రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

16, మే 2016, సోమవారం

స్క్రీన్ ప్లే సంగతులు -3
క్స్ పొజిషన్ –వివరణ అనేది స్క్రీన్ ప్లేకి బద్ధ శత్రువు లాంటిది. ఒక పాత్ర గురించో, జరిగిపోయిన సంఘటనల గురించో తెలియ జేయడానికి క్లాస్ రూమ్ పాఠం లాగా ఇంకో పాత్ర వచ్చి చెబుతూ పోతూంటే అది డాక్యుమెంటరీ అవుతుంది. ఇందుకే ‘తని ఒరువన్’ ప్లాట్ పాయింట్  వన్ తొమ్మిది నిమిషాలూ సినిమా చూస్తున్నట్టు గాక, న్యూస్ రీల్ చూస్తున్నట్టు వుంటుంది. అయితే వివరణ ఇవ్వాల్సి వస్తే,  ఇలా పాఠంలా చెప్పకుండా, సినిమా కళలో కలిసిపోయే నాటకీయ ప్రక్రియతో చెప్తే స్క్రీన్ ప్లే శిల్పం దెబ్బ తినదు. ఐతే ‘తని ఒరువన్’ ప్లాట్ పాయింట్  వన్ లో,  కథతో సంబంధం లేని అంశాలతో ఆ సుదీర్ఘ ఉపన్యాసం అవసరమే లేదన్నది వేరే విషయం. కానీ ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ఎక్స్ పొజిషన్ తో ఈ బిగినింగ్ విభాగం ముగిశాకా, మిడిల్ విభాగం మొదలవగానే  మళ్ళీ  విలన్ గురించి ఇంకో  చాంతాడంత డాక్యుమెంటరీ మొదలవుతుంది. ఈ ఎక్స్ పొజిషన్  అక్షరాలా ఆరు నిమిషాలు వుంటుంది!
No rules please,
Rules are for fools!

       ఒకవేళ విలన్ అభిమన్యు చరిత్రని  ఎక్స్ పొజిషన్ తో చెప్పాల్సే వస్తే, 1972 లో ‘గాడ్ ఫాదర్’ లో అనుసరించిన పద్ధతిని పాటించాల్సింది. సినిమా ప్రారంభంలోనే గాడ్ ఫాదర్ కూతురి  పెళ్లి  వేడుకల్లో  గాడ్ ఫాదర్ కుటుంబానికి ఎంత భయానక మాఫియా చరిత్ర వుందో ఒకటిన్నర నిమిషాల్లో నాటకీయంగా ఒక సన్నివేశం కల్పించడం ద్వారా విజువల్ గా చూపించేస్తారు -  అదీ నిలిచిపోయే సినిమాటిక్ కళ అంటే!

      మిడిల్ : మిడిల్ అంటే ప్లాట్ పాయింట్ వన్ దగ్గర  గుర్తించిన సమస్యతో/ శత్రువుతో హీరో ఎదుర్కొనే  సంఘర్షణ. పడుతూ లేస్తూ సాగించే ప్రయాణం. చివర్లో పరిష్కార మార్గం కనుగొనడం.
 
        ప్లాట్ పాయింట్ వన్ తో ఏం చేసుకోవాలో ఎటూ తెల్చుకోలేకపోయిన మిత్రన్,  దాన్నలా అసంపూర్ణంగా వదిలేసి, బైపాస్ రోడ్లో మిడిల్లోకి ఎంటరవాలని ట్రై చేస్తాడు, కానీ ఒక టోల్ గేట్ దగ్గర దొరికిపోతాడు. స్క్రీన్ ప్లే కి ఈ ప్లాట్ పాయింట్ వన్ ని కనిపెట్టిందెవరా అన్నదే అతడి బాధ. దీంతో లేనిపోని చావొచ్చింది. ఈ మిడిల్లో అసలు తన సమస్య ఏమిటో, ఎవరితో పోరాడాలో ఇంకా స్పష్టత లేదు. ఇలాటి కథనం ఇంకే సినిమాలోనూ చూసి వుండం బహుశా. చీకట్లో రాయి విసిరి చూద్దా మన్నట్టు- ఎవరో మైన్స్ మాఫియా చెల్లదురైని కనిపెట్టాలనుకుంటాడు. పట్ట పగలు వెంబడిస్తాడు. రాత్రి పూటే పోలీస్ అకాడెమీ క్యాంపస్ నుంచి ఎలా జారుకుంటున్నాడనే ప్రశ్న ఉండగానే, ఇప్పుడు పట్ట పగలు  ట్రైనింగ్ కి హాజరవకుండా ఎలా  నగరంలో కొలీగ్స్ ని వెంటేసుకుని యధేచ్చగా సంచరిస్తున్నాడన్న ఇంకో ప్రశ్న లేవనెత్తుతాడు.

                                                ***
        మూస ఫార్ములా కథ సహేతుకంగా, హేతుబద్దంగా వుండాలని లేదు. కానీ పోలీస్ ప్రొసీజురల్- ఇన్వెస్టిగేషన్ ఆధారిత కథ లాజికల్ గా ఉండి తీరాల్సిందే. ఒక వాస్తవం చెప్పుకుంటే, మిగతా అన్ని రకాల కథల కన్నా పోలీస్ ఇన్వెస్టిగేషన్ జానర్ కథలు రాసుకోవడం అందరి వల్లా కాదు. మూస ఫార్ములా మైండ్ సెట్ వదులుకుని, దర్శకుడు మరింత ప్రొఫెషనల్ గా మారి, తనలోంచి పక్కా క్రైం ఫిక్షన్  రైటర్ తొంగి చూసేలా చూసుకోవాల్సిందే. లేకపోతే హాస్యాస్పదంగా తయారవుతుంది. ఇలాటి సినిమాలకన్నా సోనీ టీవీలో గత 19 ఏళ్లుగా సక్సెస్ ఫుల్ గా ప్రసారమవుతున్న క్రైం ఇన్వెస్టిగేషన్ సిరీస్  సీఐడీచూసుకోవడం ఉత్తమం. శివాజీ  సతమ్ నేతృత్వంలో సీఐడీ టీమ్ చేసే నేరపరిశోధనలు చాలా రియలిస్టిక్ గా, విజ్ఞాన దాయకంగా వుంటాయి. 
                                                ***


        మిత్రన్ అలా చెల్లదురైని వెంబడించి వెళ్తే, చల్లదురై మైన్స్ మంత్రి సెంగల్వ రాయన్ ని కలుసుకుని ఇద్దరూ కలిసి  సైంటిస్టు అభిమన్యు దగ్గరికి వెళ్తారు. అక్కడ అశోక్ పాండియన్, పెరుమాళ్ స్వామి కలుస్తారు. నల్గురూ కలిసి అభిమన్యు దగ్గరికి వెళ్తారు. ఇలా ఇప్పుడు మాత్రమే విలన్ గా వున్న అభిమన్యు ని చూడగల్గుతాడు మిత్రన్!

        ఈ ఏర్పాటు  ఎంత మభ్య పెట్టే  విధంగా వుందో చూద్దాం- 

        చెల్లదురై  మైన్స్ మాఫియా. రేపు మైన్స్ తనిఖీ జరక్కుండా ఆపాలని తన సిండికేట్ లో భాగస్థుడైన మంత్రి సెంగల్వ రాయన్ ని కలిశాడు. అప్పుడు సింపుల్ గా మైన్స్ మంత్రి సెంగల్వ రాయనే ఆదేశాలిస్తే తనిఖీలు ఆగిపోతాయి కదా? ఇద్దరూ కలిసి  అభిమన్యు దగ్గరి కొచ్చి చెప్పుకోవడమెందుకూ!!

        అంటే మిత్రన్ కి విలన్ అభిమన్యు గురించి తెలియాలంటే ఎట్లా అని దర్శకుడు ఆ లోచించి, ఈ అర్ధం లేని కథనం చేశాడన్నమాట.  
    
        ఇలా అర్ధరహితంగా  సెంగల్వ రాయన్, చెల్లదురైలు విలన్ అభిమన్యు దగ్గరికి పోతే- అర్జెంటుగా ఒక విలన్ అవసరమున్న మిత్రన్ చీకట్లో రాయి వేస్తూ వీళ్ళ వెంటపడి పోతాడు. అప్పుడే చూడగల్గుతాడు విలన్ని! అంతకాలం తను అంత రీసెర్చ్ చేస్తూంటే నగరంలోనే ఉంటున్న అభిమన్యు గురించి ఇప్పుడే తెలియడ మేమిటి
? మెడికల్ మాఫియా అశోక్ పాండియన్ మీద నైట్ క్లబ్ నాడే కన్నేసి వుంటే,  అభిమన్యు ఎప్పుడో తెలిసిపోయేవాడు కదా!  ప్లాట్ పాయింట్ వన్ దగ్గర కూడా తన కథకి విలన్ ఎవరో తెలియని దౌర్భాగ్యం ఏర్పడేది కాదు కదా? ఒక ఐపీఎస్ కి ఉండాల్సిన  లోచనా సరళి ఇది కాదు కదా? ఈ పాత్ర దర్శకుణ్ణి/కథకుణ్ణి మించిపోయి వుండాలికదా? 

        మిత్రన్ సైంటిస్టు అభిమన్యు ని చూశాక  స్క్రీన్ ప్లేలో ఇంకో తప్పు జరిగిపోతుంది. మళ్ళీ ఆరు నిమిషాలపాటు అభిమన్యు పరిచయ డాక్యుమెంటరీ ప్రారంభమవుతుంది. మిత్రన్ ఇంకో వ్యక్తిని కలుస్తాడు. ఆవ్యక్తి చిన్నప్పటి పళని గురించి చెప్తాడు. పళనీయే ఈ అభిమన్యు అని చెప్పి, ఇప్పుడు మంత్రిగా వున్న సెం గల్వ రాయన్ కొడుకే అని చెప్పి, ఆనాడు ఇతను జైలు నించి విడుదలయ్యాక ఫారిన్ వెళ్లి సైంటిస్టు  అయ్యాడనీ చెప్పి,  పద్మశ్రీ అవార్డు  కూడా పుచ్చుకున్నాడనీ కూడా చెప్పి- ఎలా క్లిప్పింగ్స్ తో వివరణ ఇస్తారు. 
       
        ఇలా ఈ ఆరు నిమిషాలతో పాటు, ప్లాట్ పాయింట్ వన్ దగ్గర తొమ్మిది నిమిషాలూ  కలుపుకుని  ఎకబిగిన మొత్తం 15 నిమిషాలూ అసలు కథలోకి వెళ్ళకుండా, స్క్రీన్ టైముని తినేస్తూ, కార్యకారణ సంబంధాల వివరణ లిచ్చుకోవడంతోనే సరిపోతుంది. 

       
 ఐనప్పటికీ ఇతనే నా విలన్ అని ఇప్పుడు కూడా   నిర్ణయించుకోడు మిత్రన్! విలన్ ఎవరో ప్రేక్షకులకి ఎప్పుడో తెలిసిపోయి వాళ్ళు చాలా ముందుంటే, మిత్రన్ ఇంకా నసుగుతూ వెనకబడి ఉంటాడు. ఈ ఫటాఫట్ కాలంలో యాక్షన్ మూవీకి డైనమిక్స్ కూడా అక్కర్లేదేమో!

        ఇక్కడ మెడికల్ మాఫియా అశోక్ పాండియన్ యాంజలీనా గురించి చెప్తాడు. అప్పుడు ఆమె వచ్చే డిసెంబర్ పది తనకి ఇంపార్టెంట్ తేదీ అని చెప్తాడు విలన్ అభిమన్యు. ఆ రోజు  ఫారిన్ నుంచి ఒప్పందం కోసం వస్తున్న  స్విస్ ఫార్మా కంపెనీ యజమానురాలు యాంజలీనాని చంపేస్తానని నర్మగర్భంగా అంటాడు. కళ్ళెదుటే ఇంత ఎవిడెన్స్ ని మిత్రన్ వెంటనే సెల్ ఫోన్లో  చిత్రీకరించాలనుకోడు!  చిత్రీకరించి అప్పుడే టెలికాస్ట్ చేయించి వుంటే అభిమన్యు ఖేల్ ఖతం - దుకాన్ బంద్ అయిపోయేది కదా? యాంజలీనా జీవించి వుండేది కదా!

        మిత్రన్ రూమ్  నిండా పెట్టుకున్నది పాసివ్ గా సేకరించిన క్లిప్పింగ్సే, ఫోటోలే, డేటానే. ఎక్కడా తను స్వయంగా కనిపెట్టి లైవ్ గా సేకరించిన సమాచారం లేదు. స్టింగ్ ఆపరేషన్ లేదు. జీవితంలో ఫస్ట్ టైమ్ లైవ్ గా చూస్తున్న ఇప్పటి విషయాన్నికూడా  వెంటనే రికార్డు చేయాలనీ అనుకోడు! కళ్ళప్పగించి చూస్తూంటాడు. 

        ఇక్కడే ఇప్పుడే పట్టుకుంటే, ఇంకో గంట సేపున్న సినిమా అప్పుడే ముగించెయ్యలా అని నిలదీయవచ్చు-  అలాంటప్పుడు ఈ సీన్లో మిత్రన్ వుండనే కూడదు
, వుంటే ఆటోమేటిగ్గా నెక్స్ట్ కథ ముగిసిపోయే సీనే వస్తుంది, దేవుడు కూడా ఆపలేడు!

        ఎప్పుడైతే కథకుడు కథ నడిపిస్తాడో ఇలాటి గోతులే ఎదురవుతాయి. ఎప్పుడైతే కథానాయకుడు కథ నడిపిస్తాడో గోతులుండవు- గంగోత్రిలా పారిస్తూంటాడు కథని గలగలా...  

        అడుగడుగునా విఫలమయ్యే ఈ కథానాయక పాత్ర, కథకుడు కథ నడపడం వల్ల అన్యాయమైపోయిన కనిపించని పాసివ్ పాత్ర. 

                                                         ***
       ఇదే సీన్లో విలన్ అభిమన్యు ఒక ఘోరానికి పాల్పడతాడు. చెల్లదురై సమస్య తెలుసుకుని,  మెషిన్  తీసుకుని ఒక అనుచరుడి గొంతు మీద ఏదో చెక్కేస్తూంటాడు. ఒక ట్రైనీ ఐపీఎస్ అధికారిగా వెంటనే ముందుకు దూకి ఈ దుష్కృత్యాన్ని ఆపాలి మిత్రన్ నిజానికి!  అక్కడికక్కడే హత్యాయత్నం నేరం మీద  అభిమాన్యుని అరెస్ట్ చేయించాలి, బాధితుణ్ణి హాస్పిటల్ కి తరలించాలి. 

        ఇది కూడా చెయ్యకుండా చూస్తూంటాడు నక్కి. అది చేతకాకపోతే కనీసం సెల్ ఫోన్లోనైనా చిత్రీ కరించాలి. ఈ పని ఇప్పుడు కూడా చేయాలనుకోడు! ఇవన్నీ చేస్తే సినిమా ఇప్పుడే ముగిసిపోతుంది కదయ్యా అని ఈసారి అడ్డుతగుల్తున్న ఈ వ్యాసకర్తని కొట్టొచ్చుకూడా  మిత్రన్. 

        ఇలాటి తను సమఉజ్జీ అయిన శత్రువుని ఎలా కోరుకుంటాడు?

        దీంతో అయిపోలేదు- ఇదే సీన్లో ఇంకోటి కూడా వుంది. అభిమన్యు ప్రయోగ శాల ఓపెన్  అవుతుంది. ఇక్కడ ఒక పసిపిల్లాడికి డయాబెటిస్ ఇంజెక్షన్ ఇచ్చి ప్రయోగాలు చేస్తూంటాడు. ఇది కూడా బొమ్మలా నిలబడి చూస్తాడు ఐపీఎస్ ట్రైనీ మిత్రన్!

        నాజీవితంలో ఏం జరుగుతోంది? అశోక్ పాండియన్, ఛార్లెస్ చెల్లదురై, పెరుమాళ్ స్వామి –ఈ ముగ్గుర్లో నాకు సరైన శత్రువు ఒక్కణ్ణి సెలెక్టు చేసుకుందామంటే, అభిమన్యు తెరపైకి వచ్చాడే- అని కోలీగ్ దగ్గర వాపోతాడు మిత్రన్. 

         అసలు ఈ ముగుర్లో ఒక్కణ్ణి సెలెక్టు చేసుకుంటాననే గొడవేంటి? సంఘ శ్రేయస్సు కోసం ముగ్గురి అంతూ చూడాలి. ఇలాకాక తన బలప్రదర్శన కోసమే అన్నట్టు  సమఉజ్జీ ఒక్కడు కావాలంటాడేమిటి? 

        ఇంతకీ విలన్ అభిమన్యు అనుచరుడి గొంతు మీద ఏం చెక్కాడు, ఎందుకు చె క్కాడూ అంటే- అదో గొప్ప మేధావి తనంతో కూడిన మాస్టర్ ప్లాన్!

        ఇది  కూడా ఎంత అర్ధరహితంగా వుంటుందో చూద్దాం. దీని తర్వాత ఒక సభలో ప్రసంగిస్తూంటాడు అభిమన్యూ. షరా మామూలుగా అక్కడి కెళ్ళి అతన్ని చూస్తూంటాడు మిత్రన్. అంటే ఇంకా ఇతనే తన విలన్ అని డిసైడ్  చేసుకోలేదన్న మాట. ఈ సభలో అభిమన్యు నిన్న మధురై  లో జరిగిన కులఘర్షణలని ప్రస్తావించి హిత బోధ చేస్తూంటాడు. మిత్రన్ తన కొలీగ్ తో చెప్తాడు ఆ కులఘర్షణలకి వీడే కారకుడని. వెంటనే నిన్నటి న్యూస్ కటింగ్స్ పడతాయి. అంటే ఇంకో ఎక్స్ పొజిషన్ అన్నమాట! అభిమన్యు అనుచరుడి గొంతు మీద కులం పేరు చెక్కడం వల్ల – మధురైలో కులఘర్షణలు చెలరేగాయనీ, పథకం ప్రకారమే ఇది చేశాడనీ, ఇలా చేయడం ద్వారా ప్రభుత్వ యంత్రాంగం ఘర్షణలు  ఆపడంలో నికి బిజీ  అయిపోయి, చెల్లదురై  మైన్స్ తనిఖీకి వెళ్ళ లేకపోయారనీ, అలా తనిఖీని అడ్డుకున్నాడనీ ఇంకో బారెడు ఎక్స్ పొజిషన్!

        1. కులఘర్షణలు మైన్స్ వున్న మధురైలోనే జరుగుతాయని అభిమన్యు ఎలా ఊహించాడు?
        2. అది శాంతి భద్రతల సమస్య. దాంతో గనుల శాఖాధి కార్లకేం పని -వాళ్ళు కూడా ఘర్షణలని  ఆపడానికి బిజీ అయిపోవడానికి?
        3. గొంతు చెక్కుతూంటే కళ్ళారా  చూసిన మిత్రన్ అప్పుడే అడ్డుకుని వుంటే కుల ఘర్షణనలే జరిగేవి కాదు కదా?
        4. ఇప్పుడేదో ఘనకార్యం చేసినట్టు క్లిప్పింగ్స్ చూపిస్తూ ఇంకో లెక్చర్ ఇస్తాడేమిటి?
        5. ఒకవేళ వుంటే అసలిది బిగినింగ్ విభాగంలో ఉండాల్సిన కథనమా, మిడిల్ లో వుండే కథనమా?
        6. స్ట్రక్చర్ కూడా అవసరం లేదనుకోవడం నేటి ఫటాఫట్ సినిమాల కొత్త రూలా?

                                                ***
         ఇన్ని ఘోరాలు చూశాక హమ్మయ్యా అని ఇప్పుడు తను ఎంపిక చేసుకోవాల్సిన  శత్రువెవరో తెలిసిందనీ, అభిమన్యు జీవితంలో ఆ రానున్న డిసెంబర్ పదిని మర్చిపోలేని రోజుగా చేస్తాననీ  ప్రతిన బూనుతాడు మిత్రన్!

        ఇక్కడ ఒక సందేహం రావచ్చు.  మిత్రన్ కి తన శత్రువెవరో నిర్ణయమై, గోల్ ఏర్పడింది ఇక్కడే గనుక, ఇదే ప్లాట్ పాయింట్ వన్ ఎందుకు కాకూడదూ అని.

        1. ఎప్పుడైనా బిగినింగ్ లో ఒక సెటప్ ఏర్పాటు చేశాక  దాన్ని పే ఆఫ్ చేస్తున్నప్పుడే ప్లాట్ పాయింట్ వన్ ఏర్పడుతుంది.
        2. ‘శివ’ లో నాగార్జున జేడీ అగడాల్ని చూసీ చూసీ (సెటప్),  ఇక తిరగబడి అతణ్ణి కొట్టేశాక (పే- ఆఫ్) ప్లాట్ పాయింట్ వన్ వచ్చి, గోల్ ఏర్పడుతుంది.
        3. ‘24’ లో గడియారమున్న తెరచుకోని పెట్టెని రకరకాల పనిముట్టుగా అటు విసిరి ఇటు విసరీ వాడుకున్నాక (సెటప్), దాని తాళం చెవి దొరికి తెరవడంతో (పే-ఆఫ్) ప్లాట్ పాయింట్ వన్ వచ్చి,  చిన్న సూర్యకి గోల్ ఏర్పడుతుంది.
        4. ఇలాగే ‘తని ఒరువన్’ లో కూడా రాత్రి పూట నువ్వు ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నావని అప్పుడప్పుడు కొలీగ్స్ అడగడం  (సెటప్),  ఒక తప్పనిసరి పరిస్థితిలో మిత్రన్ వాళ్ళని తన గదికి తీసికెళ్ళి తన రీసెర్చి ప్రపంచాన్ని చూపడం ( పే- ఆఫ్ ) తో అక్కడే ప్లాట్ పాయింట్ వన్ ఏర్పడిపోయింది. ఇది తెలుసుకోక పోవడంవల్ల గోల్ ఏర్పడక స్ట్రక్చర్ చెదిరిపోయింది.
       
5. సినిమాల్లో ప్లాట్ పాయింట్ వన్ ఎక్కడుందో గుర్తించాలంటే సెటప్ ని ఫాలో అవుతూంటే చాలు, అది పే- ఆఫ్ అయ్యే సీనే ప్లాట్ పాయింట్ వన్ అవుతుంది.

        స్ట్రక్చర్ చెదిరి పోవడం వల్ల, విషయంకన్నా వివరణలు ఇచ్చుకోవడం ఎక్కువై పోవడంవల్లా, ఈ  సినిమా నిడివి రెండు గంటలా 40 నిమిషాలకి చేరింది. ఇంకా మున్ముందు కూడా వివరణలున్నాయి. మొత్తం కలుపుకుని 20 నిమిషాలకి పైగా ఇలా  అసందర్భ, అనవసర  ప్రేలాపనే  వుంది. ఇది తీసేస్తే రెండు గంటలా 20 నిమిషాలకి నిడివి తగ్గుతుంది.

                                                ***
        ఇప్పుడు మిత్రన్ కి అభిమన్యు ముఖాముఖీ అవుతాడు- మిత్రన్ ట్రైనింగ్ పూర్తయి పాసింగ్ అవుట్ పెరేడ్ లో ముఖ్య అతిధిగా అభిమన్యూయే వస్తాడు. అతన్నుంచి మెడల్ అందుకుంటాడు. అభిమన్యు అందించే  ఒక బెరెట్టా పిస్టల్ వున్న బాక్సుని అందుకుంటాడు మిత్రన్. అది సర్వీస్ వెపన్. ఇక్కడే  కథా సౌలభ్యం కోసం ఒక గిమ్మిక్కు చేస్తాడు దర్శకుడు. మిత్రన్ ఈ సీనులో చేతులకి గ్లవ్స్ తొడుక్కుని ఉంటాడు. ఇంకే ట్రైనీ కూడా అలా వుండడు. ఇలా ఎందుకు జరిగిందో ముందు ముందు  రాబోయే సీన్లో మనం తెలుసుకుని తెల్లమొహం వేద్దాం...

        మిత్రన్ ఇక ఏఎస్పీగా జాయినవుతాడు (జిల్లాల్లోలాగా నగరాల్లో ఎస్పీ వ్యవస్థ వుండదు, పోలీస్ కమీషనరేట్ వ్యవస్థ వుంటుంది. ఈ వ్యవస్థలో ఏఎస్పీ పోస్టు వుండదు, ఏసిపి పోస్టు వుంటుంది). ఏఎస్పీగా జాయినవుతూనే పెద్ద చర్య తీసుకుంటాడు( కొత్తగా ఏఎస్పీ అనేది ప్రొబేషనరీ పోస్టు, స్వయంగా చర్యలు తీసుకోలేడు). అదేమిటంటే, అశోక్ పాండియన్, చెల్లదురై, పెరుమాళ్  స్వామిల బ్యాంకు ఖతాల్ని స్థంభింపజేయడం. వీళ్ళు తమ
ఖాతాల్లోంచి
  7.5 బిలియన్ డాలర్లు మలేషియాలో  బ్యాంకు బ్రాంచీ కి ట్రాన్స్ ఫర్ చేయబోతున్నారని అంటాడు. ఆ డబ్బుతో యాంజలీనా కంపెనీని కొనేసి, ఆమె జనెరిక్ మందుల ఒప్పందం ప్రభుత్వంతో కుదుర్చుకోకుండా ఆపబోతున్నారని వివరణ ఇస్తాడుదీనిగురించిన సమాచార సేకరణతో మరి కొన్ని క్లిప్పింగ్స్ హడావిడి చేస్తాయి. మలేషియా బ్యాంకు  అధికారిణి  కూడా మిత్రన్ కి సమాచారం ఇచ్చేసి, మీరు వొత్తిడి చేశారు గనుక చెప్పేశానంటుంది, ఓహ్ గాడ్!!

        ఇక్కడ అస్సలు అర్ధం కానిదేమిటంటే, 7.5 బిలియన్ డాలర్లంటే మామూలు మొత్తం కాదు. అంత భారీ కంటే భారీ మొత్తం వైట్ లో అశోక్ పాండియన్, చెల్లదురై, పేరుమాళ్ స్వామీల ఖాతాల్లో వుండడం అసంభవం. వుంటే వాళ్ళ దగ్గర అంత మొత్తంలో నల్ల ధనమే వుండి, ఏ స్విస్ బ్యాంకు ఖాతల్లోనో వుండాలి!  దర్శకుడు ఎలా తోస్తే అలా కథ రాసేశాడు ఏం చేస్తాం!

        రోహిత్ శెట్టి తీసే భారీ కమర్షియల్ యాక్షన్ సినిమాలు అర్ధంపర్ధం లేకపోయినా, మనం కాసేపు మెదడు ఇంటి దగ్గర వదిలేసి ఎంజాయ్ చేసి రాగలం. అవి ఫుల్ మజా నిస్తాయి. కానీ ఒక ‘తని ఒరువన్’ లాంటి మెథడాలాజికల్ కథ ఇంత తప్పులతడకలా వుంటే ఎలా ఎంజాయ్ చేయగలం.

        ఇక ఎప్పుడెప్పుడా అని అరగంట నుంచీ ఎదురు చూస్తున్న యాక్షన్ రానే వస్తుంది. ఇది కూడా ఎలా వుందో చూద్దాం- 

        ఫారిన్ నుంచి
యాంజలీనా రాగానే ఆమెని మీటవుతాడు మిత్రన్. క్యాన్సర్ మందుల గురించి చర్చించుకుంటారు. స్టోరీ పాయింటు జనెరిక్ మందుల ప్రస్తావనే వుండదు. మిత్రన్ ఇక్కడి పరిస్థితి చెప్తాడు. రేపు ప్రభుత్వంతో మీటింగ్ కి వెళ్తే ప్రమాదమని తనకి డబుల్ గా తన గర్ల్ ఫ్రెండ్ మహిమని ఉపయోగించి తనకి ప్రమాదం లేకుండా  చూస్తాననీ అంటాడు. ఐపీఎస్ తెలివితేటలు ఇంత హీనంగా ఉంటాయా? 

        కారులో  యాంజలీనా బదులు మహిమని ఎక్కించి శత్రువుల్ని ఏమార్చడం మామూలు పరిస్థితుల్లోనైతే ఓకే.  కానీ ఈ కారే  యాంజలీనా వున్న కారనుకుని శత్రువులు ఫాలో మాత్రమే కారు, ఆమె ప్రభుత్వంతో సమావేశ స్థలానికి చేరేలోపే లేపేసే పక్కా ప్లాన్ తో వున్నారు. ఈ సంగతి మిత్రన్ కి తెలుసు. మరి తెలిసికూడా ఆ ఎటాక్ జరిగే పరిస్థితిలోకి మహిమని ఎలా నెడుతున్నాడు? మహిమ చచ్చిపోయినా తన క్కావాల్సింది వేరే కార్లో వేరే రూట్లో యాంజలీనా క్షేమంగా చేరడమా?
 

        అనుకున్నట్టే ఎటాక్ జరుగుతుంది. కారద్దం పగిలి వెంట్రుక వాసిలో మహిమ తల పక్కనుంచి దూసుకుపోతుంది బుల్లెట్. ఆమె పడిపోతుంది. ఫాలో అవుతున్న మిత్రన్ అప్పుడు  ఎలర్ట్ అయి, దుండగుల మీద కాల్పులు జరిపి మహిమని కాపాడుకుంటాడు. ఆమె బుల్లెట్ తగిలి చచ్చిపోయి వుంటే? దీన్నెలా నివారించగలననుకున్నాడు? ఇదేం పోలీస్ సీక్రెట్ ఆపరేషన్? 

                                               
***

         మొత్తం మీద కథ ఇప్పుడు గాడిలో పడినట్టు వుంటుంది. మిడిల్ బిజినెస్ ప్రకారం హీరో విలన్ల మధ్య యాక్షన్ రియాక్షన్ ల సంకులసమరం మొదలై – ఈ గంటా ఐదవ నిమిషం దగ్గర నుంచీ మొదలై, గంటా 50 వ నిమిషం వరకూ ముప్పావు గంట సేపూ ఈ యాక్షన్ ట్రాక్ ఒక్కటే ఈ స్క్రీన్ ప్లేకి బలంగా వుంటుంది. ఫస్టాఫ్ లో 49 వ నిమిషంలో మొదలయ్యే మిడిల్ విభాగం, సెకండాఫ్ లో గంటా 50 వ నిమిషం దగ్గర ముగుస్తుంది. అంటే సుమారు గంట సేపన్న మాట. ఈ గంట సేపట్లో పైన చెప్పుకున్న ముప్పావు గంటే  బలం. మొత్తం రెండు గంటలా 40 నిమిషాల నిడివిలో ముప్పావు గంట సేపే ఈ  స్క్రీన్ ప్లే బలంగా ఉంటుందన్న మాట. లెక్కకైతే  రెండు గంటలా 40 నిమిషాల నిడివిలో 50 శాతం, అంటే గంటా 20 నిమిషాలూ మిడిల్ విభాగం కొనసాగి బలంగా వుండాలి. 49 నిమిషాలు బిగినింగ్ కి పోగా, 60 నిమిషాలూ మిడిల్ కి పోయి, మిగిలిన 51 నిమిషాలూ ఎండ్ విభాగం సాగుతుందన్న మాట! ఇంత బారెడు ఎండ్ విభాగం ఎక్కడా వుండదు. అయితే ఇది కూడా బలహీనమే. ఒక్క మిడిల్లో 45 నిమిషాలే ఈ స్క్రీన్ ప్లే బలంగా వుంటుంది.  ఎందుకని? సౌజన్యం : కొరియన్ మూవీ ‘ఐ సా ది డెవిల్’!

        ‘ఐ సా ది డెవిల్’ ట్రాక్ ఒక్కటే ఆ 45 నిమిషాల బలం. ఇదికూడా లేకుండా ఈ 45  నిమిషాల కథనూ దర్శకుడే స్వయంగా తాయారు చేసుకుని వుంటే ఎలా ఉండేదో, ఇంతవరకూ చేసుకొచ్చిన ఈ పోస్ట్ మార్టమే చెప్తుంది. ఈ కొరియన్ ట్రాక్ తో మిడిల్ ముగియగానే, మళ్ళీ సొంత సృష్టితో దర్శకుడి ఎండ్ విభాగం ఇంకా గందరగోళం! 
                                                  ***
        అభిమన్యు తాను చేయించింది మహిమ మీద ఎటాక్ అని తెలుసుకోవడంతో ఈ సారి మిత్రన్ ని బాగా ఏమార్చి, హోటల్ గదిలోనే అతడి కళ్ళెదుటే యాంజలీనాని చంపిం చేస్తాడు. గాయపడ్డ మిత్రన్ ఆపరేషన్ కోసం హాస్పిటల్లో చేరతాడు. ఇప్పుడే మిత్రన్ ఇన్వాల్వ్ మెంటు గురుంచి తెలుసుకున్న అభిమాన్యు మిత్రన్ గది కెళ్ళి వ్యవహారమంతా చూస్తాడు. అక్కడే గోడకున్న 2011 నాటి మిస్ ఇండియా ఫోటోలో తన గర్ల్ ఫ్రెండ్ మొహం మీద కసితో పిన్ గుచ్చుతాడు. ఈ మిస్ ఇండియా ఫోటో మిత్రన్ ఎందుకు పెట్టుకున్నాడు? అభిమన్యు వస్తాడనీ, వస్తే పిన్ను గుచ్చి పోవాలనా!
         అబిమన్యుకి వొళ్ళు మండిపోయి, ఒక బగ్ ని ఆపరేషన్ చేస్తున్న మిత్రన్ ఛాతీలో అమర్చమని ఇచ్చి వెళ్ళిపోతాడు.. అప్పట్నుంచీ ఆ బగ్ ద్వారా మిత్రన్ ఏమేం చేస్తున్నాడో, చేయబోతున్నాడో అన్నీ తెలుసుకుంటూ ఆ ప్లాన్స్ ని తిప్పి కొడుతూంటాడు.  ఇద్దరి మధ్య ఈ ట్రాక్ ఆసక్తి రేపుతూ సాగుతూంటుంది.
        ఇందులోంచి మళ్ళీ ఇంకో ట్రాక్ మొదలవుతుంది.
అభిమన్యు  కంపెనీలో పనిచేసిన ఒక ఫార్మసిస్టు డయాబెటిస్ కి మందు కనిపెడితే, దాన్ని కొట్టేసి ఆమెని చంపేసిన రహస్యం ఒక  ఎస్డీ కార్డులో బాయ్  ఫ్రెండ్ దగ్గర వుంటుంది. ఇది మిత్రన్ తెలుసుకున్నాడని తెలుసుకున్న అభిమన్యు ఆ ఎస్డీ కార్డు కోసం బాయ్ ఫ్రెండ్ నీ, మిత్ర కొలీగ్ నీ చంపించేస్తాడు. ఎస్డీ కార్డు మాత్రం దొరకదు. 
       
ఈ సంఘటనలతో మిత్రన్ డిస్టర్బ్ అయి తన గదికి వచ్చి చూస్తే, అభిమన్యు వచ్చి వెళ్లినట్టు అనుమానం వేస్తుంది. ఈ క్రమంలోనే దర్శకుడి సొంత క్రియేషన్ మళ్ళీ జొరబడి అభాసు అవుతుంది. అదేమిటంటే, ఫోటో మీద గుచ్చిన పిన్ను మీద వేలి ముద్రలు తీయాలంటుంది మహిమ. సడెన్ గా ఆమె చేతిలో ఫోరెన్సిక్ కిట్ అంతా వుంటుంది- కంప్యూటర్, సాఫ్ట్ వేర్స్ తో సహా. అసలు ఐపీఎస్సే మానుకున్న ఆమె ఫింగర్ ప్రింట్ ఎక్స్ పర్ట్ అవతార మెత్తుతుంది.  ఐపీఎస్ లకి కూడా ఈ శిక్షణ వుండదు. ఫోరెన్సిక్ సైన్సు సపరేట్ కోర్సు, సపరేట్ కాలేజీలూ, సపరేట్ డిగ్రీలూ. ఐపీఎస్ కూడా మానేసి బలాదూరు తిరుగుతున్న మహిమ,  జమాయించి పిన్ను మీద ఇంత పౌడరు కొట్టిపారేసి, సేల్లోఫేన్ టేప్స్ మీద వేలిముద్రలు ట్రేస్ చేసేస్తుంది. 
        మరి ఇవి అభిమన్యు వేలిముద్రలేనని తెలిసేదెట్లా? అప్పుడు మిత్రన్ కి తన సర్వీస్ వెపన్ వున్న బాక్సు గుర్తు కొస్తుంది. ఈ బాక్సు ఆనాడు అభిమన్యు తనకి బహూకరించిందే. అది తెచ్చి, దీని మీద అభిమన్యు వేలిముద్రలుంటాయనీ, ఇది అందుకున్నప్పుడు తాను చేతులకి గ్లవ్స్ తొడుక్కుని వుండడం వల్ల  తన వేలిముద్రలు పడలేదనీ అంటాడు.  

        1. మిత్రన్ గ్లవ్స్ తొడుక్కుని వున్నాడు కాబట్టి బాక్సు మీద తన వేలి ముద్రలు పడవు సరే, ఆ బాక్సుని మిత్రన్ కి అందించమని అభిమాన్యుకి  ఉన్నతాధికారి అందించాడుగా. అప్పుడా ఉన్నతాధికారి వేలిముద్రలు కూడా బాక్సు మీద పడతాయిగా. 
ఈ రెండు రకాల వేలిముద్రల్లో ఏదో ఒక టైపు వేలిముద్రలు పిన్ను మీద పడిన వేలిముద్రలతో సరిపోవాలి. అవే అభిమన్యు వేలిముద్రలని ఎలా చెప్పగలరు? ఉన్నతాధికారి వేలిముద్రలు కూడా అయి ఉండొచ్చుగా? ఉన్నతాధికారి ఇక్కడకొచ్చి పిన్ను ఎందుకు గుచ్చుతాడనా? ఏమో!  సాక్ష్య  నిర్ధారణ డౌట్స్ లేకుండా జరగాలిగా?
        2. ఆ బాక్సు అందుకుంటున్నప్పుడు అసలు మిత్రన్ గ్లవ్స్ తొడుక్కుని ఎందుకున్నాడు? ఫలానా రాబోయే సీన్లో మహిమ వేలిముద్రలు తీస్తున్నప్పుడు ప్రాబ్లం ఉండకుండా అవసరం కాబట్టి, ఇప్పుడు గ్లవ్స్ తొడుక్కోమని దర్శకుడు చెప్పాడా?
        3. ఇంతకాలం ఇంట్లో పెట్టుకున్న ఆ బాక్సుని గ్లవ్స్ తొడుక్కునే హేండిల్ చేస్తున్నాడా?
        4. నడుముకి పెట్టుకుని తిరగాల్సిన అధికారిక సర్వీస్ వెపన్ ని,  పెట్టెలోనే పెట్టేసి ఇంట్లో పెట్టుకున్నాడా ఈ అవసరం కోసం?
        దర్శకుణ్ణి నమ్మి బాగానే దెబ్బ తింటున్నాడు మిత్రన్ విచిత్రంగా.

                                                ***

        క ఉన్న ఉపోద్ఘాతాలు చాలనట్టు, మళ్ళీ అభిమన్యు గర్ల్ ఫ్రెండ్ ఎవరు, అతడికి ఎప్పుడు ఎలా పడిందని ఇంకో పాఠం మన తలకెక్కించుకోక తప్పదు. ఇక అభిమన్యు తన ఫ్లాట్ ని కూడా బగ్గింగ్ చేసి ఉంటాడని మిత్రన్ కి డౌట్ వచ్చి, డిటెక్టర్ తెప్పించి  చెక్ చేసుకోవడం, అభిమన్యు ఏకకాలంలో మహిమనీ, గర్ల్ ఫ్రెండ్ ని చంపే పథకం వేయడం వగైరా ఇంటరెస్టింగ్ బీట్స్ తో సాగి, చివరికి తన ఛాతీ లోనే బగ్ వుందని మిత్రన్ తెలుసుకోవడంతో ఈ మిడిల్ విభాగం ముగుస్తుంది. బగ్ ఎక్కడుందో తెలిసిందంటే, సమస్యకి పరిష్కార మార్గం దొరికినట్టే. సంఘర్షణల పరంపరలో పరిష్కార మార్గం దొరికిందంటే, ప్లాట్ పాయింట్ టూ ఏర్పడి మిడిల్ ముగిసినట్టే. 

        ఈ మిడిల్లో బగ్ ట్రాకు తప్ప మిగిలినదంతా కథకాదు, కథకి కార్యకారణ వివరణే. ఇంతా చేస్తే మిడిల్ జనెరిక్ మందులనే స్టోరీ పాయింటు మీద కూడా సరీగ్గా నడవదు. మధ్యలో డయాబెటిస్ మందు ప్రయోగాలూ, కనుగొన్న ఆ మందుకోసం హత్యా, దానికి సంబంధించి ఎస్డీ కార్డులో సాక్ష్యమూ... ఇలా పక్కదోవ పట్టడం. అసలు విలన్ గోల్ ఏమిటి? జనెరిక్ మందులు రాకుండా చూడ్డమా, లేక డయాబెటిస్ మందు ఫార్ములా కొట్టేయడమా? హీరో గోల్ ఏమిటి? మెడికల్ మాఫియా, రియల్ ఎస్టేట్ మాఫియా, మైన్స్ మాఫియా, జనేరిక్ మందులు, డయాబెటిస్ మందు ఇవన్నీనా? వీటన్నిటితో  స్టోరీ పాయింటు ఒక కలగూర గంపా? ప్రేక్షకులు ఎవరికేది కావాలో అది ఎంపిక చేసుకుని దాని కథ చూడాలా? ఒక కథ ఒక పాయింటు మీద నడిచే కాలం పోయిందా? రేపు హీరోయిన్ ని ప్రేమించిన హీరో, ఎలా పెళ్లి చేసుకుంటాడనే పాయింటు లేవనెత్తి ,దాన్ని వదిలేసి –ఇప్పుడు సెకండ్ హీరోయిన్ని ఎలాప్రేమిస్తాడో చూడమని ఇంకో పాయింటు ఎత్తుకునే సినిమలొస్తాయా?


  (Next : ఎండ్ కి టెండర్ )

 -సికిందర్