రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Tuesday, May 7, 2019

819 : టిప్స్

(53 – 60)
          53. కథలో హీరో విలన్ మీద ఎవరికీ తెలియకుండా గుప్తంగా వున్న రివెంజిని  ఎప్పుడు వెల్లడించ వచ్చు? ముందుగా - కథ వచ్చేసి రివెంజి గురించే అయితే, అదే హీరో గోల్ అనుకుంటే, ఇది వెల్లడించేందుకు టైము, టార్గెట్ అని రెండుంటాయనుకోవచ్చు. ముందుగా ప్రేక్షకులకే  వెల్లడించాలని టార్గెట్ వుంటే, విలన్ కి వెల్లడించడానికి ఇంకా టైముంటుంది. ఇక్కడ టార్గెట్ అయిన ప్రేక్షకులతో టైము ఎడంగా వుంటుంది. ఈ టైంలో విలన్ కి ఎప్పుడు తెలుస్తుందా అన్న సస్పెన్స్ ని ప్రేక్షకులు అనుభవించేలా కథనం చేసుకోవచ్చు ఆసక్తి వుంటే. ఇక ముందుగా విలన్ కే హీరో రివెంజిని వెల్లడించాలన్న టార్గెట్ వుంటే, అప్పుడు ఆటోమేటిగ్గా ప్రేక్షకులకి సైతం అప్పుడే వెల్లడై, టైం శూన్యమవుతుంది. ఇదంతా హీరోకి కథంతా రివెంజి అన్న ఒకే ఒక్క గోల్ వున్నప్పుడు.

          ఇలాకాక
, ఆ కథ ఇలా వుందనుకుందాం : వూళ్ళో ప్రజల కోరిక మీద ఓ ప్రజాసమస్య తీర్చడానికి హీరో పూనుకున్నాడనుకుందాం. అప్పుడా సమస్య స్వయంగా హీరో అనుభవించింది కాదు కాబట్టి అతడి గోల్ కన్విన్సింగ్ గా ఆన్పించక పోవచ్చు. కన్విన్సింగ్ గా అన్పించాలంటే, ఆ ప్రజల సమస్యకి కారకుడైన విలన్ తో హీరో గతంలో వ్యక్తిగతంగా బాధ ననుభవించి వుండాలి. ఇలా ఇప్పుడు ఊరుని కాపాడడం హీరో ఫిజికల్ గోల్ గా వుంటే, గతంలో విలన్ తో పడ్డ బాధ సైకలాజికల్ గోల్ గా వుంటుంది. మరి ఇలా ఊరుని కాపాడే ఫిజికల్ గోల్ గా నడుస్తున్న ప్రధాన కథలో, గుప్తంగా  వున్న సైకలాజికల్  గోల్ ని ఎప్పుడు వెల్లడించాలి

          సాధారణంగా ఏం జరుగుతుందంటే
, ఫిజికల్ గోల్ కి పూనుకున్న హీరోకి విలన్ ఎదురు పడగానే గజిబిజిగా ఏవో షాట్లు పడతాయి. అప్పుడు గతంలో విలన్ తో హీరోకి ఏదో జరగరాని ఘోరం జరిగిందని మనకర్ధ మవుతుంది. అప్పుడు దీని ప్రభావం కథ మీద, మన మైండ్స్ మీద ఎలా వుంటుంది? కథ ఫోకస్ చెదురుతుంది, ఇక ముందు ముందు హీరోకి చాదస్తంగా ఏదో ఫ్లాష్ బ్యాక్ వేస్తారని మనకి ముందే తెలిసిపోతుంది. ఇలా నాసిరకం కథనం పాలబడకుండా వుండాలంటే ఏం చేయాలి

          అప్పుడు 2016 లో విడుదలైన 
మాగ్నిఫిషెంట్ సెవెన్’  చూడాలి. ఈ కౌబాయ్ మూవీలో ప్రజాకంటకుడుగా వున్న విలన్ని,  ప్రజల తరపున హీరో ఎదుర్కొని, చిట్ట చివరి సీనులో వాణ్ణి  చంపుతున్నపుడు మాత్రమే - అసలు తానెవరో అప్పుడు చెప్పి, తన తల్లినీ, చెల్లెళ్ళనీ విలన్ చంపిన సంగతీ అప్పుడు గుర్తుచేసి, చెడామడా చంపి పగ తీర్చుకుంటాడు!

         
 ఇలా ఫిజికల్ గోల్ పూర్తి చేస్తూ  చిట్ట చివర మాత్రమే హీరో తన సైకలాజికల్ గోల్ ని వెల్లడించడం వలన - మనకి ఒక రహస్యం బయటపడి షాక్, ఒక ట్విస్ట్, ఒక ఫినిషింగ్ టచ్ ఇవన్నీ అనుభవమై- 1) హీరోకి ఇంత కథ వుందా అని అప్పుడు తెలిసి, 2) ఇందుకోసం ఊరుని కాపాడేందుకు పూనుకున్నాడా అన్న భావోద్వేగం పుట్టి, 2) అప్పుడా హీరో చాలా మెచ్యూర్డ్ గా, హుందాగా కనపడి అభిమానం ఇంకింత పెరిగి, 4 ) అతడి  సైకలాజికల్ గోల్ ని  ఫ్లాష్ బ్యాక్ విజువల్స్ వేయకుండా కేవలం నాల్గు డైలాగుల్లో  ఎమోషనల్ గా వెల్లడించే సరికి, ఆ జరిగిన గతం తాలూకు సంఘటనా దృశ్యాల్ని మనకి నచ్చిన రీతిలో మనం వూహించుకునే వీలు ఏర్పడి, 5) హీరో ఫిజికల్ గోల్ ని కన్విన్సింగ్ గా  ఫీలవుతాం

         
1954 లో అకిరా కురసావా సెవెన్ సమురాయ్తీస్తే, 1960 హాలీవుడ్ లో  దాన్ని మాగ్నిఫిషెంట్ సెవెన్గా రీమేక్ చేశారు. తిరిగి 2016 లో డెంజిల్ వాషింగ్టన్ తో డైనమిక్స్ ని ఏ మాత్రం మార్చకుండా ఇలా ఇంకో రీమేక్ చేశారు

          54. ముందుగా
హీరో ఎంట్రీ సీను ఆలోచించి అక్కడ్నించీ కథ ఆలోచిస్తే? దాంతో కథ ఎంతకీ రాకపోవచ్చు. ఓ ఇద్దరు ఇదే అనుభవంతో జుట్లు పీక్కున్నారు. హీరో ఎంట్రీ సీను ఆలోచించింతర్వాత, తర్వాతి సీన్లేమిటా అని ఆలోచిస్తే కథే రావడం లేదు. ఇదేం కొత్త సమస్య కాదు, చాలా పాత సమస్యే. ఇలా ఎందుకు జరుగుతుందంటే, ఎక్కడో చదివిందో చూసిందో ఒక సీను బాగా నచ్చేసి, ఆ సీనుని అద్భుతంగా చూపిస్తూ లేదా హైలైట్ చేస్తూ దాంతో కథ అల్లేద్దామనుకున్నపుడు ఇలాటి సమస్య ఎదురవుతుంది. 

          సినిమా కథ ఆలోచించడమంటే ఎక్కడో నచ్చేసిన దృశ్యాన్ని ఇరికించి తీరాలన్న దురుద్దేశం పెట్టుకుని దాంతో ఆలోచిస్తారా? (తాజాగా రెండు నెలల క్రితం కూడా ఒక నిర్మాతతో ఇదే సమస్య. వూళ్ళో జరిగిన ఒక సంఘటనలో ఒక దృశ్యం ఆయనకి బాగా నచ్చింది. దాన్ని ప్రేమించి, అది పెట్టుకుని కథ కూడా ఆలోచించేసి ఫిక్స్ అయిపోతే, ఇక ఆ కథ లేడికి తోడేలు తల అతికించినట్టు వుంది. ఏం చేయాలి? లేడినైనా చంపాలి, తోడేలు తలైనా నరకాలి. దేనికీ ఆయన ఇష్టపడక లేడి తోడేలుని అలాగే భద్రపర్చుకున్నారు). సినిమా కథని హీరో ఎదుర్కొనే సమస్య (పాయింటు) ఆధారంగా ఆలోచించక పోతే కథ వస్తుందా?


          కథంటే ఎంట్రీ సీను కాదు. కథంటే పాయింట్, లేదా హీరో ఎదుర్కొనే సమస్యే! ముందుగా ఈ పాయింట్ లేదా సమస్య  ఫిక్స్ చేసుకోకుండా ఎంత  ఆలోచించినా వున్నచోటే వుండిపోతారు. ఉదాహరణకి, హీరో హీరోయిన్లు ప్రేమించుకున్నారు. హీరోయిన్ ప్రేమని హీరో పొందాలంటే, ఆమె చెప్పినట్టు వాళ్ళ నాన్న ఎక్కడో దాచిన ఒక వస్తువు కొట్టేసుకుని రావాలి. ఇదే కథ. ఆ వస్తువు కొట్టేసుకుని రావడమే పాయింటు, లేదా హీరో సమస్య.  హీరో, లేదా ఆ కథ హీరోయిన్ ఓరియెంటెడ్ అయితే హీరోయిన్, ఓ సమస్యలో ఎలా ఇరుక్కుని, అందులోంచి ఎలా బయట పడ్డారన్నదే  ప్రపంచంలో ఏ కమర్షియల్ సినిమా కథయినా. 


          కాబట్టి కథ ఆలోచించడం మొదలెట్టాల్సింది హీరో ఎంట్రీ సీను పెట్టుకుని  కాదు, హీరో ఎదుర్కొనే సమస్యతో. ముందు సమస్యేమిటో నిర్ణయించింత్తర్వాతే ఎంట్రీలూ బ్యాంగులూ ఇంకేవైనా.  హీరో ఎవరు (బిగినింగ్) - అతను ఇరుక్కున్న సమస్యేమిటి (మిడిల్)-  ఆ సమస్య లోంచి ఎలా బయట పడ్డాడు (ఎండ్)- ఇలా ఆలోచించడం మొదలిపెడితే తప్ప ఎంత తపస్సు చేసినా, ఊటీ వెళ్లి ఎన్ని సిట్టింగులేసినా జన్మకి కథ రాదు. తపస్సు తుస్సు మనడం, ఊటీ తడిసి మోపెడవడం ఖాయం.


          55. కామెడీ రైటింగ్ కూడా ఇంటలిజెంట్ రైటింగ్ గా మారినప్పుడే  అప్డేటెడ్ మూవీస్ ప్రేక్షకుల మధ్యకి వస్తాయిఅవే సినిమాటిక్ డైలాగులతో, సీన్లతోక్రియేటివిటీ లేని మాసిపోయిన కార్బన్ కాపీ కామెడీలు తీయడం కంటే  - జీవితాల్లో ఉట్టి పడే సహజ హాస్యంతో  ఆరోగ్యకర సినిమాలు తీసే స్థాయికి ఎదగడం ఇప్పటి మార్కెట్ కి అర్జెంటు అవసరం. సమాజంలో చాలా హస్యముంది, పాత్రలున్నాయి- వీటితో ప్రేక్షకులు తమని ఐడెంటిఫై చేసుకున్నంతగా, మూసఫార్ములా కామెడీ- పేరడీలకి కనెక్టయ్యే  పరిస్థితి ఇక లేదని వారం వారం విడుదలయ్యే సినిమాల్ని చూస్తూంటే తెలిసిపోతూనే వుంది. ఇక హార్రర్ కామెడీ, థ్రిల్లర్ కామెడీ, యాక్షన్ కామెడీ, క్రైం కామెడీ, అడల్ట్ కామెడీ...ఇంకేవేవో  కామేడీలంటూ ఇతర జానర్లని కలిపి కృత్రిమంగా తీసేస్తూ, అసలు ప్యూర్ కామెడీనే మర్చిపోయారు. ప్యూర్ కామెడీలకి  ఇటు జంధ్యాల, ఈవీవీ లాంటి వాళ్ళు; అటు హృషికేష్ ముఖర్జీ, ప్రియదర్శన్ లాంటి వాళ్ళూ  ఇప్పుడు లేనే లేరు. అలాగే  సింగీతం శ్రీనివాసరావు టైపు హింస లేని ఫక్తు హాస్యభరిత క్లయిమాక్సులు ఇప్పుడు వర్కౌట్ కావేమో అనుకుంటే, ‘ఈడు గోల్డ్ ఎహెఅనే తాజా  కామెడీలో జానర్ కి విరుద్ధమైన, హింసాత్మక క్లయిమాక్స్ ఏమైనా వర్కౌట్  అయ్యిందా ఆలోచించాలి.

          56. చాలామంది అర్ధం చేసుకోలేని ఒక ప్రాథమిక సూత్రముంది : ఒక సినిమాని ప్రేక్షక సమూహానికి చూపించడమంటే, యుగాలుగా డీఫాల్టుగా వాళ్ళ అంతరంగాల్లో నిబిడీకృతమై వున్న కథని రిసీవ్ చేసుకునే స్పందనలతో అనుసంధాన మవగల్గడమే! కథని పత్రిక కోసం రాసినా, సినిమా కోసం రాసినా ఆయా పాఠకులతో, ప్రేక్షకులతో అదొక సైకలాజికల్ ఎక్సర్ సైజే అవుతుంది మరి. కథలు వాటి మూడంకాల నిర్మాణంలో- అంటే- బిగినింగ్, మిడిల్, ఎండ్ విభాగాలతో- లేదా త్రీయాక్ట్ స్ట్రక్చర్ తో వున్నప్పుడే అదీ ఆ అంకాల్లో లేదా విభాగాల్లో లేదా యాక్స్ట్ లో వేటికవిగా జరిగే బిజినెస్సుల్ని కలిగి వున్నప్పుడే, మనుషుల అంతరంగ స్పందనలతో  మ్యాచ్ అవుతాయి. మ్యాచ్ ఆవనప్పుడు ఆ కథలు ఫెయిలవుతాయి. ఇట్స్ దట్ సింపుల్! 

          57. విభాగాల బిజినెస్ అంటే గుండుగుత్త ట్రీట్ మెంట్ కాదు. స్క్రీన్ ప్లేలో ఆయా అంక విభాగాల్లో జరగాల్సిన కార్యకలాపాల తీరుని బిజినెస్ అంటారు. స్క్రీన్ ప్లే లో మనం చెప్పుకునే బిగినింగ్- మిడిల్- ఎండ్ అనే విభాగాలు మూడూ ఒక్కోటీ ఒక్కో తరహా బిజినెస్ ని కలిగి వుంటాయి. రిలయెన్స్ వాళ్ళ బిజినెస్ రిలయెన్స్ వాళ్ళ బిజినెస్సే, టాటా వాళ్ళ బిజినెస్ టాటా వాళ్ళ బిజినెస్సే. అలాగే బిర్లాల కార్యకలాపాలు బిర్లాలవే. ఒక్కరూ ఇంకో తమ సాటి పోటీదారుల్లాగా తమ వ్యవస్థల్ని నడుపుకోవడానికి ఇష్టపడరు. అలాగే స్క్రీన్ ప్లేలో కూడా బిగినింగ్- మిడిల్- ఎండ్ విభాగాలు మూడింట్లో ఏ ఒక్కటీ ఇంకోదానితో పోలిన బిజినెస్ ని కలిగి వుండదు. స్క్రీన్ ప్లే విభాగాల రచనలో ఈ విలక్షణీయతల్ని గుర్తించకపోతే, ఆ మొత్తం కథ ప్రసారం చేసే తరంగాలని ప్రేక్షకుల అంతరంగ రాడార్ వికర్షించడం మొదలెడుతుంది.

         
58. ఏళ్ల తరబడీ సినిమాల్ని చూస్తూ వస్తూంటే ఒక తత్త్వం బోధపడుతోంది : తీసుకున్న స్టోరీ ఐడియాని లైన్ ఆర్డర్ ఒక మెట్టు పైకి తీసికెళ్ళాలి, ఆ లైన్ ఆర్డర్ ని స్క్రీన్ ప్లే ఇంకో మెట్టు పైకి తీసికెళ్ళాలి, ఆ స్క్రీన్ ప్లేని డైలాగ్ వెర్షన్ మరింకో మెట్టు పైకి లాగాలి, ఆ డైలాగ్ వెర్షన్ ని నటనలు కొండెక్కిస్తే, ఆ నటనల్ని దర్శకత్వం అందలా లెక్కించాలని!

         
ఇదెలా పెరుగుతుందంటే, ఉదాహరణకి ఓ చిన్న పిల్లాడు ఓ చిన్న పిల్ల దగ్గర్నుంచి తియ్యటి చాక్లెట్ లాక్కున్నాడనుకుందాం. అప్పుడు దీనికి ప్రతీకారంగా ఆ పిల్ల ఆ పిల్లాడి డబ్బులన్నీ బరబరా లాగేసుకుంటుంది. దీంతో ఆ పిల్లాడు ఆ పిల్లకి ఎంతో ప్రాణప్రదమైన ఆట బొమ్మని కసబిసా లాగేసుకుంటే, ఆ పిల్ల పిల్లాడి టోపీ ఊడబీక్కుని పారిపోతుంది. వాడు బోడి గుండుతో బ్యారు మంటాడు. మళ్ళీ పిల్ల దగ్గర్నుంచీ ఉంగరం వూడ లాక్కుంటే, ఆ పిల్ల కన్నింగ్ గా, పిల్లాడు పేరెంట్స్ కి చూపించకుండా దాచేసిన సున్నా మార్కుల ప్రోగ్రెస్ రిపోర్టు కొట్టేసుకుని పోతుంది!

          ఇలాగన్న మాట. ఇరువైపులా ఇలా నష్ట తీవ్రత పెరుగుతూ పోవడమే టైం అండ్ టెన్షన్ థియరీ. అసలైన యాక్షన్ - రియాక్షన్ ల ఇంటర్ ప్లే.
   


          59. వేల సంవత్సరాలుగా ఆకట్టుకుంటూ ఇంకా మున్ముందు కూడా ఆకట్టుకోగల సాంప్రదాయ నిర్మాణాన్ని కలిగివుండే కథల నిర్మాణపరమైన నియమ నిబంధనల్ని ఉల్లంఘించి, అవాంట్ గార్డ్ పద్ధతిలో అంటే- కమర్షియలేతర యూరోపియన్ సినిమాల తరహాలో- ఇంకా చెప్పాలంటే మన ఆర్ట్ సినిమాల  టైపులోనే - కథ చెప్పాలనుకుంటే మిమ్మల్ని కాపాడే వారెవరూ వుండరని అంటున్నాడు ఇంటర్నెట్ స్క్రీన్ రైటింగ్ కోర్సు ఎడిటర్ లారెన్స్ కానర్. కనుక సాంప్రదాయబద్ధంగానే ( అంటే బిగినింగ్-మిడిల్-ఎండ్ నియమ నిబంధనల్ని పాటిస్తూ) కథ చెప్పాలనీ, చెబుతూ అందులోనే కొత్తగా, ఆశర్యపర్చే విధంగా కథనం చేసుకోవాలనీ చెబుతున్నాడు. ఇలా చెప్పే వాళ్ళు తెలుగు ఫీల్డులో లేరు, ఇదే సమస్య.

          60. చిత్ర నిర్మాతలు ఘరానా మనుషులు, వాళ్ళది సభ్యప్రపంచం. అయితే నా కళ్ళ ఎదుటనే కళ కోసం పాకులాడిన నిర్మాతలు పోయి, మాది వ్యాపారం, లాభాలు తియ్యటం తప్ప వేరే ఆశయం లేదు అని ఎలుగెత్తి చాటే నిర్మాతలు వచ్చారు. సినిమా రంగంలో చేరి  నాలుగు డబ్బులు చేర్చుకునే సదవకాశం వచ్చిన నాడు కళకు అశ్రుతర్పణం విడిచి, కళాదృష్టీ,  కళా ప్రమేయమూకళా వైఖరిని  విసర్జించటమాలేక ముష్టెత్తుతూ, అప్రయోజకుల జాబితాలోనూ, పిచ్చివాళ్ళ జాబితాలోనూ చేరటమా? సులువుగా తేలే  సమస్య ఎంత మాత్రమూ కాదు - కొడవటిగంటి కుటుంబరావు (1961).

(మరికొన్ని మరోసారి)
సికిందర్