రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Wednesday, July 27, 2022

1185 : రైటర్స్ కార్నర్


 

    న దర్శకులు, రచయితలు సినిమా కళ గురించి ఎందుకు మాట్లాడరు? మాట్లాడితే, లేదా రాస్తే వర్ధమాన రచయితలు, దర్శకులు నేర్చుకునే అవకాశముంటుందిగా? ... ఇదీ ఇటీవల టాప్ దర్శకుడి దగ్గర పనిచేసే సీనియర్ రచయిత ఫోన్ సంభాషణలో వ్యక్తం చేసిన విచారం. దీనికి మన దగ్గర సమాధానమేముంటుంది? ఈ ప్రశ్న మనకి ఎప్పట్నుంచో వుంది. సినిమాలు విడుదలైనప్పుడు ఆ సినిమాల రైటింగ్, మేకింగ్ ల గురించి అడిగి తెలుసుకుని ఈ బ్లాగులో నలుగురికి అందుబాటులో వుంచుదామని గతంలో ఓ ముగ్గురు దర్శకుల్ని ప్రయత్నిస్తే అవకాశమివ్వలేదు. విషయ పరిజ్ఞానం లేకనో మరెందుకనో తెలీదు.

      కేవలం పరుచూరి గోపాల కృష్ణ గారొక్కరే సినిమా కళ మీద యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతున్నారు. రైటింగ్, మేకింగ్ లకి సంబంధించి సమాచార వినిమయ లేమి టాలీవుడ్ లో చాలా వుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే కొన్నేళ్ళ క్రితం ఈ బ్లాగులో రైటర్స్ కార్నర్ అనే శీర్షిక ప్రారంభించాం. ఆ రైటర్స్ ఎవరు? మనం ఎవర్ని అడిగి ఇక్కడ తెలుసుకుంటాం? టాలీవుడ్ లో ఈ అవకాశం లేదు కాబట్టి హాలీవుడ్, బాలీవుడ్ బాట పట్టాం. అక్కడైతే ఎందరో కొత్తా పాతా రచయితలు తమ క్రాఫ్ట్ గురించి, అనుభవాల గురించీ విరివిగా ఇంటర్వ్యూ లిస్తూంటారు. వాటిని అనువదించి బ్లాగులో ఇవ్వడం ప్రారంభించాం.

ఈ మధ్య కాలంలో ఈ శీర్షికకి అంతరాయాలు కలిగాయి. పైన చెప్పిన సీనియర్ రచయిత మాటలతో మన బద్ధకం కూడా వదిలి, ఈ శీర్షికని ఈవారం నుంచి కొనసాగిస్తున్నాం. ముందుగా బాలీవుడ్ రచయిత రోహన్ శంకర్ తన క్రాఫ్ట్ గురించి ఏమంటున్నాడో చూద్దాం...

        లుకా ఛుప్పీ’, సూరజ్ పే మంగళ్ భారీ’, మిమీ’, హెల్మెట్ వంటి సినిమాల బాలీవుడ్ వర్ధమాన చయిత  రోహన్ శంకర్‌ (37), 2016 లో లాల్ బాగ్చీ రాణీ అనే మరాఠీ సినిమాతో రచయితగా పరిచయమయ్యారు. 2019 లో లుకా ఛుప్పీ (బడ్జెట్ 34 కోట్లు, బాక్సాఫీసు 128 కోట్లు) నుంచి హిందీ సినిమాల రచయితగా స్థాయి పెంచుకున్నారు. దీని తర్వాత వెంట వెంటనే సూరజ్ పే మంగళ్ భారీ (2020), మిమీ (2021), “హెల్మెట్ (2021) వంటి కథా బలమున్న సినిమాలకి స్క్రిప్టు లందించారు. ఈ సందర్భంగా ఆయన తన రచనా విధానం గురించి, అనుభవాల గురించీ ఏమంటున్నారో చూద్దాం. రోహన్ శంకర్ శైలి విషాదాన్ని విషాద కథలుగా గాకుండా వినోదాత్మకంగా చెప్పడం. నిషిద్ధ అంశాల్ని వ్యంగ్యంగా చెప్పి ఎంటర్ టైన్ చేయడం...  

మీ  మిమీ రచనా  ప్రక్రియ గురించి చెప్పండి?

మడాక్ ఫిలిమ్స్ నిర్మాత  మాలా ఆయ్ వాచ్చీ (నేను తల్లినవుతా) అనే మరాఠీ సినిమా హక్కులు తీసుకుని దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్‌ని సంప్రదించారు. దాని హిందీ రీమేక్ చేయమని అడిగారు. నేను జాయినయ్యాను. ఆ మరాఠీ సినిమా నిజ జీవిత కేసు ఆధారంగా నిర్మించారు. హిందీలో ఎక్కువమంది ప్రేక్షకులకి రీచ్ అవ్వాలని మేము నిర్ణయించాం. ఒరిజినల్లోని థీమ్ ని, భావోద్వేగాలని యధాతధంగా తీసుకుని మా సొంత కథని, పాత్రల్ని సృష్టించాం. 2019 మార్చి లో రాయడం ప్రారంభించి  3-4 నెలల్లో మొదటి డ్రాఫ్ట్ ని సిద్ధం చేశాం. దాంతో నటీనటుల ఎంపిక పూర్తి చేశాం.

ఈ కథ చాలా చాలెంజింగ్ గా ఉన్నందున దీన్ని నా కష్టతరమైన స్క్రిప్టుగా భావిస్తాను. ఈ కథ సరోగసీ (అద్దె గర్భం) గురించి. మాతృత్వపు భావోద్వేగం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. నిజానికిది మరాఠీలో నిజంగా జరిగిన కేసు ఆధారంగా తీశారు.

మీరు రైటర్స్ బ్లాక్‌ నెదుర్కొంటారా ? దాన్నెలా టాకిల్ చేస్తారు?
సాధారణంగా జరిగేదేమిటంటే, క్కోసారి రచయిత తన నుంచి తనే ఎక్కువ ఆశిస్తాడు. ఎంతో బాధ్యతాయుతంగా కథ చెప్పాలనుకుంటాడు. మిమీ ని రాసేటప్పుడు, నేను కొన్ని విషయాలు ఛేదించలేకపోయాను. ఉదాహరణకు, మిమీ తన గర్భస్థ శిశువు గురించి తల్లిదండ్రులకి వివరించడానికి ప్రయత్నించే సన్నివేశం ఎలా రాసినా నాకు సంతృప్తి నివ్వలేదు.

8 రోజులు గోవా వెళ్లిపోయాను. అక్కడ రిసార్ట్స్ లో గది తీసుకుని నన్ను నేను బంధించేసుకున్నాను. ఆ సన్నివేశం మీద తీవ్ర కసరత్తు చేశాను. ఎన్నోసార్లు తిరగ రాశాను. మనకి అనేక ఆలోచనలు వస్తూంటాయి. కానీ ఏ మార్గంలో ముందుకు వెళ్ళాలో తెలుసుకోలేక పోతాం. మన చేతిలో కథ లేదని కాదు, ఆ కథని ఎలా చెప్పాలన్నదే తీవ్రంగా వేధించే సమస్య. దీనికి కొంత సమయం పడుతుంది. అయితే మీరు చెప్పే రైటర్స్ బ్లాక్ ని నేనెదుర్కోలేదు. రైటర్స్ బ్లాక్ వల్ల మనం ఆగిపోతాం. నేనలా ఆగను. రాస్తూనే వుంటా మెరుగు పర్చుకుంటూ.

మిమీ లో సరోగసీపై వాస్తవాలని తప్పుగా చూపించారని, మన దేశంలోని సరోగసీ చట్టాల్ని విస్మరించించారనీ ఒక నిర్దిష్ట వర్గం నుంచి విమర్శ వచ్చింది. దీనికి మీరేమంటారు?
మన దేశంలో కమర్షియల్ సరోగసీని నిషేధిస్తూ 2015 లో బిల్లు ఆమోదించారు. మేము సినిమాలో తప్పుగా ఏమీ చూపించలేదు. మా సినిమా కథా కాలం 2013. ఇది సరోగసీ బిల్లు ఆమోదించడానికి చాలా ముందు. ప్రారంభ సన్నివేశంలో సరోగసీ క్లినిక్‌ని చూపించాం. అక్కడ 10-15 మంది సరోగేట్‌లని ఒకే పైకప్పు క్రింద వుంచాం. కాబట్టి  2015 కి ముందు అక్షరాలా సరోగసీ కర్మాగారాలువుండేవన్నది స్పష్టం చేశాం. మీరు గూగుల్‌లో వెతికితే, గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లలో సామూహిక సరోగేట్‌ కేంద్రాలని చూపించే అనేక వీడియోలు మీకు కనిపిస్తాయి. విదేశీయులు ఈ సరోగసీ కర్మాగారాల్ని సందర్శించేవారు. అక్కడ తమ బిడ్డని కనడానికి  తగిన యువతిని ఎంచుకునేవారు. ఈ యువతులు  9 నెలలు అక్కడే వుండి, బిడ్డని ప్రసవించి, 2 నెలలు విశ్రాంతి తీసుకుని, ళ్ళీ  బిడ్డని కనేవారు. ఇలా వారి సంపాదన వుండేది. మిమీ మొదటి సన్నివేశంలో మేము సరిగ్గా అదే చూపించాం.

మరాఠీ సినిమా నిర్మాత ఒక న్యాయవాది. మీరు గూగుల్ చేస్తేఈ యువ సరోగేట్స్ ని విదేశీ జంటలు ఎలా దుర్వినియోగం చేశారో మీకు చాలా సంఘటనలు కనిపిస్తాయి. కాబట్టిమేము ఏదైనా తప్పుగా చూపించామని నేననుకోను. జైపూర్‌లోని ఓ ఐవీఎఫ్ క్లినిక్‌లో వైద్యుల సలహాతో సన్నివేశాలని చిత్రీకరించాం. సినిమా క్రెడిట్స్ లో ఆ డాక్టర్లకి ప్రత్యేక కృతజ్ఞతలు కూడా తెలిపాం.మిమీ లో మేము చూపించింది మరాఠీలో చూపించిన నిజమైన కేసు ఆధారంగా రూపొందించిందే. డౌన్ సిండ్రోమ్ పరీక్ష గర్భం దాల్చిన 4 లేదా 5వ నెలలో చేస్తారని, దానిని 8వ నెలలో చేసినట్టు చూపించామని ఎవరో అభ్యంతరం తెలిపారు. ఇది పూర్తిగా అవాస్తవం. సినిమా చూస్తే 5వ నెలలోనే పరీక్ష జరిపిట్టు తెలుస్తుంది. తర్వాత 7వ నెలలో శ్రీమంతం చూపించాం. కాబట్టి  లాంటి ఆరోపణలు చేసే ముందు కథలో టైమ్‌లైన్‌ని చూడాలి. ఒక జంట ఇంత వేగంగా బిడ్డని ఎలా దత్తత తీసుకుంటారని కూడా మరొకరన్నారు. డైలాగులు వింటే, మేం దత్తత తీసుకున్నాం’ అని కాకుండా బిడ్డని దత్తత తీసుకోబోతున్నాం అని వుంటుంది.

నిపుణులతో చర్చించే సినిమా పూర్తి చేశాం. అయినా దుష్ప్రచారం చేస్తే ఏమీ చేయలేం. ఎలాంటి తప్పుడు సమాచారం లేకుండా వాస్తవాల్ని చూపించడానికి మేము మా వంతు ప్రయత్నం చేశాం. సినిమా చూసి, గూగుల్‌లో నిజానిజాలు తెలుసుకుని మాట్లాడితే బావుంటుంది.

లుకా ఛుప్పీ (దాగుడు మూతలు) లో  లివ్-ఇన్ రిలేషన్స్‌పై కథ చేశారు. మిమీ సరోగసీ గురించి తీశారు. మీ స్క్రిప్టులు ఇలాటి నిషిద్ధ అంశాలని టచ్ చేస్తున్నాయి.  ఇలాంటి కథలు రాసేటప్పుడు మీరు ఏ విషయాలని దృష్టిలో వుంచుకుంటారు?


ముందుగా, ప్రేక్షకులు ఎలాంటి జోక్ లేదా హాస్యాన్ని ఆమోదిస్తారో తెలుసుకోవాలి. వ్యంగ్యంగా కథలు చెప్పడాన్ని నేను విశ్వసిస్తాను. వ్యంగ్యంలో చాలా సన్నని విభజన రేఖ వుంటుంది. అది దాటితే అభ్యంతరకరంగా మారుతుంది. నా ప్రధాన దృష్టి జోక్స్ పై కాదు, కథపైనే. అంతే, నేను నా పాత్రల్ని జాగ్రత్తగా రూపొందించుకుంటాను. పాత్రల మతం, సంస్కృతి, ఆర్థిక నేపథ్యం మొదలైనవాటిని దృష్టిలో వుంచుకుని తీర్చిదిద్దుతాను.

మన దేశంలో అనేక రకాల సంస్కృతులున్నాయి. వాటిలో రెండింటిని మిక్స్ చేస్తే, చాలా మంచి వ్యంగ్యం పుడుతుంది. దాన్ని కథలోకి తీసుకురాగలిగితే మనోహరంగా వుంటుంది. శ్రద్ధ వహించాల్సిన ఒక విషయం ఏమిటంటే, ఎవరినీ కించపరచకూడదు. ప్రేక్షకుల కోసం సినిమా చేస్తున్నాం కాబట్టి వాళ్ళ మనోభావాలని దెబ్బతీయకూడదు. అవసరం కూడా లేదు. కథతో జనం రిలేట్ అవ్వాలి. నేను వ్యంగ్యానికి పెద్ద అభిమానిని, అందుకే నా కథల్ని  కూడా అలానే రాస్తున్నాను.

మీరు రాయడంలో ఆకర్షణీయంగా భావించే ఒక విషయం ఏమిటి?
కథాసృష్టి మనోహరమైనది. పాత్రల్ని సృష్టించి, కథ రాస్తునప్పుడు, మున్ముందు కథలో ఏం జరుగుతుందో కూడా మనకి తెలీదు. ఆ పాత్రల్లాగా ఆలోచించడం మొదలెడతాం. కొన్నిసార్లు మన ఉపచేతన మనస్సు (సబ్ కాన్షస్ మైండ్) లో దాగి వున్నది మన తలపుకొస్తుంది. దీంతో మనల్ని మనం తరచి చూసుకుంటాం, మన వ్యక్తిత్వాన్ని కూడా చక్కదిద్దుకుంటాం.

చిన్న పట్టణాల్లోని మధ్యతరగతి పాత్రలతో వ్యంగ్య రచనలు చేయడం నాకు ఇష్టం. వాళ్ళ జీవితాల్లో చాలా సంక్లిష్టతలుంటాయి. అయినా వాళ్ళ  ముఖాలపై చిరునవ్వుల్ని మెరిపిస్తారు. కాబట్టి, నేను వ్రాసే ప్రక్రియ మొత్తాన్నీ కలిపి ఆనందిస్తాను.

దర్శకుడు స్క్రిప్టులో ఏదైనా మార్చాలనుకుంటే ఏం చేస్తారు? ఆలోచనల వైరుధ్యాన్ని మీరెలా ఎదుర్కొంటారు?

దర్శకుడూ రచయితా భార్యాభర్తల్లాంటి వాళ్ళు. నేను ఏదైనా రాసేటప్పుడు దర్శకుడి అనుమతి తీసుకుంటాను. ఆలోచనల్లో వైరుధ్యముంటే, ఎందుకలా మార్చి రాయాలో చెప్పి దర్శకుడే నన్ను ఒప్పిస్తాడు. నేననుకున్న ఆలోచనలుంటే నేను దర్శకుడ్ని ఒప్పించుకోగల్ను. వాదనలుంటాయి. తేలాల్సింది ఎవరి ఆలోచన మెరుగైనదోనన్నదే. సినిమా రచన అనేది బహిరంగ ప్రజాస్వామ్య ప్రక్రియ. సత్ఫలితాలు సాధించడానికి రచయిత, దర్శకుడు కలిసి పయనించాలి. ఇందులో మన ఇగోకి మనం ఆధిపత్యాన్నివ్వలేం. మన దృష్టి అంతా కూడానూ అత్యుత్తమ ప్రొడక్టుని సృష్టించడం మీదే  వుండాలి. కాబట్టి, దర్శకుడు ఏదైనా బెటర్ మెంట్ సూచిస్తే నేను అహంభావానికి చోటివ్వ కూడదు. నటీనటుల విషయంలోనూ ఇంతే. సినిమా చేస్తున్నప్పుడు, నటుడు మంచి డైలాగుతో వస్తే, మనం దాన్ని స్వీకరించాలి.

కథల ధోరణిని మార్చెయ్యడం గురించి, మంచి రచయితల అవసరం గురించీ మీరేమంటారు?
ఐదేళ్ళ క్రితం సినిమాలు తీసేవారు కాదు, సినిమాల స్థానంలో ప్రాజెక్టులు చేపట్టడమనే కొత్త మాట ఉనికిలో కొచ్చింది. దీనికి క్రియేటివిటీతో పెద్దగా పనుండదు. అంతా యాంత్రికమే.  ఈ ప్రాజెక్టుల్లో స్టార్సే కావాలి. స్టార్స్ ని ముందు బుక్ చేసుకుని, ఆ స్టార్ మూడ్ ని బట్టి,  ముందు విడుదలైన మూవీని బట్టీ కథని సెలెక్ట్ చేసుకునే వాళ్ళు. అంతేగానీ మా దగ్గర మంచి కథ వుంది, దీనికి తగ్గ నటీనటుల్ని ఎంపిక చేసుకుంటామనే ధోరణి లేదు.

ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ ఖాన్ కమర్షియల్ హీరో అయ్యాక మంచి కాలం వచ్చింది. 2017 తర్వాత, ప్రతి ఒక్కరూ మంచి స్క్రిప్టు కోసం ప్రయత్నించ నారంభించారు. ప్రాజెక్టులు కాక సినిమాలు తీయడం మొదలెట్టారు. సినిమాలకి కథే పెద్ద హీరో అయిపోయింది. కొంతమంది బిజీ స్టార్ల వెనుక పరుగెత్తే బదులు మంచి ప్రతిభావంతులైన నటుల్ని లీడ్‌లుగా పెట్టడానికి నిర్మాతలు ముందుకొచ్చారు.

ఇంతకి ముందు సినిమా అనేది ఫార్ములా ఫిల్మ్ మేకింగ్ గా వుండేది. ఏది అమ్ముడవుతోందో అందరూ దాన్నే తీసి అమ్మడం మొదలెట్టారు. అంటే ఆరోజుల్లో సినిమాలోని రెండు పాటలు హిట్టయితే ఆటోమేటిక్‌గా సినిమా హిట్టవుతుందని అనుకునేవారు. ఆ రోజుల్లో కొత్త రచయితల్ని, దర్శకుల్ని నిర్మాతలు నమ్మేవారు కాదు. కొత్త వాళ్ళు  చెప్పడానికి కొత్త యాంగిల్ ని, కొత్త కథల్నీ తెస్తారు కానీ దురదృష్టవశాత్తూ వాళ్ళని ఆదరించ లేదు. నిజం చెప్పాలంటే, ఎవరూ రచయితల్ని కోరుకోలేదు, కేవలం స్టార్స్ ని కోరుకున్నారు. ఇప్పుడు అది మారిపోయింది. ఇప్పుడు కథే స్టార్.

మీ ప్రయాణం సుదీర్ఘమైనది. అనేక ఎదురుదెబ్బలు తిన్నారు. మీ చేదు అనుభవాలు ఏ ఔత్సాహిక రచయితకైనా స్ఫూర్తిదాయకమే తప్ప మరొకటి కాదు. మీ సుదీర్ఘ ప్రయాణం గురించి చెప్పండి.

నా స్క్రిప్ట్స్ ని ఇష్టపడి, నిజంగా నాకు చేయూత నిచ్చే వ్యక్తుల్ని చేరుకోవడానికి నాకు కొంత సమయం పట్టింది. నేను చాలా మందికి లుకా ఛుప్పీ ఇచ్చాను. వాళ్ళందరూ మెచ్చుకున్నారు కానీ తీయడానికి ముందుకు రాలేదు. అనుకోకుండా నేను దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్‌ని కలిసే వరకూ యాతనలు పడుతూనే వున్నాను, ఆర్ధికంగా కూడా. రచయితగా నా మొదటి సినిమా మరాఠీ లాల్‌బాగ్చి రాణి. నేను మహారాష్ట్ర వాడ్నే. అది ముంబయిలో తప్పిపోయిన మానసిక వికలాంగ అమ్మాయికి సంబంధించిన కథ కావడంతో రాయడం చాలా కష్టమైన సబ్జెక్ట్. సమాచారాన్వేషణకి నాకు కొంత సమయం పట్టింది. నేను వికలాంగ పిల్లల కోసం చాలా పాఠశాలల్ని కూడా సందర్శించాను. ఆ పిల్లల అవసరాల్ని, ఆలోచనా విధానాన్నీ నేను అర్థం చేసుకోవాలి. ఇది సెన్సిబుల్ సబ్జెక్ట్. రెగ్యులర్ రోమాంటిక్ డ్రామా కంటే భిన్నమైనది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మొదట్లో లక్ష్మణ్ ఉటేకర్ లుకా ఛుప్పీ ని తిరస్కరించాడు, ఎందుకంటే అతను ఉత్తర-భారత దేశాన్ని అర్థం చేసుకోలేనందున స్క్రిప్ట్ కి  న్యాయం చేయలేనని భావించాడు. నేను వేరే వ్యక్తుల దగ్గర ప్రయత్నించినా అదృష్టం లేకపోవడంతో, 2016 చివరిలో లక్ష్మణ్ సర్‌కి మళ్లీ లుకా ఛుప్పీ చెప్పాను. ఈసారి ఒప్పుకున్నాడు. మేము ముందుగా ఉత్తర భారతదేశాన్ని పరిశీలించాలని నిర్ణయించుకున్నాం. మధుర, గ్వాలియర్, బృందావన్, ఆగ్రా వెళ్ళాం. మేము ఫైనల్ డ్రాఫ్ట్ రాయడం పూర్తి చేసిన తర్వాత, మాడాక్ ఫిల్మ్స్ ని  సంప్రదించాం. ఆయన స్క్రిప్ట్ ని ఇష్టపడి వెంటనే నిర్మాణాన్ని ప్రారంభించాడు.

—ఏజెన్సీస్

‘లుకా ఛుప్పీ’ స్క్రీన్ ప్లే సంగతులు కోసం ఇక్కడ క్లిక్ చేయండి