రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

30, డిసెంబర్ 2016, శుక్రవారం

రివ్యూ!
రచన- దర్శకత్వం : జి. నాగేశ్వర రెడ్డి

తారాగణం : అల్లరి నరేష్, కృతిక, మౌర్యానీ, ప్రగతి, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, పోసాని, షకలక శంకర్, చమ్మక్ చంద్ర, చలపతి రావు, జయప్రకాశ్ రెడ్డి తదితరులు
మాటలు : డిమాండ్ రత్నబాబు, సంగీతం : సాయి కార్తీక్, ఛాయాగ్రహణం : దాశరధి శివేంద్ర నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్

విడుదల : 30 డిసెంబర్, 2016
***

       అల్లరి నరేష్ కి ఒక హిట్ లభించి నాలుగు సంవత్సరాలు గడిచిపోయాయి. 2012 లో  ‘సుడిగాడు’ తర్వాత నటించిన పదికి పది  సినిమాలూ పరాజయాల పాలయ్యాయి. ఇప్పుడు పదకొండోది వీటి పక్కన చేరుతోంది. తనకి ఫ్లాపులు పెద్ద లెక్కలేనట్టుంది, కానీ తన సినిమాలు చూడలేక ప్రేక్షకులు పైకి చెప్పుకోలేని ఇబ్బందిపడుతున్నారు. ఓపెనింగ్స్ కూడా అంతంత మాత్రంగానే  వుంటున్నాయి. ఎప్పుడో కోడి కూసింది, ఇప్పుడే తెల్లారిందన్నట్టు తను కూడా ఓ హార్రర్ కామెడీ చేయలేదు గనుక, ఈ ‘ఇంట్లో దెయ్యం’ ఇప్పుడు చేసినట్టు ప్రకటించాడు. ఇంకేం మిగిలింది  దెయ్యం కామెడీల్లో తను చూపించడానికి. ఏమీ మిగల్లేదు గనుకే ఈ దెయ్యం కామెడీ ఇంత అల్లరై పోయింది. ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమా కాని  సినిమా ఎందుకు తీసినట్టో అస్సలు అర్ధంగాదు. ఇంకేం తోచక టెక్నీషియన్లకి పని కల్పించడానికి ఈ సినిమాకి శ్రీకారం చుట్టినట్టుంది- ప్రేక్షకులకి గట్టి కారం ఘాటు కొట్టేలా!

     కామెడీలు తీసే దర్శకుడు జి. నాగేశ్వర రెడ్డి  ఈసారి మరీ కామెడీ అయిపోయాడు. తన మార్కు ఓల్డ్ కామెడీకి ఇక కాలం చెల్లినట్టేనని తెలుసుకోవడం లేదు. హిందీలో ఇలాగే కామెడీలు తీస్తూ వున్న డేవిడ్ ధావన్ కనుమరుగైపోయి అయిదేళ్ళ తర్వాత సల్మాన్- కత్రినా- గోవిందాలతో ‘పార్టనర్’ అనే సూపర్ హిట్ తో తిరిగి వచ్చి ఆశ్చర్య పర్చా డు. కాలాన్ని బట్టి తనూ మారాలనుకుని, ట్రెండీ టేకింగ్ తో యూత్ ఫుల్ కామెడీ తీశాడు. నాగేశ్వర రెడ్డి నుంచి కాలం దీన్నే డిమాండ్ చేస్తోంది. 

       కథలేకుండా కూడా పాతబడిన సరుకుని తిరగ మోతేసి సినిమాగా తీసేయవచ్చని నిరూపించ దల్చారు. హీరో (నరేష్), అతడి ఫ్రెండ్స్ (షకలక, చమ్మక్) లు బ్యాండు మేళం బ్యాచీ. రోడ్డు మీద ఒకమ్మాయిని చూడగానే ప్రేమలో పడిపోతాడు హీరో. ఆ హీరోయిన్ (కృతిక) వంద సినిమాల్లో వచ్చేసిన  చల్లారిపోయిన క్యారక్టర్నేతిరిగి పోషిస్తూ అనాధా శ్రమం నడుపుతుంటుంది! పైగా పుణ్యం కోసం రోజుకో ఆలయాని కెళ్ళి ప్రార్ధనలు చేసే పిచ్చితో ఇంకా పాతకాలం  హీరోయిన్లాగే  వుంటుంది! ఈమె వెంట పడుతున్న హీరోకి ఒకరోజు అనాధాశ్రమంలో ఓ పిల్లకి వంద సినిమాల్లో చూపించినట్టుగా గుండె చిల్లుపడి, ఆపరేషన్ కి డబ్బు అవసరం వుంటుంది!  ఆ డబ్బు అప్పుతెచ్చి హీరోగారు ఆపరేషన్ జయప్రదం చేసేసరికి ఫార్ములా ప్రకారం హీరోయిన్ ప్రేమలో పడిపోయి పాటేసుకుంటుంది!

        ఓ బంగాళా వుంటుంది. ఓ పెద్ద మనిషి (రాజేంద్ర ప్రసాద్) కూతురు పెళ్లి చేయడానికి ఆ బంగాళా కొనుక్కుని పరివారంతో దిగుతాడు. ఆ ఇంట్లోనే దెయ్యం వుంటుంది. అందర్నీ ఈడ్చి కొట్టేసరికి మంత్రగాళ్ళ కోసం చూస్తే హీరో తగులుతాడు. హీరో గారు పాత సుబ్బారావులా ఆపరేషన్ కోసం చేసిన అప్పు తీర్చాల్సి వుంది కాబట్టి, పది లక్షలు మాట్లాడుకుని మంత్రగాడి వేషం లో ఫ్రెండ్స్ తో వస్తాడు. ఆ దెయ్యం వీళ్ళందర్నీ కూడా ఈడ్చి కొట్టేసరికి దాన్ని హీరో గారు గుర్తు పట్టి- స్వప్నా! అని గట్టిగా ఇంటర్వెల్ బ్యాంగ్ కోసం దర్శకుణ్ణి ఉద్దేశించి ఓ అరుపు అరుస్తాడు. వెంటనే దర్శకుడు వూడిపడి, ఈ ట్రాష్ ని   ఇంకా పొడిగిస్తే బావుండదని ఠకీల్మని ఇంటర్వెల్  వేసి తప్పుకుంటాడు. గుంటూరు పల్నాడు ఏరియా నాటకం ఒక అంకం పూర్తయ్యింది. 

        రెండో అంకం జోలికి వెళ్ళనవసరం లేదు. కానీ ఈ రెండో అంకంలో హీరో పాత లవర్ డాక్టర్ (!) స్వప్న (మౌర్యానీ) ఫ్లాష్ బ్యాక్ కూడా ‘నందినీ నర్సింగ్ హోం’, ‘ఎక్కడికిపోతావు చిన్నవాడా’ ల్లో లాగే వుంటుంది పనిలోపనిగా. పెళ్లి రిజిస్ట్రార్ ఆఫీసులో పెట్టుకోవడం, పెళ్లి చేసుకోవడానికి హీరోయిన్ ఓ టూవీలర్ దొరికించుకుని దాని మీద వస్తూ యాక్సిడెంట్ లో హరీమనడం, ఇది తెలియని హీరో డుమ్మా కొట్టింది దొంగ నాయాల్ది అనుకుని కోపంతో వెళ్ళిపోవడం! అల్లరి నరేష్ కి హార్రర్ కామెడీలో నటించే కోరికతో పాటు,  రెండు సినిమాల్లో వచ్చేసిన ఈ క్లాసిక్ సీన్లో  నటించే అవకాశం కూడా బోనస్ గా దక్కింది!

      ఎప్పుడైతే దెయ్యం ఎంటరయ్యిందో, అల్లరి నరేష్ క్యారక్టర్ కుదేలైపోయింది- ఇక దెయ్యానిదే పాత కథ- పాత భయపెట్టడాలూ చంపడాలూ. దెయ్యానికి భయపడితే అదే కామెడీ, అవే ప్రాస పంచ్ లు, ఎవరికీ నటించాల్సిన అవసరం రాలేదు- రాజకీయనాయకుడు కూడా సభల్లో ప్రసంగించే టప్పుడు నటిస్తాడు. ఇదొక సినిమా అని తెలిసికూడా నటీనటులెవరూ నటించలేదు. డైలాగులతో నోటికి పని చెప్పేసి వెళ్ళిపోవడమే. బ్రహ్మానందం చప్పగా వచ్చి ఇంకా తన సరుకు ఐపోలేదంటాడు. జయప్రకాష్ రెడ్డి అవే తన బ్రాండ్ భారీ  అరుపులతో దెయ్యానికి భయపడే సీన్లేసుకుని వెళ్ళిపోతాడు. పాటలు కూడా పూర్తిగా ఎందుకని సగం సగంలో కత్తిరించేశారు. పరమ బ్యాడ్ రైటింగ్ కి నిదర్శనంగా వున్న దీనికి స్క్రీన్ ప్లే అని వేసుకోవడం ఘోరం. 

        కనీసం అల్లరి నరేష్ అప్పటి రాజేంద్ర ప్రసాద్ ని కాపీ కొట్టి  నటించినా  నటనలో మెరుగవుతాడు- లేకపోతే  ఇలాగే  మొక్కుబడిగా స్క్రీన్ మీద కన్పించి వెళ్లి పోతూంటాడు. ఇక తన  తర్వాతి కోరికేమిటో, అదెలా తీర్చుకో బోతున్నాడో ఉత్కంఠతో ఎదురు చూద్దాం!


- సికిందర్
http://www.cinemabazaar.in