రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Saturday, August 5, 2017

492 : రివ్యూ!

రచన - దర్శకత్వంహరిప్రసాద్
తారాగణం : అశోక్‌,  ఈషా రెబ్బా, పూజిత,  సుదర్శన్, కేదార్శంకర్, జెమిని సురేష్, నోయల్షాన్
సంగీతం: సాయి కార్తీక్‌, ఛాయాగ్రహణం: ప్రవీణ్అనుమోలు
బ్యానర్‌: సుకుమార్రైటింగ్స్, ప్లేబ్యాక్ పిక్చర్స్  
నిర్మాతలు: బి.ఎన్‌.సి.ఎస్‌.పి. విజయ కుమార్, థామస్రెడ్డి ఆడూరి, రవిచంద్ర సత్తి
విడుదల : 4 జులై, 2017
***
        సు
కుమార్ రైటింగ్స్ ఇంకొకటి వచ్చింది. రోమాంటిక్ రైటింగ్స్ కి అలవాటు పడిన కలం ఈసారి రాయకుండా రోమాంటిక్ డ్రామా తీసింది. క్యాంపులో స్టూడెంట్ హరిప్రసాద్ ని దర్శకుడుగా, దర్శకుడి పాత్రలో బంధువు అశోక్ బండ్రెడ్డి ని హీరోగా పరిచయం చేస్తూ  ‘దర్శకుడు’ సిద్ధం చేసింది. క్రితం వచ్చిన ‘కుమారి 21 ఎఫ్’ రైటింగ్స్ కీ, రైటింగ్ ని అవుట్ సోర్స్ చేసిన ‘దర్శకుడు’ కీ చాలా తేడా వుంది. అదేమిటో చూద్దాం...

 కథ 
        చిన్నప్పట్నించీ తండ్రి ప్రోత్సాహంతో సినిమా దర్శకుడవాలని దర్శకత్వ శాఖలో చేరతాడు మహేష్ (అశోక్). రెండేళ్లకే ఓ నిర్మాతకి కథ విన్పించి ఓకే చేయించుకుంటాడు. అయితే కథలో ప్రేమ ట్రాకు బలంగా లేదని, దాన్ని సరి చేస్తేనే తీస్తానని నిర్మాత పదిహేను రోజులు గడువు పెడతాడు. తనకి  ప్రేమలో అనుభవముందా అని కూడా అడుగుతాడు. దీంతో మహేష్  ప్రేమ ట్రాకు గురించి ఆలోచిస్తూ తన వూరు వెళ్తాడు. తిరుగు ప్రయాణంలో వైజాగ్ నుంచి హైదరాబాద్ వస్తున్న నమ్రత (ఈషా) అనే ఫ్యాషన్ డిజైనర్ పరిచయమవుతుంది. ఈ ప్రయాణం కొన్ని అవాంతరాలతో, అపదలతో రకరకాలుగా సాగుతుంది. అతను సినిమా దర్శకుడని తెలుసుకున్న ఆమె సినిమాల్లో చూపించేవన్నీ అబద్ధాలని వాదిస్తుంది. ఈమెతో ఈ అనుభవాలు తన కథకి పనికొస్తాయని ఆలోచిస్తూంటాడతను. ఈ క్రమంలో తనతో ప్రేమలో పడిందని గ్రహిస్తాడు. అ ప్రేమని ఆమె వ్యక్తం చెయ్యదు. హైదరాబాద్ చేరాక అతడికి సినిమాలే తప్ప, తనమీద ప్రేమలేదని, తన ప్రేమని సినిమా కథకి వాడుకుంటున్నాడనీ తెలుసుకుని లెంపకాయ కొట్టి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అది వెండి తెర మీద చూడాలి.

ఎలావుంది కథ 
     సుకుమార్ రైటింగ్స్ నుంచి అవుట్ సోర్స్ కాంట్రాక్టు  పొందిన కొత్త దర్శకుడు అందరు కొత్త దర్శకులకి లాగే టెంప్లెట్ ప్రేమని కథగా చేశాడు. దీనికి సుకుమార్ రైటింగ్స్ అనే బ్రాండింగ్ లేకపోతే ప్రతీవారం వచ్చే చిన్నా చితకా రోమాంటిక్ కామెడీల్లో ఇదొకటిగా ఎవరికీ తెలిసేది కాదు. ఇందులో చూపిన ప్రేమకి కథా ప్రయోజనం లేదు సరే, వృత్తిపరంగా ఔత్సాహిక దర్శకులకి ఏమైనా నేర్పి కథా ప్రయోజనం సాధించిందీ లేదు. అదీ సమస్య. ఒకప్పటి కాలేజీల్లో టీనేజీ ప్రేమ కథలే ఇప్పుడు పాతికేళ్ళు దాటిన ప్రొఫెషనల్ పాత్రలకి పెట్టి తీసేస్తున్నారు. అన్ని రోగాలకీ ఒకటే జిందా తిలిస్మాత్ లాగా, అన్ని ప్రేమలకీ ఒకటే అచ్చిబుచ్చి టీనేజి ప్రేమ కథలు. ఈ చూపిస్తున్న ప్రొఫెషనల్స్ ప్రేమల తీరు, మాటల తీరు, ప్రవర్తనల తీరూ, అలకలూ వియోగాల బాధ అంతాకూడా అపరిపక్వ-   ఇన్ఫాచ్యుయేషన్ బాపతు టీనేజి మనస్తత్వాలే. చాలా నాన్సెన్స్ ఇది. సుకుమార్ రైటింగ్స్ కూడా దీనికే పూనుకోవడం వింత. ఈ చూపిస్తున్న ఏనాటివో కాలం తీరిన మూస టెంప్లెట్ ప్రేమలకంటే, టాలీవుడ్ బయట యూత్ తీస్తున్న షార్ట్ ఫిలిమ్స్ ఎంతో బెటర్. ఇప్పుడు టీనేజీ ప్రేమలైనా ఎలావుంటున్నాయో వాస్తవికంగా చూపిస్తున్నారు. దీంతో వూరూవాడా యూత్ వీటికి కనెక్ట్ అయిపోయి టాలీవుడ్ రోమాంటిక్ కామెడీల వైపే  కన్నెత్తి చూడ్డం లేదు. ఎప్పుడో ఒకటీ అరా బ్రాండింగ్ తో వస్తే మొక్కుబడిగా చూస్తున్నారు. ఒకప్పుడు కుటుంబ సినిమాలకి టీవీ సీరియల్స్ దెబ్బకొట్టి ఫ్యామిలీ ఆడియెన్స్ ని దూరం చేసినట్టు, టాలీవుడ్ రోమాంటిక్ కామెడీలకి షార్ట్ ఫిలిమ్స్ పోటీగా తయారై సినిమాలకి యూత్ డుమ్మాకొడుతున్నారని గమనిస్తే మంచిది.

ఎవరెలా చేశారు 
      కొత్త వాడు కాబట్టి అశోక్ కి ఇంకాస్త సమయమివ్వాలి. కానీ ముందుగా అతను ఏం చేస్తే ముఖభావాలు కనీస స్థాయిలో పలికించగలడో తెలుసుకుని ఆ ప్రయత్నం చేయాలి. అవసరమైతే ప్లాస్టిక్ సర్జరీ కూడా. ముఖభావాలే పలకని, అన్నిటికీ ఒకటే ఫేసుపెట్టే స్టాటిక్ ఎక్స్ ప్రెషనిస్టు యువహీరో ఆల్రెడీ వున్నాడు. ఇంకా స్ట్రగుల్ చేస్తున్నాడు. అశోక్ కి అశోకవనం కాకూడదు టాలీవుడ్. 

          పాత్ర విషయానికొస్తే, గోల్ అనేది సినిమాల కోసమే పెట్టుకున్నాడు. బావుంది. ఆ సినిమా కథలో ప్రేమ బాగాలేదన్నాడు నిర్మాత. ప్రేమలో అనుభవం లేదా అని కూడా చెత్త ప్రశ్న వేశాడు. అశోక్ పాత్ర గనుక మర్డర్ మిస్టరీ చెప్తే, మర్డర్స్ లో అనుభవం లేదా, వెళ్లి మర్డర్ చేసిరా అంటాడేమో. సరే, ప్రేమలో అనుభవంకోసం కాకపోయినా, ప్రేమలో పడేందుకే దర్శకుడు హరిప్రసాద్ తనని వూరు పంపాడు. అక్కడ ఫ్యాషన్ డిజైనర్ పరిచయమైంది. ఆమెతో ట్రావెల్ చేస్తున్నప్పుడు ప్రేమంటే ఎలావుంటుందో అనుభవమయ్యింది. ఈ బాపతు ప్రేమ రెండు టాలీవుడ్ టెంప్లెట్ రోమాన్సులు  చూసేస్తే తెలిసిపోతుంది- వేరేగా అనుభవం అవసరం లేదు. మిత్రుడు (సుదర్శన్ రెడ్డి) నయం. ఏవేవో రోమాంటిక్ సినిమాలు చూసి ఐడియా లిస్తూంటాడు. అంతకంటే తక్కువరకం ప్రేమానుభవం పొందుతున్నాడు తను. అయితే ఈ ప్రేమలో తను పడడమే పాత్ర వృత్తితత్వాన్ని దెబ్బ తీసింది. దర్శకుడుగా కథకోసం ఆమెని స్టడీ చేయాల్సింది పోయి ప్రేమలో పడిపోయాడు. ఈ ప్రేమ ట్రావెల్ లో కథకోసం రీసెర్చి ఎలా చేస్తారో, ఎలాటి చిక్కుల్లో పడతారో చూపించే అవకాశాన్ని కోల్పోయాడు. ఎందుకంటే, పాత్ర వృత్తి నుంచి విడిపోయి ప్రేమ ఒక్కటే అనుకుంది. 

          సాధారణంగా ఇలాటి సందర్భాల్లో ఏం జరుగుతుందంటే, ఇలా ప్రేమలో పడిపోతే గోల్ ని మర్చిపోతుంది పాత్ర. ఆ ప్రేమలో దెబ్బ తిన్నాకే బుద్ధి తెచ్చుకుని  మళ్ళీ గోల్ వైపు మళ్ళుతుంది. అశోక్ పాత్ర ఈ పని చేసి డెప్త్ తీసుకురాలేదు, పోనీ ప్రేమలో పడకుండా ప్రేమని స్టడీ చేయలేదు. ప్రేమా కావాలి, ప్రొఫెషన్ కూడా కావాలీ అనుకున్నాడు. ఇది ఇమ్మెచ్యూర్ పాత్ర లక్షణం. హీరోకి కాక ఇతర పాత్రలకి వుండొచ్చు ఈ స్పష్టత లేని లక్ష్యం. ఎదురుగా ప్రేమించిన హీరోయిన్ వున్నప్పుడు ఆమెతోనే వుండాలి సంఘర్షణ. తనలో రెండు కోరికలు పెట్టుకుని వాటితో కాదు. 

        ఈ కథ ప్రేమ గురించా, దర్శకుడిగా ప్రొఫెషన్ గురించా? ఇక్కడ కూడా తప్పులో కాలేయడం
వల్ల ప్రేమే కథని మింగేసి, దర్శకుడి పాత్ర చిత్రణకి గ్రహణం పట్టించింది. పాత్రకి వృత్తితత్త్వంతో కూడిన అద్భుత రసమే ప్రధాన రసంగా వుండి,  చెరో పక్క రెండు అంగాలుగా శృంగార, హాస్య రసాలు పలకాల్సింది. ‘ముత్యాలముగ్గు’ వియోగ కథని అద్భుత రస ప్రధానంగా ఎందుకు తీశారో అర్ధం చేసుకోవాలి. ఇక్కడ దర్శకుదు అద్భుత రస ప్రధానంగా నడకపోవడంవల్ల,  పాత్ర గందరగోళంలో పడిపోయి ముగింపు కొచ్చేసరికి, తన షరతుల మీద ఆమెని చేపట్టడం కాక,  పాసివ్ క్యారక్టర్ గా మారిపోతూ వచ్చి, హీరోయిన్ అచ్చిబుచ్చి కబుర్లకి పడిపోయి శుభం వేశాడు. 

          ఇక హీరోయిన్ ఈషా మంచి నటి. భావప్రకటనా సామర్ధ్యం బాగా వుంది. ఆమె రొటీన్ కమర్షియల్ సినిమాల జోలికి పోకుండా ఈ తరహా సినిమాలకి పరిమితమైతే ఎక్కువ కాలం వుండగల్గుతుంది. పాత్రకి వచ్చేసరికి,  కనీసం పాతికేళ్ళ వయసున్న ప్రొఫెషనల్ తను. పైగా ఫ్యాషన్ డిజైనర్.  కానీ హీరో దర్శకుడని తెలిశాక, మరీ టీనేజీ పిల్లల చేష్టలు పోతూ – తనకి  సినిమాలంటే ఇష్టముండదనీ, అన్నీ అబద్ధాలే చూపిస్తారనీ,  ఇంకా ఏదేదో అంత సిల్లీగా ఎలా మాటాడి గిల్లి కజ్జాలు పెట్టుకుంటుంది. ఇద్దరిదీ ఒకే రంగమైనప్పుడు ప్రొఫెషనల్ గా అతడితో వెంటనే కనెక్ట్ అయిపోవాలి. అతడితో కలిసి పనిచేసే దృష్టితో మెచ్యూర్డ్ గా మాటాడాలి.  అతనెప్పుడో సెకండాఫ్ లో పిలిచి పనిలో పెట్టుకుంటే కాదు. తనతో సాన్నిహిత్యంలో అతను  కథని వెతుక్కుంటే తప్పేముంది? కళాకారులకి ఇది తప్పదు కదా, ఆమెకీ తప్పదు. అతను కథనే చూస్తాడు, కథనే చూసినా తను ప్రేమనే చూడవచ్చు. తను ప్రేమకి ప్రతినిధి అయితే, అతను కళకి  అయినప్పడు,  బలాబలాల సమీకరణ గీతగీసి స్పష్టంగా కనపడుతుంది కదా? అతను  కథనే చూశాడనీ, ప్రేమించలేదనీ, ఏ ఎమోషన్సూ లేవనీ  లెంపకాయ కొట్టి ఎలా వెళ్ళిపోతుంది. ఇది ఇమ్మెచ్యూరే కాదు, ప్రిమెచ్యూర్ కూడా. ముందు అతడితో ప్రొఫెషనల్ గా స్థిరపడాలి, ఆ తర్వాతే ప్రేమ గొడవలు లేవనెత్తుకోవాలి. అప్పుడది కథనం అవుతుంది. అతను ఆమెతో అయిన అనుభవాలే సీన్లుగా తీస్తూంటే, ఒక చోట షూటింగు చూసి, ‘నీయబ్బ ఈ సిను ఇంటర్వెల్లో వాడేశాడా!’ అని ఉడుక్కుంటుంది. టోటల్లీ నాన్సెన్స్. అతడి సినిమాకి తను స్ఫూర్తి అయితే మంచి విషయమే కదా? ఏ పల్లెటూరి పిల్లయినా ఎగిరి గంతేస్తుంది. 

          అతను కూడా సినిమా తీసి. నిర్మాతతో సమస్య వచ్చి పేరేసుకోకుండా ఎటో వెళ్లి పోవడం బాగానే వుంది కానీ, ఆ సినిమా కథకి  స్ఫూర్తి అయిన హీరోయిన్ ని తెర మీద పరోక్షంగానైనా ప్రస్తావించకుండా ఎలా వెళ్ళిపోతాడు. అద్భుత రసం ప్రధానంగా పాత్ర కొనసాగుతూ వుంటే ఈ పనే చేసి వెళ్ళిపోయేవాడు. ప్పుడు అన్ని శంకలూ తీరి ఆమే తన దగ్గరికి వచ్చేసేది. ఇలాకాక, నేనింత ప్రేమించాను, అంత ప్రేమించానూ అని ఎన్ని చెప్పుకుంటే ఏం లాభం.  సినిమానే ఆమెకి అంకితమిచ్చి పారేస్తే అంతకంటే ఏది బలపరుస్తుంది తన ప్రేమని. 

          ఫ్రెండ్ పాత్రలో కమెడియన్ సుదర్శన్ రెడ్డి డీసెంట్ గా నటించాడు. నిర్మాతా,  ఆయన కో డైరెక్టర్ పాత్ర ధారులిద్దరూ బావున్నారు. కానీ నిర్మాత ఫస్టాఫ్ లో రెండు సినిమాలు తీసి నష్టపోయానంటాడు. మళ్ళీ ఫస్టాఫ్ లో ఆస్తులన్నీ అమ్మి ఈ సినిమా తీస్తున్నా, పోయిందంటే కుటుంబం సహా  రోడ్డున పడతానంటాడు. ముగింపులో మళ్ళీ,  ముందు తీసిన రెండు సినిమాలకి డబ్బులొచ్చాయంటాడు. ఏది నమ్మాలి? అంత పెద్ద హైఫై నిర్మాత కోటి రూపాయల సినిమాకే రోడ్డున పడతాడా. సుకుమార్ రైటింగ్స్ కి ఇలాటి అవగాహన వుంటుందనుకోలేం.  

          ప్రొడక్షన్ విలువలు చాలా బావున్నాయి. ఆర్ట్ డైరెక్షన్ వున్నట్టు తెలీకుండా తీసిన ట్రెండీ లుక్ బావుంది. కెమెరా వర్క్ స్ఫటిక స్వచ్ఛతతో వుంది. పాటలుకూడా హుషారుగా వున్నాయి. అవుట్ డోర్ లొకేషన్స్  కథకున్న ఫీల్ కి పట్టం గట్టాయి. రాతపని బలహీనంగా వున్నా, నటనల్ని రాబట్టుకునే, దృశ్యాల్ని చిత్రీ కరించే దర్శకత్వపు పనులు చక్కగా వున్నాయి. 

చివరికేమిటి 
         ప్రధాన పాత్రకి సరైన అస్త్ర శస్త్రా లుంటే స్క్రీన్ ప్లే సరీగ్గా వుంటుంది. ప్రధాన పాత్ర తప్ప  దర్శకుడు లేదా రచయిత ఏం చేసీ స్క్రీన్ ప్లేని ఏర్పరచలేరు. ప్రధాన పాత్రని సృష్టించాక కథ కథకుడి చేతిలో వుండదు. అతను ఇష్టారాజ్యం గా పాత్రని క్యాట్ వాక్ చేయించుకుంటూ వెళ్ళలేడు. పాత్ర వెంటే కథకుడు వెళ్ళాలి. ఇలా జరక్కపోవడం వల్ల, ప్లాట్ పాయింట్స్ ఎక్కడ ఏర్పడ్డాయో తెలియనంత అస్పష్ట అష్టావక్ర చట్రం ఈ ప్రేమ సినిమాలో ఏర్పడింది. అంక విభజన అదృశ్యమై గాథ స్టయిల్లో ఆర్గ్యుమెంట్ లేని ఉత్త స్టేట్ మెంట్ చందాన మిగిలింది. టెంప్లెట్ నుంచి బయటికి రాకపోతే,  ప్రేమ సినిమాలు ఏవో పెద్ద బ్యానర్లు వాటి హంగులతో తప్పితే, మిగతావి హంగులూ లేక, కథా కాకరకాయా సరైన స్ట్రక్చర్ లో లేకా చప్పగా తేలిపోతాయి.

-సికిందర్
Cinemabazaar.in