రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

31, జులై 2022, ఆదివారం

1186 : స్క్రీన్ ప్లే సంగతులు!

 

    నాగ చైతన్య థాంక్యూ లో కథ కాక, కమర్షియల్ సినిమాని ఫ్లాప్ చేసే గాథ దాగి వుందన్న విషయం తెలుసుకుని ముందుకు సాగుదాం. గాథల గాయాలతో  విరాటపర్వం సహా రాధేశ్యామ్, బ్రహ్మోత్సవం, కబాలీ, ఓకే బంగారం, డియర్ కామ్రేడ్, జార్జిరెడ్డి, అంతరిక్షం, పైసా, మొగుడు, చక్కిలిగింత, కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ, జక్కన్నతోబాటు,  ఇంకెన్నో ఫ్లాపుల పక్కన థాంక్యూ కూడా చేరిందిప్పుడు. దీన్నిబట్టి ఇంకా కథంటే ఏమిటో తెలియకుండా సినిమాలు తీస్తున్నారనుకోవచ్చు. లేదా ఒకరు మనకి చెప్పేదేంటిలే అనుకుని గాథలు తీస్తూండొచ్చు. కథంటే ఏమిటో తెలియకపోతే గాథంటే ఏమిటో కూడా తెలియదు. తీస్తున్నది కథ అనుకుంటూ తీస్తే అది సినిమాకి పనికి రాని గాథలా తేలిందన్న సంగతి, అందుకే ఫ్లాపయిందన్న సంగతీ గ్రహింపుకు రాదు. ఫ్లాప్ కి ఇంకేవో కారణాలు చెప్పుకుంటారు. చెప్పుకుని మళ్ళీ గాథే  తీసుకుని ఫ్లాప్ చేసుకుంటారు. బివిఎస్ రవి థాంక్యూ గాథని కథ అనుకుని రాసిస్తే, విక్రమ్ కుమార్ అది కథే అనుకుని తెరకెక్కించడం, దిల్ రాజు కూడా అది కథే అనుకుని నిర్మించడం విధివశాత్తూ జరిగి పోయిందేమో. ఇలా ఇంకా ఎవరెవరి దగ్గర కథ లనుకుంటూ ఇంకెన్ని గాథలున్నాయో, ఎన్ని శరవేగంగా నిర్మాణాలు జరుపుకుంటున్నాయో తలుచుకుంటే టీ తాగలేం.

        థాంక్యూ గాథ బిగినింగ్ విభాగంలో విషయమిలా వుంది : న్యూయార్క్ లో వుంటున్న ప్రియా (రాశీ ఖన్నా) తాను గర్భవతని తెలుసుకుని, బాయ్ ఫ్రెండ్ అభిరామ్‌ (నాగచైతన్య) తో సమస్య గురించి ఆంటీ శైలజ (ఈశ్వరీ రావ్) కి ఫ్లాష్ బ్యాక్ చెప్తుంది.  

        ఫ్లాష్ బ్యాక్ లో -2011లో న్యూయార్క్ లో రావుగారు (ప్రకాష్ రాజ్) నిర్వహించే కన్సల్టెన్సీ ద్వారా అభి
, ఒక హెల్త్ యాప్ డెవలప్ చేసే కలతో వూర్నుంచి వచ్చి ఉద్యోగంలో చేరతాడు. అయితే రావుగారు ఈ యాప్ పక్కన బెట్టి ముందు ఉద్యోగం చేసుకోమంటాడు. ఇక్కడే  ప్రియ పరిచయమవుతుంది. అభి పట్టుదలగా కొంతమంది పెట్టుబడిదారులని ఒప్పిస్తాడు. రావుగారు మాత్రం నిధులు ఇవ్వడు. ఆ డబ్బు ప్రియయే సర్దుతుంది. దాంతో ఇద్దరి మధ్య ప్రేమ- ప్రేమాయణం- సహజీవనం సాగుతాయి. ఓ పదేళ్ళలో యాప్ తో అభి ప్రారంభించిన కంపెనీ, ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీల్లో ఒకటిగా మారడంతో బిలియనీర్‌ అవతార మెత్తుతాడు.

        అయితే ఈ విజయంతో అభి స్వార్ధపరుడిగా మారతాడు. తన విజయానికి తానే తప్ప ఎవ్వరూ కారణం కాదన్న అహంకారం పెంచుకుంటాడు. ఎవరి పట్లా కృతజ్ఞతతో వుండడు. దీంతో ప్రియ సహా ఉద్యోగులతో కూడా సంబంధాలు చెడిపోతాయి. ఇలావుండగా పెళ్ళి చేసుకుందామంటాడు ప్రియతో. అతడి ప్రవర్తన నచ్చక సమాధానం చెప్పలేక
పోతుంది. ఇంతలో గర్భవతవుతుంది. దీంతో ఫ్లాష్ బ్యాక్ ముగుస్తుంది.

        ఇప్పుడు ప్రస్తుతానికొస్తే
, పిల్లలు పుడితే అభి మారతాడని డాక్టర్ ఆంటీ కౌన్సెలింగ్ చేయడంతో, అభికి ఇంకో అవకాశం ఇచ్చి చూద్దామని కంపెనీ కొస్తుంది ప్రియ. ఎలాగైనా పాత అభిరామ్ ని తీసుకు రావాలనుకుంటుంది. అటు రావుగారికి తన కన్సల్టెన్సీ ద్వారా వచ్చిన 60 మందికి ఉద్యోగాలు ఇప్పించాల్సిన వొత్తిడి వుంటుంది. ఈ 60 మంది గొడవపెట్టుకుని వార్నింగ్ ఇస్తారు. దీంతో ఈ అరవై మందిని అభి కంపెనీలో చేర్చుకోమని అడిగితే తిరస్కరిస్తాడు అభి. దీంతో ఇతను ఇక మారడని ప్రియ గుడ్ బై చెప్పేస్తుంది. రావుగారు గుండెపోటుతో చనిపోతాడు.

        అసలు  రావుగారు ఆమోదిస్తేనే అభి యాప్ ని ప్రారంభించ గలిగాడని ఒక పెట్టుబడిదారు చెప్పడంతో
, అభిలో సంఘర్షణ మొదలవుతుంది. అపరాధ భావంతో కుంగిపోతాడు. అప్పుడు అతడి మనస్సాక్షి ప్రశ్నిస్తుంది. నీ అహంకారమే నీకు శత్రువని చెప్తుంది. ఇక నీ విజయనికి కారకులైన వాళ్ళందరికీ
కృతజ్ఞతలు చెప్పుకోవాలని ఆదేశిస్తుంది. దీంతో అభికి నారాయణపురంలో వున్న పార్వతి గుర్తొస్తుంది...దీంతో ఈ స్క్రీన్ ప్లేలో బిగినింగ్ విభాగం పూర్తవుతుంది.

శ్రద్ధ పెట్టని కథనం

       
        సీను దేని గురించైతే వుందో దాని గురించే ఆ సీనైతే తప్పులో కాలేసినట్టే - అంటాడు రాబర్ట్ మెక్ కీ. పై 30 నిమిషాల బిగినింగ్ లో సీన్లు హడావిడి హడావిడిగా, ఏదీ సరీగ్గా ఎస్టాబ్లిష్ అవకుండా; పాత్రల్ని, విషయాల్నీ మనం ఫీలై ఫాలో అవడానికి ఆస్కారం లేకుండా, నిస్సారంగా వెళ్ళిపోతాయి. 30 కోట్ల రిచ్ సినిమాని ఇంత పూర్ గా తీయడమా అన్పిస్తాయి. ఈ స్క్రీన్ ప్లేలో ఒక్కో పేజీ విలువ ఎన్ని లక్షలుండొచ్చు? ఉజ్జాయింపుగా రెండున్నర లక్షలను కోవచ్చా? రెండున్నర లక్షల క్వాలిటీ ఏముంది ఒక్కో పేజీలో అన్పించక మానదు.

        ప్రియా విఫల ప్రేమ చుట్టూ సాగే ఈ సీన్లలో పాత్రల మాటల్లో ఉపవచనం (సబ్  టెక్స్ట్- అంటే మాటల్లో అంతర్లీన భావం) అంటూ ఏమీ వుండదు. బి గ్రేడ్ సినిమాల్లో లాగా డైరెక్టుగా మాట్లాడేసుకుంటారు. డైరెక్టుగా ఐలవ్యూ అనడానికీ, నీ షర్టు చాలా బావుందని అనడానికీ చాలా తేడా వుంది. ఐలవ్యూ అనడం ఏ ఫీలూ నివ్వని ఫ్లాట్ రైటింగ్. నీ షర్టు  బావుందనడం అతడి షర్టు మీదికి దృష్టిని మళ్లించే, షర్టుని ప్రత్యేకాకర్షణ చేసే మనోహరమైన విజువల్ రైటింగ్. దృశ్య మాధ్యమమైన సినిమాకి కావాల్సింది మాటల్లో దృశ్యాన్నిపలికించే - మాటల్ని దృశ్యాత్మకం చేసే సచేతన విజువల్ రైటింగే. హీరోయిన్ ఫ్లాట్ గా ఐలవ్యూ అని చెప్పేసే సీన్లో హీరో లక్ష రూపాయల కాస్ట్యూమ్స్ వేసుకుని వుంటే సీనులో వుండే డ్రామాకేమీ ఉపయోగం లేదు. హీరోయిన్ నీ షర్టు చాలా బావుందనేసరికి, హీరో ఆటోమేటిగ్గా ఉబ్బితబ్బివడం, సీను చైతన్యం నింపుకుని రక్తి కట్టడమూ ప్రేక్షకుల్ని సంతోష పెడతాయి.


       
ఆమె షర్టు బావుందని అంటే ఆమె మాటల్లోని అంతర్లీన భావం (సబ్ టెక్స్ట్) అర్ధమైపోతుంది- ప్రేమని వ్యక్తం చేస్తోందని. అసలు నిజమైన ప్రేమకి మాటలెందు కుంటాయ్ - చేతలుంటాయి. మనుషులు మనసులో వున్నది ఒక పట్టాన ఉన్నదున్నట్టు పైకి చెప్పరు. ఇంకోటేదో అడ్డం పెట్టుకుని చెప్తారు.

       
అందుకే మనుషులే అయిన ఆర్టిస్టులు డైరెక్టు డైలాగులు నటించడానికి ఇబ్బంది పడతారు. ఇచ్చిన సీను ఉద్దేశ్యమేమిటో తెలీక, ఏ భావోద్వేగాలు పలికించాలో అర్ధం గాక. ఐ లవ్యూ అన్న డైలాగుకి భావోద్వేగం పలికించలేరు. నీ షర్టు చాలా బావుందంటే, దీనర్ధం ప్రేమని వెల్లడించడమని తెలుసుకుని ఆ ప్రేమోద్వేగాన్ని మొహం నిండా పలికించేసి సబ్ టెక్స్ట్ ని అందించేస్తారు.

       
ఈ సినిమాలోనే ఈ బిగినింగ్ విభాగం తర్వాత వచ్చే నారాయణపురం ఎపిసోడ్లో -నన్ను ప్రేమిస్తున్నావా?’ అంటాడు కిటికీ కావల వున్న అభిరామ్. నిన్ను ప్రేమిస్తున్నాను అంటుంది కిటికీ కీవల వున్న పార్వతి. ఇలా కాకుండా కిటికీలోంచి వచ్చేస్తావా?’ అని అతనంటే, నీతో ఎక్కడికైనా వచ్చేస్తా అని ఆమె అనడం ఎంత బావుంటుంది.       

        ఎందుకని
? ఎందుకంటే ఏ సీను అయినా రెండే ఉద్దేశాలతో వుంటుంది : అయితే పాత్రల గురించి ఇంకేదో కొత్త విషయం వెల్లడించడానికి, లేదా కథని ముందుకు 
తీసికెళ్ళడానికి. పార్వతీ అభిరామ్ లు ఆల్రెడీ ప్రేమలో వున్నారని ప్రేక్షకులకి తెలుసు. ఇంకా నన్ను ప్రేమిస్తున్నావా అని నాగ చైతన్య లాంటి స్టార్ చేత చీప్ డైలాగు పలికించడం దేనికి?

        ఈ సీను తర్వాత వాళ్ళిద్దరూ లేచిపో బోతున్నారు. అందుకని, కిటికీలోంచి వచ్చేస్తావా?’ అని అతనంటే, నీతో ఎక్కడికైనా వచ్చేస్తా అని ఆమె అనడం కథని ముందుకు తీసికెళ్ళే ఆపరేటింగ్ డైలాగులవుతాయి. దీంతో సస్పెన్సూ థ్రిల్లూ క్రియేటై సజీవ మవుతుంది సీను. ఆమె నీతో ఎక్కడికైనా వచ్చేస్తా అనడం వాళ్ళ ప్రేమెంత బలమైనదో కూడా వ్యక్తమై రంజింపజేయడం అదనపు హంగు. ఈ సీన్లో సాహసం (అద్భుత రసం) తో కూడిన యూత్ అప్పీల్ లేకపోతే ఎలా? యూత్ అప్పీల్ కొద్దీ బాక్సాఫీసు అప్పీల్ కదా?

ఫ్లాష్ - బాకు
?

       
        సరే
, విషయానికొద్దాం. విషయమేమిటంటే, ప్రియ తను గర్భవతని తెలుసుకుని ఆంటీకి చెప్పే తన ఫ్లాష్ బ్యాక్ 15 నిమిషాలుంటుంది. ఈ ఫ్లాష్ బ్యాకు నెలా ప్రారంభిస్తుంది ప్రియా? ఇదంతా మొదలై చాలా ఏళ్ళయ్యింది అంటూ ప్రారంభిస్తుంది. దీంతో ఎత్తుగడే (ఫ్లాష్ బ్యాక్ కి లీడ్) చెడిపోయింది.

        ఇదంతా మొదలై చాలా ఏళ్ళయ్యిందని
, అభి తో మొదట్నుంచీ తన వ్యవహారం తెలిసిన ఆంటీకే ఎలా చెప్తుంది? అంటే ప్రేక్షకులకి తెలియాలని ఆంటీకి చెప్తున్నట్టు లేదూ అసహజంగా? నీ ఫ్లాష్ బ్యాక్ అంతా నాకు తెలుసమ్మా, నన్నడ్డం పెట్టుకుని ప్రేక్షకులకి చెప్పే ప్రయత్నం చేయకు. బోరు కొట్టించకుండా ఇప్పుడెందు కొచ్చావో అసలు విషయం చెప్పు అని ఆంటీ అనదా? ఆంటీకి చెప్తే గిప్తే ఇప్పుడు ప్రెగ్నెన్సీ గురించే కొత్త విషయం చెప్పాలి కదా? దీనికామె సలహా తీసుకుని వెళ్ళి పోతూ, బాధాకర గతాన్ని నెమరేసుకుంటూ, ప్రేక్షకులకి ఫ్లాష్ బ్యాక్ వేసుకో వచ్చు కదా?

        ఇక ఈ ఫ్లాష్ బ్యాక్ లో 
2011 లో హెల్త్ యాప్ డెవలప్ చేసే కలతో అభి న్యూయార్క్ వచ్చి
, రావుగారి కన్సల్టెన్సీ ద్వారా ఉద్యోగంలో చేరడం, అక్కడే ప్రియ పరిచయమవడం, కాలక్రమంలో యాప్ కోసం అభి పెట్టుబడిదారులని ఒప్పించడం, రావుగారు పెట్టుబడి పెట్టడానికి తిరస్కరించడమూ జరిగి, సమస్యలో వున్న అభికి ఆ డబ్బు ప్రియా తనే సర్దుతాననే సీను వస్తుంది...

            ఆ డబ్బు ఆమె సర్దగానే మొరటుగా మీద పడి (ఇప్పటికింకా గర్ల్ ఫ్రెండ్ కూడా కాదు) గాఠ్ఠిగా కౌగిలించేసుకుంటాడు! ఆమె - పో ఛీ- అని దులిపేసుకోకుండా, వెంటనే లవ్, లవ్ సాంగ్, సహజీవనం కూడా. ఇలా వున్నాయి పాత్రలు! సినిమాని సినిమాలాగా చూపించాలి గానీ, సినిమా పేరుతో జూ చూపించకూడదు గా? చింపాంజీల్ని చూడాలనుకుంటే జూ కెళ్తారు ప్రేక్షకులు. ఎలా 
 వుందంటే, డబ్బు సర్దితే అభి నా వల్లో పడ్డాడోచ్ అని ఎంజాయ్ చేస్తున్నట్టుంది ప్రియ!

             ఈ సీక్వెన్స్ క్లయిమాక్సేంటి? అతడి విశ్వాస రాహిత్యాన్ని ఆమె చవి చూసి దెబ్బతినడమేగా. ఆమె డబ్బు సర్దుతానన్నప్పుడు ఈ డైలాగు కూడా తప్పే. ఇలా డైరెక్టుగా అనేసి సీను సౌందర్యాన్ని దెబ్బతీయడం అలా వుంచి. ఈ సీన్లో డబ్బు సర్దుతానంది, తర్వాతి సీన్లో డబ్బు సర్దేసింది. ఇవి సీన్లు ఎలా అవుతాయి? ముందు సీన్లో నిన్ను సర్ప్రైజ్ చేస్తా అని, తర్వాతి సీన్లో  డబ్బు ఇస్తే థ్రిల్, యూత్ అప్పీల్ వుంటాయి గాని. ఇలా సీన్లలో ఎక్కడా డైనమిక్సే కనపడవు. సీన్లంటే ఒక సీన్లో ప్రశ్న, తర్వాతి సీన్లో జవాబనే డైనమిక్ కథనమే లేదు. డబ్బు సర్దుతానని జవాబు చెప్పి, తర్వాతి సీన్లో డబ్బు సర్ది జవాబే చెప్పింది. ఇది పునరుక్తి కూడా కాక ఏమిటి?

        ఈ సీక్వెన్స్ క్లయిమాక్సు ఆమె అతడి విశ్వాస రాహిత్యాన్ని చవి చూసి దెబ్బతినడ మైనప్పుడు - అతడితో ఆమె ఎలాటి సంబంధంలోకి అడుగు పెడుతోందో మొదట హింట్ ఇవ్వక పోతే, ఈ సీన్లు ఎందుకు ఆసక్తి పెంచుకుని మనం చూడాలి? అండర్ కరెంట్ అపాయం ఈ సీన్లలో తొంగి చూడకపోతే, మనమెందుకు ఈ క్యారక్టర్స్ ని కేర్ చెయ్యాలి?  

ఇది పోయెటిక్ అలజడి   

        2002 లో అడ్రెయిన్ లైన్ దర్శకత్వంలో రిచర్డ్ గేర్ , డయాన్ లేన్, ఒలివియర్ మార్టినెజ్ లు నటించిన అన్ ఫెయిత్ ఫుల్ వచ్చింది. ఇందులో టైటిల్స్ లోనే విశ్వాస రాహిత్యం థీమ్ ని సింబల్స్ తో చూపించి హింట్ ఇచ్చేస్తాడు దర్శకుడు. దీంతో టైటిల్స్ దగ్గర్నుంచే అతుక్కుపోతాం (అప్పట్లో థియేటర్లో చూసి రివ్యూ రాశాం)రెండు ఆస్కార్ల రచయిత ఆల్విన్ సార్జెంట్ ఈ స్క్రీన్ ప్లే రాశాడు. టైటిల్స్ లో టేబుల్- టేబుల్ పైన హేట్, కింద పడుకుని పెంపుడు కుక్క; సరస్సు - సరస్సు ఒడ్డున ఇల్లు; ఇల్లు డివైడ్ అయినట్టు దాని ప్రతిబింబం తలకిందులుగా సరస్సులో; సరస్సులో తేలుతూ ఖాళీ పడవ; తిరుగుతూ గాలిమర, గాలికి పడిపోతూ సైకిలు... చాలా పోయెటిక్ అలజడి మన గుండెల్లో జరగబోయే దాని గురించి.


టైటిల్స్ అయ్యాక కొడుకుని స్కూలుకి, భర్త రిచర్డ్ గేర్ ని ఆఫీసుకీ పంపించేసి సరుకులు తెచ్చుకోవడానికి బయల్దేరుతుంది డయాన్. సరుకులు కొనుక్కున్నాక పెద్ద గాలి దుమారం రేగుతుంది. ఆ గాలి దుమారంలో కొట్టుకు పోయి ఇట్నుంచి తనూ - అట్నుంచి పుస్తకాల షాపు అతనూ (ఒలివియర్ మార్టినెజ్) డాష్ ఇచ్చుకుని పడిపోతారు. ఇక మొదలవుతుంది ఈ బై ఛాన్స్ ఎన్ కౌంటర్ తో, ఇద్దరి మధ్య ప్రేమ చిగురించడం...   
       
        టైటిల్స్ పూర్తయ్యాక, ఇంటి దగ్గర మొదలై, రోడ్డు మీద గాలి దుమారంతో ఇద్దరూ కనెక్ట్ అయ్యే వరకూ, రెండే సీన్లు ఐదు నిమిషాల్లో పూర్తయిపోతాయి. టైటిల్స్ లో సింబల్స్ తో మొదలు పెట్టి ఈ రెండు సీన్లలో అల్లిన విషయం, ఎంతో సినిమా చూసినట్టు  పరిపూర్ణంగా బిగినింగ్ ని సెటప్ చేసేస్తుంది. టైటిల్స్ లో ఇచ్చిన హింట్స్ ని పేఆఫ్ చేసేస్తుంది- భర్తతో డయాన్ విశ్వాస రాహిత్యానికి అంకురార్పణ చేస్తూ. మనం చాలా దేశ విదేశ సినిమాలు చూస్తూంటాం. సినిమాల్ని చదవం. అందుకే రైటింగ్ నేర్చుకోలేం. సినిమాల్ని చదవడం చేస్తే రైటింగ్ కూడా బాగానే చేయొచ్చు. సినిమాల్ని చదవడమంటే రివ్యూలు చదవడం కాదు!

చైతూకే రాశీ అన్యాయం
అభి ప్రియకి అన్యాయం చేశాడని కదా ఈ గాథ? ఇది నమ్మేలా వుండదు ప్రియా వేసుకునే ఫ్లాష్ బ్యాక్ తో. ఫ్లాష్ బ్యాక్ చూస్తే ఆమె అభిని చెత్త చెత్తగా వూహించుకుని, విశ్వాస ఘాతకుడని పేరిచ్చి వెళ్ళిపోయి నట్టుంటుంది. అలా వుంది అభి పాత్ర చిత్రణ. దీంతో ప్రియా అంటే సానుభూతి మొత్తం పోతుంది. చైతూకే అన్యాయం చేస్తున్నానని తెలుసుకోకుండా పాత్ర నటించింది రాశీ. ఆమె దర్శకుడ్ని ప్రశ్నించ వచ్చు. ప్రశ్నించ లేదు.

        అభి యాప్ ప్రారంభించిన పదేళ్ళలో బిలియనీర్‌ అవతార మెత్తుతాడు. ఎత్తగానే విజయ గర్వంతో స్వార్ధపరుడిగా మారతాడు. తన విజయానికి తానొక్కడే కారకుడనీ ఇగో పెంచుకుంటాడు. ఉద్యోగుల్నీ
, ప్రియనీ ఈసడించుకుంటాడు. ఇలా  ప్రియా ఫ్లాష్ బ్యాక్ లో అభిని ప్రొజెక్ట్ చేస్తుంది. పైపైన చెప్పడమే తప్ప అతనిలా మారడానికి మూల కారణం వుండదు.

        కార్పొరేట్ ప్రపంచం క్రూరంగానే వుంటుంది పోటాపోటీలతో. కార్పొరేట్ అధిపతులు కార్పొరేట్ సైకోపాత్ లుగా కూడా మారతారు కొందరు. మన దేశంలో కూడా కొందరు స్టార్ట్ అప్ సీఈఓలు కార్పొరేట్ సైకోపాత్ లుగా మారిన విషయం తెలిసిందే. కార్పొరేట్ సైకాలజీ అని శాస్త్రమే వుంది. సైకియాట్రిస్టులూ వున్నారు. కార్పొరేట్లది అస్తిత్వ పోరాటమే. ఎదుటి కంపెనీ పోటీ లేకుండా ఏమైనా చేస్తారు. అవసరమైతే తమ కంపెనీనే మూసేస్తారు.         

        అమెజాన్ బాస్ మొదట సీడీలు హోమ్ డెలివరీ ఇచ్చేవాడు. టాప్ లో వున్న తన బిజినెస్ తో ఇన్ స్పయిరై కొందరు పోటీకి రాబోతున్నారని,  సీడీ హోమ్ డెలివరీనే మూసేశాడు అమెజాన్ బాస్. దీంతో ఈ బిజినెస్ నష్టాదాయకమని భావించుకుని ఎవరూ ప్రారంభించలేదు. తర్వాత నెమ్మదిగా, కొత్తగా ఆన్ లైన్ ఎంటర్టైన్మెంట్ తనే ప్రవేశపెట్టి- అమెజాన్ ప్రైమ్ తో దూసుకుపోతూ ప్రత్యర్ధుల్ని సర్ప్రైజ్ చేశాడు. ఇలా చాలా మంది బాస్ లు చేస్తూంటారు.

        కార్పొరేట్ల కన్ను
, పోరాటం బయటే వుంటుంది తప్ప లోపల తమ ఉద్యోగుల్నీ, బంధువుల్నీ వేధిస్తూ కూర్చోరు. కోవర్ట్ లు, ఇన్ ఫార్మర్ లు పుడతారు. లోపల పీడించడంలో బిజీ అయిపోతే, బయటి కార్పొరేట్లు ఇదే అదును అనుకుని చావు దెబ్బ కొడతారు.

        బిలియనీర్ కార్పొరేట్ అభి తన సక్సెస్ కి తనే కారణమని తన వాళ్ళ ముందు విర్రవీగడం ఇతర కార్పొరేట్లు చూస్తే నవ్వుకుంటారు. బయటి ప్రపంచంలో అభి ఏంటో చెప్పకుండా ఇన్ హౌస్ బ్యాడ్ చిత్రణలు చేసింది ప్రియా. ఆమె సరిగ్గా చిత్రిస్తే తన వాళ్ళతో అభి అలా ప్రవర్తించే అవకాశమే లేదు. అతనలా మారడానికి మూలకారణమేంటో కూడా చెప్పలేదు. ఇంకోటేమిటంటే
, ప్రియాతో అభి ఎప్పుడూ అలా ప్రవర్తించలేదు. ఇతరుల మీద అతడి ప్రతాపం చూసి తన సోమ్మేదో  పోతున్నట్టు కుమిలి పోతోంది సిల్లీగా. అతను పెళ్ళి కూడా చేసుకుంటానంటే, అతను రావుగారితో విశ్వాసంగా లేడని, ప్రెగ్నెంటై కూడా  గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోయింది! వాట్ నాన్సెన్స్.

ప్రస్తుత సమస్య
ఇలా ఫ్లాష్ బ్యాక్ పూర్తయి ప్రస్తుతానికొస్తే, ఆంటీ మాటలతో అభికి ఇంకో అవకాశం ఇచ్చి చూద్దామని కంపెనీకి తిరిగొచ్చిన ప్రియా, రావుగారి సమస్యకి దిగులుపడుతుంది. రావు గారు చెప్పిన ఉద్యోగుల్నీ అభి తీసుకోక పోవడంతో, అభికి గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోతుంది ప్రియా. రావుగారు గుండెపోటుతో హఠాన్మరణం. దీంతో అభి మనస్సాక్షి ఉత్థానం. అభి రూపమే డిస్టర్బ్ అయిన అభి ముందు మనస్సాక్షిగా ప్రత్యక్షమై- చేసింది ఇక చాలు, పొగరు మానుకుని, నీ ఉన్నతికి కారకులైన వాళ్ళకి థాంక్స్ చెప్పుకుని మనిషిగా మారు- అని మెసేజ్ ఇవ్వడంతో అభికి నారాయణ పురంలో వున్న పార్వతి గుర్తుకొస్తుంది-

ముందు ఇక్కడ రావుగారి ఫోటోకి దండం పెట్టుకుని,  ఓ థాంక్స్ పడేసి, ఎడాపెడా లెంపలేసుకోవాలని అన్పించదు. ఉద్యోగులకి సారీ చెప్పి, ప్రియని ప్రసన్నం చేసుకుని, మునకలేస్తూ పశ్చాత్తాప స్నానమాచరించా లన్పించదు- పల్లెకు పోదాం పారును చూద్దాం చలో చలో- అని జోరుగా హుషారుగా నారాయణ పురం పార్వతి దర్శనానికి పయనం!

        ఇలా బిగినింగ్ ముగిసి ప్లాట్ పాయింట్  వన్ ఏర్పడింది. ఏర్పడ్డప్పుడు కథ పుట్టకుండా గాథ పుట్టింది. రావుగారు ఎప్పుడైతే చనిపోయాడో
, అప్పుడే కథని కూడా చంపి, గాథని పుట్టించారు.  అభికి రావుగారు ప్రత్యర్థిగా వుంటే సంఘర్షణ పుట్టి అది కథ. అభికి రావుగారు లేక మెసేజిలిచ్చే మనస్సాక్షి వుంటే సంఘర్షణ లేక ఒట్టి థాంక్యూ చెప్పుకుంటూ తిరిగే నేలబారు గాథ!

        సినిమా పూర్తిగా చూడనవసంలేదు
, ఈ అరగంట దగ్గరే ఫ్లాప్ అయింది. ఇక మిడిల్, ఎండ్ గాథ ఎలా సాగిందో మంగళవారం చూద్దాం. ఈలోగా సోమవారం మలయాళం 19 (1) (a ) రివ్యూ చూద్దాం!

—సికిందర్


27, జులై 2022, బుధవారం

1185 : రైటర్స్ కార్నర్


 

    న దర్శకులు, రచయితలు సినిమా కళ గురించి ఎందుకు మాట్లాడరు? మాట్లాడితే, లేదా రాస్తే వర్ధమాన రచయితలు, దర్శకులు నేర్చుకునే అవకాశముంటుందిగా? ... ఇదీ ఇటీవల టాప్ దర్శకుడి దగ్గర పనిచేసే సీనియర్ రచయిత ఫోన్ సంభాషణలో వ్యక్తం చేసిన విచారం. దీనికి మన దగ్గర సమాధానమేముంటుంది? ఈ ప్రశ్న మనకి ఎప్పట్నుంచో వుంది. సినిమాలు విడుదలైనప్పుడు ఆ సినిమాల రైటింగ్, మేకింగ్ ల గురించి అడిగి తెలుసుకుని ఈ బ్లాగులో నలుగురికి అందుబాటులో వుంచుదామని గతంలో ఓ ముగ్గురు దర్శకుల్ని ప్రయత్నిస్తే అవకాశమివ్వలేదు. విషయ పరిజ్ఞానం లేకనో మరెందుకనో తెలీదు.

      కేవలం పరుచూరి గోపాల కృష్ణ గారొక్కరే సినిమా కళ మీద యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతున్నారు. రైటింగ్, మేకింగ్ లకి సంబంధించి సమాచార వినిమయ లేమి టాలీవుడ్ లో చాలా వుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే కొన్నేళ్ళ క్రితం ఈ బ్లాగులో రైటర్స్ కార్నర్ అనే శీర్షిక ప్రారంభించాం. ఆ రైటర్స్ ఎవరు? మనం ఎవర్ని అడిగి ఇక్కడ తెలుసుకుంటాం? టాలీవుడ్ లో ఈ అవకాశం లేదు కాబట్టి హాలీవుడ్, బాలీవుడ్ బాట పట్టాం. అక్కడైతే ఎందరో కొత్తా పాతా రచయితలు తమ క్రాఫ్ట్ గురించి, అనుభవాల గురించీ విరివిగా ఇంటర్వ్యూ లిస్తూంటారు. వాటిని అనువదించి బ్లాగులో ఇవ్వడం ప్రారంభించాం.

ఈ మధ్య కాలంలో ఈ శీర్షికకి అంతరాయాలు కలిగాయి. పైన చెప్పిన సీనియర్ రచయిత మాటలతో మన బద్ధకం కూడా వదిలి, ఈ శీర్షికని ఈవారం నుంచి కొనసాగిస్తున్నాం. ముందుగా బాలీవుడ్ రచయిత రోహన్ శంకర్ తన క్రాఫ్ట్ గురించి ఏమంటున్నాడో చూద్దాం...

        లుకా ఛుప్పీ’, సూరజ్ పే మంగళ్ భారీ’, మిమీ’, హెల్మెట్ వంటి సినిమాల బాలీవుడ్ వర్ధమాన చయిత  రోహన్ శంకర్‌ (37), 2016 లో లాల్ బాగ్చీ రాణీ అనే మరాఠీ సినిమాతో రచయితగా పరిచయమయ్యారు. 2019 లో లుకా ఛుప్పీ (బడ్జెట్ 34 కోట్లు, బాక్సాఫీసు 128 కోట్లు) నుంచి హిందీ సినిమాల రచయితగా స్థాయి పెంచుకున్నారు. దీని తర్వాత వెంట వెంటనే సూరజ్ పే మంగళ్ భారీ (2020), మిమీ (2021), “హెల్మెట్ (2021) వంటి కథా బలమున్న సినిమాలకి స్క్రిప్టు లందించారు. ఈ సందర్భంగా ఆయన తన రచనా విధానం గురించి, అనుభవాల గురించీ ఏమంటున్నారో చూద్దాం. రోహన్ శంకర్ శైలి విషాదాన్ని విషాద కథలుగా గాకుండా వినోదాత్మకంగా చెప్పడం. నిషిద్ధ అంశాల్ని వ్యంగ్యంగా చెప్పి ఎంటర్ టైన్ చేయడం...  

మీ  మిమీ రచనా  ప్రక్రియ గురించి చెప్పండి?

మడాక్ ఫిలిమ్స్ నిర్మాత  మాలా ఆయ్ వాచ్చీ (నేను తల్లినవుతా) అనే మరాఠీ సినిమా హక్కులు తీసుకుని దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్‌ని సంప్రదించారు. దాని హిందీ రీమేక్ చేయమని అడిగారు. నేను జాయినయ్యాను. ఆ మరాఠీ సినిమా నిజ జీవిత కేసు ఆధారంగా నిర్మించారు. హిందీలో ఎక్కువమంది ప్రేక్షకులకి రీచ్ అవ్వాలని మేము నిర్ణయించాం. ఒరిజినల్లోని థీమ్ ని, భావోద్వేగాలని యధాతధంగా తీసుకుని మా సొంత కథని, పాత్రల్ని సృష్టించాం. 2019 మార్చి లో రాయడం ప్రారంభించి  3-4 నెలల్లో మొదటి డ్రాఫ్ట్ ని సిద్ధం చేశాం. దాంతో నటీనటుల ఎంపిక పూర్తి చేశాం.

ఈ కథ చాలా చాలెంజింగ్ గా ఉన్నందున దీన్ని నా కష్టతరమైన స్క్రిప్టుగా భావిస్తాను. ఈ కథ సరోగసీ (అద్దె గర్భం) గురించి. మాతృత్వపు భావోద్వేగం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. నిజానికిది మరాఠీలో నిజంగా జరిగిన కేసు ఆధారంగా తీశారు.

మీరు రైటర్స్ బ్లాక్‌ నెదుర్కొంటారా ? దాన్నెలా టాకిల్ చేస్తారు?
సాధారణంగా జరిగేదేమిటంటే, క్కోసారి రచయిత తన నుంచి తనే ఎక్కువ ఆశిస్తాడు. ఎంతో బాధ్యతాయుతంగా కథ చెప్పాలనుకుంటాడు. మిమీ ని రాసేటప్పుడు, నేను కొన్ని విషయాలు ఛేదించలేకపోయాను. ఉదాహరణకు, మిమీ తన గర్భస్థ శిశువు గురించి తల్లిదండ్రులకి వివరించడానికి ప్రయత్నించే సన్నివేశం ఎలా రాసినా నాకు సంతృప్తి నివ్వలేదు.

8 రోజులు గోవా వెళ్లిపోయాను. అక్కడ రిసార్ట్స్ లో గది తీసుకుని నన్ను నేను బంధించేసుకున్నాను. ఆ సన్నివేశం మీద తీవ్ర కసరత్తు చేశాను. ఎన్నోసార్లు తిరగ రాశాను. మనకి అనేక ఆలోచనలు వస్తూంటాయి. కానీ ఏ మార్గంలో ముందుకు వెళ్ళాలో తెలుసుకోలేక పోతాం. మన చేతిలో కథ లేదని కాదు, ఆ కథని ఎలా చెప్పాలన్నదే తీవ్రంగా వేధించే సమస్య. దీనికి కొంత సమయం పడుతుంది. అయితే మీరు చెప్పే రైటర్స్ బ్లాక్ ని నేనెదుర్కోలేదు. రైటర్స్ బ్లాక్ వల్ల మనం ఆగిపోతాం. నేనలా ఆగను. రాస్తూనే వుంటా మెరుగు పర్చుకుంటూ.

మిమీ లో సరోగసీపై వాస్తవాలని తప్పుగా చూపించారని, మన దేశంలోని సరోగసీ చట్టాల్ని విస్మరించించారనీ ఒక నిర్దిష్ట వర్గం నుంచి విమర్శ వచ్చింది. దీనికి మీరేమంటారు?
మన దేశంలో కమర్షియల్ సరోగసీని నిషేధిస్తూ 2015 లో బిల్లు ఆమోదించారు. మేము సినిమాలో తప్పుగా ఏమీ చూపించలేదు. మా సినిమా కథా కాలం 2013. ఇది సరోగసీ బిల్లు ఆమోదించడానికి చాలా ముందు. ప్రారంభ సన్నివేశంలో సరోగసీ క్లినిక్‌ని చూపించాం. అక్కడ 10-15 మంది సరోగేట్‌లని ఒకే పైకప్పు క్రింద వుంచాం. కాబట్టి  2015 కి ముందు అక్షరాలా సరోగసీ కర్మాగారాలువుండేవన్నది స్పష్టం చేశాం. మీరు గూగుల్‌లో వెతికితే, గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లలో సామూహిక సరోగేట్‌ కేంద్రాలని చూపించే అనేక వీడియోలు మీకు కనిపిస్తాయి. విదేశీయులు ఈ సరోగసీ కర్మాగారాల్ని సందర్శించేవారు. అక్కడ తమ బిడ్డని కనడానికి  తగిన యువతిని ఎంచుకునేవారు. ఈ యువతులు  9 నెలలు అక్కడే వుండి, బిడ్డని ప్రసవించి, 2 నెలలు విశ్రాంతి తీసుకుని, ళ్ళీ  బిడ్డని కనేవారు. ఇలా వారి సంపాదన వుండేది. మిమీ మొదటి సన్నివేశంలో మేము సరిగ్గా అదే చూపించాం.

మరాఠీ సినిమా నిర్మాత ఒక న్యాయవాది. మీరు గూగుల్ చేస్తేఈ యువ సరోగేట్స్ ని విదేశీ జంటలు ఎలా దుర్వినియోగం చేశారో మీకు చాలా సంఘటనలు కనిపిస్తాయి. కాబట్టిమేము ఏదైనా తప్పుగా చూపించామని నేననుకోను. జైపూర్‌లోని ఓ ఐవీఎఫ్ క్లినిక్‌లో వైద్యుల సలహాతో సన్నివేశాలని చిత్రీకరించాం. సినిమా క్రెడిట్స్ లో ఆ డాక్టర్లకి ప్రత్యేక కృతజ్ఞతలు కూడా తెలిపాం.మిమీ లో మేము చూపించింది మరాఠీలో చూపించిన నిజమైన కేసు ఆధారంగా రూపొందించిందే. డౌన్ సిండ్రోమ్ పరీక్ష గర్భం దాల్చిన 4 లేదా 5వ నెలలో చేస్తారని, దానిని 8వ నెలలో చేసినట్టు చూపించామని ఎవరో అభ్యంతరం తెలిపారు. ఇది పూర్తిగా అవాస్తవం. సినిమా చూస్తే 5వ నెలలోనే పరీక్ష జరిపిట్టు తెలుస్తుంది. తర్వాత 7వ నెలలో శ్రీమంతం చూపించాం. కాబట్టి  లాంటి ఆరోపణలు చేసే ముందు కథలో టైమ్‌లైన్‌ని చూడాలి. ఒక జంట ఇంత వేగంగా బిడ్డని ఎలా దత్తత తీసుకుంటారని కూడా మరొకరన్నారు. డైలాగులు వింటే, మేం దత్తత తీసుకున్నాం’ అని కాకుండా బిడ్డని దత్తత తీసుకోబోతున్నాం అని వుంటుంది.

నిపుణులతో చర్చించే సినిమా పూర్తి చేశాం. అయినా దుష్ప్రచారం చేస్తే ఏమీ చేయలేం. ఎలాంటి తప్పుడు సమాచారం లేకుండా వాస్తవాల్ని చూపించడానికి మేము మా వంతు ప్రయత్నం చేశాం. సినిమా చూసి, గూగుల్‌లో నిజానిజాలు తెలుసుకుని మాట్లాడితే బావుంటుంది.

లుకా ఛుప్పీ (దాగుడు మూతలు) లో  లివ్-ఇన్ రిలేషన్స్‌పై కథ చేశారు. మిమీ సరోగసీ గురించి తీశారు. మీ స్క్రిప్టులు ఇలాటి నిషిద్ధ అంశాలని టచ్ చేస్తున్నాయి.  ఇలాంటి కథలు రాసేటప్పుడు మీరు ఏ విషయాలని దృష్టిలో వుంచుకుంటారు?


ముందుగా, ప్రేక్షకులు ఎలాంటి జోక్ లేదా హాస్యాన్ని ఆమోదిస్తారో తెలుసుకోవాలి. వ్యంగ్యంగా కథలు చెప్పడాన్ని నేను విశ్వసిస్తాను. వ్యంగ్యంలో చాలా సన్నని విభజన రేఖ వుంటుంది. అది దాటితే అభ్యంతరకరంగా మారుతుంది. నా ప్రధాన దృష్టి జోక్స్ పై కాదు, కథపైనే. అంతే, నేను నా పాత్రల్ని జాగ్రత్తగా రూపొందించుకుంటాను. పాత్రల మతం, సంస్కృతి, ఆర్థిక నేపథ్యం మొదలైనవాటిని దృష్టిలో వుంచుకుని తీర్చిదిద్దుతాను.

మన దేశంలో అనేక రకాల సంస్కృతులున్నాయి. వాటిలో రెండింటిని మిక్స్ చేస్తే, చాలా మంచి వ్యంగ్యం పుడుతుంది. దాన్ని కథలోకి తీసుకురాగలిగితే మనోహరంగా వుంటుంది. శ్రద్ధ వహించాల్సిన ఒక విషయం ఏమిటంటే, ఎవరినీ కించపరచకూడదు. ప్రేక్షకుల కోసం సినిమా చేస్తున్నాం కాబట్టి వాళ్ళ మనోభావాలని దెబ్బతీయకూడదు. అవసరం కూడా లేదు. కథతో జనం రిలేట్ అవ్వాలి. నేను వ్యంగ్యానికి పెద్ద అభిమానిని, అందుకే నా కథల్ని  కూడా అలానే రాస్తున్నాను.

మీరు రాయడంలో ఆకర్షణీయంగా భావించే ఒక విషయం ఏమిటి?
కథాసృష్టి మనోహరమైనది. పాత్రల్ని సృష్టించి, కథ రాస్తునప్పుడు, మున్ముందు కథలో ఏం జరుగుతుందో కూడా మనకి తెలీదు. ఆ పాత్రల్లాగా ఆలోచించడం మొదలెడతాం. కొన్నిసార్లు మన ఉపచేతన మనస్సు (సబ్ కాన్షస్ మైండ్) లో దాగి వున్నది మన తలపుకొస్తుంది. దీంతో మనల్ని మనం తరచి చూసుకుంటాం, మన వ్యక్తిత్వాన్ని కూడా చక్కదిద్దుకుంటాం.

చిన్న పట్టణాల్లోని మధ్యతరగతి పాత్రలతో వ్యంగ్య రచనలు చేయడం నాకు ఇష్టం. వాళ్ళ జీవితాల్లో చాలా సంక్లిష్టతలుంటాయి. అయినా వాళ్ళ  ముఖాలపై చిరునవ్వుల్ని మెరిపిస్తారు. కాబట్టి, నేను వ్రాసే ప్రక్రియ మొత్తాన్నీ కలిపి ఆనందిస్తాను.

దర్శకుడు స్క్రిప్టులో ఏదైనా మార్చాలనుకుంటే ఏం చేస్తారు? ఆలోచనల వైరుధ్యాన్ని మీరెలా ఎదుర్కొంటారు?

దర్శకుడూ రచయితా భార్యాభర్తల్లాంటి వాళ్ళు. నేను ఏదైనా రాసేటప్పుడు దర్శకుడి అనుమతి తీసుకుంటాను. ఆలోచనల్లో వైరుధ్యముంటే, ఎందుకలా మార్చి రాయాలో చెప్పి దర్శకుడే నన్ను ఒప్పిస్తాడు. నేననుకున్న ఆలోచనలుంటే నేను దర్శకుడ్ని ఒప్పించుకోగల్ను. వాదనలుంటాయి. తేలాల్సింది ఎవరి ఆలోచన మెరుగైనదోనన్నదే. సినిమా రచన అనేది బహిరంగ ప్రజాస్వామ్య ప్రక్రియ. సత్ఫలితాలు సాధించడానికి రచయిత, దర్శకుడు కలిసి పయనించాలి. ఇందులో మన ఇగోకి మనం ఆధిపత్యాన్నివ్వలేం. మన దృష్టి అంతా కూడానూ అత్యుత్తమ ప్రొడక్టుని సృష్టించడం మీదే  వుండాలి. కాబట్టి, దర్శకుడు ఏదైనా బెటర్ మెంట్ సూచిస్తే నేను అహంభావానికి చోటివ్వ కూడదు. నటీనటుల విషయంలోనూ ఇంతే. సినిమా చేస్తున్నప్పుడు, నటుడు మంచి డైలాగుతో వస్తే, మనం దాన్ని స్వీకరించాలి.

కథల ధోరణిని మార్చెయ్యడం గురించి, మంచి రచయితల అవసరం గురించీ మీరేమంటారు?
ఐదేళ్ళ క్రితం సినిమాలు తీసేవారు కాదు, సినిమాల స్థానంలో ప్రాజెక్టులు చేపట్టడమనే కొత్త మాట ఉనికిలో కొచ్చింది. దీనికి క్రియేటివిటీతో పెద్దగా పనుండదు. అంతా యాంత్రికమే.  ఈ ప్రాజెక్టుల్లో స్టార్సే కావాలి. స్టార్స్ ని ముందు బుక్ చేసుకుని, ఆ స్టార్ మూడ్ ని బట్టి,  ముందు విడుదలైన మూవీని బట్టీ కథని సెలెక్ట్ చేసుకునే వాళ్ళు. అంతేగానీ మా దగ్గర మంచి కథ వుంది, దీనికి తగ్గ నటీనటుల్ని ఎంపిక చేసుకుంటామనే ధోరణి లేదు.

ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ ఖాన్ కమర్షియల్ హీరో అయ్యాక మంచి కాలం వచ్చింది. 2017 తర్వాత, ప్రతి ఒక్కరూ మంచి స్క్రిప్టు కోసం ప్రయత్నించ నారంభించారు. ప్రాజెక్టులు కాక సినిమాలు తీయడం మొదలెట్టారు. సినిమాలకి కథే పెద్ద హీరో అయిపోయింది. కొంతమంది బిజీ స్టార్ల వెనుక పరుగెత్తే బదులు మంచి ప్రతిభావంతులైన నటుల్ని లీడ్‌లుగా పెట్టడానికి నిర్మాతలు ముందుకొచ్చారు.

ఇంతకి ముందు సినిమా అనేది ఫార్ములా ఫిల్మ్ మేకింగ్ గా వుండేది. ఏది అమ్ముడవుతోందో అందరూ దాన్నే తీసి అమ్మడం మొదలెట్టారు. అంటే ఆరోజుల్లో సినిమాలోని రెండు పాటలు హిట్టయితే ఆటోమేటిక్‌గా సినిమా హిట్టవుతుందని అనుకునేవారు. ఆ రోజుల్లో కొత్త రచయితల్ని, దర్శకుల్ని నిర్మాతలు నమ్మేవారు కాదు. కొత్త వాళ్ళు  చెప్పడానికి కొత్త యాంగిల్ ని, కొత్త కథల్నీ తెస్తారు కానీ దురదృష్టవశాత్తూ వాళ్ళని ఆదరించ లేదు. నిజం చెప్పాలంటే, ఎవరూ రచయితల్ని కోరుకోలేదు, కేవలం స్టార్స్ ని కోరుకున్నారు. ఇప్పుడు అది మారిపోయింది. ఇప్పుడు కథే స్టార్.

మీ ప్రయాణం సుదీర్ఘమైనది. అనేక ఎదురుదెబ్బలు తిన్నారు. మీ చేదు అనుభవాలు ఏ ఔత్సాహిక రచయితకైనా స్ఫూర్తిదాయకమే తప్ప మరొకటి కాదు. మీ సుదీర్ఘ ప్రయాణం గురించి చెప్పండి.

నా స్క్రిప్ట్స్ ని ఇష్టపడి, నిజంగా నాకు చేయూత నిచ్చే వ్యక్తుల్ని చేరుకోవడానికి నాకు కొంత సమయం పట్టింది. నేను చాలా మందికి లుకా ఛుప్పీ ఇచ్చాను. వాళ్ళందరూ మెచ్చుకున్నారు కానీ తీయడానికి ముందుకు రాలేదు. అనుకోకుండా నేను దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్‌ని కలిసే వరకూ యాతనలు పడుతూనే వున్నాను, ఆర్ధికంగా కూడా. రచయితగా నా మొదటి సినిమా మరాఠీ లాల్‌బాగ్చి రాణి. నేను మహారాష్ట్ర వాడ్నే. అది ముంబయిలో తప్పిపోయిన మానసిక వికలాంగ అమ్మాయికి సంబంధించిన కథ కావడంతో రాయడం చాలా కష్టమైన సబ్జెక్ట్. సమాచారాన్వేషణకి నాకు కొంత సమయం పట్టింది. నేను వికలాంగ పిల్లల కోసం చాలా పాఠశాలల్ని కూడా సందర్శించాను. ఆ పిల్లల అవసరాల్ని, ఆలోచనా విధానాన్నీ నేను అర్థం చేసుకోవాలి. ఇది సెన్సిబుల్ సబ్జెక్ట్. రెగ్యులర్ రోమాంటిక్ డ్రామా కంటే భిన్నమైనది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మొదట్లో లక్ష్మణ్ ఉటేకర్ లుకా ఛుప్పీ ని తిరస్కరించాడు, ఎందుకంటే అతను ఉత్తర-భారత దేశాన్ని అర్థం చేసుకోలేనందున స్క్రిప్ట్ కి  న్యాయం చేయలేనని భావించాడు. నేను వేరే వ్యక్తుల దగ్గర ప్రయత్నించినా అదృష్టం లేకపోవడంతో, 2016 చివరిలో లక్ష్మణ్ సర్‌కి మళ్లీ లుకా ఛుప్పీ చెప్పాను. ఈసారి ఒప్పుకున్నాడు. మేము ముందుగా ఉత్తర భారతదేశాన్ని పరిశీలించాలని నిర్ణయించుకున్నాం. మధుర, గ్వాలియర్, బృందావన్, ఆగ్రా వెళ్ళాం. మేము ఫైనల్ డ్రాఫ్ట్ రాయడం పూర్తి చేసిన తర్వాత, మాడాక్ ఫిల్మ్స్ ని  సంప్రదించాం. ఆయన స్క్రిప్ట్ ని ఇష్టపడి వెంటనే నిర్మాణాన్ని ప్రారంభించాడు.

—ఏజెన్సీస్

‘లుకా ఛుప్పీ’ స్క్రీన్ ప్లే సంగతులు కోసం ఇక్కడ క్లిక్ చేయండి