రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

5, ఆగస్టు 2022, శుక్రవారం

1189 : రైటర్స్ కార్నర్


                  ప్రసిద్ధ హాలీవుడ్ రచయిత డేవిడ్ కెప్ తెలియని వారు సినిమా రంగంలో వుండరు. ఈయన రాసిన తాజా మూవీ కిమీ ఈ సంవత్సరమే విడుదలైంది. డేవిడ్ కెప్ సినిమాల లిస్టు చూస్తే- అపార్ట్ మెంట్ జీరో, టాయ్ సోల్జర్స్, జురాసిక్ పార్క్, మిషన్ ఇంపాసిబుల్, ది లాస్ట్ వరల్డ్- జురాసిక్ పార్క్, స్నేక్ ఐస్, స్పైడర్ మాన్, వార్ ఆఫ్ ది వరల్డ్స్, ది మమ్మీ వంటి 24 సినిమాలున్నాయి. దర్శకుడుగా ది ట్రిగ్గర్ ఎఫెక్ట్, సీక్రెట్ విండో, ఘోస్ట్ టౌన్, ప్రీమియం రష్ మొదలైన 8 వున్నాయి.

        కిమీ ఒక టెక్నో థ్రిల్లర్. జోయ్ క్రావిట్జ్, ఏంజెలా పాత్రలో నటించింది. అగోరాఫోబియా (బహిరంగ ప్రదేశాలంటే భయం) తో బాధపడే యువతియైన ఏంజెలా ఒక కొత్త డిజిటల్ అసిస్టెంట్‌ని రూపొందించిన స్టార్టప్ కంపెనీలో పని చేస్తూంటుంది. ఈమె డ్యూటీ పొగుబడిన ఆడియో రికార్డింగ్‌లని క్లీన్ చేయడం. ఇలా ఒక రోజు ఒక రికార్డింగ్‌ వింటూ భయపడుతుంది. ఆ రికార్డింగ్ లో ఒకావిడ తన మీద జరుగుతున్న అఘాయిత్యాన్ని అరిచి చెబుతోంది...ఇప్పుడేం చేసింది ఏంజెలా? ఈ నేరానికి ఇయర్ విట్నెస్ అయిందా?...

        ఈ ఆసక్తికర టెక్నో థ్రిల్లర్ కి సుప్రసిద్ధ దర్శకుడు స్టీవెన్ సోడర్ బెర్గ్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ రచన గురించీ, ఇంకా తన రచనా వృత్తి గురించీ ఇటీవల సుదీర్ఘ ఇంటర్వూ ఇచ్చారు డేవిడ్. అనువదించిన ఈ ఇంటర్వ్యూ పాఠంలో ఆయన చెప్పిన విశేషాలు తెలుసుకుందాం...

కిమీ ని కోవిడ్ లాక్ డౌన్ సమయంలో రాసినట్టున్నారు?
దీని ఐడియా ముందు నుంచీ వుంది. 2020 లాక్ డౌన్ సమయంలో రాశాను. అప్పుడు అందరం ఇళ్ళ దగ్గర బందీలయ్యాం. ఈ నేపథ్యంలో ఎవరు అఘాయిత్యం చేసి వుంటారు? బయటి కెళ్ళడానికే భయపడే అగోరాఫోబిక్ క్యారక్టర్ హీరోయిన్ అని ముందే నిర్ణయించాను. క్యారక్టర్ ని బట్టే కథ పుట్టింది. ఇలాటి హీరోయినిప్పుడేం చెయ్యాలీ అనే  ఛాలెంజీ విసిరాను.

మరి ఎప్పుడు షూట్ చేశారు?
వెంటనే. దర్శకుడు సోడర్ బెర్గ్ తో ముప్ఫయ్యేళ్ళ తర్వాత చేస్తున్న సినిమా ఇది. స్క్రిప్టు మొదటి రెండు డ్రాఫ్టులు కూడా ఓకే చేశాడు. దీనికి హెచ్ బీ ఓ - మాక్స్ మంచి ప్లాట్ ఫామ్ అవుతుందని నిర్ణయించాం. ఆ సంస్థ కూడా స్క్రిప్టు కి వెంటనే ఓకే చెప్పింది.

మీరు రాసిన  స్క్రిప్ట్ అంత టైట్ గా వుందా?
అవుననుకుంటాను.  థ్రిల్లర్ కాబట్టి టైట్ గా వుండాల్సిందే. 108 పేజీలకి మించ నివ్వలేదు.  1940 ల నాటి థ్రిల్లర్స్ అంటే నాకిష్టం. సారీ రాంగ్ నెంబర్ వంటి థ్రిల్లర్స్ బాగా చూసే వాడ్ని. ఆ రోజుల్లో చప్పున ముగిసిపోయే థ్రిల్లర్స్ తీసేవారు. సారీ రాంగ్ నంబర్ 15 సార్లు చూసి వుంటాను. అలాగే నా థ్రిల్లర్ కూడా చప్పున ముగిసిపోవాలని కోరుకున్నాను. రాసే ప్రతీ స్క్రిప్టూ కొత్త అభ్యాసమే నాకు.

పానిక్ రూమ్ రాసినప్పుడు తొలి డ్రాఫ్ట్ పై భాగాన ఇది చప్పున ముగిసిపోయే టైట్ మూవీ అని రాశాను. చప్పున ముగిసిపోయే చిన్న సినిమాలు వరం లాంటివి అనుకుంటాను. టెన్షన్ ని పెంచుతున్నప్పుడు టైట్ గా వుంచి చప్పున ముగించాలి. ఏదైనా పని ప్రారంభిస్తే అది కాలం తెలియకుండా 92 నిమిషాల్లో  ముగిసిపోతే ఎంత ఆనందిస్తారు మీరు? ఇది ప్రపంచంలోకెల్లా గొప్ప అనుభూతి. నేను టరాంటినో తరహా విషయాంతర ప్రస్తావనల్ని(ఉన్నకథ లోంచి పక్కకెళ్ళడం) ఆస్వాదించ లేనని కాదు. అది వేరే రకం వినోదం. నేను థియేటర్‌లో సినిమా చూడాలనుకుంటే దాన్ని పాజ్ చేయలేను, సీన్స్ ని స్కిప్ చేయలేను. అలాటి అవసరం సినిమాలకి రాకూడ దనుకుంటాను నేను. అందుకనే  స్క్రిప్టు టైట్ గా వుండి చప్పున ముగిసి పోవాలని కోరుకుంటాను.

మీరు UCLA ఫిల్మ్ స్కూల్ పూర్తి చేశాక రాసిన మీ మొదటి స్క్రీన్ ప్లే బ్యాడ్ ఇన్‌ ఫ్లూయెన్స్ పిచింగ్ చేయడానికి ఎదుర్కొన్న ఇబ్బందులేమిటి?

చాలా వున్నాయి. బ్యాడ్ ఇన్ ఫ్లూయెన్స్ కంటే ముందు అపార్ట్ మెంట్ జీరో రాశాను. అప్పటికి విదేశీ పంపిణీదారులకి ప్రాతినిధ్యం వహించే వ్యక్తికి ఇంటర్న్ గా పని చేస్తున్నాను. మేము విదేశీ వీడియో కంపెనీల ద్వారా విడుదల చేయడానికి అమెరికన్ బి గ్రేడ్ సినిమాలని కొనుగోలు చేసే వాళ్ళం. రాత్రిపూట స్క్రిప్టులు రాసేవాడ్ని. ఫ్రెండ్ మార్టిన్ తో కలిసి రాసే వాడ్ని. అతడి దగ్గర కథకి గొప్ప ఐడియా వుంది. దాన్ని కలిసి రాశాం. నా కంపెనీ బాస్ దీని విదేశీ హక్కులు విక్రయించడంలో మాకు సహాయం చేశాడు. అయితే మాకు డబ్బులేం రాలేదు. కానీ నేను ఫిల్మ్ స్కూల్ నుంచి బైటకొచ్చిన సంవత్సరం లోపే  ఇంకో సినిమా కోసం పని చేశాను.

బ్యాడ్ ఇన్‌ఫ్లూయెన్స్ రాశాక, దాన్ని అమ్మి పెట్టగల ఏజెంట్ కోసం చూస్తున్నాను.  అప్పుడు అనుకోకుండా సీనియర్ స్క్రీన్ రైటర్ విలియం గోల్డ్ మాన్ రాసిన అడ్వెంచర్స్ ఇన్ ది స్క్రీన్ ట్రేడ్‌ పుస్తకం చదివి అందులోని సలహా పాటించాను. మీకు తెలిసిన ప్రతి ఒక్కరికీ కాల్ చేయండి, వాళ్ళకి ఏజెంట్ ఎవరైనా తెలుసా అని  అడగండి అన్న గోల్డ్ మాన్ సలహా పాటించాను. దాంతో నాకు ముగ్గురు ఏజెంట్లు పరిచయమయ్యారు. ముగ్గురూ నా స్క్రిప్టు చదివారు. అందులో ఒకరు కాంట్రాక్టు పై సంతకం చేశారు.

 మీరు నిజంగా కష్టపడి పనిచేయడమే మీ విజయానికి ఒక కారణమని గతంలో మీరు చెప్పారు. మంచి స్క్రీన్‌ప్లేని రూపొందించడానికి ఎంత టైమ్ తీసుకోవాలో అంతా తీసుకోకపోతే రైటర్ ని తక్కువ అంచనా వేస్తారని మీరనుకుంటున్నారా?
స్క్రిప్టుని రీ రైటింగ్ చేసేప్పుడు ఇది ఎగ్జిక్యూటివ్ లకి తెలిసి పోతుందనుకుంటాను. చాలా మంది రచయితలు మొదటి లేదా రెండవ డ్రాఫ్ట్ ని దాటి వెళ్ళడానికి ఇష్టపడరని నేను భావిస్తున్నాను. కొన్నిసార్లు ఇతరులు ఏం సవరణలు కోరుతున్నారో వినడానికి కూడా ఇష్టపడరు. వినడాని కిష్టపడితే రచయిత చెప్పేదాంట్లో కూడా అర్ధం వుందని వాళ్ళూ రాజీపడే  అవకాశం వుంటుంది.

ఈ వృత్తిలో నిరాటంకంగా కొనసాగడానికి సృష్టించుకోవాల్సిన పరిస్థితు లేమిటంటారు?
ఈ వృత్తిలో ఏది ముఖ్యమని భావిస్తారో దాన్ని బట్టి వుంటుంది. ఈ వృత్తిని కొనసాగించు కునేందుకు ముందుగా ఏం కోరుకుంటున్నారో తెలియాలి. డబ్బా? పేరు ప్రతిష్టలా? ఆత్మసంతృప్తా? లేడీస్ ని ఆకట్టుకోవడమా? ఏది ముఖ్యమైనదో ముందు నిర్ణయించుకోవడం ముఖ్యం.

కాల గమనంలో మీ వృత్తి లక్ష్యాలు ఎలా మారాయి?
పెద్ద సినిమా చిన్న సినిమా అని చూడకుండా ఆనందం కోసమే పని చేశాను. ఆనందం కోసం పని చేయాలన్న నా వృత్తి లక్ష్యం మారలేదు. మనం రాసిన సినిమా మార్కెట్లో బాగాపోతే మరిన్ని ఆఫర్స్ వస్తాయి. అలా సక్సెస్ ఇచ్చినందుకు ఆనందంగా వుంటాం. ఆ ఆనందం మరింత బాగా పని చేసి ఇంకో సక్సెస్ ఇవ్వడానికి దోహదం చేస్తుంది. కనుక ఆనందం పొందడమే నా మారని లక్ష్యం. మిగిలినవి వాటికవే జరిగిపోతాయి.

సక్సెస్ నిజంగా మంచి ఆనందాన్నిస్తుంది. అయితే మంచి రివ్యూలు పొంది, ప్రేక్షకుల మెప్పు కూడా పొందితే అది మెరుగైన ఆనందమవుతుంది. ఒక్కోసారి ఇవి విలోమంగా పనిచేస్తాయి. మంచి రివ్యూలు పొందినంత మాత్రాన కొన్ని సినిమాలు సక్సెస్ కావు. ప్రేక్షకులు తిప్పికొడతారు. చెడ్డ రివ్యూలొచ్చిన సినిమాలు సక్సెస్ అవుతూంటాయి. ఒక్కోసారి మనం రాసిన చెడ్డ సినిమా కూడా సక్సెస్ అయినందుకూ ఆనందించక తప్పదు.

స్నేక్ ఐస్‌ రైటింగ్ గురించి చెప్పండి.

దర్శకుడు బ్రియాన్ డి పల్మా నేనూ చాలా సంవత్సరాలుగా స్నేహితులుగా వున్నాం. ఇది మా కాంబినేషన్లో వచ్చిన మూడో సినిమా (మొదటి రెండు మిషన్ ఇంపాసిబుల్, కార్లితోటోస్ వే) స్నేక్ ఐ ఐడియాతో రెండేళ్ళూ తర్జన భర్జన పడి ఫైనల్ చేశాం. స్క్రిప్ట్ చాలా వరకూ పూర్తయిందని మేము భావించే వరకూ ఫైనాన్సింగ్ కోసం ప్రయత్నించ లేదు. స్క్రిప్ట్ సమస్యల్ని ప్రైవేట్‌గా పరిష్కరించుకోవడం మేలని నేననుకుంటాను. ఎందుకంటే స్క్రిప్ట్ సమస్యల్ని పరిష్కరించడంలో సహాయపడటానికి చాలా మంది వ్యక్తులు వుంటారు. కానీ స్క్రిప్ట్ సమస్యలకి పరిష్కారం, ఉత్తమ స్క్రిప్ట్ లూ ఎల్లప్పుడూ గదిలో అతి తక్కువ మంది వ్యక్తుల నుంచే వస్తాయి.

రీరైటింగ్ చేస్తే కూడా ఇంతేనా? రీరైటింగ్ మీద ఎంత ఎక్కువ మంది పని చేస్తే అంత దిగజారుతుందా?
మరింత దిగజారి పోతుంది, లేదా రూపం మారిపోతుంది. స్క్రీన్ ప్లేలో స్టోరీ ఐడియా మూడవ లేదా నాల్గవ డ్రాఫ్టుకల్లా ఫలవంత మవుతుందని నేను నమ్ముతాను. ఇంకా బెటర్ మెంట్ కి పూనుకుంటే అది పరిధి దాటడ మవుతుంది. ఐడియా అభివృద్ధికి కూడా పరిమితి వుంటుంది. అదే పనిగా దాంతో ఆడుకో కూడదు.

మిషన్ ఇంపాసిబుల్ కి మీరు రీ రైటింగ్ వర్క్ చేశారు కదా, అదెలా జరిగింది?
దర్శకుడు బ్రియాన్ డీ పల్మా రచయిత స్టీవ్ జలియన్ ఒక ట్రీట్మెంట్ పూర్తిచేశాక జలియన్ వేరే కమిట్ మెంట్ కి వెళ్ళిపోయారు. అప్పుడు నేను టేకప్  చేసి బ్రియాన్ తో కలిసి ట్రీట్మెంట్ రీ రైట్ చేశాను. ఐదారు డ్రాఫ్టులు రాశాక వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేసరికి వేరే రచయితలు దానిమీద వర్క్ చేసి వెళ్ళారు. మళ్ళీ నేను కొన్ని వారాల పాటు రీ రైట్ చేశాను.  

మిషన్ ఇంపాసిబుల్ తో మీ వర్కుకి, జురాసిక్ పార్క్ తో  మీ వర్క్ ఎలా భిన్నం?
మిషన్ ఇంపాసిబుల్ రైటింగ్ ని ట్రీట్మెంట్ నుంచి చేపడితే, జురాసిక్ పార్క్ ని నవలని తీసుకుని ట్రీట్మెంట్ ప్రారంభించాను. జురాసిక్ పార్క్ అప్పటికే ప్రాచుర్యం పొందిన నవల, సిద్ధంగా వున్న కథ. ఇంకా కొత్తగా ఆలోచించాల్సింది లేదు. కనుక ఆ వర్క్ ని నేను అంతగా ఎంజాయ్ చేయలేదు. మిషన్ ఇంపాసిబుల్ దర్శకత్వం బ్రహ్మాండంగా వుంటుంది. కానీ కథని ఫాలో అవడానికి ప్రేక్షకులు ఇబ్బంది పడ్డారు. ఎక్కువ మంది రచయితలతో ఇదే జరుగుతుంది. వేర్వేరు రచయితలు రాసిన పేజీల్ని పేక ముక్కల్లా కలిపి ఉత్తమమైన ఫలితం పొంద గలమనుకుంటే ఇంతే జరుగుతుంది.


మీరు మొదటి డ్రాఫ్ట్ రాయడానికి కూర్చున్నప్పుడు స్ట్రక్చర్ తో మీరెంత  స్పృహతో వుంటారు?  మీదగ్గర కేవలం ఐడియా మాత్రమే వున్నప్పుడు కొత్త స్క్రిప్టుకి స్టేజ్ వన్ నుంచి ఎలా అప్రోచ్ అవుతారు?
స్ట్రక్చర్ తో తీవ్ర స్పృహతోనే  వుంటాను. మొదట ఐడియా పొదిగే దశ. ఎంతకాలం పడితే అంత కాలం ఐడియాని పొదగ నిస్తాను. అది మొలకేసి నప్పుడు మనసులో ఓ మూల పడేసుకుంటాను. అప్పుడు రీసెర్చి మొదలెడతాను. రీసెర్చి దశలో పాత్రల్ని రూపొందించుకుంటాను. అంతా పూర్తయ్యాక, సీరియస్ గా కూర్చుని ఇండెక్స్ కార్డుల మీద ఔట్ లైన్ పని ప్రారంభిస్తాను.

సాధారణంగా సీన్ కార్డ్స్ వాడతాను. పానిక్ రూమ్ విషయంలో ఎప్పుడూ చేయని విధంగా నేరుగా ట్రీట్మెంట్ చేపట్టాను. ఇది ముప్ఫై పేజీలు వచ్చింది. ఇందులో కథ వచ్చేసింది. ఈ ట్రీట్మెంట్ తో స్క్రిప్ట్ రాశాను. ఇది నేను బాగా ఇష్టపడ్డ రచనా ప్రక్రియ. రెండేళ్ళుగా నలుగుతున్న ఐడియాని నేరుగా ట్రీట్మెంట్ రాసేశా. రెండు నెలలు ట్రీట్మెంట్ మీద వర్క్ చేసి, రెండు వారాల్లో స్క్రిప్టు రాశా. ఇది ఫస్ట్ డ్రాఫ్ట్. దీన్ని ఏడాదిన్నర పాటు రీ రైట్ చేశా.

ఇలాటి మూవీస్ కి ఫస్ట్ డ్రాఫ్ట్స్ ఫాస్టుగా రాసెయ్యా లనుకుంటాను. ఎందుకంటే ఫోకస్ కోల్పోయే ప్రమాదముంటుంది. ఈ కథ విషయంలో నాకు నేను చాలా ఈస్థటిక్ హద్దులు విధించుకున్నాను. కథంతా సింగిల్ లొకేషన్ లో పూర్తి చేయవచ్చేమో చూడాలనుకున్నాను. పైగా డైలాగుల్లేకుండా. ఫస్ట్ డ్రాఫ్ట్ లోనే సింగిల్ లొకేషన్ కంటెంట్ ని సాధించాను. ప్రారంభంలో న్యూయార్క్ వీధుల్లో కాస్త ఎక్స్ పొజిషన్ వుంటుంది. మళ్ళీ చివర్లో న్యూయార్క్ వీధుల్లో ముగింపు సీనుంటుంది. ఇవి తప్పించి 96% కథ సింగిల్ లొకేషన్లోనే. అయితే డైలాగుల్లేక పోవడం వెంటనే కృత్రిమంగా తోచింది. మొదటి ఇరవై  పేజీలు ఏదో వొక పాత్ర ఏదో వొకటి మాట్లాడకుండా వుంటే ముందుకెళ్ళ లేకపోయాను!

విజువల్ ఎఫెక్ట్స్ సినిమాలు హాలీవుడ్‌లో స్క్రీన్ రైటర్‌ ని తక్కువ గుర్తింపు గల పాత్రలోకి నెట్టివేస్తున్నాయని మీరు గతంలోనే చెప్పారు. ఈ ధోరణికి వ్యతిరేకంగా పోరాడటానికి రచయితలు ఏమి చేయగలరని మీరు అనుకుంటున్నారు?
రచయితలు వొరిజినల్ కంటెట్ సృష్టిలో ఎక్కువ ఆర్గానిక్ గా వుండాలి. టర్మినేటర్ 2, జురాసిక్ పార్క్ లు విడుదలైనప్పుడు అవి జాజ్ సింగర్ టెక్నో మ్యూజిక్ ఆల్బమ్ లా సంచలనం సృష్టించాయి. ప్రేక్షకుల్ని, మేకర్స్ నీ సమ్మోహనపర్చే సరికొత్త యుగపు సినిమాటిక్ టూల్ ని అవి మోసుకొచ్చాయి. ఈ టూల్ తో మొదట వచ్చిన సినిమాలన్నీ పోర్న్ లాంటివి.

పోర్న్ లాంటివా? అంటే మీ ఉద్దేశం?

ఏదైనా కొత్త సాంకేతికంతో మొదటి అప్లికేషన్ ఎల్లప్పుడూ అశ్లీలంగానే వుంటుంది. ఇంటర్నెట్‌లోని పోర్నో సైట్‌ల వంటిది. ఏదైనా కొత్తది వచ్చినప్పుడు, అది కొత్త ఆట బొమ్మ కాబట్టి దాని మొదటి అప్లికేషన్ ఎల్లప్పుడూ బేస్‌గా వుంటుంది. దాంతో నగరం పేలిపోయేలా చేయగలమో లేదో చూడాలన్పిస్తుంది. సుడిగాలుల్ని సృష్టించ గలమా? అగ్నిపర్వతాల్ని తయారు చేయగలమా? దాంతో ఈ విధమైన ఆకర్షణ వుంది కాబట్టి దాన్ని ప్రయత్నించడం సరే, ఆ చలనచిత్రాలు వాటి మార్గంలో సంతృప్తికరంగానే వుంటాయి. ఎందుకంటే, వీటిని డిజిటల్ ఎఫెక్ట్ ఇచ్చే కిక్ కోసం చూస్తారు. ఈ రకమైన టూల్ తో డీల్ చేస్తున్నప్పుడు ఇక సినిమాల్ని  రచయితల మాధ్యమం అని పిలవాల్సిన అవసరం లేదు. టెక్నీషియన్స్ మీడియం అవుతుంది. తెర మీద సాంకేతిక మాయాజాలంతో పోటీ పాడడానికి రచయిత దగ్గరుండే సాధనాలు చాలా పరిమితమైనవి.

హాలీవుడ్ మూవీ మేకింగ్ లో క్లాసిక్ మోడల్ అనేది గొప్ప బ్యాక్ స్టోరీతో, బ్రహ్మాండమైన కథా నేపథ్యంతో వుంటూ, పాత్రల మీద టైట్ ఫోకస్ పెట్టి రూపొందించడం కదా? ఇలాటి కథా సృష్టుల మీద కదా దృష్టి పెట్టాల్సింది రచయితలు?
అవును, అదొక మోడలే. ఆ మోడల్‌తో సినిమా రాయడం నేనూహించగలను. కానీ మరొక మోడల్ ఏమిటంటే, ఈ టెక్నాలజీ అనే కొత్త ఆట బొమ్మతో ఇంకా ఏ వికృత స్థాయికి సినిమాల్ని తీసుకుపోగలమో చూడాలనుకుంటున్నాం. ఇందులో మీరు చెప్పినవన్నీ వుంటాయి. బ్యాక్ స్టోరీ, బ్రహ్మాండమైన కథా నేపథ్యం, బలమైన పాత్రలూ అన్నీ వుంటాయి. అనుభూతి మాత్రం వుండదు, వినోదమే వుంటుంది. ఇది కూడా ఒక మోడలే చాలా ఎత్తుకు వెళ్ళి విరిగి పడే దాకా.

మీరు స్పెషల్ ఎఫెక్ట్స్ మూవీస్  రాయడంలో రచయితలు ప్రేక్షకుల్ని మరింత దృష్టిలో వుంచుకుని రాయాలని ఒకసారి చెప్పారు?
నేను చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే, మూవీస్ కి చాలా విభిన్నమైన నమూనాలు వున్నాయి. ప్రేక్షకులు వివిధ రకాల మూవీస్ ని వీక్షిస్తారు. విభిన్న రకాల మూవీస్ లో ఎప్పటికప్పుడు విభిన్న రకాల అనుభవాలని పొందాలని వెళతారు. ఇలాంటప్పుడు రచయితలు కథ చెప్పడం కోసం, కథా నిర్మాణం కోసం, ఒకే చట్రపు నమూనాని ప్రేక్షకుల మీద రుద్దితే, అది రచయితల పిడివాదంతో బాటు వెర్రితనంగానూ తోస్తుంది. ఇది ప్రేక్షకుల్ని దృష్టిలో వుంచుకుని రాయడం కాజాలదు.

కొన్నిసార్లు ప్రేక్షకులు ప్రచండ సుడిగాలి గ్రామాల్ని చుట్టి అతలాకుతలం చేయడాన్ని చూసేందుకు సినిమాల కెళ్తారు. అందులోని నటీ నటుల్ని పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే బయట ఎండ మండి పోతూంటే ఏర్ కండిషన్లో థియేటర్లో కూర్చుని కాసేపు సేద దీరాలి. ఇది కూడా ఒక రకమైన మూవీ మేకింగే. ఇందులో ఎవరికీ ఏ ఆస్కార్ అవార్డూ రాదు. ఎవరి జీవితాన్నీ మార్చేలా చేయదు. ఇవి కూడా సినిమాలే. ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ మాటల్లో చెప్పాలంటే కేవలం సినిమాలు.

కొత్త రకం బి గ్రేడ్ సినిమాలు.
ఔను. బి గ్రేడ్ సినిమాలు తప్పు కాదు. చిన్నతనంలో మన చాలా మధుర జ్నాపకాలు బి గ్రేడ్ సినిమాల తోనే వుంటాయి. అయితే ఈ బి గ్రేడ్ మూవీస్ తో రియల్ డేంజర్ కూడా వుంది. సక్సెస్ కాని బి గ్రేడ్ మూవీస్ ని చూస్తే, వాటి మేకర్లు వాటిలోని మెటీరీయల్ కంటే తాము అధికులమని భావించుకుంటున్నట్టు కన్పిస్తుంది. లేదా మెటీరీయల్ ని ఎలివేట్ చేయబోతే అది ప్రతిఘటించినట్టు కన్పిస్తుంది. దీనికంటే ఆ అధమ స్థాయి మెటీరియల్లోనే పడి దొర్లడం మేలన్పిస్తుంది. ఇది కూడా పాపులర్ కళే. ఆస్కార్ వైల్డ్ అంటాడు- ఎవరైనా గొప్ప కళ కోసం ప్రయత్నించడం చాలా పనికిమాలిన పని చేస్తున్నారనడానికి ఖచ్చితమైన సంకేతమని!

స్క్రీన్ రైటర్‌లందరూ దర్శకులేననీ, లేదా కనీసం దర్శకులు కావాలనుకుంటున్న ఆశావహులనీ  మీరు చెప్పారు. కానీ చాలా మంది మంచి స్క్రీన్ రైటర్‌లు దర్శకత్వం వైపు అడుగులు వేసి తమని తాము తుద ముట్టించుకో లేదా?

కొందరు దర్శకత్వం చేశారు. కానీ దర్శకత్వం ప్రయత్నించి స్క్రీన్ రైటింగ్ కెరీర్‌ ని నాశనం చేసుకున్నారని నాకు తెలియదు. దర్శకత్వం వహించడం చాలా కష్టమైనది. అది పూర్తిగా వేరే జోన్. కొంతమంది స్క్రీన్ రైటర్లు దీన్ని బాగా నిర్వహిస్తారు, కొంత మంది నిర్వహించరు. మరి కొందరు ఫుల్ టైమ్ డైరెక్టర్లుగా బాగా చేస్తారు, కొందరు చేయరు. నా ఉద్దేశం  ఏమిటంటే- ఒక రైటర్ తాను రాసిన స్క్రిప్టుని మరొకరు దర్శకత్వం వహించడాన్ని చూడలేడు. తాను చేయగల్గిన దానికంటే బాగా చేసినప్పటికీ సంతృప్తి చెందడు. తనది నాసిరకం వెర్షన్‌ అయినా సరే దాన్నే ఇష్టపడతాడు. ఎందుకంటే ఆ ఇమేజి మనసులో ముద్రించుకుని వుంటుంది.

ఉదాహరణకు నా విషయమే తీసుకోండి-  స్నేక్ ఐస్‌ తో దర్శకుడు బ్రియాన్ డీ పల్మా నేనూ చాలా ఫ్రెండ్లీ పాయింటుకి చేరుకున్నాం. నేను సెట్ లో వుండడం మా ఇద్దరికీ ఇష్టం లేదని ఇద్దరమూ తెలుసుకున్నాం. ఇక నేను సెట్ లో వుండడం బాగా తగ్గించేశాను. స్క్రిప్ట్ సమస్య ఏదైనా వస్తే వెళ్ళేవాడిని, దాన్ని చర్చించి వచ్చేసే వాడ్ని. అతను సీన్ షూట్ చేస్తున్నప్పుడు నేను చూస్తే దటీజ్ రాంగ్ అన్పించేది. అతను నా కళ్ళతో సీనుని చూసేందుకు ప్రయత్నించి నెర్వస్ అయ్యేవాడు. నేనక్కడ లేకపోతే ఇద్దరికీ టెన్షన్ వుండేది కాదు. రచయిత వేరొకరు పూర్తిగా పునర్నిర్వచించబోయే దాన్ని రాసి అందిస్తాడు. అతను స్క్రీన్ ప్లే కే రచయిత, సినిమాకి కాదు. స్క్రీన్‌ప్లే అనేది సగం పూర్తయిన పని, మిగతా పని దర్శకుడు పూర్తి చేయడానికి ప్రతిపాదన. స్క్రీన్‌ప్లేలని ఆనందం కోసం చదువుతారని అనుకోను. టార్చర్ పెట్టుకోవడానికి చదువుతారు. కాబట్టి ఇది నిజంగా ఒక కళారూపం కాదు, కళారూపంలో భాగం.

మీరు 1996లో ది ట్రిగ్గర్ ఎఫెక్ట్ తో దర్శకుడుగా మారారు. ఆ స్క్రిప్టు అంతగా ప్రేరేపించిందా?
అది నా చాలా పర్సనల్ స్క్రిప్టు. నా మొదటి సినిమాని నేను ఒక్కసారి మాత్రమే బాగా తీయగలను. తీయకపోతే రెండోది తీయలేను. నా వృత్తిని నేను దీన్ని క్రమబద్ధీకరించగల సమయం ఆసన్నమైందని ఇది చేపట్టాను.

స్క్రిప్ట్ రాసేటప్పుడు, మీరు మీ సమయాన్ని ఎంత స్టయిల్‌ పై,  ఎంత సన్నివేశపు కంటెంట్‌ పై వెచ్చిస్తారు? ఓ చదవగలిగే చిత్తుప్రతి తయారయ్యే వరకూ?

రైటింగ్ అంతా కంటెంట్ గురించే. స్టయిల్ అనేది ఆ కంటెంట్ ని వ్యక్తీకరించే మార్గం మాత్రమే. నేను మీతో మాట్లాడే విధంగానే మాట్లాడతాను. కొన్ని అభివ్యక్తుల్ని, కొన్ని జోక్స్ నీ ఉపయోగిస్తాను. కొన్ని చోట్ల తడబడతాను. ఇలా వాచికంగా నన్ను నేను అభివ్యక్తీ కరించుకుంటాను. ఇదే నా స్క్రిప్టుల్లో స్టయిల్ గా వ్యక్తమవుతుంది.

సన్నివేశపు కంటెంట్‌కి సరిపోయే రచనా శైలిని ఉపయోగించడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి అది యాక్షన్ సన్నివేశమైతే, దాన్ని ఆపుతూ వరుసగా నాలుగు ఐదు-వాక్యాల పేరాగ్రాఫ్‌లతో యాక్షన్ని రాయకుండా వుంటే, అది యాక్షన్ లాగా చదువుకోవడానికి వీలుంటుంది. స్క్రీన్ ప్లేలు చాలా అన్నేచురల్ గా వుంటాయి. అవి చదవడం చాలా కష్టం. బుర్ర తిరుగుడుగా వుంటాయి. అర్ధమయ్యేలా రాయడానికి చేయవలసిందంతా చేయాలి. చాలా శ్రమతో కూడుకున్నది, కఠినమైనది.

చాలా మంది రచయితలు తమ స్క్రిప్టుల్లో స్వగతాన్ని అతిగా ఉపయోగిస్తున్నారు. అవి ఎప్పుడు వుండాలో, ఎప్పుడు కూడదో  నిర్ణయించడంలో మీరుపయోగించే నియమాలు ఏమైనా వున్నాయా?
స్వగతం పాత్ర తనలో తాను మాట్లాడుకునేదిగా కాకుండా ప్రేక్షకుల్ని ఉద్దేశించి వుంటే ప్రేక్షకులు సీన్లో ఇన్వాల్వ్ అవుతారు. ఉదాహరణకి, స్నేక్ ఐ ప్రారంభ సీనులో హీరో డ్రగ్ డీలర్ ని వెంటాడుతూంటాడు. అప్పుడు పారిపోతున్న డ్రగ్ డీలర్ వీడు పోలీసా?’ అంటాడు. ఇది ప్రేక్షకుల్ని అడుగుతున్నట్టు వుంటుంది. స్వగతం అనే డివైస్ కిది మేలైన ప్రక్రియ అనుకుంటాను. ప్రేక్షకులతో మాట్లాడే ఈ పోస్ట్ మోడర్న్ స్వగతం దృశ్యాన్ని ఎలివేట్ చేస్తుంది. వీడు పోలీసా?’ అని అనుకున్నప్పుడు, హీరో పోలీసే అని ఇప్పుడే ప్రేక్షకులకి తెలిస్తే, సీను ఇంకా చైతన్య వంతమవుతుంది.

మీ కథలు ఒకదానికొకటి భిన్నంగా వుంటున్నాయి. మీరు వివిధ జానర్స్ ని ప్రయత్నించా లనుకుంటున్నారా?

అవును! నేను ఇప్పుడు ఎక్కువగా స్పెక్స్ (స్పెక్యులేటివ్ స్క్రీన్ ప్లే - ఎప్పుడైనా అమ్ముడు పోవచ్చని రాసి పెట్టుకోవడం) రాస్తున్నాను. దీంతో వివిధ జానర్స్ రాస్తూ వుండడం వల్ల మూసలోంచి బయటికొచ్చే మంచి జరుగుతుంది. హాలీవుడ్ లో ఒక రచయిత రాసే దానికి భిన్నమైన ఆఫర్ ఇవ్వరు. రాస్తున్నటువంటిదే ఇంకోటి ఇస్తారు. కాబట్టి ఈ మూసలోంచి బయటపడాలంటే సొంతంగా భిన్నమైనవి రాసుకోవడం చేయాలి.

దర్శకత్వం రచయితగా మీపై ఎలాటి ప్రభావం చూపింది? సెట్స్ పై మీరు దర్శకత్వం వహిస్తూంటే ఎవరు ఇది రాసింది?’ అని ఎప్పుడైనా అన్పించిందా?
అన్పించింది... దర్శకత్వం చేసే వేడిలో వున్నప్పుడు కొన్ని ఎందుకు రాశామో, ఎందుకు నిర్ణయించామో మర్చిపోవడం సులభం.  కానీ రచయిత దర్శకత్వం వహిస్తే జరిగే మంచి ఏమిటంటే విషయాల్ని విజువల్ గా చెప్పడం ఎంత ముఖ్యమో తెలుస్తుంది. భాషతో చెప్పడం కన్నా బొమ్మతో చెప్పడం పది రెట్లు మెరుగ్గా వుంటుందని తెలుస్తుంది. ఏదైనా సెటప్ దృశ్యమానంగానె  వుండాలి. ఒక ముఖ్యమైన సెటప్ తప్పనిసరిగా విజువల్ కాంపోనెంట్‌ ని కలిగి ఉండాలి.

గొప్ప స్క్రీన్‌ప్లే లేకుండా గొప్ప సినిమా సాధ్యమేనా?
ఎలా సాధ్యమో నాకు తెలీదు. తరచుగా రివ్యూవర్లు వాళ్ళేం చూస్తున్నారో వాళ్ళకి తెలియకుండా రివ్యూలు రాసేస్తూంటారు. ఈ దర్శకుడు, నటీనటులు బాగా కష్ట పడి బ్యాడ్ గా వున్న స్క్రిప్టుని అధిగమించారు - అని రాస్తూంటారు. కమాన్! వాళ్ళు అంత బాగా కష్టపడిన విషయాలు స్క్రిప్టులోనే వుంటాయి! వాళ్ళు పేలవంగా చేస్తే ఆ స్క్రిప్టు పేలవంగానే వుండొచ్చు. క్లాసిక్ సినిమాని తీసుకుంటే - ఈటీ ని చూద్దాం. స్టీవెన్ స్పీల్‌బర్గ్ టాప్ లో, శిఖరాగ్రంలో వున్న కాలమది. రచయిత్రి మెలిస్సా మాథిస్ కూడా టాప్ లోనే వుంది. ఆ ఐడియాతో తానే అద్భుతంగా స్క్రీన్ ప్లే రాసింది. సంగీత దర్శకుడు జాన్ విలియం కూడా టాప్ లో వున్నాడు. ఆ కథలోంచి విడదీయ రాని స్వరాలు కూర్చాడు. ఛాయాగ్రాహకుడూ స్పెషల్ ఎఫెక్ట్స్ నిపుణులూ మాంచి పీక్ లో వున్నారు. బాల నటుడు కూడా. ప్రతీఒక్కరూ పీక్ లో వుండి  ఈటీ అనే అద్భుత క్లాసిక్ నివ్వగలిగారు. ఎవరైనా గొప్ప స్క్రీన్ ప్లే నుంచే స్ఫూర్తి పొందుతారు, తమ శక్తిని ధారబోయడానికి ఉద్యుక్తులవుతారు.  

——ఏజెన్సీస్