రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

30, జూన్ 2016, గురువారం

షార్ట్ రివ్యూ!






రచన –దర్శకత్వం : చేరన్ 

తారాగణం : శర్వానంద్, నిత్యా మీనన్, సంతానం, ప్రకాష్ రాజ్ తదితరులు
సంగీతం : జివి ప్రకాష్ కుమార్, ఛాయాగ్రహణం :  సిద్దార్థ్  
బ్యానర్ : బృందావన్ పిక్చర్స్ , నిర్మాత : డి. ప్రతాప్ రాజు
విడుదల : 25 జూన్, 2016
***
ర్వానంద్ నటించిన ద్విభాషా చలనచిత్రం ‘రాజాధిరాజా’ మొత్తానికి విడుదలయ్యింది. చేరన్ దర్శకత్వంలో నిత్యా మీనన్ తో కలిసి నటించాడు. చేరన్ గతంలో ‘ఆటోగ్రాఫ్’ అనే హిట్  తీశాడు. చేరన్ కి ఆటోగ్రాఫులు, బయోగ్రఫీలు, డైరీలూ అంటే బాగా ఇష్ట మున్నట్టుంది.జేకే  ఎనమ్ నాన్ బనిన్ వళక్కాయ్’  అని ‘రాజాధి రాజా’  తమిళ వెర్షన్ కి టైటిల్ పెట్టాడు. అంటే ‘నా మిత్రుడు జేకే జీవితం’ అని అర్ధం. ఎవరా మిత్రుడు? ఏమిటా జీవితం?...ఒకసారి తెలుసుకుందాం.
కథ???
      ఐటీ ప్రొఫెషనల్ జయకుమార్ (శర్వానంద్) ఫ్రెండ్స్ తో కలిసి విచ్చలవిడిగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తూంటాడు. అలాంటిది అకస్మాత్తు గా బుద్ధిమంతుడై పోతాడు. సీరియస్ గా ఇంటిని పట్టించుకోవడం మొదలెడతాడు. రిటైర్ అయిన తండ్రి, తల్లి, ఇద్దరు పెళ్లి కావాల్సిన చెల్లెళ్ళు, ఒక చదువుకుంటున్న తమ్ముడూ వుంటారు. వీళ్ళందరూ జీవితంలో స్థిరపడడానికి చర్యలు చేపడతాడు. ఉద్యోగం మానేసి ఫ్రెండ్స్ ని కలుపుకుని ఫ్లాట్స్ ని శుభ్రం చేసే క్లీన్ అండ్ గ్రీన్ అని కంపెనీ పెడతాడు. రియల్ ఎస్టేట్ లోకి దిగి డూప్లెక్స్ లు కట్టే ప్రణాళిక వేస్తాడు. ఫ్లవర్ బిజినెస్ ప్రారంభిస్తాడు, ఫ్యాషన్ డిజైనింగ్ మొదలెడతాడు. ఈ వ్యాపారాల్లో గర్ల్ ఫ్రెండ్ నిత్య కూడా తోడ్పడుతూంటుంది. వ్యాపారాలు బాగా సాగుతున్నప్పుడు బడా రియల్ ఎస్టేట్ వ్యాపారి రుద్ర (ప్రకాష్ రాజ్) దెబ్బ తీస్తాడు, ఫలితంగా రియల్ ఎస్టేట్ వెంచర్ ని అతడికే తక్కువకి  అమ్ముకోవాల్సి వస్తుంది. ఆ డబ్బుని తనతో పనిచేస్తున్న ఏడుగురు ఫ్రెండ్స్ తో పంచుకుంటాడు. పెద్ద చెల్లెలికి  సంబంధం చూస్తాడు. దానికి పెద్ద మొత్తంలో కట్నం అవసరమేర్పడి మళ్ళీ ఫ్రెండ్స్ దగ్గరే  అప్పుతీసుకుంటాడు. నిత్యకి కార్డియాక్ ఆస్థమా  జబ్బు వుంటుంది. గుండె మార్పిడి చేయాలి. అది కూడా చేయిస్తాడు జేకే. తన కుటుంబానికి ఫ్లాట్ కొని అందులోకి మారుస్తాడు. చెల్లెలి పెళ్లి ఘనంగా చేస్తాడు. ఇంతలో ఒక వూళ్ళో  ఇంకో సమస్య తలెత్తుతుంది. ఆ సమస్య ఎందుకొచ్చిందో నిత్యకి చెప్తాడు. ఆ సమస్య తీరుస్తాడు. తిరిగి వచ్చి కంపెనీల్ని ఫ్రెండ్స్ పేర రాసేసి శాశ్వతంగా విదేశాలకి వెళ్ళిపోతాడు...

        ఎందుకిలా చేశాడు? అసలేం జరిగిందతడికి? జీవితాన్ని విచ్చలవిడిగా ఎంజాయ్ చేస్తున్న వాడు ఎందుకు సీరియస్ గా మారిపోయి ఈ పనులన్నీ చేశాడు? వీటికి సమాధానాలు అతడు గడిపిన విశృంఖల జీవితంలోనే దొరుకుతాయి.
ఎలావుంది కథ  
     దురదృష్టవశాత్తూ కథకీ, గాథకీ ఇంకా తేడా తెలుసుకోలేదు దర్శకుడు చేరన్. కథ అనుకుంటూ గాథలుగా తీసిన అనేక ఫ్లాప్ సినిమాలొచ్చాయి భారీ  ‘బ్రహ్మోత్సవం’ తోబాటు! ఒకదాని తర్వాత ఒకటి కృష్ణ వంశీ తీసిన ‘మొగుడు’, ‘పైసా’ రెండూ  కూడా టాప్ బ్రాండ్ అట్టర్ ఫ్లాప్ గాథలు రికార్డు స్థాయిలో. మనవాళ్ళ సినిమా నాలెడ్జి ఇలా వుంటోంది. చేరన్ అయితే కృష్ణవంశీ రికార్డు కూడా బద్దలు కొడుతూ ఏకంగా ద్విభాషా చలన చిత్రంగా ఈ గాథని తలపెట్టాడు. 2013 లో పూర్తి చేస్తే, 2015 వరకూ తమిళ వెర్షన్ విడుదలే  కాలేదు. చివరికి డీవీడీ లు విడుదల చేసి చేతులు దులుపుకోవాల్సి వచ్చింది. శర్వానంద్- నిత్యామీనన్ -ప్రకాష్ రాజ్ ల వంటి  స్టార్స్  సినిమాకి ఈ పరిస్థితి. ఇక తెలుగు వెర్షన్ కి ‘ఏమిటో ఈ మాయ’  అని తమ మీద తామే జోకు వేసుకుంటున్నట్టు టైటిల్ పెట్టి అమ్మకానికి పెడితే, నలిగినలిగి ‘రాజాధి రాజా’ గా రూపాంతరం చెంది ఇలా విడుదలయ్యింది. దర్శ కులు, హీరోలు, నిర్మాతలూ ఇప్పటికీ ఎందుకిలా జరిగిందో తెలుసుకుంటారా అంటే, అంత నాలెడ్జి ఎక్కడిది? కథ అనుకుంటూ గాథ తీయాల్సిందే, గాథలు తీశాక వాటి తడాఖా చవి చూడాల్సిందే కోట్లు వదిలించుకుని
          కథా గాథా అన్నది పక్కన పెడితే, అసలిందులో విషయం ఎంత పాతది... అనగనగా ఒక హీరో రాము, చాలీ చాలని జీతం, రిటైరైన తండ్రి,  చాకిరీ చేసే తల్లి, పెళ్లి కెదిగి కూర్చున్న చెల్లెళ్ళు, డాక్టరీ చదవాలనుకుంటున్న తమ్ముడూ...వీళ్ళకోసం కుటుంబరావులా  బతుకు బండిని ఈడుస్తూ...బాపతు కథల సినిమాలు  ఇంకానా! ట్రెండ్, బాక్సాఫీసు అప్పీల్, యూత్ అప్పీల్,  మాస్ అప్పీల్ ల వంటి  కమర్షియాలిటీలు పట్టని ‘విషయం’ ఎలా వర్కౌట్ అవుతుందనేది కామన్ సెన్సు కదా? దీనికి తోడు హార్ట్ పేషంట్లు, బ్రెయిన్ ట్యూమర్ పేషంట్లు కూడా వుంటే ఇంకేం  చెప్తాం!
ఎవరెలా చేశారు 
      సీరియస్ వాతావరణంలో అందరూ సీరియస్ గా వున్నప్పుడు చేయడానికి  ఇంకేముంటుంది.  ప్రారంభం నుంచీ ముగింపు వరకూ విషాదాన్ని ఒలకబోస్తూ కన్పించే నటీనటులతో –శర్వానంద్, నిత్యా మీనన్ సహా- ఆఖరికి  కమెడియన్ సంతానంతో  కూడా-ఎక్కడా  రిలీఫ్ అనేది వుండదు. సినిమాలో ఎంటర్ టైన్ మెంట్, కాస్త నవ్వు, మరికాస్త హుషారు అనేవి లేకుండా ప్రవర్తించే నటీనటుల ప్రతిభాపాటవాల గురించి చెప్పుకోవదానికేమీ వుండదు. జివి ప్రకాశ కుమార్ సంగీతం ఇంకో నీరసమైన వ్యవహారం. ఛాయాగ్రహణం, కళా దర్శకత్వం బావున్నాయంటే. 

చివరికేమిటి 
         ‘నా మిత్రుడు జేకే జీవితం’ ద్వారా విచ్చలవిడి జీవితాల్ని  గడిపే యూత్ ఒకనాటికి అనుభవిస్తారని చెప్పడం దర్శకుడి ఉద్దేశం. యూత్ కి పాఠాలు చెప్పే కాలం కాదని మా ఉద్దేశం. కావలసినంత ఎంటర్ టైన్ చేసి వదిలెయ్యాలని బాక్సాఫీసు కూడా విన్నవించుకుంటుంది. బాగా ఖర్చుపెట్టి ఎంత క్వాలిటీతో తీసినప్పటికీ, దర్శకుడికి ఎంత కళా హృదయమున్నప్పటికీ, కాస్త ప్రేక్షకుల్ని కూడా పట్టించుకుని తీస్తే ఇలాటి పరాభవాలు ఎదురుకావు. కుటుంబరావులూ క్యాన్సర్ వ్యాధులూ లాంటి అరిగిపోయిన విషయాలు డైరీల్లో, ఆటో బయోగ్రఫీల్లో మాత్రమే బావుంటాయనేదీ, సినిమాల్లో బావుండవనేదీ  ఇవ్వాళ్ళ కొత్తగా చెప్పుకోవాల్సిన  విషయం కాదు.
స్క్రీన్ ప్లే సంగతులు 
       కథ ఒక ఆర్గ్యుమెంట్ ని ప్రతిపాదిస్తుంది. గాథ ఒక స్టేట్ మెంట్ నిస్తుంది. అనిల్ కుమార్ రోడ్డు మీద పోతూంటే యాక్సిడెంట్ జరిగింది. హాస్పిటల్లో చేరాడు. కాలు ఫ్రాక్చరైందని తేల్చారు. తిరిగి నడవాలంటే కొన్ని నెలలు పడుతుందని చెప్పారు. కొన్ని నెలల తర్వాత తిరిగి ఎప్పటిలా నడవసాగాడు. ఇది గాథ. ఇది ఇలా  స్టేట్ మెంట్ మాత్రంగా వుండిపోతుంది. 

        అనిల్ కుమార్ రోడ్డుమీద పోతూంటే యాక్సిడెంట్ జరిగింది. హాస్పిటల్లో చేరాడు. ఆ వాహనదారుడి మీద కేసు పెట్టాల్సిందే నని  పట్టుబట్టాడు. కోర్టులో కేసు వేశారు. అనిల్ కుమార్ కేసు పోరాడి గెలిచాడు. వాహనదారుడిదే తప్పని తేలింది. అనిల్ కుమార్ కి నష్ట పరిహారం లభించింది. ఇది కథ . ఇది  ఆర్గ్యుమెంట్ ని ప్రతిపాదిస్తోంది. స్టేట్ మెంట్ మాత్రంగా వుండిపోయిన  గాథ ఎంత  చప్పగా వుందో, ఆర్గ్యుమెంట్ ని ప్రతిపాదిస్తున్న కథ అంత  ఆసక్తి కరంగా వుందని తేలుతోంది. ఇందుకే సినిమాలకి పనికొచ్చేది కథలే, గాథలు కాదు. 

        ఇంకోటి గమనిస్తే- గాథకి స్ట్రక్చర్  వుండదు, కథకి వుంటుంది. సినిమాకి స్ట్రక్చరే ముఖ్యం.  గాథలో బిగినింగ్ మాత్రమే వుండి, సాగి సాగి  బిగినింగ్ తోనే ముగుస్తుంది. అందుకని సినిమాకి పనికి రాదు. కథ కి బిగినింగ్ తో బాటు మిడిల్, ఎండ్ కూడా వుండి  సంతృప్తికరంగా ముగుస్తుంది. 

        గాథకి ప్లాట్ పాయింట్స్ వుండవు, కథకి వుంటాయి. కథకి క్యారక్టర్ ఆర్క్ వుండదు, ఎలా వున్న పాత్ర అలా నిస్తేజంగా పడి వుంటుంది. కథకి క్యారక్టర్ ఆర్క్ తో పాత్ర ఉద్విగ్నభరితంగా వుంటుంది. గాథకి టైం అండ్ టెన్షన్ గ్రాఫ్ వుండదు, కథనం నేలబారుగా సాగుతూ వుంటుంది. కథకి టైం అండ్ టెన్షన్ గ్రాఫ్ వుంటుంది, కథనం ఉత్థాన పతనాలతో కట్టి పడేస్తుంది.

        గాథలో సంఘర్షణ వుండదు, సంఘర్షణ లేనిది కథ వుండదు. గాథకి ప్రతినాయక పాత్ర వుండదు, కథకి ప్రతినాయక పాత్ర కీలకం. గాథలు ఆర్ట్ సినిమాలకి బావుంటాయి, కథలు కమర్షియల్ సినిమాలకి బావుంటాయి. 

        ఇవన్నీ ‘రాజాధిరాజా’ సినిమా పొడవునా గమనించవచ్చు. గాథతో జరిగే మోసమేమిటంటే, అది గాథ  అని చాలాసేపటి వరకూ తెలీదు. ఇంకా ప్లాట్ పాయింట్ వన్ వస్తుందనే ఎదురు చూస్తూంటాం. ఎంతకీ రాదు, విశ్రాంతి వచ్చేస్తుంది. అది కూడా ప్లాట్ పాయింట్ వన్ కాదని తేలడంతో అప్పుడు తెలుస్తుంది మోసం. మోసపోయామే అని లేచిపోవడమో లేక,  ఏం చేస్తాం ఖర్మ అనుకుని మిగతాదంతా చూడడమో చేస్తాం.

        ‘రాజాధిరాజా’ లో  మొదటి పదినిమిషాలు హీరో విశృంఖల జీవితాన్ని చూపిస్తారు పాటతో సహా. ఆ తర్వాత అతను ఎందుకో మారిపోయి కుటుంబ బాగు కోసం వ్యాపారాలు పెడుతున్నట్టు  చూపించు కొస్తూంటారు. ఒకదాని తర్వాత ఒకటి కంపెనీలు పెట్టడం, వాటికి  ప్రచారం చేసుకోవడం, కష్టమర్లని ఆకర్షించడం వగైరా- ఇదంతా వివిధ ఉత్పత్తుల యాడ్ ఫిలిమ్స్ చూపిస్తున్నట్టుగా ముప్పావు గంట సేపూ నడిపిస్తారు. అప్పుడు ప్రకాష్ రాజ్ అడ్డుపుల్ల వేయగానే,  హమ్మయ్యా ప్లాట్ పాయింట్ వన్ వచ్చిందని రైలొచ్చినంత సంతోష పడతాం. ఇక ఇద్దరికీ సంఘర్షణ పుట్టి, ఆ పోరాటంతో హీరోకి ఒక గోల్, మనకి కథతో ఆడుకోవడానికి ఒక బాల్ లభిస్తాయని ఆనందపడతాం. ఇదేమీ వుండదు. ప్రకాష్ రాజ్ అడిగింది ఇచ్చేసి వేరే పని చేసుకుంటాడు హీరో. ప్రకాష్ రాజ్ ఇక కన్పించడు. ఇంటర్వెల్ దగ్గర ఒక ఫోన్ ఫస్తుంది హీరోకి- ఆమె అన్నా కాపాడమని వేడుకుంటూ వుంటుంది...

        ఎవరామె? తెలుసుకోవాలంటే సెకండాఫ్ లోకి వెళ్ళాలి. హీరోయిన్ తో హీరో చిత్తూరు జిల్లాకి వెళ్తూ, ఆ కుటుంబానికి తన వల్ల జరిగిన అన్యాయం తాలూకు ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. ఆ ఫ్లాష్ బ్యాక్ లో  సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు, ఈ కుటుంబానికి చెందిన తన కొలీగ్ తో న్యూ ఇయర్ పార్టీకి వెళ్లి వస్తూ యాక్సిడెంట్ చేస్తే అతను చనిపోయాడు. కుటుంబం దిక్కులేనిదనిది. తండ్రికి గుండె హబ్బు వచ్చింది...ఇప్పుడు ఇలా వెళ్లి ఆ కుటుంబానికి బోలెడు డబ్బు ఇస్తాడు హీరో. అ డబ్బుతో పూల తోటలు వేసి తన కంపెనీకి అమ్మమంటాడు. 

        ఇక హీరోయిన్ కి గుండెజబ్బు సీరియస్ అవుతుంది. ఆమెకి గుండె మార్పిడి ఆపరేషన్ చేసి బతికిస్తాడు. ఆమె అతడి మెడికల్ రిపోర్టులు చూస్తుంది. దాంతో అదే ఫ్లాష్ బ్యాక్ లో జరిగిన ఇంకో విశేషం చెప్తాడు హీరో. తన తలకి దెబ్బ తగిలింది. రిపోర్టులో బ్రెయిన్ ట్యూమర్ ఇది వరకే వున్నట్టు తెలిందనీ, యాక్సిడెంట్ తో బ్లడ్ కొద్ది కొద్దిగా వూరుతూ చావుకి దగ్గర చేస్తోందనీ, అందుకే కుటుంబం గురించి ఇంట కష్టపడుతున్నా ననీ అంటాడు. 

        చెల్లెలి పెళ్లి ఇదివరకే చేశాడు, కుటుంబానికి ఫ్లాట్ కొనిచ్చాడు, బోలెడు డబ్బు ఇచ్చాడు, హీరోయిన్ కి ఆపరేషన్ చేయించాడు, కొలీగ్ కుటుంబానికి ఆధారం చూపించాడు, ఇక ఫ్రెండ్స్ అందరికీ కంపెనీలు  రాసేసి, సెలవు తీసుకుని మరణాన్ని ఆహ్వానిస్తూ విదేశాలకి వాలస... ఇంట్లో అసలు విషయం తెలియ నివ్వకుండా...ది ఎండ్.

        గాథ గోదాములోకి, మనం అగాథంలోకి!

-సికిందర్

26, జూన్ 2016, ఆదివారం

రివ్యూ :






రచన- దర్శకత్వం : శశి
తారాగణం : విజయ్ ఆంటోనీ, శాట్నా టైటస్, దీపా రామానుజం, ముత్తురామన్, భగవతీ పెరుమాళ్ తదితరులు.
సంగీతం : విజయ్ ఆంటోనీ, ఛాయాగ్రహణం : ప్రసన్న కుమార్
బ్యానర్ : విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్
నిర్మాత : ఫాతిమా విజయ్ ఆంటోనీ
విడుదల : మే 13,  2016
***
     తమిళ ‘పిచ్చకారాన్’ తెలుగులోకి ‘బిచ్చగాడు’ గా డబ్ అయి గత ఆరు వారాలుగా

విజయవంతంగా భిక్షాటన చేస్తూ వసూళ్లు సాధించుకుంటోంది. దీనిముందు చాలా తెలుగు సినిమాలు వెలవెలబోయాయి, బోతున్నాయి, అవబోతున్నాయి. గత సంవత్సరం మార్చిలో ‘డాక్టర్ సలీం’ అనే తమిళ డబ్బింగ్ తో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న విజయ్ ఆంటోనీ ‘బిచ్చగాడు’ తో ఇంకోసారి హీరోగా వచ్చాడు. హీరోగా 6 సినిమాలు,  గాయకుడిగా 23 సినిమాలు, సంగీత దర్శకుడిగా 31 సినిమాల అనుభవమున్న ఆంటోనీ, ‘బిచ్చగాడు’ డబ్బింగ్ తో తెలుగు బయ్యర్లకి కోటాను కోట్ల లాభాలు తెచ్చిపెట్టాడు.  

          ఇంతగా ఆకర్షిస్తున్న ‘బిచ్చగాడు’ ప్రత్యేకత ఏమిటంటే, ఇది పక్కా కమర్షియల్ సినిమానే, కానీ రొటీన్ కమర్షియల్ కాదు- సమాంతర సినిమాల్ని తలపించే వాస్తవికతా ధోరణులు కలగలిసిన కమర్షియల్. భిక్షాటన వృత్తి లాంటి  కమర్షియలేతర కథావస్తువుని తీసుకుని దానికి కమర్షియల్ హంగుల్ని అద్దడం. 2007 లో మధుర్  భండార్కర్ ఇలాటిదే సబ్జెక్టుతో హిందీలో ‘ట్రాఫిక్ సిగ్నల్’ అనే విజయవంతమైన క్రాసోవర్ సినిమా తీసిన విషయం గుర్తుండే వుంటుంది. ఐతే ఒక రెగ్యులర్ కమర్షియల్ హీరోని  ‘బిచ్చగాడు’ గా చూపిస్తూ ఇప్పుడు తమిళ దర్శకుడు శశి చూపిన ధైర్యానికి  ప్రేక్షకులనుంచి ఇంతగా ఆమోదం లభిస్తోందంటే, ప్రేక్షకులెప్పుడూ  మార్పుని ఆహ్వానిస్తారనే అర్ధం.

కథ 


       పారిశ్రామిక వేత్త భువనేశ్వరి (దీపా రామానుజం) ఏకైక కుమారుడు అరుణ్ (విజయ్ ఆంటోనీ) విదేశాల్లో చదువు పూర్తి చేసుకుని వస్తాడు. ఇక తల్లి బాధ్యతలు అతడికి అప్పజెప్పి రిటైర్ అవుతుంది. అరుణ్ కో  పెద్దనాన్న (ముత్తురామన్) ఉంటాడు. తనకి తక్కువ ఆస్తి ఉందన్న ఏడ్పు ఇతడికి విపరీతంగా వుంటుంది. ఎప్పుడెప్పుడు అరుణ్  వాళ్ళ కంపెనీలు కొట్టేద్దామా అని చూస్తూంటాడు. ఒకరోజు ఆ  టెక్స్ టైల్ మిల్లులో భువనేశ్వరి తీవ్ర ప్రమాదానికి లోనై  కోమాలోకి వెళ్ళిపోతుంది. ఎలాటి వైద్యమూ ఆమె మీద పని చెయ్యదు. ఇలాటి పరిస్థితుల్లో  ఒక స్వామీజీ ఎదురై  ఒక దీక్ష చెయ్యాలని అరుణ్ కి చెప్తాడు. దాని ప్రకారం 48 రోజులు అన్నీ వదులుకుని అతను బిచ్చగాడిలా అడుక్కు తినాలి. తానెవరో ఎక్కడా బయట పడకూడదు. ఇలా చేస్తే తన తల్లి కోలుకుంటుందా అంటే, అది నమ్మకంగా చెప్పలేమంటాడు స్వామీజీ. అదృష్టాన్ని నమ్ముకుని చేయాల్సిందే నంటాడు.  


        తల్లిని బతికించుకోవడం కోసం అరుణ్  సర్వం త్యజించి బిచ్చగాడుగా మారతాడు. అడుక్కుంటూ అవమానాల పాలవుతాడు, తన్నులు తింటాడు. అన్నీ భరిస్తాడు. గుడి మెట్ల దగ్గర నల్గురు బిచ్చగాళ్ళని పరిచయం చేసుకుని వాళ్ళతో కూర్చుంటాడు. వాళ్ళు అడుక్కోవడంలో ట్రైనింగ్ ఇస్తారు. తమ ‘కొంప’ లో ఆశ్రయమిస్తారు. రోజులు గడుస్తూంటాయి.  అరుణ్ కి మహి (శాట్నా టైటస్) అనే అమ్మాయి పరిచయమవుతుంది. ఆమె పిజ్జా హౌస్ నడుపుతూంటుంది.  అతను బిచ్చగాడని తెలీక ప్రేమలో పడుతుంది. ఒకరాత్రి అరుణ్ ఒక మతిస్థిమితంలేని బిచ్చగత్తెని కొందరు రేప్ చేయబోతూంటే కాపాడి మెంటల్ ఆస్పత్రిలో చేరుస్తాడు. ఆ మెంటల్ ఆస్పత్రిలో రోగులమీద  రహస్యంగా ప్రయోగాలు  జరుగుతూంటాయి. ఆమె తప్పించుకుని అరుణ్ కీ విషయం చెప్తుంది. దీంతో ఆ గ్యాంగ్ అరుణ్ ని పట్టుకోవడం కోసం రంగంలోకి దిగుతుంది. వాళ్ళతో కుమ్మక్కయిన పోలీసులూ వెంటపడతారు. ఈ నేపధ్యంలో అరుణ్ తన 48 రోజుల దీక్ష ఎలా పూర్తిచేశాడు, ఇంకా అతడికి ఎదురైన అవరోధాలేమిటి, ఆఖరి క్షణాల్లో ముంచుకొచ్చిన ఉపద్రవాలేమిటీ  అన్నది మిగతా కథ.

ఎలావుంది కథ
      తమిళ సినిమా కథకులు  కాల్పనిక కమర్షియల్ ఫార్ములా కుడ్యాల్ని కొంచెం వదులు చేసి, అందులో కాస్త పచ్చిగా వుండే  జీవితాన్ని నూరిపోయడానికి వెనుకాడరు. ఈ ప్రయత్నంలో ఆ పచ్చి జీవితం డాక్యుమెంటరీలా తయారైనా  సరే, రూల్స్ ని బ్రేక్ చేయడానికీ సందేహించరు. అయితే ఈ డాక్యుమెంటరీ పార్టు యాక్షన్ తో నిండిపోయినప్పుడు దీనికి ప్రేక్షకులకి నచ్చే షుగర్ కోటింగ్ పడిపోయినట్టే. అందుకే తెలుగులో కూడా ప్రేక్షకులు ఈ బిచ్చగాళ్ళ  దయనీయ లోకాన్ని చూడగల్గుతున్నారు. మళ్ళీ ఈ యాక్షన్ షుగర్ కోటింగ్ లో కామెడీలు, డాన్సులు, గ్లామర్  లాంటి కమర్షియల్ ఫార్ములా హంగులు పెట్టాలన్న ఆదుర్దాకి లోనుకాలేదు. ఇదంతా ఒకెత్తయితే- స్థూలంగా ఇది కమర్షియల్ సినిమానే అనుకుంటే- మదర్ సెంటిమెంటుతో ఇదేదో రొటీన్ కథకాదు. మదర్ కోమాలోకి వెళ్ళిపోతే ఆమెని బతికించుకోవడం కోసం, ఒక కోటీశ్వరుడైన కొడుకు బిచ్చమెత్తుకునే దీక్ష బూనే పాయింటే అనూహ్యమైనది. ఇదే మదర్ సెంటిమెంటుని కొత్తదారి పట్టించింది.  అనూహ్యమైన క పాయింట్లు ఎవరి బుర్రలోంచీ పుట్టుకురావు- సొంత బుర్రల్లో  ఎంతసేపూ చూసిన  హిట్టయిన సినిమాల పాయింట్లే పుడతాయి. బయటి ప్రపంచంలోకి బుర్రని తాటించినప్పుడు ఇలాటి కొత్త పాయింట్లు పరిచయమవుతాయి. ఈ సినిమా చివర్లో ఇది యదార్ధంగా జరిగిన సంఘటన అని వెల్లడించాడు దర్శకుడు.  ఆ యదార్థ సంఘటనకి ఇంకా పరిష్కారం దొరకనే లేదట. కానీ ఈ సంఘటనలో, హీరో చేసే ప్రయత్నంలో,  స్పిరిచ్యువల్ టచ్ కూడా వుంది. దీంతో  ప్రేక్షకుల ఆత్మిక దాహం కూడా తీరుతోంది. 

ఎవరెలా చేశారు

      హీరో విజయ్ ఆంటోనీ నటన అనే తన మూడో వ్యాపకంతో కూడా నిలదొ క్కుకోవడానికి తను ఎంచుకుంటున్న పాత్రలే కారణం. పాత్ర బలంగా, విలక్షణంగా,  కాస్త హ్యూమన్ టచ్ తో ఉండేలా చూసుకుంటూ పాత్రోచితంగా నటిస్తే ఏ  హీరో అయినా నిలదొక్కుకోగలడు. విషాద నేపధ్యమున్న ఈ పాత్రలోకి విజయ్ ఆంటోనీ ప్రవేశించిన తర్వాత, ఆద్యంతం ఆ నేపధ్య దృష్టితో  సీరియస్ మూడ్ తోనే నటించాడు తప్ప- పక్కకి జరిగి ఎలాటి కాలక్షేప విన్యాసాలకీ పాల్పపడలేదు. పావు గంటకో యాక్షన్ సీను చొప్పున ఫైట్లు చేసుకుపోతూంటే అదే కమర్షియల్ విలువ! పాత్రోచిత విన్యాసం! సినిమా ప్రారంభమైన పావు గంటకే తల్లిని బతికించు కోవడం కోసం బయల్దేరిన పాత్రగా  ప్రేక్షకులకి  అర్ధమైన తర్వాత, వాళ్ళు కూడా ఇంకెలాటి డాన్సులూ పాటలూ కామెడీ ఆశించలేరు. తల్లికోసం ఎన్ని బాధలైనా పడేందుకు సిద్ధపడే నటనతో  చాలా చోట్ల గుండెలు బరువెక్కిస్తాడు. అతను సహజ నటుడు. ప్రేక్షకులని అయస్కాంతంలా తనవైపు లాక్కోగల మాసాకర్షణ వున్న హీరో. 


        కొత్త హీరోయిన్ శాట్నా టైటస్ కూడా అతిసాధారణ అమ్మాయిలా వుండడం ఈ కథకి బాగా తోడ్పడింది. పైగా తను కూడా సహజంగా నటించెయ్య గలదనడానికి - విజయ్ కోటీశ్వరుడని తెలిశాక,  తన ముఖంలో కనబర్చే  రియాక్షన్ తాలూకు సైలెంట్ క్లోజప్ షాట్ ఒక్కటి చాలు.

        ఇక మిగతా పాత్రల్లో బిచ్చ గాళ్ళుగా నటించిన వాళ్ళు  కామెడీ లేని కొరత తీర్చడానికి ఎప్పుడూ రెడీ. దీంతో బాటు ముగ్గురు గ్యాంగ్ పదేపదే బిచ్చగాడి చేతిలో తన్నులు తిని పరువు పోగొట్టుకునే కామెడీకి అక్కడక్కడా తగుల్తూంటారు. తల్లిగా నటించిన దీపా రామానుజం మొదటి పది నిమిషాల తర్వాత కోమాలోనే కంటిన్యూ అయి చివర్లో చలనంలో కొస్తుంది. 

        పాటలు, కెమెరా వర్క్  తగినంత క్వాలిటీతో వున్నాయి. 1999లో వెంకటేష్ తో ‘శీను’  అనే తెలుగు తీసిన 7 సినిమాల దర్శకుడుగా శశికి,  సినిమా మాధ్యమం మీద మంచి పట్టువున్నట్టు గమనించవచ్చు.  


    ఇది రెగ్యులర్ స్క్రీన్ ప్లే కాదు. అయినా కమర్షియల్ స్క్రీన్ ప్లే. ఇందులో పాత్ర- ఆ పాత్ర ఎదుర్కొనే సమస్య- ఆ సమస్యతో సంఘర్షణ- చివరికి పరిష్కారమనే రెగ్యులర్ నడకే  వుంటుంది గానీ, ఇక్కడ సమస్య విలన్ వల్ల ఏర్పడదు, పరిష్కారం కోసం విలన్ తో సంఘర్షించడు హీరో. మరి  విలన్ లేకుండా కథెలా అవుతుంది, ‘రాజాధి రాజా’ లోలాగా అదొక గాథ అవుతుందేమో అనొచ్చు. ఇక్కడ విలన్ మానవ రూపంలో లేడని మాత్రమే చెప్పడం. విధి రూపంలో వుంటుంది.  ఆ విధి తల్లికి సంక్రమించిన కోమా.

        అందుకే ఇది పాత్ర చేసే ప్రయాణం. ఆ ప్రయాణంలో ఎదుర్కొనే కష్టాలు. కష్టాల్ని దాటుకుని  చేరుకునే గోల్. ఆ గోల్ 48 రోజుల బిచ్చమెత్తుకునే దీక్ష పూర్తి చేయడం. ఇందులో దీక్ష పూర్తి చేయకుండా అడ్డుకునే  విలన్లెవరూ లేరు. అతను  దీక్ష చేస్తున్నాడని ఎవరికీ తెలీదు. అలాగే తల్లిని కోమాలోనే చంపెయ్యాలని చూసే విలన్ ఎవడూ లేడు.  కాబట్టి అదృశ్యంగా వుండే విధిని ఓడించేందుకు హీరో చేసే ప్రయాణమే ఇది. మంచి కర్మలు చేస్తే విధి ఓడిపోతుందని చెప్పడమే. ఈ ప్రయాణంలో రకరకాల సందర్భాల్లో రకరకాల పాత్రలు స్టోరీ పాయింటుతో సంబంధం లేకుండా సమస్యల్లో ఇరికిస్తూంటాయి- హింసిస్తూంటాయి- ఓపికని పరీక్షిస్తూంటాయి. బిచ్చమడిగితే దొంగోడనుకుని కొట్టడం, బిచ్చ గత్తెని మెంటల్ ఆస్పత్రిలో చేర్పిస్తే అనుమానించి వెంటాడ్డం, తన దగ్గర డబ్బుందనుకుని దాడి చేసిన దొంగల్ని కొడితే, వాళ్ళు  పగబట్టి ఎల్ల వేళలా గొడవకి దిగడం లాంటివన్నీ విధి పెడుతున్న పరీక్షలే. 

        అంటే డాక్యుమెంటరీల్లో వాడే స్టార్ట్ అండ్ స్టాప్ నడక పద్ధతి అన్నమాట. ఒక సమస్య ఎత్తుకోవడం, దానికి పరిష్కారం చూపి మరింకో సమస్య ఎత్తుకోవడం...ఇలాగన్న మాట. ఈ పద్ధతిలో  ప్రధాన సమస్య చుట్టూ విషయం తిరగదు. అన్నీ విడివిడి సమస్యలే వుంటాయి. కానీ కమర్షియల్ సినిమాలకి ఒక ప్రధాన సమస్య వుండి  తీరాలి. అలా ఒక ప్రధాన సమస్య లేకుండా ఒక్కో విడి విడి సమస్యగా స్టార్ట్ అండ్ స్టాప్ డాక్యుమెంటరీ పద్ధతిలో చూపినందు వల్లే ‘సైజ్ జీరో’, ‘ఆటోనగర్ సూర్య’, ‘టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్’ లాంటి కమర్షియల్స్ ఫ్లాపయ్యాయి.  ఒక్కో సమస్యని చెప్పి ముగిస్తూ ఉండడమంటే చిన్న చిన్న కథలు చెప్పడమే. కానీ కథానికలతో సినిమా వర్కౌట్ కాదు. ఒకే పెద్ద కథ వుండాలి. ‘బిచ్చగాడు’ విషయానికొస్తే ఇక్కడ విడి విడి సమస్యలు- కష్టాలూ ఎదురై అవి ముగిసిపోతున్నా- నేపధ్యంలో ప్రధాన సమస్యంటూ ఒకటుంది. అది విధి- కోమా- తల్లి ని బతికించుకునే  ఒకే పెద్ద కథ, ఒక గోల్. కాబట్టి వర్కౌట్ అయ్యింది. 

        సాధారణంగా పది పదిహేను నిమిషాల్లో బిగినింగ్ ముగించి మిడిల్ కొచ్చే స్క్రీన్ ప్లేలు ఆ తర్వాత రెండు గంటలపాటు మిడిల్ ని లాగలేక చతికిల బడుతూంటాయి. ఎందుకని? అంతసేపూ ఏర్పాటు చేసిన  సమస్య చుట్టూ సంఘర్షణ మొనాటనీ బారిన పడ్డం వల్ల. దీన్ని ‘చక్కిలిగింత’ జయించలేక ఇంటర్వెల్ లోనే చేతులెత్తేస్తే, ‘దొంగాట’ గజిబిజి చేసుకుంటే, ‘క్షణం’ భేషుగ్గా జయించేసింది. కారణం, ఇందులో  బిగినింగ్ పదినిమిషాలే చూపినా ఆ పది నిమిషాల బిగినింగ్ లోనే  అంతర్లీనంగా సెటప్ చేసిన ఒక ప్రధాన  అంశముంది ఆఫ్ స్క్రీన్ లో. దాన్ని  పే-ఆఫ్ చేయక తప్పదు. ఆ ప్రధానాంశం హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్. దీన్ని మిడిల్ విభాగంలో మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకుల ద్వారా పే- ఆఫ్ చేస్తూ పోయారు. దీంతో ఈ మిడిల్లో హీరో పాపని వెతికే సమస్యతో రెండు గంటల పాటు సుదీర్ఘంగా సాగే మిడిల్ మొనాటనీ బారిన పడలేదు. 

        ‘బిచ్చగాడు’ లో మొదటి పది నిమిషాల్లో బిగినింగ్ ముగుస్తూ హీరో బిచ్చగాడుగా మారతాడు. అక్కడ్నించీ  దాదాపు రెండు గంటల సుదీర్ఘ షో సమయాన్ని  ఈ మిడిల్ విభాగం ఆక్రమిస్తుంది. అయితే ఎంత సేపని దీన్ని హీరో కష్టాలతో భర్తీ చేస్తారు. అది మొనాటనీ బారిన పడుతుంది. అందుకే బిగినింగ్ లో  సెటప్ చేసిన అంశాల్ని పే- ఆఫ్ చేసే సీన్లు కూడా మిడిల్ లో కలుపుకుంటూ పోయారు. దీని వల్ల హీరో కష్టాల కథకి మొనాటనీ జాడ్యం పట్టుకోలేదు. బిగినింగ్ లో సెటప్ చేసిన అంశాలు : 1. గ్రూపాఫ్ కంపెనీల  అధిపతిగా తల్లి భువనేశ్వరి గొప్పతనం, 2. కొన్ని కారణాల వల్ల  కంపెనీలని విక్రయించాలని హీరో నిర్ణయించడం, 3. కంపెనీలని  కొట్టేయాలని హీరో పెదనాన్న కుట్రలు పన్నడం మొదలైనవి.

        వీటిని మిడిల్ లో పే-ఆఫ్ చేసుకుంటూ పోయారు. ఇలా చేయవచ్చా అంటే, తప్పకుండా చేయవచ్చు. ఎందుకంటే ‘దొంగాట’ లో లాగా ఇవి మిడిల్ లో పుట్టుకొచ్చిన  అంశాలు కావు. బిగినింగ్ లోనే పుట్టి ముగింపు (పే-ఆఫ్)  కోసం ఎదురు చూస్తున్న సెటప్స్. ‘దొంగాట’ బిగినింగ్ లో పుట్టాల్సిన బిజినెస్ బిగినింగ్ లో పుట్టకుండా మిడిల్లో పుట్టుకొచ్చినందుకే బిగినింగ్- మిడిల్ గజిబిజి అయిపోయాయి. అలాగే ఇటీవలి ‘ఒక్క  అమ్మాయి తప్ప’ లో కూడా బిగినింగ్, మిడిల్  బిజినెస్ లు రెండూ కలగలిసిపోయి గందరగోళ మైపోయింది.  ఈ రెండు సినిమాలూ,  బిచ్చగాడూ పక్కపక్కన పెట్టుకుని చూస్తే  ఈ తేడా తెలుస్తుంది. సినిమాలెందుకు ఫ్లాపవుతాయంటే, ఇలాటి విషయాల్లో సూత్రాలు పాటించ నందుకే.  కానీ  సూత్రాలంటే చాలా మంది దర్శకులకి ఇప్పటికీ – ఇంత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యుగంలో కూడా  - అజ్ఞానంతో కూడుకున్న ఎలర్జీ.

        ‘ బిచ్చగాడు’ బిగినింగ్లో సెటప్ చేసిన మూడు పాయింట్లనీ మిడిల్లో పే- ఆఫ్ చేసుకుంటూ పోతే ఒక సమస్య పరిష్కారమైపోయింది. కోమాలో వున్న తల్లి భువనేశ్వరి గొప్పతనాన్ని చవిచూసిన కార్మికులు,  ఆవిడ కోలుకోవాలని ఊరేగిపుగా రావడం, నిరాహార దీక్షలు చేయడం, బిచ్చమెత్తుకుంటూ వాళ్ళని చూసి, వాళ్లతో మాట్లాడిన అరుణ్ ఇక కంపెనీలని విక్రయించి వీళ్ళకి అన్యాయం చేయకూడదని మనసు మార్చుకోవడం, దీంతో పెదనాన్న కుట్రలు ఆగిపోవడం...ఒక చైన్ రియాక్షన్ లా జరిగిపోతాయి. ఇందుకే కథని కూర్చ కూడదంటారు. కథని అల్లాలి. ఆ అల్లిక ఇంత అందంగా  కనపడాలి. 

        ఇక హీరోయిన్ పాత్ర ప్రవేశం ఇక్కడ బిగినింగ్ లోనే ఇరికిస్తూ జరగాలని లేదు. మిడిల్లో జరుగుతుంది. ఈమె పాత్రకి మూడు కుదుపు లిచ్చారు : బిచ్చగాడని తెలీక ప్రేమించడం, బిచ్చగాడని తెలిశాక సందిగ్ధంలో పడ్డం, ఫలానా కోటీశ్వరుడని తెలిశాక అవాక్కవడం. ఈ మూడు కుదుపుల మధ్యా వాటి తాలూకు కథనం –ప్రేమాయణం కూడా మొనాటనీ బారిన పడకుండా తప్పించుకున్నాయి.


        సుదీర్ఘమైన మిడిల్ విభాగంలో బిగినింగ్ సెటప్స్ ని పే- ఆఫ్ చేసుకుంటూ పోవడం వల్ల,  కథలో  హీరో పాత్ర ప్రయాణానికి ప్రాణం పోసినట్టయ్యింది.


-సికిందర్
         
         
         







24, జూన్ 2016, శుక్రవారం

షార్ట్ రివ్యూ!






రచన- దర్శకత్వం : రామరాజు
తారాగణం :  
నాగశౌర్య, నిహారిక, రావు రమేష్, ప్రగతి,
వెన్నెల కిషోర్, అవసరాల శ్రీనివాస్
సంగీతం : సునీల్ కశ్యప్,  ఛాయాగ్రహణం : రాంరెడ్డి
నిర్మాత : మధుర శ్రీధర్
విడుదల :  24 జూన్, 2016
***
   మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక హీరోయిన్ గా పరిచయమవుతున్న సినిమా అంటూ విపరీత ప్రచారం జరిగిన ‘ఒక మనసు’ కి దర్శకుడు రామరాజు. హీరో నాగశౌర్య, నిర్మాత మధుర శ్రీధర్. మొదటి సారిగా నాగశౌర్య సినిమా నాగశౌర్య సినిమా అని కాకుండా ఒక హీరోయిన్ సినిమా అన్నట్టు విడుదలవడం, దీనికి తగ్గట్టు ఇదివరకు నాగశౌర్య సినిమాలకి లేనంత  ఓపెనింగ్స్ రావడం ఈ సినిమా ప్లస్ పాయింట్. దర్శకుడి అదృష్టం. నిహారికతో ఈ సినిమా తీయకపోతే  దర్శకుడికి ఈ స్థాయి గుర్తింపు  కూడా రావడం కష్టం. కానీ ఈ స్థాయి  గుర్తింపుతో, ఈ ఓపెనింగ్స్ తో, తీరా సినిమా కెళ్తే  ఎలా వుంటుంది?

        నిస్సందేహంగా సహన పరీక్షలా వుంటుంది. ట్రెండ్ లో వున్న  ప్రేమ సినిమాల సరళికి దూరంగా, ఎక్కడో  1916 లో తీసిన సినిమాలా వుంటుంది. ఆ నాడు కూడా ఇలా రాసి, ఇలా తీసి వుండరు. అంత పాత మోడల్ ప్రేమలా వుండి, అన్ని  తరగతుల యువ ప్రేక్షకులూ గోల చేసేదిలా వుంటుంది. బెంచి క్లాసు ప్రేక్షకులైతే భరించలేక వెటకారాలు చేసేదిలా వుంటుంది. మెగా హీరోయిన్ తో మోడరన్ ప్రేమ కథ ఉంటుందనుకుంటే,  ఏదో పోయెటిక్ కథంటూ తీసిన దర్శకుడి సొంత కవిత్వాన్ని భరించలేక  హాహాకారాలు చేసేదిలా వుంటుంది. 

          ఈ రోజుల్లో పోయెటిక్ సినిమాలు ఎక్కడ ఎవరు తీస్తున్నారని ఈ సినిమా తీశారో అర్ధం గాదు. పోనీ ఆ పోయెట్రీ కూడా విషయపరంగా విఫలమై- చిత్రీకరణలో బావుంటే సరిపోయిందా? రచన, నటనలు, సంగీతం పోయెటిక్ గా ఉండనవసరం లేదా? కథా కథనాలు, పాత్ర చిత్రణలు అర్ధవంతంగా ఉండనవసరం లేదా? అంత పోయెట్రీ వుంటే ప్రేక్షకులు డైలాగులకి ఫీలవకుండా అంత పగలబడి ఎందుకు నవ్వుతున్నారు. ఈ సినిమాలో ఎక్కడా ఎంటర్ టైన్ మెంట్ అనేదే లేదు. కానీ వచ్చీ రాకుండా రాసిన గ్రాంథిక డైలాగులతో బాగా ఎంటర్ టైన్ చేశారు. ఎందుకు ఇంటర్వెల్ పడిందో అర్ధం గాదు- ఆ విశ్రాంతి దృశ్యం మీద ‘కాలానికి మార్పు వుంది, ప్రేమకి ఉంటుందా?’ అని సిల్లీగా అక్షరాలు వేసినప్పుడే దర్శకుడు ఇంకా ఏ కాలంలో, ఈ స్థాయి ఆలోచనలతో  వున్నాడో తెలిసిపోతుంది. కాలానికి తను అన్నట్టే మార్పు వుంటుంది, తనే మారాల్సిన అవసరముంది ప్రేక్షకుల ఆర్ధిక మానసికారోగ్యాల దృష్ట్యా. 

          అబ్బాయేమో రాజకీయ నాయకుడుగా ఎదగాలని సెటిల్ మెంట్ల దందా  చేస్తూంటాడు. అమ్మాయేమో ప్రభుత్వాసుపత్రిలో డాక్టరు. ఎందుకు ఇలాటి అబ్బాయిని ప్రేమిస్తుందో అర్ధంగాదు. అబ్బాయి జైలుకు పోతాడు. తిరిగి బెయిల్ మీద విడుదలై వచ్చేవరకూ అతడి కోసమే ఎదురు చూస్తుంది. పోనీ అప్పుడైనా పెళ్లి చేసుకుంటారా అంటే అదీ  లేదు. ఇంకా ప్రేమించుకుంటూనే వుంటారు. జైలుకి వెళ్ళక ముందు ఎలా, ఎంత ప్రేమించుకున్నారో అవే డైలాగులతో, అదే రొటీన్ తో ప్రేమించుకుంటూ ప్రేమించుకుంటూ ప్రేమించుకుంటూనే వుంటారు సాగదీస్తున్న రబ్బరులా.   ఈ ప్రేమలో పోయెట్రీ  ఏమిటంటే- పదే  పదే చేతులు పట్టుకోవడాలు, చేతులు రుద్దుకోవడాలు, నుదుటి మీద పదే పదే పదే ముద్దులు పెట్టుకోవడాలు, ఒక లక్షసార్లు గభీల్మంటూ కావిలించుకోవడాలూ, అద్దం  మీద చేతి ముద్రలు వేసుకోవడాలూ...... సీతాకోక చిలుకలు పట్టుకోవడాలు, తామర పువ్వులు తెంపు కోవడాలు, వర్షంలో ఆడుకోవడాల్లాంటి పాత్రోచితం కాని చిన్నపిల్లల చేష్టలూ....సహన పరీక్ష పెడుతూ చాదస్తంగా, చాలా  అమెచ్యూరిష్ గా వుంటుంది పోయెటిక్ విజన్. ‘చెప్పు సూర్య నన్ను ప్రేమిస్తున్నావా’ అంటే, ‘నా ప్రాణం ఉన్నంత వరకూ’ అంటాడు. ఈ స్థాయిలో, కాకపోతే నవ్వొచ్చే ఏదో గాంభీర్యంతో  వుంటాయి ప్రేమ డైలాగులు. చిట్ట చివరికి అబ్బాయి తండ్రి ఒక కండిషన్ పెడతాడు. ఆ కండిషన్ కి లొంగిన అబ్బాయి అమ్మాయికి కటీఫ్ చెప్పేస్తాడు. ఇక ట్రాజడీయే. ఈ రోజుల్లో ట్రాజిక్ ప్రేమ కథ కూడా వర్కౌట్ అవుతుందనుకోవడం దర్శకుడి దూరదృష్టికి నిదర్శనం.   


          కమర్షియాలిటీ లేని స్లో పాటలు ఇంకా సహన పరీక్ష. ఏదో విషాదం జరిగిపోయినట్టు  ఒక్క పెట్టున శోకాలాపనలతో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. ఇంతకీ  ఏ ఆడియెన్స్ ని దృష్టిలోపెట్టుకుని సినిమా తీశాడబ్బా అన్పిస్తుంది. యూత్ ని కాదు- నడివయసు అభిరుచిగల ప్రేక్షకులా? వాళ్ళయినా మెదడు ఇంటి దగ్గర పెట్టి మనసు చేసుకుని ఈ సినిమా చూడాలా? ఏ అభిరుచి కోసం? దేన్ని  ఆస్వా దించడం కోసం? 

          నాగశౌర్య పాత్రలో, నటనలో హుషారు లేదు, పెప్ లేదు, పంచ్ లేదు. పూర్తి పాసివ్ పాత్ర. ఈ పాసివ్ పాత్ర కూడా అర్ధమే గాదు. ఇక నిహారిక కదలకుండా నిలబడి మూతిముడుచుకుని ఉండడమే నటన అనుకున్నట్టుంది. ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ కన్పించవు  తను చైతన్యవంతంగా ఉండక, డల్ గా వుంటుంది. రెండున్నర గంటల సినిమా నడక అంతా నత్త నడక. పైగా ఫ్లాష్ బ్యాక్ లో చెప్పుకొస్తూంటారు. మధ్యమధ్యలో ప్రెజెంట్ లో కొస్తూంటుంది  కథ. కాసేపటికి ఏది ఫ్లాష్ బ్యాకో ఏది ప్రెజెంట్ కథో అర్ధంకాని గజిబిజి ఏర్పడుతుంది. పైగా ఫ్లాష్  బ్యాక్  ప్రారంభం నిహారిక పాయింటాఫ్ వ్యూలో ఆమె చెప్పుకుంటున్న కథలా  ఉంటూ, ఉన్నట్టుండి నాగశౌర్య  తన వాయిసోవార్ తో చెప్పే కథగా మారిపోతూంటుంది మధ్యమధ్యలో. స్ట్రక్చర్, స్క్రీన్ ప్లే, పాత్ర చిత్రణల పట్టింపు అన్నవి ఏ కోశానా కనపడవు. 

          నాగబాబు తన కుమార్తెతో ఇలా రంగ ప్రవేశం చేయించడం కచ్చితంగా తప్పటడుగే తన అపార అనుభవం దృష్ట్యా. నాగబాబు కుమార్తె నుంచి శభాష్ అనుకునే హీరోయిన్ని ఆశిస్తారు, జీరోయిన్ని కాదు. మిగతా తన మెగా వారసులు స్టార్లుగా ఎలా విరగదీస్తున్నారో అలా విరగదీయక పోతే నిహారిక సినిమాల్లోకి రావడం అనవసరమే.


-సికిందర్

         

         






22, జూన్ 2016, బుధవారం

కామెడీ సంగతులు - 2

కామెడీ ఎలా రాయాలా అని  తర్జనభర్జన పడే ముందు, అసలు కామెడీ రాయాలంటే మనదగ్గర ఏముండాలని ప్రశ్నించుకోవాలి. బాగా జోకులు పేల్చి అందర్నీ నవ్వించగల  ప్రత్యేక టాలెంట్ కలిగి వుండాలా? తప్పు.  అలాటి వాళ్ళు జోకులేసి నవ్వించగలరే గానీ కామెడీ రాయలేరు. సన్నివేశాల్ని సృష్టించలేరు. కామెడీ రాయాలంటే రెండు వుండాలి : ఎక్కువ ఊహా శక్తి, ఎక్కువ మేధాశక్తి. హాస్యంగా మాట్లాడే వాళ్లకి మొదటిదే వుంటుంది, హాస్యం రాసేవాళ్ళకి రెండూ వుంటాయి. హాస్యం రాసే వాళ్ళు  హాస్యంగా మాట్లాడలేక పోవచ్చు,  కానీ రాసి నవ్వించగలరు. అత్యంత ఫన్నీ కామెడీ రాసేవాళ్ళు  నిజజీవితంలో అంత ఫన్నీగా ఉండరని ఒక పరిశీలన వుంది. పైపెచ్చు కొందరు ఈసురోమని జీవితాలు గడుపుతారు. మేధా శక్తి వాళ్ళనలా మార్చేస్తుందేమో తెలీదు. ఎక్కువ ఊహాశక్తితో జోకులేస్తూ తిరిగేవాళ్ళు  జల్సాగా వుంటారు. నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం నోట్లోంచి ప్రవాహంలా జోకులొచ్చేసేవి. కానీ రాయలేనితనాన్ని నటించడంతో తీర్చుకున్నారు. ఎక్కువ ఊహాశక్తితో నవ్వించడానికి సాధారణంగా చుట్టూ వున్న వాతావరణం చాలు. ‘ఈడేంట్రా బైకు మీదెళ్ళి సిగరెట్లు తెమ్మంటే, లేదు సైకిలు మీదే  వెళ్తా నంటాడు... ఈడికి హెల్తు, మనకి డెత్తా?’ అనేస్తే సరిపోతుంది.
      కానీ రాయాలంటే మాత్రం ఈ చుట్టూ వుండే వాతావరణంతో బాటు, దేశకాల పరిస్థితుల మీద సెటైర్లు కూడా వేయగల్గి వుండాలి. సామాజిక స్పృహ కలిగివుండాలి. ఎలాగయితే శాస్త్రీయ సంగీతం నేర్చుకున్న వాడు పాప్ సంగీతం ఇంతరులకంటే బాగా  పాడగలడో, అలా సెటైర్ల మీద పట్టు సాధించినవాడి చేతిలో మామూలు కామెడీ ఇతరుల చేతిలో కంటే ఎక్కువ ప్రకాశిస్తుంది. ఎక్కువ ఊహాశక్తితో బాటు ఇలాటి ఎక్కువ మేధా శక్తి ఉన్న వాడే నిజమైన కామెడీ రైటర్ అన్పించుకో గలడు, సున్నిత హాస్యంలో మాస్టర్ అవగలడు. ఒకసారి సున్నిత హాస్యంతో ఉర్రూతలూగించిన  ముళ్ళపూడి, జంధ్యాల, వంశీల వంటి పూర్వపు రచయితల సామాజిక స్పృహని గమనించండి.  

        హాలీవుడ్ లో కామెడీ రైటర్ అంటే అతను  డైలాగులు సహిత పూర్తి స్థాయి కథతో స్క్రీన్ ప్లే అందించే వాడై ఉంటాడు. మనకలా కాదు. కామెడీ అనే కాదు, ఇంకే సినిమాలకి మాటలు రాసే మాటల రచయితలూ మాటల వరకే గానీ కథా రచయితలుగా అభివృద్ధి చెందని పరిస్థితి వుంది. ఇచ్చిన సీనులో విషయం చూసుకుని దానికి తగ్గ మాటలు రాసేయడం వరకే వారి విద్య. ఒక పూర్తి స్థాయి కథ రాయాలంటే అదెలా రాస్తారో తెలీని తనమే రాజ్య మేలుతోంది. కాబట్టి కామెడీ రైటర్ అన్నాక కామెడీ  డైలాగ్ రైటర్ అవ్వాలా, లేక కామెడీ స్టోరీ రైటర్ గా ఎదగాలా ముందు నిర్ణయించుకోవాలి. మొదటి దానికైతే ఎక్కువ మేధాశక్తితో పనిలేదు, ఎక్కువ ఊహా శక్తి వుంటే చాలు. రెండో దానికి రెండూ అవసరం! 

          ఈ రెండోదే ఇప్పుడవసరం. ఒక కామెడీ రైటర్ గా ఎదగాలంటే ఏం కావాలి? సామాజిక స్పృహ. సామాజిక స్పృహ లేని రచయిత డైలాగులైనా సరే రస విహీనంగా వుంటాయి. ఈ సమాజిక స్పృహకి  ఇంగ్లీషు భాషా పరిజ్ఞానం కూడా అవసరం. ఇంగ్లీషు భాషా పరిజ్ఞానం లేని సినిమా రచయితలైనా సరే, పత్రికా విలేఖర్లయినా సరే నూతిలో కప్పల్లా వుండి పోతారు. జాతీయంగా,అంతర్జాతీయంగా ఇంగ్లీషులో ప్రతినిత్యం ఉత్పత్తి అవుతున్న అసంఖ్యాక భావజాలాలు, వార్తా విశేషాలు, విలక్షణ వ్యాసాలూ తదితరమైనవి పరిచయం కాకుండా పోతాయి. అప్పుడు వీళ్ళు రాసినా ఒకటే రాయకున్నా ఒకటే. తెలుగుతో బాటు ఇంగ్లీషు మాధ్యమాలు  అందిస్తున్న కంటెంట్ ని ప్రతిరోజూ కొంత సమయం కేటాయించుకుని  చదవాలి. తెలుగు పత్రికల్లో సామాజికాంశాల పైన అనేక మంది  సెటైర్లు రాస్తున్నారు, వాటితో పాటు ఆంగ్లంలో జగ్ సురయా, బాచీ కర్కరియా, అమెరికా నుంచి డేవ్ బారీ లలాంటి ఇద్దరు ముగ్గురు హ్యూమరిస్టులని వారంవారం ఫాలో అవుతూంటే ఆ వారం జాతీయ, అంతర్జాతీయ సంఘటనలపైన  చాలా ఫన్నీ కామెడీ మనకి పరిచయమవుతుంది. కామెడీకి అవసరమైన ఎక్కువ మేధాశక్తిని పెంచుకోవాలంటే  ఇది తప్పదు. 
బాచీ కర్కరియా 
     అలాగే సహజంగా మనలో సెన్సాఫ్ హ్యూమర్ అంటూ వుంటే అది కొన్ని పరిమితుల్లో వుండి పోవాలనుకోదు. దానికి  జిజ్ఞాస ఎక్కువ వుంటుంది. ఇంకా తెలుసుకోవాలన్న తపన వుంటుంది. మన కాన్షస్ మైండ్ సోమరితనాన్ని వదిలించుకుంటే ఇంకా జాతీయ ఛానెల్స్ లో వచ్చే ఉన్నతస్థాయి రాజకీయ కార్టూన్ చిత్రాలు చూసి స్ఫూర్తి పొందవచ్చు. అర్నాబ్ గోస్వామిని చూస్తున్నా ఎన్నో కామెడీ ఐడియాలు పుట్టుకు రావచ్చు. అర్నాబ్ గోస్వామినే వేరే పాత్రగా సృష్టించి వెరైటీ కామెడీని సృష్టించే ఆలోచనలు రావొచ్చు. అంతర్జాలంలో అసంఖ్యాకంగా అర్నాబ్ మీద సెటైర్లు వెలువడుతున్నాయి. 
        ఇక హిందీ కూడా వచ్చి వుంటే హిందీ హాస్య ప్రపంచం ఎలా వుందో అంతా పరిచయమవుతుంది. డేటా బ్యాంక్ ఎంత విస్తృతమైతే  అంత కామెడీ స్థాయి కూడా  పెరుగుతుంది. కామెడీ రచయిత ఏం కోల్పోయినా తనలో హాస్య రసాన్ని మాత్రం కోల్పోకూడదు. ఏం పెంచుకోక పోయినా తనలో హాస్య రసాన్ని పెంచుకు తీరాలి. కామెడీ ఈజ్ సీరియస్ బిజినెస్ అన్నారు. ప్రత్యేకంగా కామెడీ కథా రచయితగానో, కామెడీ దర్శకుడుగానో గుర్తింపు పొందాలన్న లక్ష్యం వుంటే, మిగతా అన్ని తరహాల ప్రక్రియలూ పక్కన పెట్టేయాలి. యాక్షన్ కథల గురించి, ప్రేమ కథల గురించి, హార్రర్ కథల గురించీ... ఇలా ఇతర జానర్స్ అన్నిటినీ పక్కన పెట్టేయాలి. వాటి గురించి కలలో కూడా ఆలోచించ కూడదు. అలాగైతేనే ఈ రంగంలోకి తొంగి చూడాలి. కామెడీలు తప్ప మరే కథా  చదవాలనుకో కూడదు. కామెడీ తప్ప మరే సినిమా చూడాలను కోకూడదు. కామెడీ తప్ప మరే పాటా వినాలనుకోకూడదు. పరీక్షల కెళ్ళే విద్యార్ధికి  ఆ పరీక్షలకి ప్రిపేరవడం తప్ప వేరే  లోకం వుండనట్టే, కామెడీ రైటర్ అవ్వాలనుకునే వాడు తన చుట్టూ ఓ నవ్వుల ప్రపంచాన్ని  సృష్టించుకుని అందులో పడి పొర్లాడుతూ వుండాలి. ఒకరిద్దరు తప్ప హాస్య నటులెప్పుడూ హాస్య నటులుగానే వుండిపోయారు. అలాగే హాస్య రచయితలూ,  హాస్యదర్శకులూ ప్రపంచవ్యాప్తంగా హాస్య రచయితలుగానే, హాస్య దర్శకులుగానే వుండిపోయారు. ఒక్క హాస్యం మీదే దృష్టిని కేంద్రీకరించి,  ఆ రంగంలో విపరీతమైన కృషి చేసి, అపార పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారు. వీళ్ళని ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నా అప్రయత్నంగా  మన పెదాల  మీద నవ్వు వెలుస్తుంది. ఈ అదృష్టం ఇతర జానర్స్ తో వుండదు. ఒక కామెడీ సినిమా రాద్దాం / తీద్దాం అనుకుని ఆ పని చేసేసి,  తర్వాత ఇతర జానర్ల  వైపు జంప్ చేసే చపలత్వం  వున్న వాళ్ళకి ఇదంతా అవసరం లేదు.
జగ్ సురయా 
         ఇప్పుడు జరుగుతున్న దేమిటంటే ప్రతియేటా పదుల సంఖ్యలో కొత్త దర్శకులు వస్తున్నారు గానీ, తాము ఎలాటి దర్శకులు అవాలనుకుంటున్నారో తమకే  తెలీడం లేదు. కొత్త ముఖాలతో ఏదో ఓ  ప్రేమ సినిమా తీసేసి  చేతులు దులుపుకుని మళ్ళీ కన్పించకుండా పోతున్నారు. దీని వల్ల తమకేం లాభమో, నిర్మాతలకీ ప్రేక్షకులకీ ఏం  ప్రయోజనమో తమకే తెలీడం లేదు. ఎవర్ని చూసినా ఓ ప్రేమ కథ పట్టుకుని వుంటారు. అదేదో తెలుగు రాష్ట్రాల్లో  జనాలు ప్రేమలు కరువై అల్లాడి పోతున్నట్టు. ఈ ప్రేమ కథలకి కూడా  మార్కెట్ సెన్స్ వుండదు. పాతబడిన అవే గత శతాబ్దపు రంగూ వాసనలతో వుంటాయి. ఇంటర్మీడియేట్ చదివే విద్యార్ధులు  అప్పుడే తామేం కావాలో ఒక గోల్ ఏర్పరచుకుని చదువుతూంటారు- డాక్టరో ఇంజనీరో సీఏనో ఏదోవొకటి. కొత్త దర్శకులకి ఇలాటి గోల్స్ ఏమీ వుండవు. కనీసం తమ రోల్ మోడల్ ఎవరంటే కూడా చెప్పలేరు. ఎవరి సినిమాలు చూసి ప్రభావితమయ్యారనే దానికీ హాలీవుడ్ నుంచీ టాలీవుడ్ దాకా, ఇంకా బాలీవుడ్ నుంచీ తాము అవలీలగా కాపీ కొట్టే ఉత్తర- దక్షిణ కొరియాల  దాకా ఎవరి పేరూ చెప్పలేరు. ఇదెలా సాధ్యం? సినిమా ప్రేక్షకులుగా మనల్ని ప్రభావితం చేసిన దర్శకు లెందరో వుంటారు. ఎవరి శైలి- ముద్ర ఎలావుంటుందో చెప్పేయగలం. వాటిలో కొన్నిటికి ఫిదా అయిపోతాం. అలాటిది ఒకప్పుడు సినిమా ప్రేక్షకులే అయిన కొత్త దర్శకులు మనలా ఫీలవలేదా? మరెలా దర్శకులవుతున్నారు? ఇదే గాంబ్లింగ్. ప్రేక్షకులుగా  ఏ అభిరుచీ లేకుండా సినిమా రంగంలోకి రావడం, ఏ పునాదీ లేకుండా తమ సొంత జీవితాలతోనే జూదమాడుకోవడం. దర్శకుడు అయిపోవాలని షార్ట్ కట్స్ వెతకడం. ఓ రెండు సినిమాలకి అసిస్టెంట్ గా పని చేస్తే దర్శకుడి డిగ్రీ వచ్చేస్తుందనుకుని  ఫైలు పట్టుకుని ప్రయత్నాలు ప్రారంభించడం. అసిస్టెంట్ గా పనిచేసేది కూడా ఆ పని నేర్చుకోవడం కోసం కాదు. ఆ పని మీద కంటే డైరెక్షన్ మీదే కన్ను వుంటుంది. ఎలా తీస్తున్నారు, ఎలా చేస్తున్నారు- ఇదే తొంగి చూడ్డంగా  వుంటుంది. ఇంటర్మీడియేట్ చదివే కుర్రాడు తన పాఠ్య పుస్తకాల మీదే దృష్టి పెట్టి చదువుకుంటాడు, అప్పుడే డిగ్రీ పుస్తకాల్లోకి తొంగి చూడడు. కానీ సినిమా అసిస్టెంట్ మాత్రం అసిస్టెంట్ గా ఉండక- డైరెక్షన్ లోకి తొంగి చూస్తూంటాడు. అసిస్టెంట్ గా స్క్రిప్టుని  ఫేర్ చేయడం మీదే దృష్టి పెట్టడు. అప్పుడే తన రూములో స్క్రిప్టు రాయడం మొదలెడతాడు. ఏం తెలుసనీ రాస్తాడో తెలీదు. తను పనిచేస్తున్న ఏ దర్శకుణ్ణీ గురువుగా భావించడు. గురువు దగ్గర పనినేర్చుకోవాలనీ అనుకోడు. అప్పుడే గురువునై పోవా లనుకుంటాడు. క్షేత్ర స్థాయిలో తనకప్పగించిన  బాధ్యతలు సరీగ్గా  నిర్వర్తించుకుంటూ అసోసియేట్ గా ప్రమోటయ్యాక దర్శకత్వం గురించి ఆలోచిస్తే అదో అందం. ఇలా జరగదు. ఇందుకే ఇందరు కొత్త వాళ్ళతో ఇన్నేసి ఫ్లాపులు. కళారంగంలో షార్ట్ కట్స్ అనేవి వుండవు. ఈ రంగంలో షార్ట్ కట్స్ గాలి దుమారానికి పైకెగిరే చిత్తు కాగితాల్లాంటివని తెలుసుకుంటే మంచిది.   
       షార్ట్ కట్స్ మీద దృష్టి పెట్టడం వల్ల తమ కెవరూ రోల్ మోడల్స్ వుండడం లేదు.  నేను ఫలానా మణిరత్నం లాగా బలమైన ప్రేమ కథల దర్శకుణ్ణి అవుతా- అని నిర్ణయించుకుని  మణిరత్నం సినిమాలని స్టడీ చేయడమో, లేదా ఫలానా రామ్సే బ్రదర్స్ లాగా హార్రర్ సినిమాల దర్శకుణ్ణి అన్పించుకుంటా- అని టార్గెట్ పెట్టుకుని రామ్సే సినిమాలని స్టడీ చేయడమో, లేదా ఫలానా వంశీ లాగా తెలుగు నేటివిటీకి పట్టంగట్టే విలేజి సినిమాల దర్శకుణ్ణి అవుతా- అని గోల్ పెట్టుకుని వంశీ సినిమాలని పరిశీలించడమో, ఇంకా లేదా  ఫలానా జంధ్యాల లాగానో, ఇవివి లాగానో గొప్ప కామెడీ సినిమాల డైరెక్టర్ గా గుర్తింపు పొందుతా- అని వాళ్ళ సినిమాల్ని అధ్యయనం చేయడమో జరగడం లేదు. తమ కెరీర్ పట్ల తమకే ఏ దృక్పథమూ వుండడం లేదు. నాల్గు జానర్స్ లో నాల్గు రకాల కథలు రాసుకుని ఏది తగిల్తే అది తీద్దాంలే- అని నిర్మాతల చుట్టూ తిరుగుతూంటారు. ఒక విజన్ లేదు, విజువల్ సెన్స్ లేదు, ఏ విద్యా లేదు. 

        ఉపోద్ఘాతమింకా వుంది. ఓ కొత్త దర్శకుడు ఎక్కడికెళ్ళినా  నిర్మాతలకి ఓ బలమైన ప్రేమ కథే విన్పిస్తున్నాడని ఆ నిర్మాతల సర్కిల్ లో తెలిస్తే, ఆ కొత్త దర్శకుడి మీద సదభిప్రాయ మేర్పడుతుంది. అదే ఒక్కో నిర్మాతకి ఒక్కో కథ చెప్తున్నాడని సర్కిల్ లో తెలిస్తే, తేలిగ్గా తీసుకుంటారు, పునరాలోచనకి తావివ్వరు. ఈ మధ్యే ఒక సీనియర్ అసోసియేట్ పరిచయమయ్యారు. తన గోల్ చిన్న నిర్మాతల దర్శకుడు అన్పించుకోవాలని చెప్పారు. సక్సెస్ లొచ్చినా ఫ్లాపులు వచ్చినా చిన్న నిర్మాతలకే కట్టుబడి ఉంటానన్నారు. చిన్న సినిమాతో ఒక సక్సెస్ వచ్చిందని పెద్ద స్టార్స్ చుట్టో, అంతకన్నా చిన్న స్టార్స్ చుట్టో తిరిగి టైంవేస్ట్ చేసుకోనన్నారు. అనుభవసారంతో ఆయన వాస్తవికంగా ఆలోచిస్తున్నారు. కలల్లో తేలిపోయే కొత్త దర్శకులు రెండో సినిమాకే కోటి రూపాయల దర్శకుడైపోవాలనీ, అక్కడ్నించీ మహేష్ బాబు నుంచి పోన్ కాల్ కోసం ఎదురు చూడాలనీ లెక్కలు వేసుకుంటున్నారు. ఎటూ గాకుండా జీవితాల్ని హారతి కర్పూరంలా కరగదీసుకుంటు న్నారు. 

        ఇదంతా ఇక్కడ ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే- కామెడీ ఈజ్ సీరియస్ బిజినెస్. కామెడీ రచయితో, దర్శకుడో అవ్వాలనుకునే వాళ్ళు ఇతరుల్లాగా ఒకట్రెండు సినిమాలకి అసిస్టెంట్ గా చేసేసి, ఆ పోర్ట్ ఫోలియోతో షార్ట్ కట్ లో కామెడీ రచయితలో, దర్శకులో అవలేరు. డిమాండ్ సప్లై ప్రకారం చూస్తే ఓ దశాబ్ద కాలం  నుంచీ తెలుగులో కామెడీ రచయితలూ దర్శకులూ లేరు. ఈ కొరత తీర్చాలన్న ఆసక్తి వుంటే ఆలస్యం చేయకూడదు. కష్టమన్పించినా మిగతా కథలూ కాకరకాయలూ పక్కన పడేసి కామెడీ వంటకం నేర్చుకోవడం మీద దృష్టి పట్టాలి. మార్కెట్ లో ఏది తక్కువుందో అది సరఫరా చేయాలి. ఇందుకు కావాల్సిన సరంజామా సిద్ధం చేసుకోవాలి.  పైన చెప్పుకున్న వాటితో బాటు ఇంకా- కామెడీకి రిసౌర్సెస్ వెతుక్కోవాలి. డేటా  బ్యాంక్ ని విస్తరించుకోవాలి. అందుకు ఈ కింది వెబ్సైట్స్ ఉపయోగ పడొచ్చు : 

       
fakingnews.firstpost.com ( ఇండియాలో నకిలీ వార్తల హాస్య కథనాలు)
       
madmagazine.com (ప్రసిద్ధ అమెరికన్ హ్యూమర్ పత్రిక)
       
collegehumor.com ( అమెరికన్ కాలేజీ కామెడీ)
       
cracked.com ( అమెరికన్ సెటైర్స్ కి ప్రసిద్ది)
            dumbcriminals.com (తెలివి తక్కువ నేరగాళ్ళ కామెడీలు)
        ఇంకా వెనకటి కాలపు మెటీరియల్ ని  కూడా చదువుకుంటే మంచిది. కామెడీకి పరాకాష్ఠ అనదగిన పి.జి. ఓడ్ హౌస్ నవలలు, ముళ్ళపూడి వెంకటరమణ రచనలు, బానుమతీ రామకృష్ణ  కథలు, చిలకమర్తి లక్ష్మీ నరసింహం రచనలూ  చదువుకుంటే తిరుగుండదు. మనలోని సెన్సాఫ్ హ్యూమర్ ని పరిపుష్టం చేస్తాయి. ప్రేక్షకులు పగలబడి నవ్వేలా చేయడానికి ఏం చేయాలో వీటిలో తెలుస్తుంది.  ఇక కామెడీ ఎలా రాయాలో తెలుగులో స్క్రీన్ ప్లే పుస్తకాలు  లేవుగానీ, అమెరికానుంచి ఇంగ్లీషులో కుప్పలకొద్దీ దొరుకుతాయి. వెబ్సైట్లు కూడా వున్నాయి. వీటిని చదువుకోవచ్చు. ఇవికూడా చదువుకుంటూ కూర్చుంటే జీవిత కాలం సరిపోదు. పైగా బుర్ర చెడిపోతుంది. రెండు మూడు చదువుకుని  తెలుగు కామెడీకి అన్వయించుకుని స్క్రిప్టులు రాసుకుంటే సరిపోతుంది. 
        అయినా ఇంత రిఫరెన్స్ వున్నా,  కామెడీ ఎలా రాయాలనే దానికి మన అలవాటు కొద్దీ తెలుగులో వచ్చేవారం ముచ్చటించుకుందాం.

-సికిందర్
http://www.cinemabazaar.in