రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Tuesday, April 16, 2024

1424 : రివ్యూ



రచన-దర్శకత్వం : కేవీఆర్ మహేంద్ర
తారాగణం : సూర్య తేజ ఏలే, మీనాక్షీ గోస్వామి, వైవా హర్ష, హర్షవర్ధన్, అజయ్ ఘోష్  తదితరులు
సంగీతం : వివేక్ సాగర్, ఛాయాగ్రహణం :  వెంకట్ ఆర్ శాఖమూరి
నిర్మాత: పాయల్ సరాఫ్
విడుదల : ఏప్రిల్ 5, 2024
***
        తెలంగాణ పీరియడ్ సినిమా దొరసాని (2019) దర్శకుడు కెవిఆర్ మహేంద్ర, ప్రముఖ చిత్రకారుడు ఏలే ధని  కుమారుడు సూర్యతేజని పరిచయం చేస్తూ భరతనాట్యం అనే తెలంగాణ క్రైమ్ కామెడీ తీశాడు. పెళ్ళిచూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ నటిస్తూ తీసిన కీడాకోలా అనే తెలంగాణ క్రైమ్ కామెడీకి ఒక ప్రత్యేక శైలి వుంది. లాజిక్ ని కామెడీ చేసే మెంటల్ పాత్రలతో కొత్తదనం సంతరించుకుని ఓవర్సీస్ లో కూడా హిట్టయ్యింది. మరి ఈ క్రైమ్ కామెడీ ఏ ప్రత్యేకతలతో వుంది? దీన్ని ఒకసారి చూడొచ్చా?  చాలా కాలం తర్వాత దర్శకుడి రెండో సినిమా ఏ స్థాయిలో వుంది? ఇవి తెలుసుకుందాం...

కథ

రాజు సుందరం (సూర్యతేజ) సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తూంటాడు. రొటీన్ గానే ఇంట్లో కష్టాలకి, గర్ల్ ఫ్రెండ్ (మీనాక్షి గోస్వామి) ని ఒప్పించడానికీ డబ్బులుండవు. డైరెక్టర్ అయిపోదామని కథలు చెప్తూ తీవ్ర ప్రయత్నాలు చేస్తూంటాడు. కథల కోసం మైక్రోఫోన్లు ఏర్పాటు చేసి మనుషుల మాటలు రహస్యంగా వింటూ వాటిని కథలుగా రాస్తూంటాడు. మరోపక్క దివాకర్ (హర్షవర్ధన్) అనే పెద్ద క్రిమినల్ డ్రగ్స్ దందా చేస్తూంటాడు. ఓ రోజు రెండు కోట్ల దందా గురించి మైక్రోఫోన్లో విని, డబ్బు సంపాదనకి ఇదే మార్గమని వాళ్ళ అడ్డాకి వెళ్తాడు రాజు సుందరం. అక్కడ భగతనాట్యం అనే కోడ్ నేమ్ తో డ్రగ్స్ డీల్ జరుగుతూంటే బ్యాగు లాక్కుని పారిపోతాడు. ఆ బ్యాగులో డబ్బులుండవు, డ్రగ్స్ వుంటాయి. ఈ క్రమంలో శకుని (అజయ్ ఘోష్) అనే పోలీసు అధికారికి చిక్కుతాడు. ఇక్కడ్నుంచి బయటపడి డ్రగ్స్ తో ఏం చేశాడు, వాటిని తానే అమ్మి డబ్బు సంపాదించాడా, లేక ఇంకేం చేశాడన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

తెలంగాణ ఫీల్ ఏం లేదు గానీ క్రైమ్ కామెడీకి పనికొచ్చే కథే. అయితే చేతిలో వున్నది కథలా భావించి తీయలేదు. ఏదో కాకరకాయ, ఎలా తీసినా క్రైమ్ కామెడీ అయిపోతుంద
నుకుని తీసినట్టుంది. ఇందుకే క్లయిమాక్స్ సహా విషయం ఆషామాషీగా వుంది. డ్రగ్స్ కి పెట్టిన పేరు భరతనాట్యం సెన్సారింగ్ లో భగత నాట్యం అని పలకడంగా మారిపోవడం ఈ కంటెంట్ కి తగిన న్యాయమే. ఫస్టాఫ్ అసలు కథేంటో ఎవరైనా చెప్పగలిగితే  ఈ సినిమా బడ్జెట్ వాళ్ళకి ఇచ్చేయవచ్చు.
       

ఫస్ట్ హాఫ్ అంతా హీరో సినిమా కథలు వినిపిస్తూ చేసే కొత్తదనం లేని కామెడీలు
, విలన్ దివాకర్, అతడి గ్యాంగ్ తో ఇబ్బంది పెట్టే కామెడీలూ సాగుతూ గంటపాటు ఓపికని పరీక్షిస్తూ- ఇంటర్వెల్ కి హీరో చేతికి డ్రగ్స్ రావడంతో ఆసక్తికర మలుపే వస్తుంది.
        
అయితే సెకండాఫ్ లో ఆ డ్రగ్స్ తో హీరో ఏం గేమ్ ఆడుకోవాలో ప్లానింగ్ లేకపోవడంతో తిరిగి సహన పరీక్షగా మారిపోయి ఆశ వదులుకునేలా చేస్తుంది. ఇందులో విలనీలు కూడా పాత సినిమాల్లో సత్యనారాయణ, ప్రభాకర రెడ్డి విలనీల్లా తీరుబడి డైలాగులతో వుంటాయి. పాత హిందీ సినిమాల్లో విలన్ అజిత్ అనుచరులు మోనా డార్లింగ్, రాబర్ట్ లతో వుండే కామెడీ చాలా పాపులరైంది. ఏ సినిమాలోనైనా విలన్ అజిత్ కి మోనా డార్లింగ్, రాబర్ట్ లు వుండాలల్సిందే. ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో అజిత్- మోనా డార్లింగ్- రాబర్ట్ లతో కొత్త కొత్త జోకులు పుట్టిస్తున్నారు. వాళ్ళని సజీవంగా వుంచుతున్నారు.
       
ఇలాటి క్రియేటివిటీని ఈ క్రైమ్ కామెడీలో మిస్సయ్యారు.
ముత్యాలముగ్గు లో రావు గోపాలరావుని, జస్టిస్ చౌదరి లో సత్యనారాయణనీ తీసుకుని వాళ్ళ స్టయిల్ విలనీతో ఎంటర్ టైన్ చేసివుంటే ఈ కథ లేని సినిమాకి ఇదే పెద్ద ఆకర్షణ అయ్యేది.  కథ లేని సినిమాగా తీయాలనుకుని వుంటే, కథ లేకుండా  కేవలం క్యారక్టర్లతో ఎలా నడిపారో ఎల్ డొరాడో (1966) అనే కౌబాయ్ క్లాసిక్ చూసి తెలుసుకుని వుండొచ్చు.
        
ఇక షరా మామూలుగా సెకండ్ హాఫ్ ఆ డ్రగ్స్ కోసం, డబ్బుల కోసం అందరూ వెంటబడడం చూసి చూసి వున్నఅరిగిపోయిన  సీన్లే. ఇంతకంటే సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్ హీరో పాత్రకి క్రియేటివిటీ తెలియకుండా పోయింది. క్వెంటిన్ టరాంటినో తీసిన పల్ప్ ఫిక్షన్ లో ఒక బ్రీఫ్ కేసు కోసం వేట వుంటుంది. ఆ బ్రీఫ్ కేసులో ఏముందో పాత్రలకి తప్ప ప్రేక్షకులకి తెలీదు. చివరికా బ్రీఫ్ కేసు చేజిక్కుంచుకున్న పాత్ర మూత తెరిచి చూస్తే, బ్రీఫ్ కేసులోంచి అతడి మొహం మీద వెలుగు పడుతూంటుంది. తృప్తిగా చూస్తూంటాడు. ఆ ముగింపులో కూడా బ్రీఫ్ కేసులో ఏముందో ఆడియెన్స్ కి చూపించరు. చూపిస్తే డబ్బులో. డ్రగ్సో, వజ్రాలో వుంటే సర్ప్రైజ్ ఏముంటుంది? అందుకే ఇంకేదో గొప్పది వున్నట్టు ప్రేక్షకుల వూహకే వదిలేస్తారు. ఇది కథనంలో ఉపయోగపడే ఒక ప్లాట్ డివైస్ అనీ, దీన్ని మెక్ గఫిన్ అనాలనీ, సస్పెన్స్ బ్రహ్మ ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్ కనిపెట్టి చెప్పాడు.

మొత్తానికి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ తన కథ ఇలా నడిపిస్తే, ఇక సినిమాలేం తీస్తాడో వూహించాల్సిందే. కొసమెరుపేమిటంటే,  దీనికి పార్ట్ 2 వుంటుందని సూచించారు.

నటనలు- సాంకేతికాలు

కొత్త హీరోగా సూర్యతేజ యాక్టింగ్ ఫర్వాలేదు, స్పీడుంది. స్పీడుతో ఓవరాక్షన్ చేయకుండా నిగ్రహింఛుకున్నాడు. హీఓయిన్ మీనాక్షి గోస్వామి అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తూ హిందీ, తెలుగు కాలిపి మాట్లాడుతూంటుంది. షార్ట్ ఫిలిమ్ హీరోయిన్ లా వుంది. సినిమా హీరో అవ్వాలనే పాత్రలో వైవా హర్ష తన అనుభవంతో కామెడీని బాగా హేండిల్ చేశాడు. పోలీసాఫీసర్ గా అజయ్ ఘోష్, విలన్ గా హర్షవర్ధన్ లది పాత కాలపు విలనీ.
        
చాలా పరిమిత బడ్జెట్ తో తీసినట్టున్నారు. ప్రొడక్షన్ క్వాలిటీ గురించి చూడకూడదు. పాటలు ఒక్కటి కూడా కనెక్ట్ కావు. డ్రగ్స్ తీసుకుంటే ఆ మత్తు భరతనాట్యం చేయిస్తుందని చెప్పడం కవి హృదయమేమో.  దీన్ని సెన్సార్ ఖండించి, భగతనాట్యం గా పాత్రల చేత పలికించింది.
—సికిందర్

1423 : రివ్యూ

 

రచన -దర్శకత్వం: చిదంబరం
తారాగణం : సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ భాసి, బాలు వర్గీస్, గణపతి ఎస్. పొదువల్, లాల్ జూనియర్, ఖాలిద్ రెహమాన్ తదితరులు
సంగీతం : సుశీన్ శ్యామ్, ఛాయాగ్రహణం :             షైజూ ఖాలీద్
నిర్మాతలు : సౌబిన్ షాహిర్, బాబు షాహిర్, షాన్ ఆంటోనీ
బ్యానర్ : పరవ ఫిలిమ్స్
తెలుగు పంపిణీ : మైత్రీ మూవీ మేకర్స్
విడుదల : ఏప్రిల్ 6, 2024
***
        టీవల రెండు మలయాళం సినిమాలు వసూళ్ళలోనూ సంచలనం సృష్టించాయి.  వాటిలో ఒకటి ప్రేమలు’. ఇది 135 కోట్లు వసూలు చేసింది. దీని తెలుగు డబ్బింగ్ కూడా బాగానే వసూలు చేసింది. అలాగే మంజుమ్మల్ బాయ్స్  230 కోట్లు వసూలు చేసింది. దీని తెలుగు డబ్బింగ్  ఈ రోజు విడుదలైంది. దీని గొప్పదనమేమిటో ఓసారి చూద్దాం...

కథ
కేరళలోని కొచ్చి సమీపంలో మంజుమ్మల్ అనే చిన్న పట్టణానికి చెందిన రెండు స్నేహితుల సమూహాలుంటాయి. వీళ్ళెప్పుడూ తగాదాలు పడి కొట్టుకుంటూ వుంటారు. ఒకర్నిమించిన పనులు మరొకరు చేయాలని పోటీలు పడుతూంటారు. 2006 లో వీళ్ళల్లో ఆర్ట్స్ క్లబ్ గ్రూపు కొడైకెనాల్ విహార యాత్ర ప్లాన్ చేస్తారు. కొడైకెనాల్‌ అంతా తిరిగి ఎంజాయ్ చేశాక, గుణ గుహలు చూడాలని ఉత్సాహ పడతారు. కమలహాసన్ నటించిన గుణ షూటింగ్ ఇక్కడే జరగడంతో గుహల కీ పేరొచ్చింది. ప్రమాదకరమైన ఈ గుహాల్లోకి ప్రవేశాన్ని నిషేధించి  ఫెన్సింగ్ వేశారు. ఫెన్సింగ్ దూకి సాహసం ఛేస్తారు మంజుమ్మల్ బాయ్స్. అలా గుహలు చూస్తూ తిరుగుతూంటే బాయ్స్ లో ఒకడైన సుభాష్ (శ్రీనాథ్ భాసి) మనిషి వెడల్పుగల లోతైన రంధ్రం లో పడిపోతాడు. ఇది ప్రాణాంతక బిలం. ఇందులోకి ఇంతవరకూ 16 మంది పడిపోతే శవాల్ని కూడా బైటికి తీయలేక పోయారు.
       
ఇప్పుడు సుభాష్ పడిపోవడంతో మిత్రబృందం భయంతో కేకలు వేస్తారు. పోలీస్ స్టేషన్ కి పరిగెడతారు. గ్రామస్థులకి చెప్పుకుంటారు. పోలీసులు ఉల్టా కేసు బనాయిస్తారు. కాళ్ళావేళ్ళా పడ్డాక పోలీసు
,లు, అటవీ శాఖ, అగ్నిమాపక శాఖ అధికారులూ అక్కడికి చేరుకుని పరిస్థితిని అంచనా వేస్తారు. తాడు సాయంతో లోపలికి వెళ్ళి బాధితుడ్ని పైకి తీసుకు రావడానికి సిబ్బంది ముందుకు రారు. మంజుమ్మల్ బాయ్స్ లో ఒకడైన కుట్టన్ (
సౌబిన్ షాహిర్) ముందుకొస్తాడు.
       
కుట్టన్ ఈ సాహసం చేయడానికి కారణముంది. ప్రాణాలు పణంగా పెట్టి  స్నేహితుడ్ని కాపాడేందుకు అతను పూనుకోవడానికి ప్రేరేపించిన ఆ కారణమేంటి
? అలా స్నేహితుడ్ని ప్రాణాలతో కాపాడుకోగలిగాడా? ఇందుకు అధికార్లు అందించిన సహాయక చర్యలేమిటి? అసలు వందల అడుగుల లోతులో పడిపోయింది గాక, భారీగా కురిసిన వర్షం నీళ్ళల్లో సుభాష్ బతికున్నాడా? ఈ ప్రశ్నలకి సమాధానమే మిగతా కథ. 

యదార్థంతో ప్రయోగం
ఇది యదార్థ సంఘటన ఆధారంగా తీసిన సర్వైవల్ డ్రామా.  యదార్థ సంఘటనలతో మలయాళంలో వరుసగా మూడు సర్వైవల్ డ్రామాలు హిట్టయ్యాయి. కేరళ వరద బీభత్సం మీద ’2018’ (2023), గుణ గుహల మీద మంజుమ్మల్ బాయ్స్ (2024), సౌదీ వలస కార్మికుడి మీద ఆడు జీవితం (2024).  గుణ గుహలు  అనేవి తమిళనాడులోని కొడైకెనాల్ లో వున్న ఒక గుహల సముదాయం. ఈ సముదాయంలో మనిషి పట్టే వెడల్పుతో లోతైన బిలాన్ని 1821లో బీఎస్ వార్డ్ అనే బ్రిటిష్ అధికారి రికార్డు చేశాడు. దీనికి అతను డెవిల్స్ కిచెన్ అని పేరు పెట్టాడు. 1991 లో ఇక్కడ కమలహాసన్ సినిమా గుణ షూటింగ్ జరిగినప్పట్నుంచీ ఇది పర్యాటక కేంద్రంగా ఆకర్షించ సాగింది. 2016 వరకూ ఈ బిలంలో పడిపోయిన వ్యక్తుల కేసులు 16 నమోదయ్యాయి. కేవలం మంజుమ్మల్ బాయ్స్ ఘటనలో ఒక్కడే బతికి బయట పడ్డాడు.
       
ఈ సినిమా చూస్తూంటే ఒక సందేహం వెంటాడుతూ వుంటుంది. అంత మంది ఆ రంధ్రం లో పడిపోతున్నప్పుడు ఇనుప మెష్ తో ఆ రంధ్రాన్ని ఎందుకు మూసేయలేదు
? కేవలం అక్కడికి చేరుకోకుండా ఎక్కడో ఫెన్సింగులు మాత్రమే వేసి ఎందుకు వదిలేశారు? ఈ విషయం తట్టే కాబోలు-

సినిమా చివర్లో ఇదే చూపించాడు దర్శకుడు- ఆ రంధ్రం మీద ధడేలుమని ఇనుప మెష్ పడేసి! కానీ క్రోనాలజీ ప్రకారం చూస్తే ఇది కరెక్ట్ కాదు. మంజుమ్మల్ బాయ్స్ ఉదంతం 2006 లోనే జరిగింది. అప్పుడు ధడేలుమని ఇనుప మెష్ పడేస్తే
, 2016 వరకూ ఇంకొన్ని మరణాలు ఎలా జరిగినట్టు? ఇంతకీ ఇప్పుడైనా మూసి వుందా లేదా? ఎవరైనా గూగుల్ చేసి కనుక్కోవాలి.

       
ఈ సర్వైవల్ డ్రామా 2 గంటల పకడ్బందీ సస్పెన్స్ థ్రిల్లర్. హ్యూమన్ డ్రామా.  అడ్వెంచర్స్ లో ఒక లెసన్. పర్యాటకులు నిబంధనల్ని ఉల్లంఘించి ఎక్కడ పడితే అక్కడికి ఎలా వెళ్ళిపోతారు
? ఈ గుహల్లో తేళ్ళు పాములైనా వుంటే? నేరపూరిత నిర్లక్ష్యానికి నిలువెత్తు ఉదాహరణ ఈ సర్వైవల్ డ్రామా.
        
అందుకే దీన్ని హార్రర్ కామెడీలా తీసి ఎంటర్ టైన్ చేయాలనుకోలేదు. తెలుగు చేతులైతే ఈ పనే చేసి సినిమా తీస్తాయి. వాడు రంధ్రంలో పడిపోయి ఆర్తనాదాలు చేస్తూంటే అక్కడ దెయ్యాల్ని కూడా జొప్పించి కామెడీ చేస్తారు. చివరికి ఏ వేపమండల అమ్మవారి ముందో కాంతారా డాన్సులు చేసి బిలంలో దెయ్యాల్ని చంపి అర్భకుడ్ని కాపాడతారు.

1. క్లోజ్ ఎన్ కౌంటర్స్ ఆఫ్ ది థర్డ్ కైండ్’ (స్టీవెన్ స్పీల్ బెర్గ్ -1977),
2.
 ‘మంజుమ్మల్ బాయ్స్’ (మలయాళం- 2024)
 
బిలం అంతర్భాగాన్ని సెట్ వేసి షూటింగు జరిపారు. ఈ కథని కేవలం బిలంలో పడిపోయిన మిత్రుడి రెస్క్యూ ఆపరేషన్ గా చూపిస్తే ఇది సినిమా అయ్యేది కాదు. డాక్యుమెంటరీ అయ్యేది. ఈ ప్రమాదానికి సమానాంతరంగా  చిన్నప్పటి ఫ్లాష్ బ్యాక్స్ రన్ అవుతూ వుంటాయి. ఆ ఫ్లాష్ బ్యాక్స్ లో ఈ బాయ్సే అప్పటి పిల్ల మూక. వాళ్ళల్లో ఒకడు (సుభాష్) తన మీద ప్రాంక్స్ ప్లే చేసుకుంటూ వుంటాడు. ఆవిప్పుడు బిలంలో పడిపోవానికి సింబాలిక్ గా వుంటాయి. ఇలాటి ఫోర్ షాడోయింగ్ సీన్స్ తో సందర్భానుసారంగా ఫ్లాష్ బ్యాక్స్ రన్ అవుతూ వుంటాయి. ఒకసారి అంతా నదిలో దూకేసి ఈత కొడుతూంటారు. సుభాష్ నీ దూకెయ్యమంటారు. భయపడుతూ దూకేసిన సుభాష్ ఏమయ్యాడు? అప్పుడు వాడ్నిఎవరు కాపాడారు. ఇది ఇప్పటి  ప్రమాదంతో ఎలా లింకప్ అయింది? ఇప్పుడు కుట్టన్ రంధ్రంలోంచి సుభాష్ ని కాపాడ్డానికి ప్రేరణ ఏమిటి? లోనైన ఎమోషన్స్ ఏమిటి?

కదిలించే ఎమోషనల్ డ్రామా కూడా ఇది.  ఫ్రెండ్ షిప్ స్టోరీ కూడా. యువనటులతో యూత్ ఆడియెన్స్ పల్స్ ని పట్టుకున్న ప్రయోజనాత్మక సినిమా. నిడివి కేవలం రెండు గంటలు. తారాగణ బలం లేని సినిమాకి 20 కోట్ల బడ్జెట్ ప్రొడక్షన్ మీద పెట్టారు. తెలుగు ప్రేక్షకులు ఓటీటీలో వచ్చేదాకా ఆగకుండా బిగ్ స్క్రీన్ మీద చూస్తే దీని బలం పదింతలు తెలుస్తుంది. ఆడు జీవితం తర్వాత బలమైన సినిమా చూడాలనుకుంటే ఇదే.

2024 లో సందర్శకుల్ని ఆకర్షించడానికి గుహకు వెళ్ళే రహదారిని  తిరిగి తెరిచారు. అయితే పర్యాటకుల భద్రత కోసం గుహ ప్రవేశ ద్వారం ఇప్పటికీ మూసివేసే వుంచారు. ఈ సినిమా ప్రారంభ ముగింపుల్లో గుణ లో కమల హాసన్ వెంటాడే పాట ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే ఇళయరాజా స్వరకల్పనలో వస్తూంటుంది. గుహ బాధితుల్ని పరామర్శిస్తున్నట్టు.

—సికిందర్