స్టేషన్
కి హీరో చేరుకోగానే బయట అభిమానుల కోలాహలం, తోపులాట, గోలగోల. లోపల ప్లాట్ ఫాం మీద
అతన్ని చూసిన ప్రయాణీకుల కోలాహలం, తోపులాట, గోలగోల. ఎలాగో హీరో తోసుకుంటూ ట్రైను
ఎక్కేస్తే ట్రైను లోపల కోలాహలం, తోపులాట, గోలగోల. ఉక్కిరి బి క్కివుతూ హీరో
అలసిపోయి సీట్లో కూలబడడం...
అప్పుడు
ఈ చిత్రీకరణ అంతా చూసి - ‘నో న్నో!! ...బెత్తం తీసుక్కొడతా అలా తీశావంటే! ముందు
వెళ్ళి జీవితం తెలుసుకో, తర్వాత వచ్చి జీవం
పోయ్ సినిమా ఆర్టుకి!’ అని కేకేలేస్తాడు పై లోకాల్లోంచి సత్యజిత్ రే!
అందుకని ప్రముఖ సినిమా సమీక్షకుడు, ప్రచురణకర్త సూర్య
ప్రకాష్ జోస్యుల ఎంతో శ్రమించి, మేకర్స్ కి తమకో ఇమేజిని డెవలప్ చేసుకోవడం కోసం,
ఒక విలువైన పుస్తకాన్ని మార్కెట్ లోకి తెచ్చారు. ‘ఫిల్మ్ మేకర్స్ కి మాత్రమే -
సులువుగా గొప్ప ఫిల్మ్ మేకర్స్ టెక్నిక్స్ తెలుసుకోండి’ అన్న టైటిల్ తో. 196
పేజీలున్న ఈ పుస్తకం ధర 249 రూపాయలు.
ఇందులో కె విశ్వనాథ్ నుంచీ వంశీ వరకూ, రాజ్ కుమార్
హిరానీ నుంచీ అనురాగ్ కశ్యప్ వరకూ, అటు పాశ్చాత్యంలో క్రిస్టఫర్ నోలన్ నుంచీ
మైఖేల్ బే వరకూ, 25 మంది ప్రసిద్ధ దర్శకుల కళా జీవితం మొత్తాన్నీ వడబోసి, సారం
తీసి, సంగ్రహంగా ముందుంచారు. దీన్ని మినిమలిస్టిక్ (కనిష్ట వాదం) అప్రోచ్ అన్నారు.
అంటే మొత్తం వాళ్ళ కళా జీవితాన్ని సింప్లీఫై చేసి నాలుగు వాక్యాల్లో చెప్పడం. అంటే
ఎంతో చదివి తెలుసుకునే శ్రమ లేకుండా. సత్యజిత్ రే సినిమాల్ని పరిశీలించి, సింపుల్
గా ఆయన్ని కెమెరా పట్టుకున్న మానవతా వాది అనేశారు. కె. విశ్వనాథ్ సినిమాల్ని
పరిశీలించి -‘విశ్వనాథ్ తన సినిమాల్లో ప్రేక్షకుల ఊహాశక్తినే నమ్మారు, ఆయన
నిశ్శబ్దాన్నే అతి పెద్ద సంభాషణగా మలిచారు’ అని తేల్చారు.
ఇలా ఒక్కో దర్శకుడ్ని ప్రసిద్ధి చేసిన అనితరసాధ్య
టెక్నిక్స్ ఏమిటో మినిమలిస్టిక్ అప్రోచ్ తో సూటిగా చెప్పుకొస్తూ, ప్రతీ దర్శకుడికీ
వుండే విజువల్ సిగ్నేచర్ (సంతకం) ఏమిటో కూడా చెప్పారు. ఉదాహరణకి సత్యజిత్ రే సంతకం
చూస్తే - ‘లాంగ్ టేక్స్, లైట్ అండ్ షాడో ప్లే, సింపుల్ కంపోజిషన్స్, హ్యాండ్- డ్రాన్
టైటిల్స్’ కనిపిస్తాయినీ, అదే విశ్వనాథ్ సంతకంగా చూస్తే, ‘క్లోజప్స్, ఆచారాన్ని
ప్రతిబింబించే ఫ్రేమ్స్, భారతీయ నృత్యం ఒక
తిరుగుబాటు కావడం, ఎర్తీ టోన్స్’ కనిపిస్తాయనీ అన్నారు. హిందీలో అనురాగ్ కశ్యప్
సంతకం చూస్తే, ‘గ్రాఫిక్ హింస, నియాన్- నోయర్ లైటింగ్, లాంగ్ టేక్స్, మెటా రిఫరెన్సెస్’
తో వుంటుందనీ పేర్కొన్నారు. అలాగే మైఖేల్ బే సంతకం చూస్తే- ‘గోల్డెన్ అవర్ ఎక్స్
ఫ్లోషన్స్, 3600 హీరో షాట్స్, హైపర్ యాక్టివ్ ఎడిటింగ్ అండ్ కెమెరా
మూవ్ మెంట్, స్లో- మో హీరోయిక్ వాక్’ అని చెప్పారు.
ఇంకా ఎస్ ఎస్ రాజమౌళి, మణిరత్నం, వెట్రి మారన్, వంశీ,
సంజయ్ లీలా భన్సాలీ, ఇమ్తియాజ్ అలీ, ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్, మార్టిన్ స్కార్సెసీ,
స్టీవెన్ స్పీల్ బెర్గ్, జేమ్స్ కామెరూన్, చార్లీ చాప్లిన్ ...ఇలా విభిన్న జానర్లని
పోషించిన దర్శక మహాశయుల కళా వ్యక్తిత్వాన్ని (ఈ పదం తప్పు కావొచ్చు) సులభతరం చేసి నాలుగు
మాటల్లో నేటి మేకర్స్ ముందుంచారు సూర్య ప్రకాష్.
ఇంతేకాదు, ఇంకా ఆయా దర్శకుల్ని ఏ ఫిలాసఫీ లేదా ఏ
భావజాలం నడిపిస్తోందీ చెప్పారు. ‘మధ్యతరగతి ఒక సెట్ కాదు, మైండ్ సెట్’ అని ఫిక్స్
అయి వంశీ సినిమాలు తీశారనీ, ‘సాధారణ మనిషి జీవితం లోని అసాధారణ క్షణాలని గాథలుగా
మార్చే క్రియేటర్’ అల్ ఫాన్సో క్వారోన్ అనీ చెప్పారు. ఇలా 25 మంది దర్శకులని
నడిపిస్తున్న ఫిలాసఫీ ఏమిటో స్పష్టం చేశారు.
ఇలా టెక్నిక్, విజువల్ సిగ్నేచర్, ఫిలాసఫీ ఈ మూడు
పార్శ్వాలు వున్నప్పుడు దర్శకుడికి ఓ ఇమేజీ స్థిరపడుతుందని అర్ధం జేసుకోవచ్చు.
మేకర్లు ఈ పుస్తకాన్ని ఇంకెలా చూడాలి? నేటి ఒక్కో మేకర్ ఒక్కో జానర్ లో కృషి
చేస్తున్న పరిస్థితి లేదు. ఏ జానర్ పడితే ఆ జానర్ సినిమాలు తీస్తూ దేంతోనూ ఒక ఇమేజిని
సృష్టించుకోలేక పోతున్నారు. డార్క్ కామెడీ అంటారు, నెక్స్ట్ రోమాంటిక్ కామెడీ
అంటారు, ఇంకా నెక్స్ట్ యాక్షన్ అంటారు, హార్రర్ అంటారు... ఇలా జాక్ ఆఫ్ ఆల్
మాస్టర్ ఆఫ్ నన్ అన్పించుకునే ఎందుకూ పనికిరాని దుస్థితిలో వుంటున్నారు. ఒక
జంధ్యాల, ఒక ఈవీవీ సత్యనారాయణ, ఒక వంశీ లాగా కామెడీ దర్శకుల్లేని లోటు వుందనీ, కనుక
ఈ జానర్ దర్శకుడుగా ఎందుకు పేరు తెచ్చుకోరని అన్నామనుకోండి, మొహం ఎటో తిప్పుకుంటారు.
ఇలాటి వర్గానికి ఈ పుస్తకం పనిచెయ్యదు.
నిజంగా ఆసక్తి, అవగాహన వున్న ఒక జానర్ ని నమ్మి, ఆ
జానర్ దర్శకుడుగా బ్రాండ్ నేమ్ తో ఓ పాతిక ముప్ఫయ్యేళ్ళు పర్మనెంట్ మార్కెట్ ని సృష్టించుకుని,
జీవితాంతం దాని ఫలితాల్ని అనుభవించాలనుకుంటే మాత్రం ఈ పుస్తకం తోడ్పడుతుంది. ఈ
పుస్తకం ఏదో చదివి వదిలెయ్యడం గాక, చదివి ఈ పుస్తకంలా అవ్వాలి. అప్పుడే
అవ్వాలనుకున్న మేకర్ అవుతారు. ఇందులో ఆయా జానర్స్ కి పేరుబడ్డ దర్శకుల ప్రస్తావనే
వుంది. రోమాంటిక్ జానర్ లో కృషి చేయాలనుకుంటే మణిరత్నం, సంజయ్ లీలా భన్సాలీనీ, లేదూ
హై కాన్సెప్ట్ బిగ్ యాక్షన్ జానర్ అనుకుంటే రాజమౌళినీ, మైఖేల్ బేనీ పాటించ వచ్చు.
ఇలా ఏ జానర్ కి ఆ దర్శకుడి సంతకాన్ని ఫోర్జరీ చేసినా ఏం కాదు. సినిమాల్ని కాపీ
కొడితే కేసవచ్చేమో గానీ, సంతకాల్ని ఫోర్జరీ చేస్తే ఎవరూ పట్టుకోరు. ఆయా జానర్
దర్శకుల టెక్నిక్, సంతకం, ఫిలాసఫీ –ఈ మూడూ ఆధారంగా జేసుకుని బ్రాండ్ ఇమేజిని
సృష్టించుకోవచ్చు.
ఈ పుస్తకం పేజీలకి పేజీలు చదవడానికి ఇబ్బంది
అన్పించేలా మ్యాటర్ తో నిండిపోయి లేదు. పేజీకి నాల్గే లైన్లు విషయం వుంటుంది.
మిగతా ఖాళీ అంతా హై క్వాలిటీ లైనార్ట్ తో బొమ్మలు నిండిపోయి వుంటాయి. కనుక పేజీలు కంటికింపుగా,
రిలీఫ్ గా వుంటాయి. చివరి 35 పేజీలు ఇంకెందరో దర్శకుల ఫిల్మ్ మేకింగ్ కోట్స్
ఇచ్చారు. ఇవి కూడా ఉపయోగపడతాయి. వర్ధమాన మేకర్స్ కెరీర్ భద్రత కోసం సూర్యప్రకాష్
జోస్యుల దేశంలోనే ఇలాటి తొలి గైడ్ లా రూపకల్పన చేసిన ఈ బుక్ ని, ‘హ్యాండ్ బుక్ ఆఫ్ డిసిప్లిన్’ గా
దగ్గరుంచుకుంటే పోయేదేమీ లేదు, వృత్తి బానిస సంకెళ్ళు తప్ప!
9704683520 కి ఫోన్ చేసి పుస్తకం పొందవచ్చు.
-సికిందర్
