రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

12, డిసెంబర్ 2022, సోమవారం

1262 : రివ్యూ + స్క్రీన్ ప్లే సంగతులు

దర్శకత్వం : గంగాధర్
తారాగణం: విశ్వక్సేన్, వికాస్ వశిష్ట, ప్రియా వడ్లమాని, అయేషా ఖాన్, చైతన్య రావు, రవిశంకర్ తదితరులు
కథ, స్క్రీన్ ప్లే, మాటలు: సందీప్ రాజ్, సంగీతం: కాల భైరవ, ఛాయాగ్రహణం:  శ్రీనివాస్ బెజుగం
బ్యానర్: పాకెట్ మనీ పిక్చర్స్
నిర్మాతలు: ప్రదీప్ యాదవ్, మోహన్ యెల్లా
విడుదల : డిసెంబర్ 9, 2022
***
        క్రైమ్ సినిమాలు విరివిగా వస్తున్న క్రమంలో ముఖచిత్రం ఇంకో కొత్త దర్శకుడి ప్రయత్నంగా తెరపై కొచ్చింది. ఒకప్పుడు ఇవే క్రైమ్ సినిమాలు అన్ని భాషల్లో బి గ్రేడ్ సినిమాలుగా వచ్చి వెళ్ళి పోయేవి. ఇదే పరిస్థితి హార్రర్ సినిమాలది. హార్రర్ సినిమాల్ని ఈ శతాబ్దం ఆరంభంలో బాలీవుడ్ లో స్టార్స్ తో తీస్తూ బి గ్రేడ్ నుంచి అప్గ్రేడ్ చేయడంతో ప్రేక్షకులు పెరిగి మెయిన్ స్ట్రీమ్ సినిమాలుగా రావడం మొదలెట్టాయి. క్రైమ్ సినిమాలతో ఇది జరగలేదు.

        దీంతో చిన్న హీరో హీరోయిన్లతో, కొత్త హీరో హీరోయిన్లతో ఇప్పటికీ ఇవి మెయిన్ స్ట్రీమ్ లోకి రావడం లేదు. తెలుగులో ఎప్పుడో వచ్చే అడివి శేష్ క్రైమ్ సినిమాలు తప్ప స్టార్ స్టేటస్ కి అప్ గ్రేడ్ అవుతున్న దాఖలాల్లేవు. అయితే కొన్ని చిన్న సినిమాలు క్రైమ్ తో తీస్తే దృష్టినాకర్షించే కథాంశాలతో వుంటాయి. ఇది అరుదుగా జరుగుతుంది. దీన్ని జాగ్రత్తగా ఒడిసి పట్టుకుని ప్రేక్షకుల్లోకి తీసికెళ్ళ గలిగితే చిన్న క్రైమ్ సినిమాయే పెద్ద హిట్టయ్యే అవకాశముంటుంది. ఇలాటిదొక మెయిన్ స్ట్రీమ్ కథాంశం ముఖచిత్రం ది. మరి ఈ అవకాశాన్ని సొమ్ము చేసుకోగలిగారా? దీనికి గంగాధర్ అనే అతను కొత్త దర్శకుడు. రచన చేసింది కలర్ ఫోటో దర్శకుడు. ఈ ఇద్దరూ చేతిలో వున్న యూనివర్సల్ కథాంశాన్ని క్రైమ్ తో జోడించి ఏ మేరకు సద్వినియోగం చేసుకుని బాగు పడ్డారో చూద్దాం...  

కథ

    రాజ్  (వికాస్ వశిష్ట) కాస్మెటిక్ సర్జన్ హైదరాబాద్ లో. అతడ్ని మాయా ఫెర్నాండెజ్ (ఆయేషా ఖాన్) ప్రేమిస్తూంటుంది. ఈ చిన్నప్పటి ఫ్రెండ్ ని కాదనుకుని విజయవాడలో మహతి (ప్రియా వడ్లమాని) ని పెళ్ళి చేసుకుంటాడు. ఒక రోజు మాయా రోడ్డు ప్రమాదంలో మొహం చితికిపోయి కోమాలో కెళ్ళి పోతుంది. మరోవైపు మహతి మెట్ల మీంచి జారిపడి చనిపోతుంది. వీళ్ళిద్దరూ కూడా చిన్ననాటి స్నేహితురాళ్ళే. ఇప్పుడు మొహం చితికి పోయిన మాయ కోమాలోంచి తేరుకున్నాక ఛూస్తే, తన ముఖం మహతిలా మారిపోయి వుంటుంది. మొహం చితికిన మాయాకి చనిపోయిన భార్య మహతి చర్మం తీసి ప్లాస్టిక్ సర్జరీ చేశానని చెప్తాడు రాజ్. ఇప్పుడు మహతిలా వున్న మాయా జీవితమేమిటి? ఆమె మహతి గురించి తెలుసుకున్న నిజమేంటి? దాంతో మహతితో రాజ్ పాల్పడిన నేరాన్ని ఎలా బయటపెట్టి శిక్షించింది? ఇందులో లాయర్ విశ్వ (విశ్వక్సేన్) పోషించిన పాత్రేమిటి? ... వీటికి సమాధానాలు మిగతా కథలో తెలుస్తాయి.

ఎలావుంది కథ

    వైవాహిక అత్యాచారం (మారిటల్ రేప్) స్టోరీ ఐడియాతో ఈ క్రైమ్ కథ చేశారు. తెలుగు సినిమాల్లో బహుశా ఇది మొదటిసారి. ఇలా యూనిక్ ఐడియాగా వున్న దీని కథా విస్తరణ గందరగోళంగా వుంది. యూనిక్ ఐడియా గల్లంతయింది. సామాజిక బాధ్యత పెద్ద మాటగా అన్పించవచ్చుగానీ, ఈ యూనిక్ ఐడియా విషయంలో ఈ కథ ఒక బాధ్యతే అవుతుంది. కానీ అల్లరి నరేష్ తో నాంది తీసినప్పుడు చట్టంలోని సెక్షన్ 211 తో దేశ భాషల్లో ఎక్కడా రాని యూనిక్ కథని ఎలా బాధ్యత లేకుండా కిల్ చేశారో, అలా ముఖ చిత్రం తో చేశారు. ఈ కథ ఏ వైవాహిక అత్యాచార బాధితులకి బాసటగా వుండాలో అది గాకుండా చేశారు.  

        వైవాహిక అత్యాచారం దానికదే ఒక నేరం (కోర్టులు ఒప్పుకోకపోయినా నైతికంగా నేరమే). ఈ మౌలిక పాయింటుని  ఇంకో నేరంతో కలిపి కథ చేస్తే మౌలిక పాయింటే గల్లంతై పోతుంది. ఏదో వొక పాయింటుతో కథ చేయాలి- వైవాహిక అత్యాచారమా? ముఖ మార్పిడి  నేరమా? ఏదో వొకటి. రెండూ కలిపి చేస్తే మొదటిది బలై పోతుంది. ఇదే జరిగింది. ఈ ముఖ మార్పిడి కూడా గజిబిజి క్రైమ్ కథే.

        వైవాహిక అత్యాచారం ఐడియా అనుకున్నాక, దీని మార్కెట్ యాస్పెక్ట్ విశ్లేషించుకోకుండా, ముఖ మార్పిడి క్రైమ్ తో క్రియేటివ్ యాస్పెక్ట్ కి పూనుకున్నారు. మార్కెట్ యాస్పెక్ట్ తో స్పష్టత లేకుండా క్రియేటివ్ యాస్పెక్ట్ కి పాల్పడితే ఇంతే. మార్కెట్ యాస్పెక్ట్ ని బట్టి క్రియేటివ్ యాస్పెక్ట్ వుంటుంది. ఇది బ్లాగులో పదేపదే చెప్పుకున్న పాత విషయమే.

       వైవాహిక అత్యాచారం విస్తృత మార్కెట్ యాస్పెక్ట్ వున్న స్టోరీ పాయింటు. దేశంలో ఇంతవరకూ రాని పానిండియా మూవీగా  ఈ తెలుగు సినిమా వెళ్ళగల సామర్ధ్యమున్న పాయింటు. లొట్టపీసు లోకల్ సినిమా కాదు. ఈ పాయింటుని కాస్త రీసెర్చి ఏదో చేసుకున్నట్టు కూడా కనిపించదు. కోర్టులో తోచినట్టు వాదనలు జరిపి, వైవాహిక అత్యాచారం నిందితుడైన హీరో రాజ్ పాత్రకి పదేళ్ళు శిక్ష పడేట్టు చేసి శుభం అనేశారు.

        వైవాహిక  అత్యాచారాన్ని నేరంగా సుప్రీం కోర్టు కూడా గుర్తించనప్పుడు, శిక్షెలా పడుతుంది? భార్య సమ్మతి లేకుండా భర్త శృంగారానికి బలవంతం చేయడం రేప్ కిందికొచ్చే నేరంగా పరిగణించడానికి గతంలో రెండు రాష్ట్రాల హైకోర్టులు కూడా ఒప్పుకోలేదు. అసలు భార్యకి భర్త తనని రేప్ చేస్తున్నాడని నిరూపించడమే కష్టమని ప్రముఖ లాయర్ ఫ్లేవియా అగ్నెస్ అంటున్నారు. ఫలానా రాత్రి తను మూడ్‌లో లేనని, తను నిద్రపోయిన తర్వాత, లేదా అనారోగ్యంతో వుంటే, బలవంతం చేశాడని ఆమె నిరూపించాలి. ఇదొక ఛాలెంజ్ అవుతుందని ఆమె అంటున్నారు.

        అంటే దీన్ని కథగా చేయాల్సి వస్తే ఆ భార్య కోర్టులో విఫలమై బాధితురాలిగానే మిగలాలి చివరికి. అప్పుడు కోర్టులకీ, పార్లమెంటుకీ వినబడేలా ఆక్రోశించాలి. ఒక గట్టి ప్రశ్నతో ముగించాలి. ముఖచిత్రం కథలో మరణించిన స్నేహితురాలు మహతికి న్యాయం కోసం మాయా కోర్టులో పోరాడుతుంది. అయితే మహతి భర్తని శిక్షించలేమని కోర్టు తీర్పుతో తెలుసుకుని- మయా తనూ ఒక నిర్ణయం తీసుకుని తిరుగుబాటు చెయ్యాలి- స్త్రీ స్వాతంత్ర్యాన్ని చట్టం గుర్తించకపోతే, వైవాహిక అత్యాచారం నుంచి రక్షణ కల్పించకపోతే- స్త్రీ ఎందుకు పెళ్ళి చేసుకుని రిస్కు చేయాలి? ఏ మగాడు ఎలాటి వాడో ఎలా తెలుస్తుంది? అందుకని నేను పెళ్ళే చేసుకోను- స్వతంత్రంగా వుండగలిగేంత జీతం వచ్చే ఉద్యోగం సంపాదించుకుని బతికేస్తాను, మీ పెళ్ళి వ్యవస్థకో గుడ్ బైరా నాయనా  - అనేసి వాకౌట్ చేస్తే ఎంతో కొంత అర్ధముండొచ్చు కథకి. సామాజిక బాధ్యతో, కథా ప్రయోజనమో, మరోటో నెరవేర్చి పుణ్యం కట్టుకున్నట్టు వుంటుంది. ఇలా యూనిక్ ఐడియాతో ఇది సినిమా వైరల్ అవడానికి అవకాశమున్న మార్కెట్ యాస్పెక్ట్ అవుతోంది.

ఇంకా వుంది...

        మార్కెట్ యాస్పెక్ట్ చెప్పుకున్నాక, క్రియేటివ్ యాస్పెక్ట్ చూద్దాం. క్రియేటివ్ యా స్పెక్ట్ చూస్తే ఇది ఎక్కువగా ముఖమార్పిడి కథగా వుంది. ఈ కథలోంచి వైవాహిక అత్యాచారమనే స్టోరీ ఐడియా బయటికి రావడానికి సెకండాఫ్ లో ఇరవై నిమిషాలూ పట్టింది! ముఖమార్పిడి కథ పొదిగితే ఆ గుడ్డుని పగులగొట్టుకుని పుట్టిందే వైవాహిక అత్యాచారం అసలు కథన్న మాట. ఏం ఖర్మ! అంటే ఇలా సెకండాఫ్ లో అసలు కథ రివీల్ అయిందంటే మిడిల్ మాటాష్ స్క్రీన్ ప్లే అన్నమాట. గృహమే కదా స్వర్గసీమా అన్నట్టు మనో వీధుల్లో మాయా విహారం చేస్తూ రచిస్తే వచ్చేది మిడిల్ మాటాష్ స్క్రీన్ ప్లే అనే చెత్త. మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే సినిమాకి పనికి రాదా అంటే, కమర్షియల్ సినిమాకి పనికి రాదు. డబ్బులు రాని ఆర్ట్ సినిమా చేసుకోవచ్చు. ఆర్ట్ సినిమాలు మంచివి కాదని కాదు, యూరప్ తీసికెళ్ళి మంచిగా ఆడించుకోవచ్చు.

        హాలీవుడ్ నుంచి ఎవడో ఒకడు స్క్రీన్ ప్లే సంగతులు చెబుతూనే వుంటాడు నిత్యాన్న ప్రసాదం లాగా. మనకేం పట్టదు. మనకి మనమే స్క్రీన్ ప్లే సూపర్ హీరోలం, వీరులం. ఒకడు చెప్పేదేంటి. మన మనో వీధులు, సందులు, గొందులు మనకి పట్టా చేసి పెట్టి వున్నాయి. ఇంకొకడు చెప్పేదేంటి. ఎందుకు చెబుతున్నాడో, ఎక్కడెక్కడో తొంగి చూసి, సినిమాల్లోంచి సంగతులు లాగి, లాభ నష్టాలు ఎందుకు చెబుతూంటాడో అస్సలు అర్ధం గాదు! మన పట్టా పాస్ బుక్ తప్ప ఇంకేదీ అర్ధం గాదు.

        ఈ కథ ఫస్ట్ యాక్ట్ ఇలా వుంటుంది- ప్లాస్టిక్ సర్జన్ గా ప్రధాన పాత్ర హీరో రాజ్ పరిచయం, అతడి క్లాస్ మేట్ గా ప్రేమిస్తున్న మాయ పరిచయం కావడం, మాయని కాదని రాజ్ విజయవాడలో మాయా ఫ్రెండే అయిన మహతిని పెళ్ళి చేసుకోవడం, మాయాకి రోడ్డు ప్రమాదంలో ముఖం చితికి పోయి కోమాలో కెళ్ళి పోవడం, మహతి మేడ మీంచి పడి చనిపోవడం, మహతి బతకాలంటే మాయా కోలుకోవాలని రాజ్ అనడం- ఇంటర్వెల్.

      సుమారు గంట సేపు ఫస్ట్ హాఫ్ వుంటుంది. పై స్టోరీ బీట్స్ చూస్తే ఇంటర్వెల్లో కూడా కథేమిటో అర్ధం గాదు. మహతి బతకాలంటే మాయా కోలుకోవాలన్న రాజ్ మాటలతో ఇంటర్వెల్ ఏమర్ధమయ్యింది? అంటే చనిపోయిన మహతి రూపంతో మాయాకి సర్జరీ చేసి ఆమెలో మహతిని చూసుకోవాలనా? ఇదేనా సెకండాఫ్ లో చూడబోయే కథ? ఇదేనా ఫస్ట్ యాక్ట్ ముగింపు? ప్లాట్ పాయింట్ వన్? ఇవన్నీ నిర్ధారణ లేని వూహాగానాలు. ఎందుకంటే కాన్ఫ్లిక్ట్ ఏర్పడకపోతే కథ గురించి వూహాగానాలే తప్ప కథేమిటో అర్ధంగాకుండా పోతుంది. ఇదే జరిగింది ఇంటర్వెల్ తో- కాన్ఫ్లిక్ట్ లేక!

        ఇక సెకండాఫ్ లో కోమాలోనే వున్న మాయాకి సర్జరీ చేసి మహతిలాగా మార్చేస్తాడు. ఆమె కోమాలోంచి కోలుకున్నాక మహతి చనిపోయిన విషయం చెప్పి- మహతిలాగా తెచ్చుకుని ఇంట్లో వుంచుకుంటాడు. ఇలా ఇరవై నిమిషాలు గడిచాక ఆమెకి మహతి ఫోన్లో రికార్డింగ్స్ బయటపడతాయి- వాటి ప్రకారం రాజ్ శాడిస్టు. ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి రేప్ చేస్తున్నాడు. తను ప్రెగ్నెంట్ అయింది. అయినా వదలడం లేదు... ఇలా వైవాహిక అత్యాచారం విషయం ఇప్పుడు బయట పడుతుంది.

మిడిల్ కి మిగిలింది ఇంతే

    అంటే కథేమిటో ఇప్పుడు అర్ధమవుతోందన్న మాట. అంటే కాన్ఫ్లిక్ట్ ఫస్టాఫ్ ఇంటెర్వెల్ దాటుకుని సెకండాఫ్ లో ఇరవై నిమిషాల కొచ్చిందన్న మాట. అంటే సెకండాఫ్ లో సెకండ్ యాక్ట్ వుండాల్సిన స్పేస్ ని ఫాస్ట్ యాక్టే ఆక్రమించి సెకండాఫ్ ని- అంటే మిడిల్ ని మటాష్ చేసిందన్న మాట. అందుకే మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అన్నమాట.

        ఇప్పుడు సెకండాఫ్ లో సెకండ్ యాక్ట్ ఇరవై నిమిషాలు స్పేస్ ని నష్టపోయాక సెకండ్ యాక్ట్ కీ, ఆ తర్వాత థర్డ్ యాక్ట్ కీ మిగిలింది 40 నిమిషాలే. ఇందులోనే రెండూ పంచుకోవాలి. పంచుకుంటే సెకండ్ యాక్ట్ కి మిగిలింది పదీ పదిహేను నిమిషాలే. అంటే రెండు గంటల సినిమాలో 50 శాతం, అంటే గంట పాటు నడవాల్సిన సెకండ్ యాక్ట్ - అంటే మిడిల్- ఇంతలా కృశించి పోయిందన్న మాట!   

        ఇలా సినిమా ప్రారంభమయ్యాక గంటా 20 నిమిషాల పాటూ కథే ప్రారంభం కాలేదంటే అది సినిమా కాదన్న మాట. ఈ కథ వైవాహిక అత్యాచారం గురించి అని ఎప్పుడో సెకండాఫ్ లో తెలిసే వరకూ ప్రేక్షకులు కూర్చుని ఏం చేయాలి? ఇలావుందన్న మాట స్టోరీ ఐడియాతో క్రియేటివ్ యాస్పెక్ట్ సంగతి.

        చెప్పాలనుకున్న ముఖమార్పిడితో వైవాహిక అత్యాచారం కథ గనుక స్ట్రక్చర్ లో పెట్టి చెప్తే ఇలా వుంటుంది- ఫస్టాఫ్ అరగంటకల్లా మహతి చనిపోయి, ఆమె రూపంతో మాయాకి సర్జరీ జరిగి ఫస్ట్ యాక్ట్ - అంటే బిగినింగ్- ముగిసి ప్లాట్ పాయింట్ వన్ వస్తుంది. ఇప్పుడు సెకండ్ యాక్ట్- అంటే మిడిల్- ప్రారంభమై మాయా వచ్చి మహతిలా గా రాజ్ తో రాజ్ ఇంట్లో వుంటూంటే, ఇంటర్వెల్లో మహతి ఫోన్ రికార్డింగ్స్ ద్వారా  వైవాహిక అత్యాచారం విషయం బయట పడి, రాజ్ తో కాన్ఫ్లిక్ట్ ఏర్పడుతుంది. ఇలా కథేమిటో ఇంటర్వెల్లో అర్ధమయ్యేట్టు వుంటుంది.

    అయితే ప్రపంచమంతటా వైవాహిక అత్యాచారమనే అపరిష్కృత సమస్యగా వున్న బర్నింగ్ టాపిక్ గురించి సినిమా తీయాలనుకుంటే దాన్ని ముఖ మార్పిడి కథతో చేస్తే గజిబిజి అవుతుంది. ముఖ మార్పిడి విడిగా వేరే పాయింటు - ఆస్తికోసం భార్యని చంపి ఆమె ముఖాన్ని ప్రేయసికి అతికించి ఆడే నాటకంలాగా వేరే కథవుతుంది. దీనికి వైవాహిక అత్యాచారం పాయింటు కలిపితే డామినేట్ చేసేది ముఖమార్పిడి పాయింటే!

        అందుకని శుభ్రంగా కల్తీలేని వైవాహిక అత్యాచారం కాన్సెప్ట్ తో క్రైమ్ థ్రిల్లర్ చేస్తే, స్ట్రక్చర్ ఇలా వస్తుంది - ఫస్ట్ యాక్ట్ లో ప్లాస్టిక్ సర్జన్ గా ప్రధాన పాత్ర హీరో రాజ్ పరిచయం, అతడి క్లాస్ మేట్ గా ప్రేమిస్తున్న మాయా పరిచయం కావడం, మాయాని కాదని రాజ్ విజయవాడలో మాయా ఫ్రెండే అయిన మహతిని పెళ్ళి చేసుకోవడం, తర్వాత మహతి మేడ మీంచి పడి చనిపోవడంతో మాయాకి అనుమానాలతో ప్లాట్ పాయింట్ వన్ ఏర్పడ్డం.

        ప్లాట్ పాయింట్ వన్ మాయాతో ఎందుకంటే, మహతికి న్యాయం కోసం పోరాడేది మాయానే. ఇలా ప్లాట్ పాయింట్ వన్ లో ప్రధాన పాత్ర రాజ్ కి, ప్రత్యర్ధి పాత్రగా మాయా ఎస్టాబ్లిష్ అయిపోతుంది. ఎదురెదురు పాత్రల ఎస్టాబ్లిష్ మెంట్ లేకపోతే కథ సాగదు. సాగినా ఎలా సాగాలో తెలీదు.

        ఇప్పుడు ప్లాట్ పాయింట్ వన్ లో ప్రధాన పాత్ర చేతిలో వున్న గోల్ ప్రత్యర్ధి పాత్ర అయిన మాయా చేతికొచ్చేస్తుంది. మహతి మరణం మీద ఈమెకి అనుమానాలున్నాయి. ఈ అనుమానాలు తీర్చుకునే గోల్ తో సెకండ్ యాక్ట్ -అంటే మిడిల్- ప్రారంభమవుతుంది. ఈ మిడిల్లో సంబంధిత కథ జరుగుతూ, మాయా రాజ్ ఇంటికొస్తే, మహతి ఫోన్ రికార్దింగ్స్ దొరికి- ఆమె రాజ్ చేతిలో వైవాహిక అత్యాచార నరకాన్ని అనుభవించిందన్న నిజం తెలిసి -రాజ్ తో కాన్ఫ్లిక్ట్ ప్రారంభమై పోతూ ఇంటర్వెల్ వస్తుంది.

        ఇక సెకండాఫ్ లో సెకండ్ యాక్ట్ కొనసాగుతూ రాజ్ తో మాయాకి మిడిల్ బిజినెస్ మొదలవుతుంది. అంటే యాక్షన్- రియాక్షన్లతో కూడిన సంఘర్షణ. ఈ సంఘర్షణలో లాయర్ సాయం తీసుకుంటుంది. ప్రతిఘటించే రాజ్ తో సంఘర్షణ వెళ్ళి వెళ్ళి మాయాకి తగిన సాక్ష్యాధారాలు చిక్కడంతో- ప్లాట్ పాయింట్ టూ ఏర్పడి సెకండ్ యాక్ట్ - అంటే మిడిల్- పూర్తవుతుంది.

        ఇక థర్డ్ యాక్ట్ లో - అంటే ఎండ్ లో - కోర్టు డ్రామా వస్తుంది. ఇక్కడ మహతి బలైన వైవాహిక అత్యాచార నేరాన్ని లాయర్ తో కలిసి నిరూపిద్దామంటే, వైవాహిక అత్యాచారం అసలు నేరమే  కాదని కోర్టు కొట్టేస్తుంది. పైగా మహతీది ప్రమాదవశాత్తూ మరణం కాదని కూడా నిరూపించలేక పోతుంది మాయా. మహతిని చంపడం కూడా చేసిన రాజ్ ఓ నవ్వు నవ్వి వెళ్ళిపోతాడు. మాయా న్యాయ వ్యవస్థ మీద, ఇలాటి పెళ్ళి వ్యవస్థ మీదా ఓ రెబల్ స్టేట్ మెంట్ పారేసి- సెల్ఫ్ రిలయెంట్ ఇండిపెండెంట్ వుమన్ గా వాకౌట్ చేస్తుంది. ఇలా రఫ్ గా, కల్తీలేని శుభ్రపర్చిన వైవాహిక అత్యాచారం కథ సూటిగా తగిలేట్టు వుండొచ్చు.

ఇలా వుంది క్రైమ్ జానర్ మర్యాద
        ఇక సినిమాలో ముఖమార్పిడి కథ కూడా ఎలా వుందంటే- రాజ్ మహతి శవాన్ని ఏం చేశాడో తెలియదు. ఆమె ముఖ చర్మాన్ని తెచ్చి కోమాలో వున్న మాయాకి సర్జరీ చేసి అతికించేస్తాడు! ఆమెకి తెలియకుండా, ఆమె అంగీకారం లేకుండా మహతి ముఖంగా మార్చేస్తాడు. ఇది నేరం. అతను చేసింది ఐడెంటిటీ రీప్లేస్‌మెంట్ సర్జరీ. ఈ సర్జరీ చేయించుకునేది ఇద్దరే- క్రిమినల్స్, కొందరు పౌరులు. క్రిమినల్స్ ఎందుకు చేయించుకుంటారో తెలిసిందే. పౌరుల విషయానికొస్తే -తమ లొకేషన్‌లు, సామాజిక కనెక్షన్‌లు, రోజువారీ కదలికలు, ప్రైవేట్ సమాచారమూ ట్రాక్ చేయకుండా ప్రభుత్వాన్ని, లేదా వివిధ సంస్థల్ని నిరోధించడానికి ఐడెంటిటీ రీప్లేస్‌మెంట్ సర్జరీ చేయించుకుని తిరుగుతారు. దొరికితే చారల దుస్తులేసుకుని వేరే ఐడెంటిటీ నెంబర్ బిళ్ళతో కటకటాల వెనక్కి పోతారు.

        మాయా ఇదే పరిస్థితిలో పడుతుందని పట్టించుకోలేదు కథకుడు. ఆమె మహతిలా బతకాలన్నా ఎలా బతుకుతుంది? ముఖం మార్చుకోవచ్చు. ఆధార్ కార్డులెలా మేనిపులేట్ చేస్తుంది. సింపుల్ గా ఎక్కడో ఆధార్ అథెంటికేషన్ లో దొరికిపోతుంది. అసలు తన మీద రాజ్ చేసిన ఈ అక్రమాన్ని ఎలా సహిస్తుంది. వెంటనే కంప్లెయింట్ చేసి లోపలేయించాలి. కానీ ఇలా కూడా చేయదు. అతను మహతీలా ఇంటికి తీసుకుపోతే మహతిలా జీవిస్తూంటుంది!! తను మహతి అయితే మాయా ఏమైంది? దీనికేం చెప్తుంది? మాయా కనిపించడం లేదని ఇంటి ఓనర్ కంప్లెయింట్ చేస్తే ఏం చేస్తుంది?

        ఇక మహతికి న్యాయం కోసం కోర్టు కెక్కాక కోర్టుని దారుణంగా మోసపుచ్చుతోందని కూడా కథకుడు పట్టించుకో దల్చుకోలేదు. లాజిక్కా బొందా? సినిమా కథకి లాజిక్కేంటి, ఇదింతే అన్నట్టు దూసుకుపోయాడు. క్రైమ్ కథకి అతి ముఖ్య యోగ్యత, జానర్ మర్యాద లాజికల్ రీజనింగ్ అన్న విషయం అవసరమన్పించలేదు కథకుడికి. 

        చచ్చిపోయిన మహతి రూపంలో మహతిలా కోర్టులో కేసు పోరాడుతున్న మాయానీ, ఆమె లాయర్నీ చూస్తే- 
పాపం జడ్జి గారికి, ప్రాసిక్యూటర్ గారికీ ఈమె మహతి కాదు మాయా అని ఇంకా తెలీదు. మహతీయే అనుకుని జడ్జి గారి తీర్పు పాఠం...వైవాహిక అత్యాచార నేరం రుజువైనందున దోషి రాజ్ కి పదేళ్ళు కారాగార శిక్ష! ఇంతేనా, అతను హంతకుడు కూడా అన్న విషయం తెలియదా? వైవాహిక అత్యాచారం నేరమా? అది రుజువు చేయగల నేరమా? ఈజిట్? ఓకే, థాంక్యూ!

నటనలు-సాంకేతికాలు

        ఇందులో విశ్వక్సేన్ ది ముగింపులో కోర్టులో లాయర్ గా వాదించే అతిధి పాత్ర మాత్రమే. ఈ పాత్ర, మనసుపెట్టి నటించలేదు. కోర్టులో కామెడీ చేయాలా వద్దా అని డైలమాలో పడి ఎటూ గాకుండా నటించి సరిపెట్టాడు. మహతిగా నటించిన ప్రియా వడ్లమాని నటన ఒక్కటే చెప్పుకోదగ్గది. అయితే మహతిగా చనిపోయాక, మాయాకి తన రూపం వచ్చి, ఇంకా మహతిలాగే తను నటించడంలో లాజిక్ ఏమాత్రం లేదు. రూపం మారినంత మాత్రాన మహతి మాయ ఎలా అయిపోతుంది? మహతిగా రూపం మారిన ఆయేషా ఖానే మహతిగా నటించాలి, ప్రియా వడ్లమాని కాదు. ఈ లాజిక్ కూడా వదిలేసి ఆషామాషీగా పాత్రల్ని చుట్టేశారు.

        ఆయేషా ఖాన్ ఫస్టాఫ్ లో అరగంట కనిపించి కోమాలో కెళ్ళిపోయే పాత్ర. పాత్రకి రూట్స్ లేవు, నటనా కూడా సరిగా లేదు. హీరో రాజ్ గా, విలన్ గా వికాస్ వశిష్ట నటన కథా కథనాల ప్రమాణాలకి తగ్గట్టుంది. లాజిక్ లేని పాత్ర. ఇతడి ఫ్రెండ్ గా, మరో డాక్టర్ గా చైతన్యా రావు నటించాడు.

     ఇక సంగీతం గానీ, సాంకేతిక విలువలుగానీ లో బడ్జెట్ కి తగ్గట్టుగానే వున్నాయి. ఇలా కొత్తదర్శకుడు, ఇంకో దర్శకుడూ కలిసి- మారిటల్ రేప్ కథని గజిబిజి గందరగోళం చేసి వదిలారని చెప్పాలి. బాగుపడిందేమీ లేదు. ఇది చూశాక జీతేంద్ర- ముంతాజ్ లు నటించిన రూప్ తేరా మస్తానా గుర్తుకొస్తుంది - క్యారక్టర్ రీప్లేస్ మెంట్ థ్రిల్లర్.

—సికిందర్