రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Thursday, April 14, 2022

1157 : రివ్యూ!


 రచన  - దర్శకత్వం : ప్రశాంత్ నీల్
తారాగణం : యష్, శ్రీనిధి శెట్టి, సంజయ్ దత్, రవీనా టాండన్, ఈశ్వరీరావు, రావురమేష్, ప్రకాష్ రాజ్, రామచంద్ర రాజు, టిఎస్ నాగాభరణ, అచ్యుత్ కుమార్ తదితరులు
సంగీతం : రవీ బస్రూర్, ఛాయాగ్రహణం : భువన్ గౌడ
బ్యానర్ : హోంబోలే ఫిలిమ్స్

నిర్మాత : విజయ్ కిరగందూర్
బడ్జెట్ :  100 కోట్లు
విడుదల : ఏప్రెల్ 14, 2022
***
    2018 లో కేజీఎఫ్ : చాప్టర్ -1 సక్సెస్ తర్వాత కేజీఎఫ్ : చాప్టర్-2 అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డులు సృష్టించింది. నార్త్ లో కేజీఎఫ్ : చాప్టర్ -1 లైఫ్ టైమ్ వసూళ్ళు ఒక్క రోజులోనే  కేజీఎఫ్ : చాప్టర్-2 అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వచ్చేశాయి. ఇంత సంచలనం సృష్టిస్తున్న కేజీఫ్ తెలుగు రాష్ట్రాల్లో సైతం పెంచిన రేట్లతో అడ్వాన్స్ బుకింగ్స్ లో ముందుంది. మరో సారి రాకింగ్ స్టార్ యశ్- ప్రశాంత్ నీల్ టీమ్ ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసేందుకు ఈ కల్ట్ మూవీ సీక్వెల్ తో వచ్చేశారు. ఇదెలా వుందో ఓసారి చూద్దాం...

కథ

    చాప్టర్ వన్ గరుడ మరణంతో ముగిశాక, ఇప్పుడు గరుడ వల్ల నరకం అనుభవించిన కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లక్షలాది కార్మికులు గరుడని అంతమొందించిన రాకీ భాయ్ (యశ్) ని తమ దైవంగా కొలుస్తారు. కేజీఎఫ్ కి సుల్తాన్ గా ప్రకటించుకున్న రాకీ, ఇలాటి బంగారు గనులు ఇంకా చాలా వున్నాయని తెలుసుకుని, కార్మికుల కొడుకులతో యువ సైన్యం తయారు చేసుకుని ఆ గనుల మీద దండెత్తుతాడు. అక్కడ జయంట్ కింగ్ ధీర (సంజయ్ దత్) భారీ సైన్యంతో వుంటాడు. అక్కడ అధీరతో తలపడ్డ రాకీ తీవ్రంగా గాయపడి మృత్యుముఖంలోకి పోతాడు. రీనా (శ్రీనిధీ శెట్టి) అతడికి సపర్యలు చేస్తుంది. రాకీ ఇక ఇక్కడుండ కూడదని దుబాయ్ వెళ్ళిపోతాడు, అక్కడ గోల్డ్ స్మగ్లర్ ఇనాయత్ ఖలీల్ (బాలకృష్ణ) ని డబుల్ క్రాస్ చేసి, భారీ ఎత్తున మారణాయుధాలతో తిరిగి వచ్చి  అధీరనీ, అతడి సైన్యాన్నీ చావగొడతాడు. ప్రాణాలతో వున్న ఆధీరని పారిపొమ్మని చెప్పి, అతడి ఇలాకాని కబ్జా చేసుకుంటాడు. దీంతో పూర్తి స్థాయిలో గనుల్ని సొంతం చేసుకున్న రాకీకి ఇంకో ప్రమాదం ఎదురవుతుంది...

        రాకీ ని పట్టుకోవడంలో విఫలమవుతున్న సీబీఐ  చీఫ్ రాఘవన్ (రావు రమేష్) ప్రధాన మంత్రి  రమికా సేన్ (రవీనా టాండన్) ని ఆశ్రయిస్తాడు. దీంతో ప్రధాని రాకీని టార్గెట్ చేస్తుంది. మరోవైపు ఆధీర తిరిగొస్తాడు. ఇక రాకీ ఇప్పుడేం చేశాడన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

    ఇది కథ కాదు, గాథ. దీన్ని కథ లాగా చూసి అదిలేదు, ఇది లేదని అనుకోకూడదు. మొదటి భాగం కూడా గాథే. జీవితంలో నువ్వు ధనవంతుడిగానే చనిపోవాలని పేదరికం అనుభవించిన తల్లి చెప్పిన మాట పట్టుకుని హీరో కొనసాగించే ప్రయాణమే ఈ రెండు భాగాల గాథ. ఈ గాథని బిగినింగ్-ఇంటర్వెల్- ఎండ్ గా మొదటి భాగంలో కథనాన్ని విభజించినట్టే, రెండో భాగంలో కూడా విభజించానన్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్.

        రెండు భాగాల గాథని, లేదా కథని దేనికది పూర్తి గాథ లేదా కథ అన్పించేలా విభజించడం కరెక్టు పద్ధతి. పుష్ప లో ఇలా చేయలేదని చెప్పుకున్నాం. పుష్ప మొదటి భాగంలో వున్నది సాంతం బిగినింగ్ విభాగమే. దీంతో ఏమిటో అర్ధంగాని వెలితి ఫీలయ్యారు ప్రేక్షకులు.

        ఎడ్డీ మర్ఫీతో బేవర్లీ హిల్స్ కాప్ సినిమా లుంటాయి. దాని నిర్మాత రచయితలకి ఒకటే మాట చెప్పేవాడు- మీరేం చేస్తారో నాకు తెలీదు, కథనంలో పది నిమిషాలకో సారి మాత్రం బ్యాంగ్ పడాలంతే - అని. అలాగే బుర్ర బద్ధలు చేసుకుని బ్యాంగులు తయారు చేసేవాళ్ళు రచయితలు. అలా ఆ సిరీస్ సినిమాలు హిట్టయ్యాయి.

        ఈ టెక్నిక్ మారుతీ నానితో తీసిన భలే భలే మగాడివోయ్ లో కన్పిస్తుంది. కథలో నాని పాత్రకి కథకి ముఖ్యావసరమైన గోల్ వుండదు. కానీ నాని కథనంలో ఏదో చేసి పది నిమిషాలకోసారి బ్యాంగ్ ఇస్తూ పోతాడు. ఇదే కథని నిలబెట్టింది.

        కేజీఎఫ్ సినిమాలు కూడా ఇంతే. హీరోకి ధనవంతుడయ్యే గోల్ వుంటుంది. ఈ గోల్ కోసం పోరాటం ఒక విలన్ తో వుండదు. ఒకరి తర్వాత ఒకరు విలన్లు మారుతూ వుంటారు. ఈ ఒక హీరో- ఒక గోల్- ఒక విలన్ అనే చట్రంలో గాథ లేని లోపాన్ని కవర్ చేస్తూ, దర్శకుడు చేసిందే పది నిమిషాలకో బ్యాంగ్ అనే టెక్నిక్ ప్రయోగమనుకోవాలి. ఈ బ్యాంగులన్నీ హీరో పాత్ర ఎలివేషన్ గురించే. విరోధులతో హీరో భారీ యాక్షన్ సీన్స్ కి దిగి ఎలివేట్ అవడం, కార్మిక సమూహం జేజేలు పలకడం. ఇలా ఓ వ్యక్తి పూజే ఈ గాథ.

        దీంతో గోల్ కోసం ప్రయాణంలో హీరో ఎలివేషన్స్ పరంపరే ఈ గాథకి కథనమయ్యింది. అయితే గాథ అన్నాక రిపీట్ ఆడియెన్స్ వుండరు. ఒకసారి చూసిన ప్రేక్షకులు మరోసారి రారు. ఒకసారి చూడడమే ఎక్కువ. కథ అయితేనే, అదీ బావుంటేనే, రిపీట్ ఆడియెన్స్ వుంటారు.

నటనలు -సాంకేతికాలు

    రాకింగ్ స్టార్, యశ్ (నవీన్ కుమార్ గౌడ) చాప్టర్ వన్ తో ఆల్రెడీ        గ్లోబల్ కల్ట్ ఫిగర్ అయ్యాడు. నార్త్ లో రికార్డు స్థాయిలో 4400 థియేటర్లలో చాప్టర్ టూ విడుదల చేయడాన్ని బట్టి అర్ధం జేసుకోవచ్చు అతడి పాపులారిటీ స్థాయి. ఇది సీరియస్ గా వుండే డార్క్ క్యారక్టర్. హార్డ్ కోర్ డైలాగులు. రక్తం కళ్ళజూసే క్రూరత్వం. మదర్ వాక్పాలన అనే ఏకసూత్ర కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితిలో అమలుపర్చే సంకల్పం. ఈ క్యారక్టరైజేషన్ ఎక్కడా కుంటు పడకుండా నిర్వహించిన తీరుతో ఉత్తీర్ణుడయ్యాడు. ఒకదాన్ని మించొకటి యాక్షన్ సీన్స్ తన ఫ్యాన్ బేస్ సంతృప్తి పడేలా చేశాడు. నిన్న బీస్ట్ భరించలేక ఏకంగా సినిమాహాల్లో వెండితెరకి విజయ్ ఫ్యాన్స్ నిప్పంటించిన చారిత్రాత్మక ఘటన తెలిసిందే.  

        ఇక అధీర గా సంజయ్ దత్ క్రూర విలనీ, రూపం, మార్వెల్ మల్టీవర్స్ సినిమాల్లోని విలన్ థెనోస్ ని పోలి వుందని తనే చెప్పుకున్నాడు గనుక, దీన్నే దృష్టిలో పెట్టుకుని నటించినట్టున్నాడు. అయితే వయసు బాగా మీద బడింది.

        మల్టీపుల్ ఫ్లాష్ బ్యాక్స్ లో ఈ కథ చెప్పే పాత్రలో ప్రకాష్ రాజ్, కథ వినే జర్నలిస్టు పాత్రలో మాళవికా అవినాష్ కన్పిస్తారు. ప్రధానమంత్రిగా రవీనా టాండన్ ప్రధాని పాత్ర నటించిన ఇతర నటీమణుల్లాగే ఇందిరాగాంధీనే రిఫరెన్స్ గా పెట్టుకున్నట్టుంది. ఇక హీరోయిన్ గా ముందు హీరోకి యాంటీగా, తర్వాత రోమాంటిగ్గా కనిపించే శ్రీనిధీ శెట్టి ప్రత్యేకాకర్షణ.

        కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అంతా దర్శకుడి విజన్లో వొక మాయా జగత్తు. ఔటాఫ్ ది వరల్డ్ కాల్పనిక ప్రపంచం. ఈ విజువల్ సృష్టి, కళాదర్శకత్వం, సెట్స్ నిర్మాణం, దీనికి డార్క్ మూడ్ సినిమాటోగ్రఫీ, అసంఖ్యాక కార్మిక జనులు, క్రూర మానవ మృగాలూ -ఇదంతా మనల్ని ఉన్న లోకాన్ని మరిపించేసి ఫాంటసీ జర్నీలోకి బదలాయించేస్తాయి.

        దీనికి బిజీఎం, సౌండ్ ఎఫెక్ట్స్ ఇంకో యెత్తు. విజువల్ స్ట్రక్చర్  వచ్చేసి మిడ్ షాట్స్, క్లోజప్స్, ఎక్స్ ట్రీమ్ క్లోజప్ షాట్స్ తో నటుల్ని చూపించడంతో అవి కదలకుండా కూర్చోబెట్టేస్తాయి. యాక్షన్ సీన్స్ కి కూడా ఈ విజువల్ స్ట్రక్చరే వుంది. అరుదుగా  లాంగ్ షాట్స్ వుంటాయి.

        అయితే ఫస్టాఫ్ ఒక యాక్షన్ సీన్లో బ్లీచవుట్ షాట్స్ వేసి కళ్ళకిబ్బంది కల్గించడం వుంది. ఇలా ఏనాడో 2002 లో చెన్నకేశవ రెడ్డి లో వేసి మానేసిన విషయం తెలిసిందే. ఐతే వేర్వేరు లొకేషన్స్ లో సీన్స్ ని, కొన్ని చోట్ల టైమ్ అండ్ స్పేస్ ఐక్యతతో రియల్ టైమ్ లో ఎడిట్ చేయడం బావుంది.

చివరికేమిటి
బిగ్ స్క్రీన్ మీద ఈ నాన్ స్టాప్ యాక్షన్ విజువల్ వండర్ చూస్తూ పోవాలంతే, లాజిక్ చూడకూడదు. మొదట అధీర రాకీని చంపకుండా ఎందుకు వదిలాడు, తర్వాత రాకీ కూడా అధీర ని చంపకుండా ఎందుకు వదిలాడు-లాంటి ప్రశ్నలు వస్తే సహించాలి.  కొన్ని చోట్ల ఏ సీను ఎందుకొస్తోందో కన్ఫ్యూజన్ గా వున్నా, హీరో ఎలివేషన్స్ చూడాలంతే. ఎలివేషన్ తర్వాత ఎలివేషన్ గా యాక్షన్ సీన్స్ వస్తూ, లాజిక్ ఎలిమినేట్ అవుతూంటే హీరో జర్నీ చూడాలంతే.

        ఒక విలన్ చుట్టూ గాథ కాకుండా, గోల్ కోసం హీరో జర్నీ కావడంతో సినిమాటిక్ లిబర్టీని అంగీకరించాలి.  ఇలా ఎంత వరకని హీరో ఎలివేట్ అవగలడు. చాప్టర్ వన్ లోనే ఎలివేషన్ల పరంపరతో ఏం చేసినా ఒప్పించ గల  స్టార్ డమ్ వచ్చేయడంతో, ఇప్పుడు సెకండ్ చాప్టర్లో గన్ పట్టుకుని పార్లమెంటు లోకెళ్ళి పోయి కాల్చి పారెయ్య గడు. గన్ తోనే  ప్రధాని ముందు కాలు మీద కాలేసుకుని కూర్చుని, తన శిలాశాసనం చెప్పేయగలడు.

        అతన్ని అంతమొందించడానికి ఏకంగా ప్రధాని త్రివిధ దళాల్ని ఆదేశించకపోతే ఎలివేషన్ ఏముంటుంది. అతను ఏకంగా గోల్డు రాశులతో షిప్ లో పారిపోకపోతే ఎలివేషనేం వుంటుంది. ఆఫ్ఘనిస్తాన్ ని తాలిబన్లు ఆక్రమించుకుంటున్నప్పుడు డబ్బు మూటగట్టుకుని పారిపోయిన ప్రధాని విజువల్స్ ని చూశామా? ఇప్పుడు హీరో అలా పారిపోతూంటే చూడొచ్చు. యూక్రేన్ మీద రష్యా వైమానిక దాడుల్ని బిగ్ స్క్రీన్ మీద చూశామా? ఇప్పుడు హీరో స్థావరాల మీద వైమానిక దాడుల్ని చూడొచ్చు. హీరో ఎలివేషన్, ఎలివేషన్, ఎలివేషన్, ఇంతే. ఇంకేమీ అడక్కూడదు.

        కొసమెరుపు :  ఇందులో ఒక ముస్లిం మదర్ క్యారక్టర్, ఆమె కొడుకు క్యారక్టర్ క్రియేట్ చేసి చాలా స్క్రీన్ స్పేస్ ఇచ్చారు. కొడుకు హీరో సైన్యంలో వుంటాడు. హీరోకోసం ఏం చేయాలో చేసి ప్రాణాలర్పిస్తాడు. అయినా మదర్ ఓర్చుకుని, హీరో గెలుపు కోసం ఆశీర్వదించి, ప్రోత్సహించి, అతడితోటే వుండడం చేస్తుంది. పాత్రకి ముగింపు కూడా ఎమోషనల్ గా వుంటుంది. ఐతే ప్రస్తుతం కర్నాటకలో నెలకొన్న మత ఉద్రిక్త వాతావరణ పరిస్థితుల్లో ఈ కన్నడ సినిమా దృశ్యాలు వుండనిస్తారా?

—సికిందర్