రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

28, ఫిబ్రవరి 2021, ఆదివారం

 

Q :  సినిమా కంటెంట్ ని ఒకే మూసలో ఆలోచిస్తున్న వారికి దేర్ విల్ బి బ్లడ్ సంపూర్ణ విశ్లేషణ పెద్ద సినిమాల కంటెంట్ ని డిఫరెంట్ గా ఆలోచించేలా చేస్తుంది. కథలే గాక గాథలనేవి కూడా వున్నాయని కొత్త అవగాహన కలుగుతోంది. అయితే గాథల్లో నటించడానికి స్టార్స్ ముందుకొస్తారంటారా? రానప్పుడు ఇంత శ్రమ తీసుకుని మీరు విశ్లేషణ ఇచ్చి ప్రయోజనమేమిటి?
 శ్రీనివాస్ ఆర్, అసోసియేట్

A : గాథలు గాకపోయినా డిగ్నిఫైడ్ కథలతోనైనా ప్రయత్నాలు జరగడం లేదని కాదు, అయితే వాటిలో కూడా స్టార్స్ కి మసాలాలే కావాలి. ఫ్యాక్షన్ సినిమాల తర్వాత యాక్షన్ కామెడీలతో కొత్త దారి కన్పించింది. అయితే దశాబ్దంన్నర దాటినా ఈ దారే కన్పిస్తోంది. యాక్షన్ కామెడీల దగ్గరే ఆగి పోయారు స్టార్లు. ముందు దారి కనిపించడం లేదు. కనిపించినా నమ్మే పరిస్థితి లేదు. గొప్ప సినిమాలనేవి ఎన్టీఆర్, ఏఎన్నార్ ల దగ్గరే ఆగిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పటి జనరేషన్ ఎన్టీఆర్, ఏఎన్నార్ ల గొప్ప సినిమాల్ని యూట్యూబ్ లో విరగబడి చూస్తున్నారు. తరించిపోతూ కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటి జనరేషన్ ని కూడా స్టార్లు నమ్మడం లేదు.

Q :  నాంది సినిమా ఆర్టికల్ చదివాను. అయితే సినిమాలో హీరో ఒక సామాన్యుడు. తనకు నిజంగా రియల్ లైఫ్ లో అలా అన్యాయం జరిగినా, అతను జైలు నుంచి బయటకు వచ్చి మళ్లీ పోలీసుల మీద కేసులు పెట్టి పోరాటం చేసేంత ఓపిక, ధైర్యం ఉంటుందా? అతనలా చేస్తే పోలీసులు ఊరుకుంటారా? తనకు మళ్లీ పోలీసుల నుంచి ముప్పు ఉండదా? ఇవన్నీ తెలిసి సామాన్యుడు పోలీసులతో మళ్లీ పెట్టుకుంటాడా? అసలు ఈ సెక్షన్ లో ఉన్న లోపాలేంటి? వాటిని ఎలా సరిదిద్దాలి? ఎవరు సరిదిద్దాలి? ఇలా ఎన్నో సెక్షన్స్ దుర్వినియోగం చేస్తున్నారు కదా, దీనికి బాధ్యులు ఎవరు? ఇలాంటి బ్రహ్మాస్త్రం లాంటి సెక్షన్స్ గురించి కనీస అవగాహన కూడా లేకుండా ఉండడం ప్రజల తప్పే కదా?
కిరణ్, అసోసియేట్

A : ప్రజల గురించి కాదు, ప్రేక్షకుల గురించి కాదు, సినిమా గురించి మాట్లాడుకోవాలి. ఆర్టికల్లో కాన్సెప్ట్ గురించే మాట్లాడుకున్నాం. చెప్పిన కాన్సెప్ట్ సినిమాలో లేనప్పుడు పాత్ర చిత్రణల గురించి మాట్లాడుకో నవసరం లేదు. మీ ఇతర ప్రశ్నలకి సమాధానాలు ఆర్టికల్లోనే వున్నాయి. నల్సార్ యూనివర్సిటీ వైస్ ఛాన్సెలర్  ప్రొ. డాక్టర్ ఫైజాన్ ముస్తఫా, యూట్యూబ్ లో హిందీలో ప్రసారం చేస్తున్న లీగల్ ఎవేర్నెస్ వెబ్ సిరీస్ ద్వారా, చట్టాల గురించి ఎంతో అవగాహన కల్గిస్తున్నారు. వీటిని ఇతర భాషల్లో కూడా ప్రసారం చేయాలని డిమాండ్స్ వున్నాయి. తెలుగులో కూడా ప్రసారమైతే న్యాయ విజ్ఞాన సంబంధమైన లోటు తీరవచ్చు ప్రజలకి.

Q :  ఐ కేర్ ఎ లాట్ అనే ఇంగ్లీష్ సినిమా నెట్ ఫ్లిక్స్ లో చూసాను. అందులో డబ్బు కోసం ఒంటరిగా ఉండే ముసలి వాళ్ళను బురిడీ కొట్టించి హీరోయిన్ వాళ్ళ ఆస్తులు అమ్ముకుని లాభపడే రకం. అయితే అనుకోకుండా విలన్ తల్లిని కూడా అలాగే చేయబోయి విలన్ తో పోరాడాల్సి వస్తుంది. కానీ చివరలో విలన్ ఇచ్చిన ఆఫర్ ఒప్పుకుని అతనితో కలిసి బిజినెస్ చేస్తుంది.  మళ్లీ సినిమా ఎండ్ లో కర్మ ఫలం అన్నట్టు తన తల్లిని మోసం చేసిన ఒక వ్యక్తి చేతిలో హీరోయిన్ చనిపోతుంది. ఇలా హీరో విలన్ తో కలిసిపోవడం అన్నది ఎక్కడా చూడలేదు. కొత్తగా అనిపించింది. అసలు ఇలాంటి ప్రయోగాలు ఎలా చేయాలి? అలా హీరో విలన్ ఒకటై పోతే కథ ఎలా ఉంటుంది వివరించండి.
విడిఆర్, అసోసియేట్

A :  ఆ సినిమా చూడలేదు. కథ చదివితే, హీరోయిన్ తో ప్రాబ్లం వున్న మాఫియా బాస్, చివరికి హీరోయిన్ ని తనతో చేతులు కలపమంటాడు. చేతులు కలిపి రిచ్ గా డెవలప్ అవుతుంది. ఈ క్రమంలో ఆమె వల్ల అన్యాయానికి గురైన ఒకడు వచ్చి చంపేస్తాడు. ప్రధాన పాత్ర ప్రత్యర్ధితోనే చేతులు కలపడమన్నది కొత్త ఆల్టర్నేటే. అయితే ఇలా కొత్తగా కథ చెప్పే ధైర్యముండదు మనకి. హీరోయిన్ మాఫియా బాస్ ని బురిడీ కొట్టించడానికో- బకరా చేయడానికో చేతులు కలిపినట్టు టెంప్లెట్ లో పెట్టేస్తారు. ఇలా టెంప్లెట్ లో పెట్టేస్తే మరో చరిత్ర వుండేది కాదు. మరో చరిత్ర లో కమల్ - సరితలు గతంలో అవమానం చేసిన ఇద్దరు వచ్చి, వాళ్ళు కలుసుకోకుండా చంపేస్తారు. కర్మసిద్ధాంతం.

        పై సినిమాలో హీరోయిన్ ది నెగెటివ్ పాత్ర. అందుకని మాఫియాతో కలిసిపోయింది. ఆమె చేయాల్సిందేమిటి, ఇప్పటికైనా పాజిటివ్ గా మారి మాఫియాని ఎదుర్కోవడం. ఇలా చేయకపోవడంతో కర్మ ఫలం యాక్టివేట్ అయింది. అలా గతంలో ఆమె విరోధి వచ్చేసి తన విధి పూర్తి చేసుకుంటూ ఆమెని చంపేశాడు. ఇలాటి కథలకి ఇలా ప్లాట్ క్లయిమాక్స్ తో ముగింపు వుంటుంది. ఏ కథయినా స్టోరీ క్లైమాక్స్ కోసమే వుంటుంది. అంటే కమల్ - సరితలు ఏడాది పాటు కలుసుకోకుండా వుండాలన్న షరతు స్టోరీ పాయింటు. ఆ ఎడబాటుతో ఎలా స్ట్రగుల్ చేసి కలుసు కుంటారన్నది, కలుసు కోవడమన్నది, స్టోరీ క్లయిమాక్స్. కానీ అనుకున్నట్టుగా కలుసుకోలేక పోవడంతో ప్లాట్ క్లయిమాక్స్ అయింది. ప్లాట్ లో (కథనంలో) ఆల్రెడీ వాళ్ళ కర్మలు బీజాలు వేసి వున్నాయి కాబట్టి. పై హాలీవుడ్ సినిమాలో కూడా ఇదే. వర్మ కంపెనీ ముగింపులో అనూహ్యంగా విజయ్ రాజ్ వచ్చి, అజయ్ దేవగన్ ని షూట్ చేసి చంపడం కూడా ఇలాటిదే.

Q : మీరు నాంది  సినిమా గురించి రాస్తూ, సెక్షన్ 211 ను సినిమాలో సరిగ్గా చూపించలేదన్నారు. మరి రియల్ లైఫ్ లో  సెక్షన్ 211 ని ఒక సగటు మనిషి పోలీసుల మీద ప్రయోగించే అవకాశం ఎంత వరకూ ఉంది? అలా ప్రయోగిస్తే పోలీసులు ఊరుకుంటారా? రక్షణ ఇచ్చే మా మీదే తిరగబడడమేమిటంటే, అప్పుడు చట్టాలు, కోర్టులు, ప్రభుత్వాలు ఏం చేస్తాయి?
శివ, రైటర్

A :  ఆర్టికల్లోనే సమాధానముంది. ఈ చట్టం తీసుకుని పాత్ర, పోలీసుల మీది కెళ్తే ఏం జరుగుతుందో, ఏం జరగదో, ఎందుకు జరగదో చూపించి, ప్రశ్నించి వదిలేయాలన్నాం. పోలీసులే ఆలోచించేలా వాళ్ళ హృదయాల్ని తట్టినా చాలు.  

Q : మీరే 211 సెక్షన్  గురించి ఎంతో రీసెర్చ్ చేసి, కేరళ మాజీ డీజీపీ ఎన్ సి ఆస్థానా దీని మీద రాసిన సుదీర్ఘమైన ఆర్టికల్ గురించి చెప్పారు. మరి అలాంటిది ఈ సినిమా తీసిన మేకర్స్ ఎందుకు 211 సెక్షన్ గురించి అంత బాగా తెలుసుకోకుండా, మధ్యలో రివెంజ్ డ్రామా పెట్టీ ఒక గొప్ప ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్లాల్సిన సినిమాను ఇలా ఒక మామూలు సినిమాగా చేశారు? మామూలు కమర్షియల్ సినిమాలు వదిలేద్దాం. అవి ఎలా ఉన్నా పెద్దగా ఎవరికీ నష్టం ఉండదు. కానీ ఇలాంటి కొత్త విషయాలు కొత్త సెక్షన్స్ గురించి ఎడ్యుకేట్ చేసే సినిమాల్లో కూడా మరీ ఇంత అలసత్వం, బాధ్యతా రాహిత్యం ఉంటే ఏమిటర్థం? భవిష్యత్తులో ఇలాంటి సినిమాలు తీయాలి అనుకునేవారికి మీరిచ్చే సలహా ఏమిటి?
బిపిఎస్, అసోసియేట్

A : సలహా ఎందుకు, తట్టిందేదో చూద్దాం. నిజంగా రియలిస్టిక్ తీయాలనుకుంటే తీసే సబ్జెక్టుని రీసెర్చి చేసుకోవాలి. లేదూ మూస ఫార్ములా చాలనుకుంటే వచ్చిన మూస ఫార్ములాలు చూసుకోవాలి. ఓటీటీ తో కొత్తగా విస్తరిస్తున్న విశాలమైన గ్లోబల్ మార్కెట్ కూడా కావాలనుకుంటే రియలిస్టిక్స్ తీసుకోవాలి. లేదూ ఎబిసి సెంటర్ల పాత మార్కెట్టే  చాలనుకుంటే మూస ఫార్ములాలు తీసుకోవాలి. పైనుంచీ కిందిదాకా ప్రేక్షకుల చేతుల్లో స్మార్ట్ ఫోన్లు వచ్చేశాక ఏదీ లోకల్ గా లేదిప్పుడు. ఓటీటీ కారణంగా ఛానెళ్లలో ప్రసారం చేస్తున్న సినిమాలకి టీఆర్పీలు పడిపోతున్నాయని రిపోర్టు లొస్తున్నాయి. ఓటీటీ లో కూడా క్వాలిటీ కంటెంట్ ని కోరుకుంటున్నారు ప్రేక్షకులు. కనుక సబ్జెక్టులకి రీసెర్చి తప్పని సరి అవచ్చు.

        ఇక, రివ్యూల కోసం రీసెర్చి అవసరమా అని కూడా అన్పించక పోదు. ఎందుకంటే తీసే సినిమాలు అలాగే తీస్తారు. సినిమాలకి రీసెర్చి అంటే నవ్వడమే. కొందరే నమ్ముతారు. ఇగోని దాటి సబ్ కాన్షస్ లోకి వెళ్ళే వాళ్లు నమ్ముతారు.

Q : మీరు నాంది సినిమా మీద రాసిన ఆర్టికల్ చదివాను. మరి సినిమా తీసిన వాళ్ళు ఇలా జనాలకు తప్పుడు సమాచారం ఇచ్చినందుకు వాళ్ళ మీద జనాలు కేసు వేయవచ్చా ? అలా వేస్తే ఏం జరుగుతుంది?
కిరణ్, అసోసియేట్

A : ఏమీ జరగదు, కేసు వెనక్కొస్తుంది. ఒక న్యాయ విషయాన్నో, వైద్య విషయాన్నో, లేదా ఇంకేదైనా ఫోరెన్సిక్స్ లాంటి వైజ్ఞానిక విషయాన్నో సినిమా కోసం అలాగే చూపిస్తామన్న డిఫెన్స్ వుంటుంది. దీన్ని కాదనలేరు. ప్రేక్షకులే నిజమా కాదా క్రాస్ చెక్ చేసుకుని వూరుకోవాలి, మహానుభావుడు ఓసిడి మీద తీశామని హైప్ ఇచ్చారు. తీరా అది మామూలు ఎలర్జీ గురించే వుంది. ఎలర్జీని  ఓసిడి అనుకున్నారు. కొన్ని సినిమాల్లో ఇందులోని పాత్రలు, సంఘటనలు ఎవర్నీ ఉద్దేశించినవి కావు, కల్పితాలని డిస్ క్లెయిమర్ వేస్తూంటారు. న్యాయ, వైద్య విషయాలకి కూడా ఇలా డిస్ క్లెయిమర్ వేస్తే గొడవుండదు. కానీ స్క్రిప్టులో రాస్తున్న న్యాయ విషయమో, వైద్య విషయమో ప్రతి అక్షరం పచ్చి అబద్ధమని వాళ్ళకే తెలియనప్పుడు ఏం చేస్తారు. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ లాగా సినిమాలు తీసి వైరల్ చేయడమే!

Q :  హాయ్ అండి, ‘ఉప్పెన సినిమా పెద్ద హిట్. కొంత మంది మిత్రులు ఆ సినిమాను తిడుతూ ఇంకా ఎన్ని రోజులు ఈ పాత సినిమాలుపాత సీన్స్ తో తీస్తారు అన్నారు. కొంత మంది ఇంటర్డిగ్రీ కుర్రాళ్ళను అడిగితే అందరూ మాకు సినిమా బాగా నచ్చిందని అన్నారు. ఒక సినిమా అంత పెద్ద హిట్ అయిందంటే అందులో ప్రేక్షకుడికి నచ్చే అంశాలు ఉండే ఉంటాయి అని నా నమ్మకం. ఒక విశ్లేషకుడిగా ఆ సినిమా మీద మీ అభిప్రాయం చెప్పగలరా?
మహేష్, రైటర్

A : మేల్ ఇగో లేదా సెల్ఫ్ పీటీ. మేల్ ఇగోతో వుండే వాళ్లకి తామే పరిస్థితుల్లో వున్నా అమ్మాయి తమ కోసమే వుండాలన్న మైండ్ సెట్ తో కావచ్చు;  ప్రస్తుతం దయనీయ స్థితిలో వున్న వాళ్ళకి అమ్మాయి తమ పట్ల జాలితో వుందన్న సెల్ఫ్ పీటీ వల్ల కావచ్చు - సినిమాని హిట్ చేసి వుంటారు. 


సికిందర్