రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Friday, December 22, 2023

1393 : రివ్యూ

 

రచన : దర్శకత్వం ప్రశాంత్ నీల్
తారాగణం : ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, శృతీ హాసన్, ఈశ్వరీ రావు, శ్రియా రెడ్డి, జగపతి బాబు, బాబీ సింహా, టిన్నూ ఆనంద్ తదితరులు
సంగీతం : రవి బస్రూర్, ఛాయాగ్రహణం : భువన్ గౌడ
బ్యానర్ : హోంబలే ఫిలిమ్స్
నిర్మాత : విజయ్ కిరగందూర్
విడుదల :  డిసెంబర్ 22, 2023
***
       
    ‘బాహుబలి తర్వాత పానిండియా స్టార్ గా సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ వంటి మూడు భారీబడ్జెట్ పానిండియా సినిమాలతో హిట్లు లేక స్ట్రగుల్ చేస్తున్న రెబెల్ స్టార్ ప్రభాస్ తీసుకున్న ఒక నిర్ణయం ఫలించింది. దర్శకుడు ప్రశాంత్ నీల్ తీసిన ఉగ్రం చూసిన ప్రభాస్ ఆఫర్ ఇవ్వడం, ఆ ఆఫర్ తో ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సాలార్ తీయడం ఒకెత్తు అయితే, కేజీఎఫ్ సినిమాలతో టాప్ లో వున్న ప్రశాంత్ మళ్ళీ అలాంటి యాక్షన్ డ్రామా తీయడం పెద్ద చాలెంజీగా మారింది. టీజర్స్, ట్రైలర్స్ విషయంలో ఫ్యాన్స్ నుంచి గట్టి వ్యతిరేకత ఎదుర్కొని, సినిమా విడుదల వాయిదాలు వేస్తూ బెటర్ మెంట్ కోసం చేసిన కృషి ఆసక్తి రేపిందిమరి ఈ కృషి ఫలించిందా? ఫలిస్తే ఏ మేరకు ఫలించింది? ప్రభాస్ కి ఈసారి హిట్టేనా? దాదాపు మూడు సంవత్సరాలుగా రూపొందుతున్న సాలార్ అడ్వాన్సు బుకింగులతో రేపిన తూఫానుతో ప్రేక్షకుల సుదీర్ఘ నిరీక్షణకి న్యాయంచేసే విధంగా వుందా? 

కథ

    ఖాన్సార్ అనే సామ్రాజ్యానికి పాలకుడైన రాజ మన్నార్ (జగపతి బాబు) తన కుమారుడు వరదరాజ మన్నార్‌ (పృథ్వీరాజ్ సుకుమారన్) ని వారసుడిగా ప్రకటించే ఆలోచనతో వుంటాడు. దీంతో సామ్రాజ్యంలో సామంత దొరలు అధికారాన్ని తమ హస్తగతం చేసుకోవడానికి కుతంత్రాలు మొదలు పెడతారు. రాజమన్నార్ సామ్రాజ్యాన్ని వదిలి కొంతకాలం వెళ్ళినప్పుడు తిరుగుబాటు చేస్తారు దొరలు. ఆ దాడి నుంచి వరదరాజ మన్నార్ తప్పించుకుని అసోం పారిపోతాడు. అసోంలో దేవా (ప్రభాస్) తల్లి (ఈశ్వరీ రావు) తో వుంటాడు. తను గని కార్మికుడుగా వుంటే, తల్లి టీచరుగా వుంటుంది. ఇక్కడికి వరదరాజమన్నార్ వచ్చేసి చిన్ననాటి స్నేహితుడైన దేవాని కలుసుకుని సాయం ఆర్ధిస్తాడు. ప్రాణ స్నేహితుడైన వరదరాజ మన్నార్ కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడే దేవా, అతడ్ని ఖాన్సార్ సామ్రాజ్యానికి తిరుగులేని వారసుడుగా చేయడానికి సాలార్ (నాయకుడు) అయి బయల్దేరతాడు.       
       
అసలు దేవా చిన్నప్పుడు ఖాన్సార్ నుంచి ఎందుకు తల్లితో పారిపోయి అసోంలో తలదాచుకున్నాడు
? అతడి జీవితంలోకి ఆద్య (శృతీ హాసన్) ఎలా వచ్చింది? భారత్- పాక్ సరిహద్దులోని ఖాన్సార్ ఆటవీ ప్రాంతం ఓ రాజ్యంగా ఎలా మారింది? దీన్ని శత్రువుల బారినుంచి రక్షించడానికి యూక్రేన్, సైబెరియాలనుంచి వచ్చిన దళాలతో దేవా ఎలా తలపడ్డాడు?... మొదలైన విషయాలు మిగతా కథలో తెలుస్తాయి.

ఎలావుంది కథ

    కేజీఎఫ్ సినిమాల లాగే ముష్కరుల చీకటి ప్రపంచపు క్రూర కథ. కథాంశం సూపర్ హిట్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాగా వుంటుందని ప్రశాంత్ ముందే చెప్పాడు. సింహాసనాన్ని ఆక్రమించుకోవడానికి అనేక సమూహాలు కుతంత్రాలతో పాల్పడే ప్రమాదకరమైన పెద్ద గేమ్ చుట్టూ ప్రధానంగా ఈ కథ వుంది. అయితే హడావిడీగా ముగించేద్దామనే ధోరణిలో కచ్చా పక్కాగా కథ తయారైంది. దీంతో తీసుకున్న గేమ్ తాలూకు డ్రామా, భావోద్వేగాలూ బలహీనంగా మారాయి. యాక్షన్ మాత్రం పీక్ లో వుంది, డ్రామా వీక్ అయింది.
       
పైగా లెక్కలేనన్ని పాత్రలు
, వాటి పేర్లు, సంబంధాలు గుర్తు పెట్టుకుని ఫాలో అవడం పెద్ద చాలెంజీ ప్రేక్షకులకి. వర్తమాన కాలంలో అంటే 2017 లో కథ ప్రారంభమై సెకండాఫ్ లో పూర్వ కాలానికెళ్తుంది. ఫస్టాఫ్ వర్తమానకాలంలో పాత్రల పరిచయాలతో అతి నెమ్మదిగా సాగుతుంది. ఇక్కడ కిడ్నాపైన  శృతీహాసన్ ని ప్రభాస్ కాపాడడం, తల్లితో అతడి సంబంధాలు, విదేశం నుంచి వచ్చిన శృతి నేపథ్యం వగైరాలతో నెమ్మదిగా సాగుతుంది. శృతికీ ప్రభాస్ కీ మధ్య ఎక్కడా రోమాన్స్ వుండదు. మందకొడిగా వున్న  ప్రభాస్ ఇంటర్వెల్ ముందు యాక్షన్ సీన్స్ తో భారీ యెత్తున విశ్వరూపం చూపిస్తాడు. ఇక్కడ్నుంచీ సెకండాఫ్ లో దర్శకుడికి ఇష్టమైన కేజీఎఫ్ ఫార్ములా హీరో ఎలివేషన్ సీన్లే వుంటాయి.
        
సెకండాఫ్ లో కాన్సార్ సామ్రాజ్యపు కథ, దాని మీద సామంత దొరల కుట్రలు, వాళ్ళ కథలు వుంటాయి. ప్రాణ స్నేహితుడి వారసత్వాన్ని నిలబెట్టడంకోసం ప్రభాస్ ఇచ్చే ఎంట్రీతో ఊపందుకుంటుంది. అయితే యాక్షన్ పార్ట్ ప్రారంభమయ్యే వరకూ కథ బలహీనంగానే వుంటుంది. యాక్షన్ ఎపిసోడ్లు ప్రారంభమయ్యాక కథతో పనే లేకుండా పోయింది. పైగా ఎన్నో పాత్రలు, వాటి ఉపకథలూ వుండడంతో చాలా సేపు ప్రభాస్ పక్కకెళ్ళిపోతాడు. రెండు యాక్షన్ ఎపిసోడ్లు మాత్రం హాలీవుడ్ ఉలిక్కిపడేలా వున్నాయి- బాలీవుడ్ సరే!
       
ప్రభాస్ తో ఎమోషనల్ గా కనెక్ట్ అవకపోవడానికి అతడికి జరిగిన అన్యాయం ఏమీ లేదు. స్నేహితుడి కోసం పోరాటం వల్ల అతడి బాధ ప్రేక్షకుల బాధ కాలేకపోయింది. ప్రభాస్ ఎంత నటించినా అది కృతకంగానే వుండిపోయింది. తనకి తగిన అన్యాయం జరిగి
, విధ్వంసానికి తెర లేపితే కథ కరెక్టుగా దారిలో పడేది. ఈ కథ  చివర్లో ఓ సర్ ప్రైజ్ ట్విస్ట్ తో రాబోయే రెండో భాగానికి  రంగం సిద్ధమైంది.

నటనలు- సాంకేతికాలు

     బాహుబలి తర్వాత మళ్ళీ ప్రభాస్ ని ఒక విజయవంతమైన యాక్షన్ హీరోగా చూడడం ఒక ఊరట ఈ సినిమాతో. ఇంతకాలం ప్రభాస్ తో ఈ రేంజి  యాక్షన్ ఎపిసోడ్స్ ని, ఫైట్స్ నీ మిస్ చేసుకున్న ఫ్యాన్స్ కి ఇది పండుగే. క్లయిమాక్స్ యాక్షన్ బ్లాక్ ప్రభాస్ కేకాక, పృథ్వీరాజ్ ఫ్యాన్స్ కీ ఆనందాన్ని కలిగిస్తుంది. ఫస్టాఫ్ లో ప్రభాస్ దేవా పాత్రలో వున్న ప్రశాంతతని  కాపాడుకుంటూయాక్షన్ బ్లాక్స్ లో రైజింగ్ టైగర్ అవడం ఒక వినూత్న ఎలివేషన్.
        
ఇక ఈశ్వరీ రావు, శృతీ హాసన్, శ్రియా రెడ్డి, బాబీ సింహా వంటి చాలా మంది తెలిసిన, ప్రతిభావంతులైన నటులున్నా పాత్రలకి తగిన స్థానం లేక ముద్ర వేయలేకపోయారు. జగపతి బాబు, పృథ్వీ రాజ్ సుకుమారన్ లు మాత్రం ఫర్వాలేదని పించుకుంటారు.
        
సాంకేతికంగా యాక్షన్ ఎపిసోడ్స్ లో క్రియేటివిటీ చెప్పుకోదగ్గది. కేజీఎఫ్ సినిమాల్లో లాగే క్లోజప్ షాట్స్ యాక్షన్ ఎపిసోడ్స్ కి బలాన్నిచ్చాయి. కేజీఎఫ్ సినిమాల్లో లాగే గ్రే కలర్లో మూడీ టోన్ లో దృశ్యాలున్నాయి. కాస్ట్యూమ్స్  పాత్రలకి తగ్గట్టు ముతకగా, మొరటుగా వున్నాయి. ఈ సినిమాని నిలబెట్టడంలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పాత్ర చాలా వుంది. రెండు పాటలు బాగానే వున్నాయి. యాక్షన్ కొరియోగ్రఫీ, సినిమాటోగ్రఫీ ఇండియాలో అందరు మేకర్స్ నీ బలాదూరు చేసేలా వున్నాయి.

చివరికేమిటి
        స్నేహంరాజ్యం కోసం పన్నాగాలు, అధికార దాహం లాంటి అంశాల చుట్టూ సాగే సాలార్ బలమైన కథా కథనాల విషయాన్ని పక్కన పెట్టి, చెలరేగినన యాక్షన్ ఎపిసోడ్ల మీద ఆధారపడ్డ యాక్షన్ థ్రిల్లర్. మితిమీరిన హింసరక్తపుటేరులు తట్టుకుని చూడాల్సిన వసరముంటుంది. ఈ రోజుల్లో హింసే ఎక్కువ అమ్ముడుబోతోంది. ఈ సినిమాలో మనదికా ని ఊహాజనిత ప్రపంచాన్ని యుటోపియాగా సృష్టించి, మూడుగంటల పాటు అందులో విహరింప జేసిన ప్రశాంత్ నీల్- ప్రభాస్ లు మాత్రం సక్సెస్ అయ్యారు బాక్సాఫీసుకి- కంటెంట్ సంగతి ఎలా వున్నా!

—సికిందర్