రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

13, జూన్ 2022, సోమవారం

1172 - ఈ రోజు స్పెషల్ -12 pm   సినిమా తీయడానికి అరకొర బడ్జెట్టే చేతిలో వున్నప్పుడు ఒక్కటే మార్గం వుంటుంది. మేకింగ్ ని పైపైన మాక్రో లెవెల్లో చూడకుండా, లోతుపాతుల్లోంచి చూడడం. కథ లోతుపాతుల్నుంచీ మేకింగ్ ని మైక్రో లెవెల్లో బాగా అర్ధం జేసుకోవడం. ఇందుకు స్టీవెన్ స్పీల్బెర్గ్ వైపు దృష్టి సారించడం. హాలీవుడ్ లెజెండ్ స్టీవెన్ స్పీల్బెర్గ్ 25 వ యేట అరకొర బెడ్జెట్ తో తీసిన తొలి సినిమానే కల్ట్ క్లాసిక్ గా మార్చేశాడు. 1971 లో డ్యూయెల్ విడుదలై నేటికి 50 ఏళ్ళు దాటింది. నేటికీ దీనికి లక్షల మంది ప్రేక్షకులు, అభిమానులూ వున్నారు ఆన్ లైన్లో. బాగా చిన్నప్పుడే స్పీల్బెర్గ్ 8 ఎంఎం కెమెరా చేత బ ట్టుకుని చిత్రీకరణలు జరిపేవాడు. స్కూలు పోటీల్లో షార్ట్ ఫిలిమ్ తీసి ప్రథమ బహుమతి కూడా అందుకున్నాడు. కాలేజీ చదువు మధ్యలో ఆపేసి ఫిలిమ్ స్కూల్లో చేరిపోయి దర్శకత్వం నేర్చుకున్నాడు. ఎప్పుడూ కూడా అతడికి హాలీవుడ్ మీద, సినిమాల మీదా దృష్టి వుండేది కాదు. అందుకని టీవీ స్టేషన్లో చేరి సిరీస్ తీయడం మొదలెట్టాడు. అప్పుడు వచ్చిందే టెలి ఫిలిమ్ గురించి ఒక ఆఫర్. ఆ టెలి ఫిలిమ్ డ్యూయెల్ తీసి టీవీలో ప్రసారం చేస్తే విపరీత ఆదరణ పొందడమే గాక, సినిమాగా కూడా కొన్ని సీన్లు కలిపి విడుదల చేస్తే  స్పీల్బెర్గ్ కి అగ్రశ్రేణి దర్శకుల దర్బార్ లోకి ద్వారాల్ని తెరిచి పెట్టేసింది...


    త్యల్ప బడ్జెట్ తో 10 రోజుల్లో టెలి ఫిలిమ్ డ్యూయెల్ పూర్తి చేయాలని అప్పట్లో టీవీ స్టేషన్ ఆదేశం. జీవితంలో 10 రోజుల్లో సినిమా తీసే వుండరు తెలుగులో. ఒకవేళ తీయాల్సిన అవసరం ఏర్పడితే ఓ ఇండోర్ లొకేషన్ చూసుకుని ఆ ఇంట్లో పేరంటం జరుగుతున్నట్టు చుట్టేయడమే. ఇలా ఒక ఇంట్లో నడిచే ఇండోర్ కథనే అలవాటుగా ఆలోచిస్తారు. స్పీల్బెర్గ్  డిఫరెంట్ గా ఆలోచించాడు. ఆ 4 లక్షల డాలర్ల మినీ బడ్జెట్ కి  ఏకంగా హైవే మీద దౌడు తీసే ఔట్ డోర్ యాక్షన్ కథ నిర్ణయించాడు. ఇచ్చిన 10 రోజులు కాదు గానీ 13 రోజుల్లో పూర్తి చేశాడు. 1971 లో 4 లక్షల డాలర్లు అంటే అప్పటి మన రూపాయల్లో (డాలర్ కి రూ 7.50) 30 లక్షల రూపాయలు.  ఈ 30 లక్షల బడ్జెట్ తో ఆ రోజుల్లో ఎన్టీ రామారావు సినిమాలు 5 తీయవచ్చు. ఈ దృష్ట్యా స్పీల్బెర్గ్ కి 30 లక్షల బడ్జెట్ కేటాయించడం బాగా ఎక్కువే కదా అన్పిస్తుంది. కానీ మల్టీ మిలియన్ బడ్జెట్ల హాలీవుడ్ బజార్లో 4 లక్షల డాలర్లు అంటే- ఓ అర మిలియన్ లోపు లొట్టి పిట్ట డాలర్ల చాయ్ సిగరెట్ బడ్జెట్టే. రెండు దమ్ముల్తో వూది పారేసేంత.ఇది టెలి ఫిలిమ్ కోసం కేటాయించిన బడ్జెట్. దీన్నే సినిమాగా బూస్టప్ చేసి విడుదల చేయడంతో డెడ్ చీప్ బడ్జెట్ సినిమా అయింది. సాధారణంగా ముందు థియేటర్లో విడుదలై తర్వాత టీవీలో ప్రసారమవుతాయి సినిమాలు. డ్యూయెల్ విషయంలో ఇది తారుమారైంది. ముందు టీవీ మూవీగా లక్షల మంది చూసినప్పటికీ, తర్వాత సినిమాగా విడుదల చేస్తే అప్పుడూ విరగబడి చూశారు. ఇప్పుడూ ఆన్లైన్లో అంకిత భావంతో చూస్తున్నారు.     

  
   మొన్న స్వాతిముత్యం  సినిమా వెబ్ మేగజైన్లో గాంధీ వేసిన కార్టూన్ వచ్చింది. సినిమాని ముందు ఓటీటీకిచ్చి తర్వాత థియేటర్ రిలీజ్ చేస్తే ఎలా వుంటుందని కేప్షన్.  సినిమాల్ని థియేటర్లో విడుదల చేస్తే రెండు వారాల్లో ఓటీటీ కొస్తుందిలేనని థియేటర్లకి డుమ్మా కొడుతున్న ప్రేక్షకుల నుద్దేశించి ఈ కార్టూన్. ప్రేక్షకులు ఈ పల్స్ పట్టుకున్నాక ఆ విడుదలేదో ముందు ఓటీటీలోనే విడుదల చేసేస్తే సరిపోతుందిగా... ఇలాటి రోజులు కూడా వస్తాయేమో.
స్వాతిముత్యం వెబ్ మేగజైన్ 

    స్మాల్ మూవీస్ ని థియేటర్లో చూసేందుకు ఎవరూ రావడం లేదు. వాటి క్వాలిటీని చూసి ఓటీటీల్లో కూడా తీసుకోవడం లేదు. తెలుగులో క్వాలిటీతో తీసి ఓటీటీలో వేస్తే పెద్ద తెరమీద కూడా చూసి తీరాలన్న ఉత్సుకతని రేపాలి నిజానికి స్మాల్ మూవీస్. అప్పుడు
డ్యూయెల్ లాంటి ప్రయోగం తెలుగులో సక్సెసవుతుంది. క్వాలిటీ బావుంటే ముందు థియేటర్ రిలీజే చేసుకోవచ్చు కదా అనొచ్చు. స్మాల్ మూవీస్ క్వాలిటీ బావుందని థియేటర్లో రిలీజ్ చేస్తే బావుందన్న టాక్ వచ్చి వూపందుకోవడానికి ఓ వారం పడుతుంది. ఈ లోగా ఇంకేదో పెద్ద సినిమా వచ్చిందంటే దాన్ని థియేటర్లలోంచి లేపేస్తారు. ఈ గండం పొంచి వుంటుంది.

   అందుకని క్వాలిటీతో వున్న స్మాల్ మూవీస్ కి నిదానంగా మౌత్ టాక్ తో నిలబడేంత అవకాశమిచ్చే మంచి రోజులిప్పుడు లేవు. అందుకని మేకింగ్ చేస్తున్నప్పుడే ఫస్ట్ డే మార్నింగ్ షోని టార్గెట్ చేసి మేకింగ్ చేసుకోవాల్సిన అవసరం కన్పిస్తోంది. ఫస్ట్ డే మార్నింగ్ షో పడిందంటే ఇంకాలస్యం లేకుండా హిట్ టాక్ వచ్చేయాలి. ఆ షోతో ట్విట్టర్ రివ్యూలూ, వెబ్ రివ్యూలూ హిట్ టాక్ తో నిండిపోవాలి. స్మాల్ మూవీని తీసి విడుదల చేయడం కాదు, వైరల్ చేయాలి. స్మాల్ మూవీ కంటెంట్ విడుదలవడం కాదు, వైరల్ అవాలి. ఈ నైపుణ్యం అంతా డ్యూయెల్ లో వుంది.

అదృశ్య విలన్ 
స్పీల్బెర్గ్ జేబు ఖర్చు బడ్జెట్ తో డ్యూయెల్ ప్రారంభం నుంచీ ముగింపు వరకూ హైవే మీద ఏకబిగిన సాగే రోడ్ థ్రిల్లర్ ని వూహించాడు. ఆ కొద్దిపాటి బడ్జెట్ తోనే 2000 మైళ్ళ పొడవునా హైవే మీద షూట్ చేసుకుంటూ పోవాలి. తెలుగులో 20 మైళ్ళు  షూట్ చేసుకుంటూ పోయారో లేదో బ్యాంకు బ్యాలెన్స్ పెట్రోలు కంటే స్పీడుగా ఆవిరై పోతుంది. గుండె గుభేల్మని ఇక అదే కారేసుకుని అప్పుకోసం వూరూరా శరణార్ధుల్లా తిరగడం.

స్పీల్బెర్గ్ కథలో రెండే వాహనాలు. ఒక కారు, ఒక ఆయిల్ ట్యాంకర్ మధ్య యాక్షన్ సీన్లు. హీరో పాత్ర ఒక్కటే కన్పిస్తుంది కారులో, ట్యాంకర్ నడిపే విలన్ పాత్ర కన్పించదు. వెంటాడే ట్యాంకరే విలన్ గా కన్పిస్తుంది. పెద్ద భూతమేదో వెంట బడుతున్నట్టు. మనకైతే   ట్యాంకర్ లో వున్న విలన్నీ కూడా క్రూరంగా చూపిస్తే తప్ప సినిమా తీసినట్టు అస్సలుండదు. విలన్ కిచ్చుకున్న పారితోషికం జస్టిఫై అయిందన్పించదు.

ఇదో కథానిక
 ఒరిజినల్ గా ఇదొక కథానిక. ఈ కథానిక రిచర్డ్ మాథెసన్ అనే రచయిత రాశాడు. హైవే మీద తనకి జరిగిన ఒక అనుభవాన్ని పురస్కరించుకుని. ఈ కథానిక స్పీల్బెర్గ్ సెక్రెటరీ దృష్టిలో పడి (స్పీల్బెర్గ్ కి అప్పుడే ఒక సెక్రెటరీ!) స్పీల్బెర్గ్ కి చదవమని ఇచ్చింది. స్పీల్బెర్గ్ కి నచ్చి రిచర్డ్ మాథెసన్ చేతే స్క్రీన్ ప్లే రాయించుకున్నాడు. మాథెసన్ అప్పటికే స్క్రీన్ ప్లే రచయితగా వున్నాడు. రెండు వాహనాలతో యాక్షన్ సీన్స్ కి స్క్రీన్ ప్లే ఎలా రాస్తారు? ఇది చాలా ఆసక్తికరమైన అంశం. ఛేజింగ్స్ కూడా త్రీయాక్ట్స్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ లో కూర్చి చూపాడు మాథెసన్. పైకి చూస్తే గంటన్నర పాటు ఉరకలెత్తుతున్న ఉత్త ఛేజింగ్స్ లాగే అన్పిస్తుంది. ఇన్వాల్వ్ అయి చూస్తే ఈ ఛేజింగ్స్ కొక స్ట్రక్చర్ కన్పిస్తుంది. ఛేజింగ్స్ తో కూడిన కథనాన్ని  బిగినింగ్- మిడిల్- ఎండ్ అనే త్రీయాక్ట్స్ లో విభజించి, ఏ యాక్ట్ లో జరగాల్సిన బిజినెస్ ఆ యాక్ట్ లో, ప్లాట్ పాయింట్స్ సహా సమకూర్చడం ద్వారా, ఆద్యంతం ఒక సమగ్ర రోడ్ యాక్షన్ కథని సంతృప్తికరంగా కళ్ళముందుంచాడు రచయిత. వివరంగా దీన్ని స్క్రీన్ ప్లే సంగతుల్లో చూద్దాం.

   ఈ కథకి హీరోగా డెన్నిస్ వీవర్ (1924-2006) ని తీసుకున్నాడు స్పీల్బెర్గ్. 77 సినిమాల్లో నటించిన వీవర్ ని ఆర్సన్ వెల్స్ తీసిన టచ్ ఆఫ్ ఈవిల్ లో చూసి ఎంపిక చేసుకున్నాడు స్పీల్బెర్గ్. ఈ కొత్త కుర్రాడు ఏం దర్శకత్వం వహిస్తాడులేనని అయిష్టంగానే ఒప్పుకున్నాడు వీవర్. కానీ తీరా సినిమా విడుదలయ్యాక స్పీల్బెర్గ్ తన చేత నటింపజేసుకున్న విధానానికి మైమరచిపోతూ, యేటా రెండు సార్లు  డ్యూయెల్ ని చూసేవాడు తన నటన చూసుకోవడానికే వీవర్.

   ఇక కనిపించని విలన్ గా, ట్యాంకర్ ని నడిపే డ్రైవర్ గా  ప్రసిద్ధ స్టంట్ డ్రైవర్ కెరీ లాఫ్టిన్ (1914-1997) నటించాడు. యాభై ఏళ్ళ పాటు హాలీవుడ్ కి స్టంట్ సేవలందించిన లాఫ్టిన్-   ఫ్రెంచ్ కనెక్షన్, డైమండ్స్ ఆర్ ఫర్ ఎవర్, వాకింగ్ టాల్  మొదలైన సుప్రసిద్ధ సినిమాలకి పని చేశాడు.

కథ
భార్యా పిల్లలున్న డేవిడ్ మన్ ఒక బిజినెస్ ట్రిప్ మీద లాస్ ఏంజిలిస్ నుంచి బయల్దేరి వెళ్తాడు రెడ్ ప్లిమత్ కారులో. మానమాత్రుడు కనిపించని రెండు లేన్ల ఎడారి  రోడ్డు మీద అతడి ప్రయాణం ఒక భారీ ఆయిల్ ట్యాంకర్ వల్ల ప్రమాదంలో పడుతుంది. 18 చక్రాల ఆ భారీ ఆయిల్ ట్యాంకర్ కి వివిధ వాహనాల నెంబర్ ప్లేట్లు బిగించి వుంటాయి. ఆ నంబర్ ప్లేట్లు అతను అంతమంది వాహనదారుల్ని చంపిన గుర్తులుగా వుంటాయి. ముందున్న ఈ ట్యాంకర్ స్లోగా వెళ్తూ ఎంతకీ సైడ్ ఇవ్వకపోవడంతో, ఇచ్చినట్టే ఇచ్చి అడ్డురావడంతో డేవిడ్ మన్ కి మండిపోతుంది. ఎలాగో దాన్ని ఓవర్ టేక్ చేసి ముందుకు దూసుకు పోతాడు. ఇది ట్యాంకర్ డ్రైవర్ ఇగోని దెబ్బతీస్తుంది. ఈ డ్రైవర్ ఒక సైకో. తనని ఓవర్ టేక్ చేసి వెళ్ళిన డేవిడ్ మన్ మీద పగబట్టి  వెంటాడ్డం మొదలెడతాడు. డేవిడ్ మన్ ని చంపితీరాలన్న ప్రతీకారంతో వదలకుండా నరకం చూపిస్తాడు. ఈ సైకో డ్రైవర్ నుంచి డేవిడ్ మన్ ఎలా తప్పించుకున్నాడు? ఎన్నిసార్లు ప్రాణ గండంలో పడ్డాడు? సైకో డ్రైవర్ ని దెబ్బ తీయడానికి ఎలాటి ఎత్తుగడలు వేశాడు? హైవే మీద సుదీర్ఘ ప్రయాణపు ఈ ద్వంద్వ పోరాటంలో ఎవరు నెగ్గారు? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ
ఇది కథలా వుందా? ఇందులో కథేమైనా వుందా? ఓ కారుని ఓ ట్యాంకరు వెంటాడ్డం అంతేగా? ఇది మొత్తం సినిమాకి కథెలా అవుతుంది? క్లయిమాక్స్ అవుతుందేమో? క్లయిమాక్స్ ని గంటన్నర సాగదీసి సినిమాలాగా చూపిస్తే తెలుగు ప్రేక్షకులు తెలివి తక్కువ వాళ్ళా?... ఇలా ఆలోచించుకుని పక్కనబెడితే  ఇలాటి లో - బడ్జెట్ గ్లోబల్ సినిమా తెలుగులో తీయలేరు. గ్లోబల్ సినిమా ఎలాగంటే  ఇందులో డైలాగుల్లేవు. ప్రపంచమంతటా అందరూ చూడొచ్చు. ఆద్యంతం యాక్షనే. రెండోది, యాక్షన్లో కంగారు పెట్టించే సస్పెన్స్. సస్పెన్స్ వీడిపోగానే థ్రిల్ కల్గించే యాక్షన్. మళ్ళీ కంగారు పెట్టించే సస్పెన్స్...ఇంతే గాక, సస్పెన్స్ బ్రహ్మ ఆల్ ఫ్రెడ్ హిచ్ కాక్ ని తలపించే మిస్టీరియస్ వాతావరణ సృష్టి.

   స్పీల్బెర్గ్ కి హిచ్ కాక్ అంటే అభిమానం. తను టీవీ సిరీస్ తీస్తున్నప్పుడు హిచ్ కాక్ ని కలుసుకోవాలనుకుని ప్రయత్నించాడు. కలుసుకుని ఆయన కాళ్ళదగ్గర కూర్చుని, ఆయన చెప్పేవి వినాలనుకున్నాడు. అప్పుడు హిచ్ కాక్ ఫ్యామిలీ ప్లాట్ షూట్ చేస్తున్నాడు. దూరం దూరంగా తచ్చాడుతున్న స్పీల్బెర్గ్ ని చూపిస్తూ, ఆ అబ్బాయి మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడని వచ్చి హిచ్ కాక్ కి చెప్పాడు అసిస్టెంట్. హిచ్ కాక్ ఓ లుక్కేసి- వాడెవడు మంకీలా వున్నాడు, తరిమేయ్ - అన్నాడు. అసిస్టెంట్ వెళ్ళి గేటవతలి దాకా తరిమేశాడు స్పీల్బెర్గ్ ని.

   తర్వాత 1975 లో స్పీల్బెర్గ్ మరో క్లాసిక్ జాస్ తీసినప్పుడు స్పీల్బెర్గ్ ని కలుసుకోవడానికి ససేమిరా అన్నాడు హిచ్ కాక్. ఎందుకంటే,  జాస్ లో తన వాయిసోవర్ చెప్పడానికి అక్షరాలా మిలియన్ డాలర్లు జేబులో వేసుకున్నాడు హిచ్ కాక్. ఇప్పుడు స్పీల్బెర్గ్  ఎదుటపడితే, వాయిసోవర్ కి మిలియన్ డాలర్లు నొక్కేసిన బజారు వేశ్యలా కన్పిస్తాననని కలవడానికి ససేమిరా అన్నాడు హిచ్ కాక్.

   డ్యూయెల్ కెమెరా యాంగిల్స్ లో, ఎడిటింగ్ లో హిచ్ కాక్ టెక్నిక్స్ నే ఉపయోగించాడు స్పీల్బెర్గ్. డ్యూయెల్ ని చూసిన హిచ్ కాక్, ఈ సైలెంట్ సీన్లు స్వఛ్చమైన సినిమాకి ప్రతిరూపాలుగా వున్నాయని కొనియాడాడు. తక్కువ బడ్జెట్ తో తొలి సినిమా తీస్తున్న కొత్త మేకర్, ప్రముఖులనుంచి ఇలాటి ప్రశంసలు పొందాలని కోరుకోక పోతే, ఆ తొలి సినిమా తీసేందుకు ఏళ్ళ తరబడి స్ట్రగుల్ చేయడంలో అర్ధం పర్ధం ఏమాత్రం లేదనే చెప్పుకోవాలి.

స్క్రీన్ ప్లే సంగతులు
పైన చెప్పుకున్నట్టు రచయిత మాథెసన్ ఈ రోడ్ థ్రిల్లర్ కథానిక స్క్రీన్ ప్లేని అయిదారుసార్లు తిరగ రాశాడు. ఇందులో మాటలతో కథ జరగదు. మూవ్ మెంట్స్ తోనే జరుగుతుంది. సాధారణంగా కథల్లో హీరోకీ విలన్ కీ మధ్య మాట తేడా వచ్చి సమస్య ఏర్పడి, ఆ సమస్యని సాధించే గోల్ తో ప్లాట్ పాయింట్ వన్ వస్తుంది. కానీ ఇద్దరూ పరస్పరం ప్రత్యక్షంగా ఎదురుపడకుండా వుంటే? ఒకరి గురించి ఇంకొకరికి ఏమీ తెలియని అపరిచితులైతే? ఇద్దరి మధ్యా ఒక్క మాటా లేకపోతే? అప్పుడు వాళ్ళ మూవ్ మెంట్సే  మూగగా కథనాన్ని, యాక్ట్స్ ని, ప్లాట్ పాయింట్స్ నీ ఏర్పాటు చేస్తాయి. ఇలా ఈ స్క్రీన్ ప్లే యాక్ట్స్ కథనమూ, సంభాషణలు రహిత మూవ్ మెంట్సూ ఎలా కుదురుకున్నాయో ఇప్పుడు చూద్దాం.

బిగినింగ్ విభాగం

ఒక ఇంట్లోంచి కెమెరా పుల్ బ్యాక్ అయి రోడ్డు మీద టర్న్ తీసుకుని సిటీ ట్రాఫిక్ లో ముందుకు సాగుతుంది. ఇవి కెమెరాతో పాటూ ముందుకు సాగుతున్న వాహనం పాయింటాఫ్ వ్యూ షాట్స్. వాహనం రివీల్ కాదు. కెమెరా ఒక టన్నెల్ లోకి ప్రవేశిస్తుంది. టైటిల్స్ ప్రారంభమవుతాయి. టన్నెల్ దాటి ఇంకో టన్నెల్ గుండా పోతుంది కెమెరా. టైటిల్స్ కొనసాగుతాయి. కెమెరా మూడో టన్నెల్లోకి పోతుంది. టైటిల్స్ కంటిన్యూ.

   టన్నెల్ దాటేసరికి ట్రాఫిక్ లేని, జన సంచారంలేని లేని రూరల్ ఏరియా వస్తుంది. ఇప్పుడు వాహనం పాయింటాఫ్ వ్యూ షాట్స్ కట్ అయిపోతాయి. లాంగ్ షాట్ లో కారు రివీల్ అవుతుంది. అది రెడ్ కలర్ ప్లిమత్ కారు. పోతున్న కారుని ముళ్ళ కంచె ఫ్రేమ్ చేసి ఇంకో షాట్. ఇప్పుడు టైటిల్స్  పూర్తయి, మిర్రర్ లో కారు నడుపుతున్న హీరో డేవిడ్ మన్ ఫేస్ రివీలవుతుంది... ఇదంతా అయిదున్నర నిమిషాల సమయం తీసుకుంటుంది.

కాస్త విశ్లేషణ
బిగినింగ్ విభాగంలో ఈ మూవ్ మెంట్స్ ని చూస్తే ఇవన్నీ బిగినింగ్ విభాగపు బిజినెస్ లో తొలి భాగమైన కథా నేపథ్యపు ఏర్పాటు, పాత్రల పరిచయమనే మొదటి రెండు స్క్రిప్టింగ్ టూల్స్ గా అర్ధమవుతాయి. ఒక ఇంట్లోంచి (హీరో ఇల్లు) కెమెరా పుల్ బ్యాక్ అయి టర్న్ తీసుకుని ట్రాఫిక్ లో పోవడం చూస్తే దీనికో అర్ధముంది. స్పీల్బెర్గ్ అనే పాతికేళ్ళ కుర్రాడు ఇంట్లోంచి బయల్దేరిన కారుని చూపించకుండా, కారు నడుపుతున్న హీరోనీ కూడా చూపించకుండా, కెమెరా కన్నుతో చూపిస్తున్న సిటీ దృశ్యాలతో ఏం చెప్పాలని తాపత్రయ పడుతున్నాడు? ఏమిటి అప్పుడే పాతికేళ్ళకే పొడుచుకొచ్చిన అంతర్జాతీయ స్థాయి క్రియేటివిటీ? హిచ్ కాక్ ని తలదన్నే టాప్ క్లాస్ యాక్టివిటీ?

   ఈ కథ ఒక ప్రాంతపు నేపథ్యంలోంచి ఇంకో ప్రాంతపు నేపథ్యంలోకి మారబోతోంది... జన సమ్మర్ధమున్న సిటీనుంచి, జనసంచారం లేని రూరల్ ఏరియాకి. ఈ తేడా రిజిస్టర్ చేయాలనుకున్నాడు. ఈ తేడా రిజిస్టర్ చేయాలంటే, బయల్దేరిన కారుని రిజిస్టర్ చేయకూడదు, కారు నడుపుతున్న హీరోనీ రిజిస్టర్ చేయకూడదు. అంటే ఈ రెండూ చూపించకూడదు. ప్రేక్షకులు తదేక ధ్యానంతో తాము సిటీలో ప్రయాణిస్తున్నట్టు ఫీలయ్యేలా సిటీ దృశ్యాలనే చూపిస్తూపోవాలి. సిటీ దాటగానే మారిపోయిన కొత్త ప్రపంచంలోకి ప్రవేశించినట్టు రూరల్ వాతావరణాన్ని ఫీలవ్వాలి. ఈ స్థల మార్పు తేడాల్ని అనుభవించాలంటే కారునీ, హీరోనీ చూపించి కలుషితం చేయకూడదు. ఇదన్నమాట కెమెరా కన్ను అంతరార్ధం.

   మాథెసన్ స్క్రీన్ ప్లేలో ఈ వివరాలుండవు. షూటింగ్ స్క్రిప్టులో ఈ విజువల్ నేరేషన్ ఇచ్చుకున్నాడు స్పీల్బెర్గ్. క్లయిమాక్స్ దృశ్యాలకి మాత్రం  స్టోరీబోర్డ్ వేయించుకున్నాడు వేరే సంగతి.

   ఇంతేగాకుండా ఈ విజువల్ కథనంలో సింబాలిక్ షాట్స్ కూడా వున్నాయి. మూడు సార్లు టన్నెల్స్ లోంచి పోతున్నట్టు చూపించడమంటే మృత్యు కుహరంలోకి వెళ్ళబోతున్నట్టు అర్ధం. తర్వాత కారు రివీల్ అయినప్పుడు, ముళ్ళ కంచెలో ఫ్రేమింగ్ చేసి చూపడం అతను చిక్కుల్లో పడబోతున్నట్టు అర్ధం. ఇలాటి విజువల్ ఎలిమెంట్స్ ఫిలిమ్ నోయర్ జానర్ సినిమాల్లో వుంటాయి. పాత్ర ప్రమాదంలో చిక్కుకో బోతోందని చెప్పేందుకు సంకేతంగా ముళ్ళ కంచెలు, కిటికీ వూచలు, డోర్ గ్రిల్స్ ఫ్రేమింగ్ చేసి పాత్రని చూపించడం. అందుకని ఉన్నతంగా తీసిన సినిమాల్ని మనం కేవలం కళ్ళతో చూడకూడదు, మనసుతో చదివి అర్ధాల్ని అనుభవించాలి.

   కెమెరా ఇలా పెట్టి ఆ పాసింగ్ కారు పాన్ తీసుకో, కట్ చేసి కారులో హీరో ఫేస్ క్లోజప్ కూడా బాగా తీసుకో- ఈ చెట్టు బాగుంది, దీని పక్కనుంచి కారు ఎగ్జిట్ తీసుకో- అంటూ తోచినట్టు కెమెరామాన్ కి సూచనలివ్వడం మేకింగ్ కాదు. కథ చెప్పడం కాదు. ఇందుకే కథ లోతుపాతుల్నుంచీ మేకింగ్ ని చూడాలని పైన చెప్పుకున్నాం. తన కథ లోతుపాతుల్లో దాగున్న అర్ధాలు తనకే తెలియకపోతే కొత్త మేకర్ కి పై మెట్లు కష్టమైపోతాయి.

తర్వాతి టూల్స్  
పైన చెప్పుకున్న విధంగా కథా నేపథ్యమనే టూల్ ని ఏర్పాటు చేశాక, పాత్రల పరిచయమనే రెండో టూల్ చూస్తే- ఇప్పుడు నిర్జన హైవే మీద కారు కెదురుగా భారీ ఆయిల్ ట్యాంకర్ కన్పిస్తుంది. చాలా పాతబడిన ఆ ట్యాంకర్ నత్త నడక నడుస్తూ పొగ గొట్టంలోంచి  పొగ మేఘాలు వదుల్తూంటుంది. వూపిరాడక దగ్గుతూ వుంటాడు కారు నడుపుతున్న డేవిడ్. డేవిడ్ పాత్రని ఇలా చూపించడమే పరిచయం. ఇంతకన్నా వివరాలు ఇక్కడ వుండవు. రెండో పాత్ర ఆయిల్ ట్యాంకర్. ఈ ట్యాంకర్ డ్రైవర్ కన్పించడు. ముందు పాత్ర ట్యాంకర్ ని, దాని వెనుక పోతూ డేవిడ్ నీ ఇలా చూపించాక- ఇక మూడో టూల్ సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన.

   ఈ టూల్ మూవ్ మెంట్స్ తోనే వుంటుంది. ఈ మూవ్ మెంట్స్ ని జాగ్రత్తగా పరిశీలిస్తే సమస్యని ఏర్పాటు చేసే దిశగా (నాల్గో టూల్) బిల్డప్ తెలుస్తుంది. ముందు ట్యాంకర్, వెనుక కారు. కారు దగ్గర్నుంచి లో యాంగిల్లో పుల్ బ్యాక్ చేస్తూ వస్తూంటే, దాని ఇంజన్ రొదతో  ట్యాంకర్ రాక్షస రూపం పూర్తిగా వెల్లడవుతుంది. ఈ కెమెరా పుల్ బ్యాక్ షాట్ ట్యాంకర్ ముందు భాగాన్ని భీకరంగా రివీల్ చేస్తూ ఎండ్ అవుతుంది. ఇప్పుడు కూడా ట్యాంకర్ నడుపుతున్న డ్రైవర్ కన్పించడు.

   ట్యాంకర్ డ్రైవర్ వెనుక వస్తున్న కారుని గమనించినట్టు సైడ్ ఇస్తాడు. స్పీడు పెంచి డేవిడ్ ముందు కెళ్ళిపోతాడు. రిలాక్స్ అవుతాడు. వెనుక వున్న ట్యాంకర్  విపరీతమైన స్పీడుతో వచ్చేసి ఓవర్ టేక్ చేసేస్తుంది. కొంత దూరం వెళ్ళాక మళ్ళీ సైడ్ ఇస్తుంది. డేవిడ్ ముందు కెళ్ళిపోయి పూర్తిగా రిలాక్స్ అయి రేడియో ప్రోగ్రామ్ వింటూ డ్రైవ్ చేస్తూంటే, సడెన్ గా చెప్పాపెట్టకుండా వచ్చేసి ట్యాంకర్ భీకరంగా  ఓవర్ టేక్ చేస్తూంటే అదిరిపడి కంట్రోలు చేసుకుంటాడు డేవిడ్. మళ్ళీ సైడ్ ఇచ్చేసరికి ముందు కెళ్ళి పోతాడు. ఇక వెనుక ట్యాంకర్ ఇప్పుడు కన్పించదు. కొంత దూరంలో పెట్రోల్ బంకులోకి కారుని తిప్పుతాడు డేవిడ్. బరబరా మంటూ వచ్చేసి అతడి పక్కనే ధడేల్మని ఆగుతుంది ట్యాంకర్.

   డేవిడ్ తల పైకెత్తి డ్రైవర్ ని చూడ్డానికి ప్రయత్నిస్తాడు. కన్పించడు. ఇంతలో కారు విండో గ్లాస్ మీద  వాటర్ పడి దృశ్యం బ్లర్ అయిపోతుంది. వాటర్ కొట్టిన బంక్ వర్కర్ అద్దాన్ని తుడుస్తూ వుంటాడు. డేవిడ్ పెట్రోలు కొట్టించుకుంటాడు. వర్కర్ ఇంజన్ చెక్ చేస్తానని బానెట్ ఎత్తి చూసి రేడియేటర్ పైప్ మార్చాలంటాడు. తర్వాత మారుస్తానంటాడు డేవిడ్. అటు కారు కిందనుంచి అటూ ఇటూ తిరుగుతున్న కాళ్ళు కన్పిస్తాయి. జీన్స్ షూస్ వేసుకున్న ట్యాంకర్ డ్రైవర్ కాళ్ళు. డేవిడ్ వర్కర్ దగ్గర కాయిన్స్ తీసుకుంటూ వుంటే ఒక్కసారిగా ట్యాంకర్ హారన్ వినిపిస్తుంది. డేవిడ్ అటు చూస్తాడు. డ్రైవర్ చెయ్యి మాత్రం కన్పిస్తుంది.

డేవిడ్ లోపలి కెళ్ళి ఫోన్ బూత్ లో ఇంటికి కాల్ చేస్తాడు. భార్యతో కాల్ మాట్లాడుతూ వుంటే, వాషింగ్ మెషీన్ డోర్ తో ఫ్రేమ్ ఇన్ ఫ్రేమ్ చేసి, ఆ చట్రం లోంచి చూపిస్తుంది కెమెరా డేవిడ్ ని.

   డేవిడ్ బయటి కొచ్చి వర్కర్ కి డబ్బులిస్తూంటే గట్టిగా హారన్ కొడతాడు ట్యాంకర్ డ్రైవర్. అటు వు రుకుతాడు వర్కర్. డేవిడ్ కారు స్టార్ట్ చేసి పోనిస్తాడు...

   ఇదీ బిగినింగ్ విభాగం స్ట్రక్చర్. ఇందులో మూడవ, నాల్గవ టూల్స్ .ద్వారా కథనం ఏం చేశాడు స్పీల్బెర్గ్ ఆలోచించండి. రేపు ఇచ్చే విశ్లేషణతో సరిపోల్చుకోండి.

—సికిందర్