కామెడీ
ఎలా రాయాలా అని తర్జనభర్జన పడే ముందు,
అసలు కామెడీ రాయాలంటే మనదగ్గర ఏముండాలని ప్రశ్నించుకోవాలి. బాగా జోకులు పేల్చి
అందర్నీ నవ్వించగల ప్రత్యేక టాలెంట్ కలిగి
వుండాలా? తప్పు. అలాటి వాళ్ళు జోకులేసి
నవ్వించగలరే గానీ కామెడీ రాయలేరు. సన్నివేశాల్ని సృష్టించలేరు. కామెడీ రాయాలంటే
రెండు వుండాలి : ఎక్కువ ఊహా శక్తి, ఎక్కువ మేధాశక్తి. హాస్యంగా మాట్లాడే వాళ్లకి
మొదటిదే వుంటుంది, హాస్యం రాసేవాళ్ళకి రెండూ వుంటాయి. హాస్యం రాసే వాళ్ళు హాస్యంగా మాట్లాడలేక పోవచ్చు, కానీ రాసి నవ్వించగలరు. అత్యంత ఫన్నీ కామెడీ
రాసేవాళ్ళు నిజజీవితంలో అంత ఫన్నీగా
ఉండరని ఒక పరిశీలన వుంది. పైపెచ్చు కొందరు ఈసురోమని జీవితాలు గడుపుతారు. మేధా
శక్తి వాళ్ళనలా మార్చేస్తుందేమో తెలీదు. ఎక్కువ ఊహాశక్తితో జోకులేస్తూ
తిరిగేవాళ్ళు జల్సాగా వుంటారు. నటుడు
ధర్మవరపు సుబ్రహ్మణ్యం నోట్లోంచి ప్రవాహంలా జోకులొచ్చేసేవి. కానీ రాయలేనితనాన్ని
నటించడంతో తీర్చుకున్నారు. ఎక్కువ ఊహాశక్తితో నవ్వించడానికి సాధారణంగా చుట్టూ వున్న
వాతావరణం చాలు. ‘ఈడేంట్రా బైకు మీదెళ్ళి సిగరెట్లు తెమ్మంటే, లేదు సైకిలు మీదే వెళ్తా నంటాడు... ఈడికి హెల్తు, మనకి డెత్తా?’ అనేస్తే
సరిపోతుంది.
కానీ
రాయాలంటే మాత్రం ఈ చుట్టూ వుండే వాతావరణంతో బాటు, దేశకాల పరిస్థితుల మీద సెటైర్లు
కూడా వేయగల్గి వుండాలి. సామాజిక స్పృహ కలిగివుండాలి. ఎలాగయితే శాస్త్రీయ సంగీతం
నేర్చుకున్న వాడు పాప్ సంగీతం ఇంతరులకంటే బాగా
పాడగలడో, అలా సెటైర్ల మీద పట్టు సాధించినవాడి చేతిలో మామూలు కామెడీ ఇతరుల
చేతిలో కంటే ఎక్కువ ప్రకాశిస్తుంది. ఎక్కువ ఊహాశక్తితో బాటు ఇలాటి ఎక్కువ మేధా
శక్తి ఉన్న వాడే నిజమైన కామెడీ రైటర్ అన్పించుకో గలడు, సున్నిత హాస్యంలో మాస్టర్
అవగలడు. ఒకసారి సున్నిత హాస్యంతో ఉర్రూతలూగించిన
ముళ్ళపూడి, జంధ్యాల, వంశీల వంటి పూర్వపు రచయితల సామాజిక స్పృహని
గమనించండి.
హాలీవుడ్ లో కామెడీ రైటర్ అంటే అతను డైలాగులు సహిత పూర్తి స్థాయి కథతో స్క్రీన్ ప్లే అందించే వాడై ఉంటాడు. మనకలా కాదు. కామెడీ అనే కాదు, ఇంకే సినిమాలకి మాటలు రాసే మాటల రచయితలూ మాటల వరకే గానీ కథా రచయితలుగా అభివృద్ధి చెందని పరిస్థితి వుంది. ఇచ్చిన సీనులో విషయం చూసుకుని దానికి తగ్గ మాటలు రాసేయడం వరకే వారి విద్య. ఒక పూర్తి స్థాయి కథ రాయాలంటే అదెలా రాస్తారో తెలీని తనమే రాజ్య మేలుతోంది. కాబట్టి కామెడీ రైటర్ అన్నాక కామెడీ డైలాగ్ రైటర్ అవ్వాలా, లేక కామెడీ స్టోరీ రైటర్ గా ఎదగాలా ముందు నిర్ణయించుకోవాలి. మొదటి దానికైతే ఎక్కువ మేధాశక్తితో పనిలేదు, ఎక్కువ ఊహా శక్తి వుంటే చాలు. రెండో దానికి రెండూ అవసరం!
ఈ
రెండోదే ఇప్పుడవసరం. ఒక కామెడీ రైటర్ గా ఎదగాలంటే ఏం కావాలి? సామాజిక స్పృహ.
సామాజిక స్పృహ లేని రచయిత డైలాగులైనా సరే రస విహీనంగా వుంటాయి. ఈ సమాజిక స్పృహకి ఇంగ్లీషు భాషా పరిజ్ఞానం కూడా అవసరం. ఇంగ్లీషు
భాషా పరిజ్ఞానం లేని సినిమా రచయితలైనా సరే, పత్రికా విలేఖర్లయినా సరే నూతిలో
కప్పల్లా వుండి పోతారు. జాతీయంగా,అంతర్జాతీయంగా ఇంగ్లీషులో ప్రతినిత్యం ఉత్పత్తి
అవుతున్న అసంఖ్యాక భావజాలాలు, వార్తా విశేషాలు, విలక్షణ వ్యాసాలూ తదితరమైనవి
పరిచయం కాకుండా పోతాయి. అప్పుడు వీళ్ళు రాసినా ఒకటే రాయకున్నా ఒకటే. తెలుగుతో బాటు
ఇంగ్లీషు మాధ్యమాలు అందిస్తున్న కంటెంట్
ని ప్రతిరోజూ కొంత సమయం కేటాయించుకుని
చదవాలి. తెలుగు పత్రికల్లో సామాజికాంశాల పైన అనేక మంది సెటైర్లు రాస్తున్నారు, వాటితో పాటు ఆంగ్లంలో
జగ్ సురయా, బాచీ కర్కరియా, అమెరికా నుంచి డేవ్ బారీ లలాంటి ఇద్దరు ముగ్గురు
హ్యూమరిస్టులని వారంవారం ఫాలో అవుతూంటే ఆ వారం జాతీయ, అంతర్జాతీయ సంఘటనలపైన చాలా ఫన్నీ కామెడీ మనకి పరిచయమవుతుంది.
కామెడీకి అవసరమైన ఎక్కువ మేధాశక్తిని పెంచుకోవాలంటే ఇది తప్పదు.
బాచీ కర్కరియా
|
అలాగే సహజంగా మనలో సెన్సాఫ్ హ్యూమర్ అంటూ వుంటే అది కొన్ని పరిమితుల్లో వుండి పోవాలనుకోదు. దానికి జిజ్ఞాస ఎక్కువ వుంటుంది. ఇంకా తెలుసుకోవాలన్న తపన వుంటుంది. మన కాన్షస్ మైండ్ సోమరితనాన్ని వదిలించుకుంటే ఇంకా జాతీయ ఛానెల్స్ లో వచ్చే ఉన్నతస్థాయి రాజకీయ కార్టూన్ చిత్రాలు చూసి స్ఫూర్తి పొందవచ్చు. అర్నాబ్ గోస్వామిని చూస్తున్నా ఎన్నో కామెడీ ఐడియాలు పుట్టుకు రావచ్చు. అర్నాబ్ గోస్వామినే వేరే పాత్రగా సృష్టించి వెరైటీ కామెడీని సృష్టించే ఆలోచనలు రావొచ్చు. అంతర్జాలంలో అసంఖ్యాకంగా అర్నాబ్ మీద సెటైర్లు వెలువడుతున్నాయి.
ఇక
హిందీ కూడా వచ్చి వుంటే హిందీ హాస్య ప్రపంచం ఎలా వుందో అంతా పరిచయమవుతుంది. డేటా
బ్యాంక్ ఎంత విస్తృతమైతే అంత కామెడీ
స్థాయి కూడా పెరుగుతుంది. కామెడీ రచయిత ఏం
కోల్పోయినా తనలో హాస్య రసాన్ని మాత్రం కోల్పోకూడదు. ఏం పెంచుకోక పోయినా తనలో హాస్య
రసాన్ని పెంచుకు తీరాలి. కామెడీ ఈజ్ సీరియస్ బిజినెస్ అన్నారు. ప్రత్యేకంగా కామెడీ
కథా రచయితగానో, కామెడీ దర్శకుడుగానో గుర్తింపు పొందాలన్న లక్ష్యం వుంటే, మిగతా
అన్ని తరహాల ప్రక్రియలూ పక్కన పెట్టేయాలి. యాక్షన్ కథల గురించి, ప్రేమ కథల
గురించి, హార్రర్ కథల గురించీ... ఇలా ఇతర జానర్స్ అన్నిటినీ పక్కన పెట్టేయాలి.
వాటి గురించి కలలో కూడా ఆలోచించ కూడదు. అలాగైతేనే ఈ రంగంలోకి తొంగి చూడాలి. కామెడీలు తప్ప మరే కథా చదవాలనుకో కూడదు.
కామెడీ తప్ప మరే సినిమా చూడాలను కోకూడదు. కామెడీ తప్ప మరే పాటా వినాలనుకోకూడదు. పరీక్షల
కెళ్ళే విద్యార్ధికి ఆ పరీక్షలకి
ప్రిపేరవడం తప్ప వేరే లోకం వుండనట్టే,
కామెడీ రైటర్ అవ్వాలనుకునే వాడు తన చుట్టూ ఓ నవ్వుల ప్రపంచాన్ని సృష్టించుకుని అందులో పడి పొర్లాడుతూ వుండాలి.
ఒకరిద్దరు తప్ప హాస్య నటులెప్పుడూ హాస్య నటులుగానే వుండిపోయారు. అలాగే హాస్య రచయితలూ,
హాస్యదర్శకులూ ప్రపంచవ్యాప్తంగా హాస్య రచయితలుగానే, హాస్య దర్శకులుగానే వుండిపోయారు.
ఒక్క హాస్యం మీదే దృష్టిని కేంద్రీకరించి,
ఆ రంగంలో విపరీతమైన కృషి చేసి, అపార పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారు.
వీళ్ళని ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నా అప్రయత్నంగా
మన పెదాల మీద నవ్వు వెలుస్తుంది. ఈ
అదృష్టం ఇతర జానర్స్ తో వుండదు. ఒక కామెడీ సినిమా రాద్దాం / తీద్దాం అనుకుని ఆ పని
చేసేసి, తర్వాత ఇతర జానర్ల వైపు జంప్ చేసే చపలత్వం వున్న వాళ్ళకి ఇదంతా అవసరం లేదు.
జగ్ సురయా
|
ఇప్పుడు జరుగుతున్న దేమిటంటే ప్రతియేటా పదుల సంఖ్యలో
కొత్త దర్శకులు వస్తున్నారు గానీ, తాము ఎలాటి దర్శకులు అవాలనుకుంటున్నారో
తమకే తెలీడం లేదు. కొత్త ముఖాలతో ఏదో
ఓ ప్రేమ సినిమా తీసేసి చేతులు దులుపుకుని మళ్ళీ కన్పించకుండా
పోతున్నారు. దీని వల్ల తమకేం లాభమో, నిర్మాతలకీ ప్రేక్షకులకీ ఏం ప్రయోజనమో తమకే తెలీడం లేదు. ఎవర్ని చూసినా ఓ
ప్రేమ కథ పట్టుకుని వుంటారు. అదేదో తెలుగు రాష్ట్రాల్లో జనాలు ప్రేమలు కరువై అల్లాడి పోతున్నట్టు. ఈ
ప్రేమ కథలకి కూడా మార్కెట్ సెన్స్ వుండదు.
పాతబడిన అవే గత శతాబ్దపు రంగూ వాసనలతో వుంటాయి. ఇంటర్మీడియేట్ చదివే విద్యార్ధులు అప్పుడే తామేం కావాలో ఒక గోల్ ఏర్పరచుకుని చదువుతూంటారు-
డాక్టరో ఇంజనీరో సీఏనో ఏదోవొకటి. కొత్త దర్శకులకి ఇలాటి గోల్స్ ఏమీ వుండవు. కనీసం
తమ రోల్ మోడల్ ఎవరంటే కూడా చెప్పలేరు. ఎవరి సినిమాలు చూసి ప్రభావితమయ్యారనే దానికీ
హాలీవుడ్ నుంచీ టాలీవుడ్ దాకా, ఇంకా బాలీవుడ్ నుంచీ తాము అవలీలగా కాపీ కొట్టే ఉత్తర-
దక్షిణ కొరియాల దాకా ఎవరి పేరూ చెప్పలేరు.
ఇదెలా సాధ్యం? సినిమా ప్రేక్షకులుగా మనల్ని ప్రభావితం చేసిన దర్శకు లెందరో
వుంటారు. ఎవరి శైలి- ముద్ర ఎలావుంటుందో చెప్పేయగలం. వాటిలో కొన్నిటికి ఫిదా
అయిపోతాం. అలాటిది ఒకప్పుడు సినిమా ప్రేక్షకులే అయిన కొత్త దర్శకులు మనలా
ఫీలవలేదా? మరెలా దర్శకులవుతున్నారు? ఇదే గాంబ్లింగ్. ప్రేక్షకులుగా ఏ అభిరుచీ లేకుండా సినిమా రంగంలోకి రావడం, ఏ
పునాదీ లేకుండా తమ సొంత జీవితాలతోనే జూదమాడుకోవడం. దర్శకుడు అయిపోవాలని షార్ట్
కట్స్ వెతకడం. ఓ రెండు సినిమాలకి అసిస్టెంట్ గా పని చేస్తే దర్శకుడి డిగ్రీ
వచ్చేస్తుందనుకుని ఫైలు పట్టుకుని
ప్రయత్నాలు ప్రారంభించడం. అసిస్టెంట్ గా పనిచేసేది కూడా ఆ పని నేర్చుకోవడం కోసం
కాదు. ఆ పని మీద కంటే డైరెక్షన్ మీదే కన్ను వుంటుంది. ఎలా తీస్తున్నారు, ఎలా
చేస్తున్నారు- ఇదే తొంగి చూడ్డంగా
వుంటుంది. ఇంటర్మీడియేట్ చదివే కుర్రాడు తన పాఠ్య పుస్తకాల మీదే దృష్టి
పెట్టి చదువుకుంటాడు, అప్పుడే డిగ్రీ పుస్తకాల్లోకి తొంగి చూడడు. కానీ సినిమా
అసిస్టెంట్ మాత్రం అసిస్టెంట్ గా ఉండక- డైరెక్షన్ లోకి తొంగి చూస్తూంటాడు.
అసిస్టెంట్ గా స్క్రిప్టుని ఫేర్ చేయడం
మీదే దృష్టి పెట్టడు. అప్పుడే తన రూములో స్క్రిప్టు రాయడం మొదలెడతాడు. ఏం తెలుసనీ
రాస్తాడో తెలీదు. తను పనిచేస్తున్న ఏ దర్శకుణ్ణీ గురువుగా భావించడు. గురువు దగ్గర
పనినేర్చుకోవాలనీ అనుకోడు. అప్పుడే గురువునై పోవా లనుకుంటాడు. క్షేత్ర స్థాయిలో తనకప్పగించిన
బాధ్యతలు సరీగ్గా నిర్వర్తించుకుంటూ అసోసియేట్ గా ప్రమోటయ్యాక
దర్శకత్వం గురించి ఆలోచిస్తే అదో అందం. ఇలా జరగదు. ఇందుకే ఇందరు కొత్త వాళ్ళతో
ఇన్నేసి ఫ్లాపులు. కళారంగంలో షార్ట్ కట్స్ అనేవి వుండవు. ఈ రంగంలో షార్ట్ కట్స్
గాలి దుమారానికి పైకెగిరే చిత్తు కాగితాల్లాంటివని తెలుసుకుంటే మంచిది.
షార్ట్
కట్స్ మీద దృష్టి పెట్టడం వల్ల తమ కెవరూ రోల్ మోడల్స్ వుండడం లేదు. నేను ఫలానా మణిరత్నం లాగా బలమైన ప్రేమ కథల దర్శకుణ్ణి
అవుతా- అని నిర్ణయించుకుని మణిరత్నం
సినిమాలని స్టడీ చేయడమో, లేదా ఫలానా రామ్సే బ్రదర్స్ లాగా హార్రర్ సినిమాల దర్శకుణ్ణి
అన్పించుకుంటా- అని టార్గెట్ పెట్టుకుని రామ్సే సినిమాలని స్టడీ చేయడమో, లేదా
ఫలానా వంశీ లాగా తెలుగు నేటివిటీకి పట్టంగట్టే విలేజి సినిమాల దర్శకుణ్ణి అవుతా-
అని గోల్ పెట్టుకుని వంశీ సినిమాలని పరిశీలించడమో, ఇంకా లేదా ఫలానా జంధ్యాల లాగానో, ఇవివి లాగానో గొప్ప
కామెడీ సినిమాల డైరెక్టర్ గా గుర్తింపు పొందుతా- అని వాళ్ళ సినిమాల్ని అధ్యయనం
చేయడమో జరగడం లేదు. తమ కెరీర్ పట్ల తమకే ఏ దృక్పథమూ వుండడం లేదు. నాల్గు జానర్స్
లో నాల్గు రకాల కథలు రాసుకుని ఏది తగిల్తే అది తీద్దాంలే- అని నిర్మాతల చుట్టూ తిరుగుతూంటారు.
ఒక విజన్ లేదు, విజువల్ సెన్స్ లేదు, ఏ విద్యా లేదు.
ఉపోద్ఘాతమింకా వుంది. ఓ కొత్త దర్శకుడు ఎక్కడికెళ్ళినా నిర్మాతలకి ఓ బలమైన ప్రేమ కథే విన్పిస్తున్నాడని ఆ నిర్మాతల సర్కిల్ లో తెలిస్తే, ఆ కొత్త దర్శకుడి మీద సదభిప్రాయ మేర్పడుతుంది. అదే ఒక్కో నిర్మాతకి ఒక్కో కథ చెప్తున్నాడని సర్కిల్ లో తెలిస్తే, తేలిగ్గా తీసుకుంటారు, పునరాలోచనకి తావివ్వరు. ఈ మధ్యే ఒక సీనియర్ అసోసియేట్ పరిచయమయ్యారు. తన గోల్ చిన్న నిర్మాతల దర్శకుడు అన్పించుకోవాలని చెప్పారు. సక్సెస్ లొచ్చినా ఫ్లాపులు వచ్చినా చిన్న నిర్మాతలకే కట్టుబడి ఉంటానన్నారు. చిన్న సినిమాతో ఒక సక్సెస్ వచ్చిందని పెద్ద స్టార్స్ చుట్టో, అంతకన్నా చిన్న స్టార్స్ చుట్టో తిరిగి టైంవేస్ట్ చేసుకోనన్నారు. అనుభవసారంతో ఆయన వాస్తవికంగా ఆలోచిస్తున్నారు. కలల్లో తేలిపోయే కొత్త దర్శకులు రెండో సినిమాకే కోటి రూపాయల దర్శకుడైపోవాలనీ, అక్కడ్నించీ మహేష్ బాబు నుంచి పోన్ కాల్ కోసం ఎదురు చూడాలనీ లెక్కలు వేసుకుంటున్నారు. ఎటూ గాకుండా జీవితాల్ని హారతి కర్పూరంలా కరగదీసుకుంటు న్నారు.
ఇదంతా ఇక్కడ ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే- కామెడీ ఈజ్ సీరియస్ బిజినెస్. కామెడీ రచయితో, దర్శకుడో అవ్వాలనుకునే వాళ్ళు ఇతరుల్లాగా ఒకట్రెండు సినిమాలకి అసిస్టెంట్ గా చేసేసి, ఆ పోర్ట్ ఫోలియోతో షార్ట్ కట్ లో కామెడీ రచయితలో, దర్శకులో అవలేరు. డిమాండ్ సప్లై ప్రకారం చూస్తే ఓ దశాబ్ద కాలం నుంచీ తెలుగులో కామెడీ రచయితలూ దర్శకులూ లేరు. ఈ కొరత తీర్చాలన్న ఆసక్తి వుంటే ఆలస్యం చేయకూడదు. కష్టమన్పించినా మిగతా కథలూ కాకరకాయలూ పక్కన పడేసి కామెడీ వంటకం నేర్చుకోవడం మీద దృష్టి పట్టాలి. మార్కెట్ లో ఏది తక్కువుందో అది సరఫరా చేయాలి. ఇందుకు కావాల్సిన సరంజామా సిద్ధం చేసుకోవాలి. పైన చెప్పుకున్న వాటితో బాటు ఇంకా- కామెడీకి రిసౌర్సెస్ వెతుక్కోవాలి. డేటా బ్యాంక్ ని విస్తరించుకోవాలి. అందుకు ఈ కింది వెబ్సైట్స్ ఉపయోగ పడొచ్చు :
fakingnews.firstpost.com ( ఇండియాలో నకిలీ వార్తల హాస్య కథనాలు)
madmagazine.com (ప్రసిద్ధ అమెరికన్ హ్యూమర్ పత్రిక)
collegehumor.com ( అమెరికన్ కాలేజీ కామెడీ)
cracked.com ( అమెరికన్ సెటైర్స్ కి ప్రసిద్ది)
dumbcriminals.com (తెలివి తక్కువ నేరగాళ్ళ కామెడీలు)
ఇంకా
వెనకటి కాలపు మెటీరియల్ ని కూడా
చదువుకుంటే మంచిది. కామెడీకి పరాకాష్ఠ అనదగిన పి.జి. ఓడ్ హౌస్ నవలలు, ముళ్ళపూడి
వెంకటరమణ రచనలు, బానుమతీ రామకృష్ణ కథలు, చిలకమర్తి
లక్ష్మీ నరసింహం రచనలూ చదువుకుంటే
తిరుగుండదు. మనలోని సెన్సాఫ్ హ్యూమర్ ని పరిపుష్టం చేస్తాయి. ప్రేక్షకులు పగలబడి నవ్వేలా
చేయడానికి ఏం చేయాలో వీటిలో తెలుస్తుంది. ఇక
కామెడీ ఎలా రాయాలో తెలుగులో స్క్రీన్ ప్లే పుస్తకాలు లేవుగానీ, అమెరికానుంచి ఇంగ్లీషులో
కుప్పలకొద్దీ దొరుకుతాయి. వెబ్సైట్లు కూడా వున్నాయి. వీటిని చదువుకోవచ్చు. ఇవికూడా
చదువుకుంటూ కూర్చుంటే జీవిత కాలం సరిపోదు. పైగా బుర్ర చెడిపోతుంది. రెండు మూడు
చదువుకుని తెలుగు కామెడీకి అన్వయించుకుని
స్క్రిప్టులు రాసుకుంటే సరిపోతుంది.
అయినా
ఇంత రిఫరెన్స్ వున్నా, కామెడీ ఎలా రాయాలనే
దానికి మన అలవాటు కొద్దీ తెలుగులో వచ్చేవారం ముచ్చటించుకుందాం.
-సికిందర్
http://www.cinemabazaar.in
http://www.cinemabazaar.in