రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Tuesday, April 14, 2020

928 : క్రైం థ్రిల్లర్ జానర్ మర్యాద - 6

     
      క్రైం థ్రిల్లర్ జానర్ మర్యాద వ్యాసాల్లో అక్కడక్కడ ప్రస్తావిస్తున్న జానర్ మర్యాదలు అన్నిటినీ కలిపి ఒక చోట లిస్టుగా ఇస్తే సౌకర్యంగా వుంటుందని కొందరు కోరారు. ఈ వ్యాసం ముగించాక ఆ పని చేద్దాం. ఈ జానర్ ని రియలిస్టిక్ రూపకల్పన కూడా చేసి యూత్ ఓరియెంటెడ్ గా చూపించొచ్చు. హిందీ ‘పింక్’ లో  కొందరు యూత్ రిసార్ట్ లో పార్టీ చేసుకుంటున్నప్పుడు, ఒకడు తాప్సీతో మిస్ బిహేవ్ చేస్తే, ఆమె బాటిలెత్తి కొట్టేస్తుంది. ఇది హత్యాయత్నం కేసుకింద నమోదై ఆమె ఇరుక్కుంటుంది. ఇలా రియలిస్టిక్ గా అన్పించే -జీవితంలో సహజంగా జరిగిపోయే సంఘటనల్ని- యూత్ జీవితాల్లోంచి, ప్రవర్తనల్లోంచి  తీసుకుంటే ఎక్కువ కనెక్ట్ అయ్యే అవకాశముంటుంది. తమిళ డబ్బింగ్ ‘16 - డి’ ఇలాంటిదే. తెలుగు ‘మత్తు వదలరా’ జానర్ వేరైనా యూత్ ప్రవర్తనే పాయింటు. మరొకటేమిటంటే, నేటి సినిమాలకి మార్కెట్ యాస్పెక్ట్ రోమాంటిక్స్ లేదా ఎకనమిక్స్ అని చాలా సార్లు చెప్పుకున్నాం. ఈ యాస్పెక్ట్స్ తో కూడా ఈ జానర్ సినిమాలు తీసుకోవచ్చు. ప్రస్తుత కరోనా ముప్పువల్ల ఎకనమిక్స్ తో బాటు రోమాంటిక్స్ కీ పెద్ద సమస్య వచ్చి పడింది. లాక్ డౌన్ వల్ల  బాయ్ ఫ్రెండ్స్ - గర్ల్ ఫ్రెండ్స్ కలుసుకోలేక, షికార్లు తిరగలేక  నానా అవస్థలు పడుతున్నారు. రోమాన్సులు రోకలి బండలయ్యాయి. క్రిమినల్స్ ఆర్ధిక నేరాలు చేయలేక పాపం ఇబ్బంది పడుతున్నారు. దేశంలో ఏటా పోలీస్ స్టేషన్లలో మూడు కోట్ల ఎఫ్ఐఆర్ లు నమోదవుతాయి. అంటే రోజుకి 80 వేలు. అలాంటిది ఇప్పుడు 80 కూడా నమోదు కావడం లేదు. దేశంలో ప్రతీరోజూ 377  మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తారు. అలాంటిది ఇప్పుడు ఒక్కరు కూడా మరణించడం లేదు. 

       
క్రైం థ్రిల్లర్ జానర్ అతి హింసని ఒప్పుకోదు. హత్యా పరిశోధనలతో వుండే పోలీస్ క్రైం థ్రిల్లర్ వేరు, మాఫియా లేదా ఇతర క్రిమినల్ చర్యలతో వుండే యాక్షన్ థ్రిల్లర్ వేరు. యాక్షన్ థ్రిల్లర్ లో ఎంతైనా హింస వుండొచ్చు. ఘోరంగా నరుక్కోవచ్చు, కాల్చుకోవచ్చు, పేల్చుకోవచ్చు, చీల్చుకుని చెండాడుకో వచ్చు, రక్తాలు పారిస్తూ అరుపులు అరుచుకోవచ్చు. ఇవన్నీ పక్కనబెట్టి, పోలీస్ క్రైం థ్రిల్లర్ నీటుగా వుంటుంది. యాక్షన్ థ్రిల్లర్ మాస్ మసాలా అయితే, పోలీస్ థ్రిల్లర్ క్లాస్ - మాస్ ఎంటర్ టైనర్. ఇందులో హింస మితిమీరితే అది ఇన్వెస్టిగేషన్ ని మింగేస్తుంది. అదికూడా యాక్షన్ థ్రిల్లరై పోతుంది తప్ప, క్రైం థ్రిల్లర్ అంటూ ట్రైలర్స్ వేసుకుని ప్రచారం చేసుకోవడానికుండదు. హింస ఎంత ఎక్కువైతే అంత తక్కువ క్రైం థ్రిల్లరవుతుంది. 

        ఈ సందర్భంగా ఒక హాలీవుడ్ రచయిత తను చేపట్టిన క్రైం థ్రిల్లర్ స్క్రిప్టు గురించి చెప్పుకొచ్చాడు...ఇందులో హంతకుడు 10 హత్యలు చేస్తాడు. రచయితగా తను ఈ 10 హత్యల్నీ చిత్రిస్తూ పోతే, కథ హింసాత్మకంగా మారిపోతుంది. అంటే కాస్సేపటికి ఈ చేస్తున్న హత్యలు బోరు కొట్టేస్తాయి కూడా ప్రేక్షకులకి. అందువల్ల తను ఇలా చేశాడు - హంతకుడు ఇప్పుడు కథలో మూడు హత్యలే చేసుకుపోతాడు. పోలీస్ డిటెక్టివ్ కి దర్యాప్తు క్రమంలో ఆ హంతకుడు గతంలో ఇంకో 7 హత్యలు చేశాడని తెలుస్తుంది. ఇలా 7 హత్యల్ని గతంలోకి సమాచార రూపంలో నెట్టేయడం వల్ల, లైవ్ గా చూపించే ప్రమాదం, బోరు తప్పాయి. 

        మర్డర్ తో సస్పెన్స్ వుండదంటాడు. మర్డర్ జరిగేందుకు అవకాశమున్న కిడ్నాప్ తో సస్పెన్స్ వుంటుందంటాడు. ప్రేక్షకుల్ని కథనుంచి ఎమోషనల్ గా దూరం చేయాలనుకుంటే, హత్య తర్వాత హత్య తర్వాత హత్య... హింసాత్మకంగా నింపెయ్యవచ్చంటాడు. ఎమోషన్ తోబాటు టెన్షన్ తో ప్రేక్షకుల్ని కనెక్ట్ చేయాలనుకుంటే, హింస తగ్గించి, జరగబోయే హత్యగురించి ఉత్కంఠ పెంచాలంటాడు. అత్యంత భయపెట్టే సినిమాల్లో అతి తక్కువ హింస వుంటుందని గుర్తు చేస్తాడు. 

       
క్రైం థ్రిల్లర్ లో చంపడానికి
      ఎంత బలమైన కారణమున్నా ఆ కారణంతో చంపుకుంటూ పోకూడదు. మనిషి ప్రాణాలకి విలువివ్వాలి. మనిషి ప్రాణాలెంత విలువైనవో ప్రేక్షకులు ఫీలయ్యేట్టు చేయాలి. మనిషి ప్రాణాలే చీప్ అన్నట్టు చంపుకుపోతే, చీప్ అయినదానికి ప్రేక్షకులు ఫీల్ కారు. ఆ చంపడాల్ని కూడా కేర్ చెయ్యరు. మర్డర్ సీన్లు మార్కెట్ యాస్పెక్ట్ లేక వేస్ట్ అయిపోతాయి. ‘ఈక్వలైజర్ 2’ అనే మాఫియా యాక్షన్లో, దర్శకుడు ఆంటన్ ఫుఖ్వా, హత్యా దృశ్యాల్లో వాణ్ణి చంపవద్దంటూ మనం తల్లడిల్లేంత  ఎమోషన్ని రగిలిస్తాడు.

        ఇక టెక్నికల్ గా చెప్పుకుంటే, క్రైం థ్రిల్లర్ డార్క్ మూవీ కాదు. దీన్ని డార్క్ మూడ్ క్రియేట్ అయ్యేలా బ్లూ లేదా బ్రౌన్ టింట్ ఇస్తూ డార్క్ లైటింగ్ తో చిత్రించడం పొరపాటు. క్రైం థ్రిల్లర్ బీభత్స భయానక రసం కాదు. బీభత్స రసానికి దేవత మహాకాలుడు. మహాకాలుడు ముదురు నీలం. ఈ రంగు హార్రర్ కి, వయొలెంట్ మూవీస్ కి సరిపోతుంది. క్రైం థ్రిల్లర్ అద్భుత రసం. అద్భుత రసానికి దేవత బ్రహ్మ. బ్రహ్మ పసుపు వర్ణం. అద్భుత రసం వర్ణం పసుపు. కాబట్టి క్రైం థ్రిల్లర్ ని కలర్ఫుల్ గా, ప్లెజెంట్ గా చిత్రీకరించాల్సి వుంటుంది. జేమ్స్ బాండ్ సినిమాలు అద్భుతరసంతో కలర్ఫుల్ గా, ప్లెజెంట్ గా, యూనివర్సల్ ఎంటర్ టైనర్లుగా వుంటున్నవి కాస్తా, ఇటీవల అతి హింసతో పిల్లలు చూడలేని విధంగా వుంటున్నాయని విమర్శలొస్తున్నాయి. ఇదే రసమో అర్ధంకాని వేషమైపోయింది. 


        క్రైం థ్రిల్లర్ అన్నాక ఇన్వెస్టిగేషన్ - ఆధారంగానే కేసు సాల్వ్ అవ్వాలి. ప్రేక్షకులు ఇన్వెస్టిగేషన్ మీదే ఫోకస్ అయి వుండి, ఇన్వెస్టిగేషన్ తోనే థ్రిల్లవుతూ వుండి, ఇన్వెస్టిగేషన్ కే జేజేలు పలికేట్టు చేయడమే మేకర్ ప్రధాన కర్తవ్యం కావాలి. బయటికొచ్చిన ప్రేక్షకుడు - భలే వుంది ఇన్వెస్టిగేషన్ - అని ఛానెల్ మైకులో పబ్లిక్ టాక్ చెప్పేటట్టు వుండాలి. 

       ఇవన్నీ మిడిల్ కథనంలో- 
    పాటించవలసిన సంగతులు... క్రైం థ్రిల్లర్ కథనం సీన్ టు సీన్ సస్పెన్స్ తో వుంటుందని చెప్పుకున్నాం. హంతకుడెవరో ప్రేక్షకులకి ఓపెన్ చేసి, తర్వాత పోలీస్ డిటెక్టివ్ హీరోకి హంతకుణ్ణి ఓపెన్ చేసి - ఇక వాడినెలా పట్టుకుంటాడన్న సస్పెన్స్ తో సీన్లు నడిపించడం. ఈ బాపతు థ్రిల్లర్ కాన్ఫ్లిక్ట్ ఎంత గాభరా పుట్టించేట్టు వుంటే అంత సక్సెస్ అవుతుంది. అంటే కాన్ఫ్లిక్ట్ లో హంతకుడి మోటివ్ లేదా ప్లానింగ్ అంత గుబులు పుట్టించాలి. ఈ కాన్ఫ్లిక్ట్ తెలిసి ప్రేక్షకులు బిక్కచచ్చిపోయి కుర్చీకి అతుక్కుపోవాలి. ఇందుకే క్రియేటివ్ పార్టు రాయడం అత్యంత కష్టమైన వ్యవహారమని గత వ్యాసంలో చెప్పుకున్నది. హంతకుడనే వాడు పోలీస్ డిటెక్టివ్ హీరోకి కి ముత్తాత అన్పించాలి. తను చేయబోయే మర్డర్ ప్రపంచం దశాబ్దాల పాటు గుర్తుంచుకుంటుందని హంతక వెధవ అన్నాడనుకుందాం...లేదా - నీ బాడీ పార్టు లాగి నువ్వూహించని ట్విస్టు ఇస్తానని పోలీస్ డిటెక్టివ్ కి వార్నింగ్ ఇచ్చాడనుకుందాం, ఇలాటివి కాన్ఫ్లిక్ట్ ని టైం బాంబుగా మార్చేస్తాయి. 

        పోలీస్ డిటెక్టివ్ హీరోకి ఎలాగూ ఒక క్యారక్టరైజేషన్ ఇస్తారు. హంతకుడికి, అంటే విలన్ కి కూడా ఓ క్యారక్టరైజేషన్ ఇవ్వాలి. ఈ క్యారక్టరైజేషన్స్ లో వేర్వేరు దృక్పథాల్నివ్వాలి. పోలీస్ డిటెక్టివ్ హీరోకి - నేరస్థులు నేరాలతో శాంతిభద్రతల సమస్య కాదు, పారిశుధ్య సమస్య సృష్టిస్తున్నారనీ, నేరాలు చేసి నేరస్థలాన్ని చంఢాలంగా వదిలేసి పోతున్నారనీ, ఆ వెధవల్ని పట్టుకుని ఆ రక్తం, ఆ చెత్త, ఆ కంపు తన్ని క్లీన్ చేయించాలన్న దృక్పథం ఇచ్చామనుకుందాం - అప్పుడు హంతకుణ్ణి అపరిశుభ్రత ఏమాత్రం సహించని, పరమ నీట్ నెస్ ని కోరుకునే నీటుగాడి దృక్పథంతో చూపిస్తే, కాన్ఫ్లిక్ట్ కి ఈ వ్యక్తిత్వాల వైరుధ్యం కూడా జతపడి ఇంకింత ఆసక్తి కల్గిస్తుంది.   

        కథని టైం లాక్ తో కాకుండా, ఆప్షన్ లాక్ తో నడిపిస్తే ఇన్వెస్టిగేషన్ బతుకుతుంది. యాక్షన్ థ్రిల్లర్ ని టైం లాక్ తో చూపించ వచ్చు. లేదా 
 ‘మనసే మందిరం’ లాంటి ఫ్యామిలీ డ్రామాలో చూపించవచ్చు. 60 నిమిషాల్లో ఏదో జరగబోతోందని, ఆలోగా దాన్ని నివారించాలనీ, గడియారం ముల్లు చూపిస్తూ కథనాన్ని టెన్షన్ తో పరుగులు తీయించవచ్చు. కానీ ఇన్వెస్టిగేషన్ ప్రధానమైన క్రైం థ్రిల్లర్ లో ఇలా చేస్తే ఇన్వెస్టిగేషన్ కి చోటుండదు, యాక్షన్ ఆక్రమించేస్తుంది. జానర్ మర్యాద చెడుతుంది.

        
కౌంట్ డౌన్లూ, డెడ్ లైన్లూ- 
      అవసరమనుకుంటే ఇన్వెస్టిగేషనంతా పూర్తయ్యాక క్లయిమాక్స్ లో పెట్టుకోవచ్చు. క్లయిమాక్స్ లో హంతకుడితో టైం లాక్ యాక్షన్ నడిపించవచ్చు. అసలు ఈ జానర్ కథకి టైం లాక్ అనేది లేకుండా, కాలపరిమితి లేని ఆప్షన్ లాక్ తో ఫ్రీగా వదిలేస్తేనే హాయి.  

     కరుణ, సానుభూతి, మానసిక చురుకుదనం, మానసిక దృఢత్వం, సమయస్ఫూర్తి, నిబద్ధత, సమయానుకూల కాఠిన్యం, ఊహాశక్తి, కమ్యునికేషన్ స్కిల్స్, క్రైసిస్ మేనేజ్మెంట్, కామన్ సెన్స్, బలమైన నైతిక విలువలు, చట్టాల పట్ల గౌరవమూ  మొదలైనవి పోలీస్ డిటెక్టివ్ పాత్ర చిత్రణలో భాగమవ్వాలి.

        ఈ మిడిల్ విభాగంలో జరిగే బిజినెస్ ప్రకారం హంతకుడికీ పోలీస్ డిటెక్టివ్ కీ మధ్య వుండే యాక్షన్ - రియాక్షన్ల (సంఘర్షణ) కథనంలో హోరాహోరీని శాస్త్రీయంగా చూపాలనుకుంటే ఒకపని చెయ్యొచ్చు : 2500 ఏళ్ల క్రితం చైనీస్ సైనిక జనరల్, యుద్ధ వ్యూహ కర్త సుంజీ రాసిన సుప్రసిద్ధ గ్రంథం, ‘ది ఆర్ట్ ఆఫ్ వార్’ ని పరిశీలించ వచ్చు. ఇందులో పోలీస్ డిటెక్టివ్ కీ హంతకుడికీ మధ్య పోరాటంలో కావాల్సిన అనేక టిప్స్ దొరుకుతాయి. పీడీఎఫ్ లింక్ వ్యాసం చివర వుంది. ఆసక్తి వుంటే డౌన్ లోడ్ చేసుకోవచ్చు.   హంతకుడితో పోరాటంలో పోలీస్ డిటెక్టివ్ సమయానుకూలంగా పాసివ్ అవచ్చు (“He will win who knows when to fight and when not to fight.అంటాడు సుంజీ, The best way to fight is not to fight at all.అని కూడా అంటాడు. మనం మనకి తోచింది, వూహించి ఏవో అర్ధంలేని పోరాటాలు రాసేకన్నా, అసలు యుద్ధ కళేమిటో తెలుసుకుని చిత్రిస్తే బావుండొచ్చు). 

       స్క్రిప్టు రాయడం రోజుల్లో పూర్తయ్యే పనికాదు. కథలో ఎక్కడ దేనికి ఏది అవసరమో నిత్యం కథని ప్లాన్ చేసేప్పుడు గుర్తిస్తూ, ఆ మేరకు సమాచారం పొంది -రీసెర్చి చేసి, కథలో చిత్రణ చేసుకోవాలి. సినిమాలు చూసి మనకే అంతా తెలుసనీ రాసెయ్యకూడదు. ఆ సినిమాలు అలా తీయడానికి తెరవెనుక ఏం రీసెర్చి చేశారో, ఎన్ని మల్లగుల్లాలు పడ్డారో ఎవరికి తెలుసు. డిస్కషన్స్ లో తేలిక భావం కన్పిస్తూంటుంది. కారణం ఇవ్వాళా అరచేతిలో ప్రపంచ సినిమాలన్నీ వుండడంతో - ఆ సినిమాల సీన్లు షాట్లు మనసులో ఫిక్స్ అయిపోయి, ఇతరులేంటి చెప్పేదని డిస్కషన్స్ ని బేఖాతరు చేస్తున్న సంస్కృతి కన్పిస్తోంది. చూసిన సినిమాల్లోంచి షాట్లు సీన్లు ఆ పళంగా తెచ్చి పెట్టుకోలేరు. అవి ఏ సందర్భంగా ఏ సన్నివేశానికి ఏ ఉద్దేశంతో సృష్టించారో తెలుసుకోకుండా కాపీ కొట్టుకోలేరు. నీ బిడ్డని నువ్వే పుట్టించగలవ్, ఇతరుల వీర్యదానంతో కాదు. 

        పోలీస్ డిటెక్టివ్ కీ హంతకుడికీ- 
      మధ్య పోరాటంలో ప్రేక్షకులు సఫరవాలి. ప్రేక్షకుల్ని  వీలైనంత సఫర్ చేయాలంటాడు హిచ్ కాక్. ఐతే పోలీస్ డిటెక్టివ్ పూర్తిగా సీరియస్ గా  వుండనవసరం లేదు. కథలో వినోదాత్మక విలువకి కూడా చోటివ్వాలి. వీలైన చోటల్లా నవ్వించాలి. ఫన్నీ పోలీస్ క్యారక్టరైనా ఫర్వాలేదు, ఒక పార్శ్వంలో హంతకుడి చేతిలో అతడి సఫరింగ్ ని చూపిస్తూనే. ఫన్నీ పోలీస్ క్యారక్టర్ కి పీటర్ సెల్లర్స్ నటించిన ‘పింక్ పాంథర్’ సిరీస్ సినిమాలు చూస్తే  ఒక ఐడియా వస్తుంది. ఈ సిరీస్ లో అతను తెలివితక్కువ ఇన్స్ పెక్టర్ జాక్స్ క్లూసో గా ఎంటర్ టైన్ చేస్తాడు. పోలీస్ డిటెక్టివ్ పాత్ర మాస్ యాక్షన్ సినిమాల్లో పోలీస్ పాత్రలా వుండ కూడదని ఎలా అనుకున్నామో, హంతకుడు కూడా అలాటి విలన్ కాకూడదు.  

        కథనంలో డైనమిక్స్ ముఖ్యం. ఒకటనుకుంటే ఇంకోటి జరగడం. పోలీసులు డాగ్ స్క్వాడ్ తో బాంబుని నిర్వీర్యం చేయడానికి వెళ్ళారనుకుందాం. అప్పుడు బాంబుని నిర్వీర్యం చేస్తూంటే అకస్మాత్తుగా భూకంపం రావడం లాంటిది. అనూహ్య సంఘటనలతో కథనం చేస్తే చైతన్య వంతంగా వుంటుంది కథ.

        క్రైం థ్రిల్లర్ కథ నిర్వహించలేక పాటలతో కామెడీలతో స్క్రీన్ స్పేస్ ని భర్తీ చేసే పని చేయకూడదు. యాక్షన్ తో కూడా భర్తీ చేయకూడదు. యాక్షన్ కూర్చోబెట్టే సస్పెన్స్ కాదు. అది పే ఆఫ్. సస్పెన్స్ సెటప్. ఆయా సీన్లలో సస్పెన్స్ ని సెటప్ చేసినప్పుడు, ఇప్పుడేం జరుగుతుందా అని ఎదురు చూస్తారు ప్రేక్షకులు. ఆ సస్పెన్స్ కి ఇప్పుడేం జరగాలా అని ఆలోచించకుండా, రివర్స్ లో ఇంకేం జరిపించాలా అని ఆలోచించాలి. పైన చెప్పుకున్నట్టు, బాంబు తీసేయబోతే భూకంపం వచ్చినట్టు. 

        బేసిగ్గా చెప్పుకోవాలంటే, కథలనేవి సంఘటనలకి సమాచార రిపోర్టింగులు కావు. కథలనేవి మార్పుని చూపించేటివి. ఒక సిట్యుయేషన్, ఒక పాత్ర, లేదా పాత్రల మధ్య సంబంధాలు ఎలా మార్పుకి లొనయ్యాయో చూపించేవే కథలు. కనుక సస్పెన్స్ కథనం మార్పు ని దృష్టిలో పెట్టుకుని సాగాలి. అప్పుడే కథ డైనమిక్ గా వస్తుంది. 

        మామూలుగా కథనమంటే ఏమిటి - 
    ఒక సీన్లో ఒక ప్రశ్న విసిరి, ఇంకో సీన్లో దానికి జవాబు చెప్పడమేగా? ప్రశ్నలు జవాబులేగా కథనమంటే? ప్రతీ సీనూ ప్రేక్షకులకి చేస్తున్న ఒక వాగ్దానం కావాలి. హీరోయిన్ అందాల్ని తెరనిండా చూపిస్తూంటే, ఇది దేనికో లీడ్ కావాలి తప్ప, కేవలం యూత్ అప్పీల్ కోసమని వృధా చేయకూడదు. ఈ జానర్లో ప్రతీ సీనూ ఆడిటింగ్ జరుగుతుంది. ప్రతీ సీనూ సస్పెన్స్ కి లింకై వుంటుంది. వృధాగా వుండదు. 

        ఇక ఇంటర్వెల్, క్లయిమాక్సులు. ఇంటర్వెల్లో పోలీస్ డిటెక్టివా - హంతకుడా -ఎవరు ట్విస్ట్ ఇవ్వాలి? ఇలాటి జానర్ కథలో పరీక్షకి గురయ్యేది పోలీస్ డిటెక్టివ్, పరీక్షపెట్టేది హంతకుడు. పోలీస్ డిటెక్టివ్ స్కిల్స్ కి పరీక్ష. ఇలాటి కథని పోలీస్ యంత్రాంగపు పనితీరుకి మోడల్ గా చూపిస్తాం. హంతకుల పనితీరుకి మోడల్ గా హంతకులకి చూపించం. అందుకని ప్రేక్షకులు పోలీస్ డిటెక్టివ్ హీరోనే ఫాలో అయ్యేలా పరీక్షలన్నీ అతడికే వుంటాయి. ఇంటర్వెల్లో అతనే పెద్ద దెబ్బ తింటాడు హంతకుడి చేతిలో. క్లయిమాక్స్ లో పోలీస్ డిటెక్టివ్ హీరో దెబ్బకి, హంతకుడు పుంజాలు తెంపుకుని పారిపోతూ వుంటాడు, దట్సాల్.

        ఈ జానర్ సినిమాలు హాలీవుడ్ లోలాగా పెద్ద హీరోలు చెయ్యరు. చిన్న హీరోల మీద ఆధారపడాలి. చిన్న హీరోలతో ఈ జానర్ కి మైలేజీ సంబంధమైన లోటు లుంటాయి. దీన్ని క్రియేటివ్ యాస్పెక్ట్ ని మరికొంత విస్తరించుకుని సరిచేసుకోవాలి. ప్రేక్షకులు సినిమా సాంతం అదే చిన్న హీరో మొహం, అదే హంతకుడి మొహం చూస్తూ కూర్చోలేరన్పిస్తే, క్లయిమాక్స్ లో ఈలలు పడేలా ఇంకో పెద్ద నోటెడ్ విలన్ ఆర్టిస్టుని అదనంగా దిగుమతి చేసుకోవాలి. లేదా ఇతర సీన్లలో బడ్జెట్ మిగుల్చుకుని క్లయిమాక్స్ లో బిగ్ యాక్షన్ ని ప్లాన్ చేసుకోవాలి. ఇలాటి క్రియేటివ్ యాస్పెక్టులు అన్వేషించుకోవాలి. క్రియేటివ్ స్టేజి అంటే ఒకసారి రాసేసేది కాదు. రాస్తూ రాస్తూ రాస్తూ తిరగ రాస్తూ గీస్తూ పూస్తూ వుండేది. 


   ఈ జానర్ కథ పది నిమిషాల్లో వినిపించడాని కుండదు. పది నిమిషాల్లో ప్రేమ కథనో, యాక్షన్ కథనో విన్పించ వచ్చు. ఇలాటి ఇన్వెస్టిగేషన్ ఆధారిత క్రైం థ్రిల్లర్ విన్పించాలంటే పది నిమిషాల్లో విషయమేమీ వుండదు. కనీసం అరగంటైనా పడుతుంది. స్క్రీన్ ప్లే బేస్డ్ అని ఏదో పదం వాడేస్తూంటారు కదా, అలాటి స్క్రీ ప్లే బేస్డ్ జాతికి చెందుతుంది ఈ క్రైం థ్రిల్లర్ గొడవ. అంటే కథనం చెప్పుకుంటూ పోతే తప్ప అర్ధమవడం కష్టమన్న మాట. ఈ కథనాన్ని అరగంట లోపు కుదించడం సాధ్యం కాదు. ఒక అసోసియేట్ వున్నాడు. రెండేళ్ళుగా ఇలాటి కథని విన్పించీ విన్పించీ - వెనుక నుంచి ముందుకూ, ముందు నుంచి వెనక్కీ, ఎలాపడితే అలా - ఎప్పుడు పడీ అప్పుడు - ఎంత సేపంటే అంత సేపూ -విన్పించే స్థితి కొచ్చాడు. 

        కథ రాసేశాక క్రాస్ చెకింగ్ చేసుకోకుండా హీరోకో నిర్మాతకో విన్పించ కూడదు. ఒకవేళ అది లోపరహితంగా వుండి ఓకే అయితే ఫర్వాలేదు. లోపాలుంటే మాత్రం ఇరుక్కుని పోతారు. వాళ్ళు ఓకే చేశాక క్రాస్ చెకింగ్ మొదలు పెట్టుకుంటే, అప్పుడు లోపాలు బయట పెడితే, వాటిని మార్చడానికి వాళ్ళు అంగీకరించక పోతే (అవి లోపాలని తెలీక), ఇంకేం చెయ్యడానికి వీలుండదు. కాబట్టి ముందే క్రాస్ చెకింగ్ చేయించుకుని, పూర్తి సంతృప్తి కలిగాకే విన్పించాలి.   

(ఐపోయింది) 
సికిందర్
The Art Of War, pdf