రాయల హరిశ్చంద్ర – పరిచయం అక్కర్లేని పేరు. క్యారెక్టర్
ఆర్టిస్టుగా తెలుగు సినిమాల్లో ఆయన రూపం ప్రేక్షకులు చాలా సార్లు చూసే వుంటారు.
ఎప్పుడో ‘ఒక్కడు’ తో ప్రారంభించి, అనేక సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేస్తూ
వచ్చారు. అప్పుడు రాని గుర్తింపు ‘బాహుబలి’ తో అపూర్వంగా వచ్చింది. దీంతో ఆయన బిజీ
క్యారక్టర్ ఆర్టిస్టు అయిపోయారు. ఇప్పుడాయన్ని గుర్తు పట్టని ప్రేక్షకుల్లేరు. ఇటీవలే
రైతుల ఆత్మహత్యల కథతో తెలంగాణాలో తీసిన ‘మిట్టీ’
అనే హిందీ సమాంతర సినిమాలో ముఖ్య పాత్ర ధరించారు. డాక్టర్ రాయల హరిశ్చంద్ర గురించి
చెప్పాలంటే ఆయన నాటకం ప్రాణంగా ఎదిగిన కళాకారుడు. నాటకాల్లో నటన, దర్శకత్వం రెండూ
నిర్వహిస్తూ తెలుగు నాటక రంగంలో ఏనాడో గుర్తింపు పొందారు. థియేటర్ ఆర్ట్స్ లో ఆయన
యూనివర్సిటీలలో విజిటింగ్ ప్రొఫెసర్ గా కూడా వున్నారు. మేకప్ కళాకారుడిగా కూడా
శిక్షణ ఇప్పిస్తూంటారు. ఆయనతో 2005 లో ఈ వ్యాసకర్తకి పరిచయం కలిగింది. మిత్రుడు
ఘనశ్యాం సదాశివ్ ఇంటికి తీసుకు వచ్చి పరిచయం చేశాడు. ఆ పరిచయం గాఢమైన స్నేహంగా
మారడమే గాక, ఈ వ్యాసకర్తని నాటక రచన వైపు దారి తీయించింది. అమెరికా పెళ్లి సంబంధాల
మీద ‘హెన్ కౌంటర్’ అని ఈ వ్యాసకర్త రాసిన నాటకాన్ని హరిశ్చంద్ర ప్రధాన పాత్ర పోషిస్తూ దర్శకత్వం వహించారు. హైదరాబాద్
బీహెచ్ఈఎల్ లో 2010 జరిగిన ఆలిండియా నాటక
పోటీల్లో ప్రదర్శించారు. దానికి అయిదు ఉత్తమ బహుమతులు లభించాయి. ఆ తర్వాత ఇదే
నాటకాన్ని 'రసరంజని' సారధ్యంలో త్యాగరాయ గాన
సభలో రెండు రోజులు ప్రదర్శించారు. దీనికంటే ముందు తెలుగు యూనివర్సిటీలో ఆయన సినిమా
దర్శకత్వం కోర్సు చేస్తున్నప్పుడు, ఈ వ్యాసకర్త చేత ఒక షార్ట్ ఫిలిం రాయించి నిర్మించారు
కోర్సులో భాగంగా. దీనికి రెండో బహుమతి పొందారు. ఓ మూడేళ్ళ క్రితం మరొక నాటకాన్ని
ప్లాన్ చేశాం. ఆధునిక దాంపత్యాల మీద ఈ వ్యాసకర్త రాసిన ‘నడిసంద్రపు సిరి’ నాటకం కారణాంతరాల
వల్ల ముందు కెళ్ళలేదు. ఈలోగా ఆయన సినిమాల్లో బిజీ అయిపోయారు.
ఈ వ్యాసకర్తకి డాక్టర్
హరిశ్చంద్రని పూర్తి నిడివి సహాయ పాత్రలో చూడాలని ఆశయం. ఈ ఆశయం ఘనశ్యాం
దర్శకత్వంలో 2013 నెరవేరాల్సింది. ఘనశ్యాం నిరీక్షణలో వున్నాడు. ఓ రెండు నెలల
క్రితం ఈ వ్యాసకర్త రాస్తున్న ఇంకో మూవీకి డాక్టర్ హరిశ్చంద్రని డాక్టర్ పాత్రలో
ఫైనల్ చేశాం. ఈ మూవీ దర్శకుడు నిర్మాతతో గొడవపడి వెళ్ళిపోయాడు. అయినా హరిశ్చంద్రకి ఇంకెక్కడో తప్పకుండా రాసి పెట్టి వుంది. పూర్తి నిడివి సహాయ పాత్రలో తప్పకుండా
తెరపై కొస్తారు. ఒకటని కాదు, ఏ పాత్రనైనా అవలీలగా పోషించగల ఫౌండేషన్ ఆయనకుంది.
విలన్ గా కూడా... ఈ సందర్భంగా బ్లాగు పాఠకులకి ఆయన్ని పరిచయం చేసే వీడియోని ఇక్కడ
పొందు పర్చాం - తప్పకుండా చూడగలరు.
―సికిందర్