రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

9, డిసెంబర్ 2016, శుక్రవారం

రివ్యూ!

స్క్రీన్ ప్లే- దర్శకత్వం : సురేంద్ర  రెడ్డి
తారాగణం : రాం చరణ్, రకుల్ ప్రీత్ సింగ్, అరవింద్ స్వామి. పోసాని కృష్ణ మురళి తదితరులు
కథ : మోహన్ రాజా ( ‘తని ఒరువన్’ తమిళ కథ) మాటలు : వేమా రెడ్డి,  సంగీతం : హిప్ హాప్ తమిళ, ఛాయాగ్రహణం : పీఎస్ వినోద్
బ్యానర్ : గీతా ఆర్ట్స్
నిర్మాతలు : అల్లు అరవింద్, ఎన్వీ ప్రసాద్
 
విడుదల: 9 డిసెంబర్,2016
***
       గోవిందుడు అందరి వాడేలే,  బ్రూస్ లీ లవంటి రెండు వరస పరాజయాలతో సందిగ్ధంలో పడ్డ రాం చరణ్ తమిళ రీమేక్ ‘తని ఒరువన్’ ని ఆశ్రయించాడు. ఈ మధ్య పరాజయాల్లో వున్న కొందరు స్టార్స్ ని రీమేకులే కాపాడినట్టు, రాం చరణ్ ని కూడా ఇదే కాపాడాలి. దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా కిక్ -2 పరాజయం నుంచి ఈ రిమేక్ తో రింగులోకి రావాలని ప్రయత్నించాడు. గీతా ఆర్ట్స్ హంగూ ఆర్భాటాలని కూడా కలుపుకుని మొత్తానికి ‘ధృవ’  విడుదలయ్యింది. ఇదెలా వుందో ఈ కింద చూద్దాం.
కథ 
        ధృవ (రాం చరణ్)  ఒక ఐపీఎస్ ఆఫీసర్. తోటి యువ ఐపీఎస్ లతో ఒక లక్ష్యం పెట్టుకుంటాడు. ఐపీఎస్ ట్రైనీగా వున్నప్పుడు నగరంలో జరుగుతున్న కొన్ని నేరాల్ని గమనిస్తూంటాడు. ఈ చిన్న చిన్న నేరాల వెనుక కొన్ని పెద్ద నేరాలని దాచే కుట్ర సాగుతోందని పసిగడతాడు. ఈ పెద్ద నేరాలు చేసే ఘరానా వ్యక్తులు పదిహేను మంది వున్నారని తెలుసుకుంటాడు. వీళ్ళల్లో ఎవర్ని పట్టుకుంటే వీళ్ళ కింద పనిచేస్తున్న వంద నేరగాళ్ళు క్లోజ్ అవుతారో వాళ్ళని కనిపెట్టాలనుకున్నప్పుడు, ఓ ముగ్గురు ఘరానా పెద్ద మనుషుల వెనుక  సిద్ధార్థ్ ( అరవింద్ స్వామి) అనే సైంటిస్టు వున్నాడని అర్ధమవుతుంది. ఇతన్ని టార్గెట్ చేస్తాడు. ప్రభుత్వం తీసుకు రావాలనుకుంటున్న చవక ధరల జెనెరిక్ మందుల్ని అడ్డుకుని మెడికల్ మాఫియా ని కొనసాగించుకోవాలని సిద్ధార్థ్ చూస్తూంటాడు. దీనికి ధృవ  బీటలు కొట్టడం మొదలెడతాడు. ఇది గమనించిన సిద్ధార్థ్ ఒక కాల్పుల సంఘటనలో గాయపడ్డ ధృవ  శరీరంలోకి  మైక్రో చిప్ ని పెట్టించి అతడి కదలికల్ని, మాటల్నీ గ్రహిస్తూంటాడు. ధృవకి ఆప్తులైన వాళ్ళని టార్గెట్ చేసి ధృవని  బలహీన పర్చాలని చూస్తూంటాడు. ఈ పోరాటంలో చివరికి ఎవరిది, ఎలా పైచేయి అయ్యిందన్నదే మిగతా కథ.
ఎలావుంది కథ 
       ఒరిజినల్ కి ట్రూ కాపీ, అక్కడక్కడ చాలా స్వల్ప మార్పులు తప్పితే. ఇదొక మైండ్ గేమ్ తో కూడిన కథ అన్నారు. ఈ మైండ్ గేమ్ లో, మొత్తం కథా కథనాల్లో,  ఒరిజినల్లో వున్న సవాలక్ష తప్పులే దొర్లాయి. ఈ తప్పులతోనే తమిళంలో ఇలాగే హిట్టయింది కాబట్టి, ఆ సెంటిమెంటు పెట్టుకుని అలాగే తీసేశారు. ప్రేక్షకులందరూ తమ జీవితాల్లో అనుభవంలోకి రాని మైండ్ గేమ్స్ నీ, ఇతర ఇంటలెక్చువల్ అంశాలనీ తెలుసుకోగలిగే ఎక్స్ పర్ట్స్ కాలేరు కాబట్టి,  పైపైన యాక్షన్ చూసేసి ఇదే  చాలనుకోవచ్చు.  అయితే జయం రవితో తమిళ ప్రేక్షకులు వేరు, రాం చరణ్ తో తెలుగు ప్రేక్షకులు వేరు. జయం రవి,  రాం చరణ్ అంత పెద్ద స్టార్ కాదు. తమిళంలో  ఒక  స్టార్ డమ్, దాంతో వుండే అంచనాలూ వంటి ఏ బాదరబందీ లేకుండా ఒక న్యూవేవ్ థ్రిల్లర్ లాగా వచ్చి విజయం సాధించింది. తెలుగులో స్టార్ డమ్, దాంతో అంచనాలూ రెండూ వుంటాయి కాబట్టి,  అలాటి కమర్షియల్ మసాలాలూ లేని ఈ కథ ని ఒక సీరియస్ యాక్షన్ గా సిద్ధపడి చూడాల్సి వుంటుంది.
ఎవరెలా చేశారు 
        రాం చరణ్ చేయడానికి ఈ సినిమాలో ఒక సూపర్ ఎమోషన్ అంటూ, బాధ అంటూ లేదు. యాక్షన్ హీరోగా మాత్రమే చేసుకుంటూ పోతూ కన్పిస్తాడు. క్యారక్టర్ కి ఔటర్ యాక్షనే తప్ప, తన లాంటి స్టార్ తో  ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యే ఇన్నర్ యాక్షన్ లోపించడంతో ప్రేక్షకుల్ని అంతగా  సమ్మోహితుల్ని చేసే నటన కనపడదు. తనతో వుండే కామెడీ, అల్లరి. అలాటి పాటలూ వుండవు. క్లయిమాక్స్ కూడా ఏమాత్రం యాక్షన్ లేకుండానే ముగిసిపోవడం ఒక మైనస్సే. పైన చెప్పుకున్నట్టు జయం రవి స్థాయికి కి సరిపోయిన పాత్ర రాం చరణ్ కి చాల్లేదని కచ్చితంగా చెప్పాలి.
     ఇక హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కి తమిళం ఒరిజినల్లో  నయన తారకి లాగే పెద్దగా పాత్రలేదు. ప్రేమ కోసం వెంటపడే, పాటలు పాడే అవసరాలకి పనికొచ్చే గ్లామర్ బొమ్మ పాత్రగా వుండిపోతుంది. విలన్  గా వేసిన అరవింద్ స్వామి తమిళంతో తను వేసిన పాత్రకి డిటోనే. తమిళం చూడని ప్రేక్షకులకి కొత్తగా అన్పిస్తాడు. 
       టెక్నికల్ గా సినిమాతో వచ్చిన పెద్ద ఇబ్బంది ఏమిటంటే, హిప్ హాప్ తమిళ అనే కొత్తగా వస్తున్న సంగీత దర్శకుడి గందరగోళం గోల! ఎక్కడా ఒక్క నిమిషం కూడా తెరిపి నివ్వకుండా, చెవిపోటు వచ్చే  హారిబుల్ నేపధ్య సంగీతాన్ని వాయించేశాడు. అసలే కథా కథనాలు, సన్నివేశాలూ ప్రేక్షకులు బాగా బుర్ర పెట్టి ఆలోచిస్తూ చూడాల్సిన హైటెక్ –కొన్ని చోట్ల సైంటిఫిక్ మైండ్ గేమ్  అయితే, అలాటి ఏకాగ్రతకి అవకాశమే ఇవ్వకుండా  ఇష్టమొచ్చిన శబ్ద కాలుష్యాన్ని సృష్టిస్తూ థ్రిల్ ని చంపేశాడు. కనీసం ఏ కీలక డైలాగు దగ్గర తన హోరు ఆపితే ఆ డైలాగు ఎఫెక్టివ్ గా వుంటుందో కూడా తెలీనట్టు తలనొప్పి పుట్టించి వదిలాడు. దర్శకుడు సురేందర్ రెడ్డి దీనికి ఎందుకు అంగీకరించినట్టో తెలీదు. ఇక పాటలు ఘోరం. ఒక్క ఎస్ వినోద్ కెమెరా వర్క్ మాత్రం ఫర్వాలేదు. కానీ ఎంత స్టయిలిష్ చిత్రీకరణ వుండీ ఏం లాభం సంగీత దర్శకుడు అలావుంటే? 
చివరికేమిటి 
      ఒక స్టార్ సినిమాతో బి, సి సెంటర్ల ప్రేక్షకులకి అలవాటైన మసాలాలేవీ ఇందులో కన్పించవు. ఈ సినిమాని ఆ ప్రేక్షకులు ఒక మెట్టు పైకెదిగి రాం చరణ్ చేసిన ఒక డిఫరెంట్ ప్రయత్నంగా తీసుకుని చూడాలి. అయితే విషయం గ్రహించడానికి కష్టపడాల్సిన ఈ హైటెక్-సైంటిఫిక్  మైండ్ గేమ్స్ కంటెంట్ ని దెబ్బకొట్టే,  హిప్ హాప్ తమిళ సంకట సంకర సంకీర్ణ  సంగీతాన్ని గట్టిగా  కాచుకోవాల్సి వుంటుంది. ఎప్పుడు ఉండుండి ఏ విచిత్రమైన ట్యూన్లు వాయిస్తాడో తెలీదు. దాంతో ఈ ట్యూనేమిట్రా దేవుడా అని దృష్టి సీన్ల మీంచి చెదిరి ఆ ట్యూన్ల మీదికి పోతుంది. అతి పెద్ద విలన్ ఈ సినిమాకి హిప్పు హాప్పుల సంగీత దర్శకుడే. జీవితంలో కొట్టాల్సిన సంగీత పరికరాలన్నీ తెచ్చి కొట్టి పారేశాడు. ఇతణ్ణి ఒక్క సీనులోనైనా ఆ పరికరాలతో చూపించి వుంటే బావుండేది.
    
-సికిందర్
http://www.cinemabazaar.in