రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Saturday, July 13, 2019

847 : స్క్రీన్ ప్లే సంగతులు- 3



మిడిల్ టూ కథనం :
         
ఇంటర్వెల్లో దర్శకుడు విశాల్ తండ్రికి ఆపరేషన్ కోసం డబ్బు తీసుకుని, విశాల్ తో బాటు కారులో వెళ్తున్న హీరోయిన్ షాలినికి యాక్సిడెంట్ జరిపించి, డబ్బు దోచుకున్న రాహుల్, అతడి ఫ్రెండ్స్ ఒక చోట వుంటారు. షాలిని, విశాల్ లు డబ్బుతో వెళ్తున్నారని ఎలా తెలిసిందనేందుకు రాకీ వివరిస్తాడు. తను డబ్బు కోసం ఏటీఎంలో కెళ్ళి చూస్తున్నప్పుడు, పక్కనే వున్న బ్యాంకులో పెద్ద మొత్తాలు ఎవరైనా డ్రా చేస్తున్నారేమో చూడాలన్పించింది. వెళ్లి చూస్తే  అక్కడ షాలినీ మేనేజర్ లక్షల్లో విత్ డ్రా చేస్తున్నాడు. కారులో వచ్చిన షాలినికి డబ్బందించాడు. అప్పుడామె నడుపుతున్న కారుని ఫాలోయ్యారు... 

          ఈ ఫ్లాష్ బ్యాక్ తర్వాత షాలిని తలకి తీవ్రమైన గాయంతో హాస్పిటల్లో వుంటుంది. విశాల్ ఆందోళనతో వుంటాడు. తన తండ్రికి ఆపరేషన్ కోసం ఇప్పుడు డబ్బు ఎట్లా అని ఆలోచనలో పడతాడు. అటు కిడ్నాపై బందీగా వున్న  మిత్రకి బిర్యానీ తినిపిస్తూంటాడు కిడ్నాపర్ అనుచరుడు. స్కూల్లో చదువుకుంటున్న తన కూతురి గురించి చెప్పుకుంటాడు.   ఇటు రాహుల్ కిడ్నాపర్ కి డబ్బు అందించేందుకు కాల్ చేయడం కోసం చూస్తే,  సెల్ ఫోన్ వుండదు. ఎక్కడ పడిపోయిందో అర్ధంగాదు. ఫోన్ కోసం వెతుకులాట ప్రారంభిస్తారు. అటు తండ్రికి ఆపరేషన్ కి డబ్బు కోసం ప్రయత్నాల్లో వుంటాడు విశాల్. ఎక్కడా దొరకదు. అటు టౌన్లో మిత్ర తండ్రి ఆర్కే, రాహుల్ తండ్రిని కలుస్తాడు. రాహుల్ హైదరాబాద్ వెళ్ళాడని తెలుసుకుని కాల్ చేయమంటాడు. రెస్పాన్స్ రాదు. రాహుల్ ఫ్రెండ్ కి కాల్ చేస్తే ఫోన్ పోయిందంటాడు రాహుల్. ఆర్కే రాహుల్ ని అనుమానించి, పోలీసు  అధికారికి చెప్పి, అతడితో హైదరాబాద్ బయల్దేరతాడు. 

         దారిలో కూతురి పట్ల ఆర్కే  ప్రవర్తనకి మందలిస్తాడు పోలీసు అధికారి. ఆర్కే ఆలోచనలో పడతాడు. అటు హైదరాబాద్ లో ఫోన్ కోసం వెతుకుతున్న రాహుల్ కి, దాన్ని ఆటోలో రాకీకి ఇచ్చానని గుర్తుకొచ్చి అడుగుతాడు. ఇవ్వలేదంటాడు రాకీ. రోడ్డు మీద ఆటో వాళ్ళని అడగడం మొదలెడతారు, చివరికి రాహుల్ కి ఇంకో ఆలోచన వస్తుంది. చివరిసారి తనకి రాకీ ఎప్పుడు కాల్ చేశాడో చెప్పమంటాడు. రాకీ సెల్  ఫోన్లో చూసి 5.20  కి అంటాడు. ఆ సమయంలో ఎక్కడున్నామో గుర్తు చేసుకుంటే, యాక్సిడెంట్ జరిపించి డబ్బుదోచుకున్న చోట వున్నామని గుర్తొస్తుంది. వెంటనే అక్కడికి పరుగెడతారు. విశాల్ కి కూడా డబ్బు దోచుకున్న దుండగుల సెల్ స్పాట్ లో పడిపోయిందని స్ఫురించి, అతను కూడా అక్కడికి పరుగెత్తుతడు...(ప్లాట్ పాయింట్ టూ).

          విశ్లేషణ :  మిడిల్ రెండో భాగంలో కథనం వేడెక్కాలి. రాహుల్ సెల్ ఫోన్ పోగొట్టుకోవడంతో వేడెక్కింది. కిడ్నాపర్ కి డబ్బందించి మిత్రని విడిపించుకోవాలంటే సెల్ ఫోన్ లేదు. వాడి నంబర్ తెలీదు. వాడు కాల్స్ చేస్తున్నాడెమో తెలీదు. రెస్పాన్స్ రాక పోవడంతో, వార్నింగ్ ఇచ్చినట్టు, మిత్రని అమ్మేస్తాడేమోనని ఆందోళన. ఇప్పుడేం చేయాలి?

          చక్కగా గూగుల్ ఎకౌంట్లోకెళ్ళి క్లిక్ చేస్తే, గూగుల్ మ్యాప్ లో సెల్ ఎక్కడుందో క్షణాల్లో చూపిస్తుంది. కాబట్టి ఇలా తేలిపోయే సమస్యకి సెల్ దొరకడం లేదంటూ ఫాల్స్ వేడి పుట్టించారు. కథకుడు ఆడియెన్స్ కంటే వెనుక వుండి పోకూడదు, ముందుండాలి. ఈ మొత్తం సస్పెన్స్ కథలో కథా సౌలభ్యం మాత్రమే చూసుకుని కామన్ సెన్సుని ఖాతరు చేయకుండా వస్తున్నారు. ప్రేక్షకులకి కామన్ సెన్సు వుండదనుకున్నారేమో. సెల్ కోసం ఎవరెవరో ఆటో వాళ్ళని అడగడమేమిటి?  సరే, వీళ్ళు ఐదేళ్లుగా ఇంటర్ చదువుతున్న తెలివిలేని వాళ్ళే అనుకుందాం, సినిమా ప్రారంభమే రాహుల్ సెల్ ఫోన్ పోగొట్టుకున్న వెతుకులాటతోనే దృశ్యాలుంటాయి. 20 వేలు పెట్టి తండ్రి వేరే ఖరీదైన సెల్ కొనిస్తాడు. చదువే  రాని వాడికి అంత ఖరీదైన సెల్ ఎందుకో అలా ఉంచితే, దీన్ని కూడా జాగ్రత్త చేసుకోకపోవడం కథా సౌలభ్యం కోసమే.

      ఇక దర్శకుడు విశాల్ కూడా తండ్రికి ఆపరేషన్ డబ్బు కోసం ఆందోళన చెందడం తప్ప చేసేదేమీ వుండదు. నిర్మాతకి పరిస్థితి చెప్తే సాయం చేస్తాడేమో కూడా ఆలోచించడు. ఇక సెల్ పోగొట్టుకున్న రాహుల్ తన కెప్పుడు చివరి కాల్ చేశాడో చూడమని రాకీ తో అన్నప్పుడు ఆ టైం 5.20 అంటాడు రాకీ. ఆ టైములో తాము డబ్బు దోచుకున్న స్పాట్ లో వున్నామని గుర్తు కొచ్చి అక్కడే సెల్ పడిపోయి వుండాలని పరిగెత్తుతాడు రాహుల్. కానీ అప్పుడా స్పాట్ లో ముగ్గురూ పక్కపక్కనే మాటు వేసినట్టు ఇంతకి ముందు మనకి చూపిస్తారు.  పక్కపక్కనే కూర్చుని వుండగా, 5.20 కి రాహుల్ కి రాకీ ఎందుకు కాల్ చేస్తాడు? 

          ఇలా ఇష్టానుసారం కథ చేసుకున్నారు. సెల్ ఎక్కడ పడిపోయిందో ఇలా తెలుసుకుని పరిగెత్తడంతో, అటు విశాల్ కి కూడా ఇదే స్ఫురించి పరుగెత్తుకు రావడంతో  ప్లాట్ పాయింట్ టూ వేసి,  మిడిల్ టూ ముగించారు. 

ఎండ్ విభాగం కథనం :
          స్పాట్ దగ్గరికి వచ్చిన రాహుల్ అండ్ ఫ్రెండ్స్ విశాల్ కి కన్పించకుండా కూర్చుని ఆ సెల్ కి కాల్స్ చేస్తూంటారు. ఆ సెల్ ఒక పిచ్చోడి దగ్గర మోగుతుంది. వాడికి (బిత్తిరి సత్తికి) సెల్ దొరికింది... వాడి వెంట పడతారు. విశాల్ కూడా వెంటపడతాడు. అటు రాహుల్ కాల్స్ కి రెస్పాండ్  కావడం లేదన్న కోపంతో మిత్రని వేరే గ్రూపుకి అమ్మేద్దామని తీసుకుని బయల్దేరతాడు కిడ్నాపర్. డ్రైవర్ రాష్ డ్రైవింగ్ చేయడంతో -  వాహనదారులు అడ్డుకుని డ్రైవర్ ని కొట్టి గలభా సృష్టించడంతో - పోలీసులు వచ్చి వ్యానులో బందీగా వున్న మిత్రని చూస్తారు, కిడ్నాపర్ ని పట్టుకుంటారు. 

          రాహుల్ అండ్ ఫ్రెండ్స్  ఒక స్కూలు పిల్ల దగ్గరున్న బ్యాగుని గుర్తు పడతారు. మిత్రకి డబ్బు పెట్టి ఇచ్చిన బ్యాగులాగే వుంటుందది. దాన్ని తీసుకుని చూస్తారు. డబ్బుండదు. ఎవరిచ్చారంటే దూరంగా తండ్రిని చూపిస్తుంది. అతను మాఫియా అనుచరుడు. అతడి వెంట పడతారు. తర్వాత పిచ్చోడి దగ్గర సెల్ లాక్కుని పరిగెడుతున్న రాహుల్ కి ముఖాముఖీ అవుతాడు విశాల్. సెల్ కోసం ఇద్దరూ కొట్టుకుంటారు. విశాల్ ని విడిపించుకుని పారిపోతాడు రాహుల్. విశాల్ కి మదర్ కాల్ చేసి ఆపరేషన్ సక్సెస్ అయిందని అంటుంది. డబ్బెవరిచ్చారంటే నువ్వే పంపించావుగా అంటుంది. హాస్పిటల్ కి పరుగెడతాడు విశాల్. ఆపరేషన్ డబ్బు షాలినియే  ఏర్పాటు చేసిందని తెలుసుకుంటాడు. 

       రాహుల్ కి పోలీస్ స్టేషన్ లో వున్న మిత్రకి రాహుల్ నుంచి కాల్ వస్తుంది. ఏం జరిగిందో అర్ధమవుతుంది. పోలీస్ స్టేషన్ కి మిత్ర తండ్రి ఆర్కే, పోలీస్ అధికారి వస్తారు. అటు హాస్పిటల్లో షాలినికి పోగొట్టుకున్న డబ్బు అందుతుంది. అజ్ఞాతంగా రాహుల్ పంపించిన డబ్బు. 

          ఇటు మిత్రని కారెక్కించుకుని బయల్దేరతాడు ఆర్కే. టౌన్లో పోతూండగా మళ్ళీ నాట్యం హోర్డింగ్ ని చూస్తుంది మిత్ర. చివరి దృశ్యంలో రాహుల్, మిత్రాలు కాలేజీలో వుంటారు...

విశ్లేషణ : ఈ ముగింపులో చేసిన నేరాలకి ఎక్కడా శిక్ష పడకుండా వచ్చేసి కాలేజీలో చేరారు రాహుల్ అండ్ ఫ్రెండ్స్. పోలీసులు కళ్ళ ముందు నేరాలు కన్పిస్తున్నా ఆ వేపుగా ఆలోచించరు. ఒకవేళ ఆర్కే వెంట వున్న పోలీసు అధికారి  మేనేజి చేశాడనుకున్నా, పట్టుకున్న కిడ్నాపర్ని కూడా వదిలెయ్యాలి.  ఇలా లైటర్ వీన్ రోమాంటిక్ కామెడీల్లాగే, ఈ లైటర్ వీన్ క్రైం కామెడీని పైపైన రాసేసి తీసేశారు. లాజిక్కులూ కామన్ సెన్సులూ నైతిక విలువలూ పట్టకుండా.         
(అయిపొయింది) 

సికిందర్