రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Thursday, January 5, 2017

రైటర్స్ కార్నర్





        దొకసారి ఊహించుకోండి : మీరొక ఔత్సాహిక సినిమా రచయిత. సినిమా రంగంలో మీకు పరిచయస్థుల్లేరు. సినిమా రంగానికి దూరంగా వేరే చోట వుంటారు. కానీ మీరు రాసిన మొదటి స్క్రిప్టు  ఓకే అవడమేగాక, సినిమాగా కూడా తయారయింది. దేశవ్యాప్తంగా విడుదలయ్యింది. అందులో ఆస్కార్ అవార్డుకి నామినేట్ అయిన నటియే  హీరోయిన్! ఇంకో ఆస్కార్ అవార్డు గ్రహీత డైరెక్టర్!
        లావుంది? పగటి కలలా వుందా? కానీ జొనాథన్ పెరీరా  విషయంలో ఇదే  నిజమయ్యింది. డిసెంబర్ తొమ్మిదిన విడుదలైన ‘మిస్ స్లోన్’ అనే ఆస్కార్ అవార్డుకి నామినేట్ అయిన హీరోయిన్ జెస్సికా చాస్టియన్ నటించిన సినిమా అతడి కలని సాకారం చేసింది. దీనికి ‘షేక్స్ పియర్ ఇన్ లవ్’ కి ఉత్తమ ఆస్కార్ చలనచిత్ర అవార్డు పొందిన జాన్ మాడెన్ దర్శకుడు!

        సినిమా రచయితగా మారాలన్న కోరికతో న్యాయవాద వృత్తినే త్యజించాడు పెరీరా. త్యజించి చైనా లోని ఓ యూనివర్సిటీలో ఇంగ్లీషు అధ్యాపకుడిగా చేరిపోయాడు. కేవలం మూడొందల డాలర్లు జీతం. ముందు పూట గడవడానికి చాలినంత సంపాదించుకునే,  సినిమా రచన మీద దృష్టి పెట్టడానికి వీలైనంత సమయమిచ్చే ఉద్యోగం కోరుకునే ఇందులో చేరాడు.. సినిమా రచన గురించి ఏమీ తెలీని తను సినిమా స్క్రీన్ ప్లేలు విరివిగా చదవడం మొదలెట్టాడు. వాటిని విశ్లేషించుకోసాగాడు. మరో వైపు రాబర్ట్ మెక్ కీ రాసిన ‘స్టోరీ’ గ్రంథాన్ని అభ్యసించడం మొదలెట్టాడు. ఇతరులు  రాసిన స్క్రీన్ ప్లేలు చదవడానికే తన శిక్షణని కేటాయించాడు. ఆ స్క్రీన్ ప్లేలు ఏవి ఎందుకు వర్కౌట్ అయ్యౌయి, ఏవి ఎందుకు వర్కౌట్  కాలేదు - అని తర్జనభర్జన చేసుకుంటూ తనెలా రాయాలో తేల్చుకున్నాడు. స్క్రీన్ ప్లేలు చదువుతున్నప్పుడు అవి 120 పేజీలుంటే, మొదటి 60 పేజీలు  ఉదయం పూట చదివే వాడు. యూనివర్సిటీకి వెళ్లి వచ్చి ఆ చదివిన 60 పేజీల్ని పునశ్చరణ చేసుకునే వాడు. ఇప్పుడు చేతిలో చదివిన 60 పేజీలున్నాయి. ఇందులో క్యారెక్టర్స్ ఏమిటో తెలిశాయి, కథలో ఏం జరుగుతోందో తెలిసింది, ఇప్పుడీ కథని తానైతే ఎలా పూర్తి చేస్తాడో, మిగిలిన 60 పేజీల కథ  అలా తను వూహించేవాడు. అలా ఆలోచనలకి పదును పెట్టేవాడు. కొన్ని సీన్లు చదివేటప్పుడు గట్టిగా నవ్వేవాడు. డాన్ గోగల్ మాన్  రాసిన బ్రిలియెంట్  స్క్రిప్టు ‘క్రేజీ స్టుపిడ్ లవ్’  ని బాగా ఎంజాయ్ చేశాడు. నవ్వాపుకోలేక చచ్చాడు. తేరుకుని- హోల్డాన్! ఈ రైటర్ కేవలం పేజీల మీద కొన్ని పదాలతో నవ్విస్తున్నాడు. ఇంత నవ్వు రావడానికి మూలంలో సీన్లో దీన్ని ఇంధనంగా వాడాడు? - అని పోస్ట్ మార్టం చేసేవాడు. ఆ ఇంధనాన్ని వెతికి పట్టుకునే అన్వేషణ సాగించేవాడు. 


పెరీరా తన రచనా పద్ధతిని కూడా వివరంగా చెప్పాడు. ఈ కింద ఇచ్చిన అతడి ఇంటర్వ్యూ సినిమా రచయితలు కాగోరేవారికి ప్రయోజనకరంగా వుండొచ్చు. ఓ సారి ఆ ఇంతర్వ్యూలోకి వెళ్దాం...

స్క్రీన్ రైటింగ్ లోకి మీరెలా అడుగు పెట్టారు?
        నేను కార్పొరేట్ లాయర్ గా ట్రైనింగ్ అయ్యాను. అయితే నేను కార్పొరేట్ లాయర్ని అవాలని ఎప్పుడూ అనుకోలేదు- మరేం అవ్వాలో నాకు తెలీదు. బ్రిటన్లో విద్య దుంప తెం చేంత ఖరీదైనది, అమెరికాలో కూడా ఇంతే.  కాబట్టి నేనేసుకోవాల్సిన ప్రశ్నకూడా మారింది- నేనేం అవాలనుకుంటున్నా నన్న ప్రశ్న కాస్తా - ఏదో ఒకటి అవాలంటే ఒక డిగ్రీ సంపాదించుకోవాలి- ఆ డిగ్రీ చదవడానికి చేసే మోపెడు అప్పులు తీర్చడానికి నేనేం చెయ్యాలన్న ప్రశ్న ప్రధానంగా నా ముందు నిల్చింది. నా చదువుకు ఏదో ఒక లా కంపెనీలో చేరడమే మార్గంగా తోచింది. దాంతో ఒక జంతు మాంసం ఉత్పత్తి చేసే పెద్ద కార్పొరేట్ కంపెనీలో చేరాను. ఆ జీతంతో అప్పులు తీర్చుకుంటూ వుండే వాణ్ణి. అప్పులు తీర్చడం కోసమే ఆ ఉద్యోగం చేయడం తప్ప  ఇంకో ఆలోచన వచ్చేది కాదు. ఇలా కాదని కొన్ని మెంటల్ లిస్టులు తయారు చేసుకున్నాను : నాకు దేని మీద ఇంటరెస్టు వుంది? ఫుట్ బాలా? కార్లా? ఆర్కిటెక్చరా? నేనెందులో ఆరితేరాను? భాష, పదాలు వీటిలో అరితేరా నన్పించింది. నేను కథానికలు రాయడాన్ని  ఎంజాయ్ చేసే వాణ్ణి. మరైతే నాకు ఫుట్ బాల్ అంటే కూడా ఇష్టమే. ఈ రెండూ కలిపి నేనొక స్పోర్ట్స్ జర్నలిస్టు ఎందుక్కాకూడదనుకున్నాను. లిస్టుని ఇంకా పొడిగిస్తే, నాకు సినిమాలంటే ఇష్టమని కూడా తేలింది. అయితే సినిమా రచనే  ఎందుకు చేయకూడదన్పించింది. కానీ సినిమా రచన గురించి నాకేమీ తెలీదు. నా మొత్తం జీవితంలో ఒక్క స్క్రీన్ ప్లే కూడా చదవలేదు. ఒక లాయర్ గా నేను 16 గంటలూ పనిచేస్తున్నానని తెలుసు. కనుక నేననుకున్న గోల్ రీచ్ అవాలంటే నాక్కొంత ఫ్రీ టైం కావాలి స్క్రీన్ ప్లే బేసిక్స్ నేర్చుకోవడానికి. ఇందుకోసం బాధాకరంగా వున్నా, ఆ ఉద్యోగం మానెయ్యక తప్పలేదు. అందరూ నన్నొక అవివేకిలా చూశారు.

        చైనా వెళ్లి ఇంగ్లీషు బోధించడం మొదలెట్టాను. విద్యార్థులకు ఆ బోధనా, నాకు స్క్రీన్ ప్లే బేసిక్స్ స్వబోధనా మొదలెట్టుకున్నాను. వీలయినన్ని స్క్రీన్ ప్లేలు చదువుతూ ఎనలైజ్ చేసుకున్నాను. మార్కర్ చేతిలో పట్టుకుని పాయింట్స్ అండర్ లైన్ చేస్తూ, స్క్రీన్ ప్లే మీద ఒక పుస్తకం మొత్తం చదివేశాను.

        చైనాలో సంవత్సరం గడిపాక దక్షిణ కొరియావెళ్లి ఎలిమెంటరీ స్కూల్ పిల్లలకి పాఠాలు చెప్పడం మొదలెట్టాను. అక్కడే ‘మిస్ స్లోన్’  కథకి బీజం, ప్రణాళికా పడ్డాయి. అది పూర్తి చేసి ఏజెంట్ కి పంపాను. దక్షిణ కొరియాలో వుంటూనే ఆ స్క్రీన్ ప్లే గురించి సంప్రదింపులు జరిపాను. హాలీవుడ్ నుంచి ఆహ్వానం కూడా అందుకున్నాను. స్కూల్లో ఉదయం ఆరుగంటలకే పిల్లలకి క్లాసు తీసుకోవాల్సి వచ్చేది. ఆ క్లాసు నిర్వహిస్తూనే  స్కైప్ లో ప్రొడ్యూసర్ తో మీటింగులు జరిపాను. అలా నేను హాలీవుడ్ కి పరిచయమయ్యాను. 2014 లో ఫిలిం నేషన్ అనే కంపెనీ ప్రొడ్యూసర్ పాట్రిక్ చూతో చర్చలు జరిపాక వాళ్ళ వెబ్సైట్ ని చూశాను. వెబ్సైట్ ని చూశాక వాళ్లతో పనిచేయాలన్పించింది. కానీ జరిగింది ఇంకొకటి- నా స్క్రిప్టు కి సంబంధించి కేవలం  ఫైనాన్షియల్ ఆఫర్ మాత్రమే ఇస్తూ  నా ఏజంట్ ఈమెయిల్  పంపాడు! నేను వెనక్కి తగ్గాను. 

        ఆ స్క్రీన్ ప్లే రాస్తున్నప్పుడు దాని గురించి ఇతరులతో చర్చించడం గానీ, ఇతరులకి చూపించడం గానీ చేయలేదు. రాసేసి మర్చిపోయాను. కొన్ని నెలలపాటు కంప్యూటర్ మీద వర్క్ చేసి వుంటాను. ఇలావుంటే, ఒకరోజు వెరైటీ మ్యాగజైన్లో చదివాను- ప్రొడ్యూసర్ వీన్ స్టీన్ ఒక హీరోయిన్ ఓరియెంటెడ్ కథతో మూవీ తీయాలనుకుంటున్నట్టు చెబుతూ- ఆ కథ ఎలా వుండాలో  ఐడియా కూడా ఇవ్వడం చదివాకా నేను ఎలర్ట్ అయ్యాను. నా కథ ఐడియా కూడా అదే! వెంటనే పదేపదే నా స్క్రిప్టు చదువుకున్నాను. వెంటనే నా ఏజెంటుకి ఈ మెయిల్ చేశాను. ఆయన వెంటనే నా స్క్రిప్టు వెనక్కి పంపారు. మూడు వారాల తర్వాత ఇంకో ఈ మెయిల్ పంపారు. నా స్క్రిప్టు తనకి బాగా నచ్చిందనీ, వీలయితే డ్రింక్ కి రమ్మనీ కోరారు. అప్పుడు నేను బాంబు పేల్చాను. నేను అమెరికాలో వుంటున్న అమెరికన్ని కాదనీ, బ్రిటన్ లో వుండే బ్రిటిషర్ ననీ, అదికూడా ఇప్పుడు దక్షిణ కొరియాలో వుంటున్నాననీ బాంబు పేల్చేశాను. ఏం ఫర్వాలేదు, స్కైప్ లో మాట్లాడుకుందామన్నారు. క్లాస్ రూమ్ నుంచే ఈ స్కైప్ మీటింగ్ తర్వాత నేను అమెరికాలో వాలిపోయాను...

మోడరన్ టెక్నాలజీ గొప్పతనమంటే  అదే మరి...
        ఎగ్జాక్ట్లీ!  ఇంటర్నెట్ లేని రోజుల్లో ఇది సాధ్యమయ్యేదా?
మీరు సృష్టించిన మిస్ స్లోన్ కఠినమైన పాత్ర. ఆ పాత్ర రాయడానికి మీకు ఇన్స్ పిరేషన్ ఏమిటి?
        మా అమ్మని బట్టే రాసేశా.
వెరీ నాటీ!
        మా అమ్మ ఒక్కతే  నన్ను పెంచి పెద్ద చేసింది. ఆమె బుల్ డాగ్ అంత  పవర్ఫుల్ గా వుండేది. ఏదైనా అనుకుంటే సాధించే దాకా వూరుకునేది కాదు. మిస్ స్లోన్ లో మంచి లక్షణాలు మా అమ్మ నుంచే వచ్చాయి. ఇంకో కోణంలో మిస్ స్లోన్ జిత్తులమారి కూడా. మా అమ్మ అలాంటి కాదు. ఆమె జెకొస్లవేకియాలో  పుట్టింది. కమ్యూనిజంలో పెరిగింది. 19 వ యేట ఆ కమ్యూనిస్టు దేశం నుంచి తప్పించుకుని లండన్ పారిపోయి వచ్చేసింది. ఒకే ఒక్క సూట్ కేసు ఆమె చేతిలో వుంది. ఇక తనవాళ్ళని గానీ,  ఫ్రెండ్స్ ని గానీ  ఇంకెప్పటికీ చూడలేనని తెలిసికూడా వచ్చేసింది.  అదీ క్లుప్తంగా మా అమ్మ, నా రోల్ మోడల్. నా కథలో మిస్ స్లోన్ లాబీయింగ్ కారిడార్స్ లో జీవితం గురించి రిసెర్చి చేసి రాశాను. కార్పొరేట్ లాబీయింగ్... 

ఎంత రీసెర్చి చేశారేమిటి?
         
కార్పొరేట్ లాయర్ గానే పనిచేశాను కనుక ఆ రంగం గురించి కొంత తెలుసు. ఆ వాతావరణం, వేషధారణ, మాటలు ఎలా వుంటాయో కొంత తెలుసు. మిగతాది తెలుసుకున్నాను. లాబీయింగ్ గురించే ఎక్కువ రీసెర్చి చేశాను. లాబీయింగ్- లా అన్నదమ్ముల్లాంటివి. లాబీయిస్టులు లాయర్స్ అయివుండాల్సిన అవసరం లేకున్నా ఈ రెండు వృత్తులూ ఆత్మీయ సోదరుల్లాంటివి. జాక్ అబ్రమాఫ్ రాసిన ‘కాపిటల్ పనిష్మెంట్’ నాకు చాలా హెల్ప్ అయింది. ఆయన లాబీయిస్టు. ఏదో తేడా వచ్చి జైల్లో పడ్డాడు. జైల్లో వుంటూ ఆయన లాబీయింగ్ విశ్వరూపమేమితో బట్టబయలు చేస్తూ రాశాడు. అది నాకు బాగా ఉపయోగ పడింది. లాబీయింగ్ ప్రపంచమంతా కళ్ళకి కట్టింది. 

        లాబీయింగ్ రాజకీయ నిర్ణయాల్నీ, నిధుల కేటాయిపుల్నీ ఎలా ప్రభావితం చేస్తుందనే అంశం మీద నేను పుంఖాలు పుంఖాలుగా ఆర్టికల్స్ చదివాను. జాక్ అబ్రమాఫ్ కేసు విచారణా పత్రాల  పీడీఎఫ్ లు మొత్తాన్నీ డౌన్ లోడ్ చేసుకుని చదివేదాకా నా రీసెర్చి సాగింది. 

ఆన్ లైన్ లో ఇంత సమాచారం లభించడం క్రీజీగా అన్పించట్లేదా?
         
ఇంట్లో కూర్చుని రీసెర్చి చేసుకోవచ్చు, టెక్నాలజీ మనకిస్తున్న వరమిది. 

ఇలాటి సబ్జెక్టుని డీల్ చేస్తూంటే మీకు భయమన్పించలేదా?
        లేదు, నాకీ సబ్జెక్టు ఇంటరెస్టింగ్ గా తోచింది కాబట్టే రాసుకుంటూ పోయాను. సినిమాగా ఇది మేకింగ్ లో వున్నప్పుడు కూడా భయం వేయలేదు. ఇదొక వినోద కాలక్షేపం. అమెరికన్ రాజకీయాలకి పరిమితమైన ఆసక్తికర సబ్జెక్టు. ఈ సబ్జెక్టు ఎవర్నీ ఉద్దేశించింది కాదు, ఎవర్నీ ఆగ్రహ పర్చే అవకాశం లేదు. 

స్క్రిప్టులో మర్పులేమైనా జరిగాయా?
         
పెద్దగా లేదు. దర్శకుడు జాన్ మాడెన్ చదివి కొన్ని ఫన్నీ కామెంట్స్ చేశారు. స్ట్రక్చర్ గానీ, కథనం గానీ నేనెలా రాశానో అలాగే వుంచారు. హీరోయిన్ క్యారెక్టర్ గురించి మాత్రం స్వల్ప మార్పు చేశారు. నా హీరోయిన్ కఠినాత్మురాలే గానీ అంతే బలహీనురాలు కూడా.  దర్శకుడు మాడెన్ ఆ బలహీనత్వాన్ని అంతరాత్మకి లొంగుబాటుగా చూపించారు. 



 - ఎజెన్సీస్