రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

30, ఆగస్టు 2018, గురువారం

677 : స్ట్రక్చర్ అప్డేట్స్


రెండు పాత్రలు, వాటికి చెరొక  గోల్స్ వుండి, ఆ రెండు గోల్స్ తో సినిమా కథంటే అది స్ట్రక్చర్ లేని క్రియేటివ్ స్కూల్లోంచి వచ్చే అదో ఉత్పత్తి. దీంతో  ‘శ్రీనివాస కళ్యాణం’ లాంటివి వస్తాయి. టాస్ వేశాక ఆటగాళ్ళు ఎవరి బంతితో వాళ్ళు వేర్వేరు ఆటలాడుకుంటామంటే ఆ ఆట ఎలా వుంటుండో ఇదీ అంతే. కోతులకి కొబ్బరి చిప్పలు దొరికిన చందం. ఆ చిప్పల్ని పిల్లులు తన్నుకు పోతాయి. రివర్స్ లో వుంటుంది సామెత. స్ట్రక్చర్ లేని క్రియేటివిటీలు రివర్స్ సామెతలే. ‘శ్రీనివాస కళ్యాణం’ లో ప్రకాష్ రాజ్ కి తన చేతిలో వున్న బంతినేం చేయాలో అర్ధంగాలేదు, నితిన్ కీ తన చేతిలోని బంతినేం చేసుకోవాలో అంతుపట్టలేదు. ఇంతలో పిల్లిలా క్లయిమాక్స్ వచ్చేసి ఇద్దరి బంతుల్నీ గల్లంతు చేసిపోయింది... 

         
స్ట్రక్చర్ సమేత క్రియేటివ్ వ్యాపకంలో ప్రధాన పాత్రకీ, ప్రత్యర్ధి పాత్రకీ వుండేది ఒక్క ఆటే. దాంతోనే ఆడుకుని ఎవరో ఒకరు గెలవాలి. ప్రధాన పాత్రకి ఒక గోల్ వుంటుంది, ఆ గోల్ కి ప్రత్యర్ధి పాత్ర అడ్డు పడ్డమే సినిమా అనే ఆట. కామన్ సెన్సు చెప్పే మాట. ఉత్త క్రియేటివిటీతో అంతా నాన్సెన్సే. కథకుడి స్వకపోల కల్పనల – కొండకచో - స్వైరకల్పనల ‘కలాపోసనే’. ప్రధాన పాత్ర గోల్ ని ప్రత్యర్థి పాత్ర అడ్డుకోకుండా, వేరే గోల్ పెట్టుకుని అదే ప్రధాన పాత్రతో ఆడుకోవాలంటే ఒక సందర్భంలోనే సాధ్యం. అది కూడా వేరే విధంగా. అది ‘మరోచరిత్ర’ సందర్భం. కె. బాలచందర్ తీసిన  ‘మరో చరిత్ర’ లో ఏం జరుగుతుందంటే, ప్రేమికులైన కమల్ హాసన్ –సరితలకి వాళ్ళ పేరెంట్స్ నుంచి ఒక సమస్య (ప్లాట్ పాయింట్ వన్) ఎదురవుతుంది. దాని ప్రకారం వాళ్ళిద్దరూ ఏడాదిపాటు కలుసుకోకుండా దూరంగా వుంటే, అప్పుడు కూడా ప్రేమలు మిగిలున్నాయని వాళ్ళు బలంగా ఫీలయితే, పెళ్లి చేస్తామని. ఇదీ కమల్ – సరితలకి ఏర్పాటు చేసిన గోల్. దీంతో పరస్పరం ఏడాది పాటూ దూరంగా వున్న కాలంలో, కమల్ ని మాధవి ప్రేమిస్తుంది. కమల్ తిరస్కరిస్తాడు. ఇటు సరితని ఒక రోమియో టీజ్ చేయబోతే లెంపకాయ కొడుతుంది. ఇక చివరికి ఏడాది గడువు విజయవంతంగా పూర్తి చేసుకుని కమల్ – సరితలు హేపీగా కలుసుకోబోతూంటే, మాధవిని కమల్ కాదన్నందుకు ఆమె అన్న పగబట్టి వస్తాడు. ఇటు సరిత రోమియోని కొట్టి నందుకు వాడు ఆమె మీద పగబట్టి వస్తాడు. ఇద్దరూ కలిసి కమల్ - సరితలని చంపేస్తారు. ఏమిటిది? ప్రేక్షకులూహించే  సుఖాంతం బదులు అనూహ్యంగా దుఃఖాంతం. కమల్ – సరితల ఇద్దరి గోల్ తో స్టోరీ క్లయిమాక్స్ బదులు, దుష్టుల గోల్స్ తో ప్లాట్ క్లయిమాక్స్. 

          అనుకోకుండా చదవడం తటస్థించిన బాబ్ షకోచిస్ అనే రచయిత రాసిన ‘దినెక్స్ట్ న్యూ వరల్డ్’ కథల పుస్తంలో,  ‘స్టోలెన్ కిస్’ అనే కథలో, బర్టన్ అనే పెయింటర్ పెయింట్ వేస్తూ పెదవి ముద్రని చూస్తాడు. ఎవరో అక్కడ ముద్దు పెట్టినట్టు వుంటుంది. ఎవరా అని తనకి తెలిసిన కొందరు అమ్మాయిల్ని, అమ్మల్నీ ఊహిస్తాడు. ఆ ముద్దు వెనకున్న కథేమిటో అంతుపట్టక,  ఆ ముద్దు మీద తన ముద్దు పెట్టేస్తాడు, అంతే! 

          ఆమె కెవరితో ఏ అందమైన కలలు (గోల్) వున్నాయో ఏమో, దాన్ని చెడగొట్టే చర్యకి పాల్పడ్డాడు. ఆమె స్టోరీ క్లయిమాక్స్ కి తన ప్లాట్ క్లయిమాక్స్ ని అడ్డమేశాడు. ‘మరోచరిత్రలో’ కూడా ఇంతే. కమల్ – సరితల గోల్ తో క్లయిమాక్స్ పూర్తయితే అది స్టోరీ క్లయిమాక్స్ అవుతుంది. ఇది గోల్ పుట్టిన ప్లాట్ పాయింట్ వన్ కి న్యాయం చేస్తుంది. ఇలా కాక,  గోల్ పుట్టిన ప్లాట్ పాయింట్ వన్ తర్వాత వచ్చే మిగతా కథనంలో, ఎక్కడో వేరే అనుకోని పాత్రతో, లేదా పాత్రలతో వేరే సంఘటన జరిగి, ఆ పాత్రకి, లేదా పాత్రలకి వేరే గోల్స్ ఏర్పడితే, అది ప్లాట్ క్లయిమాక్స్ కి దారి తీసి, అదే ముగింపవుతుంది. అంటే స్టోరీ క్లయిమాక్స్ రద్దయిపోయి ట్రాజడీ అవుతుంది. ఇక్కడ ప్రధాన పాత్రల గోల్ పూర్తికాదు. మూడో పాత్ర వచ్చేసి దాని  గోల్ ని నెరవేర్చుకుంటుంది.

          సింపుల్ గా చెప్పాలంటే, ఇక్కడ కమల్ – సరితలది స్టోరీ గోల్ అయితే, దుష్టులది ప్లాట్ గోల్. స్టోరీ గోల్ క్లయిమాక్స్ కి దారితీస్తే, ప్లాట్ గోల్ యాంటీ క్లయిమాక్స్ కి దారి తీస్తుంది, అంతే!
          స్టోరీ గోల్ = దాని క్లయిమాక్స్, ప్లాట్ గోల్ = దాని యాంటీ క్లయిమాక్స్.
          అందుకే స్టోరీ క్లయిమాక్స్, ప్లాట్ క్లయిమాక్స్ అని పేర్లు.
          స్టోరీ గోల్ కథలోంచి పుడితే, ప్లాట్ గోల్ కథనంలోంచి పుడుతుంది.
          స్టోరీ గోల్ ( ప్లాట్ పాయింట్ వన్) ప్రత్యర్ధి వల్ల ప్రధాన పాత్రకి పుడుతుంది.
          ప్లాట్ గోల్ ప్రధానపాత్ర వల్ల ఇంకో ప్రత్యర్ధి పాత్రకి పుడుతుంది.
          కమల్ –సరితల పేరెంట్స్ స్టోరీ గోల్ ప్రత్యర్ధులు.
          కమల్ – సరితలు దుష్టులిద్దరి ప్లాట్ గోల్ ప్రత్యర్ధులు.
          ఇలాటి కథల్లో ప్లాట్ గోల్ దే విజయం.
                                                          *** 
      ఇప్పుడు  ‘శ్రీనివాస కళ్యాణం’ లో చూద్దాం. ఇందులో ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ప్రకాష్ రాజ్ నితిన్ కి కండిషన్ పెడతాడు. తన కూతుర్ని (హీరోయిన్ని) పెళ్లి చేసుకోవాలంటే విడాకుల పత్రాల మీద సంతకాలు పెట్టాలని. కౌంటర్ గా నితిన్ పెళ్లిని దగ్గరుండి సాంప్రదాయాల ప్రకారం ప్రకాష్ రాజ్ జరపాలంటాడు. పరస్పరం ఈ షరతులు ఒప్పకుని ప్లాట్ పాయింట్ వన్ ని ఏర్పాటు చేస్తారు. ప్రకాష్ రాజ్ గోల్ కూతురు కాదంటే ముందస్తు విడాకుల పత్రాలతో ఎప్పుడైనా నితిన్ ని వదిలించుకోవడం. నితిన్ గోల్ సాంప్రదాయాలంటే పడని ప్రకాష్ రాజ్ మెడలు వంచి, సాంప్రదాయాల ప్రకారం తన పెళ్లి జరిపించుకోవడం. 

          ప్లాట్ పాయింట్ వన్ దగ్గర హీరోకీ విలన్ కీ చెరొక గోల్ ఏర్పడతాయా? రెండు గోల్స్ తో ప్లాట్ పాయింట్ వన్, అంటే కథ పుడుతుందా? అప్పుడా కథ ఎలా నడపాలి? హీరో గోల్ తోనా, విలన్ గోల్ తోనా, ఇద్దరి గోల్స్ తోనా? ప్రకాష్ రాజ్, నితిన్ లు - నా మెడలు వంచి నీ బంతాట నువ్వాడుకో, నీ పత్రాలతో నా బంతాట నేనాడుకుంటా – అని ఆడుకోవడం సాధ్యమేనా? అది ఒక కథేనా, రెండు కథలా? 

          అసలు వీళ్ళ గోల్స్ ఎంత వాస్తవికంగా వున్నాయో చూద్దాం. ప్రకాష్ రాజ్ వజ్రాయుధంగా  విడాకుల పత్రాలు ఈ కథకి ఎందుకు పనికొస్తాయి? ఈ కథ పెళ్ళితో ముగిసిపోయే కథ. పెళ్లి తర్వాత కాపురం కూడా మొదలయ్యే కథైనప్పుడు కదా ఆ వజ్రాయుధం ప్రయోగించడానికి పనికొచ్చేది? ఉన్న పెళ్లితో ముగిసే కథలో వాడకానికి  పనికిరాని వజ్రాయుధాలూ అణ్వస్త్రాలూ ఎందుకు? కాబట్టి ప్లాట్ పాయింట్ వన్ లో ఈ అక్రమ గోల్ ఔట్!

          ఇక నితిన్ తీసిన బ్రహ్మాస్త్రం – సాంప్రదాయాలకి ప్రకాష్ రాజ్ మెడలు వంచే కార్యక్రమానికి హెచ్చరిక ఏం పెట్టాడు? ప్రకాష్ రాజ్ మెడలు వంచడానికి ఎక్కడైనా మొండికేస్తే, నితిన్ ఏం చెయ్యాలనుకున్నాడు? పెళ్లి క్యాన్సిల్ అంటాడా? మరి అలాటి హెచ్చరికతో ప్రకాష్ రాజ్ భావి జిత్తులకి చెక్ పెట్టాడా? లేదే? మరి ఈ బ్రహ్మాస్త్రమూ, బ్రహ్మోస్ క్షిపణులూ దేనికీ – జస్ట్ ఆస్కింగ్ - అని ప్రకాష్ రాజే అంటే  ఏం చేస్తాడు? కాబట్టి ప్లాట్ పాయింట్ వన్ లో ఈ అక్రమ గోల్ కూడా ఔటే! 

          అందువల్ల ఇద్దరూ గోల్స్ ని పక్కన పెట్టి డమ్మీ లైపోయారు. ఇక్కడ్నించీ కథ చూస్తే, పెళ్లి సందడీ, పెరంటాళ్ళ కోలాహలమే చూపిస్తూ కథని నడిపేశారు. క్లయిమాక్స్ లో పెళ్ళిపీటల మీంచి లేచిపోయి నితిన్ తన మనోభావాలు ప్రకటించుకుంటాడు. ఏమని? ముందే విడాకుల మీద సంతకం పెట్టే పాడుపని చేశాక, పవిత్రమైన మంగళ సూత్రం ఎలా కట్టను? అని. ఇలా తనతో ప్రకాష్ రాజ్ చేసిన దుర్మార్గం బయటపెట్టేసి, తను సేఫ్ అయిపోయి చివరికి తాళి కట్టేస్తాడు. 

          అసలు నానమ్మ కూచిగా పెళ్ళంటే పవిత్ర కార్యమని చిన్నప్పట్నించీ జీర్ణించుకున్న తను ఆ  కాగితాల మీద సంతకమెలా పెడతాడు, చించేసి ప్రకాష్ రాజ్ కి క్లాసు పీకక? కాబట్టి, పాత్ర చిత్రణ కూడా ప్లాట్ పాయింట్ వన్ లో కిల్ అయ్యాక అది కథ మొదలు పెడుతుందా? 

          ఇలా చాలా కాంట్రడిక్షన్ గా వుంటుంది గోల్స్ ఏర్పాటూ వాటి నిర్వహణా. ఒక సినిమా కథకి ఒకే గోల్ వుంటుంది, దాంతోనే హీరో విలన్ల సంఘర్షణా వుంటుంది. విడి విడి గోల్స్ వుండాలంటే ‘మరోచరిత్ర’ కెళ్ళి ఆ ప్రకారం మార్చుకోవాలి. ముందు స్టోరీ గోల్ ఒక పాత్రతో నడిపి, ప్లాట్ గోల్ ఇంకో పాత్రతో ప్రారంభించాలి. అంటే స్టోరీ గోల్ ప్రకాష్ రాజ్ చేతిలో వుంటే, ప్లాట్ క్లయిమాక్స్ నితిన్ ప్రారంభిస్తాడు. అప్పుడు ప్రకాష్ రాజ్ కి యాంటీ క్లయిమాక్స్ ఎదురవుతుంది. విలన్ కి – నెగెటివ్ పాత్రకి యాంటీ క్లయిమాక్స్ ఏముంటుంది, అది న్యాయబద్దమైన, శిక్షార్హమైన క్లయిమాక్సే అన్పించుకుంటుంది. విలన్ మీద  అయ్యోపాపం అన్పిస్తేనే యాంటీ క్లయిమాక్స్ వర్కౌటవుతుంది. అలాటి విలన్లు ఈ కింద వున్నారు...
గోల్ ఇన్నోవేషన్ లో ఇంకో కొత్త ప్రయోగం కావొచ్చిది...

Top sympathy gainer villains:
1. Itachi Uchiha - Naruto (Seriously he is not a villain)
2. Light Yagami - Death Note (Anti-hero at best)
3. Wile. E. Coyote - The Roadrunner Show (Lots of love here for this poor soul)
4. Tom Cat - Tom and Jerry (Tom was just doing his duty)
5. Darth Vader/A. Skywalker - Star Wars (Well…)
6. Magneto - X-Men (Comics and movies both)
7. Freeze - Batman (Wants to save his wife)
8. Dr. Heinz Doofenshmirtz - Phineas and Ferb (A genius who just wants some love)
9. Joker - TDK and Batman Comics
10. Karna - Mahabharat (Come on guys he was just fighting for the wrong side)
11. Raavan - Ramanyan (A great scholar and warrior)
12. Medusa - Greek Mythology (She was the victim)
13. Satan/Lucifer - Bible (Kicked out of his home)
14. Gollum - Lord of The Rings
15 Prof. Snape - Harry Potter (Always!)
16. Lord Voldemort - Harry Potter
17. Shylock - Merchant of Venice (He was treated so poorly, the guy just wanted some payback but never got it)
18. Gen. Frank Hummel - The Rock (Was fighting for a right cause)
19. Team Rocket - Pokemon (Hard working and persistent)
20. Prince Zuko - Avatar-The Last Airbender (Ftaher is the real villain)
21. Princess Azula - Avatar-The Last Airbender (Ftaher is the real villain)
22. Gru - Despicable Me
23. Loki - MCU, comics and The Mask
24. Gen. Zod - Superman (was doing what he was genetically designed to do)
25. Cersei Lannister - Game of Thrones
26. Jaime Lannister - Game of Thrones
27. Roy Batty - Bladerunner (just wanted to live)
28. Mojo Jojo - The Powerpuff Girls (Dr. abandoned him for girls)
29. Plankton, Squiward too - SpongeBob Squarepants
30. Bane - Batman Comics and DKR (endured inhuman conditions)
31. Syndrome - The Incredibles (Just wanted to help his idol)
32. Megatron - Transformers Comics (was a mistreated revolutionary)
33. Helmut Zemo - Captain America-Civil War (Avenging his family. Single-handedly took on several superheros without any special power)
34. Draco Malfoy - Harry Potter (A product of his upbringing, deeply conflicted)
35. Denzel Crocker - Fairly Odd Parents (wanted to regain his credence and reputation)
36. Nox - Waku (Wanted to turn back time and save his family)
37. Deathstroke/ Slade Wilson - DC Universe

సికిందర్


(సినిమా కథని కాపాడుకోవాలంటే ప్రాజెక్టు మేనేజి మెంట్ (S.M.A.R.T) ట్రిక్కులు వచ్చేవారం!)


26, ఆగస్టు 2018, ఆదివారం

676 : ఫ్లాష్ బ్యాక్ / రివ్యూ


దర్శకత్వం : టిన్నూ వర్మ
తారాగణం : సన్నీ డియోల్, టబూ, అర్బాజ్ ఖాన్, టిన్నూవర్మ, సుధేష్ బెర్రీ, మలై కా అరోరా, అనంగ్ దేశాయ్ తదితరులు
రచన : టిన్నూ వర్మ ,రవి శంకర్ జైస్వాల్
సంగీతం :  సాజిద్ – వాజిద్,  ఛాయాగ్రహణం : రాజూ కేజీ
నిర్మాత : మహేంద్ర ధరేవాల్
విడుదల : జనవరి 25, 2002
***
          సీమ కథల్ని నందమూరి బాలకృష్ణ గుత్తకు తీసుకున్నట్టు, సన్నీడియోల్ దేశభక్తిని కాంట్రాక్టు మాట్లాడుకున్నట్టుంది - ఈ ఆరు మాసాల్లో దేశభక్తితో ఇది మూడో దర్శనం. దేశభక్తికి అసలు సిసలు గుత్తేదారైన సీనియర్ దేశభక్తి పరుడు మనోజ్ కుమార్ కూడా ఇంత ఎక్స్ ప్రెస్ స్పీడుతో దేశ భక్తి సినిమాల్ని దేశం మీద వదల్లేదు. ఈ లేటు వయసులో సన్నీకి ఇక దేశభక్తితోనే కెరీర్ కి ముక్తి అన్నట్టుంది – ‘గదర్’ తో ఒక  హుషారు, ‘ఇండియన్’ ఇంకో బేజారూ ఖాతాలో వేసుకున్న తర్వాత, ఇప్పుడు ‘మా తుజే సలాం’ తో తిరిగి సలాములందుకునే స్థాయి కొచ్చేశాడు. అయితే ఈ క్రెడిట్ అంతా తనదే కాదు. ఈ మూవీ దర్శకుడు, స్టంట్ మాస్టర్ టిన్నూవర్మకే క్రెడిట్ అంతా పోతుంది. ఎందుకంటే, ఈ దేశభక్తి భారీ యాక్షన్ కి అసలు హీరో తనే – నటిస్తూ కూడా! 

          
స్టంట్  మాస్టర్లు దర్శకులయ్యారంటే ఎక్కువగా వాళ్ళ సినిమా సృష్టి ‘బి’ గ్రేడ్ లెవెల్ తో సరిపెట్టుకుంటుంది. టిన్నూ వర్మ దీనికి మినహాయింపు. ఒడలు జలదరించే భీకర పోరాటాల్ని నెంబర్ వన్ గా కంపోజ్ చేసే ఈయనకి, ఒక మంచి కళా హృదయమూ, భావుకతా వుండడం విస్మయం కలిగించేదే అయినా, ఇవే ఈ యాక్షన్ థ్రిల్లర్ ని ఇంకో స్థాయికి తీసికెళ్ళాయి. ఈ మధ్య సినిమాల పేరుతో అదే పనిగా హోరెత్తిస్తున్న ‘పేమ కతల’ ధాటికి బోరెత్తిన ప్రేక్షకులు, ఓసారి ఈ యాక్షన్లో వున్న దేశభక్తిని చూస్తే, కడుపు నిండిపోయి – ‘క్యా మస్త్ ఫిల్మ్ బనాయారే!’  అని తెగ ఉబ్బితబ్బిబ్బవక మానరు. చుట్టూ ఇన్ని ఉద్రిక్తతలేర్పడ్డ గడ్డు పరిస్థితుల్లో ఉబుసుపోక ప్రేమ కథలేనా, కాస్త అటు దృష్టి మరల్చి సరిహద్దులో బలగాలకేసి చూడక్కర్లేదా? సైనికుడక్కడ ధాటీగా నిలబడకపోతే, ఇక్కడ మనకి ఏ ప్రేమ కథలూ, కాకరకాయ కబుర్లూ వుండవు. 


        ‘దూద్ మాంగేతో ఖీర్ దేంగే, కష్మీర్ మాంగేతో చీర్ దేంగే!’ – (పాలు అడిగితే పాయసం ఇస్తాం, కశ్మీర్ ని అడిగితే చీరేస్తాం) అనే నాటు స్లోగన్ తో ప్రారంభమయ్యే కథ, సెంట్రల్ ఐడియా అంచెలంచెలుగా తీసికెళ్ళి ప్రేక్షకుల మెదళ్లలో బలంగా నాటి, అక్కడ్నుంచీ ముకుతాడేసి లాక్కుపోయే కథన చాతుర్యాన్ని మెచ్చ కుండా వుండలేం. ఇందులో నటీనటులకే కాదు, సాంకేతిక నిపుణులకీ ఈ పకడ్బందీ స్క్రిప్టు వాళ్ళ ప్రతిభని చాటుకోవడానికి తిరుగు లేని అస్త్రంలా మారింది. 

          జమ్మూ కాశ్మీర్ లో బటాలిక్ హిమ శిఖరాగ్రాన
, నియంత్రణ రేఖ సమీపంలో, పూర్తిగా ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో, తన పటాలంతో అవుట్ పోస్టు నిర్వహించే మేజర్ ప్రతాప్ సింగ్ (సన్నీ డియోల్) సెలవు మీద బేస్ క్యాంపు కెళ్తాడు. అక్కడ కల్నల్ ఖన్నా (గోవింద్ నామ్ దేవ్) కుమార్తె, ఇంటలిజెన్స్ కెప్టెన్ అయిన సోనియా ఖన్నా(టబూ) వుంటుంది. ఇద్దరికీ పూర్వపరిచయం, ప్రేమా వుంటాయి. ఎంగేజి మెంట్ సన్నాహాల్లో వుంటారు. ఇలా వుండగా, సరిహద్దు సమీప గ్రామం జహానా బాద్ లో సుల్తాన్ లాలా (టిన్నూ వర్మ) అనే బలమైన భూస్వామి వుంటాడు. ఇతడికి ముగ్గురు తమ్ముళ్ళూ, అల్ బక్ష్ (అర్బాజ్ ఖాన్) ఆనే నమ్మిన బంటూ వుంటారు. ఈ నమ్మిన బంటుకి నర్గీస్ (మోనాల్) అనే ప్రియురాలుంటుంది. ఈ బంటు తన యజమానిని గుడ్డిగా నమ్మి, పాకిస్తాన్ నుంచి ఆయుధాలు చేరవేస్తూంటాడు. తర్వాత ఈ ఆయుధాలతో యజమాని కుట్ర తెలిసిపోతుంది. సుల్తాన్ లాలా కుట్రేమిటంటే, కాశ్మీర్ ని పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో కలిపేసి తను అధిపతి కావాలని. పాకిస్తానీ కమాండర్ గుల్ మస్తాన్ (సుధేష్ బెర్రీ) తో కుమ్మక్కయి ఈ పథక రచన చేస్తూంటాడు. 


         ఇది తెలుసుకున్న బంటు బక్ష్, ఏకంగా గుల్ మస్తాన్ ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి కాశ్మీర్ పోలీసులకి అప్పజెప్పేస్తాడు. దీంతో లాలా రెచ్చిపోయి, బక్ష్ ని మట్టుబెట్టేందుకు పూనుకుంటాడు. ఇటు మేజర్ ప్రతాప్, సోనియాలు, బక్ష్ సాయంతో సరిహద్దు కావల లాలా తండానీ, మిలిటెంట్ల గుడారాల్నీ తుదముట్టించేసి, జెండా పాతేస్తారు. 

          స్థూలంగా ఇదీ కథయినా, దీని కాన్వాస్ – విస్తృతి పెద్దది. ఒకవైపు ప్రతాప్, సోనియాలు, అల్ బక్ష్, నర్గీస్ లతో బాటు, శివ - సత్య సోదరుల హిందూ కుటుంబం, దర్గాలో ఒక ముజావర్ (‘షోలే’లో మౌల్వీ పాత్ర లాంటిది?), ఇంకో వైపు లాలా గ్యాంగ్, మస్తాన్ తండా, ఇంకో దుష్ట ఇన్స్ పెక్టర్ అలీ ఖాన్ లతో బాటు, ఆర్మీ పోస్టు లో ఇంకో అయిదుగురు జవాన్ల కథా కలిసి, కథనానికి కావాల్సినంత ఇంధనాన్ని సమకూరుస్తూంటాయి.  


          అయితే ఇందులో ప్రధాన పాత్ర మేజర్ ప్రతాప్ కాదు. అంటే సన్నీడియోల్ కాదు. సహాయ పాత్రయిన అల్ బక్షే అనిపిస్తాడు. ఈ పాత్రకే నిడివి ఎక్కువ. చివరి ముప్పావు గంట మాత్రమే ప్రతాప్ పాత్ర పూర్తి స్థాయి యాక్షన్ లోకొస్తుంది. అమాయకుడైన ఈ అల్ బక్ష్ యజమాని పట్ల మొదట విధేయతని చాటుకునే దృశ్యాలు, అంకిత భావంతో ప్రియురాలు నర్గీస్ తో సలిపే ప్రేమ కలాపాలు, యజమాని అసలు రూపం తెలిశాక తన విశ్వరూప ప్రదర్శనా, మాతృదేశం కోసం ఏమైనా చేసేసే తెగువా, లోయలో శత్రువుల పాలిట మృత్యు నీడై సంచారం ...ఇంత కథ ఈ పాత్రకి కల్పించడాన్ని బట్టి చూస్తే, దర్శకుడి ప్రధానోద్దేశమేమిటో స్పష్టమవుతుంది. ఎలాగూ సైనిక సాహసాల సినిమాలు చాలా వచ్చేశాయి – ఇక ఉగ్రవాదంతో తప్పుదారి పట్టిపోతున్న ముస్లిం యూత్ కి, ఓ కనువిప్పు కావాలంటే, దేశమంటే ఏమిటో తెలియాలంటే, అది అల్ బక్ష్ పాత్రతోనే సాధ్యమవుతుంది. చెప్పాలనుకున్నపాయింటు సూటిగా, బలంగా వుంటుంది. ఈ పాత్రని అర్బాజ్ ఖాన్ (సల్మాన్ ఖాన్ తమ్ముడు) గుర్తుండేలా పోషించాడు.       పూర్తిగా అవుట్ డోర్ లోనే సాగే ఈ యాక్షన్ మూవీలో కాశ్మీర్ ని పండు వొలిచినట్టు వొలిచి చూపెట్టాడు దర్శకుడు. కాశ్మీర్ అందాల్ని అందమైన అల్బంలా తీర్చిదిద్దాడు. రాజూ కేజీ అద్భుత కెమెరా పనితనం పట్టుకున్న సీనిక్ బ్యూటీ ఒక అందమైన అనుభవం. ఫారిన్ సినిమాల్లోంచి ఫైట్స్ నీ, ఇతర యాక్షన్ సీన్స్ నీ కాపీ కొట్టేస్తున్న ఈ రోజుల్లో, యాక్షన్ డైరెక్టర్ గా వర్మ వొరిజినల్ టాలెంట్ ప్రదర్శనని సంపూర్ణంగా ఇక్కడ చూస్తాం. రక్తం గడ్డకట్టే మంచులో రెండు జిహాదీ గ్రూపుల నడుమ వెన్నులో చలిపుట్టించే గన్ ఫైట్, టేక్రీ మీద జెండా ఎగరేసేందుకు గుర్రాల మీద పడే పోటాపోటీ, గెరిల్లా పద్ధతుల్లో అల్ బక్ష్ తీసే చావు దెబ్బలు, చివరి అరగంట పాటూ సాగే యుద్ధ దృశ్యాలూ, అత్యంత హైలైట్స్ అని చెప్పుకోవాలి. వీటికి ప్రేక్షకుల్లోంచి అమ్మాయిలు కూడా కేరింతలు కొట్టారంటే, లింగబేధాలకి అతీతంగా, అపూర్వంగా ఈ దృశ్యాల్లో రగిలించిన దేశభక్తి భావ బలం అలాంటిది. 

          దర్శకుడు మెలోడ్రామాని కూడా వదులుకోలేదు. ఆయుధాలకోసం అల్ బక్ష్ తన గ్రూపుతో సరిహద్దు దాటుతున్నప్పుడు, వద్దని అతణ్ణి వారిస్తూ ప్రియురాలు నర్గీస్ పాడే సోలో పాట చిత్రీకరణ, కదిలించే విధంగా వుంటుంది మెలోడ్రామా పెల్లుబుకుతూ. శత్రు వినాశం కోసం తనని ఆశీర్వదించాల్సిందిగా అల్ బక్ష్ వచ్చినప్పుడు, శివ (అనంగ్ దేశాయ్) పూజకు ఉపక్రమిస్తూంటాడు. అప్పుడేకంగా హారతి పట్టి తిలకం దిద్దేస్తాడు అల్ బక్ష్ కి. దేశాన్ని మించిన దైవం ఏముంటుంది. సోదరభావం, ఆధ్యాత్మిక - దేశభక్తి భావాలూ ఇమిడి వున్న ఈ దృశ్యం ఇంకో హైలైట్ గా చప్పట్లు కొట్టించుకుంటుంది.      అలాగే ఒక సోల్జర్ (శరత్ సక్సెనా) వుంటాడు. ఇతను వివిధ భారతి రేడియో సరిహద్దులో ఫౌజీ భయ్యాల కోసం ప్రసారం చేసే మీరు కోరిన పాటలు ‘జయమాల’ కార్యక్రమానికి  ఎన్ని ఉత్తరాలు రాసినా కోరిన పాట రాదు. ఆఖరికి ఆ పాట వస్తున్న సమయానికి మిలిటెంట్లు దాడి చేస్తారు. అలా పురాతన యుద్ధ చిత్రం ‘హకీఖత్’ లోని ‘కర్ చలే హమ్ ఫిదా హోకే తన్ సాథియో’ సూపర్ హిట్ పాట ఓ పక్క రేడియోలో వస్తూంటే, మిలిటెంట్లతో భీకర పోరులో ఆ సోల్జర్ అశువులు బాసే దృశ్యానికి కరుణ రసం వెల్లువవుతుంది. అతను ఆ పాట పదేపదే కోరుకోవడం (సెటప్), ఆ కోరిక ఈ పరిణామాలతో (పే ఆఫ్) తీరడం,  అస్సలు మనం వూహించలేని కథన చాతుర్యమే.

          అయితే ఇక్కడ రెండు పొరపాట్లు దొర్లాయి. ‘జయమాల’ కార్యక్రమంలో ప్రెజెంటర్ గా ఆలిండియా రేడియోలో ఇప్పుడు లేని లివింగ్ లెజెండ్ అమీన్ సయానీ గొంతు విన్పించడం, ‘జయమాల’ కార్యక్రమం వచ్చే సమయాన్ని పగలుగా చూపించడం రెండూ పొరపాట్లే.


          ఇక పోరాటాల మాస్టర్ వర్మ ఇంకో క్రియేటివ్ పార్శ్వాన్నికూడా ఇక్కడ ఇంకో చోట చూడొచ్చు. ‘8 పిఎం విస్కీ’ కి ఇటీవల ప్రసారమవుతున్న యాడ్ ఫిలిం మీద చేసిన ప్రయోగం! అలాగే సరిహద్దు కావల మిలిటెంట్ల స్థావరాన్ని ధ్వంసం చేసే దృశ్యంలో పై అధికారి సందిగ్థత, సన్నీ డియోల్ లేవనెత్తే ప్రశ్నలూ ఆలోచనాత్మకంగా వుంటాయి. అయితే అతడి వాదం ఎంత సబబైనా, ఇజ్రాయెల్ లా తెగించే అవకాశం మనకుందా? పాలస్తీనా, పాకిస్తాన్ ఒకటేనా?      ఇందులో డ్రీమ్ సాంగ్స్ లేవు. అన్నీ సందర్భాను సారం వచ్చే గీతాలే. ఇక టిన్నూ వర్మ పోషించిన విలన్ లాలా పాత్ర విషయాని కొస్తే,  అతడి బేబీ ఫేసుకి ఈ పాత్ర సరీగ్గా సరిపోయింది. వర్మ నటనలో అతి లేదుగానీ, సన్నీడియోలే  ఫైనల్ గా పోరాటంలోకి దిగాక ఓవరాక్షన్ ఎక్కువ చేశాడు (సన్నీ అంటే సన్నం కాదు, నాటు మోటేమో!). అంతంత గొంతేసుకుని ఆ అరుపులు అరవడం అతడికే సాధ్యం. అతడి గొంతు వున్నాక ఇక మందు పాతరల అవసరమే లేదు. అన్నేసి తూటాలూ, అగ్నిగోళాలూ పేల్తూంటే కూడా ఒక్కటీ తగలకపోవడం చూసి ప్రేక్షకులు ఎగతాళి చేయడం ఓ పక్క, ఆ తర్వాత సినిమా డాక్టర్ పాత్ర వచ్చి – ‘అరె ఒక్క గుండు కూడా తగల్లేదే ఆశ్చర్యం!’  అనే చోద్యం ఇంకో పక్క! పుండుమీద కారం జల్లినట్టు! మరెందుకా  పేలుడు పదార్థాలతో వృధా ఖర్చంతా?  

          పోతే, పాక్ కి చాలా చురకలేయడంతో పాటు, ‘మీరెంతో మంచివారు, ఈ దేశానికి మీరు గర్వకారణం’ అని అంతిమంగా ముసల్మానులకి ధృవీకరణా పత్రాలిచ్చే డైలాగులూ వున్నాయి. ఇలా గత సినిమాల్లో కన్పించదు. జాతీయ సమగ్రతకి ప్రతిరూపమైన బాలీవుడ్, ఒకవేళ ఇలా ఇప్పుడు తెలియకుండానే రాజకీయ నాయకుల పాత్ర పోషిస్తోందేమో పరిశీలించుకోవాలి. ఏమైనా ఈ సిన్సియర్ ప్రయత్నానికి తప్పుదారి పట్టే ఒక్క ముస్లిం యువకుడైనా క్షణమాగి ఆలోచిస్తే, ఈ స్టంట్ మాస్టర్ ఆశయం నెరవేరినట్టే. ఆల్ ది బెస్ట్ మిస్టర్ వర్మా.


          ―సికిందర్
         
(ఆంధ్రభూమి - 2002)

23, ఆగస్టు 2018, గురువారం

676 : స్పెషల్ ఆర్టికల్


      అమీర్ ఖాన్ – అమితాబ్ బచ్చన్ ల మల్టీ స్టారర్  ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ దీపావళికి విడుదలకి సిద్ధమవుతోంది. అమీర్ ఖాన్ కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో (210 కోట్లు) నిర్మిస్తున్న ఈ చారిత్రక మెగా పీరియడ్ మూవీ కోసం ఏడాది పాటు ఏకంగా రెండు షిప్పులు నిర్మించారు. షిప్పుల మీద జరిగే పోరాటం ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని సొంతంగా షిప్పులు నిర్మించుకున్నారు. ఈ భారీ షిప్పుల బరుపు సుమారు రెండు లక్షల కేజీలు. వెయ్యి మంది కార్మికులు, అంతర్జాతీయ డిజైనర్లు, షిప్ మేకర్లూ కలిసి, యూరప్ లోని మాల్టా సముద్ర తీరంలో వీటిని నిర్మించారు. 

        1839 లో ఫిలిప్ మీడోవ్స్ టేలర్ అనే రచయిత రాసిన ‘కన్ఫెషన్స్ ఆఫ్ ఏ థగ్’ అన్న నవల ఆధారంగా దీనిని నిర్మిస్తున్నారు. ఈ నవల19 వ శతాబ్దపు గొప్ప క్రైం నవలగా పాపులరైంది. విక్టోరియా రాణి కూడా దీన్ని చదివిందని చెప్పుకుంటారు. భారతదేశంలో బ్రిటిష్ వలస పాలనతో ఈ నవలలోని కథకి సంబంధముంది. చరిత్రకి కల్పనని జోడించి ఈ నవల రాశాడు టేలర్. కథ ప్రకారం, ఇందులో కల్పిత హీరో పాత్ర అమీర్ అలీ యాంటీ హీరోపాత్ర. 18 వ శతాబ్దం పూర్వార్ధం నుంచి, 1832 వరకూ దీని కథాకాలం. నేరము - శిక్ష అనే కాన్సెప్ట్ తో నడిచే ఈ కథలో, 600 సంవత్సరాల సుదీర్ఘ నేర చరిత్ర గల థగ్గులనే బందిపోట్ల తెగ పాల్పడిన దారుణ నేరాల గురించి వుంటుంది. దారి కాచి ప్రయాణీకులని నిర్దయగా హతమార్చి దోచుకోవడమే వీళ్ళ వృత్తి. ఉపఖండంలో ఆరు శతాబ్దాల పాటు రక్తాలు పారించిన ఈ హంతక తెగ, చివరికి బ్రిటిష్ పాలకులతో తలబడే ఘట్టంతో నవల ముగుస్తుంది. ఈ తెగలో ముస్లిములు ఎక్కువ, హిందువులు కొందరు. వీళ్ళందరూ కాళీమాత పుత్రులుగా నమ్ముతారు. ఆమె స్వేద బిందువుల్లోంచి ఉద్భవించామని విశ్వసిస్తారు. అయితే కాళీమాత పుత్రులుగా చెప్పుకున్నప్పటికీ, తమ అసలు మూలాలు  బ్రాహ్మణీయ పురాణాల్లో వున్నాయని భావిస్తారు. 

      ఈ నవలలో పాత్రలు వరుసగా, అమీర్ అలీ (అమీర్ ఖాన్ పాత్ర) : పఠాన్ గా పుట్టి అనాధగా మారే ఇతను థగ్గుల పెంపకంలో పెరిగి థగ్గుగా మారతాడు; ఇస్మాయిల్ (అమితాబ్ బచ్చన్ పాత్ర) : అమీర్ పెంపుడు తండ్రి, సీనియర్ థగ్గు; బద్రీనాథ్ : హిందూ థగ్గు, తెగలో పూజారి; పీర్ ఖాన్ : ముస్లిం థగ్గు, ఫకీరుగా మారతాడు; గణేశా : తెగలో వుండే ఇతను అమీర్ కి విరోధిగా మారతాడు; చీటూ : పిండారీ తెగకి చెందిన ఇతన్ని అమీర్ కిరాయి సైనికుడుగా చేర్చుకుంటాడు.

          సుప్రసిద్ధ యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో ఆదిత్యా చోప్రా నిర్మిస్తున్న ఈ ఎపిక్ యాక్షన్ లో ఇతర పాత్రల్లో కత్రినా కైఫ్, ‘దంగల్’ ఫేమ్ ఫాతిమా సనా షేక్, లాయెడ్ ఓవెన్, జాకీ ష్రాఫ్, రోణిత్ రాయ్ తదితరులు నటిస్తున్నారు. అమీర్, అమితాబ్ ఇద్దరు బిగ్ స్టార్స్ ఆకర్షణ వుంది కాబట్టి బడ్జెట్ గురించి భయపడ్డం లేదనీ ఆదిత్యా చోప్రా భరోసా.1500 వందల కోట్లు వసూలు చేయవచ్చని అంచనా. ఇందులో అమీర్ పారితోషికం ఎంతంటే, 2001 లో ‘లగాన్’ నుంచీ అమీర్ ఒక పాలసీని అనుసరిస్తున్నారు. వంద రెండు వందల కోట్ల బడ్జెట్లో తను ముందే పారితోషికం తీసుకుంటే, ఇతర నటీనటులకి, టెక్నీషియన్లకి, ప్రొడక్షన్ కీ అతి  తక్కువ మిగులుతుంది. నిర్మాత మళ్ళీ అప్పుతెచ్చే భారం పడకూడదు. అదే సమయంలో సినిమా ఫ్లాప్ అయితే, తను సేఫ్ అయిపోయి నిర్మాత సర్వం కోల్పోకూడదు. అందుకని స్క్రిప్టు ని నమ్మాక, రూపాయి అడ్వాన్సు గానీ, పారితోషికం గానీ తీసుకోకుండానే నటిస్తారు. సినిమా విడుదలయ్యాక, ప్రమోషన్ కి పెట్టిన బడ్జెట్ వసూలయ్యే దాకా, ఆతర్వాత పూర్తి వ్యయం వెనక్కి వచ్చి లాభాల లెక్కలు తేలేదాకా ఆగుతారు. అప్పుడు భారీ వాటా తీసుకుంటారు. నిర్మాతలు కూడా సంతోషంగానే ఇస్తారు. మళ్ళీ ఇంకో సినిమా కోసం వస్తారు. ఇదంతా అమీరే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. 

        ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ కి రచయిత, దర్శకుడు, ‘రేస్ -3’ ఫేమ్ విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహించారు. అజయ్ – అతుల్ సంగీతం, మనూష్ నందన్ కెమెరా. నలభై మంది దేశ విదేశ స్టంట్ డైరెక్టర్లు, కళాకారులూ పని చేశారు. అమీర్ ఖాన్ తన పాత్ర గురించి చెప్తూ, ఫాతిమా సనా షేక్ పాత్ర చుట్టూ ఇది తిరుగుతుందనీ, ఏ మాత్రం నీతి నియమాలుండవనీ, డబ్బుకోసం తల్లిని కూడా అమ్మేసే రకమనీ చెప్పుకొచ్చారు.

          ఇదిలావుంటే, కథల కోసం ఇక చరిత్రలోకి తొంగి చూస్తున్న బాలీవుడ్ నిర్మాతలు, దర్శకులు, తెలియకుండా ఒకే మడుగులో అడుగేస్తున్నారు. ఒకే రకమైన చారిత్రక పాత్రలతో సినిమాలు తీస్తున్నారు. ఒకే వరసలో విడుదల చేస్తున్నారు.ఇది వాళ్ళకే తలనొప్పిగా మారింది. తమలాంటిదే ఇంకొకరు తీస్తున్నారని ఎవరికీ తెలియడంలేదు. గతంలో కూడా ఇదే జరిగింది. భగత్ సింగ్ మీద తీసిన రెండు సినిమాలు ఒకే రోజు విడుదలయ్యాయి! 

      ‘లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్’  అని అజయ్ దేవగణ్  తో రాజ్ కుమార్ సంతోషి తీశారు.  బాబీ డియోల్ తో ‘23 మార్చి 1931 – షహీద్’ అని గుడ్డూ ధనోవా తీశారు. రెండూ 2002 జూన్  7 న విడుదలయ్యాయి! వారం గడిచిందో లేదో, సోనూ సూద్ తో  సుకుమార్ నాయర్ తీసిన ‘షహీదే  ఆజం’ విడుదలయ్యింది!

          గత సంవత్సరం కూడా, జైలు నుంచి తప్పించుకుని పారిపోయే ఒకే కథతో ‘లక్నో సెంట్రల్’, ‘ఖైదీ బంద్’ ఒకేసారి విడుదలయ్యాయి. అమీర్ ఖాన్ కూడా ఇదే అనుభవమైంది. ‘దంగల్’ లాంటిదే సల్మాన్ ఖాన్ నటించిన ‘సుల్తాన్’ చూసి షాకయ్యారు. అటు సల్మాన్ కూడా ‘దంగల్’ చూసి కంగు తిన్నారు.  

          ఇప్పుడు పీరియడ్ బందిపోట్ల వంతు వచ్చింది. అమీర్ ఖాన్ బందిపోట్ల రగడ ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ వుండగా, సైఫలీ ఖాన్ ‘హంటర్’ కూడా వస్తోంది. ఇందులో 1780 లో రాజస్థాన్ లో బందిపోటుగా మారిన నాగ సాధువు పగదీర్చుకునే రక్త చరిత్ర వుంటుంది. దీంతో పాటు రణబీర్ కపూర్ కూడా ‘షంషేరా’ అనే బందిపోటుగా ముస్తాబవుతున్నాడు. 1800 లలో చెలరేగిన ఒక డాకూ తెగ కథ!

         అయితే వీటి విడుదలలకి ఎక్కువ గ్యాప్ వుండడంతో తేలిగ్గా వూపిరి పీల్చుకుంటున్నారు. ఈ సంవత్సరం దీపావళికి అమీర్ బందిపోటు విడుదలైతే, వచ్చే సంవత్సరం సైఫలీ బందిపోటు విడుదలవుతుంది. ఆ పై సంవత్సరం రణబీర్ బందిపోటు!

          ఇలా  బందిపోటు సినిమాలు చాలవనట్టు ఇంకో తలనొప్పి కూడా మొదలయ్యింది. అక్షయ్ కుమార్ తో కరణ్ జోహార్ 1897 నాటి సరగర్హీ పోరాట గాథని ‘కేసరి’ టైటిల్ తో తీస్తూంటే, రాజ్ కుమార్ సంతోషీ కూడా రణదీప్ హూడాతో ‘బ్యాటిల్ ఆఫ్ సర్గర్హీ’ తీస్తున్నారు! ఐతే ఇదే చారిత్రక పోరాట గాథ తో గత ఫిబ్రవరి –మార్చిలో ’21 సర్ఫరోష్  - సరగర్హీ 1897’ అనే టీవీ సిరీస్ ప్రసారమై పోయింది!

సికిందర్
(తెలుగు రాజ్యం డాట్ కాం) 

675 : పరిచయం


   
       రాయల హరిశ్చంద్ర – పరిచయం అక్కర్లేని పేరు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు సినిమాల్లో ఆయన రూపం ప్రేక్షకులు చాలా సార్లు చూసే వుంటారు. ఎప్పుడో ‘ఒక్కడు’ తో ప్రారంభించి, అనేక సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేస్తూ వచ్చారు. అప్పుడు రాని గుర్తింపు ‘బాహుబలి’ తో అపూర్వంగా వచ్చింది. దీంతో ఆయన బిజీ క్యారక్టర్ ఆర్టిస్టు అయిపోయారు. ఇప్పుడాయన్ని గుర్తు పట్టని ప్రేక్షకుల్లేరు. ఇటీవలే రైతుల ఆత్మహత్యల కథతో తెలంగాణాలో తీసిన  ‘మిట్టీ’ అనే హిందీ సమాంతర సినిమాలో ముఖ్య పాత్ర ధరించారు. డాక్టర్ రాయల హరిశ్చంద్ర గురించి చెప్పాలంటే ఆయన నాటకం ప్రాణంగా ఎదిగిన కళాకారుడు. నాటకాల్లో నటన, దర్శకత్వం రెండూ నిర్వహిస్తూ తెలుగు నాటక రంగంలో ఏనాడో గుర్తింపు పొందారు. థియేటర్ ఆర్ట్స్ లో ఆయన యూనివర్సిటీలలో విజిటింగ్ ప్రొఫెసర్ గా కూడా వున్నారు. మేకప్ కళాకారుడిగా కూడా శిక్షణ ఇప్పిస్తూంటారు. ఆయనతో 2005 లో ఈ వ్యాసకర్తకి పరిచయం కలిగింది. మిత్రుడు ఘనశ్యాం సదాశివ్ ఇంటికి తీసుకు వచ్చి పరిచయం చేశాడు. ఆ పరిచయం గాఢమైన స్నేహంగా మారడమే గాక, ఈ వ్యాసకర్తని నాటక రచన వైపు దారి తీయించింది. అమెరికా పెళ్లి సంబంధాల మీద ‘హెన్ కౌంటర్’  అని  ఈ వ్యాసకర్త రాసిన నాటకాన్ని హరిశ్చంద్ర  ప్రధాన పాత్ర పోషిస్తూ దర్శకత్వం వహించారు. హైదరాబాద్  బీహెచ్ఈఎల్ లో 2010 జరిగిన ఆలిండియా నాటక పోటీల్లో ప్రదర్శించారు. దానికి అయిదు ఉత్తమ  బహుమతులు లభించాయి. ఆ తర్వాత ఇదే నాటకాన్ని 'రసరంజని' సారధ్యంలో   త్యాగరాయ గాన సభలో రెండు రోజులు ప్రదర్శించారు. దీనికంటే ముందు తెలుగు యూనివర్సిటీలో ఆయన సినిమా దర్శకత్వం కోర్సు చేస్తున్నప్పుడు, ఈ వ్యాసకర్త చేత ఒక షార్ట్ ఫిలిం రాయించి నిర్మించారు కోర్సులో భాగంగా. దీనికి రెండో బహుమతి పొందారు. ఓ మూడేళ్ళ క్రితం మరొక నాటకాన్ని ప్లాన్ చేశాం. ఆధునిక దాంపత్యాల మీద ఈ వ్యాసకర్త రాసిన ‘నడిసంద్రపు సిరి’ నాటకం కారణాంతరాల వల్ల ముందు కెళ్ళలేదు. ఈలోగా ఆయన సినిమాల్లో బిజీ అయిపోయారు. 

          వ్యాసకర్తకి డాక్టర్ హరిశ్చంద్రని పూర్తి నిడివి సహాయ పాత్రలో చూడాలని ఆశయం. ఈ ఆశయం ఘనశ్యాం దర్శకత్వంలో 2013 నెరవేరాల్సింది. ఘనశ్యాం నిరీక్షణలో వున్నాడు. ఓ రెండు నెలల క్రితం ఈ వ్యాసకర్త రాస్తున్న ఇంకో మూవీకి డాక్టర్ హరిశ్చంద్రని డాక్టర్ పాత్రలో ఫైనల్ చేశాం. ఈ మూవీ దర్శకుడు నిర్మాతతో గొడవపడి వెళ్ళిపోయాడు. అయినా హరిశ్చంద్రకి  ఇంకెక్కడో తప్పకుండా రాసి పెట్టి వుంది. పూర్తి నిడివి సహాయ పాత్రలో తప్పకుండా తెరపై కొస్తారు. ఒకటని కాదు, ఏ పాత్రనైనా అవలీలగా పోషించగల ఫౌండేషన్ ఆయనకుంది. విలన్ గా కూడా... ఈ సందర్భంగా బ్లాగు పాఠకులకి ఆయన్ని పరిచయం చేసే వీడియోని ఇక్కడ పొందు పర్చాం -  తప్పకుండా చూడగలరు.

సికిందర్

21, ఆగస్టు 2018, మంగళవారం

674 : స్ట్రక్చర్ అప్డేట్స్


  సినిమా కథ పాత్రని పట్టుకుని ప్రయాణిస్తే పాత్ర యాక్టివ్ గా వుంటుంది, ఆ యాక్టివ్ పాత్ర కథని ముందుకు నడుపుతుంది Let's say in a story heroine and hero has two opposite philosophies towards life. Heroine on a noble side and hero on a selfish  mode. Heroine’s goal is to change the hero. Secretly she plans some thing which transforms the hero by the end. Is this in line what you said as per active role that drives the story!
టాలీవుడ్ నుంచి ఒక లేఖ          కాకతాళీయంగా  ఇప్పుడు తెలుసుకోబోతున్న అంశమిదే. మొన్న ప్రచురించిన ‘రెండు ఒకే బాలీవుడ్ లు - రెండు ఒకే టాలీవుడ్ లు - కొత్త స్క్రీన్ ప్లే అయిడియాలు’ శీర్షిక రెండో భాగం ఇప్పుడు దీనికే కేటాయించాం. సినిమా కథ పాత్రని పట్టుకుని ప్రయాణిస్తే పాత్ర యాక్టివ్ గా వుంటుంది, యాక్టివ్ పాత్ర కథని ముందుకు నడుపుతుంది అనడం ప్రధాన పాత్ర గురించే. అయితే ప్రత్యర్ధి పాత్ర కూడా యాక్టివ్ గానే వుంటుంది, కాకపోతే కథ నడపదు. నడిపితే ప్రధాన పాత్ర పాసివ్ అయిపోతుంది. ఇక - హీరో హీరోయిన్లకి పరస్పర విరుద్ధ దృక్పథాలుండి, హీరోయిన్ దృక్పథం ఉన్నతంగా వున్నప్పుడు, హీరోని ఆ దిశగా నడిపిస్తే ఆమె యాక్టివ్ పాత్రవుతుందా, కథ నడుపుతుందా అని పై ప్రశ్న. ఆమె యాక్టివ్ పాత్ర అన్నది నిజం, కథ నడిపే పాత్ర అన్నది అబద్ధం. ఆమె ఇక్కడ ప్రత్యర్ధి పాత్ర. ప్రత్యర్ధి పాత్రెప్పుడూ కథ నడపదు. ప్రత్యర్ధి పాత్రగా ఆమె ప్రధాన పాత్రని ఇరికించి కూర్చుంటే, పీక్కునే పని ప్రధాన పాత్రగా హీరోదే. ప్రధాన పాత్ర అంటే ప్రత్యర్ధి పాత్ర సృష్టించిన సమస్యని ఎదుర్కొని పరిష్కరించేదే. అంతేగానీ సమస్యని సృష్టించేది కాదు. సమస్యని సృష్టించేది ప్రత్యర్ధి పాత్ర.  ‘శివ’ లో సమస్యని సృష్టించేది ప్రత్యర్ధి పాత్ర అయిన మాఫియా భవానీ, సమస్యని ఎదుర్కొని పరిష్కరించేది ప్రధాన పాత్రయిన శివ. ఏ కథలోనైనా ఇంతే. సమస్య ప్రత్యర్ధి పాత్ర చేతిలో వుంటే, పరిష్కారం ప్రధాన పాత్ర చేతిలో వుంటుంది. రెండూ యాక్టివ్ పాత్రలుగానే వుంటాయి. కానీ అక్కడ్నించీ కథ నడిపేది, అంతు తేల్చుకునేదీ ప్రధాన పాత్రే. ఇదొక గేమ్. దృశ్య మాధ్యమమయిన సినిమా కథ ఒక గేమ్. గేమ్ లేని దృశ్య మాధ్యమం కథ ఆత్మహత్యా సదృశ సోది. 

       ఇక్కడ హీరో దృక్పథానికి సవాలుగా హీరోయిన్ తన దృక్పథాన్ని ప్రతిపాదించింది. అందుకని ఈమె యాక్టివ్ ప్రత్యర్ధి పాత్ర (పాసివ్ ప్రత్యర్ధి పాత్రలుండవు). ఇప్పుడు వీళ్ళిద్దర్లో ఎవరు కరెక్టు? ఇది ఆర్గ్యుమెంటు. కథంటే ఆర్గ్యుమెంట్. ఇప్పుడు ఈ ఆర్గ్యుమెంట్ లో హీరో గెలవాలనుకోవడమో, ఓడిపోవాలనుకోవడమో అతను పెట్టుకునే గోల్. ఈ గోల్ తో హీరోయిన్ తో తన కెదురైన సమస్యతో సంఘర్షణ మొదలు పెడతాడు. ఆఖరికి అంతగా విలువలు లేని తన దృక్పథాన్ని మార్చుకుని ఆమె ఉన్నత దృక్పథానికి మారతాడా, లేదా అన్నది కథకి ముగింపు. 

          సమస్య ఎక్కడొస్తుందంటే, సమస్యని ప్రత్యర్ధి పాత్ర సృష్టించి, పరిష్కారం కూడా ప్రత్యర్ధి పాత్ర చేస్తేనే వస్తుంది. అది గేమ్ ఎలా అవుతుంది? దృశ్య మాధ్యమమైన సినిమా కథ గేమ్ కాకుండా ఎలాపోతుంది? ఈ గేమ్ మూలాలు సైకో థెరఫీలో కదా వుంటాయి? సినిమా కథ మూలాలు పామరులు కూడా కనెక్ట్  అయ్యే  సైకో థెరఫీలో కదా వుంటాయి? సినిమా కథంటే కాన్షస్ – సబ్ కాన్షస్ మైండ్ ల లడాయే కదా? నిత్యం మన సబ్ కాన్షస్ మైండ్ పెట్టే పరీక్షలనే కదా మన కాన్షస్ మైండ్ తో ఎదుర్కొంటాం? ఎదుర్కొని నేర్చుకుంటాం, నేర్చుకుని బాగుపడతాం? మన సబ్ కాన్షస్ పెట్టే పరీక్షల్ని సబ్ కాన్షస్సే  పరిష్కరించేస్తే, మన కాన్షస్ చేసే పనేమిటి, నేర్చుకునే దేమిటి? పైగా ఇది జరక్కుండా జరిగేదేమిటంటే, సబ్ కాన్షస్ పరిష్కారాల్ని కాన్షస్ అస్సలొప్పుకోదు. ఎందుకు ఒప్పుకోదంటే, అది ఇగో కేంద్రంగా పనిచేస్తుంది. ఆ ఇగో అస్సలొప్పుకోదు. పరీక్ష నువ్వే పెట్టి- పరిష్కారం కూడా నువ్వే చూపిస్తే, నేనేం దద్దమ్మనా? నేను ఇగోని! నేనే పరిష్కరించుకుంటా ఫో- అనేస్తుంది. అప్పుడేం చేస్తుంది? సబ్ కాన్షస్ (అంతరాత్మ) లోకి దూకి, అందులో వుండే పచ్చి నిజాలు, జీవిత సత్యాలు, నైతిక విలువలూ  మొదలైన వాటితో సంఘర్షించి, తప్పొప్పులు తెలుసుకుని, ఒడ్డున పడి పరిష్కరించుకుంటుంది. ఇగోని కాస్తా మెచ్యూర్డ్ ఇగోగా మార్చుకుంటుంది. 

          అంటే, పై విధివిధానాలతో ఇగోని మెచ్యూర్డ్ ఇగోగా మార్చేదే మంచి సినిమా కథన్న మాట. ఇగో మెచ్యూర్డ్ ఇగోగా మారకుండా, ఎలావున్న ఇగో అలాగే వుండిపోతే, జీవితాలకే కాదు, సినిమాలకీ చెడ్డ కథ. పురాణాల్లో జరిగేది ఈ సైకో థెరఫీలే. ఈ మూలాల్ని, బేసిక్స్ నీ  అర్ధం జేసుకోకుండా సినిమా కథల్ని రాయడమంటే కుక్క తోక పట్టుకుని గోదారి ఈదడమే.   

          ఇలా గోదారీది సినిమాల్ని తీస్తున్నారంటే, గుణాత్మకంగా అవి టికెట్టుకి సరిపడా విలువగల సినిమాలు కావు. బెజవాడకి టికెట్టు డబ్బులు వసూలు చేసి కోదాడలో దింపేసినట్టుంటాయి. అప్పుడు ప్రేక్షకులు కూడా ఫర్వాలేదు, కోదాడ దాకా లాక్కొచ్చాడు, 2.5 / 5 రేటింగ్ ఇవ్వొచ్చని అల్పసంతోషాన్ని ప్రకటించుకుంటున్నారు. ఇగోకీ, మెచ్యూర్డ్ ఇగోకీ మధ్య దూరం కోదాడ నుంచీ కంచికచర్ల మీదుగా బెజవాడ! 

          కథకుడు నీరోగారి ఫిడేలు మీటుతున్నంత  కాలం ఇగో సినిమాలే వస్తాయి.

***
      అందుకని పై వివరణ దృష్ట్యా, హీరోయిన్ తన దృక్పథం వైపు హీరోని నడిపించాలనుకుని, ఆ సమస్యని తనే పరిష్కరిస్తే అది కాన్షస్ – సబ్ కాన్షస్ ఫ్రేమ్ వర్క్ లోకి రాదు. ప్రత్యర్ధి పాత్రెప్పుడూ సబ్ కాన్షస్ మైండే. ఇది బాగా గుర్తు పెట్టుకోవాలి. ప్రధాన పాత్రెప్పుడూ కాన్షస్ ఇగోనే. ఇది కూడా గుర్తెట్టుకోవాలి. 

          అందుకని కథ ప్రారంభించి ముగించడం ప్రత్యర్ధి పాత్రయిన హీరోయినే చేసేస్తే, ఇక ప్రధాన పాత్రగా హీరో చేసేదేమిటి? నేర్చుకునేదేమిటి? ఆమె పెట్టిన పరీక్షని లెక్క చేయకుండా కూర్చున్నా, ఆ పరీక్ష పరిష్కారమైపోతుంది – ఎందుకంటే, ఆమే పరిష్కరిస్తుంది కాబట్టి. అలాంటప్పుడు హీరోతో ఆ కథంతా ఎందుకు? అప్పుడు హీరో యాక్టివ్ పాత్రెలా అవుతాడు, పాసివ్ పాత్రవుతాడు. అంటే గేమ్ లో వుండడు. ఫ్రేమ్ వర్క్ లోనూ వుండడు. మెచ్యూర్డ్ ఇగో సినిమా తయారు కాదు, ఇమ్మెచ్యూర్డ్ ఇగోని చూపించి ముగించేస్తుంది. 

          ఇదే జరిగింది ‘గీత గోవిందం’ లో, కొంచెం తేడాతో  ‘శ్రీనివాస కళ్యాణం’ లో. మొదటిది హీరో చేతిలో లేని సింగిల్ గోల్ కథయితే, రెండోది డబుల్ గోల్ కథ. వీటిలో మొదటిది దాని ప్లాట్ పాయింట్ వన్ ఎలా ఏర్పాటయిందో చూస్తే, బస్సులో నిద్రలో వున్న హీరోయిన్ తో సెల్ఫీ దిగబోతాడు హీరో. అప్పుడు తూలి ఆమె మీద పడ్డంతో అతడి పెదాలు వెళ్లి ఆమె పెదాలకి తగుల్తాయి. ఆమె గొడవ చేసి అన్నకి కాల్ చేస్తుంది. అతను భయపడిపోయి పారిపోతాడు. ఇలా సమస్యలో ఇరుక్కుంటాడు ప్రధాన పాత్రగా హీరో. ఇప్పుడు హీరో గోల్ ఏమిటి? ఈ సమస్యలోంచి బయట పడడమే. 

      సమస్యని ఇంకొంచెం పెంచి, హీరోయిన్ అన్నకి, హీరో చెల్లెలికీ పెళ్లి సంబంధం కుదిర్చారు. ఇక్కడ గోల్ తో మెచ్చదగ్గ క్రియేటివిటీ కనబడుతుంది. గోల్ తో మొనాటనీని ఛేదించడం గురించే కదా ఈ రెండు వ్యాసాల ఎజెండా. ఇక్కడ గోల్ తో మొనాటనీని ఛేదించడం కనిపిస్తుంది. ఎలాగంటే, బస్సు సీనుతో పారిపోయిన హీరోకి ఈ సీను ఆధారంగానే  గోల్ ఏర్పాటు చేసి కథనడపలేదు. నడిపివుంటే రొటీన్ మొనాటనీ అయ్యేది. దీంతో ఏముంటుంది, హీరోయిన్ అన్న బారి నుంచి హీరో తప్పించుకోవడం, ఎదుర్కోవడం, చివరికెలాగో అపార్ధం తొలగించడం...ఇదే కథయ్యి వుండేది. ఒకే సమస్య, దాంతోనే కథంతా, దానికే పరిష్కారమనే లీనియర్ ఫ్లాట్ గోల్ ట్రావెల్ వుండేది. దీనికి ప్రత్యాన్మాయాలు వెతుక్కోవాలనేగా ఈ ప్రయత్నం. 

          మరి గత వ్యాసంలో ‘గోల్డ్’ లో గోల్ తో ఒక క్రియేటివిటీని ఇలా చూశాం : హీరోకి గోల్ ఏర్పాటయిన వెంటనే రొటీన్ గా ఆ గోల్ తాలూకు ప్రత్యక్ష సంఘర్షణలో పడెయ్యలేదు హీరోని. సంఘర్షణని ఆలస్యం చేశారు. అంటే గోల్ నుంచి విడదీసేశారు. ఇది మెచ్చదగ్గ క్రియేటివిటీ. ఇన్నోవేట్ అయిన, అప్డేట్ చేసుకున్న గోల్ మేనేజ్ మెంట్.

          ఇదొక కొత్త పద్ధతయితే, ఇక్కడేం జరిగిందంటే, బస్సు సీనుతో ప్లాట్ పాయింట్ వన్ లో,  హీరోకి గోల్ ఏర్పాటయింది. ఇది మొనాటనీ బారిన పడకుండా ఇంకో సీను ఏర్పాటయింది. పారిపోయిన హీరో ఇంటికెళ్ళగానే అక్కడ తన చెల్లెలికీ హీరోయిన్ అన్నకీ పెళ్లి. దీంతో సమస్య తీవ్రత పెరగడమే గాక, గోల్ వ్యూహం మార్చుకోవాల్సిన అవసరమేర్పడింది హీరోకి. 

      ఇక్కడ హీరోయిన్ తనని ముద్దు పెట్టుకున్నది ఈ హీరోయేనని అన్నకి చెప్పేస్తే, హీరో ప్రాణాలు పోవడమే గాక, చెల్లెలి పెళ్లి చెడిపోతుంది. 

          ఇక్కడేం జరిగిందంటే, సాంప్రదాయంగా జరుగుతున్నట్టు, ప్లాట్ పాయింట్ వన్ ఒకే  సీనుతో, దాని గోల్ తో,  రొటీన్ గా అరిగిపోయిన ఏకోన్ముఖ మలుపుగా లేకుండా, ద్విముఖంగా డైమెన్షన్ పెంచుకుంది. అంటే, బస్సు సీను ఒకవైపు, పెళ్లి సీను ఇంకోవైపుగా రెండూ కలిసిన జంక్షన్ గా నిలబడింది. దీంతో కేవలం ఒక బస్సు సీనుతో రొటీన్ గా,  ఏకోన్ముఖంగా ఏర్పడ్డ హీరో గోల్, పెళ్లి సీనుని కలుపుకుని ద్విముఖంగా మారింది. అప్పుడు డైమెన్షనూ, దాంతో డైనమిక్సూ పెంచుకుంది. సాంప్రదాయంగా ప్లాట్ పాయింట్ వన్స్ ఒకే సీనుతో వుంటాయి, వుంటూ వస్తున్నాయి. అంటే, ఆ ఒక సీనులోనే వచ్చే మలుపుతో, అక్కడే గోల్ ఏర్పడుతూ రావడం ఆనవాయితీగా వుంది. దీన్ని ఇక్కడ బ్రేక్ చేశారు. 

          అంటే హీరో మీద రెండు సమస్యల్ని మోపు చేసే ట్రిక్ తో ద్విముఖ గోల్ అనే ఒక ఇన్నోవేషన్ జరిగిందన్న మాట. ఒక సమస్యలో ఇరుక్కున్న హీరోని ఇంకో సమస్యలో అక్కడే ఇరికించడం ద్వారా ఇది వీలైంది.
***
       మరి ఈ ద్విముఖ గోల్ నిర్వహణ ఎలావుంది? తన సంగతి హీరోయిన్ ఆమె అన్నకి చెప్పేస్తే తన ప్రాణాలకే ప్రమాదం, అదే సమయంలో ఆమె అన్నతో తన చెల్లెలి పెళ్లి సంబంధం చెడి పోతుంది. ఈ రెండూ జరక్కుండా చూడడం హీరో ద్విముఖ గోల్. ఇందుకేం చేయాలి? వ్యూహమేమిటి? యాక్షన్ కథల్లో కూడా కూడా హీరోకి వెంటనే వ్యూహం వుండదు. విలన్ తో ఢక్కా మొక్కీలు తింటూ పాసివ్ గానే వుంటాడు మొదట...ఆ ఒడుపు తెలిసేదాకా. ఒడుపు తెలిసిందో ఇక దాన్ని పట్టుకుని యాక్టివ్ గా విజృంభించి విలన్ అంతు చూస్తాడు. చూడాలంటే ప్లాట్ పాయింట్ వన్ దగ్గర సమస్యలో ఇరుకున్న పధ్ధతి బలంగా, సమగ్రంగా వుండాలి. లేకపోతే  దారీ తెన్నూ లేనివాడై పోతాడు. 

          ఉదాహరణకి ఇక్కడే చూద్దాం : బస్సు సీన్లో హీరోయిన్ చేతిలో హీరో ఇరుక్కున్నాడు. ఎలాటి ఇరుక్కోవడమది? సమగ్రమేనా? అక్కడికక్కడే ఆమెని తిప్పికొట్ట లేడా?  ఇంకా తను సెల్ఫీ క్లిక్ చేయనే లేదు. కాబట్టి ఆ ఫోటోఆధారం లేదు. తనకి కిస్ పెట్టడాన్న ఆమె ఆరోపణకి ఆమె మాటలు తప్ప ఆధారమే లేదు. ఆమెకి నిజంగా అతడి మీద చర్య తీసుకోవాలని వుంటే  అక్కడే బస్సాపించి అల్లరి చేయవచ్చు. అక్కడే అతణ్ణి పట్టించవచ్చు. సాధారణంగా ఏ అమ్మాయినా ఆత్మరక్షణతో ఇదే చేస్తుంది. ఇదేమీ చేయకుండా, ఎక్కడో అన్నకి కాల్ చేసి చెప్పిందంటే, ఈ లోగా హీరో పారిపోవడానికి అవకాశ మిచ్చిందంటే, ఇవన్నీ పాత్రలు వాటి నైజంతో చేస్తున్న పనులా? కథా సౌలభ్యం కోసం కథకుడు చౌచౌగా చేయిస్తున్న పనులా? పాత్రల్ని కథ నడిపుకోనిస్తున్నాడా, లేక వాటిని పాసివ్ గా చేసి తనే కథ నడుపుతున్నాడా?  కథకోసం సమస్యని ఏర్పాటు చేస్తున్నప్పుడు అందులో లోసుగులుండ కూడదు. కామన్ సెన్స్ కి దూరంగా వుండకూడదు. అప్పుడే ఆ పాత్రలూ ఆ కథా, దాని ముగింపూ అర్ధవంతంగా, బలంగా వుంటాయి. మొత్తం కథ ఆయురారోగ్యాలు ప్లాట్ పాయింట్ వన్ పటిష్టతతోనే వుంటాయి. 

          ఈ సమస్య హీరోకి ఓ సమస్యే కాదు. అయినా హీరోయిన్ కి భయపడుతూ, ఆ భయంలోంచి కథకుడు కోరుకున్న కామెడీ సృష్టిస్తూ, మంచి వాడుగా నిరూపించుకునే ప్రయత్నాలు చేస్తూ – ఒక గోల్ అంటూ లేకుండా పాసివ్ గానే వుండిపోతాడు. ఇక ఇతడి సమస్యని కూడా హీరోయినే పరిష్కరించి బయట పడేస్తుంది!  అంటే సమస్యని సృష్టించిన ప్రత్యర్ధి పాత్రే సమస్యని తీర్చేయడమన్న మాట! ప్రధాన పాత్రగా హీరో చేసిందేమీ లేదు, నేర్చుకుందేమీ లేదు, పరిష్కరించుకుందేమీ లేదు. ప్రత్యర్ధి పాత్రే సమస్యని తీర్చే ఈ అవకరం గురించి – కథా అన్యాయం గురించి పై పేరాల్లోనే శాస్త్రీయంగా చెప్పుకున్నాం. శాస్త్రీయత, సూత్ర బద్ధత అవసరం లేదనుకుంటే అది వేరే విషయం. గుణాత్మకం కాకుండా వ్యాపారాత్మకం కాగలవు సినిమాలు. అయితే అన్ని సార్లూ అందరు హీరోలతో సాధ్యంకాదు. నితిన్ తో కానిది విజయ్ దేవరకొండతో అయింది. కానీ విజయ్ దేవరకొండతో ఇలాగే మరోసారి వ్యాపారాత్మకం అవుతుందన్న గ్యారంటీ లేదు.  

      ఇక, ఇది మళ్ళీ మరొక మభ్య పెట్టే ప్రయత్నం. హీరోయినే సమస్య తీర్చడం. హీరో ఒక కవ్వించే అమ్మాయికి లొంగకుండా, ఆమెని దారిలో పెట్టాడని ఎవరో చెప్పగానే నమ్మేసి, హీరోయిన్ కి అపార్ధాలు తొలగిపోయి, హీరోకి ప్రేయసై పోతుంది!  తన అపార్ధం గురించి పగబట్టిన అన్నకి చెప్పేసి చల్లబర్చేస్తుంది. అంతే, ఆమె పుణ్యాన ప్రధాన పాత్ర హీరో హేపీ. 

          ఇక్కడ మభ్య పెట్టడం ఎలా జరుగుతుందంటే, హీరో ఆ అమ్మాయిని దారిలో పెట్టింది హీరోయిన్ తో పాడు పని చేసి బ్యాడ్ అన్పించుకోక మునుపు కాదు. చాలా తర్వాత. హీరోయిన్ పరిచయం కాక మునుపు ఒకమ్మాయిని దారిలో పెట్టాడంటే, పాపం నిజంగా అమాయకుడేనని హీరోయిన్ నమ్మవచ్చు. హీరోయిన్తో పాడు పని చేసిన చాలా తర్వాత ఆ అమ్మాయిని దారిలో పెట్టాడంటే, అది హీరౌయిన్ తెలుసుకునేలా చేసే నాటకమైనా అయివుండాలి, లేదా తను పరివర్తన చెందే ప్రయత్నం కొద్దీ అలా చేసి వుండాలి. పరివర్తన చెందాలను కోవడానికి తను చెడ్డ వాడేమీ కాదు, కథలో మొదట్నుంచీ మంచోడే. కాబట్టి, అది కావాలని హీరో ఆడిన నాటకమై వుంటుందని మనకి అన్పించేలా పొరపాటు కథనం చేశారు. అంతే కదా? యథా ప్లాట్ పాయింట్ వన్ – తథా ప్లాట్ పాయింట్ టూ. సౌజన్యం : ఆరు ఆస్కార్ అవార్డుల బిల్లీ వైల్డర్.

       ఇక హీరోయిన్ ప్రేమిస్తున్నాక హీరో యాక్టివ్ అన్పించుకుంటూ (హీరోయిన్ పుణ్యానే) ఆమెతో పెళ్లి దగ్గర బింకాలకి పోయి, ముందరి కాళ్ళకి బంధం వేసుకుని ఇంకోలా ఇరుక్కుంటాడు. చివరికి అతిధి పాత్రగా వచ్చే నిత్యామీనన్ సలహా పాటించి  కొత్త సమస్య పరిష్కరించుకుంటాడు. అలాటి సలహా ఇచ్చి ఆమె ఫెమినిజపు ట్రిక్కు ప్లే చేసి తిక్క కుదిర్చినట్టే అన్పిస్తుంది ఇది కూడా. వెరసి ఈ కథకి ఈమే ప్రధాన పాత్ర అన్పిస్తుంది!
***
          రొటీన్ ని బ్రేక్ చేసే ఈ ద్విముఖ గోల్ ఏర్పాటు కొత్తదే. ఒక ఇన్నోవేషన్. అయితే  దీని నిర్వహణ మళ్ళీ షరా మామూలు తెలుగు సినిమా లోపాలతో వుంది. అయినా ప్రేక్షకులు ఒప్పుకున్నారు, బాక్సాఫీసు నిండింది. దీనికి స్క్రీన్ ప్లే సంగతులు రాయాలనుకోలేదు. ప్రేక్షకులు ఒప్పుకున్నసినిమాలో లోపాలెన్నితే విమర్శలొస్తాయి. మనకెందుకని వదిలెయ్యాలి. కానీ ‘గోల్డ్ లో గోల్ తో ఒక ఇన్నోవేషన్, ‘సంజు’ లో ఇంకో ఇన్నోవేషన్ లాగే, ఇందులో మరింకో ఇన్నోవేషన్ కన్పిండం వల్ల, దీన్ని దృష్టికి తెచ్చే ఉద్దేశంతో రాయాల్సి వచ్చింది. రాయాల్సి వచ్చినప్పుడు గోల్ నిర్వహణలో సకల లోపాలూ దాని వెంటే రాయాల్సి వచ్చింది. 

     రోమాంటిక్ కామెడీల గొప్పతనం టాలీవుడ్ కి తెలియడం లేదు. హాలీవుడ్ రోమాంటిక్ కామెడీలు (వెన్ హేరీ మెట్ శాలీ, మై బెస్ట్ ఫ్రెండ్స్ వెడ్డింగ్, లవ్ యాక్చువల్లీ, బ్రిజెట్ జోన్స్ డైరీ మొదలైన వెన్నో) గొప్ప స్టడీ మెటీరియల్స్ అని అమెరికన్ యూనివర్సిటీల్లో భాగం చేశారు ప్రొఫెసర్లు. వీటిలో లవర్స్ మధ్య వుండే వ్యూహ ప్రతివ్యూహాలు, వాటి అమలు, ఫలితాల అధ్యయనం నిత్య వ్యవహారాల్లో, కార్పొరేట్ వ్యవహారాల్లో సైతం దిక్సూచిలా వుంటాయని తేల్చారు. మరోపక్క చెత్త కూడా ఉత్పత్తి అవుతోందని  టైం మ్యాగజైన్ రాసింది. ప్రేమల్ని తప్పుడుగా చూపించడం, ప్రేమల్లో ఎదురయ్యే సమస్యలకి ప్రేమికులు రెస్పాండ్ అయ్యే తీరూ, అపరిపక్వ పరిష్కారాలూ వగైరా అవే నిజమని యువత నమ్మేలా చేస్తున్నాయని తప్పు బట్టింది. దురదృష్ట వశాత్తూ టాలీవుడ్ ఈ రెండో వర్గంలో వుంది. కానీ తెలుగు ప్రేక్షకులు ఇంకా లోకల్ గా లేరు, వాడ వాడలా ఎప్పుడో గ్లోబలైజ్  అయ్యారు. మనోవికాసం కల్గించే కొత్త గాలికి ముక్కు మూసుకోరు. కథకులే ముక్కులు దులుపుకోవాలి. ఆఘ్రాణ శక్తిని పెంచుకోవాలి. ఆ గ్రంథులేమైనా మూసుకుపోతే సర్జరీలు చేయించుకోవాలి. ఫిడేలు, పెన్ను పక్కన పడేసి, పలకలు ఎత్తుకోవాలి.

సికిందర్