాత్రకి చదస్తాలు చాలా వున్నాయి. యువ ప్రేక్షకుల్ని ఇవి ఆకట్టుకోవు. అయితే సెకండాఫ్ లో కన్పించే సమస్యే లేదు చివర్లో తప్ప. సెకండాఫ్ టైం లూప్ లో పడి హీరో కొట్టుకోవడంతోనే సరిపోయింది.

కెమెరా వర్క్ అంత అద్భుతమేం కాదు. బడ్జెట్ పరిమితుల వల్ల వారణాసి లొకేషన్స్, విజువల్స్ సాదాగా వున్నాయి. పాటలు, నేపథ్య సంగీతం మాత్రం అపస్వరాలు పలుకుతున్నట్టు వున్నాయి. మొత్తం మీద దర్శకుడు జయతీర్ధ చేయించిన ఈ తీర్ధయాత్ర రెండున్నర గంటల తీరని వ్యధగా చెప్పుకోవచ్చు. 

—సికిందర్